
మాట్లాడుతున్న సీపీ ఎస్వీ రాజశేఖరబాబు. చిత్రంలో డీసీపీ తిరుమలేశ్వరరెడ్డి, ఏసీపీ డాక్టర్ స్రవంతిరాయ్
354 గ్రాముల బంగారు, 21 కిలోల వెండి ఆభరణాలు, కారు స్వాదీనం
మరో రూ.23 కోట్ల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు యత్నం
183 మందిని రూ.353 కోట్ల మేర మోసం చేసిన సంస్థ
విజయవాడ సీపీ ఎస్వీ రాజశేఖరబాబు వెల్లడి
లబ్బీపేట (విజయవాడ తూర్పు): కష్టపడకుండా సులభంగా డబ్బులు సంపాదించాలని కొందరు వ్యక్తులు గ్రూప్‌గా ఏర్పడి 183 మంది నుంచి దాదాపు రూ.353 కోట్లు దండుకుని మోసగించిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టుచేసినట్లు విజయవాడ పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు శనివారం మీడియాకు వెల్లడించారు. వీరు యుపిక్స్ క్రియేషన్ అనే యానిమేషన్ సంస్థను చూపి, హాలీవుడ్ సినిమాలకు వర్క్‌చేసే ఈ సంస్థలో పెట్టుబడి పెడితే ఏడాదిలోనే రెట్టింపు డబ్బులు పొందొచ్చని అమాయకులకు ఆశ చూపి క్రమేణా రూ.కోట్లలో పెట్టుబడులు రాబట్టారని ఆయన చెప్పారు.
మోసం చేసిందిలా..
నిడుమోలు వెంకట సత్యలక్ష్మీకిరణ్ అనే వ్యక్తి విజయవాడ సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆదిశేషయ్య వీధిలో యుపిక్స్ అనే యానిమేషన్ కంపెనీని 2014లో ఏర్పాటుచేశారు. అనంతరం.. లక్ష్మీకిరణ్‌కు పేరం మాల్యాద్రి, అతని కొడుకు పేరం మహేశ్వరరెడ్డి, కొత్తూరి వేణుగోపాలరావు, మిట్టపల్లి రాజేంద్రబాబు అతని కొడుకు మిట్టపల్లి రాజీవ్‌కృష్ణ తోడయ్యారు. వీరంతా 2018లో ఒక గ్రూప్‌గా ఏర్పడి అమాయకులకు వల వేశారు.
తొలుత లాభాలు వచ్చినట్లు చూపించి వారి బంధువులు, స్నేహితులకు సక్రమంగా కమీషన్లు చెల్లిస్తూ మరిన్ని డిపాజిట్లు చేయించేలా వారిని ప్రోత్సహించారు. అలా వచ్చిన మొత్తాలను వారి సొంత ఖాతాల్లోకి మళ్లించేవారు. ఇలా దాదాపు 183 మంది నుంచి రూ.353 కోట్లు సేకరించారు. ఇందులో రూ.194 కోట్ల వరకూ వారి సొంత ఖాతాలకు మళ్లించారు.
వెలుగు చూసిందిలా..
ఈ సంస్థలో రూ.20 కోట్లు పెట్టుబడి పెడితే మోసం చేశారంటూ ఈ ఏడాది ఏప్రిల్ 14న పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన త్రిపురమల్లు శ్రీనివాసరావు, కలవకొల్లు దిలీప్‌కుమార్ సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో.. డీసీపీ కె. తిరుమలేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో విచారణ అధికారిగా ఏసీపీ డాక్టర్ స్రవంతి రాయ్‌తో పాటు మరో నలుగురు ఇన్‌స్పెక్టర్లు, సిబ్బందితో కమిషనర్ రాజశేఖరబాబు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేశారు. దర్యాప్తులో ముఠా మోసాలు బయటపడ్డాయి.
అనంతరం.. పక్కా సమాచారంతో ప్రధాన నిందితులు నిడుమోలు వెంకట సత్యలక్ష్మీకిరణ్ (33)ను విజయవాడలో, మిట్టపల్లి రాజేంద్రబాబు (63), మిట్టపల్లి రాజీవ్‌కృష్ణ (30)ను నరసరావుపేటలో పోలీసులు అరెస్టుచేశారు. వారి నుంచి రూ.90 లక్షల విలువైన 354 గ్రాముల బంగారు ఆభరణాలు, 21 కేజీల వెండి ఆభరణాలు, ఒక కారు, బీఎండబ్ల్యూ బైక్, కంప్యూటర్లు స్వాదీనం చేసుకున్నారు.
వారి బ్యాంకు ఖాతాలనూ ఫ్రీజ్ చేశారు. నిందితులకు సంబంధించిన సుమారు రూ.23 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్‌మెంట్‌కు పెట్టినట్లు సీపీ తెలిపారు. కేసును ఛేదించిన దర్యాప్తు అధికారులు, సిబ్బందిని సీపీ రాజశేఖరబాబు నగదు రివార్డులతో సత్కరించి అభినందించారు.