Nandyala
-
వెళ్లొస్తానమ్మా.. మళ్లీవస్తా
● డ్రైనేజీలో పసికందు ● ఊపిరాడక నవజాత శిశువు మృతి ● కోవెలకుంట్లలో హృదయ విదారక ఘటనతొమ్మిది నెలలు మోశావ్ పేగుతెంచి ప్రాణం పోశావ్ కళ్లుతెరిచేలోగా కనమరుగయ్యావ్ నీ స్పర్శకూడా తగలకుండానే దూరంగా విసిరేశావ్ పొత్తిళ్లలో ఉండాల్సిన నన్ను మురుగుకుంటలో వేశావ్ నేనేం చేశానమ్మా..నన్నెందుకు వద్దనుకున్నావ్ తప్పుచేశావా.. తప్పక వదిలించుకున్నావా..! నీ కష్టమేమో..కన్న ప్రేమనే వద్దనుకున్నావ్ నీకోసం ఊపిరి బిగబట్టి వెతికా పాలిస్తావని నోరు తెరిస్తే మురుగనీరు.. అందుకే నా ఊపిరి నేనే ఆపేసుకున్నా వెళ్లొస్తానమ్మా.. నీ మురిపాల కోసం మరుజన్మలో మళ్లీవస్తా బొడ్డకూడా ఊడని ఆ పసికందుకు మాటలొస్తే ఇలాగే చెబుతాడేమో.. కోవెలకుంట్ల గడ్డవీధిలో డ్రెయినేజిలో ఓ మగశిశువు మృతదేహం లభ్యమైంది. కాల్వలో బోర్లా పడటంతో ఊపిరాడక శిశువు మృతి చెందింది. మంగళవారం తెల్లవారుజామున చుట్టుపక్కల మహిళలు ఇంటి ముందు కసువు ఊడ్చుకుంటున్న సమయంలో డ్రెయినేజిలో ఉన్న శిశువును గుర్తించారు. తీసి చూడగా అప్పటికే మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ మల్లికార్జునరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. ప్రసవించిన తర్వాత శిశువును తల్లే కాల్వలో పడేసిందా, ఇతర వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. అంగన్వాడీ కార్యకర్త మంజుల సహకారంతో శిశువు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం విక్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. – కోవెలకుంట్ల -
అగ్ని ప్రమాదంతోనే బాలిక మృతి
నందికొట్కూరు: స్థానిక బీఆర్ఆర్ నగర్లో సోమవారం ఇంటర్ విద్యార్థి మంటల్లో ఆహుతైన ఘటనకు అగ్నిప్రమాదమే కారణంగా పోలీసులు తేల్చారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మంగళవారం పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు... వెల్దుర్తి మండలంలోని రామళ్లకోట జెడ్పీ హైస్కూల్లో మృతురాలు, ఇదే ఘటనలో గాయపడిన యువకుడు 10వ తరగతి వరకూ కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత బాలిక నందికొట్కూరులోని తాత దగ్గర ఉంటూ స్థానికంగా ఓ కళాశాలలో ఇంటర్లో చేరింది. ఆ యువకుడు అప్పుడప్పుడూ ఆమె కోసం నందికొట్కూరుకు వచ్చేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 8వ తేదీ రాత్రి సుమారు 11 గంటలకు బీఆర్ఆర్ నగర్‌లోని బాలిక ఇంటివద్దకు యువకుడు వచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ స్టోర్ రూమ్‌లోకి వెళ్లి దోమల నివారణకు ఉపయోగించే జెట్ కాయిల్ అంటించుకొని నిద్రించారు. ఆ సమీపంలోనే పెయింట్‌లో కలిపే టిన్నర్ మూత లేకుండా ఉండింది. వీరు నిద్రిస్తున్న సమయంలో దుప్పటి ప్రమాదవశాత్తు టిన్నర్‌కు తగలడంతో అది కిందకు ఒలికి జెట్ కాయిల్‌కు తగలడంతో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో నిద్రలో ఉన్న బాలికకు మంటలు అంటుకున్నాయి. అప్పటికే గది లోపల గడియ వేసుకోవడంతో వారు బయటకు రాలేకపోయారు. మంటలు పూర్తిగా వ్యాపించడంతో బాలిక శరీరమంతా కాలి అక్కడికక్కడే చనిపోయింది. గాయాలతో బయటపడిన యువకుడు ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటివరకూ చేసిన దర్యాప్తు మేరకు ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా తేలిందని ఎస్పీ తెలిపారు. అన్ని రకాల రిపోర్ట్స్ పెండింగ్‌లో ఉన్నందున అవి వచ్చిన తర్వాత కేసులో తదుపరి చర్య ఉంటుందని చెప్పారు. కాగా, ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా అంతకుముందు సంఘటనా స్థలాన్ని మరోసారి పరిశీలించారు. సమావేశంలో డీఎస్పీ రామాంజనేయులు నాయక్, సీఐలు ప్రవీణ్‌కుమార్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, ఎస్ఐలు తిరుపాల్, ఓబులేసు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. టిన్నర్‌కు జెట్ కాయిల్ తగలడంతో మంటలు మంచానికి మంటలు వ్యాపించడంతో బాలిక సజీవ దహనం విలేకరుల సమావేశంలో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా వెల్లడి -
బిల్లులందక అప్పుల భోజనం
అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వప్రాథమిక విద్యనభ్యసిస్తున్న చిన్నారులకు ప్రతి రోజు మెనూ ప్రకారం భోజనం అందించాలి. ఒక్కో చిన్నారికి రోజుకు 75 గ్రాముల బియ్యం, 15 గ్రాముల కందిపప్పు, ఐదు గ్రాముల నూనె మాత్రమే ప్రభుత్వం కేటాయిస్తోంది. అలాగే వంట తయారీకి సంబంధించి ఒక్కో చిన్నారిపై రోజుకు రూ. 1.50 పైసలు, గ్యాస్ చార్జీల కింద 50 పైసల చొప్పున నెలలో 25 రోజుల పనిదినాలకు చెల్లిస్తోంది. ఈ మొత్తంతో చిన్నారులకు పౌష్టికాహారం అందజేయాల్సి ఉంది. ప్రస్తుతం కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే బిల్లులు సరిపోక అంగన్వాడీ కార్యకర్తలు సొంతంగా కొంత మొత్తం చెల్లించి చిన్నారులకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్నారు. అరకొరగా ఇస్తున్న కూరగాయలు, గ్యాస్ బిల్లులు సైతం నాలుగు నెలల నుంచి విడుదల చేయకపోవడంతో అంగన్వాడీలు ఆందోళన చెందుతున్నారు. కూరగాయల షాపుల్లో నెలల తరబడి అప్పులు పేరుకుపోయాయి. ప్రతి రోజు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించే సర్కారు సక్రమంగా బిల్లులు చెల్లించాలనే విషయాన్ని మాత్రం విస్మరిస్తుందని వాపోతున్నారు. మార్కెట్లో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వకపోగా పాత మెనూ చార్జీలను సైతం నెలల తరబడి అందజేయకపోతే ఎలా అని అంగన్వాడీలు ప్రశ్నిస్తున్నారు. -
నాలుగు నెలలుగా అందని బిల్లులు
అంగన్వాడీ కేంద్రాలకు నాలుగు నెలల నుంచి కూరగాయలు, నిత్యావసర సరుకులు, గ్యాస్ బిల్లులు అందటం లేదు. గత కొన్ని నెలల నుంచి మార్కెట్లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వం పాత బిల్లులను అందజేస్తుండటంతో మధ్యాహ్న భోజన పథక నిర్వహణ భారంగా మారింది. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని మెనూ చార్జీలను పెంచడంతో పాటు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి. – వెంకటలక్ష్మి, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, కోవెలకుంట్ల బలోపేతం చేయాలి జిల్లాలో పూర్వప్రాథమిక విద్యను అందిస్తున్న అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలి. కేంద్రాల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలి. సొంత భవనాలు లేని అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించాలి. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలి. – సుధాకర్, సీఐటీయూ నాయకుడు, కోవెలకుంట్ల -
కూటమి ప్రభుత్వంపై పోరుబాట
కల్లూరు: అన్నదాతలను నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వంపై పోరుబాట పడుతున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం కాటసాని తన స్వగృహంలో పార్టీ నాయకులతో కలిసి ‘అన్నదాతకు అండగా వైఎస్సార్సీపీ’ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 13న రైతుల కోసం... రైతులతో కలిసి నంద్యాలలోని ఉదయానంద హోటల్ దగ్గర నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అక్కడ జిల్లా కలెక్టర్‌ను కలిసి రైతుల సమస్యలపై వినతి ప్రతం అందిస్తామన్నారు. అన్నదాతకు అండగా నిలిచేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ‘అన్నదాత సుఖీభవ’ అంటూ మోసం ఎన్నికల ముందు ఓట్ల కోసం చంద్రబాబు రైతులకు వివిధ హామీలు ఇచ్చారని కాటసాని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి ఆరునెలలవుతున్నా ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. దీంతో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను కూటమి సర్కారు నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. గతంలో అన్ని రకాల సేవలు ఆర్బీకేల్లో అందేవన్నారు. ఏటా రూ. 13,500 చొప్పున పెట్టుబడి సాయం లభించేదన్నారు. కూటమి నాయకులు అన్నదాత సుఖీభవ పేరుతో రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల్లో ప్రకటించి మోసం చేశారన్నారు. ఖరీఫ్ సీజన్ ముగిసినా ఇప్పటి వరకు నయాపైసా ఇవ్వలేదని చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉచిత పంట బీమా అమలు చేసి రైతులను ఆదుకుంటే నేడు బాబు సర్కారు ఆ పథకానికి ఏకంగా ఎసరు పెట్టిందని మండిపడ్డారు. పంట బీమా సొమ్మును రైతులే చెల్లించాలంటే వారికి ఆర్థికంగా భారమవుతుందన్నారు. గతంలో పంటలు ఈ–క్రాప్ చేసుకుంటే చాలు బీమా వర్తించేదన్నారు. రైతు కష్టం దళారుల పాలుకూటమి ప్రభుత్వంలో రైతులకు కష్టం తగ్గ ఫలితం దొరకడం లేదని కాటసాని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిటుబాట ధర లేక నష్టపోతున్నారన్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో దిగుబడులు భారీగా తగ్గయన్నారు. వరి ధ్యానం రంగు మారిందన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వాటిని తక్కువ ధరకు దళారులకు విక్రయించాల్సి వస్తుందన్నారు. గత ప్రభుత్వం దళారులు లేని వ్యవస్థను అమలు చేసిందన్నారు. అన్ని రకాల పంటలను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేసేదన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా ఈ పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. రైతులను నమ్మించి మోసం చేసిన సర్కారు ఆరునెలలైనా ఒక్క మేలు చేయలేదు 13 అన్నదాతలకు అండగా భారీ ర్యాలీ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి -
రబీలో ఆరుతడి పంటలే
నంద్యాల: రబీ సీజన్లో సాగునీటి కాలువల కింద ఉన్న రైతులు ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని జిల్లా ఇన్చార్జ్, రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక వాణిజ్య పనుల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నీటి పారుదల సలహా మండలి, జిల్లా అభివృద్ధిపై మంత్రి కేశవ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, రాష్ట్ర రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎరబ్రోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు వరదరాజుల రెడ్డి, కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, గౌరు చరితారెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, భూమా అఖిలప్రియ, గిత్త జయసూర్య, జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ ఇతర జిల్లాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జ్ మంత్రి మాట్లాడుతూ తెలుగు గంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్ కింద ఆరుతడి పంటలకు మాత్రమే వారబందీ పద్ధతిలో మార్చి 31 వరకు సాగునీటిని విడుదల చేస్తామన్నారు. శ్రీశైల జలాశయంలో నీటి లభ్యతను బట్టి వరి పంటకు నీటి విడుదలపై త్వరలో తెలియజేస్తామన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ మాట్లాడుతూ కేసీ కెనాలకు సంబంధించి స్థిరీకరించిన ఆయకట్టుకు నీటిని సరఫరా చేయాలంటే గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణమే శాశ్వత పరిష్కారం అన్నారు. జిల్లా అభివృద్ధే ధ్యేయంగా పని చేయండి... జిల్లా అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను ఆదేశించారు. రైస్ మిల్లు ట్రేడర్లతో సమావేశం నిర్వహించి వరిరైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్‌ను ఆదేశించారు. మరో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ జాతీయా రహదారులు, రైల్వే, సాగు నీటి ప్రాజెక్ట్‌లకు అవసరమైన భూసేకరణకు ఫారెస్ట్ అధికారులు సహకరించాలని చెప్పారు. పాత్రికేయులకు నో ఎంట్రీ కలెక్టరేట్లో మంత్రి పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశానికి పాత్రికేయులను అనుమతించలేదు. 5 నిమిషాల్లో ఫొటోలు, వీడియోలు తీసుకొని బయటకు వెళ్లాలని, సమావేశ వివరాలు తామే అందిస్తామని డీపీఆర్ఓ మల్లికార్జున పేర్కొన్నారు. దీంతో చేసేదేమీలేక పాత్రికేయులు అక్కడి నుంచి వెనుతిరిగారు. వారబందీ పద్ధతిలో మార్చి 31 వరకు సాగునీరు ఐఏబీ సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్ -
ఆదోని మెడికల్ కాలేజీలో పోస్టులు రద్దు
కర్నూలు (హాస్పిటల్): గతంలో జారీ చేసిన రెండు నోటిఫికేషన్లలో ఆదోని మెడికల్ కళాశాల, ఆదోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ పోస్టుల భర్తీని రద్దు చేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టి నరసమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రద్దు చేసిన పోస్టుల వివరాలు, ప్రస్తుతం భర్తీ చేస్తున్న కర్నూలు, నంద్యాల మెడికల్ కళాశాలలు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కర్నూలు గవర్నమెంట్ నర్సింగ్ కళాశాల పోస్టుల ఖాళీలు, రోస్టర్ పాయింట్ల వివరాలు, కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రభుత్వ వెబ్సైట్లు https:// kurnool.ap.gov.in, https://nandyal.ap.gov.in, కర్నూలు మెడికల్ కళాశాల వెబ్సైట్ https:// kurnool medical college.ac.inలలో అభ్యర్థుల సమాచారం నిమిత్తం ఉంచామన్నారు. -
గత ప్రభుత్వ హయాంలో రుచికర భోజనం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో వినూత్న మార్పులు చేసింది. తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి మాతా, శిశు మరణాల రేటును పూర్తి స్థాయిలో తగ్గించే దిశగా చర్యలు తీసుకుంది. నాడు– నేడు కార్యక్రమం ద్వారా అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించింది. సొంత భవనాలు లేని పలు కేంద్రాలకు అన్ని వసతులతో నూతన భవనాలు నిర్మించింది. మరికొన్నింటికి మరమ్మతులు చేపట్టి సౌకర్యాలు కల్పించింది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంతోనే ఆరోగ్యకర సమాజం సాధ్యమని అందుకు అంగన్వాడీ కేంద్రాలే వేదికని అప్పటి ప్రభుత్వం భావించింది. కేంద్రాల్లో చిన్నారులకు ఆటపాటలతో విద్య నేర్పించడంతోపాటు మధ్యాహ్న భోజన వసతి, తల్లులకు పౌష్టికాహార కిట్లు అందిస్తూ తల్లి, బిడ్డ ఆరోగ్యానికి భరోసా కల్పించింది. కేంద్రాల్లో 3–6 సంవత్సరాల్లోపు చిన్నారులకు సరికొత్త మెనూతో రుచికర వంటకాలతో భోజనం అందజేసింది. ఇందులో నాణ్యత లోపించకుండా అవసరమైన చర్యలు తీసుకుంది. ప్రస్తుత కూటమి పాలనలో పెరిగిన ధరలకు తోడు బిల్లులు అందకపోవడంతో చిన్నారులకు నాణ్యమైన భోజనం అందని పరిస్థితి నెలకొంది. -
అప్పు చేసి పప్పుకూడు!
ఒకవైపు ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు..మరోవైపు పెరగని మెస్‌చార్జీలు..దీనికితోడు నెలల తరబడి అందని పాతబిల్లులు వెరసి అంగన్వాడీ కేంద్రాల్లో అప్పు చేసి పప్పుకూడులా మధ్యాహ్న భోజనం పథకం తయారైంది. దీంతో వాటిలో పూర్వ ప్రాథమిక విద్యనందిస్తున్న చిన్నారులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. కూటమి ప్రభుత్వం నాలుగు నెలల నుంచి కూరగాయలు, నిత్యావసర సరుకులు, గ్యాస్ బిల్లులు చెల్లించకపోవడం, పాత చార్జీలతోనే మెనూ అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేయడంతో అంగన్వాడీ కేంద్రాలపై ధరల భారం పడింది. ఫలితంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాదిరిగా చిన్నారులకు రుచికర భోజనం అందించలేని పరిస్థితి నెలకొంది.సొంత భవనాలు లేని అంగన్వాడీలు 200కు పైగానాలుగునెలల పెండింగ్ బిల్లుల మొత్తంరూ.40 లక్షలుపూర్వ ప్రాథమిక విద్యనభ్యసిస్తున్న చిన్నారులు 39,462జిల్లాలో మెత్తం అంగన్వాడీలు 1,663 భవనాలరెండునెలల అద్దె బకాయి రూ.5 లక్షలుకోవెలకుంట్ల: జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఎనిమిది ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా 1,620 అంగన్వాడీ కేంద్రాలు, 43 మినీ కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాల్లో సున్నా నుంచి 6 నెలల లోపు 16,548 మంది చిన్నారులు, ఏడు నెలల నుంచి ఏడాదిలోపు 14,698 మంది, సంవత్సరం నుంచి మూడేళ్లలోపు 50,137 మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు 39,462 మంది చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు. మూడు సంవత్సరాలు పైబడిన చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లోనే మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. ఈ కేంద్రాలకు ప్రభుత్వం బియ్యం, కందిపప్పు, నూనె, పాలు, గుడ్లు సరఫరా చేస్తోంది. చిన్నారుల సంఖ్యకు అనుగుణంగా ఎంతమేరకు సరుకులు అవసరమో వారందించే జాబితా ప్రకారం పంపిణీ చేస్తారు. కందిపప్పు, రేషన్‌బియ్యం ప్రతి నెలా చౌక దుకాణాల ద్వారా తెచ్చుకోవాల్సి ఉంది. సరకులు తరలించేందుకు, కేంద్రాల్లో జాగ్రత్తగా నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి నగదు చెల్లించదు. అంగన్వాడీ కార్యకర్తలే అన్నీ భరించి తెచ్చుకోవాల్సి ఉంటుంది.అద్దెభవనాల్లో మౌలిక సదుపాయాల కొరతజిల్లాలో సొంత భవనాలు లేని అంగన్వాడీ కేంద్రాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. జిల్లాలో 200లకు పైగా అంగన్వాడీ కేంద్రాలను అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అద్దె భవనాలకు నెలకు రూ. 800 నుంచి రూ. వెయ్యి లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ. 1500 నుంచి రూ. 2 వేలు బాడుగ చెల్లిస్తున్నారు. ప్రభుత్వం బాడుగ రూపంలో తక్కువ మొత్తం చెల్లిస్తుండటంతో ఎలాంటి మౌలిక వసతులు లేని చిన్నపాటి ఇళ్లలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫ్యాన్లు, గాలి, వెలుతురు, మరుగుదొడ్లు, తదితర వసతులు లేని ఇళ్లలో అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. అద్దె భవనాలకు సైతం రెండు నెలల నుంచి బాడుగ చెల్లించపోవడం గమనార్హం. అరకొర వసతులున్న అద్దె భవనాల్లో కేంద్రాల నిర్వహణ భారంగా మారిందని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నేటి నుంచి ఎస్ఏ–1 పరీక్షలు
● ఉదయం ప్రైమరీ, 6,8,10 తరగతులు ● మధ్యాహ్నం 7,9 తరగతులకు పరీక్షలు నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్లో నేటి (బుధవారం)నుంచి సమ్మేటివ్ అసెస్మెంట్–1 పరీక్షలు మొదలు కానున్నాయి. జిల్లాలో మొత్తం 1400 పాఠశాలలుండగా 1,52,169 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రాథమిక తరగతులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 6,8,10 వ తరగతులకు 9.15 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 7,9 తరగతులకు చెందిన విద్యార్థులకు 1.15 నుంచి 4.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రైవేటు స్కూళ్లకు మినహా మిగిలిన అన్ని యాజమాన్యాలకు చెందిన స్కూళ్లకు ఎంఆర్సీల నుంచి ప్రశ్నాపత్రాలు తరలించాలని విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. నేటి నుంచి ఈనెల 19 వరకు ఎస్ఏ–1 పరీక్షలు జరుగుతాయి. సాధారణంగా గతంలో దసరా సెలవుల ముందుకానీ, ఆ తరువాత కానీ ఎస్ఏ–1 పరీక్షలు నిర్వహించే వారు. ఆరునెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ఏడాది సకాలంలో పుస్తకాలు అందించలేకపోవడం, టీచర్ల ట్రైనింగ్స్తో స్కూళ్లలో తరగతుల బోధన పూర్తి చేయకపోవడంతదితర కారణాలతో పరీక్షల నిర్వహణ ఆలస్యమైందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. -
Andhra Pradesh: ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థిని దారుణ హత్య
నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం బైరెడ్డి నగర్లో దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించలేదన్న కోపంతో ఓ ప్రేమోన్మాది బాలికపై సోమవారం తెల్లవారుజామున పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన బాలిక అక్కడికక్కడే మరణించగా.. ఇదే ఘటనలో ప్రేమోన్మాదికి కూడా 40 శాతం గాయాలయ్యాయి. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఓ బాలిక సామూహిత హత్యాచారం ఘటన మరకముందే నందికొట్కూరు పట్టణంలోని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యచేసిన సంఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది.ఏం జరిగిందంటే..కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని రామళ్లకోట గ్రామానికి చెందిన రామకృష్ణ, లక్ష్మి దంపతుల కుమార్తె లహరి (17). చిన్నతనంలో లహరి తండ్రి చనిపోవడంతో బాలిక అవ్వాతాతలు ఆమెను తమవద్దే ఉంచుకుని ఉన్నత చదువులు చదివిస్తామని నందికొట్కూరుకు తీసుకొచ్చి నంది జూనియర్ కళాశాలలో ఇంటర్లో చేర్పించారు. ప్రస్తుతం ఆమె రెండో సంవత్సరం చదువుతోంది. ఆదివారం రాత్రి లహరి అవ్వాతాత ఓ గదిలో పడుకోగా, చదువుకుంటానంటూ లహరి మరో గదిలో నిద్రించింది. ఏమైందో ఏమో ఆదివారం తెల్లవారుజామున లహరి ఉన్న గదిలోంచి ఒక్కసారిగా పొగలు, మంటలు వచ్చాయి. దీంతో లహరి అవ్వాతాత వెంటనే గట్టిగా కేకలు వేశారు. ఇరుగుపొరుగు వారు వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి చూసేసరికి లహరి పూర్తిగా కాలిపోయి అక్కడే మృతిచెందింది. అదే గదిలో వెల్దుర్తి మండలం కలుగోట్ల గ్రామానికి చెందిన బోయ ఆకుల సుబ్బారాయుడు, గిరిజా దంపతుల కుమారుడు రాఘవేంద్ర 40 శాతం కాలిన గాయాలతో కనిపించాడు. దీంతో పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 108 వాహనంలో రాఘవేంద్రకు ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం అందించేందుకు నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలోనే మృతిచెందిన లహరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.టెన్త్ వరకు ఇద్దరూ కలిసి చదువుకున్నారు..ఇక లహరి, రాఘవేంద్ర ఇద్దరూ 10వ తరగతి వరకు రామళ్లకోటలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో కలిసి చదువుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాఘవేంద్ర బాలికను ప్రేమించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన లహరి తల్లి తన కుమార్తెను తన తల్లిదండ్రుల వద్దకు పంపినట్లు సమాచారం. మరోవైపు.. పదో తరగతితో చదువు ఆపేసిన రాఘవేంద్ర ప్రస్తుతం పెళ్లిళ్లకు డెకరేషన్ పనులు పనిచేస్తున్నాడు. తరచూ నందికొట్కూరులోని బాలిక వద్దకు రాత్రి వేళ్లల్లో వచ్చిపోయేవాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. రెండు మూడ్రోజుల క్రితం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం అర్థరాత్రి కూడా బాలిక వద్దకు వచ్చిన రాఘవేంద్ర తెల్లవారుజామున ఆమెపై పెట్రోల్ పోసి చంపేశాడని బంధువుల చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ రామాంజునాయక్, సీఐలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్ఐలు చంద్రశేఖర్, సురేష్‌బాబు, ఓబులేసు పరిశీలించారు. అలాగే, నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా కూడా నందికొట్కూరులో లహరి ఉంటున్న ఇంటిని సందర్శించారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంఘటనపై సమగ్ర విచారణ చేపడతామన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి వాస్తవాలను వెల్లడిస్తామని చెప్పారు.వాడిని చంపేయండి..నా మనరాలిని పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేసిన వాడిని పోలీసులే చంపేయాలి. మీతో కాకపోతే వాడిని మాకు అప్పగించండి. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాం. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయాల్సిన నా మనవరాలిని అన్యాయంగా చంపేశాడు. అమ్మాయిలపై దాడులు చేసేవారిని పోలీసులు వదలకుండా కాల్చియాలి. వాడి మరణం చూసి ఎవరికీ ఇలాంటి ఆలోచనలు రాకూడదు. – పార్వతమ్మ, లహరి అవ్వ -
పింఛన్ ఉంటుందో..ఊడుతుందో!
● ప్రభుత్వం తనిఖీలతో సామాజిక పింఛన్‌దారుల్లో ఆందోళన ● ఎరుకల చెర్వులో 328, కానాలలో 416 పింఛన్ల తనిఖీ ● ఎవ్వరెవరి పింఛన్లు తీసివేయాలనే దానిపై అధికారులకు టీడీపీ నేతల దిశానిర్ధేశం చేసినట్లు ప్రచారంనంద్యాల మండలం కానాల పంచాయతీ పరిధిలోని హైస్కూల్ కొట్టాల గ్రామంలో నారాయణరెడ్డి అనే పింఛన్‌దారుడికి 70 ఏళ్లు ఉన్నాయి. ఈయన పదేళ్లుగా పింఛన్ తీసుకుటున్నాడు. సోమవారం సామాజిక పింఛన్ల తనిఖీ అధికారులు ఇంటి వద్దకెళ్లి బ్రాహ్మణపల్లె గ్రామంలో మీకు ఆరు ఎకరాల పొలం ఉందంటూ డాక్యుమెంట్లు చూపించారు. సెంటు పొలం కూడా లేదని చెప్పబోతుండగా పొలం లేనట్లుగా వన్‌బీ తీసుకొని వస్తేనే పింఛన్ ఉంటుందని అధికారులు చెప్పడంతో దిక్కులు చూడాల్సి వచ్చింది. ఈ పరిస్థితి నారాయణరెడ్డి ఒక్కడే కాదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు పింఛన్‌దారులు ఎదుర్కొంటున్నారు. వివిధ కారణాలను బూచిగా చూపి పింఛన్ల ఏరివేతకు కూటమి ప్రభుత్వం తనిఖీలు చేపట్టింది. -
ప్రజా ఫిర్యాదులపై దృష్టి సారించాలి
నంద్యాల: ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వినతులకు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. పెండింగులో ఉన్న 927 దరఖాస్తులను వెంటనే పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మల్లన్నకు శాస్త్రోక్తంగా సహస్రదీపార్చన శ్రీశైలంటెంపుల్: జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్లకు సోమవారం దేవస్థానం సహస్రదీపార్చన సేవ నిర్వహించింది. ముందుగా దేవాలయ ప్రాంగణంలోని పురాతన మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో సహస్రదీపార్చన పూజలు జరిపించారు. ఈ సేవలో భాగంగా మండపంలో వెయ్యి దీపాలను వెలిగించి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను వెండిరథంపై ఆశీనులు చేసి ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. నేడు జాబ్ మేళా నంద్యాల(న్యూటౌన్): పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళ తెలిపారు. జాబ్ మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను సోమవారం ఆమె ఆవిష్కరించారు. పది, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు వెంట విద్యార్హత పత్రాలు, ఆధార్‌కార్డు, రెండు ఫొటోలు తెచ్చుకోవాలని, మరింత సమాచారం కోసం సెల్ : 94402 24291 నంబరును సంప్రదించాలన్నారు. డ్యాంలో 120 టీఎంసీల నీరు శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయంలో సోమవారం సాయంత్రం సమయానికి 120.0754 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం డ్యాం నీటిమట్టం 864.30 అడుగులకు చేరుకుంది. డ్యాం పరిసరాల్లో ఆదివారం నుంచి సోమవారం వరకు 4.80 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. పంప్‌మోడ్ ఆపరేషన్ ద్వారా 12,941 క్యూసెక్కుల నీటిని భూగర్భ జలవిద్యుత్ కేంద్రం నుంచి మళ్లించారు. వర్షాధారంగా 4,713 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్ల పరిశీలన శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు పరిశీలించారు. సోమవారం ఆయన కై లాసద్వారం, హఠకేశ్వరం, క్యూ కాంప్లెక్స్ తదితర ప్రదేశాలను సందర్శించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ అటవీశాఖ సహకారంతో భీమునికొలను మెట్ల మార్గం, కై లాసద్వారం వద్ద జంగిల్ క్లియరెన్స్, కైలాసద్వారం నుంచి హటకేశ్వరం వరకు ఉన్న జంగిల్ క్లియరెన్స్‌తో పాటు, రోడ్డుకు గ్రావెల్ పనులు చేయాలని సూచించారు. కై లాసద్వారం వద్ద చలువ పందిళ్లు, తాత్కాలిక షెడ్లు, మంచినీటి వసతి, తాత్కాలిక విద్యుద్ధీకరణ పనులు ముందస్తుగా చేపట్టాలన్నారు. శ్రీశైల టీవీ ప్రసారాలు, అధ్యాత్మిక కార్యక్రమాలను భక్తులు తిలకించేందుకు వీలుగా క్యూకాంప్లెక్స్‌లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో దేవస్థాన ఇంజినీర్లు, శ్రీశైలం అటవీ శాఖ రేంజ్ అధికారి సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు. -
అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారారు
● నగళ్లపాడు పాల సొసైటీ డైరెక్టర్ల ఎన్నిక ప్రక్రియను అడ్డుకోవడం తగదు ● న్యాయం కోసం కోర్టుకెళ్తాం ● మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిచాగలమర్రి: అధికార పార్టీ నాయకులకు పోలీసులు తొత్తులుగా మారి పని చేస్తున్నారని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సాసీపీ నేత గంగుల బిజేంద్రారెడ్డి విమర్శించారు. మండలంలోని నగళ్లపాడు గ్రామంలో సోమవారం విజయ డెయిరీకి చెందిన రిజిస్టర్డ్ పాల సొసైటీ డైరెక్టర్ల ఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ జరగాలి. నామినేషన్ వేసేందుకు వచ్చిన ప్రస్తుత ఆ సొసైటీ చైర్మన్ గంగుల విజయసింహారెడ్డిని స్థానికేతరుడు అంటూ ఆళ్లగడ్డ రూరల్ సీఐ కంబగిరి రాముడు, చాగలమర్రి ఎస్ఐ రమేష్‌రెడ్డి అడ్డుకున్నారు. అలాగే నామినేషన్ల స్వీకరణ జరగకుండా రిటర్నింగ్ అధికారి చండ్రాయుడును సైతం ఊర్లోకి రానివ్వకుండా నిలిపివేశారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గంగుల అక్కడికి చేరుకుని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డైరెక్టర్ల ఎన్నిక ప్రక్రియను అడ్డుకోవడం సరికాదన్నారు. సొసైటీలోని 20 ఓట్లు వైఎస్సార్సీపీ మద్దతుదారులకే ఉన్నాయని, దీంతో డైరెక్టర్లుగా వారే గెలుపొందుతారని అధికారపార్టీ నాయకులు కుట్ర పన్నారన్నారు. ఇందుకు పోలీసులు సహకరించడం తగదన్నారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం సృష్టించి ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్, మండల అధ్యక్షుడు కుమార్‌రెడ్డి, ఆళ్లగడ్డ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
మన్నించుతల్లీ..
చదువులో అలలా ఎగసినా జీవితంలో ఓడిపోయావా తల్లీ తల్లి చాటు బిడ్డవనీ దయతలచలేకపోయాం ప్రేమ పేరుతో నీ ఆశలను కాల్చేశాం నీ ఆశయాన్నీ బుగ్గిచేశాం ఆ మృగమేదో నిను దహిస్తుంటే ఆపలేకపోయాం నీ ఇంట్లోనే నీకు రక్షణ కల్పించలేకపోయాం మమ్మల్ని క్షమించు తల్లీ... నిన్ను కాపాడలేని పాలకులను మన్నించు నువ్వేడున్నా ఇటువైపు చూడకు తల్లీ బూడదైన నీ శరీరానికి ఇక ఎన్ని రంగులు పులుముతారో పెట్రోలులో మండిన నీ హృదయాన్ని ఎంత గాయపరుస్తారో తప్పంతా నీదేనని దుర్మార్గులూ... నీ ప్రాణాలకు వెలకట్టే ‘అనిత’ర సాధ్యులున్నారమ్మా అందుకే ఇటువైపు రాకు తల్లీ ఏ లోకంలో ఉన్నా హాయిగా ఉండు.. మరు జన్మలోనైనా మానవమృగాల్లేని లోకంలో జన్మించు -
కేసీ పరిధిలో ఆయకట్టుకు నీరు లేనట్టే!
కర్నూలు సిటీ: రాయలసీమ జిల్లాలకు కృష్ణా, తుంగభద్ర నదులే ప్రధాన జల వనరులు. ఈ నీటిపై ఆధారపడి ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి కడప జిల్లాల్లోనే 6 లక్షలకుపైగా ఆయకట్టు ఆధార పడి ఉంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో ప్రస్తుతమున్న నీటిని తెలంగాణ ప్రభుత్వం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి విచ్చల విడిగా వాడుకుంటోంది. ఫలితంగా ఈ ప్రభావం సీమ జిల్లాల సాగుపై పడింది. ఇప్పటికే ఇంజినీర్లు రబీలో ఆరుతడి పంటలకు మాత్రమే వారబందీగా నీరు ఇస్తామని ప్రకటించడతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలో నేడు జరిగే సాగునీటి సలహా మండలి సమావేశంలో శ్రీశైలం నుంచి పవర్ జనరేషన్‌పై జిల్లా నేతలు గళం విప్పాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు శ్రీశైలం కనీన నీటి మట్టం 854 అడుగులు ఉండేటట్లు ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ఆయకట్టుదారులు కోరుకుంటున్నారు. నీరున్నా ఆరుతడి పంటలకే తెలుగుగంగ కాలువ పరిధిలో నంద్యాల జిల్లాలో 1.14 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ మొత్తానికి నీరు ఇచ్చేందుకు వెలుగోడు రిజర్వాయర్‌లో 15.787 టీఎంసీల నీరు ఉంది. అయితే, రబీలో వరి సాగు చేస్తే నీరు ఇవ్వలేమని, కేవలం ఆరుతడి పంటలకు, అది కూడా వారబందీగా ఇచ్చేందుకు సాధ్యమవుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెలుగుగంగ కాలువ ఆధునికీకరణ పనులు చేసి ఈ కాల్వ చరిత్రలో మొదటిసారి రబీ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు ఇచ్చింది. ఎస్ఆర్బీసీ పరిధిలో ప్రశ్నార్థకం 12.4 టీఎంసీల సామర్థ్యం ఉన్న గోరుకల్లు రిజర్వాయర్‌ను 2014లో చంద్రబాబు 3.36 టీఎంసీలు నిల్వ చేసి హడావుడిగా ప్రారంభించారు. ఫలితంగా రబీలో ఈ రిజర్వాయర్ ద్వారా ఒక్క ఎకరాకు సాగునీరు అందించలేకపోయారు. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకంగా 11.2 టీఎంసీలు గోరుకల్లులో నిల్వ ఉంచి ఎస్ఆర్బీసీ పరిధిలో 2021–22లో 94 వేల ఎకరాలు, 2022–23లో 1.13 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీరు అందించారు. హంద్రీనీవాకు క‘న్నీటి’ కష్టాలే...! హంద్రీనీవా కాలువ వెంబడి రైతులు పంటలు సాగు చేశారు. కాల్వలో 1688 క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రవహిస్తుంది. ఈ కాలువ కింద 40 వేల ఎకరాలకుపైగా సాగు చేశారు. కృష్ణగిరి, పందికోన రిజర్వాయర్లలో సైతం పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయలేదు. ఇలాంటి సమయంలో శ్రీశైలం రిజర్వాయర్‌లో తగ్గిపోతున్న నీటి మట్టంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. దీంతో పాటు 79 చెరువులకు నీరు ఇచ్చేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఇంత వరకు 30 చెరువులకు మాత్రమే నీటిని నింపారు. అన్ని చెరువులకు నీరు నింపి ఉంటే 10 వేల ఎకరాల ఆయకట్టు సాగు అయ్యేది. నీటి లభ్యత ఆధారంగా నీరిస్తాం పవర్ జనరేషన్ నిలిపి వేయాలని తెలంగాణ జెన్కోకు ఎన్ని సార్లు లేఖలు రాసినా, కేఆర్ఎంబీ వారు సైతం హెచ్చరించినా విద్యుత్ ఉత్పాదన నిలిపి వేయడం లేదు. వెలుగుగోడు, గోరుకల్లు రిజర్వాయర్లలో ఉండే నీటి ఆధారంగా ఆరుతడి పంటలకు నీరు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. కేసీ కెనాల్ పరిధిలో రెండో పంటకు నీరు ఇచ్చేందుకు సాధ్యం కాదు. – కబీర్ బాషా, జల వనరుల శాఖ కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ కర్నూలు–కడప కాలువ పరిధిలో కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాల్వకు 39.9 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. ఇందులో టీబీ డ్యాంలోని నిల్వ నీటి నుంచి 10 టీఎంసీలు, నది ప్రవాహం నుంచి 29.9 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు. తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని వినియోగించేందుకు మల్యాల దగ్గర రెండు పంపులు, ముచ్చమర్రి ఎత్తిపోతల పథకం చేపట్టారు. అయితే, శ్రీశైలం రిజర్వాయర్ నీటి నిల్వలో రోజు 3 టీఎంసీలకుపైగా పవర్ జనరేషన్ పేరుతో దిగువకు పోతుంది. మరోవైపు టీబీ డ్యాంలోకి ఈ ఏడాది వచ్చిన నీటి ఆధారంగా 9.08 టీఎంసీ నీరు కేటాయించారు. ఇందులో మనం చుక్క నీరు కూడా వాడుకోలేదు. అయితే, ఈ నీటిని తాగునీటి అవసరాల పేరుతో అనంతపురం జిల్లా పాలకులు హెచ్చెల్సీ ద్వారా మళ్లీంచుకునేందుకు సిద్ధమవుతుండడంతో ఇక్కడి రబీ ఆయకట్టుకు నీరు ఇవ్వలేమని జల వనరుల శాఖ ఇంజినీర్లు సంకేతాలు ఇస్తున్నారు. -
రబీ..అగమ్యగోచరం!
● ఉమ్మడి జిల్లాలో 6.95 లక్షల ఆయకట్టుకు కృష్ణా, తుంగభద్ర జలాలే ఆధారం ● తెలంగాణ సర్కారు ఇష్టారాజ్యంగా ఎడమ గట్టులో విద్యుత్ ఉత్పత్తి ● చోద్యం చూస్తున్న కూటమి ప్రభుత్వం ● సాగునీటి విడుదలపై కొరవడిన స్పష్టత ● నేడు సాగునీటి సలహా మండలి సమావేశం రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలవుతున్నా తాగు, సాగు నీటి గురించి పట్టించుకోవడంలేదు. ఎలాగోలా ఖరీఫ్ సీజన్ గడిచిపోయినా రబీ సీజన్లో జిల్లా రైతాంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. శ్రీశైలం జలాశయంలో నిల్వ ఉన్న నీటిని తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పాదన పేరుతో యథేచ్ఛగా వాడేస్తున్నా, టీబీ డ్యాంలోని మన నీటి వాటాను పొరుగు జిల్లా నాయకులు హెచ్చెల్సీ ద్వారా మళ్లీంచుకునేందుకు సిద్ధమవుతున్నా ఇక్కడి పాలకులు నోరుమెదపని పరిస్థితి. రబీకి నీటి విడుదలపై నేడు నంద్యాల కలెక్టరేట్లో సాగునీటి సలహామండలి సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం. -
మహిళలకు రక్షణ కరువైంది
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది. ఏపీని అత్యాచారాంధ్రప్రదేశ్‌గా కూటమి ప్రభుత్వం మార్చింది. ముచ్చుమర్రి సంఘటన మరువకముందే పట్టణంలో బాలిక లహరి ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురికావడం దారుణం. మహిళలు, విద్యార్థినులపై వరుసగా దాడులు, అత్యాచారాలు జరుగుతుంటే ప్రభుత్వ పెద్దలు వాటి కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గత ప్రభుత్వం మహిళలు, బాలికల రక్షణ కోసం దిశ పోలీసు స్టేషన్లు, దిశ యాప్‌ను తీసుకొచ్చింది. కూటమి సర్కారు వాటిని నిర్వీర్యం చేసింది. మహిళల రక్షణ గాలికొదిలేసింది. ఏదిఏమైనా బాలిక కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. – ధార సుధీర్, వైఎస్సార్సీపీ నందికొట్కూరు ఇన్చార్జ్ -
ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలి
ప్రేమోన్మాదిని బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు సోమవారం పట్టణంలోని పటేల్ సెంటర్లో రాస్తోరోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బాలికలు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. విద్యార్థినిపై పెట్రోల్‌పోసి నిప్పంటించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, అప్పుడే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావన్నారు. బాధిత కుటుంబానికి రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం పార్టీ నాయకులు రఘురామ్మూర్తి, రమేష్‌బాబు, శ్రీనివాసులు, మహనంది, దినేష్ జిల్లా ఎస్పీని కలిసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు. -
అమడగుంట్లలో ఉద్రిక్తత
కోడుమూరు రూరల్: మండలంలోని అమడగుంట్ల గ్రామంలో రూ.32లక్షల ఉపాధి నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రైన్ల పనులు అధికార టీడీపీలో చిచ్చు రేపాయి. టీడీపీకి చెందిన సర్పంచు వరలక్ష్మి గ్రామంలోని 4వ వార్డులో రూ.14 లక్షలతో సీసీ రోడ్డు పనులను చేపడుతున్నారు. గతంలోనే సర్పంచు ఇంటి ముందు సీసీ రోడ్డు ఉందని, మరోసారి రోడ్డు నిర్మాణం చేపట్టరాదంటూ టీడీపీలోని మరోవర్గానికి చెందిన క్రిష్ణారెడ్డి వర్గీయులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. అయినప్పటికీ సర్పంచు వర్గీయులు సోమవారం ఇదే ప్రాంతంలో సీసీ రోడ్డు, మురుగునీటి కాల్వల నిర్మాణ పనులను చేపడుతుండడంతో క్రిష్ణారెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న కోడుమూరు ఎస్ఐ శ్రీనివాసులు గ్రామానికి చేరుకుని మండల ఇంజినీర్ గంగరాజు, పంచాయతీ కార్యదర్శి శంకరమ్మలతో కలిసి ఇరువర్గాలతో చర్చించారు. సర్పంచు వర్గీయులు మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టడం లేదని, కేవలం డ్రైన్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. క్రిష్ణారెడ్డి వర్గీయులు మాట్లాడుతూ తాము అభివృద్ధి పనులను అడ్డుకోవడం లేదని, సర్పంచు ఇంటి వద్ద కాకుండా అవసరం ఉన్న ఎస్సీ, బీసీ కాలనీల్లో రోడ్డు వేయాలని, ఆలయం ఎదురుగా మురుగునీటి కాల్వ నిర్మాణం వద్దని కోరుతున్నామని చెప్పారు. దీంతో ఇరువర్గాలు మాట్లాడి మరోసారి గ్రామ పంచాయతీలో తీర్మానం చేసుకుని ఏకాభిప్రాయంతో పనులు చేసుకోవాలని, అంతవరకు ఎవరు కవ్వింపు చర్యలకు పాల్పడినా చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. పీఆర్ ఏఈ గంగరాజు మాట్లాడుతూ గ్రామంలోని మిగతా చోట్ల రోడ్డు పనులు యథావిధిగా జరుగుతాయన్నారు. టీడీపీలో చిచ్చురేపిన సీసీ రోడ్ల నిర్మాణ పనులు సర్పంచు ఇంటి ముందు రోడ్డు వేయకుండా కోర్టు స్టే సీసీ డ్రైన్ నిర్మాణ పనులను అడ్డుకున్న మరో వర్గం నేతలు -
ఆదోని మార్కెట్ యార్డు అభివృద్ధికి నిధుల మంజూరు
కర్నూలు(అగ్రికల్చర్): ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి రూ.1.38 కోట్ల నిధులు మంజూరైనట్లుగా మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు నారాయణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్కెట్లో చిన్నపాటి వర్షం కురిసినా డ్రైనేజీ పొంగి మార్కెట్లో లోతట్టు ప్రాంతాల్లోను వ్యవసాయ ఉత్పత్తులను ముంచెత్తుతోంది. ఈ ఏడాది పలు సారు డ్రైనేజీ పొంగడం వల్ల రైతులకు భారీగా నష్టం వాటిల్ల్లింది. ఈ దుస్థితిపై సాక్షి పలు కథనాలను ప్రచురించింది. వీటికి స్పందించిన జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా ఇటీవల మార్కెట్ యార్డులో పర్యటించి డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. అవసరమైన నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ ప్రతిపాదనలు పంపింది. ఇందులో భాగంగా అదనపు డ్రైనేజీ సౌకర్యం కల్పించేందుకు రూ.70 లక్షలు, డ్రైన్ కట్టర్, వరండా పైకప్పు అభివృద్ధికి రూ.28.50 లక్షలు, బోర్వెల్, పైపులైన్, ఆర్వోఆర్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.15 లక్షలు, రెండు టాయ్‌లెట్స్ బ్లాక్‌లు నిర్మించేందుకు రూ.25 లక్షలు మంజూరైనట్లు ఏడీ పేర్కొన్నారు. -
దంపతుల ఆత్మహత్యాయత్నం
బనగానపల్లె రూరల్: తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లాకు చెందిన దంపతులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన యాగంటి క్షేత్రంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ దుగ్గిరెడ్డి తెలిపిన వివరాలు.. గద్వాల జిల్లా ఐజకు చెందిన భార్గవ్, పల్లవి దంపతులు రెండు రోజుల క్రితం యాగంటి క్షేత్రానికి వచ్చారు. కుటుంబంలో నెలకొన్న ఆర్థిక సమస్యల కారణంగా పురుగు మందు తాగారు. గమనించిన స్థానికులు అంబులెన్స్‌లో బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. భార్గవ్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బంగారు వ్యాపారులకు టోకరా బొమ్మలసత్రం: నంద్యాలలోని 25 మంది బంగారు వ్యాపారుల నుంచి ఓ కేటుగాడు రూ.12 లక్షలకు టోకరా పెట్టిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక గాంధీచౌక్‌లో ఉన్న బంగారు వ్యాపారులకు ఒకరి తర్వాత మరొకరికి వివిధ నెంబర్ల నుంచి గుర్తుతెలియని దుండగుడు ఫోన్ చేశాడు. తాను వన్‌టౌన్ ఎస్ఐ అని చెప్పి దొంగల నుంచి బంగారు నగలు కొన్నారని తమపై కేసు నమోదు చేస్తామని బెదిరించాడు. కేసు నమోదు కాకుండా ఉండాలంటే కొంత నగదు ఫోన్‌పే ద్వారా చెల్లించాలని, ఆలస్యం చేయవద్దని బెదిరించాడు. దీంతో 25 మంది వ్యాపారులు ఒకరికి తెలియకుండా మరొకరు రూ.12 లక్షల వరకు నగదు బదిలీ చేశారు. తీరా స్టేషన్‌కు వెళ్లి పోలీసులను ఆరా తీయగా ఆ నంబర్లకు స్టేషన్లో ఉన్న ఎస్ఐకి ఎటువంటి సంబంధం లేదని సీఐ సుధాకర్‌రెడ్డి తేల్చి చెప్పారు. వ్యాపారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. సాఫ్ట్వేర్ సంస్థపై కేసు నమోదు బొమ్మలసత్రం: సాఫ్ట్ వేర్ ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుంచి రూ.98 లక్షల మేర వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఎస్ఎల్సీ సొల్యూషన్స్ సంస్థపై టూటౌన్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. సీఐ ఇస్మాయిల్ తెలిపిన వివరాలు.. స్థానిక టీటీడీ కల్యాణ మండపం సమీపంలో ఉప్పరి వెంకట్ హైదరాబాద్‌లోని గిజిలీజ్ సాఫ్ట్వేర్ సంస్థ సీఈవో రవిచంద్రారెడ్డి మరి కొంత మందితో కలిసి ఎస్ఎల్సీ సొల్యూషన్స్ పేరుతో సాఫ్ట్వేర్ సంస్థను నెలకొల్పారు. వివిధ రాష్ట్రాల్లో సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలిప్పిస్తామని దాదాపు 78 మంది నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి నుంచి రూ.1.20 లక్షల నగదు వసూలు చేశారు. దాదాపు రూ.98 లక్షలు వసూలు చేసి కంపెనీ బోర్డు తిప్పేసి నిర్వాహకులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాధితుడు మద్దిలేటి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ తెలిపారు. ఆకతాయికి జైలు శిక్ష బండిఆత్మకూరు: మండలంలోని కడమల కాలువ గ్రామానికి చెందిన పెద్దస్వామికి నంద్యాల సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రామిరెడ్డి గారి రాంభూపాల్ రెడ్డి 5 రోజులు జైలు శిక్ష విధించారని ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. పెద్దస్వామి మద్యం తాగి చుట్టుక్కల వారిని సభ్యత లేకుండా తిడుతున్నాడని గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అరెస్ట్ చేశారు. కేసు నమోదుచేసి నంద్యాల సెకండ్ క్లాస్ కోర్టులో హాజరు పరచగా 5 రోజులు జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించారని ఎస్ఐ తెలిపారు. చిన్నకోతతో బాలునికి గుండె ఆపరేషన్ కర్నూలు(హాస్పిటల్): చిన్నకోతతో బాలునికి గుండె ఆపరేషన్‌ను విజయవంతం చేసినట్లు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ సి. ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలు ఆయన వెల్లడించారు. నంద్యాల జిల్లా పాములపాడు మండలం మిట్టకందాల గ్రామానికి చెందిన ఖాజాబాషా(13)కు గుండెకు రంధ్రం ఉండటంతో కార్డియాలజీ విభాగం వైద్యులు కార్డియోథొరాసిక్ విభాగానికి రెఫర్ చేశారన్నారు. సాధారణంగా ఇలాంటి కేసులకు స్టెర్నం బోన్ కట్ చేసి ఆపరేషన్ చేస్తామని, రక్తస్రావం ఎక్కువగా ఉంటుందన్నారు. గాయం మానేందుకు సైతం సమయం ఎక్కువగా తీసుకుంటుందని తెలిపారు. 13 ఏళ్ల బాలుడు కావడంతో ఛాతి పక్కలో ఆరు సెంటీమీటర్ల కోతతో సోమవారం ఆపరేషన్న్ను విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. ఈ ఆపరేషన్‌లో మత్తుమందు వైద్యుడు కొండారెడ్డి, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర సహకారం అందించారన్నారు. ఇలాంటి ఆపరేషన్‌ను హైదరాబాద్, బెంగళూరులాంటి కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే చేస్తారని, దీనికి రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల దాకా వసూలు చేస్తారన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎన్టీఆర్ వైద్యసేవ కింద ఉచితంగా నిర్వహించినట్లు తెలిపారు. గుండెకు ఇలాంటి చిన్నకోత ఆపరేషన్‌ను రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం కర్నూలులోనే నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
వెన్నెల.. రాత్రంతా చీకట్లోనే!
● లోన్ యాప్ వేధింపులు తాళలేక ఆత్మహత్యకు యత్నించిన తెనాలి యువతి ● శ్రీశైలం శిఖరం వద్ద 20 అడుగుల లోయలోకి దూకిన వైనం ● సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన పోలీసులు శ్రీశైలం: లోన్ యాప్ వేధింపులను భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి లోయలోకి దూకినా ఆమె అదృష్టం బాగుండి స్వల్ప గాయాలతో బయటపడింది. కాగా చిమ్మచీకట్లో, దట్టమైన అడవిలో ఎటు వెళ్లాలో తెలియక రాత్రంతా అక్కడే ఉండిపోయింది. భక్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అతికష్టంపై యువతిని రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వన్‌టౌన్ సీఐ ప్రసాద్‌రావు తెలిపిన వివరాలు.. గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన బుర్రి వెన్నెల.. తన తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో వైద్యం కోసమని సెల్‌ఫోన్‌లోని లోన్ యాప్ ద్వారా రూ.15 వేలు రుణం తీసుకుంది. నెలనెలా కంతులు కట్టింది. 5 రెట్లు ఎక్కువే కట్టినా ఇంకా డబ్బు కట్టాలని, లేకపోతే వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో పెడతామని యాప్ నిర్వాహకులు వేధిస్తుండటంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈక్రమంలో ఆదివారం సాయంత్రానికి శ్రీశైలం చేరుకుని శిఖరేశ్వరం వద్ద రక్షణ గోడపై సెల్ ఫోన్, పర్సు పెట్టి 20 అడుగుల ఫెన్సింగ్‌పై నుంచి కిందకు దూకింది. అక్కడి భక్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకునేలోపే చీకటి పడటంతో గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం వేకువజామున తిరిగి గాలింపు చర్యలు చేపట్టి యువతిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా తక్కువ వడ్డీతో లోన్లు ఇస్తామని సెల్‌ఫోన్ ద్వారా వచ్చే మెసేజ్‌లను నమ్మి మోసపోవద్దని సీఐ తెలిపారు. యువతిని కాపాడిన పోలీసు సిబ్బంది రవికుమార్, వెంకట్ నారాయణ, నాగవేణి, రఘునాథుడు, రాజేంద్ర కుమార్, ప్రసాద్, లాల్సాలతో పాటు సహకరించిన అటవీశాఖ సిబ్బంది, దేవస్థానం ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను సీఐ అభినందించారు. -
ఉద్యోగాల పేరుతో మోసం
కర్నూలు: స్థానిక రేడియో స్టేషన్లో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని కర్నూలుకు చెందిన చంద్రశేఖర్, శ్రీకాంత్ రూ.18 లక్షలు తీసుకుని మోసం చేశారని మండల పరిధిలోని ఎదురూరు గ్రామానికి చెందిన శివకుమార్ ఎస్పీ బిందు మాధవ్‌కు ఫిర్యాదు చేశాడు. రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి సమస్యలను తెలుసుకుని, వినతులు స్వీకరించారు. పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్)కు వచ్చిన 123 ఫిర్యాదులను విచారించి త్వరితగతిన న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీఐ శివశంకర్ పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● పెద్దాస్పత్రిత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని కర్నూలుకు చెందిన శివాజీ రూ.50 వేలు తీసుకుని మోసం చేశాడని నూతనపల్లె గ్రామానికి చెందిన వంశీనాథ్ ఫిర్యాదు చేశారు. ● కోట్ల రైల్వేస్టేషన్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని జొహరాపురానికి చెందిన శ్రీనివాసులు ఏవీఆర్ ఇన్ఫోటెక్ అనే పేరుతో ఐడీ కార్డు ఇచ్చి రూ.1.50 లక్షలు తీసుకుని మోసం చేశాడని కల్లూరు మండలానికి చెందిన ప్రసాద్ ఫిర్యాదు చేశారు. ● కర్నూలుకు చెందిన రెహాన్ అనే వ్యక్తి న్యాయవాదిగా పరిచయం చేసుకుని బ్యాంకులోన్ ఇప్పిస్తానని, భూ సమస్యలు పరిష్కరిస్తానని రూ.1.50 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఓర్వకల్లు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు. ● పంచలింగాల వద్ద ఎకరా 80 సెంట్ల పొలానికి డబ్బు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని అశోక్‌నగర్‌కు చెందిన శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు. ● ఆస్పరి మండలం కై రుప్పల గ్రామానికి చెందిన కుమ్మరి వీరభద్రి కొందరు వ్యక్తులతో కలిసి ఫోర్జరీ సంతకాలతో తనకు చెందిన ఎకరా 54 సెంట్ల పొలాన్ని ఆక్రమించుకున్నారని అదే గ్రామానికి చెందిన విజయ్‌మోహన్ ఫిర్యాదు చేశారు. ఎస్పీని ఆశ్రయించిన బాధితులు పీజీఆర్ఎస్కు 123 ఫిర్యాదులు -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ఆదోని అర్బన్: ఆలూరు మంలం కమ్మరచేడు గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి బైకు అదుపు తప్పిన ప్రమాదంలో పట్టణంలోని గణేష్ సర్కిల్లో నివాసముంటున్న విజయ్‌కుమార్(28) మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. విజయ్‌కుమార్, అతని భార్య శిరీష, కుమార్తె అయోధ్యతో కలిసి చిప్పగిరి మండలం బెల్డోణ గ్రామానికి వెళ్లారు. ఆదివారం రాత్రి తిరిగి ఆదోనికి బయలుదేరారు. కమ్మరచేడు సమీపంలో బైకు అదుపుతప్పి కింద పడ్డారు. ప్రమాదంలో విజయ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య, కుమార్తెకు స్వల్ప గాయాల య్యాయి. ఆలూరు పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు. పీజీఆర్ఎస్లో 70 ఫిర్యాదులు బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి 70 ఫిర్యాదులు అందాయి. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్‌బాబు మాట్లాడుతూ అధికంగా ఆర్థిక నేరాలకు సంబంధించిన, కుటుంబ కలహాలు, అత్తింటి వేధింపులపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయన్నారు. ఆయా స్టేషన్ అధికారులకు పంపి, త్వరగా పరిష్కరించి న్యాయం చేకూరేలా చూస్తామన్నారు. ఫిర్యాదులు పునరావృతం కాకుండా ఆయా స్టేషన్ల అధికారులు జాగ్రత్త తీసుకోవాలని సూచించామన్నారు.