150 అడుగుల ఎత్తుతో విగ్రహం
బాపూఘాట్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గాంధీ విగ్రహం
సాక్షి, హైదరాబాద్/లంగర్‌హౌస్: మూసీ నదికి పర్యాటక సొబగులు అద్దుకోనున్నాయి. నది సుందరీకరణలో భాగంగా బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మూసీ, ఈసా, గోదావరి నదులతో త్రివేణి సంగమంగా అభివృద్ధి చేయనున్న బాపూఘాట్‌లోనే 150 అడుగుల ఎత్తయిన మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసిందే.
ఉగాది నుంచి గాంధీ సరోవర్ అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు.దీంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మహనీయుడు విగ్రహం ఇదే కానుంది. ప్రస్తుతం మన దేశంలో అత్యంత ఎత్తయిన గాంధీ కాంస్య విగ్రహం పట్నాలోని గాంధీ మైదానంలో ఉంది. దీని ఎత్తు 72 అడుగులు (22 మీటర్లు).
మూసీ చుట్టూ 25 వేల ఎకరాల భూమి..:
తొలి దశలో ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు, హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు రెండు వైపులా మొత్తం 21 కిలో మీటర్ల మేర మూసీని సుందరీకరించనున్న సంగతి తెలిసిందే. రెండేళ్లలో సుమారు 5,600 కోట్ల వ్యయంతో నదికి పునరుజ్జీవం కల్పించనున్నారు. రోడ్లు, వంతెనలు, స్కైవాక్‌లతో పాటు నదీ తీరాలను అభివృద్ధి చేసేందుకు వెచ్చించనున్నారు.
ఇందులో ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీపీ) రూ.4,100 కోట్లు రుణం రూపంలో అందించనుండగా..మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం బాండ్లు, పీపీపీ విధానం, ఇతరత్రా రూపంలో సమీకరించనుంది. ఆ తర్వాత దశల వారీగా హెచ్‌ఎండీఏ పరిధిలో మూసీ ప్రవహించే 55 కి.మీ. వరకూ నదికి పునరుజ్జీవం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.
దీంతో మూసీకి ఇరువైపులా సుమారు 25 వేల ఎకరాల భూమి అందుబాటులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 120 కోట్ల చదరపు అడుగుల స్థలాన్ని నివాస, వాణిజ్య సముదాయాలు, ఇతరత్రా స్థిరాస్తి కార్యకలాపాలకు వినియోగించాలని భావిస్తున్నారు.
సరోవర్‌లో ఏముంటాయంటే..
సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా గాంధీ సరోవర్‌ను అభివృద్ధి చేయనున్నారు. మొత్తం 238 ఎకరాల్లోని ఈ ప్రాజెక్ట్‌లో 52 ఎకరాలు కేంద్ర రక్షణ శాఖకు చెందినవి ఉన్నాయి. ఇందులో ఇప్పటికే 38.9 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు అంగీకరించగా.. మిగిలిన భూమి కోసం సర్కారు తీవ్రంగా శ్రమిస్తోంది. నది పరీవాహక ప్రాంతాన్ని హ్యాపెనింగ్ ప్లేస్‌గా, నైట్ ఎకానమీగా అభివృద్ధి చేయడంతో పాటు అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు.
గాంధీ సరోవర్‌లో గాంధీతత్వశాస్త్రాన్ని బోధించే మ్యూజియం, గాంధీ జీవిత చరిత్రను వివరించే ఆడిటోరియాలు, ఫొటో ఎగ్జిబిషన్లు, ధ్యాన మందిరం వంటివి ఉంటాయి. వ్యాపార, ఆర్థిక కార్యకలాపాల కోసం హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య సముదాయాలు కూడా ఉంటాయి. నది పరీవాహక ప్రాంతంలో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, షాపింగ్ మాల్స్, యాంపీ థియేటర్లు, వినోద కేంద్రాలు, ఉద్యానాలు, ఇతరత్రా యుటిలిటీలను అభివృద్ధి చేస్తారు.


