చీడికాడ : మా భూములను సోలార్ ప్రాజెక్టుకు అప్పగించేది లేదని ముందుగానే గ్రామసభల్లో చెప్పినా మరలా ఎందుకు మా భూముల్లో సర్వే నిర్వహించేందుకు వచ్చారంటూ మండలంలోని బైలపూడి, ఎ.అగ్రహారం రైతులు రెవెన్యూ అధికారులను బుధవారం నిలదీశారు. వివరాలలోకి వెళితే మండలంలోని బైలపూడి, ఎ.అగ్రహారం పరిసరాల్లో గల 120 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు భూములు సేకరణకు ఇటీవల రెండు గ్రామాల్లో తహసీల్దార్ కిషోర్ లింకన్ గ్రామసభలు నిర్వహించారు. పూర్వకాలం నుంచి తమ సాగులో ఉన్న ఢీ–పారం భూములపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నామని తమ భూముల్లో ప్రాజెక్టు ఏర్పాటుకు అంగీకరించమంటూ రెండు గ్రామాల రైతులు తేల్చిచెప్పారు. దీనిపై సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌లో రెండు గ్రామాల రైతులు తహసీల్దార్ కిషోర్ లింకన్‌కు సోలార్ ప్రాజెక్టుకు తమ భూములు ఇవ్వబోమని వినతి పత్రాలు అందించారు. అయితే దానికి ఎటువంటి సమాధానం చెప్పకుండా బుధవారం మండల సర్వేయర్ సురేష్, సచివాలయం సర్వేయర్‌తో పాటు వీఆర్‌వో సత్యనారాయణ ఇతర రెవిన్యూ సిబ్బంది బైలపూడి, ఎ.అగ్రహారం భూముల్లో సర్వే జరిపేందుకు వచ్చారు. దీంతో రెండు గ్రామాలకు చెందిన రైతులు వచ్చి అధికారులను అడ్డుకున్నారు. సోలార్ ప్రాజెక్టు మా భూముల్లోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి ఏవైనా ఉత్తర్వులుంటే చూపించాలంటూ అసలు ప్రాజెక్టు మంజూరైందా ? అంటూ రైతులు నిలదీశారు. దీనికి మండల సర్వేయర్, వీఆర్‌వో మాట్లాడుతూ ఈ భూములను చూసి సర్వే జరపమని ఇచ్చిన తహసీల్దార్ ఆదేశాల మేరకే వచ్చామని చెప్పారు. అయితే మా భూముల్లో సర్వేలు జరపవద్దని రైతులు తేల్చి చెప్పడంతో అధికారులు వెనుదిరిగారు.


