Anakapalle
-
రిజర్వాయర్లలో పూర్తిస్థాయి నీటి నిల్వలు
మహారాణిపేట (విశాఖపట్నం): ఉమ్మడి విశాఖ జిల్లాలోని రిజర్వాయర్లలో పూర్తి స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయని జలవనరుల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) శంబంగి సుగుణాకరరావు తెలిపారు. విశాఖ జలవనరుల శాఖ ఎస్ఈగా గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్ఈగా పనిచేసిన సూర్యకుమార్ ఆగస్టు 31న ఉద్యోగ విరమణ చేశారు. ఎంతో కీలకమైన ఎస్ఈ పోస్టు భర్తీలో జాప్యం జరిగింది. అప్పటి నుంచి ఈ పోస్టులో ఎవరినీ నియమించకపోగా.. ఇన్చార్జి కూడా ఇవ్వలేదు. ఎట్టకేలకు తోటపల్లి రిజర్వాయర్ (విజయనగరం) ఎస్ఈగా పని చేస్తున్న శంబంగి సుగుణాకరరావును బదిలీపై ఇక్కడకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి విశాఖలోని రిజర్వాయర్లలో నీటిమట్టం సామర్థ్యానికి మించి ఉంటే గేట్లు ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్‌కు నీటి ఇబ్బందులు లేవని, రూ.15 కోట్లతో 295 పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించినట్లు వెల్లడించారు. సాగుకు అవసరమ యిన విధంగా నీరు అందిస్తామన్నారు. -
డిబ్రూగడ్–హుబ్బళ్లి మధ్య వన్‌వే స్పెషల్
తాటిచెట్లపాలెం (విశాఖ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా డిబ్రూగడ్–హుబ్బళ్లి మధ్య స్పెషల్ రైలు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. డిబ్రూగడ్–హుబ్బళ్లి(05926) వన్ వే స్పెషల్ ఈ నెల 5వ తేదీ (శనివారం) మధ్యాహ్నం 1.30 గంటలకు బయల్దేరి మూడో రోజు సోమవారం మధ్యాహ్నం 3.08 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 3.10 గంటలకు బయల్దేరి నాల్గవ రోజు మంగళవారం ఉదయం 9 గంటలకు హుబ్బళ్లి చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు 10–స్లీపర్ క్లాస్, 2–జనరల్ సెకండ్ క్లాస్, 2–సెకండ్ క్లాస్ కమ్ లగేజీ /దివ్యాంగ కోచ్‌లతో నడుస్తుంది. -
రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు గునుపూడి విద్యార్థి
రగ్బీ పోటీలకు ఎంపికై న లగుడు అరవింద్‌తో వ్యాయామ ఉపాధ్యాయుడు నాయుడు నాతవరం: గునిపూడి హైస్కూల్ పదో తరగతి విద్యార్థి లగుడు అరవింద్ జిల్లా స్థాయి రగ్బి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారడు. ఇటీవల నిర్వహించిన స్కూల్ గేమ్స్‌లో అరవింద్ సత్తా చాటాడు. ఈ సందర్భంగా హైస్కూల్ హెచ్ఎం టి.శివజ్యోతి గురువారం మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనే అరవింద్‌కు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇటీవల తమ హైస్కూల్ నుంచి కొందరు బాలికలు సైతం జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభకనబరిచారన్నారు. అరవింద్‌ను వ్యాయామ ఉపాధ్యాయుడు ఎల్.నాయుడు, విద్యా కమిటీ చైర్మన్ ఎన్.సత్యవతి, సీఆర్పీ పోలుపర్తి నాగేశ్వరరావు అభినందించారు. -
క్విజ్ పోటీలో విజేతలకు బహుమతి ప్రదానం
విద్యార్థులకు సర్టిఫికెట్లు అందిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్ తుమ్మపాల: విద్యతోపాటు క్విజ్ పోటీల వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో విజ్ఞానాన్ని మరింత పెంపొందించవచ్చని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా జిల్లా అంధత్వ నివారణ సంస్ధ ఆధ్వర్యంలో పది, ఇంటర్ విద్యార్థులకు నేత్రదానంపై గత నెల క్విజ్ పోటీలు నిర్వహించారు. మొదటి ఐదు స్ధానాల్లో నిలిచిన విద్యార్థులకు గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ విజయ కృష్ణన్ సర్టిఫికెట్లతోపాటు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో అన్ని అంశాలపై విద్యార్థి దశలోనే అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంధత్వ నివారణ సంస్ధ జిల్లా ప్రాజెక్టు అధికారి రమణకుమార్, అధికారులు పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
నక్కపల్లి: ప్రాచీన పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారం ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం ఉత్సవ కావిడిని మాడ వీధుల్లో ఊరేగించడంతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయని ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ తెలిపారు. గరుడాద్రి పర్వతంపై కల్కి అవతారంలో స్వయం వ్య క్తమై వెలసిన స్వామివారి మూలవిరాట్‌కు అభిషే కం, నిత్యపూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభ సూచకంగా గ్రామ మాడ వీధుల్లో ఉత్సవ కావిడిని ఊరేగించారు. భక్తులు స్వామివారికి పసుపు కొమ్ములు, కుంకుమ, కొబ్బరి బొండాలు, కానుకలు సమర్పించారు. అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తులకు, సుదర్శన పెరుమాళ్లకు ఆలయ అర్చకులు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, భాగవతం గోపాలాచార్యులు, పీసపాటి శేషాచార్యులు స్నపన తిరుమంజన కార్యక్రమాలు నిర్వహించారు. క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామికి, ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం అంకురార్పణ అనంతరం సుదర్శన పెరుమాళ్లను పల్లకిలో ఉంచి గ్రామంలో ఉత్తర ఈశాన్యదిక్కున ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి మత్స్యంగ్రహణం (పుట్టమన్ను తెచ్చే కార్యక్రమం) నిర్వహించారు. తాత్కాలిక యాగశాల వద్ద అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన చతుస్థాన అర్చనలు పూర్తి చేసి గరుడ అవాహన, గరుడ అప్పాల నివేదన కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు ఈనెల 12 వరకు జరుగుతాయి. 4న ధ్వజారోహణం, 9న వసంతోత్సవం, 10న రథోత్సవం, 11న మృగవేట, 12న వినోదోత్సవంలో భాగంగా స్వామివారికి ఉంగరపు సేవ, పుష్కరిణి వద్ద శమీపూజ ని ర్వహిస్తారు. అనంతరం స్వామివారిని పుణ్యకోటి వాహనంపై తిరువీధి సేవ జరుగుతుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజస్తంభం, బేడా మండపం, వేణుగోపాలస్వామి సన్నిధిలో రంగురంగుల పందిళ్లు, విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. దేవీ వైభవం అమ్మలగన్నయమ్మను తొమ్మిది రోజులపాటు మనసారా అర్చించే దేవీ నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రణవ రూపిణి.. శక్తి స్వరూపిణిగా భక్తులను అనుగ్రహించే అమ్మవారి శరణుఘోషతో ఆలయాలు మార్మోగాయి. ఒక పక్క భవానీ మాలధారణతో భక్తుల హడావిడి, మరో పక్క నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి విగ్రహాల ప్రతిష్టలతో గ్రామాల్లో దసరా సందడి నెలకొంది. ప్రసిద్ధి గాంచిన చోడవరం శ్రీ దుర్గాదేవి ఆలయంలో ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు అమ్మవారు స్వర్ణాభరణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెం నూకాంబిక అమ్మవారి బాలాలయంలో శరన్నవరాత్రి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గవరపాలెం సతకంపట్టు కనకదుర్గమ్మ వారు స్వర్ణకవచ దుర్గాదేవి ఆలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కన్యకాపరమేశ్వరి దేవాలయంలో గాయత్రీదేవిగా అమ్మ దర్శనమిచ్చారు. –అనకాపల్లి/చోడవరం మాడ వీధుల్లో ఉత్సవ కావిడి ఊరేగింపు ఘనంగా మత్స్యంగ్రహణం రంగురంగుల పందిళ్లు, విద్యుద్దీపాలతో వెలిగిపోతున్న ఉపమాక దేవాలయంస్వామివారి దర్శనంతో విశేష ఫలితం కల్కి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం వల్ల ఎన్నో విశేష ఫలితాలు వస్తాయని అర్చకులు తెలిపారు. సాక్షాత్తూ బ్రహ్మదేవుడే స్వామివారికి నిర్వహించే బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారన్నారు. ఈ సమయంలో స్వామిని దర్శించుకోవడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోయి ఈతి బాధల నుంచి విముక్తి కలుగుతుందన్నారు. -
కలిగొట్లలో అసంపూర్తి వంతెన పరిశీలన
● వీఎంఆర్డీఏ కమిషనర్‌తో కలిసి సందర్శించిన కలెక్టర్ విజయ కృష్ణన్ దేవరాపల్లి: కలిగొట్ల వద్ద అసంపూర్తిగా నిలిచిన వంతెనను కలెక్టర్ విజయ కృష్ణన్ గురువారం పరిశీలించారు. మాడుగుల నియోజకవర్గంలోని నాలుగు మండలాలను అనుసంధానిస్తూ విశాఖపట్నానికి 80 అడుగుల మేర రోడ్డు నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్న మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వినతి మేరకు వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్, ఆర్ అండ్ బీ, రెవెన్యూ అధికార్లతో కలిసి కలెక్టర్ రోడ్డు నిర్మాణ ప్రతిపాదిత మార్గంలో పర్యటించారు. కలిగొట్ల వంతెన అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు ఎందుకు పూర్తి కాలేదని స్థానిక అధికార్లను ఆమె ఆరా తీయగా, అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన స్థలానికి నష్టపరిహారం చెల్లించకపోవడంతో పనులు జరగలేదని వివరించారు. కె.కోటపాడులో బయలుదేరి దేవరాపల్లి మండలం కలిగొట్ల, చీడికాడ మండలం అర్జునగిరి మీదుగా మాడుగుల చేరుకున్నారు. ఆయా మండలాల అధికారులు, స్థానిక నాయకులతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ.. 80 అడుగుల రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేసి, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు. ఈ రోడ్డును రెండు దశలలో నిర్మిస్తామన్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో ప్రయాణ సమయం ఆదా కావడంతోపాటు ప్రమాదాలను నివారించవచ్చునన్నారు. -
ఆదాయం పెంచుకోవడానికే కొత్త ఎకై ్సజ్ పాలసీ
సాక్షి, విశాఖపట్నం: కేవలం ప్రభుత్వాదాయం పెంచుకోవడానికే అన్నట్టుగా కొత్త ఎకై ్సజ్ పాలసీ రూపొందించారని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ వ్యాఖ్యానించారు. కొత్త మద్యం విధానంపై స్పందిస్తూ.. సీఎం చంద్రబాబుకు గురువారం ఆయన బహిరంగ లేఖ రాశారు. కొత్త పాలసీలో యువత, మహిళల సంక్షేమానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కనిపించలేదని, కేవలం ఖజానాలో డబ్బులు నింపేలా మద్యం విధానాన్ని రూపొందించినట్టు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. టీడీపీ–జనసేన 2024 ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం యువత, మహిళా సంక్షేమానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కొత్త విధానంలో కనిపించకపోవడం బాధాకరమన్నారు. కేంద్ర సమాజ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2018–19లో చేసిన సర్వే ప్రకారం.. మన రాష్ట్ర జనాభాలో 6 శాతం మంది మద్యానికి పూర్తిగా బానిసలుగా మారి వ్యాధుల బారిన పడ్డారని తేల్చిందన్నారు. జాతీయ స్థాయిలో అధికంగా మద్యపానానికి ప్రభావితమైన రాష్ట్రాల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఓ వైపు రాష్ట్ర ఆదాయం పెరిగినా.. మద్యం కారణంగా రాష్ట్రంలో లక్షలాది చిన్న కుటుంబాలు నష్టపోతాయని, దీనిపై దృష్టి సారించకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. మద్యానికి బానిసలవడం వల్ల మహిళల మీద అత్యాచారాలు కూడా పెరుగుతున్నాయని, కుటుంబ ఆదాయం తగ్గి, పిల్లల చదువులకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. మద్యం అమ్మకాల్లో 30 శాతం తగ్గుదల దిశగా పాలసీ ఉండాలే తప్ప.. ఖజానా నింపేసుకునేందుకు కాదన్నారు. విక్రయాల్లోనూ వ్యక్తిగత పరిమితిని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కొత్త విధానంపై రాష్ట్రంలో మహిళా సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మద్యం పాలసీలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని శర్మ తన లేఖలో స్పష్టం చేశారు. మద్యం అమ్మకాల్లో 30 శాతం తగ్గుదల దిశగా పాలసీ ఉండాలి విక్రయాల్లో వ్యక్తిగత పరిమితిని ప్రవేశపెట్టాలి సీఎం చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ లేఖ -
రూ.100 కోసం హత్యాయత్నం
● అప్పు తీర్చమన్నాడని బ్లేడుతో దాడి ● యలమంచిలి మండలం కొత్తలి గ్రామంలో ఘటన ● నిందితుడిపై ఇప్పటికే పోక్సో కేసు నమోదుయలమంచిలి రూరల్: తన వద్ద అప్పుగా తీసుకున్న రూ.100ను తిరిగి అడిగినందుకు పదునైన బ్లేడ్‌తో దాడికి పాల్పడడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. యలమంచిలి మండలం కొత్తలి గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు యలమంచిలి రూరల్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తలి గ్రామానికి చెందిన బంగారి వెంకటరమణ, నూకిరెడ్డి శ్రీనివాసు రోజువారీ కూలీలు. గతంలో బంగారి వెంకటరమణకు అవసరం మేరకు శ్రీనివాసు రూ.100 అప్పుగా ఇచ్చాడు. తానిచ్చిన రూ.100 తిరిగివ్వాలని శ్రీనివాస్ ఎన్నో సార్లు వెంకటరమణను అడిగాడు. బుధవారం కూడా వెంకటరమణను శ్రీనివాస్ డబ్బులు ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటి తర్వాత వెంకటరమణ సమీపంలో ఉన్న దుకాణం వద్ద కొత్త బ్లేడు కొనుగోలు చేశాడు. అనంతరం గ్రామంలో రామాలయం వద్ద కూర్చున్న శ్రీనివాసు దగ్గరికి వెళ్లి బ్లేడుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. శ్రీనివాసు మెడ, తల, చేతులు, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో సొ మ్మసిల్లిపోయిన బాధితుడ్ని 108 వాహనంలో య లమంచిలి ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. ప్రథ మ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు యలమంచిలి రూరల్ ఎస్ఐ ఉపేంద్ర కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఎస్ఐ కొత్తలి గ్రామానికి వెళ్లి ఘటనపై ప్రత్యక్ష సాక్షులు, గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించా రు. నిందితుడు వెంకటరమణపై ఇప్పటికే యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదై కేసు కోర్టులో నడుస్తోంది. నిందితుడిని కొత్తలి రైల్వేగేటు వద్ద అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు పెట్టారు. కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్ఐ తెలిపారు. -
పాతికిచ్చి.. పదోన్నతిపై వచ్చి?
సాక్షి, విశాఖపట్నం: కూటమి నేతల సిఫార్సులు.. దండిగా డబ్బులు ఉంటే చాలు.. అర్హత లేకున్నా అందలమెక్కవచ్చు. ఆరోపణలున్నా.. అవినీతిపై విచారణలు ఎదుర్కొంటున్నా.. అడ్డగోలు పదోన్నతులు పొందవచ్చు. ఎందుకంటే పాతిక లచ్చలు ఇచ్చారుగా మరి.! ఇటీవల జరిగిన బదిలీల్లో కూటమి ఎమ్మెల్యేలకు భారీగా ముడుపులు అందాయనడానికి ఇదో ఉదాహరణ. భారీగా ముడుపులిచ్చిన ఓ అధికారికి విశాఖలో గృహ నిర్మాణశాఖను ఏలేందుకు పెద్ద పోస్టే దక్కింది. అది కూడా పదోన్నతిపై. వాస్తవానికి ఆ పోస్ట్‌కి ఆ ఉద్యోగి పూర్తిగా అనర్హుడు. తొలుత గృహ నిర్మాణ శాఖలో ఏఈగా చేరిన ఆయన తర్వాత డీఈగా బాధ్యతలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈఈగా పదోన్నతి వచ్చేసింది. ఇక కీలక కుర్చీలో కూర్చొవాలని బుద్ధి పుట్టిన ఆ అధికారికి.. బేరసారాలు కుదరడంతో ఎమ్మెల్యేలు జీహుజుర్ అన్నారు. దీంతో అనుకున్న కుర్చీ దక్కింది. ఎలాంటి అర్హత లేకపోయినా.. ఉన్నతాధికారిగా చెలామణి అవుతున్న ఆ అధికారి వ్యవహార శైలి ఇప్పుడు ఆ శాఖలో కాక పుట్టిస్తోంది. అర్హత లేకున్నా.. కీలక పోస్టా? వాస్తవానికి గృహ నిర్మాణ శాఖలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కే ఉన్నతాధికారి హోదాని అప్పగించాలి. కానీ జిల్లాలో పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. సదరు ఉద్యోగి డిప్లమో చేసి ఉద్యోగం సాధించారు. క్రమంగా ఏఈ నుంచి డీఈగా.. ఇప్పుడు ఈఈగా పదోన్నతి పొందారు. సిఫార్సులతో ఏకంగా ఇన్చార్జి సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ)గా బాధ్యతలు దక్కించుకున్నారు. ఈ క్రమంలో గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారిగా బదిలీపై ఇక్కడకు వచ్చేశారు. వాస్తవానికి డిప్లమోతో విధుల్లోకి చేరిన ఉద్యోగి ఉన్నతాధికారి పోస్టుకు పూర్తిగా అనర్హులు. కానీ అతనికి ప్రభుత్వం అధికారికంగా ఇన్చార్జి ఎస్ఈగా పదోన్నతి కల్పించేసి.. కీలక బాధ్యతలు కట్టబెట్టడం గమనార్హం. ఇందుకోసం కూటమి ఎమ్మెల్యేలకు ఏకంగా రూ.25 లక్షలు ముడుపులు చెల్లించుకున్నారని హౌసింగ్ డిపార్ట్మెంట్ గుసగుసలాడుకుంటోంది. అవినీతి అధికారికి కీలక బాధ్యతలా? సదరు అధికారిపై మొదటి నుంచి తీవ్ర అవినీతి ఆరోపణలున్నాయి. పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వ్యవహారంలో అతను రూ.3 కోట్ల వరకు అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్ విచారణ సాగుతోంది. డీఈ హోదాలో ఉన్నప్పుడే ఈ తతంగాన్ని నడిపించారు. అలాగే భీమిలిలో హౌసింగ్ విభాగంలో విధులు నిర్వర్తించిన సమయంలోనూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇలా పనిచేసిన చోట్ల అవినీతి వ్యవహారాలు నడిపిన వ్యక్తికి.. ఇప్పుడు కీలక బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గృహనిర్మాణ శాఖలో అడ్డగోలు ప్రమోషన్ ఈఈ స్థాయి ఉద్యోగికి ఉన్నతాధికారిగా పోస్టింగ్ పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వ్యవహారంలో అతని అవినీతిపై విజిలెన్స్ విచారణ కూటమి ఎమ్మెల్యేలకు రూ.25 లక్షలు ముడుపులు చెల్లించినట్లుగా ఆరోపణలు -
పనులు వేగవంతం చేయండి
కన్వెన్షన్ సెంటర్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్న వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్ విశాఖ సిటీ: వీఎంఆర్డీఏ చేపట్టిన పనులను వేగవంతం చేయాలని వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంలో గురువారం ఆయన వీఎంఆర్డీఏ చేపట్టిన నిర్మాణాలను, భూములను సందర్శించారు. ముందుగా వేపగుంట ప్రాంతంలో ఉన్న చీమలాపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న రెండు అంతస్తుల కన్వెన్షన్ సెంటర్ భవనాన్ని పరిశీలించారు. మార్పులు చేర్పులు సూచించి, పనులను వేగవంతం చేయాలని చెప్పారు. అనంతరం పెదగంట్యాడలో ఓపెన్ ఆడిటోరియం, కేఎల్ రావు నగర్, కూర్మన్నపాలెం, అగనంపూడి వద్ద సంస్థకు చెందిన భూములను పరిశీలించారు. ఈ పర్యటనలో ఎస్టేట్ అధికారి లక్ష్మారెడ్డి, ముఖ్య ప్రణాళికా అధికారి శిల్పా, ప్రధాన ఇంజనీర్ భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆధిక్యంలోకి అంగద్
● రెండో స్థానంలో కొనసాగుతున్న అమన్‌రాజ్ విశాఖ స్పోర్ట్స్: వైజాగ్ ఓపెన్ 2024 గోల్ఫ్ టోర్నీ రెండో రౌండ్లో వ్యక్తిగత అత్యుత్తమ –10 స్కోర్, నాలుగు షాట్లతో అంగద్ చీమా అగ్రస్థానానికి చేరుకున్నాడు. రెండు రౌండ్లలోనూ –12 స్కోర్‌తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. గతవారం జరిగిన టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన చండీగఢ్‌కు చెందిన అంగద్ చీమాకు ఇదే వ్యక్తిగత అత్యుత్తమ స్థానం. అంగద్ ప్రస్తుత సీజన్లో ఆరు టాప్–10లతో పీజీటీఐ ర్యాంకింగ్‌లో నాలుగో స్థానానికి చేరాడు. విశాఖలోని ఈస్ట్‌పాయింట్ గోల్ఫ్‌క్లబ్‌లో గురువారం రెండో రోజు జరిగిన మ్యాచ్‌ల్లో పాట్నాకు చెందిన అమన్‌రాజ్ తన రెండో రౌండ్ అనంతరం–8(134) వద్ద రెండో స్థానం, బెంగళూర్‌కు చెందిన ఆర్యన్ రూప ఆనంద్–7 స్కోర్‌తో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. మొత్తంగా తొలి రెండు రౌండ్లలో 126 మంది పోటీపడగా 143 వద్ద కట్ ప్రకటించడంతో 57 మంది గోల్ఫర్లు పోటీలో నిలిచి మూడో రౌండ్‌కు సిద్ధమయ్యారు. పదకొండేళ్ల క్రితం టైటిల్ సాధించిన అంగద్ ఈసారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో మూడోరౌండ్‌కు సిద్ధమయ్యాడు. తొలిరౌండ్ ముగిసేటప్పటికి 13వ స్థానంలో నిలిచినా రెండో రౌండ్ ముగిసేటప్పటికి ఆధిక్యంలోకి దూసుకొచ్చాడు. తొలిరౌండ్లో ఆధిక్యాన్ని ప్రదర్శించిన మిలింద్ అండర్ 5 స్కోర్‌తో, ధృవ్‌తో కలిసి ఉమ్మడిగా ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. కెనడాకు చెందిన శుఖ్రాజ్తో కలిసి డిఫెండింగ్ చాంప్ శ్రీలంకకు చెందిన తంగరాజ ఉమ్మడిగా 16వ స్థానంలో అండర్ 2 స్కోర్లతో కొనసాగుతున్నారు. -
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు పయనం
● వేచలం విద్యార్థులకు వీడ్కోలు దేవరాపల్లి: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు మండలంలోని వేచలం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు గురువారం రాజమహేంద్రవరం పయనమయ్యారు. ఆగస్టులో ఆంధ్ర విశ్వవిద్యాలయం జూబ్లి హాల్ గ్రౌండ్లో జరిగిన జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో వీరు విశేష ప్రతిభ కనబరిచారు. అండర్–16 బాలికల విభాగంలో 9వ తరగతి విద్యార్థిని బి. చైతన్య పెంటాథ్లాన్ ఈవెంట్లోను, అండర్–16 బాలుర విభాగంలో టెన్త్ విద్యార్థి వి. నారిబాబు హైజంప్లోను, మరో టెన్త్ విద్యార్థి టి. రవిశంకర్ 5 కి.మీ రేస్ వాక్‌లో ప్రథమ స్థానాలు సాధించారు. అండర్–20 బాలికల విభాగంలో ఆర్. భారతి 200 మీటర్లు, 400 మీటర్ల రన్నింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచారు. వీరంతా రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో జరిగే రాష్ట్ర స్థాయి సబ్ జూనియన్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంనేందుకు పీడీ ఆర్. తమ్మునాయుడుతో కలిసి బయలుదేరి వెళ్లారు. వీరికి హెచ్ఎం డి. నర్సింహమూర్తి, సర్పంచ్ నాగిరెడ్డి శఠారినాయుడు, ఎంపీటీసీ రెడ్డి శ్రీలక్ష్మి, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ నగేష్, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు వీడ్కోలు పలికారు. -
ఎంపీ భరత్, ఎమ్మెల్యే పల్లా రాజీనామా చేయాలి
● స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రిలే దీక్షలు అనకాపల్లి: విశాఖ ఎంపీ భరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తమ పదవులకు రాజీనామా చేయాలని మండల రైతు సంఘాల నాయకుడు బుద్ద రంగారావు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం కానియ్యబోమని, ఆ పరిస్థితి వస్తే తమ పదవులకు రాజీనామా చేసి కార్మికులతో కలిసి పోరాడతామని ఎన్నికల సమయంలో చెప్పిన వీరు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. స్థానిక నెహ్రూ చౌక్ వద్ద స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రైతు, మహిళా, వ్యవసాయ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు మూడో రోజు గురువారం కొనసాగాయి. ఆయన మాట్లాడుతూ రెండు మాసాల క్రితం స్టీల్ ప్లాంట్ సందర్శనకు వచ్చిన కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి 45 రోజుల్లో పరిస్థితి చక్కదిద్దుతానని చెప్పి, ఇప్పుడు ప్రైవేటీకరించే పనిలో నిమగ్నమయ్యారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను దశలు వారీగా ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడమే కాకుండా, దేశంలో నిరుద్యోగ సమస్యను పెంచాలని చూస్తున్నాయని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు వైఎన్.భద్రం, కర్రి అప్పారావు, నాయినిబాబు, కోటేశ్వరరావు, ఆర్.శంకరరావు, రాజాన దొరబాబు, మోహన్, దాకారపు వరలక్ష్మి, కోరిబిల్లి శంకరరావు పాల్గొన్నారు. -
నాణ్యమైన భోజనం అందించండి
● రాష్ట్ర బాలల హక్కుల కమిషన్మధురవాడ: బక్కన్నపాలెంలోని దివ్యాంగులు, వయోవృద్ధుల శిక్షణ, ఉత్పత్తి కేంద్రంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారాం గురువారం విచారణ చేపట్టారు. ఇక్కడ శిక్షణ పొందుతూ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు నిర్వాహకులు సరైన భోజనం పెట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ‘సాక్షి’లో బుధవారం ‘నీళ్లచారు.. పురుగుల అన్నం’శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ స్పందించింది. ఈ మేరకు సీతారాం ఐటీఐని పరిశీలించి.. విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై వివరాలు సేకరించారు. భోజనం ఎలా ఉందని విద్యార్థులను ప్రశ్నించగా.. అన్నం ముద్దగా ఉందని, చారు నీళ్లలో ఉండడం వల్ల తినలేకపోతున్నామని వాపోయారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందివ్వాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని నిర్వాహకులను హెచ్చరించారు. ఐటీఐని నిత్యం పర్యవేక్షించాలని అసిస్టెంట్ డైరెక్టర్ మాధవితోపాటు మహిళా పోలీసుకు సూచించారు. మళ్లీ ఫిర్యాదులు రాకుండా చర్యలను చేపట్టాలని, ఈ వ్యవహారంపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఏడీ మాధవిని ఆదేశించారు. ఐసీడీఎస్ పీవో శ్రీదేవి పాల్గొన్నారు. కాగా.. ఈ వ్యవహారంపై జేసీ మయూర్ అశోక్ ఆరా తీసినట్లు తెలిసింది. -
మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు
గొలుగొండ: దేశంలో మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయని, వాటి పరిరక్షణ కోసం అధికారులు పనిచేస్తున్నారని జిల్లా న్యాయమూర్తి ఎం. వెంకట శేషమ్మ తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రధానంగా మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇంటిని చక్కదిద్దికోవడంలో మహిళలు కీలకపాత్ర పోషించుకోవాలన్నారు. చిన్న చిన్న విషయాలకు ఆవేశపడవద్దని తెలిపారు. ప్రతి గ్రామంలో ఐసీడీఎస్ సిబ్బంది మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. ఈ చట్టాలు వల్లే దేశంలో ఎంతో మందికి న్యాయం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో నర్సీపట్నం ఇన్చార్జి సీఐ కుమారిస్వామి, నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ జె. సురేంద్ర, ఐసీడీఎస్ పీడీ అనంతలక్ష్మి, డీఆర్డీఏ ఏపీడీ డైజీ, గొలుగొండ తహసీల్దార్ శ్రీనువాసరావు, ఐసీడీఎస్ పీవో శ్రీగౌరి, మహిళలు, అధికారులు పాల్గొన్నారు. ● జిల్లా న్యాయమూర్తి వెంకట శేషమ్మ -
ఎస్‌సీఎస్‌ఎల్ ఎండీపై సెబీ చర్యలు
● ఆ సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెల్లడి మాట్లాడుతున్న రాజగోపాల్‌రెడ్డి సీతమ్మధార: విశాఖకు చెందిన స్టీల్ సిటీ సెక్యూరిటీస్ లిమిటెడ్(ఎస్‌సీఎస్‌ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ సతీష్‌కుమార్ ఆర్యను నెలరోజుల పాటు విధుల నుంచి సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) సస్పెండ్ చేసిందని ఆ సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. డైమండ్ పార్కులోని ఓ హోటల్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సెబీకి ఆర్య సమర్పించిన విద్యార్హతల సర్టిఫికెట్లన్నీ నకిలీవని స్పష్టంగా తెలియడంతో ఈ నిర్ణయం తీసుకుందన్నారు. నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చినందుకుగానూ గతంలో ఎస్‌సీఎస్‌ఎల్, ఆర్యకి సెబీ రూ.5.25 లక్షల జరిమానా వడ్డించిందని గుర్తు చేశారు. తాజాగా కంపెనీ ఎండీ ఆర్యను నెల రోజుల పాటు విధుల నుంచి తొలగించిందన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పొందిన సర్టిఫికెట్ నకిలీదని రిజిస్ట్రార్ ధ్రువీకరించి ఆర్యపై మూడో పట్టణ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని వివరించారు. పాస్‌పోర్టు కోసం ఈ నకిలీ సర్టిఫికెట్ సమర్పించారని ఆరోపించారు. దీనిపై వచ్చిన ఫిర్యాదుతో పాస్‌పోర్టు అధికారులు చేసిన దర్యాప్తులో కూడా ఆయన సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవని తేలిందన్నారు. ఎస్సీఎస్ఎల్లో కొన్ని లక్షల మంది ప్రజలు రూ.కోట్లలో షేర్ల రూపంలో పెట్టుబడులు పెట్టారని, ఈ వ్యవహారం కారణంగా పెట్టుబడిదారులు నష్టపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. -
ఉత్సాహంగా సీబీఎస్ఈ క్లస్టర్ – 7 పోటీలు
పాయకరావుపేట: పట్టణంలోని శ్రీప్రకాష్ విద్యా సంస్థల ప్రాంగణంలో సీబీఎస్ఈ క్లస్టర్ –7 కబడ్డీ, వాలీబాల్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. అండర్ – 14, 17, 19 బాలికల విభాగాల్లో పోటీలకు వందకి పైగా పాఠశాలల నుంచి 1200 మంది విద్యార్థినులు హాజరయ్యారు. క్రీడా స్ఫూర్తితో నువ్వా నేనా అన్నట్టుగా వీరు తమ ప్రతిభ కనబరుస్తున్నారు. బుధవారం ప్రారంభమైన ఈ పోటీలు శుక్రవారంతో ముగియనున్నాయి. అదే రోజు ముగింపు కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత విజేతలకు బహుమలు ప్రదానం చేస్తారని విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయ్ ప్రకాష్ తెలిపారు. -
మిజోరం గవర్నర్‌ను కలిసిన నాగార్జున
బీచ్‌రోడ్డు: అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న మిజోరం గవర్నర్ కె.హరిబాబును సినీ నటుడు నాగార్జున గురువారం దసపల్లా హిల్స్ లోని ఆయన నివాసంలో కలిశారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పలు విష యాలు చర్చించారు. ఆయన వెంట యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఉన్నారు. 10 రోజుల పాటు విశాఖ లో ఓ సినిమా షూటింగ్ ముగించుకుని గురువారం హైదరాబాద్ పయనమైన నాగార్జునను అభిమానులు కలిసి ఫొటోలు దిగారు. వివాహిత ఆత్మహత్యాయత్నం కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గోపాలపట్నం: ఆత్మహత్య చేసుకునేందుకు సింహాచలం రైల్వేస్టేషన్‌కు వచ్చిన ఓ వివాహితను ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాపాడారు. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం–1పై బుధవారం మధ్యాహ్న సమయంలో బుచ్చిరాజుపాలెం సుసర్ల కాలనీకి చెందిన కంచిమోజు అఖిల అనే వివాహిత అనుమానాస్పదంగా సంచరిస్తోంది. గమనించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కె.అనిత ఆమె వద్దకు చేరుకుని ప్రశ్నించారు. అనంతరం స్టేషన్‌కు తీసుకెళ్లగా.. ఏఎస్ఐ కె.ఆర్.కె.రావు ఆమె నుంచి వివరాలు సేకరించారు. కుటుంబ సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చానని, తిరిగి ఇంటికి వెళ్లనని ఆమె తెలిపింది. దీంతో పోలీసులు ఆమె సోదరి కర్రి లీనాకు సమాచారం ఇచ్చారు. ఆమె సింహాచలం రైల్వే స్టేషన్‌కు వచ్చి ఆమెకు ధైర్యం చెప్పారు. మధ్యాహ్నం రెండు గంటలకు భర్త జగదీష్ సమక్షంలో ఆమెను సోదరి లీనాకు అప్పగించారు. ప్రేమ వంచకుడి అరెస్టు ఎస్.రాయవరం: పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ విభీషణరావు గురువారం తెలిపారు. నక్కపల్లి మండలం జి.జగన్నాథపురం గ్రామానికి చెందిన కొత్తూరునాగదేవ ఎస్.రాయవరం మండలానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. -
బార్క్ రోడ్డును పరిశీలించిన జేసీ
మునగపాక: మండలంలో నాగవరం పంచాయతీ పరిధిలోని బార్క్ రోడ్డును జేసీ జాహ్నవి గురువారం పరిశీలించారు. బార్క్ రోడ్డు ఏర్పాటులో భాగంగా వుడా లే–అవుట్లో కోల్పోయిన ప్లాట్ లబ్ధిదారులు తమకు ప్రభుత్వం తగు నష్టపరిహారం చెల్లించడంతోపాటు గతంలో వేసిన ఫెన్సింగ్ తీసివేయాలని కోరుతూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె స్థల పరిశీలన చేశారు. 2004లో వుడా ద్వారా అన్ని అనుమతులు తీసుకుని లే–అవుట్ వేశారని, పలువురు మధ్య తరగతి ఉద్యోగస్తులు ప్లాట్లు కొనుగోలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బార్క్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నట్లు 2005లో నోటిఫికేషన్ ఇచ్చారని బాధితులు వివరించారు. అప్పటి నుంచి న్యాయ స్థానాల చుట్టూ తమకు న్యాయం చేయాలని ఆర్జించామన్నారు. 2013 భూ చట్టం ప్రకారం పరిహారం అందించాలన్నారు. ఉన్నతాధికారులు స్పందించి ప్లాట్లు పోయిన వారికి పరిహారం ఇవ్వడంతో పాటు ఫెన్సింగ్ తొలగించేలా చూడాలని కోరారు. ఇందుకు స్పందించిన ఆమె రికార్డులు పరిశీలిస్తామని చెప్పారు. -
పరిశ్రమలో ఇటుకలు పడి ముగ్గురికి గాయాలు
అనకాపల్లి: కేఎన్ఆర్ పేటలోని ఏపీఐసీసీలో ఏర్పాటు చేసిన ప్రీటెక్ అల్యూమినియం, ఐరెన్ పరిశ్రమలో గురువారం జరిగిన ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. రూరల్ ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పరిశ్రమలో విధుల్లో భాగంగా ఇటుకలు పేరుస్తున్న సమయంలో ఒక్కసారిగా అక్కడున్న దీనేష్, శేఖర్, సాయిలపై ఇటుకలు పడిపోవడంతో గాయాలు పాలయ్యారు. హుటాహుటిన క్షతగాత్రులను అనకాపల్లి ఉషాప్రైమ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రూరల్ ఎస్ఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
సాష్టాంగం
సిండికేట్లకుఇద్దరు లిక్కర్ కింగ్‌ల సేవలో తరిస్తున్న ఎకై ్సజ్ అధికారులు ● గిరాకీ ఉన్న ప్రాంతాల్లో మద్యం షాపుల లైసెన్సులపై కన్ను ● లాటరీకి ముందే జోరుగా తెరవెనుక వ్యవహారాలు ● 70 షాపుల కోసం 500 దరఖాస్తులు వేయాలని నిర్ణయం? ● ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్న షాపుల ముందస్తు బుకింగ్?విశాఖ సిటీ: మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు లిక్కర్ కింగ్‌లు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అన్ని అస్త్రాలతో తెరవెనుక తతంగాన్ని నడిపిస్తున్నారు. ప్రధానంగా ఇద్దరు సిండికేట్లు నగరంలో కీలక మద్యం షాపులను సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి కొంత మంది ఎకై ్సజ్ అధికారులు సైతం శక్తి వంచన లేకుండా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కూటమి ఎమ్మెల్యే కనుసన్నల్లో నడిచే సిండికేట్‌కు సాగిలా పడుతూ.. షాపుల ఏర్పాటుకు సైతం తోడ్పాటు అందించే పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే.. లాటరీకి ముందే కొంత మంది అధికారుల సాయంతో షాపుల లీజులకు ప్రయత్నాలు చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చక్రం తిప్పుతున్న ఇద్దరు సిండికేట్లు 2019 వరకు జిల్లాలో మద్యం వ్యాపారాన్ని ముగ్గురు సిండికేట్లే శాసించేవారు. కానీ ఇప్పుడు ముగ్గురు సిండికేట్లలో కొంత చీలికలు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు సిండికేట్లు మాత్రం ఈ దఫా జిల్లాలో చక్రం తిప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒక సిండికేట్‌కు కూటమి ఎమ్మెల్యే ఆశీర్వాదాలు పుష్కలంగా ఉండడంతో ఈసారి వీరి హవా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్లు లిక్కర్ వ్యాపార వర్గాల్లో టాక్ నడుస్తోంది. వీరు నగరంలో ప్రధాన ప్రాంతాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. విశాఖలో జిల్లాలో 155 మద్యం దుకాణాల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో అత్యధికంగా వ్యాపారం జరిగే ఏరియాలను ఇప్పటికే గుర్తించి వాటిని దక్కించుకోవడానికి పెద్ద ఎత్తున దరఖాస్తులు చేయించే పనిలో ఉన్నారు. ప్రధానంగా 70 షాపులను చేజిక్కించుకోడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటి కోసం 500 దరఖాస్తులు వేయాలని నిర్ణయించినట్లు చర్చ జరుగుతోంది. షాపుల బుకింగ్‌కు అధికారుల రాయబారం లిక్కర్ కింగ్‌లు లాటరీకి ముందే షాపులు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. తప్పనిసరిగా వారికే లైసెన్సు వస్తుందన్న గట్టి నమ్మకంతో షాపుల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న షాపుల్లోనే లీజులకు తీసుకోవాలని భావిస్తున్నారు. లాటరీ ప్రక్రియ పూర్తయితే ప్రస్తుతమున్న ప్రభుత్వ మద్యం దుకాణాలను ఖాళీ చేయనున్నారు. దీంతో వాటిని తిరిగి లీజుకు తీసుకొని నిర్వహించాలని సిండికేట్లు భావిస్తున్నారు. ఇందుకోసం నేరుగా కొంత మంది ఎకై ్సజ్ అధికారులే రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు నిర్వహిస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాల యజమానులతో సంబంధిత ఎకై ్సజ్ స్టేషన్ అధికారులకు పరిచయముంది. దీంతో వీరి ద్వారా సదరు షాపుల యజమానులతో సంప్రదింపులు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సిండికేట్‌లో కొంతమందిని తీసుకువెళ్లి ఆయా షాపులను వారికి లీజుకు ఇవ్వాలని అధికారులు రాయబారం చేస్తున్నట్లు సమాచారం. ఇలా ఇప్పటికే 70 షాపులకు సంబంధించి లీజు ఒప్పందాలకు సిద్ధమవుతున్నట్లు చర్చ జరుగుతోంది. మున్ముందు ఈ మద్యం షాపుల కేటాయింపులో మరెన్ని విచిత్రాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి మరి. -
ఆగి ఉన్న లారీని ఢీకొని యువకుడి మృతి
అనకాపల్లి: ఆగి ఉన్న లారీని ఢీకొని మండలంలో చింతనిప్పుల అగ్రహారం గ్రామానికి చెందిన కోరుకొండ సురేష్(24) దుర్మరణం చెందాడు. ట్రాఫిక్ ఎస్ఐ డి.శేఖరం వివరాల మేరకు... స్థానిక జాతీయ రహదారి జలగల మధుం జంక్షన్ పెట్రోల్ బంక్ సమీపంలో స్టోన్ క్రషర్ లారీ రిపేరుతో ఆగిపోయింది. ఈ క్రమంలో గాజువాక నుంచి చింతనిప్పుల అగ్రహారం వెళ్తుతున్న సురేష్ తన ద్విచక్ర వాహనంతో లారీ వెనుక వైపు గుద్దడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. మృతుడు తండ్రి చందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటక పోటీలు ప్రారంభం
అనకాపల్లి: కర్రి రమేష్ మెమోరియల్ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకోత్సవ పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. గవరపాలెం సతకంపట్టు కనకదుర్గ నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని గౌరీ సేవా సంఘం మళ్ల జగన్నాథం కల్యాణ మండపంలో ఈ పోటీలను మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ప్రారంభించారు. ఈ నెల 7వ తేదీ వరకూ ఈ నాటికలు ప్రదర్శించనున్నారు. రాత నాటిక... ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం వెలగలేరు గ్రామం వేలగలేరు థియేటర్ ఆర్ట్స్ వారి ‘రాత నాటిక’ ప్రదర్శన ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. మనిషికి కష్టం కలిగితే నా రాతింతే, నా రాత బాగోలేదు అంటూ ఉసూరుమంటాడు. సుఖం విషయంలో మాత్రం రాతను గాలికొదిలేస్తాడు. తాను పొందాల్సినవి మంచిగా పొందుతాడు. తాను తిరిగి ఇవ్వాల్సిన వాటి విషయంలో మాత్రం బాధ్యతా రహితంగా ఉంటాడు. అది ఎదుటి మనిషి విషయంలోనైనా, ప్రకృతి విషయంలోనైనా, ఇలాంటి మనిషి నైజం వల్ల ప్రస్తుత సమాజంలో ఎం జరుగుతోంది..? సమాజం ఎటుపోతోంది..? మనిషి జీవనం ఎలా సాగుతోంది..? ఈ అనర్థాలకు కారణం ఎవరూ...? ఇది ఎవరు రాసిన రాత...? అని ప్రస్తుత సమాజ పోకడలకు అద్దం పట్టేలా పాత్రధారులు ప్రదర్శించారు. స్వప్నిక. సురభివాగ్ధేవి, గోవర్దన్, శ్రీనివాసరావు పోలుదాసు, కిరణ్, సురభి రాఘవ, అజయ్, పవన్‌కల్యాణ్, బ్రహ్మ, బి.కొండలరావు నటించి తమ పాత్రలకు జీవం పోశారు. పోలుదాసు శ్రీనివాసరావు రచన, దర్శకత్వం వహించారు. అజరామరం....నాటిక... హైదరాబాద్ కళావర్షిణి వారిచే అజరామరం నాటిక నిర్వహించారు. పలువురిని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నాటికకు రచనతోపాటు దర్శకత్వం జెట్టి హరిబాబు వహించారు. కార్యక్రమంలో కనకదుర్గ అమ్మవారి ఆలయ శాశ్వత చైర్మన్ కాండ్రేగుల నాయుడు, ఉత్సవ కమిటీ చైర్మన్ భీమరశెట్టి వరహా నూకరాజు, ఆలయ వ్యవస్థాపకుడు పి.వి.రమణ, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
నక్కపల్లి: మండలంలో గురువారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. డొంకాడకు చెందిన కందిపల్లి సత్యనారాయణ(62) పశువుల కోసం పోలవరం కాలువ గట్టుకెళ్లి కాలుజారి అందులో పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇతని కోసం గాలించడంతో కాలువలో శవమై తేలాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో వి. మాడుగుల మండలం వీరవల్లి అగ్రహారం గ్రామానికి చెందిన ముత్తా గోవిందరావు (40) హెట్రోలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. గురువారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లి కొండవెనుకపాలెం సమీపంలో రోడ్డు పక్కన గొయ్యిలో ప్రమాదవశాత్తు పడి మరణించాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు హెస్సీ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గాంధీ, శాస్త్రిల జీవితం స్ఫూర్తిదాయకం
తుమ్మపాల: జాతిపిత మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి నిరాడంబరంగా జీవించి స్వాతంత్య్రోద్యమం ద్వారా దేశప్రజలకు స్వేచ్ఛను ఇవ్వడంలో ముఖ్య పాత్ర పోషించారని, వారి జీవితం అందరికీ ఆదర్శమని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు.పట్టణంలో బెల్లం మార్కెట్ వద్ద నిర్వహించిన గాంధీజయంతి ఉత్సవాల్లో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ జాహ్నవి, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తదితరులు మహాత్ముని విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గాంధీజీ చేసిన శాంతియుత పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. అంతకుముందు నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో కలెక్టరేట్ ప్రాంగణం, శంకరం రైల్వే బ్రిడ్జి మీద చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.కలెక్టర్, జేసీ స్వయంగా కొడవలి చేతపట్టి మొక్కలను కట్ చేశారు. చీపురుతో రోడ్డును శుభ్రం చేశారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి చిన్నికృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి శిరీష రాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.