మద్దతు ధరతో కందుల కొనుగోలు
కర్నూలు(అగ్రికల్చర్): ఈ ఏడాది రబీలో పండించిన కందులను మార్క్‌ఫెడ్ ద్వారా నేషనల్ కో–ఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మద్దతు ధరతో కొనుగోలు చేయనుంది. కర్నూలు జిల్లాలో 14,788 టన్నులు, నంద్యాల జిల్లాలో 25,875 క్వింటాళ్లు మద్దతు ధర రూ.8వేలతో కొనుగోలు చేయనుంది. నంద్యాల జిల్లాలో మినుములు కూడా 11,254 టన్నులు కొనుగోలు చేయనుంది. నేషనల్ కో–ఆపరేటివ్ కన్జూమర్స్ పెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు మార్క్‌ఫెడ్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. మార్కెట్‌లోకి దాదాపు నెల రోజులుగా కందులు వస్తున్నాయి. మద్దతు ధరతో కొనుగోలు చేయడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. మద్దతు ధర రూ.8వేలు ఉండగా.. మార్కెట్‌లో రైతులకు గరిష్టంగా రూ.7 వేల వరకే ధర లభిస్తోంది. దీంతో రైతులు నష్టపోతున్నారు. ఎట్టకేలకు నేషనల్ కో–ఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మద్దతు ధరతో కొనుగోళ్లు చేయనుండటంతో రైతులు ఊరట చెందుతున్నారు. జిల్లాలోని 16 మండలాల్లో కంది సాగు ఎక్కువగా ఉంది. ఈ మండలాల్లోని ఆర్‌బీకేల వారీగా కందులు కొనుగోలు చేయనున్నారు. కంది సాగు తక్కువగా ఉన్న మండలాల రైతులు పక్క మండలంలో అమ్ముకోవచ్చని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ జి.రాజు తెలిపారు. ఖరీఫ్‌లో కంది సాగు చేసి ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులు సంబంధిత ఆర్‌బీకేల్లో పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు.


