పాల ఉత్పత్తుల సేకరణపై అప్రమత్తం
అనకాపల్లి టౌన్: జిల్లాలో వివిధ డెయిరీల్లో సేకరిస్తున్న పాల ఉత్పత్తులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి రామ్మోహన్ సూచించారు. స్థానిక జిల్లా పశు సంవర్థక శాఖ కార్యాలయంలో మహిళా డెయిరీ సహకార సంఘం చీఫ్ ప్రమోటర్స్, కార్యదర్శులకు పాల ఉత్పత్తులు, కల్తీ, కో–ఆపరేటివ్ చట్టాలు, పరిశుభ్రమైన పాల ఉత్పత్తులపై బుధవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్టోమీటర్ ద్వారా పాలలో కలిసే నీటి శాతం గుర్తించవచ్చన్నారు. ఎఫ్‌టీఐఆర్ స్పెక్ట్రోస్కోపీ పరికరం ద్వారా పాలలో ఉండే బహుళ కల్తీ పదార్థాలను గుర్తించేందుకు వీలు ఉంటుందన్నారు. బయోస్పెన్సర్లు ఉపయోగించడం ద్వారా యూరియా లేదా సమానమైన లవణాలు వంటి పదార్థాలను గుర్తించవచ్చన్నారు. సంఘాల సభ్యులు తప్పనిసరిగా ఈ పరీక్షలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ శ్రీనివాస్, అమూల్ మేనేజర్ శ్రీకాంత్ పటేట్, ప్రశాంత్, ఏపీడీడీసీఎఫ్ జిల్లా మేనేజర్ రాకేష్, తదితరులు పాల్గొన్నారు.


