Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Flipkart Big Billion Days boosted Walmart Q3 growth1
కలిసొచ్చిన ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌

అమెరికన్‌ రిటైల్‌ దిగ్గజం వాల్ట్‌మార్ట్‌ ఇంటర్నేషనల్‌ మూడో త్రైమాసికంలో పటిష్టమైన ఆర్థిక ఫలితాలు సాధించడంలో భారత విభాగం ఫ్లిప్‌కార్ట్‌ కీలకంగా నిలిచింది. ఫ్లిప్‌కార్ట్‌ ’బిగ్‌ బిలియన్‌ డే’ సేల్స్‌ని నిర్వహించిన సమయం తమ సంస్థ ఆదాయాల వృద్ధికి సానుకూలంగా దోహదపడిందని వాల్‌మార్ట్‌ తెలిపింది.ఫిబ్రవరి–జనవరి వ్యవధిని కంపెనీ ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. దీని ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంతర్జాతీయంగా వాల్‌మార్ట్‌ ఆదాయం 179.5 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. క్యూ3లో ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సానుకూలంగా ఉన్నప్పటికీ, క్యూ4లో వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశంఉందని వాల్‌మార్ట్‌ తెలిపింది.ఈ ఏడాది సెపె్టంబర్‌ 23 నుంచి అక్టోబర్‌ 2 వరకు బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ నడిచింది. 2018లో 16 బిలియన్‌ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్‌ 77 శాతం వాటా కొనుగోలు చేసింది. తర్వాత దాన్ని 80 శాతానికి పెంచుకుంది.

Maruti Suzuki picks up stake in Ravity Software2
సాఫ్ట్‌వేర్‌ స్టార్టప్‌లో వాటా కొన్న మారుతీ

టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌ రావిటీ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌లో కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ 7.84 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకు మారుతీ సుజుకీ ఇన్నోవేషన్‌ ఫండ్‌ ద్వారా రూ. 2 కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. రావిటీ కనెక్టెడ్‌ మొబిలిటీ ఇన్‌సైట్స్‌లో ప్రత్యేకతను కలిగి ఉన్నట్లు పేర్కొంది.ఈ ఫండ్‌ ద్వారా మారుతీ ఇంతక్రితం రెండుసార్లు దాదాపు రూ. 2 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసింది. 2024 మార్చిలో ఏఎంఎల్‌గో ల్యాబ్స్‌లో, 2022 జూన్‌లో సోషియోగ్రాఫ్‌ సొల్యూషన్స్‌లోనూ వాటా కొనుగోలు చేసింది. అత్యున్నతస్థాయి ఆవిష్కరణలకు తెరతీస్తున్న స్టార్టప్‌లలో ఇన్నోవేషన్‌ ఫండ్‌ ద్వారా వ్యూహాత్మకంగా ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు మారుతీ తెలియజేసింది.కంపెనీ కార్యకలాపాలకు సంబంధించిన స్టార్టప్‌లవైపు దృష్టి పెడుతున్నట్లు తెలియజేసింది. కాగా.. మారుతీ పెట్టుబడుల నేపథ్యంలో ఏఐ, అనలిటిక్స్, మొబిలిటీలో కంపెనీకున్న సామర్థ్యం, నైపుణ్యాలను మరింత మెరుగుపరచేందుకు కట్టుబడి ఉన్నట్లు రావిటీ సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థాపకుడు వికాస్‌ రుంగ్తా పేర్కొన్నారు.కాగా మారుతీ సుజుకీ షేరు శుక్రవారం బీఎస్‌ఈలో 1.2 శాతం బలపడి రూ. 15,980 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో గరిష్టంగా రూ. 16,150ను తాకింది.

IT Employees To Get Salaries By 7th Of Every Month New Labour Code3
ఐటీ ఉద్యోగుల జీతాలు.. కొత్త లేబర్‌ కోడ్‌

ఐటీ ఉద్యోగులకు రూ.లక్షల్లో జీతాలు ఉంటాయి.. ఇవి కాక అనేక ఇతర ప్రయోజనాలు.. ఆహా జాబ్‌ అంటే ఐటీ వాళ్లదే అనుకుంటాం. కానీ వాస్తవంలోకి వెళ్తే ఉద్యోగులకు అరకొర జీతాలు.. అదీ నెలనెలా సక్రమంగా ఇవ్వని ఐటీ కంపెనీలు అనేకం ఉన్నాయి. అలాంటి బాధితులకు ఉపశమనం కలగనుంది.దేశంలో ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొత్త లేబర్‌ కోడ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న లేబర్‌ కోడ్‌లను తక్షణం అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగులకు ప్రతి నెలా 7వ తేదీలోగా జీతం పంపిణీ చేయడం తప్పనిసరి. దీంతో ఐటీ ఉద్యోగులు ఇకపై జీతాల్లో జాప్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ఇక మహిళా ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి కూడా కొత్త లేబర్‌కోడ్‌ పలు అంశాలను నిర్దేశించింది. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, వేతనంలో లింగ ఆధారిత అసమానత ఉండదని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.అంతేకాకుండా నైట్‌ షిఫ్టులలో పని చేయడం ద్వారా అందే అధిక వేతనాలు, ఇతర ప్రయోజాలను మహిళలు కూడా పొందవచ్చు. ఇందుకు అనుగుణంగా మహిళా ఉద్యోగులు రాత్రి షిఫ్టులలో పని చేసుకునేలా అన్ని సంస్థలలో సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది.వీటన్నింటితో పాటు పరిశ్రమ-నిర్దిష్ట కోడ్ ప్రకారం.. వేధింపులు, వివక్ష, వేతన సంబంధిత వివాదాలను సకాలంలో పరిష్కరించడం జరుగుతుంది. ఉద్యోగులందరికీ నిర్ణీత కాల ఉపాధి, నియామక పత్రాలు అందించడం తప్పనిసరి. ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాలను సరళీకృతం చేయడానికి, క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం ఈ లేబర్‌ కోడ్‌లను ప్రకటించింది.ఇది చదివారా?: కొత్త జాబ్‌ ట్రెండ్స్‌.. ప్రయోగాత్మక పని విధానాలు

Open Plots Boom Turns Into Buyer Trouble Real estate Hyderabad4
ఓపెన్‌ ప్లాట్లు.. అమ్ముకోలేక అగచాట్లు!

‘మూడేళ్ల క్రితం హైదరాబాద్‌ నుంచి దాదాపు 100 కి.మీ. దూరంలో ఉన్న జహీరాబాద్‌లో ఓ నిర్మాణ సంస్థ భారీ వెంచర్‌ చేసింది. నిమ్జ్‌కు సమీపంలో ఉండటంతో రెట్టింపు ధర పక్కాగా వస్తుందని ఆశ పెట్టడంతో ఓ ప్రైవేట్‌ ఉద్యోగి గజం రూ.8 వేలు చొప్పున 150 గజాల స్థలాన్ని కొన్నాడు. కొడుకు పైచదువుల కోసమని ఏడాది క్రితం నుంచి ప్లాట్‌ అమ్మకానికి పెడితే పోవడం లేదు. రెట్టింపు ధర కాకపోయిన కనీసం బ్యాంకు వడ్డీ చొప్పున ధర కలిసొచ్చినా విక్రయిద్దామని చూసినా లాభం లేకుండా పోయింది. దీంతో ప్లాట్‌ కొన్న కంపెనీ ఆఫీసుకు వెళ్లి తన ప్లాట్‌ విక్రయించి పెట్టమని చెబితే.. ఇప్పుడక్కడ మార్కెట్‌ బాగాలేదని, మరో ఏడాది పాటు ఆగాలని సర్దిచెప్పి పంపించేశారు... ఇదీ రీసేల్‌ ప్లాట్ల పరిస్థితి. – సాక్షి, సిటీబ్యూరోఎవరైనా సరే భూమి ఎందుకు కొంటారు? పిల్లల చదువుకోసమో, అమ్మాయి పెళ్లి కోసమో, ఇతర భవిష్యత్తు అవసరాల కోసం అక్కరకొస్తుందనే కదా! కానీ, ప్రస్తుతం రీసేల్‌ ప్లాట్లకు గిరాకీ ఉండటం లేదు. కుప్పలు తెప్పలుగా వెంచర్లు రావడం, స్థానిక సంస్థల నుంచి అనుమతులు లేకపోవడం, మౌలిక వసతులు కల్పించకపోవటంతో పాటు ప్రభుత్వ ప్రతికూల విధానాలతో స్థిరాస్తి మార్కెట్‌ మందగించింది. దీంతో రీసేల్‌ ప్లాట్లకు గిరాకీ పూర్తిగా తగ్గింది.నగరం చుట్టూ ఇదే పరిస్థితి.. రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌), యాదాద్రి, నిమ్జ్, ఫార్మా సిటీ, టెక్స్‌టైల్స్‌ పార్క్, ఇండ్రస్టియల్‌ పార్క్, ఐటీ హబ్‌లు, మెట్రో రైలు విస్తరణ.. ఇలా అనేక ప్రాజెక్ట్‌లు వచ్చేస్తున్నాయంటూ హైదరాబాద్‌ నుంచి వంద కిలో మీటర్ల వరకూ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు భారీ వెంచర్లు చేస్తున్నారు. యాదాద్రి, జనగాం, సదాశివపేట, షాద్‌నగర్, సంగారెడ్డి, చౌటుప్పల్, చేవెళ్ల వంటి ప్రాంతాలలో ఫామ్‌ ప్లాట్లు, విల్లా ప్లాట్లు, వీకెండ్‌ హోమ్స్‌ అని రకరకాల పేర్లతో విక్రయిస్తున్నారు. ప్లాట్‌ కొనుగోలు చేస్తే అధిక లాభాలు ఉంటాయని అందమైన బ్రోచర్లతో ఊదరగొడుతున్నారు. వీటిని నమ్మి కొన్నవారికి నిరాశే ఎదురవుతుంది. స్థానిక సంస్థల నుంచి అనుమతులు తీసుకోకుండా, ఎలాంటి మౌలిక వసతులను కల్పించకుండానే వెంచర్లను విక్రయిస్తున్నారు. తెల్ల కాగితాల మీద గీతలు గీసేసి, ప్లాట్లను విక్రయించే బిల్డర్లు సైతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు.రెరాలో నమోదు లేకుండానే.. నిబంధనల ప్రకారం రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు కూడా టీఎస్‌–రెరాలో నమోదు చేసుకోవాలి. కానీ, నిర్మాణ సంస్థలు ఇవేవీ పట్టించుకోకుండా పెద్ద ఎత్తున మార్కెటింగ్‌ ప్రతినిధులను నియమించుకుంటున్నాయి. ఏజెంట్లకు ఒక్క ప్లాట్‌ విక్రయిస్తే రూ.2 లక్షలకు పైగానే కమీషన్‌ అందిస్తున్నాయి. ఎక్కువ ప్లాట్లను విక్రయిస్తే ఏజెంట్లకు బంగారం, కార్లు గిఫ్ట్‌లుగా ఇవ్వడంతో పాటు గోవా, మలేíÙయా, దుబాయ్, బ్యాంకాక్‌ హాలీడే ట్రిప్పులకు తీసుకెళుతున్నారు. మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లతో గొలుసుకట్టు వ్యాపారం చేస్తున్నాయి. ప్రతి ఆదివారం నుంచి బస్సులు, కార్లలో కొనుగోలుదారులను వెంచర్ల వద్దకు తీసుకెళుతున్నాయి. వీకెండ్‌ వస్తే చాలు వెంచర్ల వద్ద టెంట్లు, ఏసీ గదులను ఏర్పాటు చేసి ప్రాజెక్ట్‌ల గురించి వివరిస్తున్నాయి. కొనుగోలుదారులకు మందు, విందు అందిస్తున్నాయి.ఇదీ చదవండి: ఇక్కడ అద్దె కన్నా సొంతిల్లు చవక!అమ్ముకోలేక అగచాట్లు.. కొన్ని ప్రాంతాల్లో బిల్డర్లు నిర్మానుశ్య ప్రాంతాలు, జంగిల్‌లలో కూడా వెంచర్లు వేశారు. కనీసం అక్కడ ఊరు ఆనవాళ్లు కూడా కనిపించవు. ఆయా ప్రాంతాలలో ప్లాట్లను కొనుగోలు చేసిన వారు అత్యవసరం అయితే అమ్ముకోలేక అగచాట్లు పడుతున్నారు. వెంచర్లు చేసిన సంస్థ విక్రయించిన ధరకు ప్లాట్‌ను తీసుకోవడానికి వెనకంజ వేస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్లాట్‌పై పెట్టుబడి పెడితే ఎప్పటికైనా ధర పెరుగుతుందనే ధీమాతో చాలా మంది కొనుగోలుదారులు కొనుగోలు చేశారు. అలాంటి వారంతా రెండు, మూడేళ్లుగా అమ్ముకోవడానికి ప్రయత్నిస్తే అమ్ముడుపోవడం లేదు.

GST disruption slows FMCG sales in September quarter5
ఎఫ్‌ఎంసీజీ అమ్మకాల వృద్ధి తగ్గుదల 

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకాల వృద్ధి సెప్టెంబర్‌ త్రైమాసికంలో పరిమాణం పరంగా 5.4 శాతానికి పరిమితమైనట్టు నీల్సన్‌ఐక్యూ సంస్థ తెలిపింది. జీఎస్‌టీ రేట్ల మార్పులకు ముందు నెలకొన్న పరిస్థితులను అవరోధాలుగా పేర్కొంది. అమ్మకాల విలువ మాత్రం 12.9 శాతం పెరిగినట్టు తెలిపింది. ధరల పెరుగుదల ఇందుకు అనుకూలించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ అమ్మకాల వృద్ధి క్రితం ఏడాది క్యూ2తో పోల్చితే 8.4 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గిందని.. అయినప్పటికీ వరుసగా ఏడో నెలలోనూ పట్టణాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక వృద్ధి కనిపించినట్టు తన నివేదికలో నీల్సన్‌ఐక్యూ సంస్థ వెల్లడించింది. చిన్న ప్యాక్‌లకు వినియోగదారుల నుంచి ఆదరణ ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఎఫ్‌ఎంసీజీ అమ్మకాల్లో అధిక వాటా కలిగిన పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా చిన్న పట్టణాల్లో డిమాండ్‌ క్రమంగా కోలుకుంటోంది. జూన్‌ త్రైమాసికంతో పోల్చితే మాత్రం పట్టణాల్లో డిమాండ్‌ తగ్గింది. ఇక గ్రామీణ మార్కెట్లో అందుబాటు ధరల ఆధారంగా చిన్న ప్యాక్‌ల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. ఎఫ్‌ఎంసీజీ డిమాండ్‌లో గ్రామీణ వాటా 38 శాతంగా ఉంటుంది’’అని ఈ నివేదిక తెలిపింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో గ్రామీణ మార్కెట్లో 7.7 శాతం వృద్ధి నమోదు కాగా, పట్టణాల్లో 3.7 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. మెట్రోల్లో ఈ–కామర్స్‌ అమ్మకాలు అధికం మెట్రో నగరాల్లో సంప్రదాయ దుకాణాల ద్వారా ఎఫ్‌ఎంసీజీ అమ్మకాలు తగ్గగా, ఈ–కామర్స్‌ విక్రయాలు పెరిగినట్టు నీల్సన్‌ ఐక్యూ నివేదిక తెలిపింది. ఎనిమిది మెట్రోల్లో ఎఫ్‌ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో ఈ–కామర్స్‌ వాటా పెరిగినట్టు పేర్కొంది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఓమ్ని ఛానల్‌ అమ్మకాలకు (ఆన్‌లైన్‌–ఆఫ్‌లైన్‌) ఈ–కామర్స్‌ కీలక చోదకంగా ఉందని, సంప్రదాయ రిటైల్‌ వాణిజ్యం సైతం తనవంతు వాటా పోషించినట్టు తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినందున వినియోగం పట్ల ఆశావహంగా ఉన్నట్టు పేర్కొంది. జీఎస్‌టీ రేట్ల తగ్గింపు ప్రభావం వచ్చే రెండు త్రైమాసికాల విక్రయాల్లో కనిపించొచ్చని అంచనా వేసింది. ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ జీఎస్‌టీ 2.0 (సెప్టెంబర్‌ 22 నుంచి అమల్లోకి)కు మారే క్రమంలో హోమ్, పర్సనల్‌కేర్‌ బ్రాండ్ల విభాగంలో తాత్కాలికంగా వృద్ధి నిదానించినట్టు ఈ నివేదిక వివరించింది. ఇక ఆహారోత్పత్తుల వినియోగంలో వృద్ధి స్థిరంగా 5.4 శాతం స్థాయిలో ఉన్నట్టు తెలిపింది. పార్మసీల ద్వారా విక్రయించే ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకాల విలువ 14.8 శాతం పెరిగినట్టు, ఇందులో ధరల పెంపు రూపంలో 9.7 శాతం సమకూరినట్టు పేర్కొంది.

India and Israel sign terms of reference to guide free trade agreements6
ఇజ్రాయెల్‌  స్టార్టప్‌లతో జత 

టెల్‌అవీవ్‌: భారత్, ఇజ్రాయెల్‌ స్టార్టప్‌లు సాంకేతిక సహకారమందించుకునేందుకు చేతులు కలపవలసి ఉన్నట్లు వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ ఇక్కడ పేర్కొన్నారు. దీంతో ప్రధానంగా సైబర్‌సెక్యూరిటీ, మెడికల్‌ పరికరాలు తదితరాలలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంలో టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ సహకారానికి ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. సొంత స్టార్టప్‌ వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఇజ్రాయెల్‌తో చేతులు కలపనున్నట్లు పేర్కొన్నారు. పోటీ ధరలలో లోతైన టెక్నాలజీ, అత్యంత నాణ్యమైన ఆవిష్కరణలను అందించే లక్ష్యంతో ఉన్నట్లు వివరించారు. భారత్‌కున్న విస్తారిత వ్యవస్థల ద్వారా ఇందుకు పలు అవకాశాలున్నట్లు తెలియజేశారు. ఇజ్రాయెల్‌ వాణిజ్య మంత్రి నిర్‌ బార్కట్‌తో ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు నిర్వహించేందుకు గోయల్‌ ఇక్కడకు వచ్చారు.

Advertisement
Advertisement
Advertisement