అంతర్జాతీయ చెల్లింపుల్లో ఫిన్‌టెక్ స్టార్టప్‌ల దూకుడు | Indian Software Fintech Startups Redefine Global Markets Digital Platforms | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ చెల్లింపుల్లో ఫిన్‌టెక్ స్టార్టప్‌ల దూకుడు

Mar 16 2026 12:31 PM | Updated on Mar 16 2026 12:47 PM

Indian Software Fintech Startups Redefine Global Markets Digital Platforms

భారతీయ సాఫ్ట్‌వేర్ సర్వీసులు, ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో గిరాకీ పెరుగుతోంది. ఈ తరుణంలో నగదు లావాదేవీలు సులభతరం చేసే ప్రక్రియ వేగవంతం అవుతోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న సంక్లిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థల స్థానంలో స్వదేశీ ఫిన్‌టెక్ స్టార్టప్‌లు అత్యంత సులభమైన, పారదర్శకమైన సాంకేతిక వేదికలను అందుబాటులోకి తెస్తున్నాయి.

పాత పద్ధతులకు స్వస్తి..

గతంలో అంతర్జాతీయ చెల్లింపులంటే స్విఫ్ట్ వంటి సాంకేతికతపై ఆధారపడాల్సి వచ్చేది. నగదు చేరడానికి అనేక మధ్యవర్తిత్వ బ్యాంకుల గుండా ప్రయాణించాల్సి రావడం వల్ల రోజుల కొద్దీ సమయం పట్టడమే కాకుండా, భారీగా చార్జీలు వసూలయ్యేవి. ఇది పెద్ద కంపెనీలకు భారంగా అనిపించకపోయినా చిన్న ఎగుమతిదారులు, ఫ్రీలాన్సర్లు, ఎస్‌ఎంఈలకు పెద్ద సవాలుగా ఉండేది.

ప్రస్తుతం ఫిన్‌టెక్ సంస్థలు సాఫ్ట్‌వేర్ ఆధారిత మౌలిక సదుపాయాలను రూపొందించడం ద్వారా ఈ అంతరాన్ని పూడుస్తున్నాయి. దీనివల్ల విదేశీ మారక ద్రవ్య నిర్వహణ, నియంత్రణ సంస్థల నిబంధనల అమలు ఆటోమేషన్ ద్వారా సులభతరం అవుతున్నాయి.

గ్లోబల్ మార్కెట్‌లో భారతీయ ముద్ర

‘అంతర్జాతీయ వాణిజ్యం ఇప్పుడు కేవలం కార్పొరేట్ దిగ్గజాలకే పరిమితం కాలేదు. ఈ విభాగంలో స్టార్టప్‌ కంపెనీలు సులభంగా సర్వీసులు అందిస్తున్నాయి’ అని రేజర్‌పే సీఓఓ రాహుల్ కొఠారి విశ్లేషించారు. సాస్ సంస్థల నుంచి ఇ-కామర్స్ బ్రాండ్ల వరకు అన్నీ అంతర్జాతీయ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంటున్నాయని చెప్పారు. రేజర్‌పే ప్రస్తుతం 130కి పైగా కరెన్సీల్లో చెల్లింపులను అనుమతిస్తోందన్నారు.

ఎయిర్‌బీఎన్‌బీ, షాపిఫై వంటి గ్లోబల్ బ్రాండ్లతో పాటు ఆకాశా ఎయిర్, హౌస్ ఆఫ్ మసాబా వంటి భారతీయ బ్రాండ్లు కూడా వీటి సేవలను వినియోగిస్తున్నాయి. క్రాస్-బోర్డర్(విదేశాలు) విభాగంలో లావాదేవీలు జరిపే వినియోగదారుల సంఖ్య రెట్టింపు అవుతోంది.

నమ్మకమే పెట్టుబడి..

విదేశీ కస్టమర్లు తమకు అలవాటైన యాపిల్ పే లేదా అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసే వెసులుబాటు కల్పించడం వల్ల వ్యాపారాలు మెరుగుపడుతున్నాయని క్యాష్‌ఫ్రీ సీఈఓ ఆకాష్ సిన్హా తెలిపారు. ‘భారతదేశంలో అంతర్జాతీయ కార్డు లావాదేవీలు విఫలమయ్యే రేటు 35-40% వరకు ఉంటుంది. కానీ యూపీఐ, రూపే వంటి స్థానిక పద్ధతులను అనుసంధానించడం ద్వారా సక్సెస్ రేటును పెంచగలిగాం’ అని చెప్పారు.

ఎగుమతిదారులకు భరోసా

ఫ్రీలాన్సర్లు, చిన్న ఎగుమతిదారుల కోసం స్కైడో సంస్థ ప్రత్యేక సేవలను అందిస్తోంది. ఎగుమతి చేసిన తర్వాత బ్యాంకుల నుంచి పొందాల్సిన ఫిరా(ఫారెన్‌ ఇన్వార్డ్‌ రెమిటెన్స్‌ అడ్వైజ్‌) వంటి పత్రాల సేకరణను ఈ సంస్థ సులభతరం చేస్తోంది. ప్రస్తుతం స్కైడో ఏడాదికి సుమారు 1 బిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలను నిర్వహిస్తోంది. వస్త్రాలు, ప్రాసెస్ చేసిన ఆహారం, గృహాలంకరణ వస్తువుల ఎగుమతిదారులు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు.

ఆర్‌బీఐ వెన్నుదన్ను

భారత రిజర్వ్ బ్యాంక్ ప్రవేశపెట్టిన పేమెంట్ అగ్రిగేటర్–క్రాస్ బోర్డర్ నిబంధనలు ఈ రంగానికి కొత్త ఊపిరి పోశాయి. ఈ ఫ్రేమ్‌వర్క్ వల్ల ఫిన్‌టెక్ సంస్థలకు స్పష్టమైన గుర్తింపు లభించడమే కాకుండా బ్యాంకులపై పూర్తిస్థాయి ఆధారపడటం తగ్గింది. భవిష్యత్తులో ఈ సంస్థలు కేవలం చెల్లింపులకే పరిమితం కాకుండా గ్లోబల్ బిజినెస్‌లకు అవసరమైన పూర్తిస్థాయి ఫైనాన్షియల్ ఆపరేటింగ్ సిస్టమ్‌గా ఎదగాలని ప్లాన్ చేస్తున్నాయి.

ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం

Advertisement
 
Advertisement
Advertisement