Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP Assembly 2024 June Session: No Clarity On Deputy Speaker Post
డిప్యూటీ స్పీకర్‌ విషయంలో ట్విస్ట్‌ తప్పదా?

అమరావతి, సాక్షి: కొత్తగా ప్రభుత్వం కొలువుదీరడంతో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు రెండ్రోజులపాటు నిర్వహించేందుకు సన్నాహకాలు పూర్తయ్యాయి. ఈ నెల 21వ తేదీన మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్‌ సమక్షంలో ప్రమాణం చేస్తారు. ఆ మరుసటి రోజు స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరగనుంది. స్పీకర్‌గా ఇప్పటికే అయ్యన్నపాత్రుడి పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేసేశారు. మరోవైపు ప్రొటెం స్పీకర్‌ ఎవరనే ఉత్కంఠ వీడింది. సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఫోన్‌ చేసిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌.. ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాలని కోరారు. దీనికి ఆయన అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతో.. రేపు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరితో ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాతే మిగిలిన 174 మంది వరుసగా ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేస్తారు.ఇదీ చదవండి: ముసుగు తొలగింది.. బూతులు.. బెదిరింపులు మరోవైపు డిప్యూటీ స్పీకర్‌ పదవి జనసేనకు వెళ్తుందనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. ఆ విషయంలో ట్విస్ట్‌ తప్పదనే ప్రచారం ఇప్పుడు తెర మీదకు వచ్చింది. కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేనకు మంత్రి పదవులు తక్కువగా ఇచ్చారు చంద్రబాబు. దీంతో.. డిప్యూటీ స్పీకర్ ఇవ్వొచ్చని తొలి నుంచి ప్రచారం నడిచింది. ఈ క్రమంలో జనసేన తరఫున లోకం మాధవి, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్ పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారని కథనాలు వెలువడ్డాయి కూడా. అయితే.. స్పీకర్‌ పదవి విషయంలో జనసేనకు మొండి చేయి దక్కవచ్చనేది లేటెస్ట్‌ టాక్‌. డిప్యూటీ స్పీకర్‌ పదవిని మరో మిత్రపక్షం బీజేపీకి వెళ్లవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు విజయవాడ వెస్ట్‌ ఎమ్మెల్యే సుజనా చౌదరి(బాబు అనుచరుడు కూడా) పేరు ఫైనల్‌ కావొచ్చని తెలుస్తోంది. ప్రధాన మిత్రపక్షం జనసేనకు తక్కువ మంత్రి పదవులు ఇచ్చినా.. పవన్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వడంతో పాటు ప్రాధాన్యం ఉన్న శాఖలు ఇవ్వడం, అదే సమయంలో బీజేపీకి కేవలం ఒకే మంత్రి పదవి ఇవ్వడంతో చంద్రబాబు ఈమేర ఆలోచన చేస్తున్నారన్నది తాజా ప్రచార సారాంశం.

33 Deaths in 24 Hours
Delhi: భానుడి ఉగ్రరూపం.. 24 గంటల్లో 33 మంది మృతి

దేశరాజధాని ఢిల్లీలో భానుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. ఎండ వేడిమికి జనం పడరాని పాట్లు పడుతున్నారు. గడచిన 24 గంటల్లో వడదెబ్బకు 33 మంది మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.ఐదు జిల్లాల్లో వడదెబ్బ కారణంగా మృతిచెందినవారి వివరాలు పోలీసులకు ఇంకా లభ్యం కాలేదు. వడదెబ్బకు బలైనవారిలో అత్యధికులు ఫుట్‌పాత్‌లు, నైట్ షెల్టర్లలో ఉంటున్నవారేనని పోలీసు అధికారులు తెలిపారు. మరోవైపు ఢిల్లీలోని పలు ఆసుపత్రులకు ప్రతిరోజూ వందకుపైగా బాధితులు వాంతులు, తల తిరగడంలాంటి సమస్యలతో వస్తున్నారు.లజ్‌పత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 24 గంటల్లో ఎనిమిది మంది మృతి చెందారు. అలాగే నెహ్రూ నగర్ ఫ్లైఓవర్ కింద రెండు మృతదేహాలు, మూల్‌చంద్‌ ఆస్పత్రి ముందు ఫుట్‌పాత్‌పై ఓ వ్యక్తి మృతదేహం, మూల్‌చంద్ మెట్రో స్టేషన్ సమీపంలో ఒకని మృతదేహం లభ్యమైంది. లజ్‌పత్ నగర్‌లో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఉత్తర జిల్లాలో ఎనిమిది మృతదేహాలు, వాయువ్య జిల్లాలో ఏడు మృతదేహాలు పోలీసులకు లభ్యమయ్యాయి. జన్‌పథ్‌ లేన్‌ ఫుట్‌పాత్‌పై ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది.పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అత్యధిక ఉష్ణోగ్రతల బారినపడటంతోనే వీరు మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మరోవైపు ఎండ వేడిమికి నెమళ్లు మృతి చెందుతున్నాయని నైరుతి జిల్లా పోలీసులు తెలిపారు. గత 24 గంటల్లో పోలీసులకు లభ్యమైన 33 మృతదేహాలు ఇంకా గుర్తిపునకు నోచుకోలేదు. ఈ మృతదేహాలను పోస్టుమార్టం కోసం వివిధ ఆస్పత్రులలో ఉంచారు.

Vijay Sethupathi Comments On Telugu Movies
తెలుగు సినిమాల్లో నటించకపోవడానికి కారణం ఇదే: విజయ్‌ సేతుపతి

సౌత్‌ ఇండియా చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌ సేతుపతి ఇంత వరకు తెలుగులో డైరెక్ట్‌గా ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఇక్కడ కూడా ఆయనకు భారీగానే ఫ్యాన్స్‌ ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్‌.. తెలుగు సినిమాల్లో నటించకపోవడానికి ఉన్న కారణాలను వెళ్లడించారు.విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'మహారాజ'. క్రైం, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా విడుదలైన ఈ చిత్రం తెలుగులో కూడా విజయవంతంగా కొనసాగుతుంది. తెలుగు సినిమాల్లో విజయ్‌ నటించకపోవడానికి ఉన్న కారణాన్ని ఇలా చెప్పాడు. 'నేను తెలుగు సినిమాల్లో భాగం అవ్వాలని రెడీగా ఉన్నాను. అందుకోసం ఇప్పటికే చాలా కథలు కూడా విన్నాను. అయితే, వాటిలో కొన్ని నాకు చాలా నచ్చాయి కూడా. కానీ. ఆ ప్రాజెక్ట్‌లో వారు నాకు ఇచ్చిన పాత్ర పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక్కడి వారు అందిస్తున్న కథలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వారు ఆఫర్‌ చేసిన పాత్రకు నేను సెట్‌ కానని భావించడం వంటి కారణాలతో తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నాను. భవిష్యత్‌లో నాకు సెట్‌ అయ్యే పాత్ర ఇక్కడ దొరుకుతుందని ఆశిస్తున్నాను.' అని విజయ్‌ సేతుపతి అన్నారు.నిథిలన్‌- విజయ్‌ సేతుపతి కాంబినేషన్‌లో వచ్చిన మహారాజ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఆధరిస్తున్నారు. అనురాగ్‌ కశ్యప్‌, అభిరామి,భారతీరాజా, మమతా మోహన్‌దాస్‌ వంటి వారు కీలక ఇందులో పాత్రలు పోషించారు. విజయ్‌ సేతుపతి కెరియర్‌లో 50వ చిత్రంగా జూన్‌ 14న మహారాజ విడుదలైంది. ఇప్పటికే సుమారు రూ.40 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

Kane Williamson Quits New Zealand Captaincy Declines Central Contract After T20 WC
విలియమ్సన్‌ అనూహ్య ప్రకటన: కెప్టెన్సీకి గుడ్‌ బై.. ఇకపై..

న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తప్పుకొన్నాడు. ఏడాది కాలానికి(2024-25)గానూ తాను బ్లాక్‌కాప్స్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలిపాడు.అదే విధంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతున్నట్లు విలియమ్సన్‌ తెలిపాడు. న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ఈ విషయాన్ని ధ్రువీకరించింది.గౌరవిస్తున్నాంవిలియమ్సన్‌ నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని.. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తప్పుకొన్నా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌లకు మాత్రం అందుబాటులోనే ఉంటానని అతడు చెప్పినట్లు తెలిపింది. తమ అత్యుత్తమ బ్యాటర్‌కు ఈ వెసలుబాటు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.కాగా టీ20 ప్రపంచకప్‌-2024లో న్యూజిలాండ్‌ చేదు అనుభవం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. గ్రూప్‌ దశలో నాలుగింట రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచిన విలియమ్సన్‌ బృందం.. సూపర్‌-8కు కూడా చేరకుండానే నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో కెప్టెన్‌ విలియమ్సన్‌ టీ20 కెరీర్‌పై నీలినీడలు కమ్ముకోగా.. ఇప్పట్లో రిటైర్‌ కాబోనని మాత్రం చెప్పాడు. అయితే, అనూహ్యంగా సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు.అందుకే ఈ నిర్ణయం విదేశీ లీగ్‌(టీ20)లలో అవకాశాలు అందిపుచ్చుకోవడం, కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేన్‌ విలియమ్సన్‌ కివీస్‌ బోర్డుకు వెల్లడించాడు. సుదీర్ఘకాలం పాటు న్యూజిలాండ్‌కు సేవలు అందించే క్రమంలో.. తన కెరీర్‌ను పొడిగించుకునేందుకే ఏడాది కాలం పాటు దూరంగా ఉండనున్నట్లు తెలిపాడు.కాగా 2024-2025 ఏడాదికి గానూ కివీస్‌కు ద్వైపాక్షిక సిరీస్‌లు తక్కువే ఉన్నాయి. అయితే, వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌ చేరాలంటే మాత్రం కీలక మ్యాచ్‌లలో గెలుపొందాల్సిన అవసరం ఉంది. సరికొత్త ఉత్సాహంతో తిరిగి వస్తాడుఈ నేపథ్యంలో కేన్‌ విలియమ్సన్‌ టెస్టులకు మాత్రం అందుబాటులో ఉండేందుకు సమ్మతించడం గమనార్హం. ఈ ఏడాది నవంబరులో సొంతగడ్డపై కివీస్‌ జట్టు ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. ఇక కేన్‌ విలియమ్సన్‌ నిర్ణయం గురించి న్యూజిలాండ్‌ బోర్డు సీఈవో మాట్లాడుతూ.. దిగ్గజ ఆటగాడి అభ్యర్థన పట్ల తాము సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. తమ అత్యుత్తమ బ్యాటర్‌ త్వరలోనే తిరిగి సరికొత్త ఉత్సాహంతో జట్టుతో చేరతాడని పేర్కొన్నారు.చదవండి: శ్రేయస్‌ అయ్యర్‌ రీఎంట్రీ.. జింబాబ్వే టీ20 సిరీస్‌కు ఐపీఎల్‌ హీరోలు!

Increased interest in acting among the city masses
విశ్వ..నట...నగరంగా హైదరాబాద్‌

-ప్రొఫెషన్‌తో పనిలేదు.. యాక్టింగ్‌యే ప్యాషన్‌-సిటిజనుల్లో పెరిగిన నటనాభిరుచి-ఓటీటీలు, యూట్యూబ్‌ల రాకతో ఓవర్‌టైమ్‌ యాక్టింగ్‌కు సై..ఒకే ఒక్క ఛాన్స్‌... ఈ డైలాగ్‌ ఎక్కడో విన్నట్లుందే..అనుకుంటున్నారా...! అవును రవితేజ హీరోగా నటించిన ఖడ్గం సినిమాలోనిది.. అయితే ఇది ఈ ఒక్క సినిమాకో.. హీరోకో పరిమితం కాదు...దాదాపు ఇండస్ట్రీలో అవకాశం కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరి నోటి వెంట వచ్చేది ఈ డైలాగే..అంటే అతిశయోక్తి కాదేమో..నాటి ఎన్‌టిఆర్‌ దగ్గర నుంచి నేటి విశ్వక్‌సేన్‌ వరకూ అలా వచి్చన వారే.. ఇప్పుడు ఇదంతా మాకెందుకు చెప్తున్నారు..? ఇవన్నీ తెలిసిన విషయాలే అనుకుంటున్నారా..? అవును..! అందులో నిజం లేకపోలేదు..కాకపోతే గతంతో పోలిస్తే నటనవైపు వెళ్లాలని అనుకునే వారి సంఖ్య భారీగా పెరిగిందనే విషయాన్ని చెప్పడానికి వచ్చెనదే ఈ తిప్పలంతా..నగరవాసుల్లో నటనవైపు పెరిగిన ఆసక్తి...గతంతో పోలిస్తే పెరిగిన అవకాశాలు.. వివిధ వేదికలు గుర్తించి తెలుసుకునే ప్రయత్నమే ఇది...సాక్షి హైదరాబాద్‌: ఆయనో ప్రముఖ వైద్యుడు.. నగరంలోని ఓ ప్రభుత్వాస్పత్రిలో కీలక పదవిలో కొనసాగుతున్నారు. డయాబెటిక్‌ కన్సల్టేషన్‌ కోసం ఆయన్ని కలిసేందుకు సికింద్రాబాద్‌కు చెందిన గిరి ఆ ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్‌ను చూడగానే ఎక్కడో చూసినట్లు.. బాగా తెలిసినట్లు చాలా యూనీక్‌గా అనిపించింది. కాసేపు తన బుర్ర బద్దలకొట్టుకుని ‘‘ఫలానా వెబ్‌సిరీస్‌లో మీరు నటించారు కదా డాక్టర్‌?’’ అని ఠక్కున అనేశాడు.. డాక్టర్‌ కూడా చాలా ఫ్రెండ్లీగా మొహమాటాన్ని పక్కనబెట్టి అడిగిన ప్రశ్నకు అవునంటూ చిరునవ్వుతో సమాధానమిచ్చారు. గిరికి ఎదురైన అనుభవమే మనలో చాలామందికీ కలిగే ఉండొచ్చు.. ఆస్పత్రులు, బొటిక్‌లు, పార్లర్లు, కాలేజీలు.. ఎక్కడ పడితే అక్కడ అనేక మంది నగరవాసులు డాక్టర్‌ తరహాలోనే తమ ప్రతిభను వివిధ మాధ్యమాల్లో చాటుతున్నారు..వెల్లువెత్తుతున్న అవకాశాలు.. టీవీలు, షార్ట్‌ ఫిలింస్‌...వరకూ దశలవారీగా యాక్టింగ్‌ హాబీ విస్తృతమవుతూ ఉంది. గత ఐదేళ్ల కాలంలో ఆన్‌లైన్‌ వినియోగంతో పాటుగా ఈ హాబీ కూడా ఒక్కసారిగా ఊపందుకుంది. ముఖ్యంగా ఓటీటీ వేదికలు విస్తృతమవడంతో నటీనటులకు అవకాశాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. తక్కువ బడ్జెట్‌లో సినిమాలు, సిరీస్‌ రూపొందించే నిర్మాతలు, టెక్నీషియన్లుతో పాటు నటీనటులను కూడా తమ బడ్జెట్‌కు అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.. పాత్రోచితంగా కనిపించే వ్యక్తులకు కాస్తంత శిక్షణ అందిస్తే చాలు పని జరిగిపోతున్న పరిస్థితుల్లో వయసుతో సంబంధం లేకుండా.. అనేకమందికి అవకాశాలు గుమ్మం ముందుకు వచ్చి మరీ తలుపు తడుతున్నాయి. సొంత వేదికలు.. ఇన్‌స్టా, స్నాప్‌చాట్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ రీల్స్, టిక్‌టాక్‌ వంటి మాధ్యమాల రాకతో సరదాగా మొదలుపెట్టి రీల్స్, షార్ట్‌ వీడియోలు వగైరా వంటి సోషల్‌ మీడియా వేదికల్లో తమ ప్రతిభను కనబరుస్తున్నారు. అంతేకాదు సినీ తారలను మించిన ఫాలోయింగ్‌ను, గుర్తింపును, ఫాలోవర్స్‌ను పోగేసుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆయా ప్రాంతాల్లో సెలబ్రిటీలుగా.. చిన్నపాటి స్టార్‌లుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అంతేకాదు ఆ వేదికల ద్వారానే సినీ అవకాశాలనూ అందిపుచ్చుకుంటున్నారు. యూట్యూబ్‌ ద్వారా పాపులరైన గంగవ్వే దీనికో ఉదాహరణ... ఏ రంగంలో, ఏ వేదిక, ఏ మాధ్యమం ద్వారా సక్సెస్‌ సాధించినా, తెరపై రాణించడం, తద్వారా వచ్చే పాపులారిటీకి సాటిరావు అనేది వాస్తవం.స్టోరీ టెల్లింగ్, ఫ్యాషన్‌ కాదేదీ నటనకు అనర్హం.. నగరానికి చెందిన ఫ్యాషన్‌ డిజైనర్‌ రామ్‌... గత కొంత కాలంగా సెలబ్రిటీలకు డిజైన్లు అందించడంలో పేరొందారు. లుక్స్‌లో టాలీవుడ్‌ హీరోలకు తీసిపోని రామ్‌... లాక్‌ డౌన్‌ టైమ్‌లో దొరికిన ఖాళీ సమయాన్ని నటనాభిరుచితో భర్తీ చేసుకున్నారు. ఆయన పచ్చీస్‌ పేరుతో రూపొందించిన ఓ సినిమాలో హీరోగా నటించారు. ఆ సినిమా ఆ మధ్య ఓటీటీలో విడుదలైంది.. అదే విధంగా నగరంలో స్టోరీ టెల్లింగ్‌కు కేరాఫ్‌గా పేరొందిన దీపా కిరణ్‌ కూడా ఇటీవల యాంగర్‌ టేల్స్‌ అనే ఓటీటీ చిత్రంలో నటించారు. అందులోని నాలుగు పొట్టి కథల్లో ఒకటైన యాన్‌ ఆఫ్టర్‌ నూన్‌ న్యాప్‌లో ఆమె కనిపిస్తారు. ఈ ఎక్స్‌పీరియన్స్‌ తనకు కొత్త అనుభూతిని పంచిందని ఆమె అంటున్నారు. నటనే హాబీగా... కేరెక్టర్‌కు ఓకె...కెరీర్‌గా నాట్‌ ఓకె...అంటున్నారు ఈ హాబీ యాక్టర్లు. నటనావకాశాలు వస్తున్నా వరుస పెట్టి సినిమాలు చేసేయాలనే ఆత్రం చూపడం లేదు. తమ కెరీర్‌కు ప్రాధాన్యత ఇస్తూనే అడపాదడపా వచ్చిన ఛాన్సుల్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సినిమా అనేది తమకు అభిరుచి మాత్రమే నని అనేక మంది స్పష్టం చేస్తున్నారు. ‘‘నాట్యం అనేది నా అభిరుచికి, నా ఆలోచనలకు దగ్గరగా ఉన్న సినిమా కాబట్టి నటించాను. అంతే తప్ప సినిమాల్ని కెరీర్‌గా తీసుకునే ఆలోచన లేదు’’ అంటున్నారు సంధ్యారాజు. ప్రముఖ పారిశ్రామిక వేత్త సత్యం రామలింగ రాజు కుటుంబ సభ్యురాలైన సంప్రదాయ నృత్య కారిణి... ఆ మధ్య నాట్యం అనే సినిమాలో కథానాయికగా నటించారు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ పురస్కారానికి కూడా నోచుకుంది. అయినప్పటికీ ఆమె మరో చిత్రంలో నటించలేదు. అదే విధంగా నగరానికి చెందిన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకెళ్ల రాఘవేంద్ర కూడా ఒకటి రెండు చిత్రాల్లో కనిపించారు. కేవలం టాలీవుడ్‌ మాత్రమే కాదు.. కోలీవుడ్, మాలీవుడ్‌ చిత్రాల నిర్మాణానికీ కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన భాగ్యనగరంలో ఓటీటీలు, యూ ట్యూబ్‌ చిత్రాల వెల్లువతో నటించే సరదా ఉన్న వారికి అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయి. అయితే నటనను జస్ట్‌ ఫర్‌ ఛేంజ్‌ అన్నట్టు çహాబీగా ఎంచుకోవడం వల్ల పెద్ద నష్టం లేకపోయినా, సరైన శిక్షణా నేపధ్యం లేకుండానే పూర్తి స్థాయి కెరీర్‌గా మార్చుకోవాలనే తొందరపాటు మాత్రం సరైంది కాదని అనుభవజ్ఞులు సూచిస్తున్నారు. ప్రేక్షకాభిరుచిలో మార్పు...నటనలో పేరున్నవారు, బాగా తెలిసిన ముఖాలను మాత్రమే కాకుండా కొత్త వారిని కూడా ఆదరించే దిశగా ప్రేక్షకుల అభిరుచుల్లో స్పష్టమైన మార్పు వచి్చంది. దీంతో నిర్మాతలు కొత్త నటీనటులతో ప్రయోగాలు చేయడానికి గతంలోలా భయపడడం లేదు. అంతేకాకుండా ఏ రంగంలో ఉన్నవారు ఆ రంగానికి సంబంధించిన పాత్రల్లో కాస్త సులభంగా మమేకమయ్యే వీలుంటుంది. కాబట్టి సినిమాలో వైద్యుడి పాత్ర ఉంటే వైద్యుడిని, లాయర్‌ పాత్రకు లాయర్‌ని ఎంచుకుంటూన్నారు. దీంతో రంగాలేమైనా తెరంగేట్రం సాధారణ విషయంగా మారిపోయింది.

Mumbai is the most expensive city in the country for expats
ముంబై.. చాలా కాస్ట్లీ గురూ!

సాక్షి, అమరావతి: ప్రముఖ హెచ్‌ఆర్‌ కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్‌– ‘2024 కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ సర్వే ప్రకారం దేశంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై అగ్రస్థానంలో నిలిచింది.దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబైలో జీవించే ప్రవాసుల జీవన వ్యయం గణనీయంగా పెరిగినట్టు ఈ సంస్థ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 11 స్థానాలు ఎగబాకి 136వ స్థానానికి చేరుకుంది. ఢిల్లీ 164, చెన్నై ఐదు స్థానాలు దిగజారి 189వ స్థానానికి, అలాగే బెంగళూరు ఆరు స్థానాలు క్షీణించి 195వ స్థానానికి చేరుకున్నాయి. హైదరాబాద్‌ 202వ స్థానంలో స్థిరంగా కొనసాగుతోంది.ఉపాధి, ఉద్యో­గ అవకాశాల కోసం వేరొక నగరం, దేశానికి వలస వెళ్లి జీవించడంలో జీవన వ్యయం కీలక పాత్ర పోషిస్తున్నది. స్థానిక ఆర్థిక పరిస్థితులు కొన్ని నగరాలను ప్రవాసులకు మరింత ఖరీదైనవిగా చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ వరుసలోనే పూణే ఎనిమిది స్థానాలు ఎగబాకి 205వ, కోల్‌కతా నాలుగు స్థానాలు ఎగబాకి 207వ స్థానానికి చేరుకున్నాయి. ఇక్కడ ఈ ఖర్చులు ఎక్కువ ఆసియాలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై 21వ స్థానం, ఢిల్లీ 30వ స్థానంలో ఉన్నాయి. ఢిల్లీలో ఈ ఏడాది గృహాల అద్దెలు 12–15 శాతం పెరిగాయి. ముంబైలో 6–8 శాతం, బెంగళూరు, పూణే, హైదరాబాద్, చెన్నైలలో 2–6 శాతం పెరుగుదల నమోదైనట్లు నివేదిక చెబుతున్నది. ఇక ముంబైలో రవాణా ఖర్చులు భారీగా ఉంటున్నాయి. ఆ తర్వాత బెంగళూరు ఉంది.పాల ఉత్పత్తులు, రొట్టెలు, పానీయాలు, నూనెలు, పండ్లు, కూరగాయలు వంటి రోజువారీ నిత్యావసరాల కోసం కోల్‌కతాలో పొదుపుగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కేవలం ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు ఢిల్లీలో అత్యంత తక్కువ ధరలకు లభిస్తున్నాయి. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల ఖర్చుల్లో మాత్రం ముంబై అందనంత ఎత్తులో ఉంది. దీని వెనుకే చెన్నై ఉంది. ఎనర్జీ, యుటిలిటీ ఖర్చుల్లో ముంబై, పూణేలు భయపెడుతున్నట్లు నివేదిక పేర్కొంది. హాంకాంగ్‌ మరోసారి ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయాన్ని పరిశీలిస్తే మొదటి ఐదు నగరాలు ర్యాంకింగ్‌లో ఎటువంటి మార్పు కనిపించలేదు. హాంకాంగ్‌ (చైనా) అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, సింగపూర్, జ్యూరిచ్, జెనీవా, బాసెల్, బెర్న్‌ (స్విట్జర్లాండ్‌), న్యూయార్క్‌ సిటీ (యూఎస్‌), లండన్‌ (యూకే), నసావు (బహామాస్‌), లాస్‌ ఏంజిల్స్‌ (యూఎస్‌) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మెర్సర్‌ సర్వే ప్రపంచ వ్యాప్తంగా 227 నగరాల్లో జీవన వ్యయాన్ని అంచనా వేసింది. గృహనిర్మాణం, రవాణా, ఆహారం, దుస్తులు, గృహోపకరణాలు, వినోదం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది. 2024లో అధిక జీవన వ్యయాన్ని ఖరీదైన గృహ వినియోగం, అధిక రవాణా ఖర్చులు, వస్తువులు, సేవల అధిక ధర, ద్రవ్యోల్బణం, మారకపు రేటు హెచ్చుతగ్గులు, యుటిలిటీలు, స్థానిక పన్నులు, విద్య తీవ్రంగా ప్రభావితం చేసినట్టు వివరించింది. అధిక జీవన వ్యయాలకు ప్రసిద్ధి చెందిన న్యూయార్క్‌ నగరం ఈ జాబితాలో ఏడో స్థానాన్ని పొందింది. ఆసియా–పసిఫిక్‌ ప్రాంతాల్లోని నగరాలు టాప్‌–10లో ఎక్కువ సంఖ్యలో ఉండడం విశేషం. ఇందులో టోక్యో 5వ, బీజింగ్‌ 9వ స్థానంలో ఉన్నాయి.

AP Ex Minister RK Roja Fire On TDP Over Rushikonda
అదేనా మా తప్పు?: టీడీపీకి ఆర్కే రోజా సూటి ప్రశ్న

విశాఖపట్నం, సాక్షి: రుషికొండలో గత జగన్‌ ప్రభుత్వం నిర్మించిన కట్టడాలు.. అక్రమ కట్టడాలని ప్రచారం చేస్తు‍న్న టీడీపీకి గట్టి ఎదురు దెబ్బలే తగులుతోంది. చంద్రబాబు మాదిరి జగన్‌ తాత్కాలిక భవనాలు నిర్మించి ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేయలేదని.. ప్రజా ధనంతో పటిష్టమైన ప్రభుత్వ భవనాలే నిర్మించారని ఇటు వైఎస్సార్‌సీపీ, అటు నెటిజన్లు కౌంటర్లు ఇస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో ఏపీ పర్యాటక శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి ఈ అంశంపై స్పందించారు. రుషికొండలో నిర్మించిన కట్టడాలు అత్యద్భుతమని వర్ణించిన మాజీ మంత్రి రోజా.. పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా? అని టీడీపీ శ్రేణుల్ని గట్టిగా ప్రశ్ని‍ంచారు. ‘‘విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్పా?. వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టినవాళ్లకు అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా?’’ అంటూ సెటైర్లు వేశారు. ఇదీ చదవండి: సంక్షేమ పథకాలకు పేర్లు మార్చిన చంద్రబాబు ప్రభుత్వం.. 2021లోనే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలిచ్చి రుషికొండ నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవం కాదా..?. 61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు చేపట్టం...ఇందులో అక్రమం ఎక్కడుంది..?. విశాఖ ఖ్యాతిని ఇనుమడించేలా, రాష్ట్రానికే తలమానికంగా భవనాలు నిర్మించడం కూడా నేరమేనా..?. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ఫైవ్ స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పేనా...?. ఏడు బ్లాకుల్లో ఏమేమీ నిర్మాణాలు, వసతులు ఉంటాయో గతంలోనే టెండర్ డాక్యుమెంట్లలో పొందుపర్చిన మాట వాస్తవం కాదా..... హైకోర్టుకు ఈ నిర్మాణాలపై ప్రతి దశలోనూ అధికారులు నివేదిక సమర్పించిన వాస్తవం దాచేస్తే దాగుతుందా..?. ఇన్నాళ్లూ ఇవి జగనన్న సొంత భవనాలని ప్రచారం చేసిన వాళ్లు ఇప్పటికైనా అవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా..? లేదా..?. హైదరాబాద్ లో సొంతిల్లు కట్టుకున్నారని, హయత్ హోటల్ లో లక్షలకు లక్షలు ప్రజల డబ్బులను అద్దెలు చెల్లించిన వాళ్లా...ఈరోజు విమర్శలు చేసేది..?. .. లేక్ వ్యూ గెస్ట్‌ హౌస్, పాత సచివాలయం ఎల్ బ్లాక్, హెచ్ బ్లాక్ లలో 40 కోట్లతో హంగులు అద్ది రాత్రికి రాత్రి వాటిని వదిలేసి విజయవాడ వచ్చేసిన వాళ్లా ఈరోజు విమర్శలు చేసేది..?. జగనన్నపైన, మాపైన ఎంత వ్యక్తిత్వ హననం చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటంలో వెన్ను చూపేది లేదు...వెనకడుగు వేసేది లేదు.. జై జగన్ అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

Horoscope Today: Rasi Phalalu On 19-06-2024 In Telugu
Daily Horoscope: ఈ రాశివారు నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి: శు.ద్వాదశి ఉ.5.35 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: విశాఖ సా.4.23 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: రా.8.36 నుండి 10.17 వరకు దుర్ముహూర్తం: ఉ.11.36 నుండి 12.28 వరకు అమృతఘడియలు: ఉ.6.52 నుండి 8.43 వరకు. మేషం: నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవర్తమానాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలం.వృషభం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. భూవివాదాల పరిష్కారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.మిథునం: రుణాలు చేయాల్సివస్తుంది. బంధువులతో అకారణ వైరం. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు తప్పకపోవచ్చు.కర్కాటకం: ప్రయాణాలు చివరిలో వాయిదా. శ్రమాధిక్యం. మిత్రులతో విభేదాలు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు.సింహం: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వాహనయోగం. చర్చల్లో పురోగతి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం. వస్తులాభాలు.కన్య: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగక డీలాపడతారు.తుల: పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. వస్తు, వస్త్రలాభాలు. ఆర్థిక ప్రగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.వృశ్చికం: పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.ధనుస్సు: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తిలాభం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.మకరం: కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తి లాభసూచనలు. ప్రముఖుల పరిచయం. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు సైతం వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత రాణింపు.కుంభం: శ్రమ పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి.మీనం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.

Sakshi Editorial On West Bengal Train Accident
కలలు మాని... కళ్ళు తెరవాలి!

ఏడాది గడిచిందో లేదో... సరిగ్గా అదే రకమైన దుర్ఘటన. అవే రకమైన దృశ్యాలు. మళ్ళీ అవే అనునయ విచారాలు, నష్టపరిహారాలు, దర్యాప్తుకు ఆదేశాలు, భద్రతే తమకు ముఖ్యమంటూ సర్కారీ ప్రకటనలు. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లాలో సీల్డా వెళుతూ ఆగివున్న కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి వచ్చిన ఓ గూడ్స్‌ రైలు గుద్దుకున్న సోమవారం నాటి ప్రమాద దృశ్యాలు, తదనంతర పరిణామాలు చూస్తే సరిగ్గా అలాగే అనిపిస్తుంది. నిరుడు జూన్‌ 2న ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్, మరో రెండు రైళ్ళు ఢీ కొట్టుకోవడంతో 290 మందికి పైగా మరణించగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డ దారుణ ఘటన ఇప్పటికీ మదిలో మెదులుతూనే ఉంది. ఇంతలోనే ఇప్పుడు ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్‌లో జనం బక్రీద్‌ హడావిడిలో ఉండగా ఉదయం తొమ్మిది గంటల వేళ జరిగిన తాజా రైలు ప్రమాదం పాలకులు పాఠాలు నేర్చుకోలేదని తేల్చింది. గూడ్స్‌ పైలట్, కో–పైలట్‌ సహా పది మంది ప్రాణాలను బలి తీసుకొని, 40కి పైచిలుకు మందిని గాయాలపాలు చేసిన ఈ దుర్ఘటన మన రైల్వే వ్యవస్థలో లోటుపాట్లను మరోసారి బయటపెట్టింది. ప్రమాదం జరగడానికి మూడు గంటల ముందు ఉదయం 5.50 గంటల నుంచే రెండు స్టేషన్ల మధ్య ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ చెడిపోయిందని వార్తలు వచ్చాయి. సిగ్నల్‌ను పట్టించుకోకుండా గూడ్స్‌ ట్రైన్‌ ముందుకు పోవడం వల్లే ప్రమాదం సంభవించిందని రైల్వే బోర్డ్‌ ఛైర్‌పర్సన్‌ జయావర్మ సిన్హా ఉవాచ. కానీ, ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ పనిచేయనప్పుడు రెడ్‌ సిగ్నళ్ళను పట్టించుకోకుండా ముందుకు సాగాల్సిందిగా సర్వసాధారణంగా ఇచ్చే టీఏ 912 మెమోను స్టేషన్‌ మాస్టర్‌ ఇవ్వడం వల్లే రైళ్ళు రెండూ ఒకే లైనులో ముందుకు సాగాయట. విభిన్న కథనాలు, వాదనలు, తప్పొప్పులు ఏమైనా అమాయకుల ప్రాణాలు పోవడం విచారకరం. లెక్క తీస్తే 2018–19 నుంచి 2022–23 మధ్య అయిదేళ్ళలో తీవ్ర పర్యవసానాలున్న రైలు ప్రమాదాలు సగటున ఏటా 44 జరిగాయి. దాదాపు 470కి పైగా జరిగిన 2000–01 నాటితో పోలిస్తే ఈ సంఖ్య తగ్గినట్టే కానీ, పెరిగిన సాంకేతికత, పాలకుల ప్రగల్భాలతో పోలిస్తే ఇప్పటికీ ఎక్కువే. ముఖ్యంగా రైళ్ళు ఢీ కొంటున్న ఘటనలు ప్రతి 3.6 నెలలకు ఒకటి జరుగుతున్నాయట. దేశంలోని మొత్తం 18 రైల్వే జోన్లలో దక్షిణ రైల్వే లాంటి ఆరింటిలో మినహా, మిగతా అన్నిటా నిరుడు ఏదో ఒక ప్రమాదం సంభవించింది.రైలు ప్రమాదాలను అరికట్టాలనీ, ప్రయాణాల్లో ప్రయాణికుల భద్రతకు ప్రాముఖ్యం ఇవ్వాలనీ చాలాకాలంగా చర్చ జరుగుతోంది. రైళ్ళు ఢీకొనే ప్రమాదం లేకుండా చూసేందుకు ప్రయోగాలూ సాగాయి. ప్రమాదాలను నివారించేందుకు ఆటోమేటిక్‌ ట్రైన్‌ ప్రొటెక్షన్‌ సిస్టమ్‌ ‘కవచ్‌’ను మూడు భారతీయ సంస్థలు దేశీయంగా రూపొందించాయి. ఈ ‘కవచ్‌’ భద్రతా వ్యవస్థ రైళ్ళ వేగాన్ని నియంత్రించడమే కాక, ప్రమాద సూచికలు డ్రైవర్ల దృష్టిని దాటిపోకుండా తోడ్పడుతుంది. మసక మసక చీకటిలోనూ భద్రతను అందిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలున్న ‘కవచ్‌’ను ప్రవేశపెట్టామని పాలకులు చాలా కాలంగా గొప్పలు చెబుతున్నారు. కానీ, భారత రైల్వే వ్యవస్థ దాదాపు లక్ష కిలోమీటర్ల పైచిలుకు పొడవైనది కాగా, దశలవారీగా 1500 కి.మీల మేర మాత్రమే ‘కవచ్‌’ ఇప్పటికి అందుబాటులోకి వచ్చింది. ఈ నత్తనడక ప్రయాణికుల భద్రతపై ప్రభుత్వ పట్టింపులేనితనానికి నిదర్శనం. అసలు ఒకప్పటిలా రైల్వేలకూ, రైల్వే శాఖకూ ప్రాధాన్యం ఉందా అంటే అనుమానమే. రైలు సేవల్లో సామాన్యుల హితం కన్నా హంగులు, ఆర్భాటాలు, ఎగువ తరగతి సౌకర్యాలకే పెద్ద పీట వేస్తున్నారు. సౌకర్యాల పేరిట అధిక ఛార్జీలు, వందే భారత్‌ ౖరైళ్ళు, సుందరీకరణ లాంటివాటి మీదే సర్కారు దృష్టి తప్ప, సాధారణ రైళ్ళ సంగతి పట్టించుకోవట్లేదు. సరిపడా కోచ్‌లు, బెర్తులు కరవన్న మాట అటుంచి, కనీసం కూర్చొనే జాగా కూడా లేక శౌచాలయాల వద్దే ఒకరిపై ఒకరుపడుతున్న జనంతో క్రిక్కిరిసిన రైళ్ళు మన దేశంలో నిత్య దృశ్యాలు. వీటన్నిటి మధ్య భద్రత మాట సరేసరి! గతంలో సాధారణ బడ్జెట్‌కు దీటుగా రైల్వేకు ప్రత్యేక బడ్జెట్‌ ఉండేది. 1924 నుంచి ఉన్న ఆ రెండు వేర్వేరు బడ్జెట్ల విధానానికి 2017లో బీజేపీ సర్కార్‌ స్వస్తి పలికింది. ఫలితంగా ఆ తర్వాత రైల్వే శాఖకు వెలుగు తగ్గింది. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదికి, అందులోనూ బీజేపీ పాలిత రాష్ట్రాలకే రైల్వే సౌకర్యాల విస్తరణలో సింహభాగం వడ్డిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఒకప్పటి రైల్వే మంత్రి, బెంగాల్‌ ప్రస్తుత సీఎం మమతా బెనర్జీ మాటల్లో చెప్పాలంటే, రైల్వేస్‌ ఇప్పుడో అనాథ. ఇక, నిరుటి పాలనలో లాగే... కొత్త మోదీ సర్కారులోనూ అశ్వినీ వైష్ణవ్‌కే రైల్వే శాఖ అప్పగించారు. పేరుకు ఆయన రైల్వే మంత్రే కానీ, కీలకమైన ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ శాఖ, సమాచార ప్రసార శాఖ సైతం ఆయన వద్దే ఉన్నాయి. దేనికదే అత్యంత ముఖ్యమైన మూడు శాఖలను వైష్ణవ్‌ ఒక్కరే నిర్వహించడం భారమే. ఇవన్నీ కాక సోమవారం రైలు ప్రమాదం జరిగిన కొద్ది గంటలకే... ఆయనను రానున్న అసెంబ్లీ ఎన్నికలకై మహారాష్ట్రలో పార్టీ ఎన్నికల కో–ఇన్‌ఛార్జ్‌గా కూడా బీజేపీ నియమించడం మరీ విడ్డూరం. పాలనా ప్రాధాన్యాల పట్ల అలసత్వానికి ఇది మచ్చుతునక. దేశంలో మునుపెన్నడూ జరగనంత ప్రమాదమైన బాలాసోర్‌ విషాదం తర్వాతా మనం మారలేదు. సీబీఐ దర్యాప్తు చేసి, ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసినా ఆ కేసు ఇంకా కోర్టులోనే మూలుగుతోంది. అందుకే, ఇకనైనా సిగ్నలింగ్‌ వ్యవస్థల ఆధునికీకరణ, రైల్వే ప్రయాణ భద్రతను పెంచడం ప్రాధమ్యం కావాలి. బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ల గురించి రంగుల కలలు చూపిస్తున్న మన పాలకులు తాజా ఘటనతోనైనా క్షేత్రస్థాయి వాస్తవాలపై కళ్ళుతెరవాలి. ఉట్టికెగరలేకున్నా, స్వర్గానికి నిచ్చెన వేస్తామంటే హాస్యాస్పదం.

YS Jagan Mohan Reddy Post In Social media X On AP Elections Results
బ్యాలెట్టే బెటర్‌: వైఎస్‌ జగన్‌

సాక్షి,అమరావతి: ఏపీ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలపై ఒకవైపు.. ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్, అన్‌లాకింగ్‌ తదితర అంశాలపై మరో­వైపు తీవ్రస్థాయిలో చర్చోపచర్చలు నడుస్తు­న్నాయి. ఫలితాలపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు మాత్రమే కాదు.. ప్రజలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తు­న్నారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక మాధ్యమం(ఎక్స్‌) ఖాతాలో ఓ కీలక సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ‘న్యాయం జరగడం ఒక్కటే ముఖ్యం కాదు. జరిగినట్లు కనిపించాలి కూడా. ప్రజాస్వామ్యం గెలవడంతోపాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి కూడా. ప్రపంచం మొత్తం మీద అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో బ్యాలెట్‌ ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈవీఎంలు కాదు. దేశంలోనూ బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి. ఈవీఎంలను పక్కన పెట్టాలి. ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం కూడా ఇదే దిశగా ముందుకు కదలాలి. అప్పుడే ప్రజాస్వామ్యం నిస్సందేహంగా మనగలదు’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement