-
భార్య పుట్టినరోజు.. ఎన్టీఆర్ లవ్లీ పోస్ట్
జూ.ఎన్టీఆర్ (Ntr) ప్రస్తుతం జపాన్ లో ఉన్నాడు. గతేడాది మన దగ్గర రిలీజైన దేవర (Devara Movie).. ఈ 28న జపాన్ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇదివరకే ప్రీమియర్స్ పడగా.. వాటికి తారక్ తోపాటు దర్శకుడు కొరటాల శివ కూడా హాజరవడం విశేషం.సతీసమేతంగా జపాన్ వెళ్లిన ఎన్టీఆర్.. తన భార్య ప్రణతి పుట్టినరోజు (Birthday) వేడుకల్ని మంగళవారం రాత్రి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన రెండు ఫొటోలని షేర్ చేసుకోవడంతో పాటు క్యూట్ క్యాప్షన్ కూడా పెట్టాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి పూజా హెగ్డే డిజాస్టర్ సినిమా)'అమ్మలు.. హ్యాపీ బర్త్ డే' అని తారక్ తన ఇన్ స్టాలో రాసుకొచ్చాడు. దీనికి నెటిజన్ల లైకులు కొట్టేస్తున్నారు. 2011లో తారక్-ప్రణతికి పెళ్లయింది. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.సినిమాల విషయానికొస్తే జపాన్ నుంచి వచ్చిన వెంటనే ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ తీస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. తర్వాత షెడ్యూల్ బెంగళూరులో ఉన్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: కారు ప్రమాదంలో నటుడు సోనూసూద్ భార్య) View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) -
ట్రంప్ అనాలోచిత నిర్ణయాలు.. అమెరికాకు భారీ షాక్!
అమెరికా నుంచి శాస్త్రవేత్తలు నిష్క్రమిస్తున్నారు. పరిశోధనలకు నిధులను తగ్గించడంతోపాటు వర్క్ వీసాలపై నిబంధనలను కఠినతరం చేయడంతో విసుగు చెందిన పలువురు అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు దేశం వీడే ఆలోచనలో ఉన్నారు. స్థిరమైన అవకాశాలున్న యూరప్, ఆస్ట్రేలియా, కెనడాలకు మకాం మార్చాలని వారు ఆలోచిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఫ్రాన్స్, స్వీడన్ ప్రయత్నిస్తున్నాయి. శాస్త్రవేత్తలను తమ దేశాలకు స్వాగతిస్తున్నాయి. ప్రభుత్వ నిధుల కోతతో అనిశ్చితి.. ట్రంప్ ప్రభుత్వం నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ (ఎన్ఐహెచ్) వంటి ప్రముఖ పరిశోధనా సంస్థలకు వేల కోట్ల రూపాయల నిధులను నిలిపేయాలని నిర్ణయించింది. అమెరికా ఆతిథ్యం ఇస్తున్న 7,400 మంది విదేశీ స్కాలర్లకు ట్రంప్ ప్రభుత్వం నిధులను ఇప్పటికే నిలిపేసింది. దీంతో శాస్త్రవేత్తలకు అనిశ్చిత వాతావరణం నెలకొంది. వారు ఆర్థికంగా చితికిపోయారు. నిధుల నిలిపివేత కారణంగా కేన్సర్ వంటి వైద్య పరిశోధన సహా అంతరిక్ష పరిశోధన వంటి రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. ప్రభుత్వ నిర్ణయంపై 22 అమెరికా రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ఇప్పటికే దావా వేశారు. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ఏఐడీ)లో మలేరియా పరిశోధనలో ఉన్న అమెరికన్ అలెక్స్ కాంగ్ ఫెలోషిప్‌ను ఫిబ్రవరిలో ఆకస్మికంగా రద్దు చేశారు. అమెరికా ఇకపై సైన్స్ లేదా ప్రజారోగ్య పరిశోధనలు చేయడానికి ఉత్తమమైన ప్రదేశం కాదని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన యూరప్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. వీసా పొందడం కష్టమేననని ఆయన అన్నారు. అమెరికాలోని చాలా మంది పరిశోధకులది ఇదే పరిస్థితి. ‘పరిశోధనలంటే నాకు ఇష్టం. కానీ అమెరికాలో ఇప్పుడందుకు అనుకూల పరిస్థితి లేదు’ అని ప్రతిష్టాత్మక అమెరికన్ సంస్థలో కేన్సర్, జన్యుశాస్త్రంపై అధ్యయనం చేస్తున్న పోస్ట్ డాక్టోరల్ పరిశోధకుడు ఒకరు వ్యాఖ్యానించారు. తలుపులు తెరిచిన కెనడా, చైనా కెనడా, చైనాలు కూడా పరిశోధకులకు తలుపులు తెరుస్తున్నాయి. అమెరికాకు చెందిన పరిశోధకులను ఆకర్షించేందుకు ఆస్ట్రేలియా, కెనడా, చైనా మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఒక అడుగు ముందుకేసి ఆ్రస్టేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డేనియల్ కేవ్... శాస్త్రవేత్తలను ఆకర్షించడానికి ఫాస్ట్ ట్రాక్ వీసాలను ప్రతిపాదించారు. అమెరికాతో టారిఫ్ వార్‌లో ఉన్న కెనడాకు ఇప్పటికే ఉన్నత విద్యా సంస్థలకు నిధుల కొరతను ఎదుర్కొంటోంది. పరిశోధకులకు పోటీ ప్యాకేజీలను అందించే సామర్థ్యం తక్కువే ఉన్నా.. అవకాశమివ్వాలని ఆలోచనలో ఉంది. చైనీస్–అమెరికన్ శాస్త్రవేత్తలను తిరిగి ఆహా్వనిస్తూ చైనా ఇప్పటికే ప్రకటన చేసింది. జాతీయ భద్రత ముసుగులో శాస్త్రీయ పరిశోధనా రంగాన్ని అమెరికా అస్తవ్యస్తం చేస్తోందని చైనా విమర్శించింది. చాలా మంది చైనీస్–అమెరికన్ శాస్త్రవేత్తలు అమెరికాలో తమ కెరీర్‌ను ఇక్కడే కొనసాగించాలా వద్దా అనే పునరాలోచనలో పడ్డారని, చైనాలో స్థిరపడాలనే ఆలోచనలో ఉన్నారని ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ పేర్కొంది.రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇన్నాళ్లకు మేథో వలస..అమెరికాలో వలసలపై ఆంక్షలు విధించిన సమయంలో పరిశోధకుల నిష్క్ర మణ జరగడం గమనార్హం. ఇక రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఒక దేశం నుంచి మేధోవలసలు ఈ స్థాయిలో జరగడం ఇదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత, అమెరికా తన శాస్త్రీయ, పారిశ్రామిక కార్యక్రమాలను పెంచడానికి కొత్త గుర్తింపు పత్రాలను అందించింది. జర్మన్, ఆ్రస్టియన్ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులకు పునరావాసం కలి్పంచింది. అయితే ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతోందని స్థానిక అమెరికన్ సమాజం ఆవేదన వ్యక్తం చేసింది. శాస్త్రవేత్తల వలసలపై ఇంటర్నెట్లో పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ‘‘ప్రపంచంలో అతిపెద్ద సమస్యలను అమెరికానే పరిష్కరించింది. అలాంటిది ఇప్పుడు శాస్త్రవేత్తలను పట్టించుకోవడం మానేసింది. డేటాను తుడిచిపెట్టేస్తోంది. పరిశోధనలను రద్దు చేసింది. తమ ఉద్యోగాలను కాపాడుకోవాలంటే కొన్ని పదాలను ఉపయోగించలేమని నిపుణులు చెబుతున్నారు. బెస్ట్ మైండ్స్ అమెరికా నుంచి వెళ్లిపోతున్నాయి’’ అని ఓ వ్యక్తి ఎక్స్‌లో రాశాడు.చైనాలో బిగ్ ఏఐ న్యూస్!పదేళ్ల పాటు అమెరికాలో పనిచేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం డాక్టర్ గువో–జున్ క్వి తిరిగి చైనాకు రావాలని నిర్ణయించుకున్నారు! అతను అమెరికాను వదిలి చైనాకు వెళ్లడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో రీసెర్చ్ ట్రెండ్స్‌కు పెద్ద మేల్కొలుపు అని మరో పరిశోధకుడు ఎక్స్‌లో పేర్కొన్నారు. అమెరికా వెలుపల పరిశోధకులు ఆప్షన్ల కోసం వెతుకుతున్నట్లు మీడియాలో వార్తలు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది నిజంగా వలస అవుతుందా, అమెరికాపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది రాబోయే కొన్ని నెలల్లో తెలియనుంది.స్వాగతించేందుకు యూరప్ సన్నాహాలు.. అమెరికాను వీడుతున్న శాస్త్రవేత్తలకు సహాయం చేయాలంటూ పలువురు అమెరికన్ చట్టసభల సభ్యులు, సభ్యదేశాలు, కంపెనీలు యురోపియన్ కమిషన్‌ను కోరినట్లు వార్తలొచ్చాయి. అమెరికాలోని వాతావరణం స్వతంత్ర పరిశోధకుల పరిశోధనలకు నిరుత్సాహం కలిగిస్తోందని యురోపియన్ పరిశోధనా మండలి అధ్యక్షురాలు మారియా లెప్టిన్ అన్నారు. పలువురు శాస్త్రవేత్తలు, పరిశోధకుల భవిష్యత్ అగమ్యగోచరంగా ఉందన్నారు. ఫ్రాన్స్, స్వీడన్, కెనడా వంటి దేశాలు అమెరికాను వీడాలనుకుంటున్న అగ్రశ్రేణి పరిశోధకులను తమ దేశాలకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడి బలమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, ఉన్నతస్థాయి జీవన ప్రమాణాలు, వృత్తి,వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యం, సాంస్కృతిక చైతన్యాన్ని చూపించి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడికి వచ్చే పరిశోధకులకోసం నిధులను రెట్టింపు చేయాలని కమిషన్ అధ్యక్షుడు వాన్ డెర్ లేయన్ యురోపియన్ రీసెర్చ్ కౌన్సిల్‌కు పిలుపునిచ్చారు. బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇప్పటికే బయో మెడిసిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలను నియమించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాలను కేంబ్రిడ్జ్ వైస్ ఛాన్స్లర్ దెబోరా ప్రింటిస్ వెల్లడించారు. అమెరికా ప్రతిభావంతులకు ఫ్రెంచ్ విశ్వవిద్యాలయం ‘సైంటిఫిక్’ ఆశ్రయం కల్పిస్తోంది. -
ఆదాయం పెంచాలి: సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి రేటు పెంచడం ద్వారా ఆదాయం పెంచాలని, అప్పుడే తాను చెప్పిన విధంగా సంక్షేమ పథకాలను సజావుగా అమలు చేయగలనని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లను కోరారు. ఆదాయం పెంచకుండా సంక్షేమం, అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఒక శాతం వృద్ధి రేటు పెంచితే అదనంగా రూ.15 వేల కోట్లు, 3 శాతమైతే రూ.45 వేల కోట్ల ఆదాయం వస్తుందని.. అప్పుడైతేనే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయగలనని పునరుద్ఘాటించారు. వచ్చే ఆర్ధిక ఏడాది 15 శాతం పైగా వృద్ధి రేటు సాధించేందుకు అనుగుణంగా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సదస్సును ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్స్ ద్వారా ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలలి, పన్ను ఎగవేతదారులపై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. మే నెలలో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం ద్వారా రూ.15 వేలు చొప్పున ఇస్తామని, స్కూల్స్ తెరిచేలోగా ఈ మొత్తాన్ని పంపిణీ చేయాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు ఇస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద మూడు వాయిదాల్లో ఇస్తున్న మొత్తంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ.5 వేలు, 5 వేలు, 4 వేలు చొప్పున మూడు వాయిదాల్లో రైతులకు ఇస్తామని తెలిపారు. (హామీ మేరకు రూ.6 వేలు+రూ.20 వేలు = రూ.26 వేలు ఇవ్వాలి. కానీ కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రూ.20 వేలు మాత్రమే ఇస్తామని చెబుతున్నారు). మెగా డీఎస్సీ కింద 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఎస్సీ వర్గీకరణతో సహా ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. స్కూల్స్ తెరిచే నాటికి పోస్టింగ్‌లు ఇవ్వాలని చెప్పారు. ఏప్రిల్‌లో మత్స్యకారుల జీవనోపాధికి రూ.20 వేలు ఇస్తామని, 2027లో పోలవరం పూర్తి చేస్తామని తెలిపారు. కలెక్టర్లు సీఈవోలా పని చేయాలని, ఎప్పటికప్పుడు పనితీరుపై సమీక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీఎం ఇంకా ఏం చెప్పారంటే.. రెవిన్యూ సమస్యలపై దృష్టి పెట్టడం లేదు – రెవెన్యూ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కలెక్టర్లు వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం లేదు. కేవలం భూ సంబంధిత సమస్యలే 60–70 శాతం ఉన్నాయి. దీనిపై వర్క్‌షాప్ నిర్వహించాలి. క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలిసిన కలెక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, మంత్రులు, నిపుణులు నెల రోజుల్లో నివేదికతో రావాలి. “వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ ప్రెన్యూర్’ అనే నినాదంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. – ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగులకు రూ.1,030 కోట్లు విడుదల చేశాం. ఇప్పుడు మరో రూ.6,200 కోట్లు విడుదల చేస్తాం. రాష్ట్రంలో జనాభా పెరగాల్సిన అవసరముంది. అన్ని వర్క్ ప్లేసుల్లో చైల్డ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. అంతర పంటలతో అరకు కాఫీని ప్రోత్సహించాలి. – బీసీల్లో వడ్డెర కులస్తులకు క్వారీలు ఇచ్చేలా, మత్స్యకార సొసైటీలకు చెరువులు అప్పగించి చేపలు పెంచుకునేలా తోడ్పాటు ఇవ్వాలి. కల్లు గీత కార్మీకులకు కేటాయించిన వైన్ షాపులు దుర్వినియోగం కాకూడదు. – రైతులు ఇచి్చన భూములను తాకట్టు పెట్టడం, విక్రయించడం ద్వారా వచ్చే నిధులతోనే అమరావతి నిర్మాణం చేపడుతున్నాం. అనకాపల్లి వద్ద స్టీల్ ప్లాంట్, రామాయపట్నం కోసం భూములతో పాటు మిగతా ప్రాజెక్టులకు ఇదే నమూనాను అమలు చేయాలి. అనకాపల్లిలో టౌన్íÙప్, రామాయపట్నంలో మరో టౌన్ షిప్ వస్తాయి. – కలెక్టర్లు.. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన అన్ని అనుమతులను వచ్చేలా చూడాలి. సోలార్ రూఫ్ టాప్, సహజ సేద్యంను ముందుకు తీసుకెళ్లాలి. గ్రీన్ ఎనర్జీ, పర్యాటకం, వాట్సాప్ గవర్నెన్స్, పీ4 గేమ్ చేంజర్ కానున్నాయి. – వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి. పశువులకు మేతపై దృష్టి పెట్టాలి. వడగాడ్పుల వల్ల ఒక్క వ్యక్తి కూడా మృతి చెందకూడదు. కాల్ సెంటర్ నిర్వహించాలి. స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా పచ్చి మేత పెంపకానికి చర్యలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వలసలకు తావివ్వొద్దు. – మంత్రులు, శాఖాధిపతులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా, నియోజకవర్గ, మండల, సచివాలయాల స్ధాయిలో విజన్ ప్రణాళికలతో ముందుకు సాగాలి. శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్పీలతో కలిసి పని చేయాలి. సాంకేతికతను ఉపయోగించుకోవాలి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం ప్రారంభంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయారని చెప్పారు. కలెక్టర్ల సదస్సులో సీఎం పక్కనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కుర్చీ వేశారు. అయితే ఆయన రాకపోయినప్పటికీ ఆ చైర్‌ను అలాగే ఖాళీగా ఉంచి సదస్సు నిర్వహించారు. కాగా, 2025–26 ఆర్థిక ఏడాదిలో స్థూల ఉత్పత్తి లక్ష్యాలలో భాగంగా వృద్ధి శాతం 16, 17, 18 చొప్పున జిల్లాల వారీగా లక్ష్యాలు నిర్దేశించారు. -
రోడ్డెక్కిన మిర్చి రైతులు
సాక్షి, ప్రతినిధి గుంటూరు/కొరిటెపాడు(గుంటూరు): కూటమి ప్రభుత్వ తీరుతో కడుపు మండిన మిర్చి రైతులు మరోసారి రోడ్డెక్కారు. ‘తేజ’ మిర్చి క్వింటా ధర దారుణంగా పడిపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కష్టించి పండించిన మిర్చికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. గుంటూరు మిర్చి యార్డు ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇవే ధరలు కొనసాగితే పురుగు మందు తాగి చస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరీ ఇంత దారుణమా?గుంటూరు మిర్చి యార్డులో మంగళవారం ఉదయం తేజ రకం మిర్చి క్వింటా ధర కేవలం రూ.8 వేలు పలకడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. ఉదయం 9.30 ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున గుంటూరు మిర్చి యార్డు మెయిన్ గేట్ ఎదుట ఉన్న మెయిన్ రోడ్డుపైకి చేరుకొని ధర్నాకు దిగారు. మరీ ఇంత దారుణమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మిర్చి యార్డుకు చేరుకున్నారు. రైతులతో మాట్లాడి.. ధర్నాను విరమింపజేసే ప్రయత్నం చేశారు. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవతేజ, యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక, యార్డు ఇన్చార్జి సుబ్రమణ్యం.. రైతుల వద్దకు వచ్చారు. ప్రభుత్వం క్వింటా మిర్చికి రూ.11,781 ధర ప్రకటించిందని.. అంతకన్నా తగ్గితే రైతుల ఖాతాల్లో మిగిలిన మొత్తాన్ని జమ చేస్తామని భార్గవ తేజ చెప్పారు. ప్రభుత్వం ప్రకటించాక.. ధరలు మరింత పతనం.. జేసీతో పలువురు రైతులు మాట్లాడుతూ.. గతేడాది తేజతో పాటు మిగిలిన రకాలకు క్వింటా ధర రూ.23 వేలు నుంచి రూ.27 వేల వరకు పలికిందని చెప్పారు. తాలు కాయలకు కూడా రూ.15 వేలు నుంచి రూ.18 వేలు వరకు ధర వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం క్వింటా మిర్చికి రూ.11,781 ధర ప్రకటించకముందు.. తేజ రకం రూ.13 వేలు నుంచి 15 వేలు వరకు పలికిందని తెలిపారు. ప్రభుత్వం ధర ప్రకటించాక.. నిలువు దోపిడీకి గురవుతున్నామని రైతులు మండిపడ్డారు. ఉదయం క్వింటా ధర రూ.9 వేలు పలికిందని చెబుతున్నారని.. మరో గంట తర్వాత రూ.8 వేలేనంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులు 2 శాతం బదులు.. 6 శాతం వరకు కమీషన్ తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో, కూలీలకు డబ్బులెలా ఇవ్వాలో అర్థం కావడం లేదని వాపోయారు. జేసీ భార్గవ తేజ స్పందిస్తూ.. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి.. యార్డు నుంచి వెళ్లిపోయారు. దీంతో రైతులు మరోసారి రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేసేందుకు ప్రయత్నించారు. ఇవే ధరలు కొనసాగితే పురుగు మందు తాగి ఇక్కడే చస్తామని హెచ్చరించారు. చివరకు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పోలీసులు సర్దిచెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.కూలీలకు ఇచ్చేందుకూ సరిపోవు..నాలుగు ఎకరాల్లో తేజ రకం సాగు చేశా. గతేడాది ఎకరాకు సుమారు 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాకు రూ.23 వేల నుంచి రూ.27 వేల వరకు వచ్చాయి. ఈ ఏడాది పెట్టుబడి కోసం రూ.2 లక్షల వరకు ఖర్చు చేశా. ఇప్పుడు గుంటూరు యార్డుకు తేజ రకం మిర్చి 20 బస్తాలు తీసుకువచ్చా. క్వింటా రూ.8 వేలుకు అడుగుతున్నారు. ఈ డబ్బులు కూలీలకు కూడా సరిపోవు. ఇవే ధరలు కొనసాగితే ఆత్మహత్య చేసుకోవడమే మార్గం. – దారం ఎలీసారెడ్డి, దారంవారిపాలెం, ప్రకాశం జిల్లాధరలు ఇంత ఘోరంగా ఎప్పుడూ లేవు..గత 15 ఏళ్లుగా మిర్చి సాగు చేస్తున్నా. ఈసారి రెండు ఎకరాల్లో తేజ రకం వేశా. ఎకరాకు రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేశా. తెగుళ్ల వల్ల దిగుబడి 15 క్వింటాళ్లు మించి వచ్చే పరిస్థితి లేదు. గుంటూరు యార్డుకు 40 బస్తాలు తీసుకువచ్చా. క్వింటా రూ.8 వేలకే అడుగుతున్నారు. మిర్చి ధరలు ఇంత ఘోరంగా ఎప్పుడూ లేవు. మా ఇంటిల్లిపాది నెలలు పాటు సేద్యం చేసినా.. కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు. ఇలాగైతే సాగు చేయలేం. – గొల్ల చిరంజీవి, పరమాదొడ్డి గ్రామం, కర్నూలు జిల్లా -
విభజన కుట్ర
‘స్టాలిన్ దున్నపోతు ఈనిందని అందరికీ ఆహ్వానాలు పంపితే దక్షిణాదికి చెందిన ప్రాంతీయ పార్టీల నేతలు ఆ దూడను కట్టేయడానికి చెన్నైకి పరుగులు పెట్టారు.’ లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరిగిపోతోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశం అచ్చంగా ఇలాగే జరిగింది. అన్యాయం జరిగిపోతోందని బీజేపీని గుడ్డిగా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న పార్టీలు ఆ సమావేశానికి వెళ్లాయి. చెన్నైలో ఓ స్టార్ హోటల్లో కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించిన సమావేశంలో ఒక్కరంటే ఒక్కరైనా ఎలా అన్యాయం జరుగుతుందో చర్చించారా? జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల విభజన జరుగుతుందనీ, దక్షిణాదిలో జనాభా తగ్గి పోయారనీ, ఉత్తరాదిలో పెరిగిపోయారనీ, అందుకే దక్షిణాదికి సీట్లు తగ్గుతాయనీ వీరంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు. నిజానికి ఈ ప్రక్రియలో ఇంతవరకూ ఒక్క అడుగు కూడా పడలేదు. ముందుగా జనాభా లెక్కలు పూర్తి చేయాలి. అప్పుడే ఉత్తరాదిలో ఎంత పెరిగారు, దక్షిణాదిలో పెరిగారా, తగ్గారా అన్న స్పష్టత వస్తుంది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటవుతుంది. జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన చేస్తారన్నది కూడా అపోహే! అలా అయితే ఈశాన్య రాష్ట్రాలకు 25 లోక్‌సభ సీట్లు ఉండేవా? ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని పదే పదే చెబుతున్న ప్రధాని, కేంద్ర హోంమంత్రి... ఏ రాష్ట్రానికీ ఒక్క సీటు కూడా తగ్గదని వివిధ సందర్భాల్లో స్పష్టం చేశారు. 2023లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ డీలిమిటేషన్ ప్రక్రియను 2026 తర్వాత జనగణన డేటా ఆధారంగా చేపట్టాలని ప్రభుత్వం యోచి స్తోందని ప్రకటించారు. ప్రతి ఓటరుకూ సమాన ప్రాతి నిధ్యం లభించేలా చేస్తామన్నారు. ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడేలా డీలిమిటేషన్ ఉంటుందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్థానిక జనాభా వైవిధ్యం, గిరిజన సముదాయాల ప్రాతినిధ్యాన్ని కాపాడేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘డీలిమిటేషన్ అనేది కేవలం స్థానాల సంఖ్యను పెంచడం లేదా తగ్గించడం కాదు, ప్రజాస్వామ్యంలో సమానత్వాన్ని స్థాపించే ప్రక్రియ’ అని స్పష్టం చేశారురాజకీయ అలజడి కోసమే...అయినా దక్షిణాదిలోని కొన్ని ప్రాంతీయ పార్టీలు కాకి లెక్కలను ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు 42 లోక్‌సభ స్థానాలుంటే, పునర్విభజన తరు వాత 34 అవుతాయని చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు ప్రస్తుతం 129 స్థానాలుంటే వీటి సంఖ్య 103కు పడిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజ స్థాన్, బిహార్ రాష్ట్రాలలోని స్థానాల సంఖ్య 174 నుంచి 204 స్థానాలకు చేరుకుంటుందని అంటున్నారు. నిజానికి ఈ లెక్కలు ఇచ్చింది ఓ విదేశీ సంస్థ. ‘కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్’ అనే సంస్థ ‘ఇండియాస్ ఎమర్జింగ్ క్రైసిస్ ఆఫ్ రిప్రజెంటేషన్’ అనే నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదిక తప్ప, డీలిమిటేషన్ సీట్లపై మరో రిపోర్టు లేదు.కేంద్రం నుంచి అసలు లేదు. అయినా ఓ విదేశీ సంస్థ రిపోర్టును పట్టుకుని దేశంలో రాజకీయ అలజడి రేపడానికి డీఎంకే ప్రయత్నిస్తూంటే, ఆ పార్టీ ట్రాప్‌లో ఇతర పార్టీలు పడుతున్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదనీ, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసు కోలేదనీ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. లోకసభ నియోజకవర్గాల పునర్విభజన గతంలో 2002లో ప్రారంభమైంది. 2008లో అమలులోకి వచ్చింది. ఈ ప్రక్రియ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం జరిగింది. 2002లో డీలిమిటేషన్ చట్టం ఆమోదించిన తర్వాత, సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌లో ఎన్నికల కమిషన్ సభ్యులు, రాష్ట్రాల నుండి ప్రతినిధులు ఉన్నారు. 2001 జనాభా లెక్కల ఆధారంగా ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను సమన్వయం చేశారు. దీని ప్రకారం, జనాభా పెరుగుదలకు అనుగుణంగా నియోజకవర్గాల సరిహద్దులు సవరించారు. మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్య మాత్రం మారలేదు. నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ వివిధ రాష్ట్రాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, పౌరుల నుండి సూచనలు స్వీకరించింది. ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుని, సరిహద్దులను ఖరారు చేశారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఇంకా విస్తృత సంప్రతింపులకు కమిటీలు వేస్తారు.పరుష వ్యాఖ్యలు ఎందుకు?ఉత్తరాదివాళ్ళు పందుల్ని కన్నట్లుగా పిల్లల్ని కంటున్నారనీ, అక్కడ బహుభర్తృత్వం ఉంటుందనీ డీఎంకేకు చెందిన మంత్రి దురై మురుగన్ వ్యాఖ్యానించారు. ఉత్తరాదివారిని కించపరిచి తమిళనాడు డీఎంకే నేతలు ఏం సాధించాలనుకుంటున్నారు? ఉత్తరాది వారిలో దక్షిణాదిపై ఏకపక్షంగా వ్యతిరేకత పెంచే కుట్రలో భాగంగానే ఇలాంటి పనులు చేస్తున్నారు. తమిళనాడు డీఎంకే పాలన నాలుగేళ్లు నిండ కుండానే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంది. అందుకే ఉత్తరాదిపై విషం చిమ్మి, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో దక్షిణాది సెంటిమెంటుతో గెలవాలనుకుంటున్నారు.హక్కుల కోసం పోరాటం చేయడం ప్రజాస్వామ్య హక్కు. కానీ ప్రాంతాల వారీగా భావోద్వేగాలు కలిగి ఉండే సమస్యల పట్ల పోరాడేటప్పుడు, విభజనవాదం చెలరేగే ప్రమాదం ఉంది. ప్రత్యేక ద్రవిడ దేశం కావాలని గతంలో కొంత మంది తమిళ నేతలు ప్రకటనలు కూడా చేశారు. ఇలాంటి విభ జనవాదుల మధ్య దేశాన్ని సమైక్యంగా ఉంచుకోవడం ఇప్పుడు అత్యంత ముఖ్యం. ప్రత్యేక దేశం అనే మాట వినిపించిందంటే, అది విభజన వాదమే! దీన్ని ఏ మాత్రం ప్రోత్సహించకుండా,దక్షిణాది తన ప్రాధాన్యాన్ని కాపాడుకునేందుకు పోరాటం చేస్తే అది మంచి ప్రజాస్వామ్య విధానం అవుతుంది.ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి వ్యాసకర్త బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు -
దంతెవాడ–బీజాపూర్‌లో ఎన్కౌంటర్
సాక్షి, హైదరాబాద్/ సాక్షిప్రతినిధి, వరంగల్/ చర్ల: మావోయిస్టు కీలక నేతలే టార్గెట్‌గా సాయుధ పోలీసు బలగాలు తమ వేట ముమ్మరం చేశాయి. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పట్టు సాధిస్తూ మావోయిస్టుల కీలక ప్రాంతాల్లోకి చొచ్చుకుపోతున్న బలగాలు నక్సల్స్ ఏరివేతను కొనసాగిస్తున్నాయి. తాజాగా మంగళవారం ఉదయం దంతెవాడ–బీజాపూర్ ప్రాంతంలోని గీడం పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్సాపర, నెల్గోడ, బోడ్గా, ఇకెలి గ్రామాల సరిహద్దు ప్రాంతాలలో నక్సల్స్ ఉన్నట్టు సమాచారం అందడంతో దంతెవాడ డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ బృందం గాలింపు జరపగా చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో డీకేఎస్జెడ్సీ (దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ) సభ్యుడిగా పనిచేస్తున్న హనుమకొండ జిల్లా మడికొండ పీఎస్ పరి«ధిలోని తరాలపల్లికి చెందిన మావోయిస్టు కీలకనేత అంకేశ్వరపు సారయ్య అలియాస్ సుధాకర్ అలియాస్ సుదీర్ అలియాస్ మురళి మృతిచెందినట్టు దంతెవాడ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ అధికారికంగా వెల్లడించారు. 1991లో మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిన సుధాకర్ అంచెలంచెలుగా ఎదిగాడు. ప్రస్తుతం జనధనసర్కార్ స్కూల్స్ ఇంచార్జిగా కొనసాగుతున్నాడు. తొలుత నర్సంపేట డివిజన్ ఇంచార్జి, తర్వాత ఖమ్మం జిల్లా పరిధిలో కొంతకాలం... తర్వాత బస్తర్‌కు సుధాకర్ వెళ్లినట్టు సమాచారం. డీకేఎస్‌జెడ్‌సీలో కీలకంగా ఉన్న సుధాకర్‌పై రూ.25 లక్షల రివార్డు ఉంది. మావోయిస్టు చేసిన పలు కీలక ఆపరేషన్లలోనూ సుధాకర్ పాత్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సారయ్య అంగరక్షకులు బీజాపూర్ జిల్లా బైరాంగర్కు చెందిన పండరు అటరా, మన్ను బర్సాలు కూడా ఎన్కౌంటర్లో మృతిచెందారు. వీరిపై రెండు లక్షల రివార్డు ఉందని ఎస్పీ చెప్పారు. ఘటనాస్థలి నుంచి ఇన్సాస్ రైఫిల్, పాయింట్ 303 రైఫిల్, పేలుడు పదార్థాలు, నిత్యావసరాల వస్తువులను స్వా«దీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. తాజా ఎన్కౌంటర్ మృతులతో కలుపుకుని ఈ ఏడాదిలో ఇప్పటివరకు 116 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు వెల్లడించారు. 100 మందికిపైగా కీలక నేతలను కోల్పోయిన మావోయిస్టులు 2025 సంవత్సరంలో ఇప్పటివరకు, బస్తర్ రేంజ్లో వివిధ ఎన్కౌంటర్లలో 100 మంది నక్సలైట్లు మృతిచెందారు. డిసెంబర్ 2, 2024లో ములుగు జిల్లా పొలకమ్మ వాగు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కురుసం మంగు, 2024 సెపె్టంబర్ మొదటివారంలో కర్కగూడెం గ్రామానికి అతి సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ సభ్యుడు లచ్చన్న, ఆయన భార్య తులసి అలియాస్ పునెం లక్కీ, పాల్వంచ మణుగూరు ఏరియా కమాండర్ కామ్రేడ్ రాము, పార్టీ సభ్యులు కోసి, సీనియర్ సభ్యులు గంగాల్, కామ్రేడ్ దుర్గేశ్ ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. 2024 ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేరు జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు సహా మావోయిస్టు అగ్రనేత సుగులూరి చిన్నన్న అలియాస్ విజయ్ మృతి చెందారు. ఇలా తెలంగాణ ప్రాంతానికి చెందిన కీలక నేతల ఏరివేతలోనూ భద్రత బలగాలు రోజురోజుకూ పట్టు సాధిస్తున్నాయి. సీఆర్పీఎఫ్, డీఆర్జీ (డిస్ట్రిక్ట్ రిజర్వ్‌గార్డ్)కు సరిహద్దున తెలంగాణ గ్రేహౌండ్స్, స్పెషల్ పోలీస్ బలగాల దాడులు ముమ్మరం కావడంతో మావోయిస్టులు ఆత్మరక్షణకే పరిమితం అవుతున్నారు. -
సాయం పేరుతో స్వాహా!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి అందరూ బియ్యం ఇవ్వాలంటూ జనసేన శ్రేణులు గత ఏడాది ఊరూరా తిరిగి సేకరించారు. ఇలా దాతలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థల నుంచి భారీగా సేకరించారు. చివరికి అనుకున్న స్థాయిలో బియ్యం సేకరించాక ఆ మొత్తాన్ని జనసేన నియోజకవర్గ ఇన్చార్జి ఒకరు అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడిది బయటకు పొక్కింది. దీంతో.. ఆ మొత్తం డబ్బును పార్టీకి విరాళంగా ఇస్తానని.. ఇదంతా మంత్రి కందుల దుర్గేష్‌కు చెప్పేచేశానని ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వివాదం ముదరడంతో రెండ్రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో దీనిపై పంచాయితీ జరిగింది. అయినా సెటిల్ కాకపోవడంతో జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి వ్యవహారం తీసుకెళ్లారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఇప్పుడీ వ్యవహారం కలకలం రేపుతోంది. ఆ వివరాలు..అసలేం జరిగిందంటే.. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికంటూ జనసేన పార్టీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి దొడ్డిగర్ల సువర్ణరాజు నేతృత్వంలో గతేడాది నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో భారీగా బియ్యం సేకరించారు. కానీ, ఇలా సేకరించిన బియ్యాన్ని విజయవాడలో బాధితులకు పంచకుండా ఆయన విక్రయించేశారు. ఈ సొమ్మును నియోజకవర్గ ఇన్చార్జే స్వాహా చేశాడని ఒక వర్గం దుమ్మెత్తిపోస్తుండగా.. ఇన్చార్జి వర్గం మాత్రం సొమ్ము తమవద్దే ఉందని, పార్టీకి విరాళం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే కుదరడంలేదని, మంత్రి కందుల దుర్గేష్‌కు విషయం చెప్పామని, ఆయన విరాళం ఇవ్వడానికి పవన్‌కళ్యాణ్ వద్దకు తీసుకువెళ్తారంటూ చెబుతున్నారు. అయితే, నాలుగు నెలల క్రితం జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం వచ్చినప్పడు కూడా ఆయనకు చెక్కు ఇవ్వడం కుదరలేదా అని ప్రత్యర్థి వర్గం నిలదీస్తోంది.రూ.10 లక్షలు కాదు.. 16 లక్షలకు అమ్ముకున్నారు..జనసేన నియోజకవర్గ ఇన్చార్జి సువర్ణరాజు, ఆయన వ్యతిరేక వర్గం మధ్య ఈ విషయంలో కొద్దిరోజులుగా తారాస్థాయిలో వివాదం నడుస్తోంది. సేకరించిన బియ్యాన్ని రూ.10.27 లక్షలకు విక్రయించానని సువర్ణరాజు చెబుతుంటే.. రూ.16 లక్షలకు అమ్ముకున్నారని వ్యతిరేక వర్గం చెబుతోంది. దీనిపై పార్టీ జిల్లా నేతల వద్ద పంచాయితీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో.. రెండ్రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో జనసేన నాయకుడు కరాటం సాయి పార్టీ ఆదేశాలతో గోపాలపురం నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు. సువర్ణరాజు అనుకూల, వ్యతిరేక వర్గాలు ఘర్షణకు దిగడంతో సమావేశం రసాభాసగా మారింది. దీంతో కరాటం సాయి చేతులెత్తేసి జిల్లా ఇన్చార్జి నాదెండ్ల మనోహర్ దృష్టికి వ్యవహారం తీసుకెళ్తున్నట్లు చెప్పి సమావేశం ముగించారు. -
సొరంగంలో మరో మృతదేహం లభ్యం
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగ ప్రమాదంలో శిథిలాల కింద కూరుకుపోయిన వారిలో మరొకరి మృతదేహం మంగళవారం లభ్యమైంది. మృతుడిని జేపీ కంపెనీకి చెందిన ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్‌కుమార్ (50)గా గుర్తించారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సహాయ బృందాలు మనోజ్‌కుమార్ మృతదేహాన్ని సొరంగం నుంచి బయటకు తీసుకొచ్చాయి. నాగర్‌కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని ఆయన కుటుంబానికి అప్పగించారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆర్డీఓ సురేశ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం తరఫున మృతుని కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును అందించారు. అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్‌లో మనోజ్‌కుమార్ స్వగ్రామం యూపీలోని ఉన్నావ్ జిల్లా బంగార్మావ్ గ్రామానికి తరలించారు. మనోజ్‌కుమార్ 2009 నుంచి జేపీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య స్వర్ణలత, కుమార్తె శైలజ (24), కుమారుడు ఆదర్శ్ (17) ఉన్నారు. ఎక్స్కవేటర్ ద్వారా తవ్వకాలతో మృతదేహం బయటకు.. సొరంగంలోని 14వ కి.మీ. సమీపంలో ఫిబ్రవరి 22న పైకప్పు కూలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, ఇంజనీర్లలో 8 మంది ఆచూకీ గల్లంతవడం తెలిసిందే. రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఈ నెల 9 ఒక మృతదేహాన్ని (గురుప్రీత్‌సింగ్) వెలికితీయగా డీ2 ప్రాంతానికి సుమారు 190 మీటర్ల దూరంలో వెనక వైపు, కన్వేయర్ బెల్టుకు సమీపంలో మనోజ్‌కుమార్ మృతదేహం లభ్యమైంది. సొరంగానికి కుడి వైపున కన్వేయర్ బెల్టు ఉండగా బెల్టు సమీపంలో ఇప్పటికే ఒకవైపు నుంచి తవ్వకాలు చేపడుతూ సహాయక బృందాలు మార్గాన్ని ఏర్పాటు చేస్తూ ఎడమ వైపున మట్టి వేశాయి. ఎక్స్కవేటర్ సాయంతో అక్కడి మట్టిని తొలగిస్తుండగా మంగళవారం మృతదేహం కనిపించింది. ప్రమాదానికి ముందు లోకో ట్రైన్లో కాంక్రీట్ సెగ్మెంట్లు, సామగ్రిని తీసుకెళ్లారని, ప్రమాద సమయంలో లోకోట్రైన్తో సహా చెల్లాచెదురై వెనక్కి కొట్టుకొచ్చి ఉంటుందని సహాయక సిబ్బంది అంటున్నారు. ఇదే ప్రాంతంలో నాలుగు ఎక్స్కవేటర్ల సాయంతో ముమ్మరంగా తవ్వకాలు, మట్టి తొలగింపు చేపట్టారు. -
అన్నదాతకు సర్కారే శాపం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయానికి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే శాపంగా మారింది. ప్రకృతి వైపరీత్యాలు, కరువు దెబ్బతీస్తున్నా, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీంతో 2024–25 ఖరీఫ్, రబీ సీజన్లలో వ్యవసాయమే అస్తవ్యస్తమైపోయింది. రైతులు తీవ్ర ఒడిదొడుకుల మధ్య పంటలు సాగు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. చివరకు రైతులు తీవ్ర నష్టాలపాలయ్యారు. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఖరీఫ్ సాగు ఆలశ్యం కాగా, ఆ ప్రభావం రబీ పైనా పడింది. రబీ సాగు కోసం ముందస్తు ఏర్పాట్లు చేయడంలో విఫలమైన ప్రభుత్వం రెండో పంటకు నీరివ్వడంలోనూ వైఫల్యం చెందింది. ప్రభుత్వ నిర్వాకం, పెట్టుబడి సాయం అందకపోవడం, అదనుకు విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు పడరాని పాట్లుపడ్డారు. ఈ తిప్పలన్నీ పడలేక చాలా మంది రైతులు వారి పొలాల్లో సాగే చేయకుండా వదిలేశారు. రెండు సీజన్లలో కలిపి 1.51 కోట్ల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యం కాగా, 1.24 కోట్ల ఎకరాల్లోనే సాగయ్యాయి. ఖరీఫ్‌లో 16 లక్షల ఎకరాలు.. రబీలో 11 లక్షల ఎకరాల్లో.. మొత్తంగా 27 లక్షల ఎకరాల్లో సాగే లేకుండా సీజన్ ముగిసింది. ఖరీఫ్‌లో వరుస వైపరీత్యాల బారిన పడి 10 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు 6 లక్షల ఎకరాలు కరువు బారిన పడ్డాయి. అయినా ప్రభుత్వం నుంచి రైతులకు కనీస మద్దతు కూడా దక్కలేదు. దీంతో రైతులు కుదేలైపోయారు. దాని ప్రభావం రబీ పైనా పడింది. సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. లక్షలాది ఎకరాల్లో విత్తనం నాటడానికి కూడా రైతులు సాహసించలేకపోయారు. రబీ సాగు లక్ష్యం 57.65 లక్షల ఎకరాలు కాగా.. సాగైన విస్తీర్ణం 46.40 లక్షల ఎకరాలే. అంటే 11.25 లక్షల ఎకరాల్లో సాగుకు రైతులు ముందుకు రాలేదు. దాళ్వాలో వరి సాగు లక్ష్యం 20 లక్షల ఎకరాలు కాగా సాగైంది 16.52 లక్షల ఎకరాల్లోనే. అంటే 3.50 లక్షల ఎకరాలు ఖాళీగా ఉండిపోయాయి. సాధారణంగా రెండో పంటలో వరి కంటే ఎక్కువగా అపరాలు సాగవుతాయి. ఈసారి అపరాల సాగు లక్ష్యం 23.50 లక్షల ఎకరాలు కాగా, సాగైన విస్తీర్ణం 16.72 లక్షల ఎకరాలే. అంటే దాదాపు 6.78 లక్షల ఎకరాలు ఖాళీగా ఉండి పోయాయి. వీటిలో ప్రధానంగా శనగలు 11.17 లక్షల ఎకరాలకు గాను, 7.5 లక్షల ఎకరాల్లోనే సాగయ్యాయి. మినుము సాగు లక్ష్యం 8.50 లక్షల ఎకరాలు కాగా, 6.95 లక్షల ఎకరాల్లో పంట వేశారు. గతేడాది రికార్డు స్థాయిలో సాగైన మొక్కజొన్న కూడా ఈసారి తగ్గిపోయింది. ఈ ఏడాది మొక్కజొన్న సాగు లక్ష్యం 5.27 లక్షల ఎకరాలకుగాను 4.55 లక్షల ఎకరాలే సాగైంది. ఇలా పంటలన్నీ లక్ష్యానికి ఆమడ దూరంలోనే నిలిచిపోయాయి. ఇప్పటికీ రబీ పంటల సాగు చివరి దశకు చేరుకున్నా కొన్ని ప్రాంతాల్లో సాగు నీరందక పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. సీజన్ ఆరంభంలోనే ఫెంగల్ తుపాన్ దెబ్బతీయగా, ఆ తర్వాత వర్షాభావ పరిస్థితులు రైతులను దెబ్బతీశాయి. దీనికి తోడు సాగు నీటి నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట పెను శాపంగా మారింది. -
మామిడి గుజ్జు.. ఎగుమతులు నుజ్జు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: విదేశాలకు మామిడి గుజ్జు (పల్ప్) ఎగుమతులు క్షీణించాయి. గడచిన సీజన్లో ఒక్క ఏపీ నుంనే 3 లక్షల టన్నుల మామిడి గుజ్జు ఎగుమతులు జరుగుతాయని అంచనా వేయగా.. ఊహించని పరిస్థితులు తలెత్తడంతో 2.75 లక్షల టన్నుల మేర నిల్వలు ఎగుమతి కాకుండా నిలిచిపోయింది. వివిధ దేశాల్లో యుద్ధాలు. ఆర్థిక మాంద్యం, పౌర అశాంతి ప్రభావంతో దేశం నుంచి ఎగుమతులు పడిపోయాయి. ఈ ఏడాది కూడా పరిస్థితులు మరింత తీవ్రం కావడంతో ఎగుమతులు మరింత క్షీణించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిస్థితి మామిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఏడాది అకాల వర్షాలు, వరుస వైపరీత్యాలతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడం, నాణ్యత లోపించడం వంటి కారణాలతో ధర లేక మామిడి రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. అదే సమయంలో మామిడి గుజ్జు ఎగుమతులు నిలిచిపోవడం రైతులతో పాటు ఎగుమతి దారులకు ఆశనిపాతంగా మారింది. ఆ ప్రభావం ఈసారి మార్కెట్‌పై మరింతగా పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ నుంచి ఏటా 2.5 లక్షల టన్నులకు పైగా ఎగుమతి రాష్ట్రంలో 9.97 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉండగా.. ఈ ఏడాది 45 లక్షల టన్నులకుపైగా దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సాగయ్యే పంటలో 65–70 శాతం పంట తోతాపురి రకమే. తోతాపురి మామిడిని గుజ్జు రూపంలో యూరప్, గల్ఫ్, ఉక్రెయిన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. రాష్ట్రం నుంచి ఏటా 2.5 లక్షల టన్నులకు పైగా మామిడి గుజ్జు ఎగుమతి అవుతుంటుంది. 2019–24 మధ్య 8.5 లక్షల టన్నుల పల్ప్ విదేశాలకు ఎగుమతి చేశారు. అదేవిధంగా 550 టన్నులకుపైగా మామిడి పండ్లు సైతం విదేశాలకు ఎగుమతి అయ్యాయి. రైతులు, ఎగుమతిదారులకు ఇది కష్టకాలమే 2024–25లో ప్రపంచ దేశాల్లో యుద్ధాలు, ఆర్థిక మాంద్యం వంటి కారణాల వల్ల దేశం నుంచి మామిడి గుజ్జుతో పాటు పండ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో విదేశాల నుంచి ఆర్డర్స్ వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది తోతాపురి రకం టన్ను రూ.25 వేల నుంచి రూ.30 వేలు ధర పలకగా, ఈ ఏడాది టన్నుకు రూ.10 వేల నుంచి రూ.15వేలకు మించి పలకకపోవచ్చని చెబుతున్నారు. వాతావరణ మార్పులు, చీడపీడలు, కొత్తరకం పురుగులు మామిడిపై దాడి చేయడంతో దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గుజ్జు ఎగుమతులు కాకపోతే ధరలు మరింత క్షీణించే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు రైతులను మరింత కలవరానికి గురి చేస్తున్నాయి.పేరుకున్న రూ.1,750 కోట్ల విలువైన గుజ్జు నిల్వలు మామిడి గుజ్జు పరిశ్రమలన్నీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి. మొత్తంగా 47 ఫ్యాక్టరీలు ఉండగా.. వాటి సామర్థ్యం 8 లక్షల టన్నులు. గతేడాది 3.50 లక్షల టన్నులకు పైగా గుజ్జు ఉత్పత్తి అయ్యింది. ఇందులో స్థానిక వినియోగం పోగా.. ఇంకా 2.75 లక్షల టన్నుల నిల్వలు పేరుకుపోయాయి. వీటి విలువ రూ.1,750 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. సాధారణంగా ఏటా 10–20 శాతం వరకు గుజ్జు నిల్వలు మిగులు ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి గుజ్జు ఎగుమతులు ప్రారంభం కాగా.. గతేడాది పేరుకుపోయిన నిల్వల్లో కేవలం 10 శాతం మాత్రమే ఎగుమతి అయింది. మే నాటికి పాత నిల్వలు అమ్ముడవకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోతామని వ్యాపారులు చెబుతున్నారు. తమకు ఆర్థికంగా చేయూత ఇవ్వాలని చిత్తూరు జిల్లా ఫ్రూట్ ప్రోసెసర్స్ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకపోయింది.ఈసారి కూడా మామిడి కష్టమే మాకు 10 ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఈసారి పూత ఆలస్యమైంది. వాతావరణ ప్రభావంతో పిందె సక్రమంగా రాలేదు. తెగుళ్లు, కొత్త రకం పురుగులు పంటను పట్టి పీడిస్తున్నాయి. ఎండ తీవ్రత అధికం కావడంతో పిందె ఎదుగుదలపై ప్రభావం పడుతోంది. ఇప్పటివరకు 3 సార్లు మందుల పిచికారీ చేశా. ఖర్చులు విపరీతంగా పెరిగాయి. మరోవైపు మామిడి గుజ్జు నిల్వలు ఫ్యాక్టరీల్లో పేరుకుపోయాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు దక్కుతాయో లేదో అనుమానంగా ఉంది. – పద్మనాభరెడ్డి, ఎర్రచేను, చిత్తూరు జిల్లా అయోమయంలో ఉన్నాం మహరాష్ట్ర వెళ్లి ఎగుమతిదారులతో మాట్లాడాం. వాళ్లు ఏమాత్రం స్పందించడం లేదు. మామిడి గుజ్జు నిల్వలు అమ్ముడుపోయే పరిస్థితి కనిపించడం లేదు. యుద్ధాలు, ట్రాన్్పపోర్ట్ చార్జీలు పరిశ్రమదారులను నిండా ముంచుతున్నాయి. అప్పులు నిలిచిపోయాయి. ఈసారి ఎలా ఉంటుందో అర్థంగాక అయోమయంలో ఉన్నాం. జ్యూస్ తయారీ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఉత్పత్తులపై దృష్టి సారిస్తున్నాయి. గతంలో జ్యూస్‌లో 80 శాతం గుజ్జు కలిపేవారు. ఇప్పుడు 5 శాతమే గుజ్జు కలుస్తోంది. ఇది కూడా పరిశ్రమదారులను దెబ్బతీస్తోంది. వీటిపై ప్రభుత్వాలు స్పందించి ఆదుకోవాలి. – తలపులపల్లి బాబురెడ్డి, గుజ్జు పరిశ్రమ యజమాని మామిడి గుజ్జు పరిశ్రమను ఆదుకోవాలి: ఏఐఎఫ్‌పీఏ తీవ్ర సంక్షోభంలో ఉన్న మామిడి పరిశ్రమను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనివ్వాలని, చిత్తూరులో మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసింగ్ అసోసియేషన్ (ఏఐఎఫ్‌పీఏ) కోరింది. ఈ మేరకు అసోసియేషన్ సౌత్ జోన్ చైర్మన్ కట్టమంచి గోవర్ధన్ బాబీ చిత్తూరు జిల్లా ఫ్రూట్ ప్రాసెసింగ్ ఫెడరేషన్తో కలిసి సీఎం చంద్రబాబుకు, కేంద్రానికి లేఖ రాశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పల్ప్ ఇండస్ట్రీని ఆదుకునేందుకు రుణాల వసూళ్లను ఆరునెలలు వాయిదా వేసేలా బ్యాంకర్లకు ఆదేశాలివ్వాలని కోరారు. మామిడి గుజ్జు నిల్వలు అమ్ముడయ్యేందుకు వీలుగా ఆలయాలు, పర్యాటక ప్రాంతాల్లో మామిడి గుజ్జు పరిశ్రమల సమాఖ్యకు స్టాల్స్ కేటాయించాలని, మధ్యాహ్న భోజనం మెనూలో మామిడి ఉత్పత్తులు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. పల్ప్ పరిశ్రమలకు పెండింగ్ సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలని కోరారు.