బ్యాండ్‌ లేదు.. బరాత్‌ లేదు..సింపుల్‌గా పెళ్లిచేసుకున్న ఐఏఎస్‌ జంట | IAS Couple Simple Wedding Ceremony At The Collectors Court In Alwar Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

బ్యాండ్‌ లేదు.. బరాత్‌ లేదు..సింపుల్‌గా పెళ్లిచేసుకున్న ఐఏఎస్‌ జంట

Feb 20 2026 12:12 PM | Updated on Feb 20 2026 12:37 PM

IAS Couple simple wedding ceremony at the Collectors Court in Alwar

ఈ రోజుల్లో పెళ్లిళ్లు ఏ రేంజ్‌లో గ్రాండ్‌గా జరుగుతున్నాయో తెలిసిందే. అందులోనూ అత్యున్నత హోదాలో ఉన్నవాళ్ల పెళ్లిళ్లు కళ్లు చెదిరిపోయే రేంజ్‌లో వీఐపీలతో అత్యంత కోలహలంగా జరుగుతాయి. అలాంటిది ఈ ఐఏఎస్‌ దంపతులు ప్రేమకు సరికొత్త అర్థం చెప్పేలా చాలా సింపుల్‌గా పెళ్లిచేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. మధురమైన దాంపత్యానికి ఆడంబరంతో పనిలేదని ఎలుగెత్తి చాటారు. ప్రస్తుతం ఈ దంపతుల పెళ్లి సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.

ఆ దంపతులే మాధవ్ భరద్వాజ్-అదితి వర్ష్నీలు. ఎలాంటి హంగు ఆర్భాటం జోలికి పోకుండా సింపుల్‌గా రాజస్థాన్‌ అల్వార్‌ సచివాలయంలో పెళ్లిచేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. అక్కడ ఉన్న సిబ్బంది సైతం ఆ వివాహాన్ని చూసి విస్తుపోయారు. ప్రభుత్వ కార్యాలయాన్ని తమ వివాహానికి వేదికగా, రాజస్థాన్‌ జిల్లా కలెక్టర్ అర్పితా శుక్లా సమక్షంలో దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. దాంతో ఈ జంట వివాహం వార్తల్లో నిలిచింది. 

బ్యాండ్‌ లేదు, బరాత్‌ లేదు, వీఐపీ అతిథులు లేరు. కేవలం తల్లిదండ్రులు, తోబుట్టువుల సమక్షంలో కలెక్టర్‌ ఛాంబర్‌లో దండలు మార్చుకున్నారు. ప్రభుత్వ కార్యాలయం సచివాలమయే వివాహ వేదికగా మారింది. ఈ ఇద్దరూ కూడా 2023 బ్యాచ్‌కు చెందిన యువ ఐఏఎస్‌లు. ముస్సోరీకి చెందిన మాధవ్, ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన అదితిలిద్దరూ ఐఏఎస్ శిక్షణ సమయంలోనే ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. 

అప్పటి నుంచి వారి మధ్య బంధం కొనసాగుతోంది. అయితే ఇరు కుటుంబాల అంగీకారం కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా రెండు కుటుంబాలు పెళ్లికి గ్రీన్‌సిగ్నల్స్ ఇచ్చేశాయి. దీంతో ఎగిరి గంతేసిన జంట.. పెళ్లి మాత్రం చాలా సింపుల్‌గా ముగించేశారు. కాగా, మాధవ్ భరద్వాజ్ యూపీఎస్సీ 2022లో లోకోమోటర్ డిజేబిలిటీ విభాగంలో ఆల్ ఇండియా ర్యాంక్ 536ని కైవసం చేసుకుని ఐఏఎస్‌ అయ్యారు. ఐఐఎం అహ్మదాబాద్ నుంచి MBA పూర్తి చేసిన ఆయన, భారతదేశంలో అత్యంత కఠినమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి శారీరక సవాళ్లను అధిగమించారు. మాధవ్‌ మైక్రోసాఫ్ట్ ఉద్యోగం నుంచి సివిల్ సర్వీసెస్‌కు మారారు.

ఇక అదితి వర్ష్నీ 2022లో యూపీఎస్సీ తొలి ప్రయత్నంలోనే ఆల్‌ ఇండియా 57 ర్యాంక్‌ని సంపాదించి ఐఏఎస్‌ అయ్యారు. తండ్రి వ్యాపారవేత్త. అయితే మాధవ్ భరద్వాజ్ ప్రస్తుతం రాజస్థాన్‌ అల్వార్‌లో SDM (సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌)గా పనిచేస్తున్నారు. భార్య అదితి వర్ష్నీ ప్రస్తుతం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో SDM(సబ్‌ డివిజినల్‌ మెజిస్ట్రేట్‌)గా ఉన్నారు.

(చదవండి: అరుదైన కేన్సర్‌లతో పోరాడిన యువ యోధురాలు..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement