breaking news
Kurnool
-
అప్రకటిత కోతలు ఎత్తేయండి
ఆదోని: మండలంలోని గణేకల్లు సబ్‌స్టేషన్ ముందు ప్రధాన రహదారిపై సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు వీరారెడ్డి, డి.రామాంజనేయులు ఆధ్వర్యంలో గురువారం రాత్రి స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఎలాంటి సమాచారం లేకుండా విద్యుత్ కోత విధించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం విషయం తెలుసుకుందామంటే అధికారుల ఫోన్లు కూడా పనిచేయడం లేదన్నారు. అప్రకటిత విద్యుత్ కోతలను ఎత్తివేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. రెండు రోజులుగా కోతలు కోవెలకుంట్ల: బనగానపల్లె నియోజకవర్గంలోని పలు మండలాల్లో లోడ్ రిలీఫ్(ఎల్ఆర్) పేరిట రెండు రోజులుగా రాత్రి వేళల్లో విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బుధవారం రాత్రి 6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విద్యుత్ కోత విధించగా.. గురువారం సాయంత్రం 6.45 గంటల నుంచి రాత్రి 8.20 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపేశారు. రెండు రోజుల నుంచి ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ప్రజలు గంటల తరబడి చీకట్లో మగ్గుతున్నారు. ఉక్కపోతతో పాటు దోమల మోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. -
అప్పుల ఉరికి అన్నదాత బలి
కోడుమూరు రూరల్: వానలు లేక, పంటలు పండక తీవ్రంగా నష్టపోయిన కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన రైతు బోయ లక్ష్మన్న (35) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బోయ లక్ష్మన్న తనకున్న రెండెకరాల పొలంతో పాటు మరో ఎనిమిది ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. ఈ ఏడాది ఎనిమిది ఎకరాల్లో పత్తి, రెండెకరాల్లో కంది పంట సాగు చేశాడు. వానల్లేక పంటలన్నీ మొలక దశలోనే ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. పంటల సాగుకు, కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు రూ.10 లక్షలకు చేరుకున్నాయి. గురువారం భార్య శారదమ్మ అన్నకు రాఖీ కట్టేందుకు పుట్టింటికి వెళ్లారు. మధ్యాహ్నం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో రైతు బోయ లక్ష్మన్న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం కుమారుడు సోమేష్ హైస్కూల్ నుంచి ఇంటికి రాగా తండ్రి బోయ లక్ష్మన్న ఉరేసుకుని ఉండటాన్ని గమనించి లబోదిబోమంటూ చుట్టుపక్కల వారిని పిలుచుకువచ్చాడు. అప్పటికే రైతు బోయ లక్ష్మన్న మృతి చెంది ఉన్నాడు. రైతుకు భార్య శారదమ్మతో పాటు, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. కుటుంబ పెద్ద దిక్కు మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
సబ్‌స్టేషన్ ముట్టడి
కౌతాళం: విద్యుత్ సరఫరాను సక్రమంగా అందించాలని కోరుతూ హాల్వి సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన ఘటన బుధవారం రాత్రి 11గంటలకు చోటు చేసుకుంది. హాల్వి, గొతులదొడ్డి, వల్లూరు గ్రామస్తులు వందలాదిగా తరలివచ్చి హాల్వి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. విద్యుత్ కోతలు సాయంత్రం 5 నుంచి రాత్రి 11గంటల వరకు విధించడం పట్ల ఆయా గ్రామస్తులు సిబ్బందితో వాగ్వాదానికి దిగి సబ్‌స్టేషన్‌కు తాళం వేశారు. రాత్రిళ్లు విద్యుత్ సరఫరా నిలిపేస్తే ఎలా బతికేదని వాపోయారు. ఏఈ, డీఈని పిలిపించండని రెండు గంటల పాటు సిబ్బందిని లోపలికి పోకుండా అడ్డుకున్నారు. రాత్రి 11గంటల తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో శాంతించారు. పరిస్థితిలో మార్పు రాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. -
అడుగంటిన ‘ప్రథమ’ ఆశలు!
కర్నూలు సిటీ: కర్ణాటక రాష్ట్రంలోని హొస్పేట్ వద్ద ఉన్న తుంగభద్ర జలాశయంలో 89 టీఎంసీల నీరు ఉన్నా..ఔట్ ఫ్లో 9,819 క్యూసెక్కులు ఉన్నా.. కర్నూలు జిల్లాలోని తుంగభద్ర నదిలో చుక్కనీరు కనిపించడం లేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నది తడారి ఎడారిగా కనిపిస్తోంది. నదిపై నిర్మించిన సుంకేసుల బ్యారేజీలో నీరు అడుగంటిపోయింది. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజల తాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్న నీటిని సైతం బుధవారం ఉదయం బంద్ చేశారు. ప్రథమ పూజ్యుడైన వినాయక నిమజ్జనానికి నీరు ఇవ్వలేమని మంత్రి టీజీ భరత్ చెప్పారు. దీంతో ముందస్తుగా డబ్బులు ఇచ్చి పెద్ద విగ్రహాలను తీసుకొచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదీ దుస్థితి.. తుంగభద్ర నదిలో ఏటా 250 నుంచి 400 టీఎంసీలకుపైగా నీటి లభ్యత ఉంది. ఇందులో 10 శాతం నీటిని కూడా వినియోగించుకోని పరిస్థితులు ఉన్నాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల్లో సైతం డ్యాంకు 89 టీఎంసీల నీరు వచ్చి చేరింది. అయితే ఆ నీరుతో కనీసం ప్రజల తాగునీటి అవసరాలు కూడా తీర్చలేని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. టీబీ డ్యాంలో నీటి లభ్యతలో దమాషా ప్రకారం కేసీ కెనాల్‌కు ఐదు టీఎంసీల నీటి వాటా వస్తుంది. ఆ నీటిని నది ద్వారా విడుదల చేస్తే 20 శాతం కూడా రాదని ఇంజినీర్లు అంటున్నారు. అయితే తుంగభద్ర దిగువ కాలువ నీటిని జీడీపీ (గాజులదిన్నెప్రాజెక్టు)కు మళ్లించి..అక్కడి నుంచి కేబీసీ కాలువ ద్వారా జి.శింగవరం సమీపంలో కేసీ కాలువకు తీసుకొచ్చేందుకు అవకాశం ఉంది. ఈ విషయం ఇంజినీర్లకు సైతం తెలిసినా ఎందుకు ఆ వైపుగా మంత్రిని, కలెక్టర్‌ను ఒప్పించలేకపోతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేసీలోనే నిమజ్ఞనం చేసుకోవచ్చు గాజులదిన్నె ప్రాజెక్టులో ప్రస్తుతం 2.4 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టులోకి హంద్రీ–నీవా కాలువ 110 కి.మీ దగ్గర వైఎస్సార్సీపీ హయాంలో నిర్మించిన స్లూయిజ్ నుంచి 250 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో పాటు తుంగభద్ర దిగువకాలువ పరిధిలోని తాగునీటి ట్యాంకులు నింపిన తరువాత ఆ నీటిని జీడీపీలోకి మళ్లించేందుకు అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి ఎడమ కాలువ నీటిని విడుదల చేసి 6 కి.మీ. దగ్గర క్రాస్ రెగ్యులేటర్ క్లోజ్ చేస్తే ఆ నీరు కర్నూలు బ్రాంచ్ కెనాల్ 7.78 కి.మీ దగ్గర నుంచి 42 కి.మీ. వరకు ప్రవహిస్తుంది. ఆ నీటిని ఉల్చాల దగ్గర ఓ వాగులోకి వదిలేస్తే జి.శింగవరం దగ్గర కేసీ కాలువలోకి చేరుతుంది. ఆ నీటితో కర్నూలు తాగునీటి అవసరాలు, ఆ నీటిలోనే కర్నూలు నగరంతో పాటు చుట్టు గ్రామాల ప్రజలు వినాయక నిమజ్జనం చేసుకునేందుకు అవకాశం ఉంది. కానీ టీడీపీ నేతలు ఆ దిశగా ఆలోచన చేయలేదు. విగ్రహాలు చిన్నవి ఏర్పాటు చేసుకోండి అంటూ భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తుంగభద్ర నదిలో కనిపించని నీరు వెలవెలబోతున్న సుంకేసుల జలాశయం వినాయక నిమజ్జనానికి తప్పని తిప్పలు జీడీపీ నుంచి నీరిచ్చేందుకు అవకాశమున్నా పట్టించుకోని ప్రభుత్వం గుండ్రేవుల నిర్మిస్తే..! కేసీ కాలువకు తుంగభద్ర జలాల్లో 31.9 టీఎంసీల నీటిని కేటాయించినా నిల్వ చేసుకునేందుకు రిజర్వాయర్లు లేవు. సుంకేసుల లో 1.2, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వా యర్‌లో 2.965 టీఎంసీలకు మాత్రమే నిల్వ చేయవచ్చు. ఏటేటా నీటి ప్రవాహ రోజులు తగ్గిపోవడంతో కేసీ కెనాల్ కింద సాగుకు, తాగునీటి అవసరాలకు ఇబ్బందులు పడా ల్సి వస్తోంది. కేడబ్ల్యూడీటీ–1 కేటాయింపుల మేరకు నీటిని నిల్వ చేసుకునేందుకు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్న గుండ్రేవులు ప్రాజెక్టును(20 టీఎంసీల నిల్వ సామర్థ్యం) నిర్మిస్తే నీటి కష్టాలు తొలుగుతాయి. కర్నూలు నగరంతో పాటు చుట్టూ ఉండే పల్లెల్లో వినాయక నిమజ్ఞనానికి ఎలాంటి నీటి కష్టాలు లేకుండా ఉంటాయి. -
రికార్డుల నిర్వహణ లేదు.. కార్మికులకు భద్రత లేదు!
● ఆధ్య అగ్రిక్రాప్ సైన్స్ కంపెనీలో అధికారుల తనిఖీలు ● లోపాలను గుర్తించి హెచ్చరించిన వైనం జూపాడుబంగ్లా: తంగడంచ రెవెన్యూ పరిధిలోని ఆధ్య అగ్రిక్రాప్సైన్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో నిర్వహణ లోపాలు అధికారుల తనిఖీలో వెలుగు చూశాయి. గురువారం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గంగాధర్‌రావు, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు టెక్నికల్ ఏఓ ఆయూబ్‌బాషా, ఏడీఏ గిరీష్, ఏఓ కృష్ణారెడ్డి కంపెనీని తనిఖీ చేశారు. తనిఖీ నిమిత్తం అధికారులు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న కంపెనీ నిర్వాహకులు ఉత్పత్తి నిలిపేసి లేబర్‌ను బయటకు పంపించేశారు. కంపెనీలో నిల్వ చేసిన డబ్బాలు, ప్రొడక్ట్ కవరింగ్ లేబుల్స్, ల్యాబ్‌లను అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం తయారు చేస్తున్న 24 రసాయనిక మందులకు సంబంధించి యాంటీ డోస్ ఇంజెక్షన్లు కంపెనీలో అందుబాటులో లేకపోవటంతో నిర్వాహకులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 80 మంది లేబర్ పనిచేస్తుండగా ప్రమాదకరమైన కెమికల్స్ వల్ల ప్రాణాపాయం సంభవిస్తే యాంటీడోస్ లేకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రథమ చికిత్స గది, చికిత్స నిర్వహించేందుకు డాక్టర్‌ను నియమించకపోవటంతో నిర్వాహకులపై మండిపడ్డారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడుతూ ఆధ్య కంపెనీలో 124 రకాల ప్రొడెక్టుల తయారీకి అనుమతి ఉన్నప్పటికీ ప్రస్తుతం 24 రకాల మందులు తయారుచేస్తున్నట్లు తెలిపారు. కంపెనీ నిర్వహణలో లోపాలను గుర్తించి సరి చేసుకోవాలని కంపెనీ యాజమాన్యానికి సూచించామన్నారు. తనిఖీ నివేదికను తయారు చేసి జిల్లా కలెక్టర్‌తో పాటు కమిషనర్‌కు అందజేస్తామన్నారు. -
కర్నూలు జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురి విషాదం!
ఆంధ్రప్రదేశ్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సమీపంలోని పీసీ ప్యాపిలి సబ్‌స్టేషన్ వద్ద బైక్‌ను ఐచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.మృతులను వజ్రకరూరు గ్రామానికి చెందిన జైనుల్లా, మహాబూబ్ బాషా, మహమ్మద్ రఫీగా గుర్తించారు. అయితే, వీరు ముగ్గురూ ఒకే బైక్‌పై ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఉరవకొండలో కోర్టు పనిమీద వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. వీరు ప్రయాణం చేస్తున్నటువంటి బైక్ పీసీ ప్యాపిలి సబ్‌స్టేషన్ సమీపంలోకి చేరుకున్న తరుణంలో ప్రమాదావశాత్తు ఐచర్ వాహనాన్ని బలంగా ఢీకొన్నట్లు తెలుస్తోంది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
వినాయక చవితి ప్రశాంతంగా జరుపుకోవాలి
కర్నూలు (టౌన్): వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనోత్సవాలను కులమతాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. బుధవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, వివిధ మతాల పెద్దలు, శాంతి కమిటీ సభ్యులు, పోలీసు ఉన్నతాధికారులతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. కర్నూలు జిల్లా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందన్నారు. చట్టాన్ని గౌరవిస్తూ ఎవరి మనోభావాలకు భంగం కలుగకుండా ఉత్సవాలను నిర్వహించుకోవాలన్నారు. వాట్సప్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాద్యమాల్లో వచ్చే నిర్ధారణ లేని సందేశాలు, రెచ్చగొట్టే పోస్టులు, వీడియోలను గుడ్డిగా నమ్మవద్దన్నారు. అలాగే బాధ్యతారహితంగా ఇతరులకు షేర్ చేయవద్దన్నారు. అనుమానాస్పద సమాచారం ఉంటే తక్షణం పోలీసులకు తెలియజేయాలన్నారు. చట్ట ప్రకారం డీజేల శబ్ధం 70 డెసిబుల్స్ కంటే ఎక్కువ ఉంటే వాటిని సీజ్ చేస్తామన్నారు. వినాయక ఘాట్‌లో తగినంత నీటి లభ్యత లేని పక్షంలో నగర శివారులోని నన్నూరు టోల్‌ప్లాజా, ఉలిందకొండ ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లకు తగిన చర్యలు ఉంటాయన్నారు. కర్నూలు నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, 9వ రోజు నిమజ్జన శోభాయాత్రలు ప్రశాంతంగా కొనసాగుతాయని సమావేశంలో గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, మత పెద్దలు హామీ ఇచ్చారు. కర్నూలు డీఎస్పీ రాఘవేంద్ర, సీఐలు, మత పెద్దలు, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రేషన్ బియ్యం అక్రమ నిల్వపై దాడులు హొళగుంద: మండల కేంద్రంలోని ఈబీసీ, సినిమా రోడ్ తదితర ప్రాంతాల్లోని ఇళ్లలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని బుధవారం సాయంత్రం డీఎస్ఓ (డిస్ట్రిక్ సివిల్ సప్లై ఆఫీసర్) రాజారఘువీర్ దాడులు చేసి పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కర్నూలు నుంచి వచ్చిన ఆయన సీఎస్‌డీటీ దీప, తహసీల్దార్ లక్ష్మిరాజు, ఎస్ఐ దిలీప్‌కుమార్‌తో కలిసి దాడులు చేపట్టారు. ఈబీసీ కాలనిలోని ఓ వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 15 బస్తాల (6.25 క్వీంటాళ్లు) రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. అలాగే సినిమా రోడ్డులోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 77 క్వింటాళ్లు (189 బస్తాలు) బియ్యాన్ని దాడులు చేసి పట్టుకోగా ఆ ఇంటి వారితో పాటు స్థానికులు డీఎస్ఓ, ఇతర అధికారులతో వాగ్వాదానికి దిగారు. అవి రేషన్ బియ్యం కాదని, రైతులు పండించిన బియ్యమని వాదించారు. అయితే బియ్యం నిల్వలో పీడీఎస్ బియ్యం కలిసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వాటిని టెస్టింగ్ కోసం కర్నూలు ల్యాబ్‌కు పంపుతున్నట్లు తహసీల్దార్ లక్ష్మిరాజు తెలిపారు. రేషన్ బియ్యం కలిసి ఉంటే బాధ్యులపై కేసులు నమోదు చేసి బియ్యం బస్తాలను సీజ్ చేస్తామన్నారు. టెస్టింగ్ రిపోర్ట్ గురువారం సాయంత్రం వస్తుందని ఆయన వెల్లడించారు. మొత్తం బియ్యం బస్తాలను రెవెన్యూ అధికారుల ఆధీనంలో ఉంచారు. డీటీ నిజాముద్దీన్ తదితరులు వెంట ఉన్నారు. -
అయ్యో‘పాప’ం
● ఆడబిడ్డను వదిలేసిన తల్లిదండ్రులు ఆలూరు: ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామ సమీపంలోని బ్రహ్మయ్య దేవాలయం వద్ద అప్పడప్పుడే పుట్టిన ఆడ శిశువును వదిలేసి వెళ్లిన సంఘటన బుధవారం రాత్రి 9:30 గంటల సమయంలో జరిగింది. దేవాలయం ముందు కళ్లు తెరవని, అప్పుడప్పుడే పుట్టిన శిశువును వదిలేసిన విషయాన్ని దేవాలయం సమీపంలోని కొందరు గుర్తించారు. ఈ విషయాన్ని కమ్మరచేడు గ్రామస్తులకు దేవాలయ నిర్వాహకులు సమాచారం చేరవేశారు. కమ్మరచేడు గ్రామానికి చెందిన ఖాశీం అనే వ్యక్తి పసికందును ఇంటికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కొందరు పోలీసుల సమక్షంలో ఆదోని ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అమ్మ ఒడిలో సేదతీరాల్సిన పసిబిడ్డకు ఆసుపత్రిలో చికిత్సలు చేస్తున్నారు. -
మానసిక వైద్యులను సంప్రదించాలి
ఇటీవల కాలంలో ఆత్మహత్యకు పాల్పడే వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వారిని గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రిలోని మానసిక వైద్యులను సంప్రదించి చికిత్స అందేలా చేయాలి. అక్కడి వైద్యులు మందులతో పాటు కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి సాధారణ జీవితం గడిపేలా చేస్తారు. –డాక్టర్ చైతన్యకుమార్ నేరెళ్ల, మానసిక వైద్యులు, జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం ఆత్మహత్యలపై మాట్లాడకూడదని ఇప్పటికీ అపోహలు ఉన్నాయి. కానీ దీని గురించి చర్చిస్తే చాలా వరకు ఆత్మహత్యలను నివారించవచ్చు. ఇటీవల కాలంలో బెట్టింగ్‌కు అలవాటు పడి ఎక్కువ మంది యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పెద్దలు ఈ విషయమై చర్చించి పరిష్కారం కనుగొనాలి. –డాక్టర్ కె.నాగిరెడ్డి, సైకియాట్రిస్ట్, కర్నూలు -
మద్యం షాపుల లైసెన్సు మరో ఏడాది పునరుద్ధరించండి
కర్నూలు (టౌన్): మద్యం షాపుల లైసెన్సుల గడువు ఈ నెల 30న ముగుస్తున్నందున మరో ఏడాది పాటు రెన్యూవల్ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో కర్నూలు, నంద్యాల జిల్లాల స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కర్నూలు, నంద్యాల జిల్లాలను నాటుసారా రహిత జిల్లాలుగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నాటుసారా తయారు చేయకుండా పాత నేరస్తులపై నిఘా ఉంచాలని వారందరినీ సంబంధిత తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేయాలని ఆదేశించారు. పొరుగు రాష్ట్రాల మద్యం, నకిలీ మద్యం జిల్లాలోకి ప్రవేశించకుండా పాత నేరస్థులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల మద్యం కేసుల్లో, గ్రేవ్ క్రైం కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసి అరెస్టు చేయకుండా ఉన్న పెండింగ్ కేసుల ముద్దాయిలను సత్వరమే అరెస్టు చేయాలని దర్యాప్తు అనంతరం చార్జ్‌షీటు కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. ప్రొహిబిషన్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, ఎకై ్సజ్ అధికారి సుధీర్ బాబు (కర్నూలు), రవికుమార్ (నంద్యాల), ఏఈఎస్‌లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణారెడ్డి, విజయకుమార్, కర్నూలు, నంద్యాల ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
ఘనంగా ఎల్లార్తి ఉరుసు
● శేక్షావలి, షాషావలి దర్గాలను దర్శించుకున్న భక్తులు ● గంధం మోసిన పీఠాధిపతి నూర్బాబాహొళగుంద: రాష్ట్రంలో ప్రాధాన్యత కలిగిన దర్గాల్లో ఒకటైన ఎల్లార్తి శేక్షావలి, షాషావలి తాతల దర్గా ఉరుసులో భాగంగా బుధవారం ఉరుసుతో పాటు తెల్లవారుజామున దర్గాలకు చేరిన గంధం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మత సామరస్యానికి ప్రతాకగా నిలిచే ఈ ఉత్సవాలను తిలకించడానికి రాష్ట్ర నలమూలల నుంచే కాకా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలి వచ్చారు. పురవీధుల్లో ఊరేగిన గంధం తెల్లవారుజామున దర్గా పీఠాధిపతి నూర్‌బాబా దర్గాలో ప్రత్యేక ఫాతెహాలు చదివి అక్కడి నుంచి గంధం మోసుకుని గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి తిరిగి దర్గాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు, పకీరులు ప్రదర్శించిన కర్రసాము విన్యాసాలు, నృత్యాలు, పాటలు అమితంగా ఆకట్టుకున్నాయి. గంధం దర్గాకు చేరడంతో భక్తులు ఆయా దర్గాల్లో సమాధులను దర్శించుకుని నైవేద్యాలు, చాదర్లు సమర్పించి ప్రత్యేక ఫాతెహాలు చేశారు. బోర్డు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉరుసులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య పర్యవేక్షణలో ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో హొళగుంద ఎస్ఐ దిలీప్‌కుమార్‌తో పాటు 60 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. గురువారం జియారత్ కార్యక్రమంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవంలో భక్తులకు ఎస్ఎస్వీ ఆధ్వర్యంలో ట్యాంకర్లతో మంచినీటి సరఫరా, ఆదోని మధు హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. -
తక్షణమే ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయాలి
కర్నూలు(సెంట్రల్): తక్షణమే ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేసింది. బుధవారం ఆయా సంఘాల ఆధ్వర్యంలో గాయత్రీ ఎస్టేట్ నుంచి బిర్లాగేటు వరకు నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర, అబ్దుల్లా, రంగప్ప మాట్లాడుతూ పోలీసు పోస్టుల సంఖ్యను పెంచాలని కాకినాడలో నిరుద్యోగులు శాంతియుతంగా చేపట్టిన ఆందోళనపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం అన్యాయమన్నారు. నిరుద్యోగులపై అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తునట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే ధ్యేయమని చెప్పిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తోందని విమర్శించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ తమ ప్రభుత్వం వస్తే ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ఉంటుందని పదేపదే చెప్పారని.. మరి ఇప్పుడు అహంకారం పెరిగిందా అని ప్రశ్నించారు. ఇప్పటికై నా నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్ 11,639 పోస్టులతో ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజాపక్షమే
● ‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం కావాలి ● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి కల్లూరు: ప్రజల తరఫున నిలబడి వైఎస్సార్సీపీ నిరంతరం పోరాటం చేస్తోందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ఆ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పిలుపునిచ్చారు. కల్లూరు అర్బన్ ముజఫర్‌నగర్ ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో బుధవారం సాయంత్రం పాణ్యం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పార్టీ కోసం పని చేసే నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా ఉంటామన్నారు. మున్సిపల్, పంచాయతీ రాజ్ ఎన్నికల ఎప్పుడు వచ్చిన ఎదుర్కొనే విధంగా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. మున్సిపాలిటీ, గ్రామాల్లో ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకుని వారి పక్షాన నిలబడి నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులు ఏం మాట్లాడినా భయపడాల్సిన అవసరం లేదన్నారు. డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అనుమానాస్పద అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలకు తాము ఎప్పుడు వ్యతిరేకం కాదని, రైతుల భూములు తీసుకుంటే ఆకుటుంబాల పిల్లలకు, ఆ గ్రామంలోని చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. పరిశ్రమల అభివృద్ధి పేరుతో స్థానిక ప్రజలకు అన్యాయం జరగకూడదన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్ గుండం సూర్య ప్రకాష్‌రెడ్డి, జెడ్పీటీసీ చంద్రశేఖర్‌రెడ్డి, నియోజకవర్గంలోని నాయకులు గాజుల శ్వేతారెడ్డి, అక్కిమి హనుమంతురెడ్డి, మీదివేముల ప్రభాకర్‌రెడ్డి, దండు లక్ష్మీకాంతరెడ్డి, నాగలక్ష్మీరెడ్డి, నరసింహులు, నారాయణరెడ్డి, శివశంకర్‌రెడ్డి, సూర్యానారాయణరెడ్డి, శ్రీథర్‌రెడ్డి, రమణారెడ్డి, శివారెడ్డి, సుమంత్, శ్రీకాంత్‌రెడ్డి, తిరుపాల్, రామలక్ష్మణుడు, కరుణాకర్‌రెడ్డి, యువరాజ్, సత్యంరెడ్డి, , ఎంపీటీసలు, మాజీ సర్పంచ్‌లు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు. -
విజృంభిస్తున్న విషజ్వరాలు
కోసిగి: మండల పరిధిలోని జుమ్మాలదిన్నె గ్రామంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గత వారం రోజులుగా గ్రామంలో 20 మందికి పైగా జ్వరం బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతూ అవస్థలు పడుతున్నారు. గ్రామానికి చెందిన రాగయ్య అనే వ్యక్తి ఆదోనిలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకోగా రూ.60 వేలు ఖర్చయినట్లు వాపోయారు. అలాగే తిక్కయ్య, కృష్ణ, మల్లేశ్వరితో పాటు మరో ముగ్గురు జ్వరంతో ఆదోనిలోని ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. ప్రసాద్, సునీత దంపతుల కుమారుడు వైభవ్ తేజ్ అనే బాలుడికి మూడు రోజులుగా కోసిగిలో వైద్య సేవలు అందించినా జ్వరం తగ్గడం లేదని తల్లిదండ్రులు వాపోయారు. రాజు, సువర్ణమ్మ దంపతుల పిల్లలు జస్వన్, మహిమాలీ, ఈషా జ్వరంతో చికిత్స పొందుతున్నారు. మరికొందరు స్థానికంగా ఆర్ఎంపీ డాక్టర్ వద్ద చికిత్సలు చేయించుకున్నట్లు తెలిపారు. గ్రామం చుట్టూ మట్టి దిబ్బలు, గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడంతో దోమలు విజృంభిస్తున్నాయి. గ్రామంలో దోమల నివారణకు చర్యలు చేపట్టకపోవడంతో విషజ్వరాలు ప్రబలుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి దోమలు నివారణ చర్యలు, పారిశుద్ధ్య పనులు చేయించాలని కోరుతున్నారు. కుమారుడికి మూడు రోజులుగా జ్వరం తగ్గలేదని చూపుతున్న తండ్రి ఆస్పత్రిలో వారం రోజులు చికిత్స పొందిన రాగయ్యఆదోనిలో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిక్కయ్య -
మొక్క మొక్కకు నీటి తడి!
కౌతాళం: వరుణదేవా.. కరుణుంచు అని అన్నదాతలు వేడుకుంటున్నారు. వర్షాలు లేక రైతన్నలు సాగు చేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతన్నారు. కొందరు రైతులు ఎలాగైనా పంటలను కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఖర్చుతో కూడుకున్నా సరే వెనుకుంజ వేయకుండా ముందుకు సాగుతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. సాగు చేసిన మిరప పంటను కాపాడుకోవడానికి ట్యాంకర్ ద్వారా నీటిని తెప్పించి మగ్గుతో చెట్లకు పోస్తున్న దృశ్యం బుధవారం మండల పరిధిలోని బదినేహాల్ గ్రామంలో కనిపించింది. రైతు ముత్తమ్మ గారి నాగరాజు మిరప పైరు ఎండకుండా భార్య లక్ష్మితో పాటు కూలీల ద్వారా మొక్కలకు మగ్గుతో నీరు పోస్తున్నారు. తాను రెండెకరాల భూమిని కౌలుకు తీసుకుని ముందస్తుగా ఎకరాకు రూ.35 వేలు చొప్పున చెల్లించి పొలం సాగు చేసినట్లు రైతు తెలిపాడు. వర్షాభావ పరిస్థితుల వల్ల లేత దశలోనే పంట ఎండిపోతోందని ఇప్పడు కాపాడకపోతే పూర్తి నష్టం జరుగుతుందని చెప్పారు. పంటను కాపాడుకునేందుకు నీళ్ల ట్యాంకర్‌కు బాడుగకు తెచ్చుకుని మొక్కలకు పోస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కౌలుతో పాటు రూ.60 వేల వరకు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. మొక్కలకు నీళ్లు పోస్తే పెట్టిన పెట్టుబడైన వస్తుందన్న నమ్మకంతో పని చేస్తున్నట్లు రైతు నాగరాజు చెప్పారు. పంట చేతికొచ్చేటప్పటికి ఎంత ఖర్చవుతుందో అర్థం కావడం లేదని వాపోయారు. -
మెగా డీఎస్సీ అక్రమాలను ఆధారాలతో నిరూపిస్తాం
పత్తికొండ: మెగా డీఎస్సీ అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తామని, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి డిమాండ్ చేశారు. సోమవారం పత్తికొండలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో రోజుకో అక్రమం బయటకొస్తున్నా స్పందించేందుకు ఆ పార్టీ పెద్దలు జంకుతున్నారన్నారు. వెల్దుర్తి మండలం రత్నపల్లికి చెందిన ప్రభాకర్ కౌతాళం మండలం వల్లూరులో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తున్నాడన్నారు. ఇతను టెట్‌లో అర్హత సాధించలేదని, ఎక్కడా పోటీల్లో పాల్గొన్న దాఖలాలు కూడా లేవన్నారు. మరి ఆయనకు డీఎస్సీలో ఎలా ఉద్యోగం వచ్చిందో లోకేష్ సమాధానం చెప్పాలన్నారు. కమతం రమ్యశ్రీ, బంగారు మౌనిక 2018లో డీఎస్సీ రాసినప్పుడు బీసీ కేటగిరిలో దరఖాస్తు చేసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన 2025 మెగా డీఎస్సీలో మరో కేటగిరిలో దరఖాస్తు చేసుకుని ఉద్యోగాలు పొందారన్నారు. అది కూడా వారికి 75లోపు మార్కులు వచ్చాయని, ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంలో కులాలు మార్చుకుని ఉద్యోగాలు పొందుతున్న వింత ఘటనలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయన్నారు. కూటమి పెద్దల సహకారంతో నకలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు సమర్పించి అడ్డదారిలో ఇలాంటి వారు ఎందరో ఉద్యోగాలు పొందారని ఆరోపించారు. అది కూడా నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో చురుకుగా పొల్గొన్న వారికి అక్రమ దారిలో ఉద్యోగాలు కట్టబెట్టారన్నారు. అక్రమాలపై విచారణ పారదర్శకంగా చేపట్టి నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ కార్యదర్శి సోమశేఖర్, మేధావుల ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీరంగడు, ఎంపీపీ నారాయణ్‌దాస్ పాల్గొన్నారు. -
12న జాతీయ లోక్ అదాలత్
కర్నూలు(టౌన్): జిల్లాలోని అన్ని కోర్టుల ప్రాంగణాల్లో ఈనెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వాసు తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా కోర్టులోని కాన్ఫరెన్స్ హాలులో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కోర్టుల్లో పెండింగ్లోనివిల్, రాజీ కాదగిన కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఎకై ్సజ్ కేసులు, ఫ్యామిలీ కేసులు, చెక్‌బౌన్స్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కువ కేసులు, 10 సంవత్సరాలు పైబడిన సివిల్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు సహకారం అందించి ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాదర్శి లీలా వెంకట శేషాద్రి, ఉమ్మడి కర్నూలు జిల్లాల న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
కర్నూలు(సెంట్రల్): ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్‌తో పాటు జేసీ నూరుల్ ఖమర్ వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న ప్రతి అర్జీని ప్రాధాన్యతతో పరిశీలించి నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారులకు అందించే ఎండార్స్మెంట్లు స్పష్టంగా, సులభంగా అర్థమయ్యే ఉండాలన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలన్నారు. కార్యక్రమ డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రామసుబ్బయ్య, అనురాధ, శివప్రసాద్ రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియంవద పాల్గొన్నారు. -
యంగ్ లీడర్స్ డైలాగ్ పోటీల్లో పాల్గొనండి
కర్నూలు(హాస్పిటల్): జాతీయ యువజన దినోత్సవం(స్వామి వివేకానంద జయంతి)ని పురస్కరించుకుని వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్–2027 కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హులైన యువత ముందుకు రావాలని జిల్లా యువజన అధికారి(మై భారత్ కేంద్ర) కర్నూలు అధికారి పి.ఐజయ్య కోరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొనేందుకు 15 నుంచి 29 ఏళ్ల యువత అర్హులన్నారు. ఆరు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారన్నారు. వికసిత్ భారత్ ఛాలెంజ్ ట్రాక్, సాంస్కృతిక విభాగం(జానపద గీతం/నృత్యం, ఉపన్యాసం, పెయింటింగ్, కవిత్వం), డిజైన్ ఫర్ భారత్, హ్యాక్ ఫర్ సోషల్ కాజ్, యూత్ ఎంట్రపెన్యూర్ ఛాలెంజ్, యూత్ పార్లమెంట్ విభాగాలు ఉంటాయన్నారు. ఈ విభాగాల్లో రాష్ట్రస్థాయి విజేతలుగా నిలిచిన వారు జనవరి 12 నుంచి న్యూఢిల్లీలో జరిగే జాతీయ యువజన దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. పై ఆరు విభాగాల్లో సాంస్కృతిక విభాగం మినహా ఇతర ఐదు విభాగాల పోటీలు ఆన్లైన్లో నిర్వహిస్తారన్నారు. పూర్తి వివరాలకు అధికారిక పోర్టల్ mybharat.gov.inను సందర్శించాలన్నారు. -
రైతులు వర్షాభావ పరిస్థితులను అధిగమించాలి
గోనెగండ్ల: రైతులు వర్షాభావ పరిస్థితులను అధిగమించాలని, ఇందుకు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలని కేవీకే కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ కె. రాఘవేంద్ర చౌదరి, విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ టీ. చందన అన్నారు. సోమవారం కేవీకే బనవాసి ఆధ్వర్యంలో తాడిపత్రి జేసి దివాకర్ రెడ్డి వ్యవసాయ కళాశాల బీఎస్సీ అగ్రికల్చర్ చివరి సంవత్సరం 10 మంది విద్యార్థులతో కలసి పిల్లిగుండ్ల, ఒంటెడుదిన్నె గ్రామాల్లో పీఆర్ఏ పద్ధతులపై గ్రామీణ అవగాహన కార్యక్రమం చేపట్టారు. రైతులతో కలిసి గ్రామ పటం, రిసోర్స్ మ్యాపింగ్, ప్రాబ్లమ్ ట్రీ వంటి పీఆర్ఏ పద్ధతులను వివరించారు. మిరప, పత్తి, ఉల్లి తదితర పంటల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వర్షాభావ పరిస్థితుల్లో దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, గులాబీ రంగు పురుగు, పచ్చదోమ, తెల్లదోమ నివారణకు పసుపు నీలం జిగురు అట్టలను ఎకరానికి 10 చొప్పున ఏర్పాటు చేసుకోవాలన్నారు. పత్తిలో 13–0–45, మెగ్నీషి యం సల్ఫెట్ పిచికారి, వీఏఎం వినియోగం ద్వారా మొక్కల ఒత్తిడి తట్టుకునే శక్తి, పోషకాల వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవాలని రైతులకు శాస్త్రవేత్తలు సూచించారు. ఉల్లిలో తామర పురుగు, ఆకు మాడు సమస్యలకు ట్రైకోడెర్మా, సూడోమోనాస్ ఆధారిత జీవ నియంత్రణ పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో కేవీకే సిబ్బంది, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. -
హత్యాయత్నం కేసు ఛేదన
● మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడికి పాల్పడిన ఆరుగురు నిందితుల అరెస్ట్ఆదోని అర్బన్: మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలు నరసమ్మపై జరిగిన హత్యాయత్నం కేసును ఆదోని పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. దారుణానికి ఒడిగట్టిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. స్థానిక టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం డీఎస్పీ వెంకటరమణ, టూటౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. పట్టణానికి చెందిన నరసమ్మ భర్త శీను ఐదేళ్ల క్రితం కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం మున్సిపాలిటీలో శీను ఉద్యోగం నరసమ్మకు లభించగా, అక్కడే పనిచేస్తున్న చిన్న ఈరన్నతో ఆమెకు పరిచయం ఏర్పడి వీరిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేశారు. ఈ క్రమంలో ఈరన్న స్థానిక అమరావతినగర్‌కు చెందిన శిరీషను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే నరసమ్మతో ఉన్న సంబంధాన్ని ఈరన్న కొనసాగించడానికి ప్రయత్నించడంతో అతని కుటుంబీకులు అడ్డు చెప్పారు. ఈ క్రమంలో నరసమ్మపై గతంలో శిరీష తన కుటుంబీకులతో కలసి దాడి చేసింది. వారిపై నరసమ్మ ఫిర్యాదు మేరకు కేసులయ్యాయి. దీంతో పెద్దలతో పంచాయతీ జరిపిన అనంతరం ఈరన్న, శిరీష సాయిబాబానగర్‌లో ఉంటున్నారు. నరసమ్మతో దూరంగా ఉండడం, కుటుంబ పరిస్థితులతో మనస్తాపానికి గురైన ఈరన్న ఈ ఏడాది జూలై 26వ తేదీన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈరన్న మృతికి నరసమ్మనే కారణమని భావించిన శిరీష కక్ష పెంచుకుని హత్య చేయాలని పథకం వేశారు. ఈ మేరకు ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ కొత్త బస్టాండు సమీపంలో విధులు నిర్వహిస్తున్న నరసమ్మపై శిరీష, ఆమె తల్లి సుజాత, అత్తామామలు రాములమ్మ, ఈరన్న, ఆడబిడ్డ హేమ, చిన్నమ్మ అంజినమ్మలు దాడి చేశారు. కంట్లో కారం చల్లి పెట్రోల్ పోసి నిప్పంటించారు. నరసమ్మ కేకలు వేయడంతో సహ ఉద్యోగులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు 70 శాతం శరీరం కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం వైద్యులు కర్నూలుకు రెఫర్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై నిందితుల కదలికలను గమనించి, ఇతర ప్రాంతాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అమరావతినగర్ రోడ్డు, బసాపురం జంక్షన్ సమీపంలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. కేసును 24 గంటల్లోపు చేధించిన టూటౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, సిబ్బందిని అభినందించామన్నారు. -
ఇద్దరి ప్రాణాలను బలిగొన్న అతివేగం
భూత్పూర్: జాతీయ రహదారిపై భూత్పూర్ పట్టణ సమీపంలోని బ్రిడ్జిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఓ మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. ఎస్ఐ నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి జడ్చర్ల నుంచి కర్నూలు వైపు కోళ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ డీసీఎం టైరు పంచర్ కావడంతో బ్రిడ్జిపై కుడివైపున ఆగిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి కారులో వస్తున్న హరీశ్‌గౌడ్(26) పరిస్థితిని గమనించి డీసీఎం వెనుక కారును నిలిపాడు. ఇంతలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో డీసీఎం కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ముందున్న డీసీఎం కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న హరీశ్‌గౌడ్, కారును ఢీకొట్టిన డీసీఎం డ్రైవర్ జి.శేఖర్ (30) అక్కడికక్కడే మృతిచెందారు. వివాహానికి వెళ్తుండగా విషాదం మృతుడు హరీశ్‌గౌడ్ హైదరాబాద్‌లో కారు మెకానిక్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి భార్య కల్యాణితో కలిసి బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని డివిజన్ బుర్కుంట గ్రామంలోని స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో జరిగిన ప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కల్యాణికి స్వల్ప గాయాలు కావడంతో 108 వాహనంలో మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. -
కనుల పండువగా ఈరన్న స్వామి చక్రస్నానం
● తుంభద్రమ్మ ఒడిలో ఓలలాలిడిన స్వామి వారు ● బ్రహ్మరథం పట్టిన భక్తులు కోసిగి/మంత్రాలయం: ఏటి గట్టున భక్తజనం వీక్షిస్తుండగా.. మంగళ వాయిద్యాలు మోగుతుండగా.. పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈరన్న స్వామి తుంగభద్రమ్మ ఒడిలో ఓలలాడారు. నృసింహుని పుణ్యస్నానంతో ఆధ్యాత్మిక తరంగాలతో తుంగభద్రమ్మ పరవశించింది. శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా ఉరుకుంద ఈరన్న స్వామి (లక్ష్మీనరసింహ స్వామి) పల్లకోత్సవం చివరి సోమవారం కడు వైభవంగా సాగింది. తెల్లవారుజామున ఆలయంలో ప్రత్యేక పూజలు చేసుకుని స్వామి వారి విగ్రహాన్ని పల్లకీలో కొలువుంచి పాదయాత్రగా ఉరుకుంద నుంచి కోసిగి మండలం కందుకూరు గ్రామం రామలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఉన్న తుంగభద్రనది చెంతకు చేరారు. ముందుగా ఆలయ డిప్యూటీ కమిషనర్ కె. వాణి ఆధ్వర్యంలో తుంగభద్రమ్మకు హారతులు పట్టి సారె సమర్పించారు. అనంతరం నరసింహా స్వామికి జై.. అంటూ .. స్వామి వారికి నదిలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం నది ఒడ్డున దింపుడు కట్టపై స్వామి వారిని కొలువుంచి అభిషేకాలు గావించి మహామంగళ హారతులు ఇచ్చారు. భక్తులు స్వామి వారికి నారికేళాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. తిరిగి యథావిధిగా పల్లకీలో ఊరేగింపుగా బయలు దేరారు. కందుకూరు గ్రామంలో స్వామి వారికి మేళతాళాలతో డప్పువాయిద్యాలతో గ్రామ ప్రజలు స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. అనంతరం కామన్‌దొడ్డి, తిప్పలదొడ్డి, కరణి, గ్రామాల మీదుగా ఉరుకుంద క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వర రావు, రామ్మోహన్, ఉపప్రధాన అర్చకులు మహాదేవప్ప, సీనియర్ అసిస్టెంట్ వీరేష్లు ఉన్నారు. పల్లకోత్సవం ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కోసిగి, కౌతాళం సీఐలు మంజునాథ్, యుగంధర్, కోసిగి, ఎమ్మిగనూరు రూరల్, పెద్దకడబూరు ఎస్ఐలు రమేష్ రెడ్డి, శ్రీనివాసులు, మారుతి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఊరూరా జాతర ఈరన్న స్వామి పల్లకీ చేరుకున్న గ్రామాల్లో జాతరను తలపించింది. కోసిగి మండలం కందుకూరు గ్రామంలో పల్లకీ చేరుకోగా స్వామి పాదాల చెంత భక్తులు నీటితో పాదాభిషేకం చేయగా, అడుగడునా కోక పాన్పులు పరుచగా పల్లకీ ముందుకు సాగింది. భక్తులు అడుగడునా నారికేళాలు సమర్పించి పూజలు చేపట్టారు. స్వామి పల్లకీ ముందుకు సాగిన గ్రామాల్లో గాజులు, మిఠాయి అంగళ్లు, చిన్నారుల రంగుల రాట్నాలు, బొమ్మలు అంగళ్లతో పండుగ వాతావరణం నెలకొంది. -
ముగ్గురు నిందితుల అరెస్ట్
బేతంచెర్ల: పట్టణంలోని అల్లా బకాష్ దర్గా కాలనీలో మహిళపై దాడి చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ రమేష్ బాబు సోమవారం తెలిపారు. వివరాల మేరకు.. గత నెల 31 పాత కక్షల నేపథ్యంలో మినుగ విజయ్, అతని అనుచరులు హసన్, విక్రమ్‌లు షేక్ హుస్సేన్‌బీ ఇంటికి వెళ్లి ఆమె కుమారుడిని చూపించాలంటూ ఆమెతో గొడవపడి దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను సోమవారం కర్నూలు రహదారిలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అరెస్టు చేశారు. అనంతరం డోన్ కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ ముగ్గురికి రిమాండు విధించినట్లు ఎస్ఐ రమేష్ బాబు వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి పాములపాడు: కర్నూలు – ఆత్మకూరు రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంబాలపల్లి గ్రామా నికి చెందిన గొల్ల జయకృష్ణ (26) మృతి చెందాడు. స్థానికులు తెలిపి న వివరాల మేరకు.. కర్నూలు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న ట్రాలీ వాహనం పంచర్ కావడంతో రహదారిపై పక్కకు నిలిపారు. పాములపాడు వైపు నుంచి బైక్‌పై జయ కృష్ణ స్వగ్రామానికి వెళ్తుండగా కంబాలిపల్లి వద్ద అదుపుతప్పి నిలిచి వున్న ట్రాలీ వాహనాన్ని ఢీకొన్నాడు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. ఈ ఘటనపై పాములపాడు ఎస్ఐ తిరుపాలు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతుడికి భార్య కళ్యాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మెట్లపై నుంచి పడి..ఆదోని అర్బన్: పెద్దతుంబలం గ్రామానికి చెందిన రజాక్(35) సోమవారం ఇంట్లో మెట్లపై నుంచి కింద పడి మృతి చెందినట్లు పెద్దతుంబలం ఎస్ఐ విద్యశ్రీ తెలిపారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందరన్నారు. మృతుడి భార్య గౌసియా, ఇద్దరు పిల్లలు ఉన్నారన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఉరుకుందలో గుర్తు తెలియని వ్యక్తి మృతి కౌతాళం: ఉరుకుంద గ్రామం ఈరన్నస్వామి దేవాలయ పరిసర ప్రాంతంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సోమవారం దాదాపు 50 ఏళ్ల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు సమాచారం కౌతాళంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని శవాన్ని పరిశీలించారు. మృతునికి సంబంధించిన ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యుగంధర్ తెలిపారు. మృతుని గురించి సమాచారం తెలిస్తే కౌతాళం పోలీసులను ఆశ్రయించాలన్నారు. కర్నూలు(హాస్పిటల్): చిన్న వయస్సులో గర్భం దాల్చడం తల్లీబిడ్డలకు ప్రమాదకరమని రాష్ట్రీయ కిశోర స్వాస్త్య కార్యక్రమ కన్సల్టెంట్ మల్లికార్జున చెప్పారు. సోమవారం కర్నూలు నగరంలోని పెద్దమార్కెట్ వద్ద ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు టీనేజ్ గర్భంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కిశోర బాలికలకు బాల్యవివాహాల నివారణ, టీనేజీ గర్భదారణ దుష్పరిణామాలు, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించారు. బాల్యవివాహాలకు బలవంతం చేస్తే 1098కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్ మాట్లాడుతూ నిల్వ చేసిన జంక్‌ఫుడ్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఉపాధ్యాయులు శ్రీవిద్య, ప్రొజెక్షనిస్టు ఖలీల్ పాల్గొన్నారు. టార్చ్ లైట్లతో నిరసన ఆదోని రూరల్: రాత్రి వేళ విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా మండలంలోని పాండవగల్లులో సోమవారం రాత్రి సీపీఎం నాయకులు టార్చ్లైట్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి లింగన్న, మండల కార్యదర్శివర్గ సభ్యులు జె.రామాంజనేయులు మాట్లా డుతూ.. రాత్రి సమయాల్లో అధికారులు విద్యుత్ కోతలు విధించడం ఏమిటని ప్రశ్నించారు. ఉదయం పనులకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకున్న కూలీలు, ప్రజలకు విద్యుత్ కోతల వల్ల ఇబ్బందులు పడుతున్నారన్నారు. అప్రకటిత విద్యుత్ కోతలను నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో సీపీఎం నాయకులు పాండురంగ, అనీఫ్బాషా, పార్టీ సభ్యులు నర్సిరెడ్డి, హనుమంతరెడ్డి, కొండయ్య, తాయప్ప, భీమాంజి, నాగరాజు పాల్గొన్నారు. -
జాప్యమెందుకు
ప్రతి నెలా ఇవ్వాల్సిన గౌరవ వేతనాలను పెండింగ్‌లో పెట్టడమేంటి? ఈ విషయంపై సహచర జెడ్పీటీసీలతో కలిసి సీఈఓ దృష్టికి తీసుకుపోయాం. నేటి వరకు గౌరవ వేతనాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. రవాణా ఖర్చులు కూడా ఇవ్వడం లేదు. – డీ దొరబాబు, జెడ్పీటీసీ సభ్యుడు, ఆస్పరి గౌరవ వేతనాలను అందించే విషయంలో జరుగుతున్న జాప్యంపై ఇప్పటికే సహచర జెడ్పీటీసీలతో కలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. పక్కనున్న వైఎస్సార్ కడప జిల్లాలో జెడ్పీ సాధారణ నిధుల నుంచి పెండింగ్‌లో ఉన్న జెడ్పీటీసీల గౌరవ వేతనాలను విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. – ఈ రంగనాథ్గౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు, ఓర్వకల్లు సర్పంచ్ కాలం గడువు ముగిసినా మేం ఇంకా పదవిలోనే కొనసాగుతున్నాం. అయినా పాలన అంతా ఎలాంటి పదవులు లేని టీడీపీ నేతలతోనే కొనసాగిస్తున్నారు. అధికారులు సైతం ప్రొటోకాల్ పాటించడం లేదు. గౌరవం ఇవ్వక పోయినా వేతనమైనా ఇస్తుందనుకుంటే అదీలేదు. గడువు ముగిసే లోపైనా ఇస్తారో లేదో? – ఎద్దుల రాజేశ్వరి, ఎఎంపీటీసీ సభ్యురాలు, చింతలచెరువు, చాగలమర్రి మండలం టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాకు ఒక్క రూపాయి కూడా గౌరవ వేతనం ఇవ్వలేదు. నాకు రూ. 78 వేల వేతనం రావాలి? ఎప్పుడు ఇస్తారో తెలియదు. సొంత ఖర్చులతో ప్రతి మండల సమావేవానికి హాజరయ్యా. పదవీ కాలం ముగిసేలోపైనా బకాయిలు చెల్లిస్తారో లేదో? – పెద్ద పేరయ్య, ఎంపీటీసీ సభ్యుడు, హరివరం, ఉయ్యాలవాడ మండలం -
ఎమ్మెల్యే పొలాలకు నీళ్లు.. రైతుల పొలాలకు కన్నీళ్లా?
● శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తీరుపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి బుడ్డా శేషారెడ్డి ధ్వజం వెలుగోడు: ఎల్‌నినో ప్రభావంతో రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పొలానికి మాత్రం సాగునీరు ఎలా అందుతోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి బుడ్డా శేషారెడ్డి ప్రశ్నించారు. రైతుల కష్టాలను వివరిస్తూ, ఎమ్మెల్యే తీరును ఎండగడుతూ సోమవారం బుడ్డా శేషారెడ్డి ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘‘ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో రైతులు సాగునీటి కోసం అల్లాడుతున్నారు. తాగునీటికి మాత్రమే నీళ్లు విడుదల చేస్తున్నామని అధికార పార్టీ నాయకులు, అధికారులు చెబుతున్నారు. అలాంటప్పుడు చెరువులు, కుంటలు నింపి పశువులకు నీరు అందించడంతో పాటు భూగర్భ జలాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ కృష్ణా జలాలను, కాలువల ద్వారా వస్తున్న నీటిని చెరువులకు మళ్లించకుండా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పొలానికి మాత్రం నేరుగా నీరు ఎలా పారుతోంది?’’ అని బుడ్డా శేషారెడ్డి ప్రశ్నించారు. మిగతా రైతుల పరిస్థితి ఏంటి? ‘‘కాలువల వెంట ఇరిగేషన్ అధికారులు, లస్కర్లను, సిబ్బందిని కాపలాగా పెట్టి తూముల వద్ద నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఆ నిఘా అంతా ఎమ్మెల్యే పొలాలకు నీళ్లు సక్రమంగా చేరేందుకేనా? మేడం కలెక్టర్ గారు, ఎస్పీ గారు క్షేత్రస్థాయిలోకి వచ్చి రైతుల పొలాలను పరిశీలించండి. పక్కనే ఉన్న పొలాలు నెర్రెలు వారి ఎండిపోతుంటే ఎమ్మెల్యే పొలంలో మాత్రం మనుషులను పెట్టి నీళ్లు పారిస్తున్నారు. మొన్ననే ఒక రైతు కొత్తగా బోరు వేసినా భూగర్భ జలాలు అందక కొద్దిసేపు నీరు వచ్చి మళ్లీ ఆగిపోతున్నాయి. నారుమడులు పూర్తిగా ఎండిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో చెరువులు, కుంటలు నింపితే భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయి. సొంత పొలాలకు మాత్రమే నీరు మళ్లించుకుంటే మిగతా రైతుల పరిస్థితి ఏంటి?’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి ‘‘తెలుగుగంగ, కేసీ కెనాల్, ఇతర కాలువలకు నీళ్లు బ్రహ్మాండంగా పారినప్పుడు తాను రైతునని చెప్పుకోవడం సులభమే. పక్క రైతులు ప్రశ్నిస్తే అహంకారంతో సమాధానం చెప్పకుండా, ప్రజల కడుపుకొట్టే విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అన్నట్టుగా వ్యవహరించకండి. రైతులందరికీ సమానంగా సాగునీరు అందించండి.’’ అని బుడ్డా శేషారెడ్డి పేర్కొన్నారు. -
పైళ్లెన నాలుగు నెలలకే..
● రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి ఆదోని అర్బన్: పట్టణ శివారులోని ఆలూరు–సిరుగుప్ప బైపాస్‌లోని పర్వతాపురం క్రాస్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలోని బుడుదూ రు గ్రామానికి చెందిన సోమశేఖర్, శాంతమ్మ(21)కు నాలుగు నెలల క్రితం వివాహమైంది. శ్రావణ మాసం కావడంతో బైక్‌పై బాబాయి కొడుకు ఆకాష్‌తో కలసి ఉరుకుంద క్షేత్రానికి బయలుదేరారు. ఆదోని పట్టణ సమీపంలోని ఆలూరు–సిరుగుప్ప బైపాస్‌లోని పర్వతాపురం క్రాస్ వద్ద స్పీడు బ్రేకర్‌ను గమనించకుండా వేగంగా వెళ్లడంతో వెనుక కూర్చున్న శాంతమ్మ(21) ఎగిరి కింద పడటంతో తీవ్రంగా గాయపడింది. ఆ క్రమంలో బైక్ అదుపు తప్పి కింద పడటంతో బాలుడు ఆకాష్‌కు గాయాలయ్యాయి. వెంటనే ఇద్దరిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి శాంతమ్మ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. క్వింటా వేరుశనగ గరిష్ట ధర రూ.7,630 ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో సోమవారం క్వింటా వేరుశనగ గరిష్టంగా రూ.7,630 ధర పలికింది. మార్కెట్‌కు 39 క్వింటాళ్ల దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. కనిష్ట ధర రూ.7,410 ప్రకారం మార్కెట్లో వ్యాపారులు కొనుగోలు చేశారని మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన ఈ సందర్భంగా తెలిపారు. కర్నూలు రేంజ్ పోలీసు క్రీడాకారుల ప్రతిభ కర్నూలు (టౌన్): ఇటీవల నాగార్జున యూనివర్సీటీలో ఈనెల 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించిన ఏపీ పోలీసు స్పోర్ట్స్ మీట్లో కర్నూలు రేంజ్ క్రీడాకారులు 86 పతకాలు సాధించినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ వెల్లడించారు. విజేతలను తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన అభినందించారు. కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాలో 54 మంది పోలీసు అధికారులు, సిబ్బంది వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబరిచారన్నారు. మహిళల విబాగంలో ఓవరాల్ చాంపియన్‌షిప్‌గా మొదటి స్థానం, పురుషుల విభాగంలో రెండవ స్థానంలో నిలిచారని తెలిపారు. అలాగే సైంటిఫిక్ ఎయిడ్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినాలజీ డ్యూటీ మీట్ విభాగంలో కర్నూలు రేంజ్‌కు చెందిన ఇన్స్పెక్టర్ ప్రథమ బహుమతి సాధించినట్లు తెలిపారు. కర్నూలు ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణ మోహన్, నంద్యాల ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. తల్లిని కాపాడే ప్రయత్నంలో.. ● తండ్రిపై కుమారుడి దాడి ● తీవ్ర గాయాలై తండ్రి మృతి వెల్దుర్తి: తండ్రి వివాహేతర సంబంధం ఆ కుటుంబంలో విషాదం మిగిల్చింది. అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన తల్లి గొంతు నులిపేస్తున్న తండ్రిని కుమారుడు కట్టెతో కొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ ఘటన వెల్దుర్తి మండల కేంద్రం చోటుచేసుకుంది. ఎస్ఐ నరేశ్ తెలిపిన వివరాల మేరకు.. స్థానిక ఐజీ నగర్లో నివాసముంటున్న ఆటో డ్రైవర్ షేక్షావలి (45), మస్తాన్‌బీ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. షేక్షావలికి పట్టణంలోనే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంపై కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈనెల 5వ తేదీ శనివారం రాత్రి ఇదే విషయమై దంపతుల మధ్య గొడవ జరిగింది. తన అక్రమ సంబంధాన్ని ప్రశ్నిస్తున్న భార్య మస్తాన్‌బీని షేక్షావలి గొంతు నులిమి దాడి చేస్తుండగా పెద్ద కుమారుడు మస్తాన్ వలి గమనించి తన తల్లిని కాపాడుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న కట్టెతో తండ్రి తలపై దాడిచేశాడు. దీంతో షేక్షావలికి తీవ్ర రక్తస్రావమైంది. మెట్లపై జారి పడ్డాడని గాయాలపాలైన తండ్రిని ఆటోలో స్థానిక ఆసుపత్రిలో చేర్చాడు. మెరుగైన వైద్యానికి కర్నూలు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన తల్లిని కాపాడే క్రమంలోనే మస్తాన్ వలి తన తండ్రిపై దాడిచేసినట్లు తేలింది. మృతుని సోదరుడు ఈదురుబాషా ఫిర్యాదు మేరకు మస్తాన్‌వలిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
శాస్త్రోక్తంగా ఏకాదశి ఉత్సవం
ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో ఏకాదశిని పురస్కరించుకుని సోమవారం విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున మూలమూర్తులను సుప్రభాతసేవతో మేల్కొల్పి దివ్యదర్శనం అనంతరం నిత్యపూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను ఆలయ ముఖద్వార మండపంలో కొలువుంచారు. పంచామృతాలతో అభిషేకించి వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య ధూపదీపాలతో మహా మంగళహారతి అందించారు. రాత్రి విశేష అలంకరణలో స్వామి, అమ్మవార్లు పల్లకీపై కొలువుదీరి తిరువీధిలో విహరించారు. -
ధ్యానం కోసం వచ్చి దోపిడీకి పాల్పడి!
● వృద్ధురాలిపై దాడి చేసి బంగారు నగలు ఎత్తుకెళ్లిన దొంగ అరెస్ట్ ● నిందితుడి నుంచి బంగారు నగలు, బైక్ రికవరీ సి.బెళగల్: ఐదు రోజుల క్రితం సంగాల గ్రామంలో వృద్ధురాలిపై దాడి చేసి బంగారు నగలు ఎత్తుకెళ్లిన దొంగను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. మండల కేంద్రం సి.బెళగల్‌కు చెందిన బోయ గుంటి రంగన్నగా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం సి.బెళగల్ పోలీసు స్టేషన్లో కోడుమూరు సీఐ త్రబేజ్, ఎస్ఐ వేణుగోపాల్రాజుతో కలిసి నిందితుడి వివరాలను మీడియాకు వివరించారు. సీఐ వివరాల మేరకు.. సి.బెళగల్‌కు చెందిన బోయ గుంటి రంగన్న ఇంటి వద్ద వ్యవసాయ పనులు, జీవాలను పోషిస్తున్నాడు. ఇతను సమీపంలోని సంగాల గ్రామంలో ధ్యాన పిరమిడ్ కేంద్రానికి వెళ్లేవాడు. కాగా ధ్యాన కేంద్రం పక్కనే ఒంటరిగా నివాసముంటున్న వృద్ధురాలు ఇల్లూరి సంజీవమ్మ ధ్యాన పిరమిడ్‌లో నిత్యం జ్యోతి వెలిగిస్తూ ఉండేది. ఈ క్రమంలో వృద్ధురాలిని రంగన్న పరిచయం చేసుకుని ఆమె ఇంటిపై నిఘా ఉంచాడు. రోజూ ఆమె కదలికలను గమనిస్తూ ఆమె వద్ద ఉన్న నగలను దోచుకోవాలని పథకం వేశాడు. ఈ మేరకు ఈ నెల 3వ తేదీ ఉదయం హెల్మెట్ పెట్టుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. రాడ్‌తో చంపుతా అంటూ వృద్ధురాలిని బెదిరించి, తర్వాత దాడి చేసి బంగారు గొలుసు, రెండు బంగారు గాజులను తీసుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సి.బెళగల్ పోలీసులు విచారణ చేపట్టి దొంగతనానికి పాల్పడిన రంగన్నను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 8.9 తులాల బరువున్న రూ.13 లక్షల విలువ చేసే బంగారు నగలతో పాటు చోరీకి ఉపయోగించిన బైకు, హెల్మెట్, ఇనుపరాడ్, ఇతర వస్తువులను నిందితుడిని నుంచి సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. కాగా కేసును త్వరగా ఛేదించిన ఎస్ఐ వేణుగోపాల్‌రాజు, కానిస్టేబుల్ శ్రీనివాసులను సీఐ ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా కేసు ఛేదనలో ప్రతిభ చూపిన హెడ్ కానిస్టేబుల్ తిమ్మప్ప, కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, ఈశ్వరయ్య, జానకిరాముడులను సీఐ, ఎస్ఐలు రివార్డుతో అభినందించారు. -
న్యాయస్థానాన్ని ఆశ్రయించిన జెడ్పీటీసీ సభ్యులు
తమకు అందించాల్సిన గౌరవ వేతనాలను పూర్తి స్థాయిలో పెండింగ్‌లో పెట్టడంతో జెడ్పీటీసీ సభ్యులు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ అంశంపై పలుమార్లు జెడ్పీ సీఈఓ, ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా, ఎలాంటి ఫలితం కనిపించడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్కనున్న వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన జెడ్పీటీసీ సభ్యులకు జిల్లా పరిషత్ సాధారణ నిధుల నుంచి వేతనాలను అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. తమకు కూడా వేతనాలను అందించాలని ఉమ్మ డి జిల్లాకు చెందిన జెడ్పీటీసీలు కోరుతున్నారు. మరో ఇరవై రోజుల్లో తమ పదవీ కాలం పూర్తి అవుతున్న దృష్ట్యా పెండింగ్‌లో ఉంచిన గౌరవ వేతనాలను చెల్లించాలని స్థానిక సంస్థలకు చెందిన ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. కర్నూలు(అర్బన్): ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వారంతా.. పాలనా పరమైన అంశాల్లో వారి ఆమోదం (కోరం) తప్పనిసరి. ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారికంగా పాల్గొనాల్సిన వారిని చంద్రబాబు ప్రభుత్వం కరివేపాకులా తీసి పారేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నట్లు ప్రకటిస్తూ చిన్న చూపు చూస్తోంది. మరో ఇరవై రోజుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం ముగుస్తున్నా.. నేటికీ ప్రభుత్వం వేతనాల రూపంలో వీరికి కోట్ల రూపాయలను బకాయి పెట్టింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అందించే గౌరవ వేతనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదే తంతు! ‘మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంపీటీసీ సభ్యుల గౌరవ వేతనం పెంచుతాం.. స్థానిక సంస్థలకు పూర్వ వైభవం తెస్తాం’.. అని టీడీపీ అధినే చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వేతనం పెంచడం దేవుడెరుగు పదవీకాలం ముగుస్తున్నా గౌరవ వేతనాన్ని ఇవ్వకుండా ఎంపీటీసీ సభ్యులను తీవ్రంగా వేధించారు. హోదాలో జిల్లా ప్రథమ పౌరుడైన జిల్లా పరిషత్ చైర్మన్‌కు ప్రభుత్వం నెలకు రూ.40 వేలు, జెడ్పీటీసీ సభ్యులకు రూ.6 వేలు, మండల పరిషత్ అధ్యక్షులకు రూ.6 వేలు, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులకు (ఎంపీటీసీలకు) రూ.3 వేలను గౌరవ వేతనంగా అందించాల్సి ఉంది. ఈ మొత్తం కేవలం వారి హోదాను గౌరవించి ఇవ్వాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులకు సంబంధించిన గౌరవ వేతనాలపై పెదవి విప్పడం లేదు. గత వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనాలకు ఎప్పటికప్పుడు నిధులు విడుదలవుతూ వచ్చాయి. 2024 ఎన్నికల కంటే ముందు మూడు, నాలుగు నెలలు మినహా మిగిలిన ఐదు సంవత్సరాల్లో గౌరవ వేతనాలను రెగ్యులర్‌గా విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు దాదాపు 27 నెలలుగా స్థానిక సంస్థలకు చెందిన ప్రజా ప్రతినిధులకు చెల్లించాల్సిన గౌరవ వేతనాలను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. పలు సమావేశాల్లో అడుగుతున్నా.. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు మండలాల్లో జరుగతున్న మండల సర్వసభ్య సమావేశాల్లో సభ్యులు తమ వేతనాలకు సంబంధించి పలు మార్లు ప్రశ్నిస్తున్నా, వినతి పత్రాలు అందిస్తున్నా, నేటి వరకు ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో కూడా పలువురు సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించినా, ఆశించిన స్థాయిలో ప్రయోజనం కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల గౌరవ వేతనాలకు సంబంధించి జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి పలుమార్లు పీఆర్అండ్ఆర్డీ కార్యాలయానికి కరస్పాండెన్స్ జరుగుతున్నా, వేతనాలు విడుదల చేసే అంశంలో మాత్రం స్పష్టత కొరవడింది. జెడ్పీటీసీలకు అందించాల్సిన గౌరవ వేతనాలకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేశాం. గతంలో జెడ్పీటీసీలు అందించిన వినతి పత్రాలను కూడా ప్రభుత్వానికి పంపించారు. జిల్లా పరిషత్ సాధారణ నిధుల నుంచి జెడ్పీటీసీలకు గౌరవ వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం. – ఆర్.సుధాకర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ అధికారిక లెక్కల ప్రకారం జెడ్పీ చైర్మన్‌తో పాటు జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలకు ప్రభుత్వం ఈ ఏడాది ఆగష్టు నెల వరకు రూ.10,38,11,463లను బకాయి పడింది. జెడ్పీ చైర్మన్‌కు నెలకు రూ.40 వేల ప్రకారం 27 నెలలకు రూ.10.80 లక్షలు 52 మంది జెడ్పీటీసీ, కోఆప్షన్ సభ్యులకు నెలకు రూ.6 వేల ప్రకారం 27 నెలలకు రూ. 87.48లక్షలు 53 మంది ఎంపీపీ, 778 మంది ఎంపీటీసీలకు రూ.7,16,04,000 స్థానిక ప్రజాప్రతినిధులపై చంద్రబాబు ప్రభుత్వం ‘చిన్న చూపు’ జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ సభ్యులకు 27 నెలలుగా అందని గౌరవ వేతనం ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులదీ ఇదే పరిస్థితి వీరికి ప్రభుత్వం చెల్లించాల్సింది రూ.8.95 కోట్లు మొత్తంగా రూ. 10.38 కోట్లు పెండింగ్ మరో 20 రోజుల్లో ముగియనున్న స్థానిక ప్రజాప్రతినిధుల పదవీ కాలం -
చట్టపరంగా న్యాయం చేస్తాం
కర్నూలు(టౌన్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి 104 ఫిర్యాదులు అందాయన్నారు. త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అడిషనల్ ఎస్పీ ఆడ్మిన్ హుస్సేన్ పీరా, సీఐలు శివశంకర్, ఇస్మాయిల్, మస్తాన్ వలీలు పాల్గొన్నారు. కొత్త పింఛన్ల దరఖాస్తుకు 16వ తేదీ ఆఖరు కర్నూలు(సెంట్రల్): కొత్త పింఛన్లకు అర్హులు ఈనెల 7 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణపై అధికారులకు కలెక్టర్ తగిన ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. ని ర్ణీత నమూనాలో దరఖాస్తు ఫారాలను ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. వృద్ధు లు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత సిస్టమ్ జనరేటెడ్ అక్నాలెడ్జ్మెంట్ అందజేస్తారన్నారు. క్వింటా ఉల్లి రూ.4,739 కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు సోమవారం 1,224 క్వింటాళ్ల ఉల్లి విక్రయానికి వచ్చింది. కనిష్ట ధర రూ.1,843, గరిష్ట ధర రూ.4,739 లభించింది. మార్కెట్ యార్డులో 33 లాట్ల ఉల్లి ఉండగా.. ఎక్కువ లాట్లకు రూ.4వేల పైనే ధర దక్కింది. రైతుబజార్లలో అంతంతమాత్రం నాణ్యత ఉన్న ఉల్లినే రూ. 46–56 ప్రకారం విక్రయిస్తున్నారు. మహారాష్ట్ర ఉల్లిగడ్డలను నాణ్యతను బట్టి రూ.60 నుంచి రూ.70 వరకు విక్రయిస్తుండటం గమనార్హం. ఉల్లి ధరలు పెరిగి వినియోగదారులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. వేరుశనగ ధర కూడా పెరుగుతోంది. కర్నూలు మార్కెట్లో వేరుశనగ గరిష్ట ధర రూ.9,426, ఆదోని మార్కెట్లో రూ.9,688, ఎమ్మిగనూరు మార్కెట్లో రూ.7,630 ప్రకారం ధరలు లభించాయి. ఆదోని మార్కెట్‌కు పత్తి 6,578 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.4,011, గరిష్ట ధర రూ.9,959 లభించగా.. సగటు ధర రూ.9,789 పలికింది. జవాబుదారీతనంతో సేవలు అందించండి కర్నూలు(అగ్రికల్చర్): వినియోగదారులకు జవాబుదారీతనంతో సేవలు అందించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్లో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించారు. వినియోగదారుల నుంచి ఫోన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వినియోగదారులకు అందుబాటులో ఉన్నప్పుడే సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు. ఈఈలు, డీఈఈ, ఏడీఈలు వినియోగదారులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఈ విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితా ప్రచురణ కర్నూలు(అర్బన్): గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎస్ఈసీ ఆదేశాల మేరకు జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో గుర్తించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాలను సోమవారం ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రచురించారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఓటర్ల గుర్తింపు ప్రక్రియ గత 18వ తేదిన ప్రారంభించి 24వ తేది వరకు కొనసాగించారు. అనంతరం గుర్తించిన ఓటరు జాబితాలను అదే నెల 25న డ్రాఫ్డ్ పబ్లికేషన్ చేశారు. 26 నుంచి 28వ తేది వరకు అభ్యంతరాలను స్వీకరించి విచారణ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే గ్రామ సభలను నిర్వహించి ఈ నెల 6న తుది జాబితాలను సిద్ధం చేశారు. క్షేత్ర స్థాయిలోని పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల తుది జాబితాలను ప్రచురించారు. -
పేద బలిజ విద్యార్థులకు స్కాలర్షిప్లు
కర్నూలు(హాస్పిటల్): రాయలసీమ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (రోపా), గుంటూరుకు చెందిన శ్రీ కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను పేద బలిజ మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనాలు (స్కాలర్షిప్)లు పంపిణీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రోపా అధ్యక్ష, కార్యదర్శులు చింతలపల్లి రామకృష్ణ, కోనేటి వెంకటేశ్వర్లు, కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు అర్జా రామకృష్ణ, కత్వా రాష్ట్ర రాష్ట్ర నాయకులు పెద్ది లక్ష్మీనారాయణ తెలిపారు. ఆదివారం ఆయా సంఘాల కార్యవర్గ సమావేశం కర్నూలులో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపకార వేతనాలకు అర్హులైన విద్యార్థులు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్, డిగ్రీ, డిప్లమా, బీటెక్, బీ ఫార్మసి, ఎంబీబీఎస్, బీడీఎస్, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో 2026–27 అకడమిక్ సంవత్సరంలో చేరిన మొదటి సంవత్సరం విద్యార్థులు నూతనంగా ఫార్మ్–ఎ, గత యేడాది ఉపకార వేతనాలు పొందిన వారు, రెన్యువల్ కోసం ఫార్మ్–బి దరఖాస్తులు సమర్పించాలన్నారు. పదవ తరగతిలో, తదనంతర కోర్సుల్లో ప్రతి సంవత్సరం కనీసం 90 శాతం మార్కులు సాధించి ఉండాలన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు ఎంసెట్‌లో 30వేల లోపు ర్యాంకు పొంది ఉండాలని సూచించారు. కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందని, మార్కుల జాబితాలు, స్టడీ సర్టిఫికెట్, ఈ యేడాది ఫీజు రశీదు, తెల్ల రేషన్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్(టీసీ), విద్యార్థి ఆధార్, బ్యాంకు ఖాతా పుస్తకం, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు జతపరచాలని తెలిపారు. కర్నూలు, నంద్యాల, బనగానపల్లె, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, డోన్, ఆత్మకూరు, కోడుమూరు, ఆదోని ప్రాంతాల్లోని రోపా నియోజకవర్గ సమన్వయకర్తల వద్ద అప్లికేషన్లు లభిస్తాయని, పూర్తి చేసిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా అందించాలన్నారు. అనంతరం వివిధ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలు అందించి పదవీ విరమణ పొందిన రోపా సభ్యులను కార్యవర్గం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు బీఏ శ్రీనివాసరావు, రోపా ఉపాధ్యక్షులు వడ్ల శ్రీకాంత్, సంఘం పెద్దలు ఐ.వెంకటేష్, సుబ్రహ్మణ్యం, కామిని వెంకటేశ్వర్లు, యక్కంటి శ్రీనివాసులు, జానకి శ్రీనివాసులు, మధుసూదనరావు, గద్వాల ఈరన్న, చింతల జ్యోతిర్మయి, బ్రాహ్మణి పాల్గొన్నారు. -
నేడు ఉరుకుంద ఈరన్న స్వామి పల్లకోత్సవం
కోసిగి/మంత్రాలయం: శ్రావణ మాసం చివరి సోమవారం పురస్కరించుకుని ఉరుకుంద ఈరన్న స్వామి పల్లకోత్సవం నేడు అత్యంత వైభవంగా జరుగనుంది. వేకువజామన ఉరుకుంద క్షేత్రంలో ఆలయం నుంచి ఉత్సవమూర్తిని పల్లకీలో కొలువుంచి పాదయాత్రగా బయలుదేరి తిప్పలదొడ్డి, కామన్‌దొడ్డి, కందుకూరు గ్రామ సమీపంలోని తుంగభద్ర నది ఒడ్డుకు చేరుకుంటారు. అక్కడ దింపుడు కట్టపై స్వామి వారు ఆశీనులు కానున్నారు. తుంగభద్ర నదిలో చక్రస్నానం నిర్వహించి వేదమంత్రోచ్ఛరణలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం కందుకూరు, కామన్‌దొడ్డి, తిప్పలదొడ్డి మీదుగా ఉరుకుంద ఈరన్న క్షేత్రానికి సాయంకాలానికి పల్లకోత్సవం పాదయాత్ర చేరుకుంటుంది. పల్లకోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి వే లాది మంది భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా కోసిగి, కౌతాళం పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేయించారు. నదితీరంలో గ్రావెల్‌తో ర్యాంపు ఏర్పాటు పల్లకోత్సవం యాత్ర సందర్భంగా కందుకూరు గ్రామ సమీపంలో తుంగభద్ర నది ఒడ్డున ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి పి.మురళీమోహన్ రెడ్డి సహకారంతో గ్రావెల్ ర్యాంపు, రోడ్డుకు ఇరువైపులా ముళ్లపొదల తొలగింపు చర్యలు చేపట్టినట్లు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బెట్టన గౌడ, గ్రామస్తులు తాయన్న, రామన్న, శివరాం, శేఖర్ గౌడ తెలిపారు. రామలింగేశ్వర ఆలయం నుంచి నది ఒడ్డు వరకు రోడ్డుకు ఇరువైపులా పెరిగిన ముళ్ల పొదలను జేసీబీతో తొలగించారు.అలాగే నదిలో నీరు తక్కువగా ఉండడంతో లోతట్టు ప్రాంతానికి వెళ్లేందుకు కంకర రాళ్లు, గ్రావెల్ వేసి మార్గం ఏర్పాటు చేయించారు. ఊరూరా సంబరాలు ఈరన్న స్వామి రాకతో ఆయా గ్రామాల్లో పండగ జరుపుకుంటారు. పిండి వంటలతో స్వామికి నైవేద్యాలు, నారీ కేళాలు సమర్పిస్తారు. కందుకూరు గ్రామంలో జాతర చేసుకుని వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తారు. ఉరుకుంద గ్రామంలోనూ ఇదే విధంగా వేడుక చేసుకుంటారు. ఊరూరా భక్తులు పల్లకీ ముందు బోర్లాపడి తమ శరీరాలపై పల్లకీ దాటుకుని వెళ్లేలా చూసుకుంటారు. ఈ వేడుక శ్రావణ మాసోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. -
‘వేమన పద్యామృతం – ఆధ్యాత్మిక వ్యాఖ్యానం’ పుస్తకావిష్కరణ
కర్నూలు కల్చరల్: అఖిల ప్రపంచ ప్రధాన కేంద్రం మనుజ్యోతి ఆశ్రమం ఆధ్వర్యంలో ఆదివారం వీఆర్ కాలనీలోని ఏపీ టూరిజం హరిత హోటల్లో దేశీయ సమైక్యతా సమావేశం జరిగింది. దేవాశీర్ రచించిన ‘వేమన పద్యామృతం – ఆధ్యాత్మిక వ్యాఖ్యానం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయమనోహరి, మాజీ మంత్రి మూలింటి మారెప్ప, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, రియల్టర్ కె.విక్రమ్ సేనా రెడ్డి, ఏపీటీడీసీ డివిజినల్ మేనేజర్ లక్ష్మీనారాయణ, ప్రముఖ నేపథ్య గాయకులు రాగ్సాగర్, తెలుగు బాషా నిర్దేశకులు డాక్టర్ బోలుగద్దె అనిల్‌కుమార్ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. అనేక భాషల్లో ముద్రితమైనన ఈ పుస్తకం తేలికగా అర్థం చేసుకునే విధంగా ఉంటుందన్నారు. ఒకే దేవుడు – ఒకే దేశం అనే సిద్ధాంతంతో అనేక ఆధ్యాత్మిక విషయాలు యువతరం చదివి అర్థం చేసుకునేలా ఉందన్నారు. అధ్యాత్మిక పుస్తకాలు చదవటం ద్వారా అమూల్య జ్ఙానం పొందవచ్చన్నారు. అనంతరం పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. -
ఏమార్చి.. ఏటీఎం కార్డు మార్చి
● ఖాతాలోని రూ.62 వేలను కాజేసిన దుండగుడుఆదోని అర్బన్: ఏటీఎంలో నగదు డ్రా చేసేందుకు వెళ్లిన మహిళను గుర్తు తెలియని వ్యక్తి మాటల్లో పెట్టి కార్డును తీసుకుని, తన వద్దనున్న నకిలీ కార్డును ఇచ్చి ఆమె ఖాతాలోని రూ.62 వేలను కాజేసిన సంఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఆదోని, ఇందిరానగర్‌కు చెందిన అంగన్వాడీ టీచర్ తిమ్మక్క తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సదరు మహిళకు డబ్బు అవసరం ఉండడంతో గత నెల 28న ఆస్పరి రోడ్డులో ఉన్న ఏటీఎంలో నగదు డ్రా చేసుకునేందుకు వెళ్లింది. ఏటీఎంలో నగదు విత్ డ్రా చేయడం తెలియకపోవడంతో పక్కనున్న గుర్తు తెలియని వ్యక్తిని సాయం కోరింది. అతడు నగదు డ్రా చేస్తున్నట్లు నటించి, మిషన్‌లో డబ్బు రావడం లేదని చెప్పి ఆమె కార్డును తీసుకొని బదులుగా తన వద్దనున్న మరో కార్డును ఆమెకు ఇచ్చాడు. తనకు రూ.9 వేలు డబ్బు అత్యవసరం ఉందని ఆమె చెప్పడంతో ఆ వ్యక్తి తన వద్ద నగదు ఉందని రూ.30 కమీషన్‌తో కలిపి మొత్తం ఫోన్‌పే చేయించుకుని నగదు ఇచ్చాడు. తర్వాత ఎవరి దిక్కు వారు వెళ్లిపోయారు. ఈ క్రమంలో తిమ్మక్క మరోసారి డబ్బు అవసరమై ఏటీఎంలో డ్రా చేసేందుకు వెళ్లగా కార్డు తనది కాదని తెలుసుకుంది. బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ చూసుకోవడంతో రూ.62 వేలు డ్రా చేసినట్లు తెలుసుకుని ఆదివారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు ఆమె తెలిపింది. -
ప్రైవేటు నుంచి వచ్చిన వారి వల్లే !
కర్నూలులోని పలు ప్రైవేటు ఆసుపత్రుల నుంచి చివరి నిమిషంలో రోగులు చికిత్స కోసం వస్తున్నారు. ఆయా ఆసుపత్రుల్లో డబ్బులు అయిపోయాక గత్యంతరం లేని పరిస్థితిలో పెద్దాసుపత్రికి వస్తున్నారు. ఇలాంటి వారి విషయంలో అవసరమైన వైద్యం అందించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే మరణాల సంఖ్య ప్రైవేటుతో పోలిస్తే ఇక్కడ ఎక్కువగా ఉంటున్నాయి. కీలక విభాగాల్లో రోగులకు చికిత్స అందించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నాం. వైద్యసేవల విషయంలో ఎలాంటి లోపమూ ఉండదు. –డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, జీజీహెచ్, కర్నూలు -
నిమజ్జనానికి నీళ్లు ఇవ్వకుంటే పోరాటం చేస్తాం
● మంత్రి టీజీ ప్రత్యామ్నాయం ఆలోచించాలి ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి కర్నూలు (టౌన్): భక్తిశ్రద్ధలతో కర్నూలులో ఎంతో వైభవంగా నిర్వహించుకునే వినాయక నిమజ్జనానికి నీళ్లు విడుదల చేయకుంటే పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. కర్నూలు ప్రజల విశ్వాసాలతో ఆటలాడవద్దని, అధికారులతో మంత్రి టీజీ భరత్ చర్చించి ప్రత్యామ్నాయం ఆలోచించాలని సూచించారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ కర్నూలులో పెద్ద ఎత్తున వేల విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ఇప్పటికే రూ.10 కోట్ల వరకు అడ్వాన్సులు ఇచ్చారని, కొన్ని మండపాలు ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. ఈ దశలో మంత్రి టీజీ భరత్ ఒక అడుగు ఎత్తు ఉన్న విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఇంట్లో నిమజ్జనం చేసుకోవాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పెద్ద విగ్రహాలు తెచ్చుకుంటే వాటిని నిమజ్జనం చేయకుండా వచ్చే ఏడాది చేసుకోవాలని అవసరమైతే వాటిని భద్రపరుస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నీళ్లు లేవని తెలిసినప్పుడు నెల రోజుల ముందే ఎందుకు చెప్పలేదని, ఇప్పటికే ఇచ్చిన అడ్వాన్స్‌లు తిరిగి ఇప్పిస్తారా అని ప్రశ్నించారు. తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడిని ఏడాది వరకు పక్కన ఉంచితే, వచ్చే ఏడాది కూడా వర్షాలు లేకపోతే ఏం చేస్తారని మంత్రిని ప్రశ్నించారు? ప్రజల ఆధ్యాత్మి క మనోభావాలను దెబ్బతీయవద్దన్నారు. వినాయక నిమజ్జనాన్ని హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారని, కర్నూలులో ముస్లింలు సైతం మసీదుల వద్ద హిందువులకు మజ్జిగ, మంచినీళ్ల ప్యాకెట్లు అందించి మతసామరస్యాన్ని కాపాడుతారన్నారు. -
హోరాహోరీగా కబడ్డీ పోటీలు
కృష్ణగిరి: మండల పరిధిలోని కోయిలకొండ గ్రామంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం నిర్వహించిన జాతీయస్థాయి కబడ్డీ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి 18 జట్లు పాల్గొన్నట్లు నిర్వాహకులు గోపాల్, ఈశ్వర్, గంగాధర్, శ్రీను, రంగనాథ్ తెలిపారు. పోటీలను దాతలు, గ్రామపెద్దలు ఆంజనేయులు, గంగన్న, దస్తగిరి, లక్ష్మి ఈశ్వరయ్య, శేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. యువత క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. క్రీడాకారులకు గ్రామస్తుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
సర్క్యూట్ బెంచ్ వద్దు.. శాశ్వత హైకోర్టు బెంచ్ కావాలి
● నినాదాలతో హోరెత్తించిన న్యాయవాదులు కర్నూలు: ‘సర్క్యూట్ బెంచ్ వద్దు.. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ కావాలి’ అంటూ నినాదాలతో న్యాయవాదులు హోరెత్తించారు. కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 14వ రోజు ఆదివారం కొనసాగాయి. శాశ్వత హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేయడం ద్వారా రాయలసీమ ప్రజలకు న్యాయ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని న్యాయవాదులు ప్లకార్డులను ప్రదర్శించారు. హైకోర్టు బెంచ్ కోసం కొంతకాలంగా వివిధ రూపాల్లో న్యాయవాదులు నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేవరకు అన్ని పక్షాల రాజకీయ నేతలు, ప్రజాసంఘాల సహకారంతో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రుడు స్పష్టం చేశారు. న్యాయవాదుల దీక్షలో సాద్విక, నిస్సీ, జి.మురళీకృష్ణ, ఎస్.మహమ్మద్ అన్వర్ సాదత్, గోపాల్ యాదవ్, ఈదుల బాలాజీ రెడ్డితో పాటు న్యాయ విద్యార్థి హేమంతేశ్వర మునిరాజు పాల్గొన్నారు. న్యాయవాదులు పెద్ద ఎత్తున తమ విధులు బహిష్కరించి దీక్షా శిబిరాన్ని సందర్శించి రిలే నిరాహారదీక్షలో పాల్గొన్న వారికి పూలమాలలు వేసి దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి మహేశ్వర రెడ్డి, ఉపాధ్యక్షుడు రసూల్ ఖాన్, లైబ్రేరియన్ ఎండి మహేష్ కుమార్, సీనియర్ న్యాయవాదులు రామసుబ్బారెడ్డి, కపిలేశ్వరయ్య, ఓంకార్, నాగేంద్రనాథ్, నాగలక్ష్మి దేవి, వై.జయరాజు, గోపాల్, రాజేంద్ర, శ్రీరాముడు, జూనియర్ న్యాయవాదులు గోతం శేఖర్, షేక్ అఫ్రోచ్ బాషా, మధుకుమార్ నాయుడు తదితరులు దీక్ష చేస్తున్న న్యాయవాదులకు మద్దతు తెలిపారు. -
ఇష్టానుసారంగా విద్యుత్ కోతలు
మద్దికెర: ఎల్‌నినో ప్రభావంతో వర్షాల్లేక ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి. ఇంట్లో ఫ్యాన్ లేనిదే ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో అనధికార విద్యుత్ కోతలు ప్రజలను ఉక్కిబిక్కిరి చేస్తున్నాయి. రాత్రి సమయాల్లో గంటల తరబడి ఇష్టానుసారంగా కోతలు విధిస్తున్నారు. దీంతో సామాన్యులు నిద్ర లేక అల్లాడిపోతున్నారు. విద్యుత్ అధికారులను అడిగితే తమకు షెడ్యూల్ ఇవ్వకుండా మొయిన్ సప్లై పోయిందంటున్నారు. గాలిమరలు, సోలార్ పవర్ ఉంది కదా అని ప్రశ్న వేస్తే ఏమీ సమాధానం ఇవ్వడం లేదు. నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వానాకాలంలో భగ్గుమంటున్న ఎండలు కర్నూలు (అగ్రికల్చర్): వానాకాలం ఎండాకాలాన్ని తలపిస్తోంది. ఏప్రిల్, మే నెలలో ఉండే ఉష్ణోగ్రతలు సెప్టెంబర్‌లో నమోదవుతున్నాయి. సాధారణంగా ఈ సమయంలో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సి ఉంది. కానీ ఆదివారం కర్నూలులో 37.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వివిధ ప్రాంతాల్లో 38, 39 డిగ్రీలు కూడా నమోదయినట్లు తెలుస్తోంది. రానున్న నాలుగు రోజుల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే లక్ష హెక్టార్లలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ తేల్చింది. తాజా ఉష్ణోగ్రతల తీవ్రతకు పంటలపై రైతులు పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్వింటా వేరుశనగ రూ.9,040 ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఆదివారం క్వింటా వేరుశనగకు గరిష్టంగా రూ.9,040 ధర లభించింది. మార్కెట్‌కు 861 క్వింటాళ్ల దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. క్వింటా కనిష్టంగా రూ.6,100, మధ్యస్థంగా రూ.7,669 ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేశారని మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన తెలిపారు. శ్రీశైలంలో భక్తుల రద్దీ శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజును పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజామున్నే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులు తీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులకు క్యూకంపార్ట్మెంట్లలో పాలు, తాగునీరు, అల్పాహారం, ప్రసాదం పంపిణీ చేశారు. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడాయి. -
వ్యక్తి అదృశ్యం
ఆదోని రూరల్: మండలంలోని గణేకల్లు గ్రామానికి చెందిన మేసీ్త్ర నాగరాజు శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి కనిపించకుండా పోయాడని, ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆదోనిలోని తిమ్మారెడ్డి బస్టాండు వద్ద అదృశ్యమయ్యాడని పేర్కొన్నారు. ఈ విషయంపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఆచూకీ తెలిసిన వారు 90591 26816, 97010 97287 నంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.ఆర్టీసీ కండక్టర్ నిజాయితీ ఎమ్మిగనూరురూరల్: బస్సులో ప్రయాణికుడు పోగొట్టుకున్న బ్యాగ్‌ను తిరిగి అందజేసి నిజాయితీని చాటుకున్నాడు ఆర్టీసీ కండక్టర్ లక్ష్మన్న. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి నాగలదిన్నెకు వెళ్లిన నైట్ సర్వీస్ బస్సులో ప్రయాణికుడు బజారప్ప హ్యాండ్ బ్యాగ్ మరచిపోయాడు. రాత్రి డ్యూటీలో ఉన్న కండెక్టర్ బ్యాగ్‌ను గుర్తించి, చెక్ చేయగా అందులో రూ.5,500 నగదు, రేషన్ కార్డు ఉంది. రేషన్‌కార్డులోని వివరాల ఆధారంగా ప్రయాణికుడిని గుర్తించి ఆదివారం ఆర్టీసీ డిపోకు రప్పించి నగదు, బ్యాగ్ అప్పగించారు. ఇందుకు సదరు ప్రయాణికుడు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ డీఎం మద్దిలేటినాయుడుతో పాటు తోటి ఉద్యోగులు కండెక్టర లక్ష్మన్నను అభినందించారు. బైక్ ఢీకొని మహిళ దుర్మరణం ఆళ్లగడ్డ: మండల పరిధిలోని నల్లగట్ల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జయలక్ష్మమ్మ (60) మృతి చెందారు. జయలక్ష్మమ్మ హైవే రోడ్డు దాటుతుండగా నంద్యాలకు చెందిన సమీర్ ఆళ్లగడ్డ నుంచి నంద్యాలకు బైక్‌పై వెళ్తూ ఢీ కొట్టా డు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడిక్కడే మృతి చెందగా గాయపడ్డ సమీర్‌ను నంద్యాల వైద్యశాలకు తరలించారు. రూరల్ పోలీసు లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కృష్ణానదిలో మునిగి యువకుడి మృతి శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం డ్యాం ముందు భాగంలోని కృష్ణానదిలో మునిగి ముంబైకి చెందిన సచిన్రాజ్పుత్(22) మృతి చెందాడు. ముంబైకి చెందిన అభిషేక్ చతుర్వేది(29) అపస్మారక స్థితికి చేరుకున్నాడు. విప్రో ఉద్యోగి సచిన్, ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగి అభిషేక్ తెలంగాణ వైపు ఉన్న ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం ఎగ్జిట్ టన్నెల్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం కృష్ణానదిలో స్నానం చేస్తు మునిగిపోయారు. గమనించిన స్థానిక మత్స్యకారులు ఇద్దరిని బయటకు తీసుకురాగా సచిన్ అప్పటికే మృతి చెందినట్టు గుర్తించారు. అభిషేక్‌ను సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అదృశ్యమైన మహిళల ఆచూకీ తేల్చాలి నంద్యాల(న్యూటౌన్): అదృశ్యమైన మహిళల ఆచూకీ తక్షణమే తేల్చాలని నంద్యాల జిల్లా మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మిదేవి, రజిత డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. గత 15 రోజులుగా అదృశ్యమై మిస్టరీగా మారిన నంద్యాలకు చెందిన నజియా, రాయపాడుకు చెందిన వివాహిత ఆదిలక్ష్మి ఆచూకీని తక్షణమే తేల్చాలన్నారు. గత నెల 18వ తేదీన అదృశ్యమైన ఈ ఇద్దరు మహిళలు ఎక్కడికి వెళ్లారు, వారు సురక్షితంగా ఉన్నారా లేదా అనే విషయాలపై రోజులు గడుస్తున్నా స్పష్టత రాకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందనన్నారు. బాధిత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా దర్యాప్తులో ఆశించిన పురోగతి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నజియా అదృశ్యం వెనుక ఆదిలక్ష్మి ప్రమేయం ఉందనే అనుమానాలతో గత రాత్రి రాయపాడులోని ఆదిలక్ష్మి ఇంటి వద్ద నజియా బంధువులు ప్రశ్నించడం, ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. పారదర్శకంగా విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలని, బాధిత కుటుంబాలకు త్వరితగతిన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. చామంతి తోట తొలగింపు బేతంచెర్ల: చామంతి తోటను ట్రాక్టర్‌తో దున్నేస్తున్న ఈ రైతు పేరు పిళ్లి సూర్యనారాయణ. బేతంచెర్ల మండలం సీతారామాపురానికి చెందిన ఈయన జూలైలో రెండెకరాల్లో 50 వేల సెంటు చామంతి రకం మొక్కలు నాటాడు. వర్షాలు లేక పంటలో ఎదుగుదల లోపించింది. ఎండుకొమ్మ తెగులు సోకడంతో ఆదివారం పంటను ట్రాక్టర్‌తో ఇలా దున్నించేశాడు. సాగు కోసం ఇప్పటివరకు రూ.1.50 లక్షలు ఖర్చు చేశానని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని కోరాడు. -
కారు ఢీకొని బాలుడికి తీవ్రగాయాలు
మంత్రాలయం రూరల్: మండల పరిధిలోని మాధవరం జాతీయ రహదారిలో చెట్నేహళ్లి పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం బెస్త తేజ (12)ను కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై ఎస్ఐ మల్లికార్జున తెలిపిన వివరాల మేరకు.. బెస్త తేజ మంత్రాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 తరగతి చదువుతున్నాడు. ఆదివారం కావడంతో మంత్రాలయంలో పూలు అమ్ముతున్న అమ్మ (భీమేశ్వరి)కి మధ్యాహ్నం క్యారియర్ ఇచ్చి 2 గంటల సమయంలో తిరిగి వస్తున్నాడు. చెట్నేహళ్లి పంచాయతి కార్యాలయం వద్ద ఆటో దిగిన తేజ రోడ్డు దాటుతుండగా రాయచూరు వైపు నుంచి వస్తున్న కారు (జీజే 16 సీఏ 8320) వేగంగా ఢీకొట్టింది. రాయచూరుకు చెందిన దర్శన్ రాజ్ (19) కారు నడుపుతున్నాడు. ప్రమాదంలో బాలుడి దవడ, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. తల్లి, బంధువులు వచ్చి బాలుడికి ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. బాలుడి చిన్నమ్మ ఈరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పూజారి ఆత్మహత్య కేసులో నలుగురి అరెస్ట్
గోస్పాడు: నిరాధార ఆరోపణలతో వేధించి పూజారి ఆత్మహత్యకు కారణమైన నలుగురిని ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. వివరాలు.. జిల్లెల్ల గ్రామానికి చెందిన తెలుగు వెంకటరాముడు గ్రామంలోని గంగమ్మ ఆలయ కార్యకలాపాలను వంశపారంపర్యంగా వచ్చిన బాధ్యతల ప్రకారం నిర్వహిస్తున్నాడు. ఏడుగురు వ్యక్తులు అతనిపై ఆలయ నిధులను దుర్వినియోగం చేశాడని నిరాధార నిందలు మోపి, గ్రామంలో బహిరంగంగా పలుమార్లు అవమానించడంతో మానసిక వేదనకు గురయ్యాడు. ఈ నెల 1న సూసైడ్ నోట్ రాసి అర్ధరాత్రి గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై మృతుడి కుమారుడు తెలుగు హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోస్పాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా విచారణ జరిపి నిందితులు గోటికె మల్లికార్జున రెడ్డి, మునగబోయిన నాగరాజు, నాగ మద్దిలేటి, అన్నలదాసు ఓబులేసు నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించినట్లు తెలిపారు. మిగతా ముగ్గురు నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని ఎస్ఐ చెప్పారు. -
ఏటా పెరుగుతున్న మరణాలు
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగుల్లో మరణించే వారి శాతం ప్రతి ఏటా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రికి అత్యవసర వైద్యపరిస్థితులైన ఆత్మహత్యాయత్నాలు, హత్యాయత్నాలు, దాడులు, వివిధ రకాల ప్రమాదాలు, గుండెపోటు, పక్షవాతం, ఆయాసం, మూత్రపిండాల వ్యాధులతో చికిత్స కోసం వస్తుంటారు. ఇలాంటి వారిలో కేవలం 20 నుంచి 30 శాతం మాత్రమే క్యాజువాలిటీ, ఏఎంసీ విభాగాల నుంచి బయట పడి డిశ్చార్జ్ అవుతున్నారు. మొత్తంగా ఆసుపత్రిలో గత యేడాది రోజూ మరణాల సంఖ్య 15 నుంచి 18 దాకా ఉండగా ఈ యేడాది అది 18 నుంచి 22కు పెరిగింది. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగర నడిబొడ్డున ఉన్న పెద్దాసుపత్రికి ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచే గాక అనంతపురం, వైఎస్సార్ కడప, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి రోగులు అధికంగా చికిత్స కోసం వస్తారు. ఈ మేరకు ఈ ఆసుపత్రిలో ప్రతిరోజూ ఓపీ రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కరువు ప్రాంతమైన రాయలసీమలో ఇతర ప్రాంతాల మాదిరిగా డబ్బు రొటేషన్ ఉండదు. అందుకే ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులకే రోగులు చికిత్స కోసం వెళతారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోతే సమీపంలోని ఆర్ఎంపీలను ఆశ్రయిస్తారు. వ్యాధి తగ్గకపోతే ఎక్కువ శాతం కర్నూలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలకే వస్తున్నారు. ఇక్కడ అన్ని రకాల వైద్యపరీక్షలు, వైద్యులు, సిబ్బంది చికిత్స అంతా ఉచితం కాబట్టి. ఇవే పరీక్షలు, చికిత్సలు బయట చేయించుకునే స్థోమత లేక వారు ఎక్కువగా ఇక్కడికి వస్తున్నారు. ఈ మేరకు ప్రతిరోజూ ఓపీ రోగుల సంఖ్య 3 వేల నుంచి 3,500ల దాకా, ఇన్‌పేషంట్ల సంఖ్య నిత్యం 1300 నుంచి 1500ల దాకా ఉంటోంది. క్యాజువాలిటీ, జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్ వంటి విభాగాల్లో అయితే ఒక్కో పడకపై ఇద్దరు రోగులు చికిత్స తీసుకునే పరిస్థితి ఉంటుంది. అత్యవసరమైతే అంతే గతి! ఆసుపత్రిలోని క్యాజువాలిటీకి అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ విభాగంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల వరకు పెద్దగా రద్దీ ఉండదు. ఆ తర్వాత ఓపీ చికిత్స దాదాపుగా ముగిసిపోతుంది. దీంతో ఓపీ చికిత్సకు వచ్చిన రోగులు ఇక్కడికే వస్తారు. మధ్యాహ్నం నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండరు. అందుకే ఏదైనా అత్యవసర చికిత్స వస్తే రోగులు నేరుగా ఇక్కడికే వస్తారు. ఇలా వచ్చిన వారికి చికిత్స అందించేందుకు ఆ సమయంలో ఇక్కడ జూనియర్ వైద్యులు మినహా పెద్ద డాక్టర్లు ఎవ్వరూ కనిపించరు. జూనియర్ వైద్యుల్లోనూ కొందరు వారి జూనియర్లపై భారం వేసి వెళ్లిపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ విభాగంలో నర్సింగ్ సిబ్బందే ఎక్కువగా రోగుల పక్కన సేవలందిస్తూ కనిపిస్తారు. ఇక రాత్రివేళల్లో ఇక్కడి సేవల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలు అనే విధంగా ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు రావాల్సిన డ్యూటీ డాక్టర్ సాయంత్రం వస్తారు. వచ్చిన కొన్ని గంటలు మాత్రమే ఉండి, రాత్రి భోజనానికి అంటూ వెళ్లిపోయి మళ్లీ రారన్న విమర్శలు ఉన్నాయి. రోగులకు అత్యవసర పరిస్థితి ఏదైనా ఉంటే డ్యూటీ డాక్టర్లకు జూనియర్ వైద్యులు ఫోన్ చేసి వివరాలు చెప్పి చికిత్స అందించడం ఇక్కడ పరిపాటిగా మారింది. మరునాడు ఉదయం వచ్చే డ్యూటీ డాక్టర్లు రాత్రి ఉండే ఓపీ టికెట్లను పరిశీలించి వార్డుల్లో అడ్మిట్ చేసే కేసులు అధికంగా ఉంటున్నాయి. అప్పటి వరకు రోగులు ఇక్కడే ఉండి చికిత్స అందుకోవాల్సిన పరిస్థితి ఉంటోంది. ఆసుపత్రిలోని మొదటి అంతస్తులో ఉన్న అక్యూట్ మెడికల్ కేర్(ఏఎంసీ)కు రోగి వెళితే అలాగే పైకి వెళతారన్న విమర్శలు ఉన్నాయి. ఈ విభాగంలోనూ ఎక్కువగా జూనియర్ వైద్యులు, నర్సింగ్ సిబ్బందిపైనే వైద్యసేవలు ఆధారపడి ఉంది. వీరిలో కొందరికి రోగులకు అమర్చిన మానిటర్లు, వెంటిలేటర్లు సైతం సరిగ్గా చూడటం రాదన్న విమర్శలు ఉన్నాయి. ఈ విభాగంలో ఉండాల్సిన డ్యూటీ డాక్టర్లు మొక్కుబడిగా వైద్యం చేసి వెళ్లిపోతూ జూనియర్లపై భారం వేస్తున్నారు. దీనికితో ఈ విభాగంలో వైద్యపరికరాలు ఎంత మేరకు పనిచేస్తున్నాయి, వాటిలో రోగికి అవసరమైన ఆక్సిజన్ ఎంత మేరకు వెళ్తుందన్న పర్యవేక్షణ కూడా కరువైంది. ఇన్ఫెక్షన్ రేటు కూడా ఇక్కడ ఎక్కువగా ఉండటంతో మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు పెద్దాసుపత్రి... పెద్ద డాక్టర్లుంటారని, ఇక్కడికి వెళ్తే రోగాలు నయం అవుతాయని, బతికి బయటపడొచ్చని రోగుల నమ్మకం. ఇది ఒకప్పటి మాట. నేడు ఈ ఆసుపత్రికి వెళితే తిరిగి ఇంటికి వస్తారన్న గ్యారంటీ లేదు. ఆసుపత్రిలోని పై అంతస్తులో ఉన్న ఏఎంసీ విభాగంలో చేరిన వారు 80 శాతానికి పైగా మరణిస్తున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది పెద్దాసుపత్రిలో మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కల్గిస్తోంది. గతేడాది నెలకు 500కు పైగా మరణాలు ఈ యేడాది 600లకు చేరువగా! క్యాజువాలిటీ, ఏఎంసీల్లోనే ఎక్కువ అందుబాటులో ఉండని డాక్టర్లు సిబ్బంది నిర్లక్ష్యం మరీ దారుణంపేరుకే ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం ఆసుపత్రిలోని క్యాజువాలిగా(అత్యవసర చికిత్స విభాగం)ని గత ప్రభుత్వంలో ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంగా మార్చారు. ఈ మేరకు ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను కేటాయించారు. క్యాజువాలిటీకి బోర్డులో ఎమర్జెన్సీ మెడిసిన్ అని పేరు మాత్రమే మార్చారు. సేవలన్నీ పాత క్యాజువాలిటీ మాదిరిగానే కొనసాగుతున్నాయి. అత్యవసర వైద్యసేవలు ఇక్కడ మొక్కుబడిగా సాగుతున్నాయి. రాత్రివేళల్లో రోగుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో వారికి అందే వైద్యం దైవాధీనం అన్న చందంగా సాగుతోంది. సీనియర్ వైద్యులు, నర్సులు సీట్లను వదిలి వెళ్లడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మొత్తం వైద్యసేవలను జూనియర్లపై వదిలేసి రికార్డులు రాసుకోవడానికే పరిమితం అవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే ఈ విభాగంలో మరణాల సంఖ్య పెరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. నెల 2025 2026జనవరి 539 631 ఫిబ్రవరి 552 626 మార్చి 466 661 ఏప్రిల్ 544 550 మే 561 655 జూన్ 547 608 జులై 582 549 ఆగస్టు 519 590 -
క‘రుణ’ లేక.. కష్టాలు తొలగక!
కర్నూలు (అగ్రికల్చర్): రెక్కల కష్టాన్ని నమ్ముకున్న రైతుకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రకృతి సహకరించక, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం లేక నష్టాలే మిగులుతున్నాయి. సాధారణంగా ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులు రైతులకు పంట రుణాలు పంపిణీ చేస్తాయి. దాదాపు ఆరు నెలలు అవుతున్నా.. పంట రుణాల పంపిణీ అంతంతమాత్రానికే పరిమితం అయ్యింది. ఐదు నెలల వ్యవధిలో 61.17 శాతం మాత్రమే పంట రుణాలు పంపిణీ చేశారు. ఖరీఫ్ సీజన్ ఈ నెల చివరితో ముగియనుండగా బ్యాంకుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. పంపిణీ చేసింది రూ.2,543 కోట్లు ఖరీఫ్ సీజన్ సాధారణ సాగు 4.34 లక్షల హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 3,48,390 హెక్టార్లలో పంటలు వేశా రు. ప్రధానంగా పత్తి 2,33,984 హెక్టార్లలో సాగైంది. ఖరీఫ్‌లో 3,98,647 మంది రైతులకు రూ.4,157.40 కోట్లు పంట రుణాల పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 1,42,770 మంది రైతులకు రూ.2,542.24 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. జిల్లా లో కెనరా బ్యాంకు లీడ్ బ్యాంకుగా వ్యవహరిస్తోంది. మొత్తం 85,617 మంది రైతులకు రూ.1490 కోట్లు పంట రుణాలు పంపిణీ చేయాలనేది లక్ష్యం. అయితే 31 వేల మందికి రూ.702 కోట్లు మాత్రమే పంటరుణాలు పంపిణీ చేశారు. బ్యాంకుల నిర్లక్ష్యం! రైతులకు ఎటువంటి హామీ లేకుండానే రూ.2లక్షల వరకు రుణాలు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఆ దిశగా ఎటువంటి చర్యలు లేవు. కొన్ని బ్యాంకులు తీవ్ర అలసత్వం వహించాయి. ఖరీఫ్ సీజన్ సెప్టెంబరు నెల చివరిలో ముగియనుంది. అక్టోబరు 1 నుంచే పంపిణీ చేసే రుణాలు రబీ కిందకు వస్తాయి. ఖరీఫ్ ముగింపు దశకు చేరినప్పటికీ 61.17 శాతం మాత్రమే రుణాలు పంపిణీ చేశారు. పలు బ్యాంకులు పాత రుణాలను రెన్యువల్ చేసి చేతులు దులుపుకున్నాయి. కొత్తగా ఒక శాతం మందికి కూడా పంట రుణాలు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. వివిధ బ్యాంకుల్లో దళారీల హవా నడుస్తోంది. మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు దళారీలను పెట్టుకుని పంట రుణాల పంపిణీలో మా మూళ్లు దండుకుంటున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డోన్, ప్యాపిలి, బేతంచెర్ల, వెల్దుర్తి, కృష్ణగిరి, దేవనకొండ, పత్తికొండ, హాలహర్వి మండలాల్లోని ఎస్బీఐ, ఏపీజీబీ, యూనియన్ బ్యాంకులో దళారీలదే రాజ్యంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు బ్యాంకులు సహకరించకపోవడంతో ప్రయివేట్ వ్యక్తుల వద్ద అప్పులు తీసుకుని రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 23 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అంతంతమాత్రమే! వ్యవసాయ రంగం, ప్రాధాన్యత రంగం, ప్రాధాన్యేతర రంగాల్లో 2026–27 ఆర్థిక సంవత్సరంలో రూ.22,323 కోట్ల రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం. ఆర్థిక సంవత్పరం మొదలై దాదాపు ఆరు నెలలు అవుతోంది. ఇప్పటి వరకు రూ.8,368 కోట్లు పంపిణీ చేసినట్లు స్పష్టమవుతోంది. అంటే 37.49 శాతం రుణాలు పంపిణీ చేసినట్లు లెక్కలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో రు ణాల పంపిణీ అంతంతమాత్రంగానే ఉంది. ఈ ఏడాది పంట రుణాలు, అగ్రికల్చర్ టర్మ్‌లోను, వ్యవసాయ మౌలిక సాదుపాయాలు తదితర వాటికి రూ.10,630 కోట్లు రుణాలు పంపిణీ చేయాలనేది లక్ష్యం. అయితే ఆగస్టు చివరి నాటికి రూ.3857.19 కోట్లు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. వ్యవసాయ రంగంలో 36.29 శాతం రుణాలు పంపిణీ చేసినట్లు సమాచారం. ఫ్రాధాన్య రంగంలోకి వచ్చే డీఆర్డీఏ, మెప్మాలకు చెందిన స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీ నామమాత్రంగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఎంఎస్ఎంఈ కింద ఈ ఏడాది 27933 మందికి పరిశ్రమల ఏర్పాటుకు రూ.4585 కోట్లు రుణాలుగా పంపిణీ చేయాలనేది లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 7900 మందికి రూ.1922 కోట్లు రుణాలు పంపిణీ చేసినట్లు లెక్కలు ఉన్నాయి.కౌలురైతులను పట్టించుకుంటే ఒట్టు!అన్నదాత సుఖీభవ పథకం రెండేళ్లుగా ఒక్క కౌలు రైతుకు కూడా అమలు కాలేదు. ఈ ఏడాది 14,000 సీసీఆర్సీ కార్డులు జారీ అయ్యాయి. అత్యధికంగా ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, కౌతాళం, పెద్దకడుబూరు, గూడూరు, హొళగుంద, మద్దికెర, తుగ్గలి, నందవరం మండలాల్లో సీసీఆర్సీ కార్డులు జారీ అయ్యాయి. సీసీకార్డులను బ్యాంకర్లు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ ఆర్థిక సంవత్సరంలో కౌలుదారులకు రూ.45 కోట్లు రుణాలు పంపిణీ చేయాలనేది లక్ష్యం. సీసీఆర్సీ కార్డులు పొందిన సాగుదారులు జేఎల్‌జీ గ్రూపులుగా ఏర్పాటు కావడంతో రూ.65 లక్షలు మాత్రమే పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం నిల్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు ఎగనామం పెట్టింది. కేంద్ర వాటా విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఏ పంటలో కూడా క్వింటాలు దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపధ్యంలో రైతులు వాతావరణ ఆదారిత బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై దృష్టి సారించారు. బ్యాంకుల్లో పంట రుణం ఉన్న రైతులు బ్యాంకుల ద్వారానే ప్రీమియం చెల్లించాల్సి ఉంది. అయితే బ్యాంకులు సహకరించకపోవడంతో రైతులు నాన్ లోని కింద ప్రీమియం చెల్లించాల్సి వచ్చింది. మీ సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా 1,92,884 దరఖాస్తుల ద్వారా రైతులు ప్రీమియం చెల్లించారు. రుణాల పంపిణీలో కనిపించని పురోగతి ఖరీఫ్ లక్ష్యం రూ.4,157 కోట్లు ఆగస్టు వరకు పంపిణీ చేసింది రూ.2,543 కోట్లు అప్పులబాధతో 23 మంది రైతుల ఆత్మహత్య -
చిన్న పిల్లలు ఉన్నారన్నా.. నన్ను బతికించండి!
కర్నూలు: ఓ వైపు రక్తమోడుతున్నా ఇంటి వద్ద ఉన్న భార్యా పిల్లలను గుర్తు చేసుకుంటూ.. ‘అన్నా.. నన్ను రక్షించండి.. నాకు చిన్న పిల్లలన్నా’ అంటూ విలపించాడు. కదలలేనిస్థితిలో ఇరుక్కుపోయినా ‘మా ఇంట్లో వాళ్లకి ఫోన్ చేసి మాట్లాడాలా’ అంటూ విలవిలలాడాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ క్షతగాత్రుని వేదన అక్కడి వారిని కన్నీరు పెట్టించింది. కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారిపై మంగంపల్లె స్టేజీ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వాహన డ్రైవర్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు ఐరన్ మెటీరియల్ లోడ్‌తో వెళ్తున్న లారీ మంగంపల్లె స్టేజ్ వద్ద టైర్ బరస్ట్ అయ్యి రహదారికి కుడి వైపు డివైడర్ పక్కనే నిలిచిపోయింది. లారీ డ్రైవర్ కిందకు దిగి పరిస్థితిని చూసి 1032 ద్వారా సమాచారమిచ్చాడు. అయితే నిమిషాల వ్యవధిలోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఐచర్ వాహ నం లారీని ఢీకొంది. దీంతో ఐచర్ వాహన డ్రైవర్ తాడిపత్రికి చెందిన నాగేంద్ర (35) డ్రైవింగ్ సీటులోనే ఇరుక్కుపోయాడు. వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్న హైవే పోలీసులు ఆనంద్, శివ, హైవే అంబులెన్స్ సిబ్బంది, క్రేన్ సిబ్బంది ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను దాదాపు గంటపాటు శ్రమించి బయటకు తీశారు. ఆ సమయంలో డ్రైవర్ ‘త్వరగా తీయండన్నా.. తట్టుకోలేకపోతున్నాను.. నాకు చిన్న పిల్లలన్నా.. మా ఇంట్లో వాళ్లకి ఫోన్ చేసి మాట్లాడాలి’ అంటూనే సృహ కోల్పోతుండడం అక్కడి వారి హృదయాలను కలచివేసింది. అతి కష్టం మీద బయటకు తీయగా అప్పటికే తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు. చదవండి: రన్నింగ్ ఆటోలోనే ప్రసవం.. రోడ్డుపై విసిరేసిన తల్లి -
ఆదోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర దారుణం
సాక్షి, కర్నూలు జిల్లా: ఆదోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర దారుణం జరిగింది. నర్సమ్మ (30) అనే మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆమె మున్సిపాలిటీ కాంట్రాక్ట్ వర్కర్క్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తెల్లవారు జామున ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా విధులు నిర్వహిస్తున్న నర్సమ్మపై దాడి చేసిన దుండగులు.. పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికులు మంటలార్పి, 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. -
‘ఉమ్మడి’ పాలనకు తెర.. ఇక వేర్వేరు జెడ్పీలు!
కర్నూలు(అర్బన్): రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలను పునర్విభజన చేసిన నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో జిల్లా పరిషత్ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి పీఆర్అండ్ఆర్డీ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే శనివారం జీఓఎంఎస్ నెం.115 జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నంద్యాల జిల్లా కేంద్రంగా కొత్త జిల్లా పరిషత్ ఆవిర్భవించనుంది. ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీల పదవీ కాలం ఈ నెల 24వ తేదితో ముగియనుంది. ఆ మేరకు కొత్త జిల్లా పరిధులకు అనుగుణంగా జిల్లా పరిషత్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. కొత్తగా ఏర్పా టు కానున్న నంద్యాల జిల్లా పరిషత్‌కు సీఈఓ, డిప్యూటీ సీఈఓలను ప్రభుత్వం త్వరలోనే నియమించేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలులో మొత్తం 53 మండలాలు ఉండగా.. కర్నూలు జిల్లా పరిషత్ పరిధిలోకి 25 మండలాలు, కొత్తగా ఏర్పాటు కానున్న నంద్యాల జిల్లా పరిషత్ పరిధిలోకి 28 మండల పరిషత్తులు ఉండనున్నాయి. ప్రస్తుత పాలక వర్గం పదవీ కాలం ముగిసిన అనంతరం రెండు జిల్లాల్లో ప్రత్యేకంగా పాలనా వ్యవస్థ ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ● 1959లో కర్నూలు జిల్లా పరిషత్ ఏర్పాటు కాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మొట్టమొదటి జిల్లా పరిషత్ చైర్మన్‌గా పాలన సాగించగా, ఉమ్మడి జిల్లా పరిషత్ చివరి చైర్మన్‌గా యర్రబోతుల పాపిరెడ్డి చరిత్రలో నిలిచిపోనున్నారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డితో పాటు యర్రబోతుల పాపిరెడ్డి వరకు మొత్తం 16 మంది చైర్మన్లు కర్నూలు జిల్లా పరిషత్ పాలనలో భాగస్వామ్యులయ్యారు. ఈ నెల 24తో ముగియనున్న జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీల పదవీ కాలం నంద్యాలలో కొత్తగా జిల్లా పరిషత్ ఏర్పాటుకు చర్యలు -
తూతూ మంత్రంగా గురుపూజోత్సవం
● స్థానికంగానే ఉన్నా కన్నెత్తి చూడని మంత్రి టీజీ భరత్ ● గ్రూప్ ఫొటోకు మాత్రమే హాజరైన కలెక్టర్డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళులర్పిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులుఆకట్టుకున్న నృత్య ప్రదర్శనకర్నూలు(సెంట్రల్): జిల్లా స్థాయి గురుపూజోత్సవ కార్యక్రమాన్ని శనివారం తూతూమంత్రంగా నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి కలెక్టరేట్లోనే అందుబాటులో ఉన్నా మిగతా పనులతో బిజీగా ఉండి రాలేకపోయారు. దీంతో డీఈఓ ఎల్.సుధాకర్ అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించగా ఆర్ఐఓ లాలెప్ప, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ లోకరాజు హాజరై జ్యోతిప్రజ్వలన, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయితే మధ్యలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కర్నూలు ఎంపి బస్తిపాటి నాగరాజు రావడంతో మరోసారి సర్వేపల్లి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ రెండు నిమిషాలు మాట్లాడి ఇతర పనులు ఉన్నాయంటూ వెళ్లిపోయారు. చివరగా కలెక్టర్ గ్రూప్ ఫొటో దిగడానికి మాత్రమే వచ్చి మమ అనిపించడం గమనార్హం. కార్యక్రమంలో మొత్తం 48 మంది జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువా కప్పి మెమొంటోతో సన్మానించారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ తాను కూడా ఒకప్పుడు లెక్చరర్‌గా పనిచేశానని, ఉపాధ్యాయులే సమాజ మార్గనిర్దేశకులని అన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను బోధించాలన్నారు. కార్యక్రమంలో బీక్యాంపు గర్ల్స్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు వందేమాతరం గేయాన్ని, శారద నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ, డీవైఈఓ శ్రీధర్ పాల్గొన్నారు. -
సమయపాలన పాటించకపోతే చర్యలు
● సచివాలయాల సిబ్బందికి కలెక్టర్ హెచ్చరిక కర్నూలు(సెంట్రల్): స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బంది తప్పనిసరిగా నిర్దేశించిన సమయానికి విధులకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. శనివారం ఆమె కలెక్టరేట్ నుంచి మండల స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల తనిఖీ చేసిన సమయంలో సిబ్బంది హాజరు 62 శాతం మాత్రమే నమోదైనట్లు గుర్తించామన్నారు. ప్రజలకు అవసరమైన సేవలు సకాలంలో అందించేందుకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తప్పనిసరిగా సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. హాజరులో నిర్లక్ష్యం కనిపిస్తే సంబంధిత మండల స్థాయి అధికారిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యాలయాల్లో వివిధ రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించడం లేదని, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారి భాస్కర్ నాయుడు, అదనపు మున్సిపల్ కమిషనర్ కృష్ణ, మండల స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు. రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే meekosam.a p.gov.in అనే వెబ్సైట్లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆర్యూ నుంచి విద్యార్థి బహిష్కరణ కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ నుంచి ఒక విద్యార్థిని బహిష్కరిస్తూ వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయం నుంచి శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. వర్సిటీ కళాశాలలో తెలుగు పీజీ మూడవ సెమిస్టర్ చదువుతున్న సుగాలి కృష్ణ నాయక్‌ను వర్సిటీ నుంచి బహిష్కరించారు. ఈనెల 2న వర్సిటీలో అధికారులు, సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగడం, అభ్యంతరకర భాషను ఉపయోగించడం లాంటి కారణాలతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వర్సిటీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేసీ కెనాల్‌కు కృష్ణా జలాలు పగిడ్యాల: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కేసీసీ లిఫ్ట్ నుంచి రెండు మోటర్ల ద్వారా కేసీ కెనాల్‌కు కృష్ణా జలాలను విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ ఏఈఈ వీరమ్మ శనివారం తెలిపారు. కేసీ కాలువ పరివాహక గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చడానికి పది రోజుల పాటు నీటి సరఫరా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కొక్క మోటార్ నుంచి 240 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలకు మాత్రమే విడుదల చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. అలాగే మల్యాల లిఫ్ట్ నుంచి 330 క్యూసెక్కుల నీటి సరఫరా కొనసాగుతుందని తెలిపారు. అయితే కేసీ కాలువకు సాగునీరు విడుదల చేయాలని వైఎస్సార్సీపీ నాయకులు ఉరితాళ్లతో నిరసన చేసిన ఐదు రోజుల వ్యవధిలోనే అధికారులు నీటి విడుదల చేయడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లాకిన్స్‌లా వద్ద లాకులు జూపాడుబంగ్లా: కేసీ కాల్వకు ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి 480, మల్యాల నుంచి 325 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 120 కిలోమీటరు వద్ద నుంచి నిప్పులవాగు, తూడిచెర్ల సబ్‌ఛానల్ కాల్వకు వెళ్లకుండా అధికారులు లాకిన్స్‌లా వద్ద లాకులు మూసివేశారు. ఈ విషయమై కేసీ కాల్వ ఏఈ శ్రీనివాసనాయక్ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాలు వెలువడిన తర్వాత దిగువ కాల్వలకు నీటిని సరఫరా చేస్తామన్నారు. -
ఎఫ్‌బీటీ యాప్ పేరుతో భారీ మోసం
● సుమారు రూ.కోటి కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు!బండిఆత్మకూరు: అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి ఎఫ్‌బీటీ యాప్ పేరుతో బండిఆత్మకూరు మండలం ఎరగ్రుంట్ల గ్రామస్తులను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. బాధితుల నుంచి దాదాపు రూ.కోటి వరకు నగదు సేకరించి మోసానికి పాల్పడినట్లు సమాచారం. తొలుత యాప్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. కొంతకాలం పాటు లాభాలు వచ్చినట్లు చూపించి బాధితుల్లో విశ్వాసం కల్పించారు. అనంతరం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేలా ప్రలోభపెట్టారు. నగదును వివిధ ఖాతాలకు బదిలీ చేయించుకున్నట్లు బాధితులు చెబుతున్నారు. యాప్‌లో చూపించిన నగదును విత్‌డ్రా చేసుకునేందుకు వీలు లేకపోవడంతో బాధితులు మోసపోయినట్లు గుర్తించారు. పంటలు లేవు కదా అని ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టి కొంత డబ్బును తీసుకున్నా. ఐదు రూపాయల వడ్డీ ద్వారా కొంత డబ్బును తీసుకున్నా. ఎఫ్‌బీటీ యాప్ పేరుతో రూ. 3 లక్షలను ఫోన్ పే ద్వారా చెల్లించా. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తిరిగి రాలేదు. – కుమారి , బాధితురాలు -
హైకోర్టు బెంచ్ సాధనకు ఉద్యమం ఉధృతం
● రౌండ్ టేబుల్ సమావేశంలో న్యాయవాదులు, రాజకీయ పక్షాల నిర్ణయంకర్నూలు: శాశ్వత హైకోర్టు బెంచ్ సాధన కోసం ఉద్యమం మరింత ఉధృతం చేయాలని న్యాయవాదులు, రాజకీయ పక్షాలు నిర్ణయించాయి. న్యాయవాదుల సంఘం భవనంలో శనివారం నిర్వహించిన ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, బీఎస్పీ, విద్యార్థి, రైతు, కార్మిక, సామాజిక సేవా సంఘాల ప్రతినిధులు, ఉద్యమకారులు సమావేశంలో పాల్గొని న్యాయవాదుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని తమ వంతు సహకారం అందిస్తామని ఆయా రాజకీయ పక్షాలు, సంఘాల ప్రతినిధులు స్పష్టంగా హామీ ఇచ్చారు. న్యాయవాదుల దీక్షకు మద్దతుగా రాజకీయ పక్షాల ప్రతినిధులు కూడా పాల్గొంటారని హామీ ఇచ్చారు. 13వ రోజు కొనసాగిన న్యాయవాదుల దీక్షలు... శాశ్వత హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరాహారదీక్షలు 13వ రోజు కూడా కొనసాగాయి. శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేవరకు ఉద్యమం కొనసాగిస్తామని న్యాయవాదులు స్పష్టం చేశారు. అనిశెట్టి నీరజ, ఎస్.మహమ్మద్ అన్వర్ సాదత్, గోపాల్ యాదవ్, ఈడిగ బుద్దిరాజు గౌడ్, గైక్వాడ్ భరత్ కుమార్, షేక్ మాసూం వలి, పీఎస్ హరీష్ రెడ్డి తదితరులు శనివారం నిర్వహించిన రిలే నిరాహారదీక్షల్లో పాల్గొన్నారు. సోమవారం జనరల్ బాడీ సమావేశం శాశ్వత హైకోర్టు బెంచ్ సాధన కోసం తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు సోమవారం న్యాయవాదుల జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు చంద్రుడు తెలిపారు. ప్రధాన కార్యదర్శి మహేశ్వర రెడ్డి, ఉపాధ్యక్షుడు రసూల్ ఖాన్, సీనియర్ న్యాయవాదులు రామసుబ్బారెడ్డి, జయరాజు, బి.మురళీమోహన్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. -
ఏపీ వ్యాప్తంగా బట్టబయలవుతున్న డీఎస్సీ అక్రమాలు
సాక్షి, విజయవాడ: ఏపీ వ్యాప్తంగా డీఎస్సీ అక్రమాలు బయటపడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోనూ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా బండారం బయటపడింది. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన పెద్ద అప్పలరాజుపై ఫిర్యాదులు వచ్చాయి. ఉద్యోగం పొందిన వ్యక్తి పేరు “పెద్ద అప్పలరాజు” కాగా, “పాండ అప్పలరాజు” పేరుతో ఉన్న సర్టిఫికెట్‌ను అప్లోడ్ చేశారు. శాప్ పోర్టల్‌లో అభ్యర్థి తమ్ముడి పేరుతో ఉన్న సర్టిఫికెట్‌ను ఎందుకు అప్లోడ్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా, సర్టిఫికెట్‌ను మూడు సార్లు ఎందుకు మార్చారు? అనే సందేహాలు కలుగుతున్నాయి.ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ..ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ డీఎస్సీ నూయామకాల్లో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ బ్లైండ్ సెర్టిఫికెట్తో ఒక వ్యక్తి ఉద్యోగం పొందాడని మరో మహిళా అభ్యర్థి ఆరోపిస్తున్నారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల జాబితా ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. విశాఖ డీఈవో ప్రేమ్ కుమార్‌ని స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల జాబితా ఇవ్వాలని సాక్షి మీడియా కోరగా.. జాబితా ఇవ్వకూడదని.. ఉన్నతాదికారుల ఆదేశాలు పాటిస్తున్నామని డీఈవో తెలిపారు. ఏ సమాచారం కావాలన్నా లిఖిత పూర్వకంగా కోరితే ఆర్జేడీకి పంపుతామంటూ వెల్లడించారు.కోనసీమ జిల్లాలో అడ్డగోలుగా పోస్టింగులు..కోనసీమ జిల్లాలో అడ్డగోలుగా డీఎస్సీ అభ్యర్థుల పోస్టింగులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం అప్పన రాముని లంకకు చెందిన గాయత్రి సాయిశ్రీకి కాట్రేనికోన మండలం బ్రహ్మసమేద్యం పోస్టింగ్ ఇచ్చారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ రిమార్క్స్‌లో నాట్ క్వాలిఫైడ్ అని అధికారులు రాశారు. ఆమె బీఈడీ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. ఫైనల్ లిస్ట్‌లో మాత్రం బాక్సింగ్ స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వం.. ఉద్యోగం ఇచ్చేసింది. బీఈడీ సర్టిఫికెట్లు లేకపోయినా అధికారులు ఎలా ఉద్యోగం ఇచ్చారో స్పష్టం కాలేదు. 11 సార్లు తెలుగు టెట్ రాసిన ఆమెకు సోషల్ స్కూల్ అసిస్టెంట్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఈ పోస్టింగ్‌పై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు పండిట్‌కు సోషల్ పోస్టింగ్ ఎలా ఇచ్చారో అధికారులు స్పష్టం చేయలేదు.రిజర్వేషన్లలోనూ గోల్మాల్వైఎస్సార్ జిల్లాలోనూ డీఎస్సీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. రిజర్వేషన్లలోనూ గోల్మాల్ చేసి అభ్యర్థులు ఉద్యోగం పొందినట్లు తేలింది. వైఎస్సార్ జిల్లాలో బీసీ–ఈ అభ్యర్థి మనూర్ రసూల్ ఓసీ కింద ఉద్యోగం పొందారు. 2008, 2012, 2018 డిఎస్సీల్లో తాను బీసీ–ఈ కేటగిరీగా నమోదు చేసుకున్న రసూల్.. 2025 డిఎస్సీలో మాత్రం తాను ఓసీ (ఈడబ్ల్యూఎస్) కింద దరఖాస్తు చేసుకుని ఉద్యోగం పొందారు.రసూల్ చేసిన అవకతవకల వల్ల తనకు ఉద్యోగం రాలేదని రాయచోటికి చెందిన జమీల్ ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని జమీల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా రిజర్వేషన్లనే మార్చేసి అక్రమంగా ఉద్యోగం పొందడంపై చంద్రబాబు సర్కార్ నోరు విప్పడం లేదు. ఏడాదిగా ఈ అంశంపై జిల్లా యంత్రాంగం విచారణ చేస్తూనే ఉన్నారు. రసూల్ చేసిన అక్రమాలపై చర్యలు తీసుకుని తనకు రావాల్సిన ఉద్యోగం ఇప్పించాలని జమీల్ కోరుతున్నారు.విద్యా శాఖ ప్రకటనతో అనుమానాలుకర్నూలు డీఎస్సీ అక్రమాలు కప్పి పుచ్చేందుకు విద్యాశాఖ ప్రయత్నం చేస్తోంది. విద్యాశాఖ ప్రకటనతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఎస్సీ అంతా పారదర్శకం అంటూ విద్యాశాఖ మీడియా ప్రకటన చేసింది. కర్నూలు జిల్లా కౌతాళం మండలం, వల్లూరు ఎంపీపీఎస్ (న్యూ) పాఠశాలలో క్రీడా కోటా కింద ఈడిగ ప్రభాకర్, SGT(తెలుగు)గా ఎంపిక, పోస్టింగ్ ప్రక్రియలో అక్రమాలపై పాఠశాల విద్యా శాఖ వివరణ ఇచ్చింది. పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ పేరుతో ప్రకటన విడుదల చేసింది. ఘటన గురించి తెలిసిన వెంటనే శాఖాపరమైన దర్యాప్తును విద్యా శాఖ ప్రారంభించింది.ఉన్నతాధికారులు విచారణ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. కర్నూలు డీఈవో విచారణను ప్రారంభించి, సమగ్ర పరిశీలన కోసం సంబంధిత రికార్డులను, వెరిఫికేషన్ ఫైళ్లను తెప్పించారు. విచారణ నివేదిక అందగానే, రిక్రూట్మెంట్, సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని.. డీఎస్సీ-2025 నియామక ప్రక్రియలో సంపూర్ణ పారదర్శకత, ప్రతిభ ఆధారిత ఎంపిక, విధానాన్ని అవలంభించామని పాఠశాల విద్యాశాఖ పునరుద్ఘాటిస్తోంది. -
విలువలతో కూడిన విద్యతో గుర్తింపు
బండిఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన జి.శ్రీనివాసులు 2012లో జూనియర్ లెక్చరర్ల నియామకంలో స్టేట్ టాపర్‌గా నిలిచారు. అప్పటి నుంచి 2021 సంవత్సరం వరకు మిడుతూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జంతుశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు. 2021లో కర్నూలు నగరంలోని కెవిఆర్ బాలికల జూనియర్ కాలేజీకి బదిలీపై వచ్చారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వాములను చేసి సేవా దృక్పథాన్ని పెంపొందించారు. అత్యుత్తమ ఫలితాలతో పాటు చదువులో వెనుకబడిన విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేలా బోధన సాగిస్తున్నారు. కేవీఆర్ కాలేజీలో పని చేస్తున్న ఓ చిరుద్యోగి కిడ్నీలు పాడై చికిత్సకు ఇబ్బంది పడుతుండటంతో కొంత సొమ్ము వసూలు చేసి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. గతేడాది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. – కర్నూలు సిటీ -
రాష్ట్ర స్థాయి అవార్డులు
పాఠశాల విభాగం ఉపాధ్యాయుని పేరు పనిచేస్తున్న ప్రాంతం అద్దంకి చంద్రమోహన్, ఎస్జీటీ లక్ష్మీతండా, తుగ్గలి శీలం జయమ్మ, హెచ్ఎం కరివేముల, దేవనకొండ మండలం ఎం.ఆదిమూర్తి, ఎస్ఏ విరుపాపురం, ఆదోని మండలం జూనియర్ కాలేజీ విభాగం జి.శ్రీనివాసులు కేవీఆర్ కళాశాల, కర్నూలు డిగ్రీ కాలేజీ విభాగం డాక్టర్ ఎం.బుచ్చయ్య సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీ, కర్నూలు డాక్టర్ నాగ్ అరుణ్ మల్రెడ్డి సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీ, కర్నూలు ● విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేస్తున్న ఉపాధ్యాయులు ● వృత్తిలో రాణిస్తూనే సేవా కార్యక్రమాలకు పెద్దపీట ● ఉత్తమ సేవలతో ముగ్గురికి రాష్ట్రస్థాయి అవార్డులు ● జిల్లా స్థాయి ఉత్తమ అవార్డులకు 43 మంది ఎంపిక -
శాశ్వత బెంచ్ ప్రకటించే వరకు ఉద్యమం ఆగదు
కర్నూలు (టౌన్): హైకోర్టు శాశ్వత బెంచ్‌పై ప్రభుత్వం స్పష్టమైన అధికారిక ప్రకటన చేసే వరకు ఉద్యమం ఆగదని జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బి.చంద్రుడు, ప్రధాన కార్యదర్శి టీ.మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్యర్యంలో కోర్టు విధులకు హాజరయ్యే సమయంలో ధరించే నల్లకోటుకు బదులుగా సివిల్ డ్రెస్‌లో కూర్చొని న్యాయవాదులు 12వ రోజు దీక్షలను కొనసాగించారు. వారు మాట్లాడుతూ.. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేస్తే రాయలసీమ ప్రాంత ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువవుతాయన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో హైకోర్టు శాశ్వత బెంచ్‌పై ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంపై న్యాయవాదులుగా తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేస్తున్నామన్నారు. 12వ రోజు దీక్షల్లో ఈదుల బాలాజీ రెడ్డి, మురళీక్రిష్ణ, నేతన్యా, రాజేంద్రప్రసాద్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. న్యాయవాదుల దీక్షలకు పలువురు మద్దతు సర్క్యూట్ బెంచ్ కాకుండా కర్నూలులో శాశ్వతంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని గత 11 రోజలుగా న్యాయవాదులు చేపడుతున్న రిలే నిరహార దీక్షలకు పలువురు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. రాయలసీమ యూనివర్సిటీ రిటైర్డు ప్రొఫెసర్ డాక్టర్ మన్సూర్ ఆలీఖాన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, లౌకిక రాజ్య పరిరక్షణ వేదిక కన్వీనర్ నరసింహా తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈసీహెచ్ సమావేశానికి హాజరవ్వాలి కర్నూలు(సెంట్రల్): ఈసీహెచ్ పాలీక్లినిక్ నెల వారీ సమావేశానికి ప్రతి మాజీ సైనికుడు హాజ రై విజయవంతం చేయాలని కర్నూలు డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీసుమెన్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు యు.సుధాకర్, వెంకటేశ్వర్లు, ట్రెజరర్ మలికార్జున శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. మాజీ సైనికులకు సంబంధించి అధునాతన వైద్యం అందించడంలో ఈసీహెచ్ ఆఫీసర్ ఇన్చార్జ్ విఫలమైన నేపథ్యంలో అందరూ హాజరై హక్కుల కోసం నిలదీయా ల్సి ఉందన్నారు. ఆసుపత్రి ఎంప్యానెల్మెంట్, అందుబాటులో లేని వైద్య సదుపాయాలు, మందుల సరఫరా, రెఫరల్స్, వైద్య సేవల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, ఇతర సమస్యలను సమావేశంలో చర్చించనున్న నేపథ్యంలో మాజీ సైనికులు హాజరు కావాలని కోరారు. ఇంటింటి సర్వేపై అభ్యంతరాల స్వీకరణ కర్నూలు(అర్బన్): గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గుర్తించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలు తెలపాలని జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ కోరారు. శుక్రవారం కర్నూలు మండలం దిన్నెదేవరపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ ఎస్ఈసీ ఆదేశాల మేరకు గత నెల 18 నుంచి 24వ తేది వరకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపునకు ఇంటింటి సర్వే నిర్వహించామన్నారు. ఆ మేరకు గుర్తించిన ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఓటర్ల జాబితాలపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించేందుకు ఈ నెల 3 నుంచి 6వ తేది వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 6వ తేది వరకు గ్రామ సభలను నిర్వహించి తుది ఓటరు జాబితాలను రూపొందిస్తామన్నారు. ఈ జాబితాలను జిల్లా కలెక్టర్ ఆమోదంతో 7వ తేదీన తుది జాబితాలను ప్రచురిస్తామన్నారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీడీఓ ఎల్.భరత్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి జాకీర్ పాల్గొన్నారు. భక్తులు సంతృప్తి చెందేలా సౌకర్యాలు కల్పించాలిశ్రీశైలంటెంపుల్: శ్రీశైల యాత్రకు విచ్చేసే భక్తులందరూ సంతృప్తి చెందేలా ప్రతి ఒక్క సిబ్బంది కృషి చేయాలని శ్రీశైల దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు అన్నారు. శ్రీశైల దేవస్థాన పరిపాలనాంశాలపై ఈఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. శుక్రవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమావేశమందిరంలో నిర్వహించిన సమావేశానికి డీఈవో చంద్రశేఖర్, అన్ని యూనిట్ విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, ఏఈలు పాల్గొన్నారు. అన్ని విభాగాలు కూడా అధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని అన్నారు. రోజురోజుకు పెరుగుతున్న భక్తులరద్దీకి అనుగుణగా ఆయా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఇంజనీరింగ్ అధికారులు శాసీ్త్రయ అంశాల ఆధారంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. -
చదువుల వనంలో సాహితీ సేద్యం
డోన్ పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయునిగా పని చేస్తున్న డాక్టర్ దేవేంద్రప్ప రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. తుగ్గలి మండలం రాంపల్లి గ్రామానికి చెందిన ఈయన 2002 డీఎస్సీలో ఎంపికై తెలుగు ఉపాధ్యాయునిగా అవుకు మండలం కునుకుంట్ల పాఠశాలలో చేరారు. ఈయన తెలుగు భాషపై పట్టు సాధించి సాహిత్యంపై అడుగులు వేశారు. విధులు నిర్వహించే పాఠశాలల్లో విద్యార్థులకు భాషాభివృద్ధి, బాల సాహిత్యం పట్ల ఆసక్తి కలిగించడంతో పాటు నైతిక విలువలు, సృజనాత్మక, క్రమశిక్షణ విషయాలను విద్యార్థులకు బోధిస్తూ ఆదర్శంగా నిలిచారు. సాహిత్యం పట్ల మక్కువతో ఆయన ఆశావాది, ఆభ్యుదయ భావకుడు, అంబేడ్కకర్ శతకం అనే గ్రంథాలు రచించారు. అలాగే సృజనా స్రవంతి, చదువు ఎదుగు, అనిత అనే కథానికలకు సంపాదకత్వం వహించారు. రాష్ట్రంలో అనేక సాహితి సంస్థల నుంచి పురస్కారాలు, సత్కారాలను పొందారు. ఈ క్రమంలో ఆయనను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. ఈ పురస్కారం తనకు మరింత ప్రోత్సాహానిచ్చిందన్నారు. – డోన్ రూరల్ -
బాబు, పవన్, లోకేష్.. జాబ్‌లు మీకేనా, మాకివ్వరా?
● కర్నూలులో ఆశావహ పోలీసు అభ్యర్థుల మూడు రోజుల రిలే నిరాహారదీక్షలు ప్రారంభంకర్నూలు(సెంట్రల్): తమ ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ పదవులు పొంది తమనే మరచిపోయారని ఆశావహ పోలీసు అభ్యర్థులు తీవ్ర ఆవేదన చెందారు. శుక్రవారం కర్నూలులో ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని కోరుతూ కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లాలకు చెందిన ఆశావహ పోలీసు అభ్యర్థులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే ప్రభుత్వం పోలీసులను అట్టుపెట్టి ఈ దీక్షలను అడ్డుకోవడానికి శతవిధాల ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నిరుద్యోగులు గ్రూపులుగా విడిపోయి నగరంలోని శ్రీకృష్ణ దేవరాయల సర్కిల్లో ఉన్న ధర్నా చౌక్‌కు చేరుకొని దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాము, చైతన్య, అంజి, చంద్ర మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చిందన్నారు. తరువాత నాలుగేళ్ల నుంచి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నా ఎందుకు విడుదల చేయడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలు గడిచినా ఉద్యోగాల భర్తీకి ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారాలోకేష్ ప్రతి ఏడాది జాబ్‌క్యాలెండర్ అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా జాబ్ క్యాలెండర్లో ఒక్క పోస్టునైనా భర్తీ చేయలేకపోయారన్నారు. జాబ్ లేస్ క్యాలెండర్‌ను రూపొందించిన ప్రభుత్వం పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులను కేవలం 1,600 చూపడం అన్యాయమన్నారు. అసెంబ్లీలో హోంశాఖ మంత్రి అనిత, డీజీపీ చెప్పిన విధంగా 11,639 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. పోలీసు అభ్యర్థులు వయో పరిమితి 35 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. -
వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రతం
● వ్రతంలో పాల్గొన్న 1,233 మంది చెంచు, 500 మంది ఇతర భక్తులుశ్రీశైలంటెంపుల్: ధార్మిక కార్యక్రమ నిర్వహణలో భాగంగా శ్రీశైల దేవస్థానం శ్రావణ నాల్గవ శుక్రవారం ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించింది. శుక్రవారం ఆలయ ఉత్తరద్వారం ఎదురుగా చంద్రవతి కళ్యాణ మండపంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మీ వ్రతంలో నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలోని పలు చెంచుగూడేలకు చెందిన 1,233 మంది చెంచు మహిళా భక్తులు, 500 మంది ఇతర మహిళా భక్తులు పాల్గొని వ్రతాన్ని జరిపించుకున్నారు. వ్రతాలకు కావలసిన పూజాద్య్రాలన్నింటిని దేవస్థానమే సమకూర్చింది. వ్రత కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరి కోసం వేర్వేరుగా కలశాలను నెలకొల్పి శాస్త్రోక్తంగా వ్రతం జరిపించారు. వ్రతాన్ని జరిపించుకున్న వారందరికీ పూలు, గాజులు, కంకణాలు, తులసి మొక్క, శ్రీశైల ప్రభ మాసపత్రిక, మూడు రకాల ప్రసాదాలు, అమ్మవారి శేవస్త్రాలను కూడా అందజేశారు. సంప్రదాయబద్ధంగా జరిపిన వ్రతంలో మహాగణపతిపూజ, వేదికపై ఆశీనులను చేసిన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు జరిపించారు. వరలక్ష్మీవ్రతంలో భాగంగా భక్తులందరి చేత విడివిడిగా కలశస్థాపన చేయించి వరలక్ష్మీదేవిని సమంత్రకంగా అవాహన చేశారు. అనంతరం అర్చకులు వ్రతకథను పఠించి వ్రత మహిమా విశేషాలను భక్తులకు తెలియజేశారు. చివరిగా నీరాజన మంత్రపుష్పాలను జరిపి వ్రతసమాప్తి చేశారు. భక్తులందరికీ ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించారు. -
చెంచు విద్యార్థుల చదువులకు ‘ఆధార’మై..
నిరుపేద కుటుంబంనుంచి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన అతను పేద విద్యార్థులకు చుక్కానిగా నిలుస్తున్నారు. ఆత్మకూరు మండలం బాపునంతపు రం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు 16 ఏళ్ల క్రితం 2010 నవంబర్‌లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. ప్రస్తుతం కొట్టాలచెరువు చెంచుగూడెంలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వ హిస్తున్నారు. చెంచుగిరిజన పిల్లలు చదువుకు దూరంగా ఉండడంతో వారి తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలకు వచ్చేలా చేశారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో సొంత ఖర్చులతో రంగులు వేయించారు. పాఠశాలలో ప్రత్యేక ఆధార్ క్యాంపు ఏర్పాటు చేసి విద్యార్థులకు కార్డులు అందజేశారు. వెదురుబొంగులతో అదనపు తరగతి గదిని ఏర్పాటు చేయించారు. ఆర్డీటీ సహకారంతో విద్యా వలంటరీ నియమించారు. దాతల సహకారంతో మినరల్ వాటర్ ఏర్పాటు చేయించారు. ఆయన సేవలను గుర్తించి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ.. చెంచు గిరిజన గూడెం విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే తన లక్ష్యమన్నారు. – ఆత్మకూరు -
బోధన సృజనాత్మకం
విద్యార్థులు సులభంగా పాఠ్యాంశాలను అర్థం చేసుకునేలా బోధించేందుకు కొందరు ఉపాధ్యాయులు కృషి చేస్తుంటారు. అందులో తుగ్గలి మండలం లక్ష్మీతండా ప్రాథమిక పాఠశాల హెచ్ఎం అద్దంకి చంద్రమోహన్ ఒకరు. తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన ఆయన ప్రస్తుతం లక్ష్మీతండా ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్నారు. 2008లో ఉపాధ్యాయ వృత్తిలో చేరిన ఆయన పలు పాఠశాలల్లో పని చేశారు. టీఎల్ఎం (టీచింగ్, లెర్నింగ్, మీటీరియల్) రూపొందించారు. స్వతహాగా చేసిన టీఎల్ఎం ద్వారా విద్యార్థులకు బోధిస్తూ ఉత్తమ ఫలితాలు రాబడుతున్నారు. సాంకేతికత సాయం, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా వినూత్నంగా పాఠాలు బోధించడం ఆయన ప్రత్యేకత. వంద శాతం ఎన్రోల్ మెంట్, నో బ్యాగ్ డే, యోగా, క్విజ్, చిత్ర లేఖనం తదితర వాటిని అమలు చేస్తున్నారు. విద్యార్థులకు ఎక్కువగా గుర్తుండే విధంగా సబ్జెక్టుల్లోని ప్రతి అంశాన్ని ప్రయోగాత్మక పద్ధతిలో బోధించే విధంగా ఆయన చర్యలు తీసుకుంటూ విద్యార్థుల ఉన్నతికి, పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశారు. జీ.ఎర్రగుడి పాఠశాలలో పనిచేసిన సమయంలో రాష్ట్ర స్వచ్ఛ విద్యాలయ పురస్కారం, 2024లో ఉపాధ్యాయ రత్న, 2025లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక కావడం పట్ల చంద్రమోహన్ ఆనందం వ్యక్తం చేశారు. అవార్డుతో మరింత బాధ్యత పెరుగుతుందని, భవిష్యత్‌లో మరింత మెరుగైన విద్య అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. – తుగ్గలి -
ఆదిమూర్తి పాఠాలు.. 2.5 లక్షల వీక్షకులు
తరగతి బోధనతో పాటు ఉపాధ్యాయ శిక్షణ, సైన్స్ ప్రాజెక్టులు, క్విజ్లు, డిజిటల్ బోధన, విద్యార్థుల మార్గదర్శకత్వం వంటి అనేక రంగాల్లో కృషి చేస్తున్న ఆదోని మండలం విరుపాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మైత్రి ఆదిమూర్తికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వరించింది. ఆదోనికి చెందిన ఈయన 2003లో స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 2023లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. తరగతి బోధనకే పరిమితం కాకుండా గత 12 సంవత్సరాలుగా సర్వశిక్ష అభియాన్, ఆర్.ఎం.ఎస్.ఏ. శిక్షణలు, కాంప్లెక్స్ సమావేశాలు, పదో తరగతి ఓరియంటేషన్ తరగతులు, ఎన్నికల నిర్వహణపై శిక్షణ తదితర కార్యక్రమాల్లో రిసోర్స్ పర్సన్‌గా సేవలందించారు. అలాగే ఇన్స్పైర్, ఎన్సీఎస్సీ, కౌశల్ క్విజ్ వంటి కార్యక్రమాల కోసం అనేక మంది సైన్స్ ఉపాధ్యాయులకు శిక్షణ అందించారు. ఆదిమూర్తి మార్గదర్శకత్వంలో 2023లో ఒక విద్యార్థి జిల్లా స్థాయి ఎన్సీఎస్సీకి ఎంపికై రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా పాల్గొన్నారు. అలాగే పదో తరగతి భౌతిక శాస్త్రానికి సంబంధించిన ‘మార్గదర్శి’ స్టడీ మెటీరియల్ రచయితగా కూడా ఆయన సేవలందించారు. గత నాలుగేళ్లుగా కర్నూలు జిల్లాలో నిర్వహిస్తున్న కౌషల్ జిల్లా స్థాయి క్విజ్ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తూ క్విజ్ మాస్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఫిజికల్ సైన్స్‌కు సంబంధించిన యూట్యూబ్ చానల్ ద్వారా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బోధనా వనరులను అందిస్తున్నారు. ఆయన రూపొందించిన వీడియోలను 2.5 లక్షలకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు వీక్షించి ప్రయోజనం పొందారు. అంతే కాకుండా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఉపయోగపడే పలు మూల్యాంకన పత్రాలను రూపొందించారు. – ఆదోని -
సతీష్‌కు సరిలేరెవ్వరు!
విధులు నిర్వహిస్తున్న పాఠశాల అభివృద్ధికి కృషి చేయడం, అక్కడ చదువుతున్న విద్యార్థుల ఉన్నతికి పాటుపడటంలో బనగానపల్లె పట్టణం కొండపేట ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు సతీష్‌కుమార్ ముందంజలో ఉన్నారు. బనగానపల్లె పట్టణానికి చెందిన ఈయన 2002 అక్టోబరులో బనగానపల్లె మండలంలోని గిరిజన ప్రాంతమైన గులాం అలిబాద్ ఎంపీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. ఆ పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసిన బాలికలు చాలా మంది 6వ తరగతి చదివే అవకాశం లేక ఇళ్ల వద్దనే ఉండిపోయారు. ఆ సమస్యను సతీష్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామానికి యూపీ పాఠశాల మంజూరైంది. 2009లో వెంకటాపురం ఎంపీయూపీఎస్ పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయులుగా చేరారు. అక్కడ గణితం, ఇంగ్లిషులో విద్యార్థులు వెనుకబడి ఉన్నారని గుర్తించి ప్రత్యేక ప్రణాళిక బోధనతో విద్యార్థులను తీర్చిద్దారు. ఎన్ఆర్ఐలు, గ్రామస్తుల సహకారంతో పాఠశాల అభివృద్ధికి కృషి చేశారు. 2017లో టంగుటూరు ఎంపీపీఎస్ పాఠశాలకు బదిలీ అయ్యారు. ఆయన విధులు నిర్వర్తించే పాఠశాలలో విద్యార్థులకు వసతులు కల్పించడం, విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంలో తనదైన ముద్ర వేస్తున్నారు. తన సేవలను గుర్తించిన ప్రభు త్వం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. – బనగానపల్లె -
అంకిత భావంతో వి‘జయం’..
అందరి ఉపాధ్యాయుల్లా ఆమె పాఠశాలకు వెళ్లామా.. పాఠాలు చెప్పామా.. ఇంటికి తిరిగి వచ్చామా అనుకోలేదు. దాదాపు 28 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో ఆమె చూపిన అంకితభావానికి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వరించింది. దేవనకొండ మండలం కరివేముల ఎంపీపీఎస్ స్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్న శీలం జయమ్మ సొంతూరు వెలుగోడు మండలం వేగులగూడూరు. 1998 ఆగస్టు 21న హాలహర్వి మండలం హాలహర్వి ఆదిఆంధ్ర పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా విధుల్లో చేరారు. తర్వాత దేవనకొండ మండలం కరివేముల, జూపాడుబంగ్లా మండలం మండ్లెం, నందికొట్కూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (పేట)లో విధులు నిర్వర్తించారు. గతేడాది జూన్‌లో కరివేముల ఎంపీపీ పాఠశాలకు పీఎస్ హెచ్ఎంగా పదోన్నతిపై వచ్చారు. ఆమె ఎక్కడ విధులు నిర్వర్తించినా విద్యార్థుల్లో దాగిన ప్రతిభా నైపుణ్యాలను వెలికి తీయడం, విద్యార్థులు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఎంపికయ్యేలా ప్రోత్సహించడం, చదువుకు దూరంగా విద్యార్థుల ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బడిలో చేర్పించారు. సాయంత్రం వేళల్లో విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ చెబుతూ విద్యలో వెనుకబడిన విద్యార్థులను తీర్చిదిద్దారు. కరివేముల పాఠశాలకు హెచ్ఎంగా వచ్చినప్పటి నుంచి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషిచేశారు. అలాగే గ్రామంలో జానకి వావిలాల కృష్ణమూర్తి ట్రస్టు హాస్టల్ కూడా వచ్చింది. ఆమె సేవలను గుర్తించిన అధికారులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డు రావడం ఆనందంగా ఉందని, తన సేవలను కొనసాగిస్తానని చెప్పారు. – దేవనకొండ -
పైర్లు ‘బావు’రుమంటున్నాయి !
ఉమ్మడి కర్నూలు జిల్లాను కరువు అతలాకుతలం చేస్తోంది. ఎక్కడ చూసినా నోళ్లు తెరిచిన బీళ్లే. ఇక లాభం లేదని ఎండిపోయిన పొలాలను దున్నేస్తున్న దృశ్యాలు కన్నీళ్లు తెప్పించక మానవు. అప్పులు చేసి.. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటలు మట్టిలోనే కలిసిపోతుంటే రైతుల ఆవేదన వర్ణనాతీతం. ఇంతటితో అయిపోలేదని, ముందుంది తీవ్రమైన కరువని శాస్త్రవేత్తలు హెచ్చరించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. జలాశయాల్లో నీరులేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బావుల్లోకి తొంగి చూస్తే కన్నీళ్లే కనిపిస్తున్నాయి. వీటి కింద సాగుచేసిన పంటలు ఎక్కడికక్కడ ఎండిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
మహిళ దారుణ హత్య
● పొలంలో మృతదేహం లభ్యం ● విచారణ చేస్తున్న పోలీసులు పత్తికొండ రూరల్: పత్తికొండ మండల పరిధిలోని కోతిరాళ్ల గ్రామ పొలాల్లో గురువారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కోతిరాళ్లకు చెందిన హరిజన శాంతమ్మ (65) ఉదయం పొలం పనులకు వెళ్లి రాత్రయినా తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి ఆమె కోసం వెతికారు. శాంతమ్మను గుర్తుతెలియని వ్యక్తులు బండరాళ్లతో మోది చంపిన స్థితిలో మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న డీఎస్పీ వెంకట్రామయ్య, ఇన్చార్జ్ సీఐ శ్రీనివాసులునాయక్ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆస్తి వివాదం కారణంగా బంధువులే హత్య చేసి ఉంటారనే అనుమానంతో మృతురాలి కుమారుడు హరిజన కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ కోణంలో అనుమానితుల మీద విచారణ చేస్తున్నారు. శుక్రవారం ఉదయం డీఎస్పీ వెంకట్రామయ్య, ఇన్చార్జ్ సీఐ శ్రీనివాసులునాయక్, ఎస్ఐ రాందాస్ గ్రామానికి వెళ్లి హత్యకు దారి తీసిన పరిస్థితుల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. మృతిపై విచారణ చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
కొలిమిగుండ్ల: మండల పరిధిలోని అబ్దులాపురానికి చెందిన ఓ వివాహిత శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఇటిక్యాల నాగరాజుకు అనంతపురం జిల్లా సద్దలదిన్నెకు చెందిన వరలక్ష్మికి (38)తో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు సంతానం ఉన్నారు. భర్త రోజు మద్యం సేవిస్తూ ఉండేవాడు. వరలక్ష్మి క్రిమి సంహారక మందు తాగిందని తన బావమరిది దేవేంద్రకు ఫోన్ చేయడంతో తాడిపత్రికి తీసుకురావాలని సూచించాడు. అరగంట తర్వాత మళ్లీ ఫోన్ చేసి ఎలాంటి మందు తాగలేదని సమాధానం ఇచ్చాడు. తెల్లవారాక వరలక్ష్మి మృతి చెందిందని బావమరిదికి విషయం చేరవేశాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నగీనా గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేవు, క్రిమిసంహారక మందు తాగినట్లు ఆనవాళ్లు కూడా లేవు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక మృతికి గల కారణాలు తెలుస్తాయని ఎస్ఐ వెల్లడించారు. మోటార్ల చోరీ : నిందితుల అరెస్టు పాములపాడు: వ్యవసాయ బావుల వద్ద విద్యు త్ మోటార్ల చోరీ కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ తిరుపాలు తెలిపారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. మండలంలోని తుమ్మలూరు, క్రిష్ణరావుపేట, కోల్స్ ఆనందాపురం గ్రామాల్లో విద్యుత్ మోటార్లు చోరీకి గురైనట్లు బాధిత రైతుల నుంచి ఫిర్యాదులొచ్చాయన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామన్నారు. ఆత్మకూరు పట్టణంలోని వెంగళరెడ్డి నగర్‌కు చెందిన చంటి, నర్సమ్మ అనే ఇద్దరి నుంచి 5 మోటార్లు రికవరి చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ప్రమాదవశాత్తు వలస కార్మికుడి మృతి ఓర్వకల్లు: రేకుల షెడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు వలస కార్మికుడు మృతి చెందిన సంఘటన మండలంలోని కన్నమడకల గ్రామ శివారులోని ఓ సిలికాన్ ఫ్యాక్టరీలో గురువారం రాత్రి చోటు చేసుకోగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కన్నమడకల గ్రామ సమీపంలో కేఈ సోదరుల స్థలంలో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు నూతన షెడ్ నిర్మాణం చేపట్టారు. పనుల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా, నర్సన్నపేట గ్రామానికి చెందిన రెడ్డి కిరణ్‌కుమార్ (27) పైపులకు వెల్డింగ్ చేస్తుండగా గురువారం సాయంత్రం కురిసిన గాలివానకు షెడ్‌కు నిర్మించిన ఇనుప పైపు ఊడి కిరణ్‌కుమార్‌పై పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు ఏఎస్ఐ పాండురంగస్వామి తెలిపారు. -
ఓటరు జాబితా సవరణ పేరుతో సైబర్ మోసాలు
కర్నూలు (టౌన్): ఓటరు జాబితా సవరణ, ఓటరు కార్డులో పేర్లు, వివరాల మార్పుల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సంఘం ప్రతినిధులుగా పరిచయం చేసుకుని ఓటరు వివరాలు తప్పుగా ఉన్నాయని, దరఖాస్తు తిరస్కరణకు గురైందని చెప్పి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. అనంతరం వాట్సాప్ ద్వారా నకిలీ లింకులు, అనుమానాస్పద ఏపీకే ఫైల్స్ పంపించి తక్కువ మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలంటూ బ్యాంకు, కార్డు వివరాలు, ఓటీపీలు సేకరించి నగదు కాజేసే అవకాశం ఉందన్నారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి
నందికొట్కూరు: డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నంద్యాల జిల్లా అధ్యక్షుడు సురేష్ యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టెట్‌లో అర్హత లేకపోయినా 2025 డీఎస్సీలో ఉద్యోగాలు ఎలా ఇచ్చారో మంత్రి లోకేశ్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. డీఎస్సీలో అక్రమాలకు పాల్పడి అర్హులైన అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడితే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. టెట్ అర్హత లేకున్నా ఉద్యోగాలు ఇచ్చిన సంఘటన డీఈఓ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో బయటపడిందని స్పష్టం చేశారు. డీఎస్సీ అవకతవకలపై మంత్రి నారా లోకేశ్ విసిరిన సవాళ్లను వైఎస్సార్సీపీ స్వీకరించి బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పినా ఎందుకు ముందడుగు వేయలేదని నిలదీశారు. డీఎస్సీలో అక్రమాలను బయటకు తీసేందుకు సీబీఐకు అప్పగించాలని కోరారు. అలాగే సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పిన ప్రకారం నిరుద్యోగులకు నిరుద్యోగి భృతి నెలకు రూ.3 వేలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలన్నారు. సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం నాయకులు అబ్దుల్లా, సతీష్‌రెడ్డి, శశాంక్, బన్నీ, చరణ్, మన్సూర్, రంగ, తదితరులు పాల్గొన్నారు. – డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ -
ఫేక్ ‘గేమ్’..‘మెగా’ స్కామ్!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: మెగా డీఎస్సీ 2025 అక్రమాల డొంక కదులుతోంది. ఇప్పటికే స్పోర్ట్స్ కోటా ముసుగులో ఇష్టారాజ్యంగా జీవోలిచ్చి అక్రమాలకు గేట్లు ఎత్తడం.. అసలు పరీక్షే లేకుండా టీచర్ ఉద్యోగాలను కట్టబెట్టడం.. కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లకు పోస్టులు ఇవ్వడం లాంటి అక్రమాలు బహిర్గతం కాగా, తాజాగా టెట్ (టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్)లో కనీసం క్వాలిఫై కూడా కాకుండానే ఉద్యోగాల్లో నియమించినట్లు తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. సాక్షి కథనంతో ఈ వ్యవహారం నుంచి ఎలా బయటపడాలో తెలియక సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖాధికారులు ప్రధానంగా స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు శుక్రవారం ఉదయం పలువురు మెగా డీఎస్సీ టీచర్లు స్పోర్ట్స్ సర్టిఫికెట్ల విక్రయదారులతో కర్నూలులో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మెగా డీఎస్సీలో అక్రమాలకు ఇవన్నీ నిదర్శనాలని, సీబీఐతో విచారిస్తే నివ్వెరపోయే నిజాలు బహిర్గతం కావడం ఖాయమని విద్యావేత్తలు, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ‘మెగా డీఎస్సీలో రాత పరీక్ష అనంతరం 1 : 1 నిష్పత్తిలో అభ్యర్థులను వెరిఫికేషన్‌కు ఎందుకు పిలిచినట్లు? మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులుగా నియమించిన వారి సర్టిఫికెట్లను తాజాగా రహస్యంగా వెరిఫికేషన్ చేస్తున్నారంటే... దీని అర్ధం గతంలో వెరిఫికేషన్ జరగలేదనే కదా! టెట్‌లో క్వాలిఫై కాకపోయినా, అర్హత లేదని తెలిసి కూడా టీచర్ పోస్టు ఎలా ఇచ్చారు? దరఖాస్తు దశలోనే రిజెక్ట్ కావాల్సిన అభ్యర్థి ఇన్ని దశలు దాటి ఉద్యోగం ఎలా పొందగలిగాడు? దీని వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తి ఎవరు..?’ అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. చంద్రబాబు సర్కారు ఇంకా బుకాయించకుండా మెగా డీఎస్సీ ప్రక్రియపై సీబీఐ విచారణకు సిద్ధపడితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి రావడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సవాల్ విసిరినట్లుగా మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు అంగీకరించాలని, ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని విద్యావేత్తలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.స్వయంగా ప్రభుత్వ విచారణలో బట్టబయలు.. ముఖ్యనేత భరోసాతో మెగా డీఎస్సీ నియామకాల్లో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు, టెట్ క్వాలిఫై కాకుండానే లోకేశ్ యువగళం సభ్యులకు టీచర్ ఉద్యోగాలు కట్టబెట్టిన విషయం వెలుగు చూసింది. ఇన్నాళ్లూ మెగా డీఎస్సీలో అక్రమాలు జరగలేదంటూ బుకాయించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దిక్కుతోచని పరిస్థితిలో కూరుకుపోయారు. కర్నూలు జిల్లాలో టెట్ క్వాలిఫై కాకుండానే స్పోర్ట్స్ కోటాలో జి.ప్రభాకర్ అనే వ్యక్తి టీచర్ ఉద్యోగం పొందడం.. అధికారుల విచారణలో ఇది వాస్తవమేనని తేలడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇదే తరహాలో మెగా డీఎస్సీలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో విద్యా శాఖ మంత్రి లోకేశ్‌తోపాటు చంద్రబాబు సర్కారుపై నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు, జెన్‌జీ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది. టీడీపీ నేతల గుప్పిట్లో సంఘాల నుంచి ఫేక్ సర్టిఫికెట్లు..! మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు ప్రకంపనలు సృష్టిస్తుండటంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు సర్కారు విచారణకు ఆదేశించినట్లు సమాచారం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖాధికారులు విచారణ మొదలు పెట్టారు. ప్రధానంగా స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను యుద్ధ ప్రాతిపదికను తెప్పించుకుంటున్నారు. టెట్ క్వాలిఫై అయ్యారా? లేదా? ఎలాంటి స్పోర్ట్స్ సర్టిఫికెట్ పెట్టారు? సదరు సర్టిఫికెట్ ఎక్కడనుంచి తెచ్చారు? అనే వివరాలను ఆరా తీస్తున్నారు. దాదాపు అన్ని స్పోర్ట్స్ సర్టిఫికెట్లు టీడీపీ ప్రజా ప్రతినిధులు పర్యవేక్షిస్తున్న అసోసియేషన్ల నుంచి పొందినట్లు విచారణలో ప్రాథమికంగా వెల్లడైందని కర్నూలు విద్యాశాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ముఖ్యనేత అండదండలతో..ముఖ్యనేత అండదండలు, భరోసాతో చిత్తూరు జిల్లాకు చెందిన రాష్ట్ర స్థాయి క్రీడా సంస్థ నేత మెగా డీఎస్సీ నకిలీ సర్టిఫికెట్ల పంపిణీ వ్యవహారంలో కీలకపాత్ర పోషించారని అధికారుల దృష్టికి వచ్చి నట్లు తెలుస్తోంది. లోకేశ్ యువగళం యాత్రలో ఆయన చురుగ్గా వ్యవహరించారు. యువగళం సభ్యులు మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందేందుకు తన పదవిని అడ్డుపెట్టి బోగస్ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయి. ముఖ్యనేత అండదండలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తన అనుచరులను ఏర్పాటు చేసుకుని నకిలీ సర్టిఫికెట్లు సరఫరా చేసినట్లు సమాచారం. ముఖ్యనేత భరోసాతో అనుచరుల ద్వారా నకిలీ సర్టిఫికెట్ల విక్రయాలు.. ముఖ్యనేత భరోసా లభించడంతో కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో మెగా డీఎస్సీ అభ్యర్థులకు నెల్లూరుకు చెందిన మల్లిఖార్జున అనే వ్యక్తి నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. కర్నూలుకు చెందిన ప్రైవేట్ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు దూరవిద్యా కేంద్రంలో పనిచేస్తున్న మరోవ్యక్తి కలసి చిత్తూరు నేత నుంచి పెద్ద ఎత్తున స్పోర్ట్స్ నకిలీ సర్టిఫికెట్లు తెచ్చి విక్రయించినట్లు తెలుస్తోంది. వీరంతా అనంతపురం, చిత్తూరుకు చెందిన రెండు ముఠాలతో కలిసి మెగా డీఎస్సీ అభ్యర్థులకు నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్మకానికి పెట్టారు. చిత్తూరు నేతతో సంబంధాలు ఏర్పరచుకున్న గుంటూరుకు చెందిన మరో ముఠా కూడా అభ్యర్థులకు బోగస్ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు విక్రయించినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన కొందరు నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు తెచ్చి అభ్యర్థులకు విక్రయించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో పలువురికి దొడ్డి దారిలో టీచర్ ఉద్యోగాలు కట్టబెట్టినట్లు సమాచారం. రాష్ట్రస్థాయిలో ముఖ్యనేత అండదండలు, భరోసా లేకుండా ఈస్థాయిలో అక్రమాలు జరిగేందుకు ఆస్కారం లేదని అంటున్నారు.అప్పుడు.. ‘బీసీ’ ఇప్పుడు.. ‘ఈడబ్ల్యూఎస్’మెగా డీఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాల్లో లీలలు కర్నూలు సిటీ: 2018లో బీసీ కేటగిరీలో డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న కొందరు అభ్యర్థులు.. తాజాగా మెగా డీఎస్సీ 2025లో ఈడబ్ల్యూఎస్ విభాగంలో దరఖాస్తు చేసుకోవడంతోపాటు టీచర్లుగా ఎంపిక కావడం గమనార్హం. గతంలో బీసీ సర్టిఫికెట్ సమర్పించిన శకునాల కేశవులు మెగా డీఎస్సీలో మాత్రం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్తో ఉద్యోగం పొందిన జుమ్మలదిన్నె జడ్పీ హైసూ్కల్లో పని చేస్తున్నారు. ఏకంగా కులం మారిపోవడం.. ఇష్టారాజ్యంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు పొంది ఉద్యోగాల్లో చేరడం కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లాలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇలా టీచర్లుగా నియమించిన వారిలో నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో ఆరుగురు, చాగలమర్రి మండలంలో ఒకరు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్రంగా విచారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. » 2018 డీఎస్సీలో బీసీ–బీ కింద దరఖాస్తు చేసుకున్న ఓ మహిళా అభ్యర్థి... మెగా డీఎస్సీలో ఈడబ్ల్యూఎస్ కోటాలో టీచర్ ఉద్యోగం పొంది కోసిగి జడ్పీ హైసూ్కల్లో పని చేస్తున్నారు. » 2018 డీఎస్సీలో బీసీ–బీ కింద దరఖాస్తు చేసుకున్న మరో మహిళా అభ్యర్థి.. మెగా డీఎస్సీలో మాత్రం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్తో ఉద్యోగం పొంది పొదలకుంట్ల ఎంపీపీఎస్‌లో పని చేస్తున్నారు. » గతంలో బీసీ–డీ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న ఓ మహిళ మెగా డీఎస్సీలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్తో ఎంపికై కౌతాళం మండలం ఉరుకుంద జడ్పీ హైసూ్కల్లో పని చేస్తున్నారు. » గతంలో బీసీ–బీ సర్టిఫికెట్ సమర్పించిన మరో మహిళ.. మెగా డీఎస్సీలో ఈడబ్ల్యూఎస్‌లో టీచర్ ఉద్యోగం పొంది కోసిగి ఎంపీపీఎస్ స్కూల్లో పని చేస్తున్నారు.కర్నూలులో మెగా డీఎస్సీ టీచర్ల సమావేశం..! కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలంలో 24 మంది స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందగా నియోజకవర్గంలోని వల్లూరు పాఠశాలలో ఐదుగురిని ఇదే కోటాలో టీచర్ పోస్టుల్లో నియమించారు. వల్లూరు ఎంపీపీ స్కూల్లో టెట్ క్వాలిఫై కాకుండానే స్పోర్ట్స్ కోటాలో ప్రభాకర్‌ను ఎస్జీటీ టీచర్‌గా నియమించినట్లు తాజాగా తేలడం.. అధికారుల విచారణలో అక్రమాలు నిజమేనని నిర్థారణ కావడం తీవ్ర సంచలనం రేపింది. ఇదే తరహాలో పలువురిని నియమించినట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయి. విద్యాశాఖ విచారణతో మెగా డీఎస్సీ ద్వారా నియమించిన వారిలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం పలువురు మెగా డీఎస్సీ టీచర్లు స్పోర్ట్స్ సర్టిఫికెట్ల విక్రయదారులతో కర్నూలులో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఆందోళనతో యువగళం టీమ్ వద్దకు..! చిత్తూరులో కొందరు నకిలీ స్విమ్మింగ్ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు పొందగా వారిలో చాలామంది టెట్ క్వాలిఫై కాలేదని సమాచారం. కడపలో స్పోర్ట్స్ కోటాలో పలువురు టెట్ క్వాలిఫై కాకుండానే ఉద్యోగాలు పొందగా ఇందులో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలుతోపాటు సంతనూతలపాడు, దర్శి ప్రాంతాలకు చెందిన కొందరు ఇదే తరహాలో మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందినట్లు అనుమానాలున్నాయి. విద్యాశాఖ అంతర్గత విచారణతో ఆందోళనగా వీరంతా ఉద్యోగాలిప్పించిన లోకేశ్ యువగళం టీమ్ ముఖ్య నేతలను నిలదీస్తునట్టు సమాచారం. నకిలీ సర్టిఫికెట్లతో ప్రిన్సిపాల్ ఉద్యోగాలు..! ఏపీ రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఎస్టీ గురుకుల పాఠశాలల్లో పోస్టులకు నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు పెట్టి కొందరు ప్రిన్సిపాల్ ఉద్యోగాలను పొందినట్లు సమాచారం. వీరిలో చాలామంది నెల్లూరు, అనంతపురం, గుంటూరు ప్రాంతాల ముఠాల నుంచి బోగస్ సర్టిఫికెట్లు పొందినట్లు తెలుస్తోంది. మెడికల్ రిప్రెంజెంటేటివ్గా పనిచేస్తున్న కర్నూలుకు చెందిన వ్యక్తితోపాటు డోన్‌కు చెందిన మరొకరు నందికొట్కూరు ప్రాంతంలోని ప్రైవేటు బీఈడీ కళాశాల నుంచి బోగస్ సర్టిఫికెట్లతో ప్రిన్సిపల్ ఉద్యోగం పొందినట్లు సమాచారం. -
అశ్వవాహనంపై విశ్వమోహనుడు
● వైభవంగా 6వ రోజు ఆరాధన వేడుకలు ● ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు మంత్రాలయం: మంగళకర వాయిద్య నాదాలు.. భక్తజనుల జయజయ పఠనాలు.. పండితుల వేద ఘోషల మధ్య ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు అశ్వ వాహనంపై కొలువుదీరారు. పండితుల ఉయ్యాల జంపాలతో ఉత్సవమూర్తి శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో కడు వైభవంగా ఊరేగారు. రాఘవేంద్రుల 355వ ఆరాధన సప్తరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రహ్లాదరాయలకు అశ్వవాహన సేవ గావించారు. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆశీస్సులతో ముందుగా ఊంజల మంటపంలో ఉత్సవమూర్తికి చతుర్వేద పారాయణం గావిస్తూ ఉయ్యాల సేవ నిర్వహించారు. అనంతరం ప్రాంగణ వీధుల్లో అశ్వ వాహనంపై కనుల పండువగా ఊరేగింపు సాగింది. ఆనవాయితీలో భాగంగా చెక్క, వెండి, అంభారి, స్వర్ణ, నవరత్న రథాలపై ఉత్సవమూర్తిని ఊరేగించారు. 6వ రోజు వేడుకల్లో రాఘవేంద్రుల మూల బృందావనానికి విశేష పూజలు, రాయరు పాదపూజ, మూలదేవర సంస్థాన పూజ చేపట్టారు. ఈ వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 వెంకటేష్‌జోషి, మేనేజర్–3 శ్రీపతి ఆచార్, మేనేజర్–4 సురేష్ కోనాపూర్, ధార్మిక సహాయకాధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. నేటి కార్యక్రమాలు ఆరాధన ఆఖరిరోజు సందర్భంగా సర్వ సమర్పణోత్సవం జరుగనుంది. ఉత్సవం సందర్భంగా ఏకకాలంలో పంచవాహనాలపై ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు, రాఘవేంద్రులను శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో ఊరేగిస్తారు. ఉదయం అనుమంత్రాలయం తుంగభద్ర గ్రామం మృత్తిక బృందావన క్షేత్రంలో ఆరాధన వేడుకలు, రథయాత్ర నిర్వహిస్తారు. -
దేవతతో రాజకీయం
● గ్రామాల్లో టీడీపీ నాయకుల చిచ్చు ● ఏళ్లనాటి సాంప్రదాయానికి స్వస్తి ● ఎవరికి వారే అన్నట్లుగా రెండు గ్రామాల ప్రజలు దేవనకొండ: సోదరుల్లా కలిసిమెలిసి ఉండే రెండు గ్రామాల మధ్య టీడీపీ నాయకులు రేపిన చిచ్చు వందల ఏళ్లుగా వస్తున్న సంప్రదాయానికి ముగింపు పలికింది. ఏకంగా మారెమ్మ దేవతను రాజకీయాలకు వాడుకోవడం ఆ పార్టీ నాయకులకే చెల్లింది. గద్దెరాళ్ల మారెమ్మ పుట్టినిల్లు అయిన పల్లెదొడ్డి నుంచి ప్రతి శ్రావణమాస మూడో మంగళవారం భక్తులు బోనాలతో వచ్చి అమ్మవారికి చల్ల సమర్పిస్తే రెండు గ్రామాలు సుఖసంతోషాలతో వర్ధిళ్లుతాయని ప్రజల నమ్మకం. అయితే గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ ఏడాది జూన్ 5వ తేదీన కూటమి ప్రభుత్వ నాయకులు కొత్తగా ఆలయ కమిటీని ఏర్పరుచుకున్నారు. ఆ కమిటీలో చైర్మన్ పదవి మొదలుకుని మెంబర్ల దాకా పల్లెదొడ్డి గ్రామస్తులను ఎవరినీ సంప్రదించకుండా ఆలూరు టీడీపీ ఇన్చార్జ్ కనుసన్నల్లో నచ్చిన వారికి పదవులు ఇచ్చుకున్నారు. దీంతో ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో చిచ్చు పెట్టినట్లు అయ్యింది. గద్దెరాళ్ల మారెమ్మ అంటేనే మొదటగా గుర్తుకొచ్చేది. అత్యధిక ప్రాధాన్యత సంతరించుకున్నది పల్లెదొడ్డి బోనాలు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న గ్రామాన్ని వదిలి ఆలయంతో సంబంధం లేని గ్రామాల్లోని వారికి పదవులు ఇవ్వడంతో పల్లెదొడ్డివాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మారెమ్మవ్వ ఆలయ కమిటీలో పల్దొడ్డి గ్రామవాసులకు ప్రాధాన్యత కల్పించలేదని, అలాంటి చోట తమ ఊరి బోనాలు కూడా అవసరం లేదని, తమ గ్రామంలోనే బోనాల సంబరం జరుపుకుంటామని గ్రామ పెద్దలందరూ తీర్మానించుకున్నారు. వందల సంవత్సరాల సాంప్రదాయానికి స్వస్తి పలుకుతున్నా దేవదాయ శాఖ అధికారుల్లో మాత్రం ఎలాంటి స్పందన లేదు. దీంతో ఈ శ్రావణమాసం మూడో మంగళవారం అమ్మవారికి చల్లదనం పల్లెదొడ్డి, గద్దెరాళ్ల ప్రజలు ఎవరి ఊళ్లలో వారు జరుపుకున్నారు. అసలే ఒక పక్క వర్షాలు లేక కరువుతో అల్లాడుతుంటే, మరో పక్క గ్రామాల ప్రజలు ఎవరికి వారుగా ఉంటే వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో జరిగే అమ్మవారి దేవరలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
పారే నీటిలో నీవే.. చిరునవ్వులో నీవే !
నేడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కరువు నేలలో జలసిరులు కృష్ణగిరి: జిల్లాలో నిత్యం కరువుతో అల్లాడుతున్న పత్తికొండ నియోజకవర్గాన్ని హంద్రీ – నీవా కాలువ ఏర్పాటు చేసి కృష్ణాజలాలతో సస్యశ్యామలం చేసింది మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాగే కృష్ణగిరి, పందికోన రిజర్వాయర్లను ఏర్పాటు చేసి దాదాపు 80 వేల ఎకరాలకు సాగు నీరు అందించారు. దేవనకొండ, తుగ్గలి, కృష్ణగిరి, డోన్ మండలంలోని 50 గ్రామాలకు, డోన్ పట్టణానికి గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా రూ.55 కోట్లతో తాగునీరు అందించారు. వెల్దుర్తి మండలంలో మల్లెపల్లె వద్ద ఎత్తిపోతల పథకం, కృష్ణగిరి మండలంలో కృష్ణగిరి, కంబాలపాడు, ఆలంకొండ ఎత్తిపోతల పథకాలతోపాటు కృష్ణగిరి సమీపంలో 0.016 టీఎంసీలతో రిజర్వాయర్ ద్వారా ఏడు గ్రామాల్లోని 5,100 ఎకరాలకు సాగునీరు అందించారు. అలాగే పత్తికొండ మండలంలోని పందికోన వద్ద ఒకటిన్నర టీఎంసీల సామర్థ్యంతో 60 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా ఏర్పాటుచేశారు. దీంతోపాటు లక్కసాగరం వద్ద, దేవనకొండ మండలం గుండ్లకొండ ఎత్తిపోతల పథకం సమీపంలో చానల్ కాలువలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా మరో 5,100 ఎకరాలకు సాగునీరు అందుతోంది. జలయజ్ఞంతోపాటు ఈ ప్రాంత ప్రజలకు అన్ని సంక్షేమ ఫలాలు అందింది కూడా వైఎస్సార్ పాలనలోనే అనేది జగమేరిగిన సత్యం. అందుకే ఇక్కడి ప్రజలు అయనను అనుదినం స్మరించుకుంటున్నారు. రైతు బాంధవుడు తుగ్గలి: వరుస కరువులతో 2004కు ముందు రైతులు కష్టాలతో కొట్టుమిట్టాడే రోజులవి. భూములు సాగుకు నోచుకోక బీడుగా మారాయి. మరోవైపు విద్యుత్ చార్జీల భారం. రైతులు వ్యవసాయం చేయడానికి వెనుకాడే పరిస్థితి. ఆ సమయంలో అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి రైతుల రుణమాఫీ చేయడంతో పాటు బోర్ల ద్వారా వ్యవసాయం చేసుకోవడానికి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేశారు. అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్సార్ ఉచిత విద్యుత్ ఇస్తానంటే హేళన చేశారు. కానీ రైతు సంక్షేమం కోసం తాను ఎంత ఖర్చు అయినా చేస్తానని రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి ప్రతిపక్ష పార్టీ నాయకులకు మాట ఆడలేని పరిస్థితి తెచ్చారు. ఇప్పటికీ ఆ పథకం కొనసాగుతుండటం ఆయన చలువే అని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. పత్తికొండ నియోజకవర్గంలో కృష్ణగిరి, పందికోన వద్ద రిజర్వాయర్లు నిర్మించి వేలాది ఎకరాలకు సాగునీరు అందేలా కృషి చేశారు. -
సబ్సిడీ వేరుశనగ స్వాహా!
డోన్ టౌన్ (ప్యాపిలి)/డోన్: తమది రైతు ప్రభుత్వం అంటూ టీడీపీ నాయకులు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దోపిడీకి పొంతన లేకుండా పోతోంది. రైతులకు అందాల్సిన సబ్సిడీ వేరుశనగ విత్తనకాయలను అధికారుల అండదండలతో టీడీపీ నాయకులు బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై నాలుగు రోజుల క్రితం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనం మరువకముందే సబ్సిడీ వేరుశనగను బ్లాక్ మార్కెట్‌కు తరలించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 29న డోన్ నియోజకవర్గంలోని ఎనుగుమర్రి గ్రామంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సబ్సిడీ వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామానికి మంజూరైన విత్తనాలను అర్హులైన రైతులకు అందించకుండా గ్రామ టీడీపీ నాయకుల సిఫార్సుతో కొద్దిమంది ఆ పార్టీ వారికి అందించి మిగతా విత్తనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రామంలోని సచివాలయంలో ఉంచిన స్టాకును అదే గ్రామానికి చెందిన వ్యాపారికి విక్రయించగా సదరు వ్యక్తి వాటిని రెండు వాహనాల్లో బ్లాక్ మార్కెట్‌కు తరలించినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. -
కేజీబీవీ సీటు ఇప్పించండి మేడం
నందవరం: ‘చదువుకోవాలని ఉంది. కేజీబీవీలో సీటు ఇప్పించండి.. మేడం’ అంటూ పెద్దకడబూరు మండలం, కమ్మలదిన్నెకు చెందిన కురవ కావేరి జిల్లా కలెక్టర్ ఏ.సిరిని వేడుకుంది. మంగళవారం స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌కు కేజీబీవీలో సీటు కేటాయించాలని కోరుతూ కావేరి వినతి పత్రం అందజేసింది. 7వ తరగతి వరకు చదివానని, తర్వాత తల్లిదండ్రులు చదివించలేకపోవడంతో మధ్యలోనే వదిలేశానని తెలిపింది. కేజీబీవీలో దరఖాస్తు చేసుకున్నా సీటు రాకపోవడంతో చదువుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం నందవరం మండల కేంద్రంలో అమ్మమ్మ ఇంట్లో ఉంటూ పనులు చేసుకుంటున్నానని, తనకు కస్తూర్బాలో సీటు ఇప్పించి చదివించాలని జిల్లా కలెక్టర్‌ను ఆ బాలిక వేడుకుంది. కలెక్టర్ స్పందిస్తూ కేజీబీవీలో సీటు కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో కావేరి సంతోషం వ్యక్తం చేసింది. -
ఆర్టీసీ బస్సు.. ప్రయాణమంటేనే హడల్
● బస్సు టైర్ పేలి ముగ్గురికి గాయాలు ● భయాందోళనకు గురైన ప్రయాణికులు ● రద్దీలో అస్వస్థతకు గురైన మహిళ మృతి పత్తికొండ: గమ్యస్థానాలకు చేరకుండా మార్గం మధ్యలోనే మరమ్మతులకు గురై ఆగిపోతూ ఆర్టీసీ బస్సులు హడలెత్తిస్తున్న సంఘటనలతో ప్రయాణికులు కలవరపడుతున్నారు. మంగళవారం ఉదయం పత్తికొండ నుంచి ఆదోనికి బయలుదేరిన ఆదోని డిపోకు చెందిన ఏపీ 39 యూఎస్ 5609 నంబరు గల బస్సు దేవనబండ–ఆటికెలగుండు గ్రామాల మధ్య టైర్ పేలడంతో ఆగిపోయింది. పేలుడు తీవ్రతకు టైర్ ఉన్న చోట సీట్లో కూర్చున్న హోసూరు, పత్తికొండ, ఆదోనికి చెందిన వెంకటేష్, కార్తీక్, గిరి అనే ప్రయాణికులు గాయాల పాలయ్యారు. ఉన్నఫళంగా పెద్ద శబ్దంతో టైరు పేలడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు కాసేపు ఏమి జరిగిందో అర్థం కాక తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతరం ప్రయాణికులు 108కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న అంబులెన్స్ వాహనం సిబ్బంది గాయపడిన వారిని ఆస్పరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై ఘటన జరగడంతో ముప్పు తప్పిందని, రక్షణ గోడలు లేని వంతెన వద్ద టైరు పేలి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు వాపోయారు. డిపో మేనేజర్‌పై మండిపాటు ఆదోని, పత్తికొండ రెండు డిపోలకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్న రెహమాన్‌పై ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పత్తికొండ డిపోలో కాలం చెల్లిన బస్సులలో ప్రతిరోజు ప్రయాణం నరకప్రాయంగా మారింది. బస్టాండ్ నుంచి బయలుదేరిన బస్సులు గమ్యస్థానాలకు చేరకుండా అనునిత్యం మార్గం మధ్యలో నిలిచిపోతున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. దీనికితోడు పత్తికొండ బస్టాండ్‌కు వచ్చే ఇతర డిపోల సిబ్బంది ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇతర డిపోలకు చెందిన బస్సులు సమయపాలన లేకుండా నడపడం వల్ల అందుబాటులో ఉన్న బస్సులపై రద్దీ తీవ్రత పడుతుంది. దీంతో బస్సులో ప్రయాణం చేసేవారు అవస్థల నడుమ ప్రయాణాలు చేస్తున్నారు. అదే విదంగా రద్దీ వల్ల సోమవారం సాయంత్రం పత్తికొండ బస్డాండ్‌లో గుంతకల్‌కు చెందిన హసీనా అనే మహిళ తీవ్ర అస్వస్థతకు గురై వైద్య చికిత్స పొందుతూ కోలుకోలేక చనిపోయింది. పత్తికొండ డిపో మేనేజర్‌గా ఉన్న రెహమాన్ సంక్రమంగా విధులకు రాకపోవడం పాటు ఇక్కడ పనిచేసే సిబ్బంది విధులపై కూడా సంక్రమంగా పర్యవేక్షణ చేయడం లేదు. దీంతో మేనేజర్ నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవే సమస్యలపై నేరుగా గతంలో చాలా మంది రీజనల్ మేనేజర్ శ్రీనువాసులుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తోపులాటలో అస్వస్థతకు గురైన మహిళ మృతి కర్నూలు నుంచి గుంతకల్‌కు బస్సులో ప్రయాణిస్తున్న గుంతకల్‌కు చెందిన హసీనా (55) అనే మహిళ సోమవారం సాయంత్రం పత్తికొండ బస్టాండ్‌లో వాష్‌రూమ్‌కు దిగింది. తిరిగి బస్సు ఎక్కే క్రమంలో రద్దీ వల్ల జరిగిన తోపులాటలో ఊపిరి అందక స్పృహ తప్పి కింద పడిపోయింది. ఆమె కుమారుడు స్థానికుల సహకారంతో వెంటనే పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విధుల్లో ఉన్న వైద్యాధికారి మణిదీప్ ఆమెకు వైద్య చికిత్సలు నిర్వహించారు. అయితే ఆమె కోలుకోలేక మృతి చెందింది. బస్సులో రద్దీ వల్లనే తన అమ్మ అకారణంగా చనిపోయిందని కుమారుడు దాదాపీరా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారని కుటుంబసభ్యులు ప్రశ్నించారు. -
వ్యక్తి దారుణహత్య
ఆళ్లగడ్డ: పట్టణ శివారు పాలసాగరం వ్యవసాయ పొలంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. ఆంజనేయులు (27)ను ఎవరో దారుణంగా హత్య చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని నాయీ బ్రాహ్మణ కాలనీకి చెందిన ఆంజనేయులుకు ఐదేళ్ల క్రితం రుద్రవరం మండలం లింగందిన్నె గ్రామానికి చెందిన సుబ్బులుతో వివాహం అయ్యింది. అతడు సోమవారం రాత్రి ఇంటి వద్ద ఉండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బయటకు వెళ్లి వద్దామని చెప్పి తీసుకెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం పట్టణ శివారులోని పాలసాగరం రోడ్డులోని మొక్కజొన్న తోటలో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం రావడంతో వెళ్లి చూడగా మృతుడు ఆంజనేయులుగా గుర్తించారు. అతని భార్య సుబ్బులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజరావు తెలిపారు. మృతదేహం పడిఉన్న చోట మద్యం బాటిల్లు ఉండటంతో మద్యం మత్తులో ఘర్షణ జరిగి హత్య చేశారా? లేక వివాహేతర సంబంధం కారణమా? ఇతర కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు -
వరద బాధితులకు అండగా..
నంద్యాల(అర్బన్): వరద ప్రభావంతో నంద్యాలలో సర్వం కోల్పోయి ని రాశ్రయులుగా మారిన వారికి డాక్టర్ వైఎస్సార్ అండగా నిలిచారు. 2007 జూన్ 21న పట్టణం వరద ముంపునకు గురై అధికంగా నష్టపోయింది. వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో జూన్ 24న వైఎస్సార్ స్వయంగా పర్యటించి, బాధితులను పరామర్శి ంచారు. ప్రజల కష్టాన్ని కళ్లారా చూసి న వైఎస్సార్ వరద ముప్పు నుంచి కాపాడతానని హామీ ఇచ్చారు. ఆ మేరకు శ్యామ కాలువ, కుందూ నది,మద్దిలేరును వెడల్పు చేసి వరద ముప్పు తప్పించడానికి రూ.92 కోట్లను మంజూరు చేశారు. వైఎస్ నగర్, పీవీ నగర్లలో తాగునీటి సౌకర్యం, రోడ్లు, డ్రె యిన్లకు రూ.3.62 కోట్లను మంజూరు చేశారు. ఆయ న హయాంలో నంద్యాల నియోజకవర్గంలో దాదాపు రూ.250 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. -
సీమ కల్పతరువు అవుకు రిజర్వాయర్
కోవెలకుంట్ల: మహానేత జలయజ్ఞం పేరుతో చేపట్టిన ప్రాజెక్టులు ఆయా జిల్లాల రైతాంగానికి ఊపిరిలూదా యి. రెండు టీఎంసీల సామర్థ్యం ఉన్న అవుకు రిజర్వాయర్‌ను రూ.70 కోట్లతో నాలుగు టీఎంసీల సామర్థ్యానికి పెంచేందుకు 2005 నవంబర్‌లో శంకుస్థాపన చేశారు.దీని ద్వారా కర్నూలు,కడప జిల్లాల్లో 77,200 ఎకరాలకు సాగునీరు, రిజర్వాయర్‌కు అనుసంధానంగా జీఎన్ఎస్ఎస్ వరద కాల్వ నుంచి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.67 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 20 లక్షల మందికి తాగునీరు అందించాలన్నది లక్ష్యం. శ్రీశైలం జలాశ యం నుంచి అవుకు రిజర్వాయర్‌లోకి నీరు చేరేందుకు 30 వ ప్యాకేజీ కింద రూ.401 కోట్లతో 12 కిలోమీటర్ల మే ర రెండు సొరంగ మార్గాలను ఏర్పాటు చేసి 20 వేల క్యూసెక్కుల వరదజలాలను రిజర్వాయర్‌లో నింపు తున్నారు. వైఎస్సార్ కలల సాకారమైన అవుకు రిజర్వాయర్ సీమ జిల్లాలకు కల్పతరువుగా మారింది. -
రాజన్నకు పుష్పాంజలి
నంద్యాల(అర్బన్): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి పురస్కరించుకొని నంద్యాల చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్ సూక్ష్మ పూల బొమ్మలతో రాజన్న చిత్రం గీసి పుష్పాంజ లి అర్పించారు. వైఎస్సార్ తనదైన శైలిలో చిరునవ్వులు చిందిస్తున్నట్లు చిత్రాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా కోటేశ్ మాట్లాడుతూ.. మహానేత వైఎస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. జలయజ్ఞం, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతు బాంధవుడిగా పేరు పొందారన్నారు. ఆయ న మరణం కోట్లాది ప్రజలను వేదనకు గురి చేసిందన్నారు. రాజన్న నవ్వు వికసించిన పువ్వుల వలే స్వచ్ఛంగా ఉంటుందని కొనియాడారు. పెద్దనేలటూరు వాసికి డాక్టరేట్ కర్నూలు సిటీ: గోనెగండ్ల మండలం పెద్దనేలటూరు కు చెందిన వెంకటేశ్వర్లు గౌడ్, సువర్ణమ్మ దంపతుల కుమారుడు డాక్టర్ ఈ.నిరంజన్‌గౌడ్‌కు శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. ఈ మేరకు నిరంజన్ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘క్యాన్సర్‌తో బాధపడతున్న పిల్లల తల్లిదండ్రుల్లో సంరక్షకుల ఒత్తిడి’ అనే అంశంపై ప్రొఫెసర్ డి.సాయి సుజాత పర్యవేక్షణ,మార్గదర్శకత్వంలో పీహెచ్డీ పూర్తి చేశానని గ్రహీత వెల్లడించారు. పెద్దనేటూరులో పీహెచ్డీ సాధించిన మొదటి వ్యక్తిని కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. వైద్యులా.. భూత వైద్యులా? ఆదోని: తనపై మహిళా డాక్టర్ క్షుద్రపూజలు చేయించిందంటూ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర చర్చ కు దారితీసింది. ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రిలో సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఆది నాగేష్, అనస్థటిస్ట్‌గా డాక్టర్ లక్ష్మీ మోనాలిసా పనిచేస్తున్నారు. ఆది నాగేష్ ఆదోనిలో క్లినిక్ కూడా నడుపుతున్నారు. 3 రోజుల క్రితం క్లినిక్ నుంచి ఆయనకు అర్జంటుగా రావాలని ఫోన్ వచ్చింది. ఆయన హుటాహుటిన వెళ్లి సిబ్బందిని విచారించారు. క్లినిక్ ఎదుట నల్లటి కవర్ క్లినిక్ ప్రధాన ద్వారం ఎదుట ఒక నల్ల బ్యాగు ఉండటాన్ని ఆస్పత్రి సిబ్బంది గుర్తించారు. ఒక నర్సు భర్త ధైర్యం చేసి ఆ బ్యాగ్‌ను తెరిచి చూసి బిత్తరపోయారు. అందులో అనుమానాస్పద వస్తువులతో పాటు క్షుద్రపూజలు చేసిన సామగ్రి ఉంది. ఒక రాగి రేకు మీద డాక్టర్ ఆది నాగేష్ పేరు రాయబడి ఉంది. సీసీ కెమెరా ఫుటేజీతో కలకలం విషయం తెలుసుకున్న డాక్టర్ ఆది నాగేష్ సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ఓ మహిళ నల్లటి కవర్‌ను తీసుకొచ్చి ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద ఉంచి వెళ్లినట్లు ఫుటేజీలో కనిపించింది. ఆ మహిళ తన సహద్యోగి డాక్టర్ లక్ష్మీ మోనాలిసాగా గుర్తించి బిత్తరపోయారు. ఆస్పత్రి సిబ్బంది కూడా షాక్‌కు గురయ్యారు. పోలీసుస్టేషన్‌కు చేరిన వివాదం తాను చేసిన తప్పును ఎంతకూ ఒప్పుకోకపోవడంతో డాక్టర్ లక్ష్మీ మోనాలిసాపై డాక్టర్ ఆది నాగేష్ ఆదోని టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది నాన్ కాగ్నిజబుల్ కేసు కావడంతో కోర్టు అనుమతితో కేసు నమోదు చేసి విచారణ చేయాల్సి ఉంటుందని తెలిపారు. మరోవైపు తన ఫిర్యాదుపై కేసు నమోదు చేయాల్సిందేనని, అవసరమైతే జిల్లా ఎస్పీని కూడా కలుస్తానని డాక్టర్ ఆది నాగేష్ అంటున్నారు. మరో వైపు తాను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళనని, తాను కూడా డాక్టర్ ఆది నాగేష్‌పై అట్రాసిటీ కేసు పెడతానని తన సన్నిహితుల వద్ద డాక్టర్ లక్ష్మీ మోనాలిసా చెబుతున్నట్లు సమాచారం. -
కదిలిన స్పోర్ట్స్ కోటా డొంక
కౌతాళం: కర్నూలు జిల్లాలో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో చోటు చేసుకున్న బాగోతాలు కలకలం రేపడంతో ఉలిక్కిపడ్డ ఉన్నతాధికారులు హడావుడిగా విచారణకు ఉపక్రమించారు. కౌతాళం మండలంలో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు పొందిన 24 మంది ఉపాధ్యాయులను మండల విద్యాధికారులు రామాంజినేయులు, శోభారాణి గురువారం విచారించి వారి సర్టిఫికెట్లను పరిశీలించారు. ఎంఈవో కార్యాలయానికి కాకుండా గోతులదొడ్డి పాఠశాల వద్దకు పిలిపించి అక్కడ రహస్యంగా విచారణ చేపట్టారు. వల్లూరు ఆదర్శ పాఠశాలలో ప్రభాకర్‌తో పాటు మిగతా నలుగురు ఉపాధ్యాయులు స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం పొందిన వారే ఉన్నారు. కరా్టటక సరిహద్దు ప్రాంతమైన కౌతాళంలో నదీ తీర గ్రామాలనే స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు ఎంచుకోవడం గమనార్హం. వల్లూరు పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులు, కుంబళనూరులో ఐదుగురు, గుడికంబాలిలో ముగ్గురు, కాత్రికి పాఠశాలలో నలుగురు, మరళిలో ఇద్దరు, కరణిలో ఒకరు, కుంటనహాల్‌లో ఒకరు, చిరుతపల్లి పాఠశాలలో ముగ్గురు.. ఇలా సరిహద్దు గ్రామాలనే స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు ఎంపిక చేసుకున్నారు.జిల్లా ఫస్ట్ వచ్చినా ఉద్యోగం రాలేదు.. డీఎస్సీలో తన చిన్నాన్న కుమార్తె 70.18 మార్కులతో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించినా ఉద్యోగం ఇవ్వలేదని నదిచాగి ఎంపీటీసీ లింగన్నగౌడ్ పేర్కొన్నారు. తాళ్లూరు స్వాతికి టెట్‌లో 150కి 115 మార్కులు వచ్చాయన్నారు. కాల్ లెటర్ పంపించినా కర్నూలుకు వెళితే రిజెక్ట్ చేశారన్నారు. -
కర్నూలు జనసంద్రం
కర్నూలు (టౌన్): కర్నూలు నగరం గురువారం జనసంద్రంగా మారింది. ఎస్టీబీసీ కళాశాల మైదానం మొదలు వైఎస్సార్ సర్కిల్, నరసింగరావు పేట, చిరంజీవి పార్కు, ప్రకాష్ నగర్, నేతాజీ థియేటర్, సుంకేసుల రోడ్డులోని సెయింట్ జోసఫ్ కళాశాల వరకు ఇసుక వేస్తే రాలనంతగా జనసందోహం సందడి చేసింది. తమ అభిమాన నాయకుడైన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలుకు విచ్చేశారని తెలియడంతో అశేష ప్రజానీకం తరలి వచ్చి రోడ్డుకిరువైపులా బారులు తీరింది. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎస్వీ విజయమనోహరి దంపతుల కుమారుడు జనక్దత్తా రెడ్డి, రాజమండ్రి రుడా మాజీ చైర్మన్ షర్మిల, మేడపాటి అనిల్ రెడ్డి దంపతుల కుమార్తె హంసినీ శ్రేయల వివాహ రిసెప్షన్‌కు గురువారం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు హెలికాఫ్టర్‌లో ఎస్టీబీసీ కళాశాల మైదానానికి చేరుకున్న వైఎస్ జగన్.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేసిన సెయింట్ జోసఫ్ కళాశాల వరకు దారిపొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చారు. ప్రజలు, మహిళలు, అభిమానులు వేలాదిగా అడుగడుగునా వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. జగన్‌తో సెల్ఫీ దిగేందుకు యువత పోటీ పడ్డారు. నేతలను, అభిమానులను వైఎస్ జగన్ ఆత్మీయంగా పలకరిస్తూ.. అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వైఎస్ జగన్‌ను కలిసిన న్యాయవాదులుఅధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీకర్నూలు: చంద్రబాబు కూటమి ప్రభుత్వం న్యాయ పరంగా కర్నూలుకు తీరని నష్టం చేకూర్చిందని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కర్నూలుకు వచ్చిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కర్నూలు నగరంలో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో పాటు మానవ హక్కుల కమిషన్, లోకాయుక్తను కర్నూలులో ఏర్పాటు చేసిందన్నారు. అయితే వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడకు తరలించి రాయలసీమ ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే కర్నూలులో నేషనల్ లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. కర్నూలులో న్యాయవాదుల సమాజానికి ఇప్పటి వరకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. వారి సమస్యలను ఓపికగా విన్న వైఎస్ జగన్.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేతలు జి.స్వాములు, సువర్ణా రెడ్డి, హనుమంత రెడ్డి, నరేంద్రనాథ్ రెడ్డి, కోడుమూరు ప్రభాకర్, శివ, ఇతర న్యాయవాదులు ఉన్నారు. బ్లడ్ క్యాన్సర్ బాధితునికి వైఎస్ జగన్ పరామర్శకర్నూలు (టౌన్): చాలా కాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న విశ్వనాథ్ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి వీరాభిమాని. వైఎస్ జగన్‌ను దగ్గరి నుంచి చూడాలని, ఫొటో దిగాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో గురువారం కర్నూలు నగరానికి వస్తున్న వైఎస్ జగన్‌ను ఎలాగైనా కలవాలని నడవలేని స్థితిలో వీల్‌చైర్‌లో ఎస్టీబీసీ కళాశాలకు చేరుకున్నాడు. మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ద్వారా విషయం తెలుసుకున్న వైఎస్ జగన్ వెంటనే వీల్ చైర్లో ఉన్న విశ్వనాథ్ దగ్గరకు వెళ్లారు. అతనితో కలిసి ఫొటో దిగారు. ఆప్యాయంగా పలకరించారు. దీంతో ఇన్నాళ్లకు తన కోరిక తీరిందని విశ్వనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. బాధితుడి కుటుంబ సభ్యులు వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
ఉద్యాన పంటలతో ఎగుమతులు సాధ్యమే!
కర్నూలు(అగ్రికల్చర్): ఉద్యాన పంటల్లో ఎగుమతులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అయితే సాగులో తగిన జాగ్రత్తలు చేపట్టి నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఐ కార్ ప్రధాన శాస్త్రవేత్త విజయ్ అవినాష్ లింగం సూచించారు. కర్నూలులోని ఉద్యాన భవన్లో గురువారం రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ప్రపంచ విజయం దిశగా సాధికారత సాధించడం, ఎగుమతుల సన్నాహకాలపై సమగ్ర శిక్షణలో భాగంగా జిల్లాలోని ఎఫ్పీఓల ప్రతినిధులకు ఎగుమతులపై అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఐ కార్ ప్రధాన శాస్త్రవేత్త మాట్లాడుతూ.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతులపై అవగాహన కల్పించారు. ఏఏ పంటలకు ఎగుమతులకు అవకాశాలు ఉన్నాయి. ఎగుమతులలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల పాత్ర తదితర వాటిని వివరించారు. కర్నూలు జిల్లా ఉద్యాన పంటల సాగుకు నిలయంగా మారుతోందని, ఎగుమతులకు అవకాశం ఉన్నప్పుడే పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభిస్తాయని పేర్కొన్నారు. ఉద్యాన శాఖ, నాబార్డు, డీఆర్డీఏ ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు బాగా పని చేస్తున్నాయని, ఎగుమతులకు అవకాశం కల్పించడం ద్వారా సంఘాలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. వివిధ సంఘాల ప్రతినిధుల అనుమానాలను నివృత్తి చేశారు. ఎగుమతులకు నాబార్డు, ఎపిడా సంపూర్ణంగా సహకరిస్తున్నాయని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇండియన్ ఇనిస్టిట్యూషన్ ఆప్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ ప్రతినిధి నబిరసుల్, నాబార్డు డీడీఏం సుబ్బారెడ్డి, ఎపిడా మేనేజర్ పెద్దస్వామి, జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి, డీఆర్డీఏ పీడీ శ్రీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధురాలిపై దాడిచేసి దోపిడీ
● ఇంట్లోకి ప్రవేశించి దుండగుడి చర్య ● 8 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధితురాలి ఫిర్యాదు సి.బెళగల్: మండల పరిధిలోని సంగాల గ్రామంలో వృద్ధురాలిపై దాడిచేసి ఒంటిపై ఉన్న బంగారు నగలను గుర్తు తెలియని దుండగుడు దోచుకెళ్లిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తుల సమాచారం మేరకు.. గ్రామంలోని ప్రధాన దారిలో పిరమిడ్ కేంద్రం దగ్గరున్న ఇంట్లో వృద్ధురాలు సంజీవమ్మ భర్త మల్లికార్జున శెట్టి 8 నెలల కింద అనారోగ్యంతో మృతి చెందటంతో ఒంటరిగా నివశిస్తోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం సంజీవమ్మ ఇంటి పనిలో నిమగ్నమై ఉండగా, అప్పటికే పథకంతో ఉన్న దుండగుడు ఇంట్లోకి చొరబడి, వృద్ధురాలిపై దుప్పటి కప్పి మెడలో ఉన్న 5 తులాల బంగారు గొలుసు, చేతికి ఉన్న 3 మూడు తులాల బంగారు గాజులను లాక్కొని వృద్ధురాలిని బాత్రూంలోకి తోసి బయట గడియతోపాటు, ఇంటి గడియ పెట్టి పరారయ్యాడు. బాధితురాలు కేకలు వేసినప్పటికీ బయటివారికి వినిపించలేదు. తరచూ వృద్ధురాలితో మాట్లాడే అదే ప్రాంతంలోని యువకుడు సాయంత్రం ఇంటి వద్దకు వెళ్లి చూడగా గదిలో తలుపు కొడుతున్న శబ్దం రావడంతో తలుపు తీయగా నీరసంగా బాధిత మహిళ సంజీవమ్మ కనిపించింది. విషయాన్ని స్థానికులకు తెలియజేయడంతో వెంటనే సి.బెళగల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. 6 రోజుల క్రితమే విఫలయత్నం? బాధితురాలు జరిగిన సంఘటనను తెలియజేస్తూ.. గత శనివారం (ఆగస్టు 29న) రాత్రి ఇంట్లో పడుకుని ఉండగా బయటి నుంచి తలుపు కొట్టిన శబ్దం వచ్చిందని, తాను భయంతో తలుపు తీయలేదని చెప్పింది. మరుసటి రోజు ఉదయం ఇంటి పరిసరాల్లో సంచిలో వేట కొడవలి, మాస్క్, హెల్మెట్, గ్లౌజ్‌లు, రెయిన్‌కోట్, సాక్సులు కనిపించాయని బాధితురాలు తెలిపింది. రాత్రి వేళ తలుపు కొట్టడంతో పాటు, ఇంటి పరిసరాల్లో అనుమానాస్పద వస్తువులు లభించిన విశయాన్ని సంజీవమ్మ బంధువులకు, గ్రామస్తులకు తెలపడంతో, వారి సూచన మేరకు ఇంటికి సీసీ కెమరాలను ఏర్పాటు చేసుకునేందుకు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారు. కాగా ఆరు రోజుల క్రితమే దుండగుడు చోరీకి విఫలయత్నం చేసినట్లు స్థానికులు చర్చించుకున్నారు. భయాందోళనలో గ్రామస్తులు ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళను లక్ష్యంగా చేసుకుని బంగారం దోపిడీ చేయడంపై గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. మారుమూల పల్లెటూరు అయిన సంగాల గ్రామంలో దుండగుడు ఆయుధాలు, రక్షణ సామగ్రితో దోపిడీకి పాల్పడటంతో పల్లె ప్రజలు భయపడుతున్నారు. పోలీసులు సమగ్రంగా విచారించి, నిందితుడిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, గ్రామంలో పొలీసు నిఘా పెంచాలని కోరుతున్నారు. కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కరువు ఉరుముతోంది
● రెండున్నర నెలలుగా జాడలేని వర్షాలు ● దాదాపు అన్ని పంటల్లో దిగుబడులు జీరో ● ఉమ్మడి జిల్లాలో రూ.2500 కోట్ల పెట్టుబడి మట్టిపాలు ● కర్నూలు జిల్లాలో 43 శాతం, నంద్యాల జిల్లాలో 43.1 శాతం లోటు వర్షపాతం ● ప్రత్యామ్నాయ పంటలకు అవకాశం లేనట్లే.. పాణ్యం మండలం కొణిదేడులో నీరు లేక నెర్రలిచ్చిన వరి పొలంకర్నూలు జిల్లాలో 3,44,171 హెక్టార్లలో పంటలు సాగు చేయగా.. హెక్టారుకు రూ.50 వేల ప్రకారం రూ.1,720 కోట్ల పెట్టుబడి నష్టం జరిగింది.నంద్యాల జిల్లాలో 1,55,477 హెక్టార్లలో పంటలు సాగు చేయగా.. కేవలం పెట్టుబడి రూపంలోనే రూ.773 కోట్లు మట్టిపాలయింది. -
ఆర్‌యూలో విద్యార్థి సంఘం నేత హల్చల్
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం నేత, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అనుచరుడు బుధవారం రాత్రి వర్సిటీలో వీరంగం సృష్టించాడు. వీసీని కలవడానికి అనుమతివ్వలేదనే కారణంతో వీసీ పీఏతో మొదలైన దూషణల పర్వం, వీసీ డ్రైవర్, ఒక సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులను అసభ్య పదజాలంతో విరుచుపడ్డాడు. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.విజయ్‌కుమార్ నాయుడు ఎదుటే దూషణల పర్వం కొనసాగింది. రిజిస్ట్రార్‌ను ఉద్దేశించి ‘‘కడపలో ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఉండేది, ఇప్పుడు అది పోయింది, నీ విషయంలో జోక్యం చేసుకోలేదు. వీసీకి, రిజిస్ట్రార్‌కు నేను ఎంత సపోర్ట్ చేశానో తెలుసా’’ అంటూ విరుచుకుపడ్డాడు. ‘‘మా ఆడబిడ్డపై దాడి చేస్తారా.. మా గవర్నమెంట్ ఇది, ఎవరు నన్ను ఆపేది, అయితే సస్పెండ్ చేస్తారు అంతే కదా. ఇక్కడ అందరి జాతకాలు తెలుసు. ఒక్కొక్కరి దగ్గర రూ.50 వేలు, రూ.లక్ష తీసుకొని డ్రామాలు చేస్తారా’’ అంటూ వీరంగం సృష్టించాడు. బైరెడ్డి శబరి అక్కకు ఒక్క ఫోన్ చేస్తే.. అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరకు రిజిస్ట్రార్ ఇలాగే చేస్తే పోలీసులను పిలవాల్సి వస్తుందని చెప్పడంతో ఆయనతో పాటు మాట్లాడటానికి రిజిస్ట్రార్ ఛాంబర్‌కు వెళ్లాడు. విద్యార్థులు గొడవ పడితేనే సస్పెండ్, వర్సిటీని బహిష్కరించే వర్సిటీ అధికారులు, మరి వర్సిటీ పరిపాలనాధికారి ఎదుటే, పరిపాలనా భవనంలోనే ఇష్టానుసారం అసభ్య పదజాలంతో దూషణలకు పాల్పడ్డ విద్యార్థి సంఘం నాయకునిపై ఏమి చర్యలు తీసుకుంటారోననే చర్చ వర్సిటీలో సాగుతోంది. -
5, 6 తేదీల్లో సర్ ప్రత్యేక క్యాంపులు
కర్నూలు(సెంట్రల్): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)లో భాగంగా డ్రాఫ్ట్ రోల్‌పై వచ్చిన అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించడానికి ఈనెల 5, 6 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని పోలింగ్ బూత్‌ల్లో బీఎల్ఓలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండి ఓటర్ల నుంచి ఫాం 6, 7, 8, 8ఏలను స్వీకరిస్తారని చెప్పారు. ఫాం–6 ద్వారా కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడం, ఫాం–7 ద్వారా ఓటరు తొలగింపునకు అర్జీలు ఇవ్వడం, ఫాం–8 ద్వారా పేర్లు, ఫొటోలు, ఇతర వివరాల సవరణ చేసుకోవచ్చన్నారు. ఫాం 8ఏ ద్వారా విదేశాల్లో ఉన్న భారతీయులు ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. క్వింటా ఉల్లి రూ.4,340 కర్నూలు(అగ్రికల్చర్): ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో ఉల్లి సాగులో పురోగతి కరువైంది. గత ఏడాది ఇదే సమయంలో మార్కెట్‌కు 4,500 క్వింటాళ్ల ఉల్లి మార్కెట్‌కు వచ్చింది. నేడు 1,182 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. కనిష్ట ధర రూ.2,569 లభించగా.. గరిష్ట ధర రూ.4,340, సగటు ధర రూ.4,190 నమోదైంది. కర్నూలు మార్కెట్లో వేరుశనగకు గరిష్ట ధర రూ.9,419, ఆదోని మార్కెట్లో రూ.9,504, ఎమ్మిగనూరు మార్కెట్లో రూ.7,909 లభించింది. ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభం కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజిలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ అడ్మిషన్లు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరంలో స్టేట్ కోటా కింద అడ్మిషన్లు పొందిన 34 మంది విద్యార్థులు మొదటి రోజు అడ్మిషన్ తీసుకున్నారు. ఈ అడ్మిషన్లు ఈ నెల 7వ తేదీ వరకు నిర్వహిస్తామని, సెలవు రోజుల్లో కూడా ఈ ప్రక్రియ నిరంతరాయంగా చేపడతామని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ తెలిపారు. అడ్మిషన్ల కార్యక్రమాన్ని వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ హరిచరణ్, డాక్టర్ సింధియా శుభప్రద, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీబాయి, ఫార్మకాలజి హెచ్ఓడీ డాక్టర్ రాజేష్ పర్యవేక్షించారు. -
రూ.3.20 లక్షల పెట్టుబడి నష్టం
16 ఎకరాల్లో పత్తి సాగు చేశాం. అంతరపంటగా కంది వేసుకున్నా. రెండున్నర నెలలుగా చినుకు జాడ లేదు. పత్తి, కంది పంటలు పూర్తిగా దెబ్బతిన్నా యి. ఎకరాకు సగటున రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టాం. మొత్తంగా రూ.3.20 లక్షల వరకు పెట్టుబడిని కోల్పోయాం. గతంలో ఎప్పుడూ ఇంతటి దారుణమైన పరిస్థితులు లేవు. – శ్రీనివాసరెడ్డి, రైతు, వెల్దుర్తి సొంత పొలం ఆరు ఎకరాలు ఉంటే, 34 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. ఇప్పటి వరకు మిర్చి 10 ఎకరాలు, కంది 15 ఎకరాలు, సద్దలు 8 ఎకరాల ప్రకారం 33 ఎకరాల్లో పంటలు వేశాం. వర్షాలు లేకపోవడం వల్ల ఏడు ఎకరాలు ఖాళీగా ఉంది. సాగు చేసిన పంటలకు ఎకరాకు రూ.15వేల ప్రకారం రూ.4.95 లక్షలు పెట్టుబడి పెట్టాం. ఎకరాకు కౌలు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంది. పంటలు పండకపోయినప్పటి కౌలు మాత్రం రూ.3.40 లక్షలు చెల్లించాల్సి ఉంది. మొత్తంగా రూ.8.35 లక్షలు నష్టం వాటిళ్లుతోంది. కరువు మా జీవితాన్ని పూర్తిగా కాటేసింది. – లింగరాజు, రైతు, మద్దికెర -
అంతా శివయ్యే చూసుకోవాలి!
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో ఇంజినీరింగ్ విభాగం అత్యంత కీలకం. ఈ విభాగం ద్వారా క్షేత్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి. శ్రీగిరిలో త్వరలో సుమారు రూ.800 కోట్లతో మూడు విడతలుగా మాస్టర్ ప్లాన్ పనులకు శంకుస్థాపన చేసి, పనులను ప్రారంభించాలని ట్రస్ట్‌బోర్డు ఆశిస్తోంది. అయితే దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఈఈ) రిటైర్ కావడంతో ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్చార్జ్ డీఈఈ హోదాలో ఇద్దరు ఏఈఈలు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో క్షేత్రంలో ఇంజినీర్ల కొరతతో అభివృద్ధి పనులకు అటంకం కలగనుంది. దేవస్థానంలో ఇంజినీర్ల కొరత రాష్ట్రంలో అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో శ్రీశైల మహాక్షేత్రం రెండవది. శ్రీశైల దేవస్థానం ఇంజినీరింగ్ విభాగంలో ఈఈలు ఇద్దరు ఉండాలి. అలాగే సివిల్–2, ఎలక్ట్రికల్–1, వాటర్ సఫ్లై–1 ఇలా నలుగురు డిప్యూటీ ఈఈలు ఉండాలి. అలాగే హెడ్ డ్రాఫ్ట్స్‌మెన్–ఒకరు, డ్రాఫ్ట్స్‌మెన్–ఇద్దరు ఉండాలి. ఒక్కో డీఈఈ కింద ఐదుగురు సహాయ ఇంజినీర్లు ఉండాలి. ఒక్కో ఏఈకి ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ఉండాలి. అంతేగాకుండా ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్స్, ఫిట్టర్, పంప్ ఆపరేటర్, సూపర్వైజర్స్, మేషన్ (మేస్త్రి), కార్పెంటర్, వెల్డర్, పెయింటర్, హెల్పర్స్ ఉండాలి. దేవస్థానంలోని ఇద్దరు ఈఈల్లో ఒకరు జూన్‌లో, మరొకరు ఆగస్టులో రిటైర్ అయ్యారు. దీంతో రెండు ఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నలుగురు డీఈఈలకు గాను ఎవరు లేరు. 20 మంది ఏఈలకు గాను నలుగురు రెగ్యులర్, మరికొంత మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నారు. డ్రాఫ్ట్స్‌మెన్ ఒకరు మాత్రమే ఉన్నారు. అంతేగాకుండా ఇద్దరు ఏఈఈలు, ఇన్చార్జ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ (సివిల్, ఎలక్ట్రికల్) ఇంజినీర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. అనుభవం ఉన్న అధికారి అయితే.. సుమారు రూ.800 కోట్లతో మూడు విడతల్లో చేపట్టనున్న మాస్టర్‌ప్లాన్ అభివృద్ధి పనులు వేగవంతం కావాలంటే గతంలో దేవస్థానంలో పనిచేసిన అనుభవం కలిగిన అధికారిని ఈఈగా నియమించాలనే వాదన వినిపిస్తోంది. రూ.800కోట్ల అభివృద్ధి పనులు ఎటువంటి అంతరాయం లేకుండా వేగంగా, క్షేత్రంలో మౌలిక వసతులు, దేవస్థాన ఇంజినీరింగ్ పనులపై అవగాహన ఉండి గతంలో క్షేత్రంలో పనిచేసిన ఈఈను శ్రీశైలానికి డెప్యూటేషన్ లేదా బదిలీపై నియమించాలని కొన్ని నెలల క్రితం ఈఓ రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌కు లేఖ సైతం రాశారు. అయితే టీడీపీ ముఖ్యనేత అనుచరుడు ఆర్అండ్బీ శాఖలో ఈఈగా ఉన్న ఓ అధికారిని దేవస్థాన ఈఈగా డెప్యూటేషన్‌పై తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా దేవదాయ శాఖ అధికారులు శ్రీశైల దేవస్థానంలోని ఇంజినీరింగ్ విభాగంపై దృష్టిసారించి అనుభవం, అర్హత కలిగిన ఇంజినీర్లను నియమించి, మాస్టర్‌ప్లాన్ పనులు పూర్తి నాణ్యతతో నిర్మించేలా పర్యవేక్షణ చేసేందుకు అవరమైన పూర్తిస్థాయి ఇంజినీర్లను నియమిస్తారో లేక టీడీపీ ముఖ్య నాయకుడి అనుచరుడి సూచించిన ఆర్అండ్బీ శాఖ ఈఈని డెప్యూటేషన్‌పై నియమిస్తారో చూడాలి. శ్రీశైల దేవస్థానంలో అభివృద్ధి పనులకు ఇంజినీర్లు కరువు దేవస్థానంలోని ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు రిటైర్డ్ శ్రీగిరిలో త్వరలో మూడు విడతల్లో రూ.800 కోట్లతో మాస్టర్‌ప్లాన్ పనులు రూ.800 కోట్ల మాస్టర్‌ప్లాన్‌కు ఆటంకం టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి శ్రీశైల దేవస్థానంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. దేవస్థాన ట్రస్ట్‌బోర్డు సుమారు రూ.800 కోట్లతో మూడు విడతల్లో మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా క్యూకాంప్లెక్స్, పబ్లిక్ ఎనిమిటీస్, టాయిలెట్స్, సాలు మండపాలు నిర్మించాలని భావిస్తున్నారు. అయితే దేవస్థానంలో ఈఈలు లేకపోవడంతో మాస్టర్‌ప్లాన్ పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మాస్టర్‌ప్లాన్ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ, నాణ్యతతో నిర్మాణ పనులు, పర్యవేక్షణ చేపట్టేందుకు దేవస్థానంలో ఈఈలు లేరు. ఈ నేపథ్యంలో దేవస్థానంలో మాస్టర్‌ప్లాన్ అమలుకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. -
ఎండుతున్న పొలాన్ని చూసి ఆగిన రైతు గుండె
మహానంది: మహానంది మండలం బొల్లవరం గ్రామానికి చెందిన బండారు శేఖర్ (45) ఎండుతున్న పొలాన్ని చూసి ఆవేదనతో గుండెపోటుకు గురై గురువారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామానికి చెందిన శేఖర్ తనకున్న కొద్దిపాటి పొలంతో పాటు 5.50 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఇటీవల వర్షాలు లేక వరి పంట ఎండిపోవడంతో ఆందోళన చెందాడు. ఈ మేరకు గత రెండు రోజుల నుంచి పొలం ఎండిపోతోందని కుటుంబ సభ్యులతో చెబుతూ మనోవేదనకు గురయ్యాడు. పొలం ఎండిపోతే పోయింది.. అప్పులు ఎలాగైనా తీర్చుకుందామని కుటుంబ సభ్యులు ఓదార్చుతూ వచ్చారు. అయినప్పటికీ మనోవేదనకు గురైన ఆయన గురువారం తెల్లవారుజామున గుండెపోటుకు గురికావడంతో చికిత్స నిమిత్తం నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన కోలుకోలేక మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతిచెందిన శేఖర్‌కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
డోన్ రూరల్: రాష్ట్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)ల్లో ఏర్పాటు చేస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌లకు సంబంధించి కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ డిప్యూటీ డైరెక్టర్ జింకా శ్రీకాంత్, ఐటీఐ ప్రిన్సిపాల్ నాగకేశాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డేటా అనోటేటర్ అసిస్టెంట్ (3) ఓసీ, డేటా క్యూరెటర్ అసిస్టెంట్ (3) ఓసీ–1, బీసీ–1, ఎస్సీ–1, పోస్టులు డోన్ ఐటీఐలో అందుబాటులో ఉన్నాయన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, అభ్యర్థులు ఎంపికకు సంబంధించి 22 సెప్టెంబర్ సాయంత్రం 5 గంటల్లోపు వివరాలను సమర్పించాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలకు దగ్గర్లోని ఐటీఐ ప్రధానాధికారిని సంప్రదించాలని పేర్కొన్నారు. నియామక ప్రకియ డిప్యూటీ డైరెక్టర్ రీజినల్ ఆఫీస్, ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ క్యాంపస్, పద్మావతిపురం, తిరుచానూర్ రోడ్డు, తిరుపతి కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య డోన్ టౌన్: మండలంలోని చింతలపేట గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు కుమ్మరి వెంకటస్వామి (27) చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఆగస్టు 28న తండ్రి మందలించడంతో వెంకటస్వామి ఇంటి నుండి వెళ్లిపోయి గ్రామ సమీపంలో గోసానిపల్లె నుంచి ధర్మారం గ్రామానికి వెళ్లే మట్టి రోడ్డు గుండా పొలాల్లోకి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. వెంకటస్వామికి నాలుగు సంవత్సరాల క్రితం హరిప్రియ అనే యువతితో వివాహం జరిగింది. ఉడుములపాడు సమీపంలోని ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పని చేస్తూ జీవనం సాగించేవారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన అతని కోసం కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో గురువారం అటు వైపు పొలం పనులకు వెళ్లిన వారికి దుర్వాసన రావడంతో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తల్లి లక్ష్మిదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. ఆటో ఢీకొని వ్యక్తి మృతి కర్నూలు (సిటీ): కర్నూలు రూరల్ మండల పరిధిలోని ఇ.తాండ్రపాడు గ్రామంలో ఆటో ఢీకొనడంతో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ కోలుకోలేక మృతిచెందాడు. అదే గ్రామంలోని టీజీ నగర్‌కు చెందిన ఎం.రాజేంద్ర బాబు (56) బార్బర్ షాప్ నిర్వహిస్తున్నాడు. రాత్రి షాప్‌కు మూత వేసి ఇంటికి వెళ్తుండగా గ్రామ సమీపంలోని వంతెన వద్ద ఇ.తాండ్రపాడుకు చెందిన ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టారు. ప్రమాదంలో రాజేంద్రబాబుకు తీవ్ర గాయాలైనప్పటికీ ఆటోడ్రైవర్ అలాగే ముందుకెళ్లిపోయాడు. అదే దారిలో వెళ్తున్న కొందరు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారమివ్వడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి కోలుకోలేక మృతిచెందాడు. మృతుడికి భార్య ఎన్.శంకరమ్మ, ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. హైకోర్టు బెంచ్ సాధించే వరకు ఉద్యమం కర్నూలు: కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ సాధించేవరకు ఉద్యమం కొనసాగిస్తామని న్యాయవాదులు స్పష్టం చేశారు. వారి రిలే నిరాహారదీక్షలు 11వ రోజు గురువారం కొనసాగాయి. న్యాయవాదులు నిస్సీ, గౌతమ్ శేఖర్, తులసి ఈశ్వర్ రెడ్డి తదితరులు దీక్షలో కూర్చున్నారు. సర్క్యూట్ బెంచ్ వద్దు. శాశ్వత హైకోర్టు బెంచ్ మాత్రమే కావాలంటూ నినాదాలు చేస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. 11వ తేదీ వరకు విధుల బహిష్కరణ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న న్యాయవాదుల విధుల బహిష్కరణ ఈనెల 11వ తేదీ వరకు కొనసాగించాలని తీర్మానించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయవాదుల భవన్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు తెలిపారు. ప్రభుత్వం స్పష్టమైన అధికారిక ప్రకటన చేసే వరకు వివిధ రూపాల్లో ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పత్తి పంట దున్నివేత ఆలూరు రూరల్: మండలంలోని కాత్రికి గ్రామానికి చెందిన రైతు విఠల్ 17 ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంట వర్షాభావంతో పూర్తిగా ఎండిపోవడంతో పంటను దున్నేశాడు. వరుణుడు ముఖం చాటేయడంతో పత్తి మొక్కలు ఎదుగుదల లేక వాడిపోయాయి. పంటకు నీరు అందించే పరిస్థితి లేకపోవడంతో పెట్టుబడులు కూడా దక్కే అవకాశం లేదని భావించిన విఠల్..గురువారం ట్రాక్టర్‌తో పంటను దున్నేశాడు. -
రాజకీయ ముద్రతో ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం
కర్నూలు(సెంట్రల్): ఉద్యోగ సంఘాల నాయకులపై ప్రభుత్వం రాజకీయ ముద్ర వేసి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ వి.గిరికుమార్‌రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులను జేఏసీ నాయకులు కలుసుకొని మద్దతు కోరారు. ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్రభుత్వ తీరు పట్ల కార్యాలయాల్లోనే నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నల్లబ్యాడ్జీలతోనే విధులకు హాజరుకావాలన్నారు. అందులో భాగంగానే కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన సమయంలో ఉద్యోగులు పెద్త ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వి.గిరికుమార్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై 27 నెలలు గడిచినా ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడంతో విధిలేని పరిస్థితుల్లోనే ఏపీజేఏసీ అమరావతి ఉద్యమానికి సిద్ధమైందన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటైన 12వ పీఆర్సీని తొలగించడం అన్యాయమని, ఉద్యోగులకు సంబంధించి ఇస్తామన్న ఐఆర్ 30 శాతం ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను కూడా వెంటనే ఇవ్వాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి పెండింగ్‌లోని రూ.40 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం.వెంకటరాజు, నాయకులు ధనుంజయరెడ్డి, కృష్ణ పాల్గొన్నారు. రూ.1.35 కోట్లతో షెడ్ల నిర్మాణాలు కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద రూ.1.35 కోట్లతో వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కర్నూలు, ఆదోని మార్కెట్ యార్డుల్లో రూ.50 లక్షల ప్రకారం, ఎమ్మిగనూరు మార్కెట్లో రూ.35 లక్షలతో కవర్డ్ షెడ్లు నిర్మించనున్నట్లు మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు నారాయణమూర్తి తెలిపారు. కర్నూలు మార్కెట్‌కు మంజూరైన కవర్డ్ షెడ్‌ను ఈ నెల 5న మంత్రి టీజీ భరత్ భూమి పూజ చేయనున్నారని మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. 100‘‘60 అడుగుల విస్తీర్ణంలో షెడ్ నిర్మిస్తామన్నారు. -
ప్రత్యామ్నాయ పంటలకు అవకాశం లేనట్లే..
ఇప్పటికే కర్నూలు జిల్లాలో పత్తి, ఉల్లి, మొక్కజొన్న తదితర పంటలు దాదాపు 28వేల హెక్టార్లలో... నంద్యాల జిల్లాలో 30వేల హెక్టార్లలో పంటలను దున్నేశారు. ప్రత్యామ్నాయంగా జొన్న, కొర్ర, స్వల్పకాలిక రకాలైన కంది, పెసర, అలసంద, ఉలువలు, వంటి పంటలు సాగు చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు కూడా వర్షాల అవసరం ఉంది. కనీసం 100 మి.మీ వర్షపాతం నమోదు కావాలి. ఎల్‌నినో ప్రభావం వచ్చే ఏడాది మార్చి వరకు ఉంటుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. వర్షాలే లేకపోతే ప్రత్యామ్నాయ పంటల సాగు ఎలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎల్‌నినో తీవ్రతను పరిశీలిస్తే ఈ సారి రబీ సీజన్‌పైనా ఆశలు వదులు కోవాల్సిందేనని తెలుస్తోంది. కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్లో మూడు నెలలు గడచిపోయాయి. మామూలుగా ఈ పాటికి చెరువులు, కుంటలు, వాగులు, వంకలు జలకళను సంతరించుకోవాల్సి ఉంది. కానీ ఉమ్మడి జిల్లాలో ఎటు చూసినా ఏడారి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో 3,44,171 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. నంద్యాల జిల్లాలో 1,55,648 హెక్టార్లలో పంటలు వేశారు. దాదాపు అన్ని పంటలు నెల నుంచి 90 రోజుల దశలో ఉన్నాయి. కర్నూలు జిల్లాలో పత్తి 2,32,671 హెక్టార్లలో సాగయింది. మామూలుగా పత్తిలో ఈ పాటికి ఒకసారి పత్తి తీస్తారు. మొదటి సారి పత్తి తీయడంలోనే ఎకరాకు 3–4 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంది. అలాంటిది పత్తి వేసి 90 రోజులు గడుస్తున్నా కిలో దిగుబడి కూడా తీయలేని పరిస్థితి. పత్తి మొక్కలు కనీసం 3–4 అడుగుల ఎత్తు పెరగాలి. ఈ సారి ఏర్పడిన అనావృష్టి వల్ల ఒక్క అడుగు ఎత్తు కూడా పెరగకపోవడం కరువు తీవ్రతకు అద్దం పడుతోంది. ఒక్క పత్తిలోనే కాదు.. వేరుశనగ, కంది, ఆముదం తదితర అన్ని పంటల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నంద్యాల జిల్లాలో మొక్కజొన్న, కంది, మినుము, వరి, పత్తి ప్రధాన పంటలు. ఒక్క డోన్ నియోజకవర్గం మినహా మిగిలిన అన్ని ప్రాంతాలకు నీటిపారుదల సదుపాయం ఉంది. కానీ మొదటిసారి నీటిపారుదల స్తంభించింది. సాగైన పంటల్లో దిగుబడులు దాదాపు జీరో కావచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలే స్పష్టం చేస్తున్నారు. దెబ్బతీసిన ఎల్‌నినో.. వరుసగా 21 రోజులు వర్షం లేకపోతే ఒక డ్రై స్పెల్‌గా పరిగణిస్తారు. ఇటు కర్నూలు, అటు నంద్యాల జిల్లాల్లో జూన్ 14న ఆశాజనకంగా వర్షాలు కురిశాయి. ఆ తర్వాత అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మినహా ఎక్కడా భారీ వర్షం లేదు. అంటే దాదాపు రెండున్నర నెలలుగా వర్షాలు లేకపోవడం ఇదే మొదటిసారి. ఉమ్మడి జిల్లాలో దాదాపు ప్రతి మండలంలో మూడు డ్రై స్పెల్‌లు రావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. నంద్యాల జిల్లాలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సాధారణ వర్షపాతం 428.3 మి.మీ ఉండగా.. 243.8 మి.మీ వర్షపాతం మాత్ర మే నమోదైంది. కర్నూలు జిల్లాలో జూన్ నుంచి ఆగస్టు వరకు 286.4 మి.మీ సాధారణ వర్షపాతం ఉండగా.. 164.5 మి.మీకే పరిమితమైంది. గత 50 ఏళ్లలో అనేక సార్లు ఎల్‌నినో ప్రభావం ఏర్పడింది. అయితే వర్షాలు కాస్త మెరుగ్గానే కురిశాయి. ఈ సంవత్సరం ఏర్పడిన ఎల్‌నినోను అత్యంత తీవ్రమైనదిగా పేర్కొంటున్నారు. -
దిశ, వన్‌స్టాప్ సెంటర్ తనిఖీ
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలోని దిశ, వన్‌స్టాప్ సెంటర్‌ను గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాలకు సంబంధించి రిజిస్టర్లను పరిశీలించారు. వన్‌స్టాప్ సెంటర్లో చేరే వారి వివరాలను, వారి రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, సంబంధిత సంతకాలు కచ్చితంగా తీసుకోవాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. బాధితులకు విక్టిమ్ కాంపెన్సేషన్ త్వరగా అందేలా కృషి చేయాలని అక్కడి సిబ్బందికి చెప్పారు. అక్కడున్న నివాసితులకు లీగల్ సర్వీసెస్ యాక్ట్ – 1987 ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందేందుకు అర్హులని తెలిపారు. వారి భోజన, వసతి సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. చట్టపరమైన సమస్యలు వస్తే లీగల్ సర్వీసెస్ టోల్ ఫ్రీ నంబర్ 15100కు కాల్చేస్తే సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. -
కర్నూలులో వైఎస్ జగన్.. కొత్త జంటకు ఆశీర్వాదం
సాక్షి, కర్నూలు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ కర్నూలు పర్యటనలో ఉన్నారు. సెయింట్ జోసెఫ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న కర్నూలు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఎస్వీ మోహన్‌రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు వైఎస్ జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువరులు జనక్-శ్రియాలను వైఎస్ జగన్ ఆశీర్వదించారు.ఇక, వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. జగనన్నకు ఘన స్వాగతం పలికారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్ జగన్ రాకతో సెయింట్ జోసెఫ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో సందడి వాతావరణం నెలకొంది. ఇదీ చదవండి: బాబూ.. పోలవరంపై మీ డ్రామాలు ఆపండి: వైఎస్ జగన్ -
నేడు కర్నూలుకు వైఎస్ జగన్
కర్నూలు(టౌన్): మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, విజయమనోహరి దంపతుల కుమారుడు జనక్దత్తారెడ్డి, శ్రీయల వివాహ రిసెప్షన్‌కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం కర్నూలుకు రానున్నారు. ఉదయం బెంగళూరు నుంచి బయలుదేరి 11.40 గంటలకు ఎస్టీబీసీ కళాశాల మైదానంలోని హెలిపాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 12 గంటలకు సుంకేసుల రోడ్డులోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు హాజరవుతారు. నూతన వధూవరులను ఆశీర్వదించి 20 నిమిషాలు అక్కడే ఉంటారు. అనంతరం 12.35 గంటలకు తిరిగి బెంగళూరుకు బయలుదేరి వెళతారు. రిసెప్షన్‌కు పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు హాజరవుతున్నారు. -
పంప్‌హౌస్ దుకాణంలో చోరీ
ఆదోని అర్బన్: పట్టణంలోని పాత ఓవర్ బ్రిడ్జి కింద మెయిన్ బ్రాంచి పోస్టాఫీసు సమీపంలో పంప్‌హౌస్ దుకాణంలో చోరీ జరిగింది. పంప్‌హౌస్ దుకాణదారుడు నిజాం తెలిపిన వివరాల మేరకు.. గుర్తు తెలియని వ్యక్తులు దుకాణానికి పైకప్పులో కన్నం వేసి దాదాపు రూ.3 లక్షలు విలువ చేసే విద్యుత్ తీగలను అపహరించారు. బుధవారం ఉదయం దుకాణం తలుపులు తీయగా పైకప్పులో కన్నం ఉండటంతో చోరీ జరిగిందని తెలుసుకున్నారు. దుకాణాన్ని పరిశీలించగా దాదాపు రూ.3 లక్షలు విలువ చేసే విద్యుత్ తీగల సామగ్రి అపహరణకు గురైనట్లు గుర్తించారు. వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతి అదృశ్యం కొత్తపల్లి: శివపురం చెంచుగూడెంకు చెందిన ఓ యు వతి మూడు రోజులుగా కనిపించడం లేదు. గూడెంకు చెందిన ఐలేని కోటయ్య రెండవ కూతురైన ఐలేని ఇందు (17) గత నెల 30వ తేదీన రాత్రి సమయంలో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు, బంధువుల ఇళ్ల వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. దీంతో యువతి కుటుంబీకులు బుధవారం ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ జయశేఖర్ తెలిపారు. మొక్కజొన్న పంటపై పందుల దాడి గడివేముల: ఆరుగాలం కష్టపడి సాగు చేస్తున్న పంటలపై పందులు స్వైర విహారం చేయడంతో రైతులు నష్టపోతున్నారు. గడివేముల సమీపంలోని పొలాల్లో మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ పంటలపై పందులు దాడులు చేస్తున్నాయి. గ్రామానికి చెందిన కౌలు రైతు వెంకటేశ్వర్లు సాగు చేసిన మొక్కజొన్న పంటపై పందులు దాడి చేయంతో పంటంతా ధ్వంసమైంది. మరో నెలలో చేతికి రావాల్సిన పంట మొత్తం నాశనమైంది. పందుల నిర్వాహకులకు హెచ్చరించినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నా రు. పందులకు భయపడి రాత్రిళ్లు పొలం వద్ద కాపలా ఉండాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. -
మొసళ్ల కలకలం
కౌతాళం: తుంగభద్ర నది పరివా హకంలో వేర్వేరు చోట్ల రెండు భా రీ మొసళ్లను స్థా నికులు బంధించారు. కౌతాళం మండలం మేళిగనూరు గ్రామ సమీపంలోని రామలింగేశ్వర దేవాలయం వెనుక భాగంలో గుంతలో ఉన్న భారీ మొసలి ఉండటంతో గ్రామస్తులు కొన్ని రోజులుగా భయాందోళన చెందుతున్నారు. కాగా నదిలో నీటి ప్రవాహం తగ్గడంతో బుధవారం గుంతలో ఉన్న మొసలిని పెద్ద పెద్ద తాళ్లతో బంధించారు. ఈ విషయాన్ని అదోని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఫారెస్ట్ ఆఫీసర్ తేజశ్వని ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రత్యేక వాహనంలో మొసలిని తీసుకెళ్లారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న చోట వదిలేస్తామని చెప్పారు. నాగలదిన్నె బ్రిడ్జి వద్ద.. నందవరం: నాగలదిన్నె గ్రామంలో తుంగభద్ర నది బ్రిడ్జి వద్ద గుంతలో ఉన్న మొసలిని బుధవారం రైతులు బంధించారు. నదిలో నీరు లేకపోవడంతో మోటర్ ద్వారా గుంతలోని నీటి పంపు చేయడానికి వెళ్లారు. వరదల్లో కోట్టుపోయిన పాత బ్రిడ్జి పిల్లర్ వద్ద గుంతలో నీటి తోడేందుకు రైతులు విద్యుత్ మోటర్ వేశారు. నీటి తోడే సమయంలో గుంతలో మొసలి బయటపడింది. వెంటనే రైతులు తాళ్లతో మొసలిని బంధించి తెలంగాణపైపు తుంగభద్ర నది గుంతల్లో వదిలేశారు. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
సి.బెళగల్: మండలంలోని తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్ఐ వేణుగోపాల్‌రాజు తెలిపారు. మంగళవారం రాత్రి పోలీస్ సిబ్బందితో మండలంలో నది తీర గ్రామాల్లో గస్తీ నిర్వహిస్తుండగా తిమ్మందొడ్డి నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నామన్నారు. ఈ మేరకు ఇసుక అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి, ట్రాక్టర్లను సీజ్ చేసి, రెవెన్యూ అధికారులకు అప్పగిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇసుకను అక్రమంగా రవాణ చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయన్నారు. డ్రంకెన్ డ్రైవ్ చేసిన నలుగురికి జైలు డోన్ టౌన్: మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురు వ్యక్తులకు జడ్జి నూరుల్లా జైలు శిక్ష లు విధించినట్లు సీఐ ఇంతియాజ్‌బాషా తెలిపారు. పట్టణంలోని కొండపేటకు చెందిన చాక లి తిరుమలేసుకు నాలుగు రోజులు, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి నగర్‌కు చెందిన నీలకంఠ, కొండపేటకు చెందిన ఈడిగ వెంకటేశ్వర్లు, డోన్ మండలం తాడూరు గ్రామానికి చెందిన దస్తగిరికి రెండు రోజుల పాటు జైలు శిక్ష విధించిన ట్లు సీఐ చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడిపితే వారి ప్రాణాలతో పాటు అమాయక ప్రజల ప్రాణాలకు హాని కలుగుతుందని అన్నారు. పేకాట రాయుళ్ల అరెస్ట్ చిప్పగిరి: ఖాజీపురం కొట్టాల శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ సీవీ నరసిహులు తెలిపిన వివరాల మేరకు.. గుట్టుగా పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఐ బుధవారం మధ్యాహ్నం సిబ్బందితో వెళ్లి దాడి చేశారు. పేకాట రాయుళ్లలో ఆరుగురు వ్యక్తులు, ఓ మహిళ ఉన్నారు. వారి వద్ద నుంచి రూ 32,250 నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వేలాడుతున్న తీగలను సరి చేసేందుకు వెళ్లి.. ● విద్యుదాఘాతంతో యువకుడి మృతి ఎమ్మిగనూరురూరల్: విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందా డు. కలుగొట్ల గ్రామానికి చెందిన ఎం.కృష్ణ (28) ప్రైవేట్ ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు. కె. నాగలాపురం గ్రామానికి చెందిన రైతు కుమ్మరి నరసింహులకు చెందిన పొలం విద్యుత్ తీగలు కిందకు వేలాడుతుండటంతో మరమ్మతుల కోసం కృష్ణను తీసుకెళ్లాడు. విద్యుత్ స్తంభంపై ఎక్కిన యువకుడు ప్రమాదవశాత్తు పక్కన ఉన్న మరో తీగను తాకడంతో విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు జయకుమార్ (8), దేవాన్ష్ (2) ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
భక్తుల మొర ఆలకించేదెవరు?
● గతంలో ‘డయల్ యువర్ ఈఓ’ కార్యక్రమంతో అధికారుల దృష్టికి భక్తుల సమస్యలు ● ఉత్సవాలు, ముఖ్యమైన పర్వదినాల పేరుతో ఎగనామం ● నామమాత్రంగా ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్సులు ఉపయోగంలేని ఫిర్యాదుల బాక్స్‌లు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం సాధారణ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రకటిస్తున్నా.. కనీసం వారి సమస్యలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నం చేయడం లేదు. మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఎదురైన కష్టాలను చెప్పుకునేందుకు దేవస్థానం అవకాశం ఇవ్వడం లేదు. శ్రీశైల క్షేత్రంలో కొలువైన భ్రమరాంబా సమేతా మల్లికార్జున స్వామి కటాక్షం పొందేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు నిత్యం తరలివస్తారు. క్షేత్రానికి వచ్చే భక్తులకు దర్శన సౌకర్యాలు, పలు ఆర్జితసేవలు, లడ్డూప్రసాదాలు, అన్నప్రసాద వితరణ, వైద్యసౌకర్యాలు, వసతి, టికెట్ల కౌంటర్లు, డోనేషన్ కౌంటర్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉద్యానవనాల నిర్వహణ, పార్కింగ్ తదితర సౌకర్యాలను కల్పిస్తోంది. ఈ క్రమంలో దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు భక్తులకు ఏవిధంగా ఉపయోగపడుతున్నాయి. ఇంకా ఎటువంటి సౌకర్యాలు మెరుగుపర్చాలి, ఆర్జితసేవల నిర్వహణ ఎలా ఉంది, స్వామిఅమ్మవార్ల అలంకార దర్శన సౌకర్యాలు, స్పర్శదర్శనం, దర్శన సమయ వేళలు, ఇంకా పలు విషయాలపై భక్తుల నుంచి వారి అభిప్రాయాలు తెలుసుకోవడం, క్షేత్రాభివృద్ధికి భక్తుల నుంచి సలహాలు, సూచనలు తెలుసుకోవడం, భక్తుల అసౌకర్యాలపై ఫిర్యాదులు స్వీకరించడం వాటిని పరిష్కరించడం, తదుపరి పునరావృతం కాకుండా చూడాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని టీటీడీ తరహాలో ఏర్పాటు చేశారు. మోగని ‘డయల్ యువర్ ఈఓ’ ఫోన్ భక్తుల నుంచి వచ్చిన సూచనల మేరకు, రాష్ట్ర దేవదాయశాఖకమిషనర్ ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని 2021 డిసెంబరు 22న అట్టహాసంగా ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేకంగా 08524–287111నెంబరును కేటాయించారు. ప్రతి బుధవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు భక్తులు ఫోన్ చేసి తమ సలహాలు, సూచనలు, ఫిర్యాదులు చేయవచ్చునని తెలిపారు. కార్యక్రమం అనంతరం అన్ని విభాగాల అధికారులతో, సిబ్బందితో ఈఓ సమీక్షించి భక్తుల నుంచి వచ్చిన ఆయా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కొన్ని వారాల పాటు సజావుగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారానికి ఒకరోజు కాకుండా నెలలో ఒక రోజు మాత్రమే నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం శ్రీశైల దేవస్థానంలో ముఖ్య పర్వదినాలు, ముఖ్యమైన రోజులు, ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు తదితర కార్యక్రమాల నిర్వహణ సాకుతో కార్యక్రమానికి మొత్తానికి ఎగనామం పెట్టారు. దేవస్థానం డయల్ యువర్ ఈఓ కార్యక్రమానికి ప్రత్యామ్నాయంగా ఫిర్యాదుల బాక్స్‌లను ఏర్పాటు చేశారు. దేవస్థాన పరిపాలన భవనం వద్ద, వసతి గదుల కేంద్రాల వద్ద, సీఆర్వో కార్యాలయం, క్యూలైన్ల వద్ద, అన్నప్రసాద వితరణ భవనం వద్ద తదితర ప్రదదేశాలలో ఫిర్యాదుల బాక్స్‌లు ఏర్పాటు చేశారు. కానీ ఫిర్యాదుల బాక్స్‌లపై అవగాహన లేని భక్తులు వాటిని వినియోగించడం లేదు. అసలు ఫిర్యాదు బాక్స్‌లు ఉన్నాయో లేదో భక్తులకు అవగాహన లేదు. ఇప్పటికై న దేవస్థాన అధికారులు స్పందించి గతంలో నిర్వహించిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని పునఃప్రారంభించి ఆ కార్యక్రమం ద్వారా భక్తుల నుంచి సలహాలు, సూచనలు, ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించి క్షేత్రాభివృద్ధికి దోహదపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు భక్తులు కోరుతున్నారు. -
ప్రియుడి మోజులో పడి..
● భర్తను కడతేర్చిన భార్య ● 24 గంటల్లో కేసును చేధించిన పోలీసులు ● ముగ్గురు నిందితుల అరెస్ట్ ఆళ్లగడ్డ:వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన భర్తను కడతేర్చిన ఘటన ఆళ్లగడ్డ పట్టణంలో చోటు చేసుకుంది. ఈ దారుణానికి ఒడిగట్టిన మహిళతో పాటు ఆమె ప్రియుడు, సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు నిందితుల వివరాలు వెల్లడించారు. పట్టణంలోని నాయీబ్రాహ్మణ కాలనీలో నివాసముండే ఆంజనేయులు (27)కు రుద్రవరం మండలం లింగందిన్నె గ్రామానికి చెందిన సుబ్బులుతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈ క్రమంలో సుబ్బులుకు చాగలమర్రి మండలం తోడేండ్లపల్లె గ్రామానికి చెందిన గురుప్రసాద్ ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. విష యం తెలుసుకున్న ఆంజనేయులు భార్యను హెచ్చరిస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఎలాగైనా భర్తను అడ్డుతొలగించుకోవాలని సుబ్బులు తన ప్రియుడు గురుప్రసాద్‌తో కలిసి కుట్ర పన్నింది. ఈ మేరకు గురుప్రసాద్, అతని స్నేహితుడు షరీఫ్ ఆదివారం రాత్రి ఆంజనేయులను మద్యం తాగుదామంటూ నమ్మించి పాలసాగరం రోడ్డులోని మొక్కజొన్న పొలంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆంజనేయులకు మద్యం తాగించి తర్వాత రాళ్లతో తలపై మోది హత్య చేశారు. సోమవారం హత్య విషయం వెలుగులోకి వచ్చింది. అయితే మృతుడి భార్య ఏమి తెలియనట్లు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి దగ్గరున్న తన భర్తను పిలుచుకు పోయారని, తెల్లారే సరికి హత్య చేశారని నమ్మబలికింది. ఆమె మాటలపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా తన ప్రియుడితో కలిసి ఈ హత్య చేయించినట్లు ఒప్పుకుంది. దీంతో సుబ్బులు, గురుప్రసాద్‌తో పాటు హత్య కు సహకరించిన షరీఫ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా హత్య జరిగిన ఒక రోజులోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన సీఐ నాగరాజారావు, ఎస్ఐ చిన్న పీరయ్యను డీఎస్పీ అభినందించారు. -
లోకేషూ.. మీరిచ్చిన బ్యాగుల నాణ్యత ఇదిగో!
వెల్దుర్తి: ‘మీ ప్రభుత్వంలో ఇచ్చిన స్కూల్ బ్యాగ్‌లు ఎంతటి నాణ్యతగా ఉన్నాయో చూడండి. రెండు నెలలకే మొత్తం చినిగిపోయి తిరిగి కుట్టించుకునేందుకు కూడా వీలులేకుండా పోయాయి. ఇదేనా మీ పథకాల నాణ్యత’ అంటూ పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ను సూటిగా ప్రశ్నించారు. బుధవారం ఆమె వెల్దుర్తి మండలంలో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా పాతబస్టాండులో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి నాణ్యతలేని పథకాలు అమలు చేస్తోందన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుందన్నారు. ఇదే సందర్భంలో సమావేశం జరుగుతున్న ప్రాంతంలో తిరుగాడుతున్న కృష్ణగిరి మండలం ఎరుకులచెరువుకు చెందిన 6వ తరగతి విద్యార్థిని కె.రాణి, ఆమె తల్లి స్కూల్ బ్యాగుల ప్రస్తావన విని సమావేశం వద్దకు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే ప్రసంగం అనంతరం విద్యార్థిని తన స్కూల్ బ్యాగ్ రెన్నెల్లకే చినిగిపోయిందని మాజీ ఎమ్మెల్యేకు చూపుతూ, కొత్తది కొనివ్వమని నాన్నను అడిగితే తిడుతున్నాడని.. అమ్మ కొనిస్తా, లేకపోతే కుట్టిస్తా పద అంటూ వెల్దుర్తికి తీసుకువచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో ఇచ్చిన జగనన్న విద్యా కానుక బ్యాగులు ఇప్పటికీ నాణ్యతతో చెక్కుచెదరలేదన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ఇచ్చిన బ్యాగులు నాణ్యత ఎలా ఉన్నాయో ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు, చివరికి టీడీపీ నాయకులకే తెలుసన్నారు. మరి విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు ఈ విషయం తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. -
‘బండారం’ బయటపడేదెన్నడు!
మంత్రాలయం: శ్రీమఠం బ్రాండ్‌తో భక్తులను మోసగిస్తున్నా అడిగే వారు లేరు. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా చర్యలు చేపట్టరు. దోపిడీపై భక్తులు మొత్తుకుంటున్నా వినేవారు కరువయ్యారు. ఎవరి ఆశీస్సులు ఉన్నాయో తెలియదు.. అనుమతులు ఎవరిచ్చారో బయటకు చెప్పరు.. దేవాదాయశాఖ నిబంధనలకు విరుద్ధంగా శ్రీమఠంలోపల ఓ వ్యాపారి కొన్నేళ్లుగా దుకాణం నిర్వహిస్తున్నాడు. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఆలయ ప్రాంగణాల్లో ఎటువంటి వ్యాపార దుకాణాలు ఉండరాదు. బయట వ్యక్తుల ఆధీనంలో ఎలాంటి వ్యాపారాలు చేపట్టరాదు. ఒకవేళ ఉంటే ఆలయ ఆధీనంలో రసీదులతో కూడిన లావాదేవీలు చేపట్టాలి. అంతేగాక దేవాదాయ శాఖ నియమం ప్రకారం అందులో అర్చన కుంకుమ, పరిమళ విభూతి, నియమ నిబంధన పూజా పదార్థాలు మాత్రమే విక్రయించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు వ్యక్తులు ఆలయ ప్రాంగణాల్లో వ్యాపారాలకు తావు ఉండదు. మఠంలో ఓ ప్రైవేటు వ్యక్తి దోపిడీకి అనుమతి ఎవరిచ్చారో అంతు చిక్కడం లేదు. ప్రాంగణంలోని గ్రామ దేవత మంచాలమ్మ గర్భాలయానికి వెనుక భాగంలో రాఘవేంద్రుల గర్భమఠానికి ఈశాన్య దిక్కున పెద్ద దుకాణం కేటాయించి ‘న్యూ శ్రీ రాఘవేంద్రస్వామి పూజా బండార్’ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కర్ణాటకలోని ఉడిపీ ప్రాంతానికి చెందిన పరమేష్ అనే వ్యక్తి 15 ఏళ్ల క్రితం శ్రీమఠం ప్రధాన ముఖద్వారం కుడివైపు చిన్న క్యాసెట్ల అంగడి పెట్టుకున్నాడు. భక్తి గేయాల క్యాసెట్లు, సీడీలు, డీవీడీలు అమ్ముకుంటూ కాలం వెల్లదీశాడు. ఇప్పటికీ ఆయనను స్థానికులు క్యాసెట్ల పరమేష్ అని ముద్దుగా పిలుచుకుంటారు. కొన్నేళ్ల తర్వాత శ్రీమఠంలోనే దుకాణం తెరిచాడు. చేతి దారాలు మొదలు తపంబు పీఠాల వరకు వ్యాపారం నడుస్తోంది. అక్కడ ఏ వస్తువు కొన్నా బయట దుకాణాల్లో ధరల కంటే ఐదోవంతు ఎక్కువ. ఉదాహరణకు రాగి చెంబు బయట దుకాణంలో రూ.200కు లభిస్తే అదే చెంబు ఇక్కడ మాత్రం రూ.1000కి అంటగడతారు. ఇలా ప్రతి వస్తువుపై అంతే. ఎవరైనా భక్తులు ప్రశ్నిస్తే ఇదీ శ్రీమఠం బ్రాండ్ అంటూ బురిడీ కొట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. శ్రీమఠంలో ప్రైవేటు పూజా బండార్ లేనప్పుడు క్షేత్రంలో 20 దాకా పూజా సామగ్రి దుకాణాలు ఉండేవి. కొందరు బండ్లపైనే పెట్టుకుని జీవనం సాగించే వారు. అయితే మఠంలో బండార్ పెట్టడంతో చిరు వ్యాపారులు రోడ్డున పడి వ్యాపారాలు వదులుకున్నారు. భక్తులను దోచుకుంటున్న వ్యాపారిపై శ్రీమఠం అధికారులకు ఎందుకంత ప్రేమో తెలియడం లేదు. అది దేహ రహస్యంగానే మిగిలింది. -
శోభాయమానం.. సర్వసమర్పణోత్సవం
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రుల 355వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు అట్టహాసంగా ముగిశాయి. వేడుకల్లో భాగంగా శనివారం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలకు సర్వ సమర్పణోత్సవం నిర్వహించారు. ఉత్సవమూర్తిని పంచవాహనాలపై ఊరేగించారు. గజ, అశ్వ, సింహ, మయూరం వాహనాలపై కొలువుంచి పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు వాహ నోత్సవానికి శ్రీకారం పలికారు. అశేష భక్తజన వాహిని మధ్య రాయరు ఎంతో రమణీయంగా ఊరేగారు. అనంతరం ఊంజల మంటపంలో రాయరుకు ఉయ్యాల, ఛామర్ల సేవ కానిచ్చారు. యోగీంద్ర మంటపంలో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మంత్రాలయం మండలంలో అనుమంత్రాలయంగా పేరుగాంచిన తుంగభద్రలో ఆఖరి రోజు ఉత్సవాలు నిర్వహించారు. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు గ్రామాన్ని చేరుకుని మృత్తిక బృందావనానికి విశేష పూజలు చేపట్టారు. అనంతరం పండితులు, భక్తులు వసంతోత్సవం జరుపుకుని మంగళహారతులు పట్టారు. వేడుకలో భక్తులకు రాఘవేంద్రుల వైభవాన్ని ప్రవచించారు. -
ఉద్యోగులూ.. ఉద్యమంలో పాల్గొనాలి
కర్నూలు(సెంట్రల్): ఉద్యమంలో ఉద్యోగులు పాల్గొనాలని ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ వి.గిరికుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఉద్యమంలో భాగంగా మూడో రోజు ఏపీజేఏసీ అమరావతి నాయ కులు వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని ఉద్యోగులను కోరారు. కలెక్టరేట్, జెడ్పీలో ఉద్యమానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వివరిస్తూ కరపత్రాలు, నల్లబ్యాడ్జీలను అందజేశారు. ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని, అప్పుడే ప్రభుత్వం మెడలు వచ్చి డిమాండ్ల సాధనకు మార్గం సుగమనం అవుతుందన్నారు. ఇదిలా ఉండగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. 27 నెలలు గడిచినా ఒక్క హామీ నెరవేర్చలేదు ఏపీజేఏసీ జిల్లా చైర్మన్ వి.గిరికుమార్‌రెడ్డి మాట్లాడుతూ...టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై 27 నెలలు గడిచినా ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే ఏపీజేఏసీ అమరావతి ఉద్యమానికి సిద్ధమైందన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటైన 12వ పీఆర్సీ కమిషనర్‌ను తొలగించడం అన్యాయమన్నారు. ఉద్యోగులకు ఐఆర్ 30 శాతం ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబునాయుడు మోసం చేశారని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను కూడా వెంటనే ఇవ్వాలన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులపై రాజకీయ ముద్రలు వేయడం అన్యాయమన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.40 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. సీపీఎస్ స్థానంలో ఓపీఎస్‌ను మాత్రమే అంగీకరిస్తామని, జీపీఎస్‌ను కూడా ఒప్పుకునేది లేదన్నారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగులరైజేషన్ చేయాలని, వారికి సమాన పనికి సమాన వేతనం కింద కనీస వేతనం రూ.35 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేసి పనిభారం తగ్గించాలని కోరుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం.వెంకటరాజు, నాయకులు ధనుంజయరెడ్డి, కృష్ణ పాల్గొన్నారు. -
● మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని స్మరించుకున్న ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు ● వైఎస్సార్ విగ్రహాలకు జలాభిషేకాలు చేసిన వైఎస్సార్సీపీ నంద్యాల, కర్నూలు జిల్లాల అధ్యక్షులు
సంక్షేమ ప్రదాత.. రైతు బాంధవుడు..పేదల దేవుడు.. ఆర్యోగ‘సిరి’ కల్పించిన మహానేత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇప్పటికీ ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారు. భౌతికంగా దూరమై 17 సంవత్సరాలు గడిచినా రాజన్నా..నిన్ను మరువలేం అంటూ బుధవారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వైఎస్సార్ వర్ధంతిని నిర్వహించారు. మహానేత విగ్రహాలకు వైఎస్సార్సీపీ నేతలు, ప్రజలు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ కేంద్రాల్లో జలాభిషేకాలు చేసి అప్పటి పాలనను గుర్తు చేసుకున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా కులమతాలకు అతీతంగా కలిగిన లబ్ధిని స్మరించుకున్నారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలను హోరెత్తించారు. పేదలకు దుస్తులు అందించి, అన్నదానం చేసి, రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేసి, రక్తదానం నిర్వహించి అభిమానం చాటుకున్నారు. ● కర్నూలులో మహానేత విగ్రహానికి హంద్రీ– నీవా జలాలతో అభిషేకం చేశారు. వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూలు పార్లమెంటరీ సమన్వయకర్త బుట్టా రేణుక, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీవై రామయ్య పాల్గొన్నారు. ● కల్లూరు శరీన్‌నగర్‌లో వైఎస్సార్ విగ్రహానికి హంద్రీ– నీవా జలాలతో వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి జలాభిషేకం చేశారు. రాయలసీమకు కృష్ణాజలాలు తీసుకొచ్చిన మహానేతను రైతులు ఎప్పటికీ మరువబోరన్నారు. ● ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ● వెల్దుర్తిలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఆళ్లగడ్డలో మాజీ ఎమ్యెల్యే గంగుల బిజేంద్రనాఽథ్‌రెడ్డి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ● బనగానపల్లిలో మాజీ ఎమ్యెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి వారి పురోగతికి వైఎస్సార్ దోహదపడ్డారన్నారు. ● ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. నల్లకాల్వ వద్ద ఉన్న స్పృతివనంలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. –కర్నూలు (టౌన్)/ బొమ్మలసత్రం -
లోకేష్ వచ్చేదెప్పుడు.. ఆశలు ఎగిరేదెప్పుడు!
కర్నూలు(సెంట్రల్): ఓర్వకల్ విమనాశ్రయంలో రాష్ట్రంలోనే తొలి పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే మైసూరుకు చెందిన ఓరియంట్స్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు విమానాశ్రయంలో 1.2 ఎకరాలు కేటాయించగా.. శిక్షణనిచ్చేందుకు అధునాత హ్యాంగర్ భవనాన్ని సిద్ధం చేశారు. గత ఆగస్టు 22న ప్రారంభోత్సవానికి ఆ సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఆగస్టు 18న ఓర్వకల్ డ్రోన్ సిటీలో కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రి రామ్మోహన్నాయుడు పర్యటించారు. ఆ సమయంలో విషయాన్ని అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అయితే మంత్రి లోకేష్‌తో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తే ఆయన మెప్పు పొందవచ్చనే ఉద్దేశంతో అనధికార ఆదేశాలిచ్చి కార్యక్రమాన్ని వాయిదా వేయించినట్లుగా చర్చ జరుగుతోంది. శిక్షణ విమానాల ట్రయల్ రన్ విజయవంతం చైన్నెలోని హిందుస్తాన్ గ్రూపు ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ ఉంది. ఈ సంస్థ మైసూరులో 12 ఏళ్లుగా పైలట్ శిక్షణనిస్తోంది. రెండో కేంద్రాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సంస్థ వద్ద సెస్నా, టెక్నామ్ బ్రాండ్ల సింగిల్ ఇంజిన్, మల్టీ ఇంజిన్ శిక్షణ విమానాలు ఉన్నాయి. మైసూరులో ఉన్న శిక్షణ కేంద్రంలో మూడింటిని ఇకపై కర్నూలు విమానాశ్రయంలో ఉంచాలని భావిస్తున్నారు. ఇప్పటికే శిక్షణ విమానాలను కర్నూలుకు తీసుకొచ్చి ఉంచారు. అంతేకాక కర్నూలులో పైలట్ శిక్షణకు సంబంధించి తరగతి గది బోధనకే పరిమితమైన పైలట్లకు శిక్షణ ఇచ్చి ట్రయల్ రన్ విజయవంతం చేసింది. డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రమాణాల ప్రకారం సుమారు వంద కోట్లతో అకాడమీ ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవడంతో ప్రారంభానికి ఆగస్టు 22వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. ఇంతలోనే ఇలా... కొన్ని రోజుల్లో ప్రారంభోత్సవాన్ని పూర్తి చేసేందుకు మంత్రులు బీసీ జనార్ధన్‌రెడ్డి, టీజీ భరత్‌గుప్తా అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆ మేరకు ఆహ్వాన పత్రికలు ముద్రించడం, నాయకులకు ఆహ్వానాలు పలకడం పూర్తయింది. అయితే కేంద్ర మంత్రి ఆదేశాలతో ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. మంత్రి నారా లోకేష్ ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితుల్లో.. ఆయన వచ్చే వరకు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవద్దని చెప్పడంతో అకాడమీ నిర్వాహకులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇప్పటికే కొందరు విద్యార్థులు పైలట్ శిక్షణ పొందుతున్నారు. అయితే ప్రస్తుతం వీరి శిక్షణ తరగతి గదికే పరిమితమైంది. పైలట్ శిక్షణకు ప్రాక్టికల్స్ అత్యంత ముఖ్యం. అలాంటిది విద్యార్థుల ఆశలను ఎగరనివ్వకుండా రాజకీయ స్వార్థంలో ఓ నేత శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవాన్ని అడ్డుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఏవియేషన్ పైలట్ శిక్షణ కేంద్రం ప్రారంభం వాయిదా -
రాయలసీమపై చంద్రబాబు వివక్ష
కర్నూలు: రాయలసీమపై ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు వివక్ష చూపుతున్నారని వైఎస్సార్సీపీ నంద్యాల,కర్నూలు జిల్లాల అధ్యక్షులు కాట సాని రాంభూపాల్ రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, కర్నూ లు పార్లమెంటు ఇన్చార్జి బుట్టా రేణుక, మాజీ మేయర్ బీవై రామయ్య విమర్శించారు. కర్నూలు లో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షల శిబిరాన్ని వైసీపీ నేతలు బుధవారం సందర్శించి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా కర్నూలు న్యాయవాదులు హైకోర్టు ఏర్పాటుకు పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడం సిగ్గుచేటన్నారు. కర్నూలును న్యాయ రాజధానిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించి ప్రకటన చేస్తే సుప్రీం కోర్టులో కేసులు వేయించిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సుభాష్ చంద్రబోస్, వైసీపీ కురువ సంఘం రాష్ట్ర నాయకులు గడ్డం రామకృష్ణ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సిట్రా సత్యనారాయణమ్మ, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి సువర్ణా రెడ్డి తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. హామీని నెరవేర్చాలని కోరుతూ.. రాయలసీమ ప్రాంతం కోసం ఏపీ హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేస్తామన్న హామీని నెరవేర్చాలని కోరుతూ జిల్లా కోర్టు బయట 50 మందికి పైగా మహిళా న్యాయవాదులు బుధవారం రిలే నిరాహారదీక్షల్లో పాల్గొన్నారు. ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయవాది వై.జయరాజు వారికి పూలమాలలు అందించి అభినందించారు. బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రుడు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా సీనియర్ న్యాయవాది నాగలక్ష్మి దేవి సమన్వయకర్తగా వ్యవహరించారు. -
టెట్ అర్హత లేకుండానే టీచర్ పోస్టు ఇచ్చేశారు..
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా వల్లూరులో మెగా డీఎస్సీ అక్రమాలు బట్టబయలయ్యాయి. టెట్ అర్హత లేకుండానే టీచర్ పోస్ట్ ఇచ్చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ పోస్టుల భర్తీలో భారీ అక్రమాలు అక్రమాలు చోటుచేసుకున్నాయి. టెట్ అర్హత లేకుండానే స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టు ఇచ్చినట్లు కర్నూలు విద్యాశాఖ అధికారులు నిర్థారించారు. స్పోర్ట్స్ కోటాలో టీచింగ్ పోస్టుకు టెట్ అర్హత తప్పనిసరి అనే నిబంధనలు ఉండగా.. అర్హత లేకుండానే ఓ అభ్యర్దిని ఎస్జీటీ పోస్టుకు శాప్ ఎంపిక చేసేసింది.కౌతాళం మండలం వల్లూరు ఎంపీపీఎస్ స్కూల్లో అర్హత లేని టీచర్ భాగోతం వెలుగులోకి వచ్చింది. కర్నూలు డీఈవో ఆఫీస్‌లో టీచర్స్ కమిటి ఆధ్వర్యంలో ప్రభాకర్ గౌడ్ విద్యార్హతలపై విచారణ జరపగా.. విచారణ కమిటీకి అర్హత సర్టిఫికెట్లను ప్రభాకర్ గౌడ్ చూపలేకపోయారు. టీచర్ కమిటీ ముందు టెట్ అర్హత పొందలేదని ప్రభాకర్ అంగీకరించారు.స్పోర్ట్స్ కోటా ద్వారా భర్తీ చేసిన టీచర్ పోస్టులలో అనర్హులకు చోటుపై వైఎస్సార్సీపీ ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు సర్కార్ శత విధాలుగా ప్రయత్నిస్తోంది. జిల్లాలో స్పోర్ట్స్ కోటాలో కేవలం ఒక జూడో క్రీడ ద్వారానే 21 మందికి టీచర్ పోస్టులు ఇచ్చేసింది. ఘటనపై పాఠశాల డైరెక్టర్‌కు నివేదిక అందజేస్తామని కర్నూలు డీఈవో తెలిపారు. -
సాగునీళ్లడిగితే 'పోలీసు జులుం'
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కేసీ కెనాల్, తెలుగుగంగ, ఎస్సార్బీసీ తదితర ప్రాజెక్టులకు సాగునీరు విడుదల చేసి కరువు ప్రాంతాల రైతులను ఆదుకోవాలంటూ వైఎస్సార్సీపీ చేపట్టిన ‘వెలుగోడు రిజర్వాయర్ ముట్టడి’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి వెలుగోడుకు బయలుదేరిన నేతలను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. మంగళవారం వేకువజామునుంచే వెలుగోడు రిజర్వాయర్‌కు వెళ్లే దారిలో ఆత్మకూరు, కరివేన, వైఎస్సార్ స్మృతివనం, మోత్కూరు, బండి ఆత్మకూరు ప్రధాన రహదారితోపాటు గ్రామాల నుంచి వెలుగోడు వెళ్లే దారుల్లోనూ బారికేడ్లు, చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అడుగడుగునా పోలీసులను మోహరించారు. వెలుగోడుకు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లపై వస్తారని తెలుసుకున్న పోలీసులు సోమవారం రాత్రి గ్రామాలకు వెళ్లి ధర్నాకు వచ్చే వారందరిపైనా కేసులు పెడతామని, ప్రతి ఎడ్లబండికి రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తామని బెదిరించారు. అయినా ఖాతరు చేయని వైఎస్సార్సీపీ శ్రేణులు వెలుగోడు ముట్టడి కార్యక్రమానికి పెద్దఎత్తున తరలివచ్చారు. వేల్పనూరు వద్ద కాటసాని అడ్డగింపు మాజీ ఎమ్మెల్యే నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బనగానపల్లి సమన్వయకర్త కాటసాని రామిరెడ్డి, నందికొట్కూరు సమన్వయకర్త ధారా సు«దీర్, వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కర్నూలు మాజీ మేయర్ బీవై రామయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ పీపీ నాగిరెడ్డి తదితర నేతలను వెలుగోడు సమీపంలోని వేల్పూరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిసి పాదయాత్రగా బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం నేతలంతా పాదయాత్రగా వెలుగోడుకు చేరుకున్నారు. దారి పొడవునా పలుమార్లు పోలీసులు వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకున్న ప్రతిసారి వైఎస్సార్సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసుల ఆంక్షల నడుమ వెలుగోడు గ్రామానికి చేరుకున్న వైఎస్సార్సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. చంద్రబాబు డౌన్ డౌన్, శ్రీశైలం నుంచి తక్షణం సాగునీరు విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. నీళ్లివ్వకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ నీటి చౌర్యాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.బండి ఆత్మకూరులో శిల్పా నిర్బంధం మరోవైపు పార్టీ శ్రేణులతో కలిసి వెలుగోడుకు వస్తున్న శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, నంద్యాల సమన్వయకర్త శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డిని పోలీసులు బండి ఆత్మకూరులో అడ్డుకున్నారు. దీంతో వారు పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి అక్కడే బైఠాయించి రెండు గంటలపాటు నిరసనకు దిగారు. వెలుగోడు దిగువన అన్ని సాగునీటి వనరులకు నీళ్లిచ్చే వరకూ ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆర్డీవో వెంకటశివ బండి ఆత్మకూరులో శిల్పా చక్రపాణిరెడ్డిని కలిసి మాట్లాడారు. నాలుగు రోజుల్లో నీటి విడుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో శిల్పా చక్రపాణిరెడ్డితోపాటు వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన విరమించారు. మరోవైపు మోటార్ బైక్‌లపై కార్యకర్తలతో కలిసి వెలుగోడు బయలుదేరిన శిల్పా రవిని మోతుకూరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో శిల్పా రవి, శిల్పా కిషోర్ అక్కడే ధర్నాకు దిగారు. గంటపాటు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీశైలం నియోజకవర్గంతోపాటు నంద్యాల, కర్నూలు జిల్లాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. -
చేటు తెచ్చిన బస్సు ప్రయాణం
● రద్దీ తోపులాటలో అపస్మారక స్థితిలోకి మహిళపత్తికొండ: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల రద్దీతో ఓ మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన సోమవారం సాయంత్రం పత్తికొండ ఆర్టీసీ బస్టాండ్‌లో చోటు చేసుకుంది. గుంతకల్ పట్టణంలోని ధర్మవరం గేట్‌కు చెందిన హసీనా తన కుమారుడు దాదా పీరాతో కలిసి ఉదయం వైద్య పరీక్షల కోసం కర్నూలుకు వెళ్లింది. ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించింది. అనంతరం కర్నూలు నుంచి ఏపీ 39యుఎల్ 1662 బస్సులో గుంతకల్‌కు బయలుదేరింది. కూర్చోవడానికి సీటు కూడా దొరికింది. అయితే సాయంత్రం సమయంలో బస్సు పత్తికొండ బస్టాండ్‌కు రాగానే వాష్‌రూమ్ కోసం కిందకు దిగింది. ఆ సమయంలో గుంతకల్ వైపు బస్సులు తక్కువగా ఉంటాయి. దీనికితోడు దాదాపు 3గంటలు పాటు గుంతకల్ వైపు వెళ్లే బస్సులు రాలేదు. దాదాపు 200 మంది ప్రయాణికులు గుంతకల్ వైపు వెళ్లడానికి బస్టాండ్‌లో నిరీక్షిస్తున్నారు. దీంతో వచ్చిన బస్సు కోసం ప్రయాణికులు చుట్టుముట్టారు. ఈక్రమంలో వాష్‌రూమ్ ముగించుకొని బస్సు ఎక్కుతున్న సమయంలో రద్దీ వల్ల ప్రయాణికులు ఒకరికొకరు విపరీతంగా తోసుకున్నారు. తోపులాటలో హసీనా అక్కడే సృహతప్పి పడిపోయింది. బస్సులో ఉన్న కుమారుడు దాదా పీరా గమనించి కిందికి దిగివచ్చి కాసేపు సపర్యలు చేశాడు. విషయం తెలుసుకుని పక్కనే ఉన్న లాడ్జీలో పని చేస్తున్న హనుమాన్, నాగేష్ అనే యువకులు అక్కడికి చేరుకొని కుమారుడు సహాయంతో ఆటోలో పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహిళను పరీక్షించిన వైద్యులు సృహలో లేనందున ప్రాథమిక చికిత్సలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ అసుపత్రికి రెఫర్ చేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. బస్సులో రద్దీ వల్ల జరిగిన తోపులాట మా అమ్మ ప్రాణాలకు ముప్పు తెచ్చిందని కుమారుడు దాదా పీరా బోరున విలపించాడు. ఇంతటి దారుణమైన ఘటన చోటు చేసుకున్నా ఆర్టీసీ సిబ్బంది తమకేమీ సంబంధం లేనట్లు ఆమెను కిందకు దింపి వెళ్లిపోవడం గమనార్హం. -
దేవదేవుడికి తేళ్లే నైవేద్యం
కోడుమూరు రూరల్: ఎక్కడైనా దేవుళ్లకు భక్తులు పాలు, పండ్లు, ఫలహారాలను నైవేద్యంగా పెట్టి పూజిస్తారు. కోడుమూరు కొండపైన వెలసిన శ్రీకొండలరాయుడికి మాత్రం భక్తులు తేళ్లనే నైవేద్యంగా సమర్పించి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి యేడాది శ్రావణమాసంలో వచ్చే మూడవ సోమవారం ఈ వింత ఆచారాన్ని కోడుమూరు ప్రజలు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. విషపురుగులైన తేళ్లను చూస్తే ఎవరికై నా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అయితే కోడుమూరు కొండపైన మాత్రం భక్తులు చిన్న చిన్న రాళ్లను ఎత్తుతూ వాటి కింద ఉండే తేళ్లను ఎలాంటి బెరుకు లేకుండా చేతులతో పట్టుకొని శ్రీకొండలరాయుడుకు సమర్పించడం ఇక్కడ విశేషం. ఒక వేళ తేలును పట్టుకునే క్రమంలో కుట్టినా స్వామి వారి ఆలయం చుట్టు మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే తగ్గిపోతుందని ఇక్కడి భక్తుల నమ్మకం. సోమవారం సాయంత్రం వేలాదిమంది ప్రజలు కాలినడకన కొండపైకి చేరుకొని శ్రీకొండలరాయుడికి తేళ్లను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండలరాయుడు ఆలయం వద్ద భక్తుల సందడి నెలకొంది. నాలుకపై, చేతులపై తేళ్లను ఉంచుకున్న యువకులు -
‘సీజనల్’ నిధులు స్వాహా చేశారు!
● జిల్లా కలెక్టర్‌కు అర్జీ ఇచ్చిన యువజన నాయకులుకర్నూలు(సెంట్రల్): దొంగ బిల్లులతో సీజనల్ హాస్టళ్ల నిధులను స్వాహా చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరికి యూఎస్ఎఫ్ఐ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి, యువజన సమాఖ్య నాయకులు అర్జీ ఇచ్చారు. వెల్దుర్తి, కృష్ణగిరి, తుగ్గలి మండల్లాలోని 30 సీజనల్ హాస్టళ్లను ప్రభుత్వం పొదుపు మహిళలకు ఇస్తే వాటిని పత్తికొండ ఎమ్మెల్యే బంధువులు తీసుకున్నారని అర్జీలో పేర్కొన్నారు. వాటిని వారే నిర్వహణ చేసి దొంగ బిల్లులతో నిధులను కాజేశారని ఉదహరించారు. కర్నూలు బీక్యాంపు గవర్నమెంట్ బాలుర ఉన్నత పాఠశాలకు గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిని నియమించాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ సభ్యుడు గుడిపల్లి సురేందర్ వినతిపత్రం ఇచ్చారు. కర్నూలు రూరల్ మండలం బి.తాండ్రపాడు, పసుపల, సూదిరెడ్డిపల్లె, నూతనపల్లె గ్రామాలకు తాగు, సాగునీటిని అందజేయాలని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడు బోయ హనుమంతు అర్జీ ఇచ్చారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అధికారులు అర్జీలు స్వీకరించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారాలు చూపించాలని, రీఓపెన్, ఇంప్రాపర్ రెడ్రెసల్ కేసులు పూర్తిగా తగ్గిపోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అనురాధ, శివ ప్రసాద్ రెడ్డి, రామసుబ్బయ్య పాల్గొన్నారు. -
ఇంద్రభవనం వీడేదెన్నడు!
శ్రీశైలంటెంపుల్: ఇల కై లాసమైన శ్రీగిరి క్షేత్రాభివృద్ధిని పర్యవేక్షిస్తూ.. భక్తుల మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ.. దేవస్థానం సొమ్మును కాపాడుతూ ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిన ఓ ఉన్నతాధికారే దేవస్థానం ఆదాయానికి గండి కొడుతున్నారు. భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించే కానుకలతో క్షేత్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి. దేవస్థాన ఉన్నతాధికారి నివాసం ఉండి పరిపాలన సాగించేందుకు గతంలో ప్రత్యేక గృహం లేకపోవడంతో దాతలు నిర్మించిన కాటేజీలను వినియోగించుకుంటూ పాలన సాగించేవారు. దాతలు నిర్మించిన కాటేజీలను వినియోగిస్తే ఆ దాతకు, భక్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి, దేవస్థానానికి రోజువారి అద్దె రూపంలో వచ్చే ఆదాయం కూడా దేవస్థానం కోల్పోతుందని భావించి సుమారు రూ.కోటికి పైగా భక్తుల సొమ్మును వెచ్చించి ఉన్నతాధికారి కోసం భవనం నిర్మించారు. భవనం పూర్తయినప్పటికీ ఇంతవరకు ఆ భవనంలోకి వెళ్లేందుకు ఉన్నతాధికారికి మనసు రావడం లేదు. దీంతో ఇటు కాటేజీ రోజు వారి అద్దె దేవస్థానం కోల్పోవడం, నూతన భవనానికి వెచ్చించి ధనం వృథాగా మారుతుంది. ప్రస్తుతం ఉన్నతాధికారి నివాసం ఉంటున్న కాటేజీ రోజు వారి అద్దె రూ.10 వేలు. నెలకు రూ.3లక్షలు ఇలా సంవత్సరానికి రూ.36 లక్షలు, రెండేళ్లకు రూ.72 లక్షలు. ఉన్నతాధికారి వ్యవహారశైలితో రెండేళ్లలో దేవస్థానం రూ.72 లక్షలు కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాకుండా నూతన భవనానికి ఖర్చు చేసిన రూ.కోటికి పైగా సొమ్ము సైతం వృథా అవుతుంది. దేవదాయ శాఖ ఆదేశాలు బేఖాతర్.. కొన్ని నెలల క్రితం ఉన్నతాధికారిగా వచ్చిన ఈయన దేవస్థానం పరిధిలో ఓ దాత భక్తుల సౌకర్యార్థం అధునాతన హంగులతో ఇంద్రభవనం లాంటి కాటేజీని నివాసంగా మార్చుకున్నారు. అ భవనం విశాలవంతం, సౌకర్యవంతంగా ఉండి ‘ఇంద్ర’భవనాన్ని తలపిస్తుండడంతో ఆ భవనాన్ని వదలేక పోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఉన్నతాధికారి తీరుపై దేవస్థానం ఆదాయానికి గండి పడుతున్న విషయం కొన్ని నెలల క్రితం దేవదాయశాఖ మంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే కాటేజీని ఖాళీ చేసి నూతన భవనంలోకి వెళ్లాలని దేవదాయ శాఖ ఆదేశించినా బేఖాతర్ చేశారు. నూతన భవనంలో చిన్నపాటి మరమ్మతులు ఉన్నాయని త్వరలోనే వెళ్తానంటూ వాయిదాలు వేస్తూ ఇంద్ర భవనాన్ని వదలడం లేదని విమర్శలు ఉన్నాయి. అయ్యగారి సేవలో ఏడుగురు ఉద్యోగులు ఉన్నతాధికారికి సేవలందించేందుకు దేవస్థానంలో వివిధ విభాగాల్లో పనిచేసే ఏడుగురు ఉద్యోగులు ఉన్నారు. అయ్యగారి నివాసం వద్ద ఉదయం ఒకరు, మధ్యాహ్నం ఒకరు, రాత్రి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వహిస్తారు. సీసీ, అటెండర్, డ్రైవర్, వంట మనిషి, స్వీపర్, గోవు సంరక్షణకు గోశాల నుంచి ఒక ఉద్యోగి ఇలా ఏడుగురు సిబ్బంది రెండు షిఫ్ట్‌లలో విధులు నిర్వహిస్తారు. ‘భక్తుల సొమ్ము వృథా అవుతే నా కేంటి’ అన్నట్లు వ్యవహరించడంతో ఆ ఉన్నతాధికారి వ్యవహారశైలి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది. ఆదర్శం మరచిన అధికారి శ్రీశైల దేవస్థానంలో పనిచేసే అధికారులకు, కింది స్థాయి ఉద్యోగులకు ఉన్నతాధికారి ప్రవర్తన ఆదర్శంగా ఉండాలి. అయితే ప్రస్తుతం దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఉన్నతాధికారి తీరు ఆ విధంగా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధునాతన హంగులతో, అన్ని సౌకర్యాలతో, దేవాలయానికి కూతవేటు దూరంలో రూ.కోటిగా నిధులు వెచ్చించి నిర్మించిన భవనంలోకి ఉన్నతాధికారి మాత్రం వెళ్లరు. సమయానికి రవాణా, భద్రత, అంతర్గత రహదారులు, డ్రైనేజ్, తాగునీటి సౌకర్యాలు లేని ఎక్కడో దేవస్థానానికి 8కి.మీ దూరంలోని సున్నిపెంటలో నిర్మించిన దేవస్థాన ఉద్యోగుల వసతి గృహానికి మాత్రం ఉద్యోగులు వెళ్లాల్సిందేనని ఒత్తిడి తీసుకువస్తారని పలువురు ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఇప్పటికై న దేవదాయశాఖ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులు స్పందించి శ్రీశైల దేవస్థానంలో ఉన్నతాధికారి నివాసం ఉంటున్న కాటేజీని ఖాళీ చేయించి, ఉన్నతాధికారి కోసం నిర్మించిన నూతన భవనంలోకి మకాం మార్చి కాటేజీని భక్తులకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు భక్తులు కోరుతున్నారు. దాత కట్టించిన కాటేజీలో ఉన్నతాధికారి నివాసం దేవస్థానం నిర్మించిన నూతన భవనం నిరుపయోగం రెండేళ్లలో దేవస్థానం ఆదాయానికి రూ. 72 లక్షల గండి శ్రీశైలంలో చర్చనీయాంశంగా ఉన్నతాధికారి వైఖరి -
దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల
కర్నూలు(అర్బన్): దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల మెరిట్, తిరస్కరణ జాబితాలను విడుదల చేసినట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్‌ఫాతిమా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాలను తమ కార్యాలయ నోటీసుబోర్డు, డిస్ట్రిక్ట్ వెబ్సైట్ https://kurnool.ap.gov.inలో ఉంచినట్లు పేర్కొన్నారు. ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్ –2 (వీహెచ్ జనరల్), జూనియర్ అసిస్టెంట్ ( వీహెచ్ జనరల్), జూనియర్ అసిస్టెంట్ (హెచ్‌హెచ్ జనరల్), జూనియర్ అసిస్టెంట్ (ఓహెచ్ జనరల్ ), జూనియర్ ఆడిటర్ (ఓహెచ్ జనరల్), టైపిస్టు ( వీహెచ్ జనరల్), టైపిస్టు ( హెచ్‌హెచ్ జనరల్ ), ఎల్డీ కంప్యూటర్ ( హెచ్‌హెచ్ జనరల్), ఏఎన్ఎం గ్రేడ్ –3, (హెచ్‌హెచ్ జనరల్) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫైనల్ మెరిట్ జాబితా, తిరస్కరణ జాబితాలను చూసుకోవాలని ఆమె కోరారు. మేళిగనూరు ప్రజలకు మొసలి భయం కౌతాళం: మేళిగనూరు గ్రామ సమీపంలోని రామలింగేశ్వర దేవాలయం వెనుక నీళ్లలో మొసలి తిరుగుతుండటంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రైతులు అటువైపు పొలాలకు వెళ్లలేకపోతున్నారు. కూలీలు సైతం పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఇటీవల హోస్పెట్ డ్యాం నుంచి స్పల్పంగా వదిలిన నీరు తుంగభద్ర నదిలో ప్రవహిస్తోంది. ఈ నీటి ప్రవాహంలో మొసలి వచ్చిందా లేదంటే గతంలో ఉన్నదేనా అన్న అనుమానాలు వస్తున్నాయి. మొసలి నుంచి తమను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. యోగా పోటీల్లో ఆదోని విద్యార్థిని ప్రతిభ ఆదోని అర్బన్: విశాఖపట్నం వేదికగా నిర్వహించిన 51వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి యోగా స్పోర్ట్స్ చాంపియన్‌షిప్–2026 పోటీల్లో ఆదోని పట్టణానికి చెందిన నిథాలి డి.జైన్ అద్భుత ప్రతిభ కనబరిచారు. ఆగస్టు 29న జరిగిన పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులతో పోటీపడి నిథాలి రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. ఈనెల 30న ప్రకటించిన ఫలితాల ప్రకారం ఆమె ప్రతిష్టాత్మక జాతీయస్థాయి పోటీలకు అధికారికంగా ఎంపికయ్యారు. స్థానిక లీలాస్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని నిథాలి పట్టణంలోని మహావీర్ డిజిటల్స్ అధినేత దినేష్భరత్షా కుమార్తె. చిన్న వయసులోనే యోగాలో కఠినమైన ఆసనాలను చక్కగా ప్రదర్శించి న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకున్నారు. డ్రంకెన్ డ్రైవ్‌లో ఇద్దరికి జైలు శిక్ష నంద్యాల(వ్యవసాయం)/బేతంచెర్ల: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఇద్దరికి నిందితులకు జైలు శిక్ష పడింది. నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆర్జీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పోలీసులు శ్రీనివాస నగర్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టగా.. షేక్ ఫయాజ్ పట్టుపడ్డాడు. నిందితుడిని సోమవారం కోర్టులో హాజరు పరచగా స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ న్యాయమూర్తి మద్దెల శ్రీనివాసరెడ్డి ఏడు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. అలాగే బేతంచెర్లలో పట్టుబడిన రామాంజనేయులుకు జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూరుల్లా రెండు రోజుల శిక్ష విధించినట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. -
గుర్తింపు లేని ప్రైవేట్ స్కూల్ సీజ్
సి.బెళగల్: ప్రభుత్వ గుర్తింపు లేని జీనియస్ గ్లోబల్ స్కూల్‌ను ఎంఈఓ జ్యోతి సీజ్ చేశారు. సోమవారం ఎంఈఓ తన కార్యాలయ అధికారులు, పోలీస్ సిబ్బందితో కలిసి మండల కేంద్రమైన సి.బెళగల్‌లోని ప్రైవేట్ పాఠశాలకు చేరుకుని ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాల నిర్వహణకు అనుమతులు, గుర్తింపు లేని విషయమై గతంలో యాజమాన్యానికికి మూడు గడువు నోటీస్‌లు ఇచ్చామన్నారు. గడువులోగా గుర్తింపును పొందలేదని, అదేవిధంగా పాఠశాలను నిర్వహించడంపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల సభ్యులు ఫిర్యాదుల మేరకు విచారించామన్నారు. ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగకుండ చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఈఓ తెలిపారు. ఆమె వెంట ఎంఐఎస్ రాజారావు, సీఆర్పీ నాగేష్, హెడ్‌కానిస్టేబుల్ క్రిష్ణ గౌడ్, కానిస్టేబుల్ సత్యరాజు తదితరులు ఉన్నారు. అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా.. ● ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి బేతంచెర్ల: హెచ్ కొట్టాల గ్రామ సమీపాన జాతీయ రహదారిపై ఆటో బోల్తాపడిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. నంద్యాల మండలం పుసులూరుకు చెందిన ఎర్రగొండ నాగయ్య, ఆటో డ్రైవర్‌తో పాటు 8 మంది మండలంలోని ఆర్ కొత్తపల్లె గ్రామంలో ఆదివారం పాముకాటుతో మృతి చెందిన గురు మోహన్ అంత్యక్రియలకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ పక్కన్న కూర్చున్న ఎర్రగొండ నాగయ్యపై ఆటో పడటంతో తీవ్రగాయాలయ్యాయి. 108 వాహనంలో బేతంచెర్ల సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో ముగ్గురికి గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. మృతుని సోదరుడు రామ సుబ్బయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ బాబు సోమవారం తెలిపారు. శ్రీశైలంటెంపుల్: శ్రీశైలమహాక్షేతం భ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్లకు సోమవారం దేవస్థానం సహస్రదీపార్చన సేవను నిర్వహించింది. ముందుగా ఆలయ ప్రాంగణంలోని పురాతన మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో సహస్రదీపార్చన పూజలు జరిపించారు. సేవలో భాగంగా మండపంలో వెయ్యి దీపాలను వెలిగించి, ఉత్సవమూర్తులకు ప్రత్యే క పూజాదికాలు నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్లను వెండిరథంపై ఆశీనులను చేసి ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. బనగానపల్లె రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వరస్వామి దేవస్థాన అభివృద్ధికి హైదరాబాద్‌కు చెందిన ఓ దాత రూ.5 లక్షల విరాళం అందించినట్లు ఆలయ చైర్మన్ బండి మౌళీశ్వరరెడ్డి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆలయం తరఫున దాతకు ఆలయ చైర్మన్, ఈఓ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నంద్యాల(వ్యవసాయం): పట్టణంలో గణేశ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో సోమవారం ఉత్తరాది మఠంలో కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు నగర గౌరవాధ్యక్షులు డాక్టర్ రామకృష్ణారెడ్డి, అధ్యక్షులు గంగిశెట్టి విజయ్ కుమార్, కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. వినాయక చవితి ఉత్సవాలు ఈ నెల 14వ తేదీ సోమవారం పండుగతో ప్రారంభమై 18వ తేదీ నిమజ్జనం కార్యక్రమంతో పూర్తవుతుందన్నారు. 5 రోజుల చవితి వేడుకులను ఘనంగా నిర్వహించుకుందామన్నారు. ఎత్తైన విగ్రహాలు కాకుండా చిన్నవి ప్రతిష్టించి పూజించాలన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కృష్ణమాచార్యులు, సత్యనారాయణ, డమాంశంకర్, చంద్రమోహన్, గాజుల హరిబాబు, పుల్లయ్య, ఈరన్న స్వామి, మురళీధర్‌రెడ్డి, రామారావు వెంకటసుబ్బయ్య, చంద్రశేఖర్ సుహాసిని, తదితరులు పాల్గొన్నారు. -
ఇవేమి వేధింపులు!
● వైఎస్సార్సీపీ నేతలను నాలుగు గంటలు స్టేషన్లో ఉంచిన సీఐడోన్: ఓ కేసులో కండీషన్ బెయిల్ పొంది పోలీసు స్టేషన్లో సంతకం పెట్టేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ నేతలను సీఐ దాదాపు నాలుగు గంటల పాటు స్టేషన్లోనే నిరీక్షించి, నీరసించేలా చేశారు. ప్రోటోకాల్ పాటించకుండా ఈనెల 23వ తేదీన డోన్ పట్టణంలోని నూతన ఎంపీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించారని ఎంపీడీఓ వెంకటేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు జెడ్పీ చైర్మెన్ ఎర్రబోతుల పాపిరెడ్డితో పాటు వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు కేసు పెట్టారు. కాగా వారు కండీషన్ బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే కండీషన్ బెయిల్లో భాగంగా సోమవారం పోలీస్ స్టేషన్లో సంతకం చేసేందుకు ఎంపీపీ రేగటి రాజ్‌శేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు బద్దల రాజ్‌కుమార్‌లతో పాటు పలువురు ఎంపీటీసీలు, నాయకులు పోస్టు ప్రసాద్, రామచంద్రుడు తదితరులు ఉదయం చేరుకున్నారు. సంతకం చేసి వెళ్తుండగా.. సీఐ ఇంతియాజ్ బాషా బయటకు వెళ్తూ ‘తాను తిరిగి వచ్చే వరకు అక్కడే ఉండండి’ అంటూ వెళ్లిపోయారు. దా దాపు నాలుగు గంటలు గడిచినా సీఐ తిరిగి రాలేదు. చివరకు నాయకుల్లో కొందరికి షుగర్ ఉందని, మధ్యాహ్నం భోజనం చేయాలని ఎస్ఐ శరత్కుమార్రెడ్డికి చెప్పడంతో ఆయన పంపించేశారు. అయితే కూటమి నేతల ఒత్తిడి మేరకు సీఐ అలా వ్యవహించారనే విమర్శలు ఉన్నాయి. సీఐ బయటకు వెళ్లిన సమయంలో ఎటువంటి కార్యక్రమాలు కూడా లేవని, కూటమి నేతల వేధింపుల్లో భాగంగానే తమను నాలుగు గంటల పాటు స్టేషన్లో ఉంచారని వైఎస్సార్సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. -
పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురణ
కర్నూలు(అర్బన్): జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల తుది జాబితాలను ప్రచురించినట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ ఆగస్టు 23వ తేది నాటికి అన్ని గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. ఆయా పోలింగ్ కేంద్రాలపై 26వ తేది వరకు అభ్యంతరాలను స్వీకరించి పరిశీలించామన్నారు. జిల్లా కలెక్టర్ అనుమతితో 31న అన్ని గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల తుది జాబితాలను ప్రచరించామన్నారు. అన్ని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాల నోటీసు బోర్డుల్లోను, ఆయా గ్రామ పంచాయతీ పరిధిలోని రెండు ముఖ్యమైన కార్యాలయాల్లో తుది జాబితాలను ప్రచురించారన్నారు. -
ఉద్యోగుల ఉద్యమ భేరి
● ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు నోటీసు అందజేత కర్నూలు(సెంట్రల్): చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలైనా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగులు ఉద్యమ భేరి మోగించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జరుగుతున్న పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరికి ఉద్యమ కార్యాచరణ నోటీసును అందజేశారు. వందలాది మంది ఉద్యోగులతో వెళ్లిన ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ వి.గిరికుమార్‌రెడ్డి, కార్యదర్శి ఎం.వెంకటరాజు మాట్లాడుతూ 29 డిమాండ్లతో నోటీసును అందజేసి ఉద్యమానికి సహకరించాలని కోరినట్లు తెలిపారు. ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ 30 శాతం ఇస్తామని చెప్పినా చంద్రబాబు ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను ఇవ్వాలని కోరితే ఉద్యోగ సంఘాల నాయకులపై రాజకీయ ముద్రలు వేసి ఏజెంట్లని సంబోధించడం అన్యాయమన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.40 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు మురళీకృష్ణనాయుడు, శంకరప్ప, రంగారెడ్డి, పీఆర్ ఉద్యోగుల నుంచి జ్యోత్స్న, ధనిబాబు, ఆర్టీసీ నుంచి మహేష్, సాలమ్మ, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నుంచి విష్ణువర్ధన్‌రెడ్డి, టీచర్స్ నుంచి ఎస్‌ఎల్‌టీఏ నాయకులు మద్దిలేటి, వెంకటేష్ పాల్గొన్నారు. -
వర్షాలు కురిసి సుఖసంతోషాలు ప్రసాదించాలి
శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో ప్రజానీకం అల్లాడిపోతున్నారని, రాఘవేంద్రుల అనుగ్రహంతో వర్షాలు కురిసి సుఖసంతోషాలు ప్రసాదించాలన్నారు. భక్తుల సహకారంతో శ్రీమఠంలో భక్తులకు వసతి కల్పనకు బాటలు వేస్తున్నామన్నారు. శ్రీమఠం వైభవానికి మరింతగా శ్రమిస్తామని పేర్కొన్నారు. నేపాల్‌లో వరద విపత్తుపై స్వామిజీ విచారం వ్యక్తం చేశారు. బాధిత దేశానికి శ్రీమఠం సహాయ, సహకారాలు అందించేందుకు సిద్ధంగా అవుతోందని తెలిపారు. హెలికాప్టర్‌తో పూలవర్షం -
వేదమూర్తి.. దివ్యదీప్తి
మంత్రాలయం: నింగిన పుష్పవృష్టి.. భువిన భక్తజన సాగరం.. పండితులు వేద ఘోషలు.. కళాకారుల సంప్రదాయ ప్రదర్శనల మధ్య వేదమూర్తి శ్రీరాఘవేంద్ర స్వామి రథోత్సవం సోమవారం కనులపండువగా సాగింది. రాఘవేంద్రుల 355వ ఆరాధన సప్తరాత్రోత్సవాల్లో భాగంగా శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో ఉత్సవమూర్తి మహారథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్తరారాధనలో భాగంగా ముందుగా ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులను గురుసార్వభౌమ వేద పాఠశాలకు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ పాఠశాల విద్యార్థులు వేద పఠనం కానిస్తూ విశేష పూజలు చేశారు. అక్కడి నుంచి శ్రీమఠం మూల బృందావనం చేరుకోగా స్వామిజీ ఉత్సవమూర్తి బుగ్గలకు గంధం పూసి వసంతోత్స వానికి శ్రీకారం పలికారు. గర్భాలయంలో అర్చకులు, పండితులు, పీఠాధిపతి గులాలు చల్లుకుని ఆచార వైభవాన్ని స్పృశింపజేశారు. మంగళవాయిద్యాలు, ఉత్సవ పతాకాలతో ఉత్సవమూర్తితో మహారథం చెంతకు చేరుకున్నారు. మహారథం చుట్టూ ప్రదక్షిణలు ఉత్సవమూర్తి మహారథం చేరుకోగా పీఠాధిపతి రథచక్రాలకు నారీకేళాలు సమర్పించి అర్చనలు చేశారు. ఉత్సవమూర్తితో మహారథం చుట్టూ ప్రదక్షిణలు చేశారుస. మహారథంపై కొలువుదీరిన తరుణాన భక్తజనులు గోవిందా.. గోవిందా.. అంటూ ప్రణమిల్లుతూ స్మరణ చేసుకున్నారు. రథంపై ఆశీనులైన స్వామిజీ ప్రవచనం ముగియగానే రథయాత్రకు అంకురార్పణ పలికారు. వంద అడుగుల దూరం చేరుకోగా స్వామిజీ హెలికాప్టర్‌పై నుంచి పుష్ప వృష్టి కురిపించారు. మంగళ వాయిద్యాలు, డప్పు దరువులు, రంగుల ఆటల మధ్య మహారథం అలా ముందుకు కదిలింది. మధ్వ కారిడార్, ప్రధాన ముఖద్వారం, సుజయీంద్ర కారిడార్ మీదుగా రాఘవేంద్ర సర్కిల్ చేరుకుంది. అక్కడ స్వామిజీ పూర్వాశ్రమ కుటుంబ సభ్యులు ఉత్సవమూర్తికి పూజలు చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. మంత్రాలయం పురవీధుల్లో గంటన్నర పాటు రథయాత్ర సాగింది. తిరిగి శ్రీమఠానికి చేరుకుని పూజా మందిరంలో స్వామిజీ మూల, జయ, దిగ్వజయ సంస్థాన పూజ గావించారు. ఎస్పీ విక్రాంత్‌పాటిల్ నేతృత్వంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పండిత కేసరి రాజా ఎస్. గిరియాచార్, శ్రీమఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 వెంకటేష్‌జోషి, మేనేజర్–3 శ్రీపతి ఆచార్, మేనేజర్–4 సురేష్ కోనాపూర్ పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా రాఘవేంద్రుల మహారథోత్సవం హెలికాప్టర్‌తో మహారథంపై పుష్పవృష్టి -
వన్‌స్టాప్ సెంటర్లలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
● ఐసీడీఎస్ పీడీ పీ విజయ కర్నూలు(అర్బన్): కర్నూలు, ఆదోనిలోని వన్‌స్టాప్ సెంటర్లలో పలు రకాల పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పీ విజయ తెలిపారు. సోమవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2025 జూలై 1వ తేదీ నాటికి 18 నుంచి 39 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుందన్నారు. కర్నూలు, ఆదోనిలో నివాసం ఉంటున్న వారికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. పూర్తి నోటిఫికేషన్, ఇతర వివరాలకు కలెక్టరేట్లోని తమ కార్యాలయం, www. kurnool.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించాలన్నారు. కర్నూలులో కేసు వర్కర్ (ఎస్సీగ్రూపు– 2 మహిళలకు), ఆదోనిలో కేసు వర్కర్ (ఎస్టీ మహిళ), పారా మెడికల్ సర్సనల్ (ఎస్టీ మహిళ), సైకో సోషియల్ కౌన్సిలర్ (ఓసీ మహిళలకు) పోస్టులకు అర్హులైన వారు ఈ నెల 1 నుంచి 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. క్వింటా ఉల్లి రూ.3,898 కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆగస్టు నెల 24న ఉల్లిగడ్డలకు గరిష్టంగా క్వింటాకు రూ.4,329 ధర లభించింది. మరుసటి రోజు నుంచి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆగస్టు 29న గరిష్ట ధర రూ.3,629 లభించింది. తాజాగా సోమవారం కర్నూలు మార్కెట్‌కు 1,796 క్వింటాళ్ల ఉల్లి వచ్చింది. కనిష్ట ధర రూ.2,079 ఉండగా.. గరిష్ట ధర రూ.3,989 లభించగా.. సగటు ధర రూ.3,614 నమోదైంది. వేరుశనగ ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. కర్నూలు మార్కెట్‌కు 227 క్వింటాళ్ల వేరుశనగ బుడ్డలు రాగా కనిష్ట ధర రూ.4,600, గరిష్ట ధర రూ.9,299 లభించగా.. సగటు ధర రూ.7,411మాత్రమే నమోదైంది. ఆదోని మార్కెట్‌కు 827 క్వింటాళ్లు రాగా కనిష్ట ధర రూ.3,509, గరిష్ట ధర రూ.8,910 లభించగా.. సగటు ధర రూ.7,439 పలికింది. మార్కెట్లో మొక్కజొన్నలకు కొరత ఏర్పడటంతో ధరలు పెరుగుతున్నాయి. క్వింటాకు రూ.2,360 ధర లభించింది. నేడు పింఛన్ల పంపిణీ కర్నూలు(అగ్రికల్చర్): సెప్టెంబరు నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరుగనుంది. పింఛన్ల పంపిణీకి కర్నూలు జిల్లాకు రూ.102.48 కోట్లు, నంద్యాల జిల్లాకు రూ.90.87 కోట్లు సోమవారం బ్యాంకులకు విడుదల అయ్యాయి. గ్రామ, వార్డు సచివాలయాల సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు డ్రా చేశారు. 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి పంపిణీ చేస్తారు. కర్నూలు జిల్లాలో 2,33,431, నంద్యాల 2,09,732 ఉన్నాయి. ఇంటిదగ్గరే పింఛన్ల పంపిణీ అంటున్నా... కేవలం నామమాత్రానికే పరిమతమైంది. కొత్త పింఛన్లు ఇదుగో, అదుగో అంటున్నా.. అతీగతీ లేకపోవడంపై అవ్వాతాతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్లు అనే చంద్రబాబు హామీ గాలిలో కలసి పోయింది. -
వైఎస్సార్సీపీ కార్యకర్త హత్య?
ఓర్వకల్లు: జీవాలను మేపడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ కార్యకర్త బోయ బంకు వెంకటేశ్వర్లు (53) నిమ్మతోటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఘటన స్థలంలో హ్యత చేసినట్లు అనవాళ్లు కనిపిస్తున్నాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మీదివేముల గ్రామానికి చెందిన బోయ బంకు వెంకటేశ్వర్లు తనకు ఉన్న నాలుగు జీవాలను మేపడానికి ఆదివారం ఉదయం వెళ్లాడు. మీదివేముల, నన్నూరు గ్రామాల మధ్య ఉన్న దిగువయ్యస్వామి దర్గా వద్ద గల నిమ్మతోటలో మృతదేహంగా కనిపించాడు. అక్కడే ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త బోయరమేష్ ప్రత్యర్థుల చేతుల్లో హత్యకు గురయ్యాడు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు కర్నూలు తాలూకా సీఐ చంద్రబాబు నాయుడు, ఎస్ఐ సునీల్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని కంటిపై, శరీరంపై పలు చోట్ల పేడరంగులో కలిపే రసాయనాలు పడినట్లు గుర్తించారు. ఘటనా స్థలానికి కొంత దూరంలో మనిషిని ఈడ్చుకవెళ్లినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంకటేశ్వర్లును ఎవరైనా సరిపోని వ్యక్తులు హత్యచేసి, ఎవరినీ గుర్తుపట్టలేని రీతిలో ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతుని శరీరంపై పేడరంగు రసాయనాలు చల్లినట్లు అనుమానిస్తున్నారు. అంతేగాక వెంకటేశ్వర్లు గొంతుపై గాట్లు ఉండడంతో అతని మృతిపై పలు అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. వెంకటేశ్వర్లుది హత్యనా? ఆత్మహత్యనా? అనే కోణంలో విచారిస్తున్నారు. గ్రామంలో రెండేళ్ల క్రితం ఇచ్చిన ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటుండగా, సదరు భూమి తమదని నన్నూరు గ్రామానికి చెందిన వ్యక్తులు వేధిస్తున్నారు. ఈ మేరకు మృతుని భార్య లక్ష్మిదేవి ఫిర్యాదు ఇచ్చారని పోలీసులు తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన కాటసాని వెంకటేశ్వర్లు మృతదేహం కనిపించిన స్థలాన్ని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కర్నూలు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మీదివేముల ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. మృతుడు వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడా? హత్యకు గురయ్యాడా? అనేది నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవ విషయాలను నిగ్గుతేల్చాని పోలీసులకు విన్నవించారు. వారి వెంట ఓర్వకల్లు వైఎస్సార్సీపీ నాయకులు కాశిరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, పలువురు నాయకులు ఉన్నారు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం మృతదేహాన్ని పరిశీలించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి -
ఉరుకుందకు పోటెత్తిన భక్తులు
తుంగభద్ర కాలువలో స్నానాలు ఆచరిస్తున్న భక్తులుకౌతాళం: శావ్రణమాస ఉత్సవాల్లో భాగంగా మూడవ సోమవారం ఉరుకుంద ఈరన్నస్వామిని దర్శించుకోవడానికి ఆదివారం ఉదయం నుంచే భక్తులు తరలివచ్చారు. మూడవ సోమవారం సుమారు 3 నుంచి 4లక్షల మంది భక్తుల తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారని అంచనా. రద్దీ దృష్ట్యా భక్తులు ఆదివారం ఉదయం నుంచే తరలిరావడంతో క్షేత్రం కిటకిటలాడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు దిగువ కాల్వలో స్నానాలు ఆచరించి, స్వామి సన్నిధిలో పిండి వంటలు వండి స్వామికి నైవేద్యం సమర్పించారు. భక్తులు తరలివస్తుండటంతో రాత్రంతా దర్శనాలు కొనసాగుతాయని, అర్ధరాత్రి 12 గంటల అనంతరం పూజల కోసం అర గంట పాటు దర్శనాలు నిలుపుతామని ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా కౌతాళం సీఐ యుగంధర్‌తో పాటు మరో నలుగురు సీఐలు ఎస్ఐలు, పోలీసులు గట్టి పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
బైలుప్పలలో గుప్త నిధుల కోసం వేట
గోనెగండ్ల: మండలంలోని గ్రామ శివారులో ఉన్న ఈశ్వర దేవాలయంలో గుప్త నిధుల కోసం వేట జరిగినట్లు వెలుగుచూసింది. బైలుప్పల గ్రామం నుంచి బన్నూరు గ్రామానికి వెళ్లే దారిలో ఒక పంట పొలంలో ఈ పురాతన శివాలయం ఉంది. ఇక్కడ గుప్త నిధులు ఉన్నట్లు గత కొన్నేళ్లుగా ప్రచారం సాగుతుంది. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు శివాలయం వెనుక భాగంలో గోడకు ఉన్న రాయిని గడ్డపారాలతో తొలగించారు. భక్తులు ఆదివారం గుర్తించి దుండగులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడే కొందరు గ్రామస్తులతో పాటు బయటి వ్యక్తులతో కలిసి దేవాలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపించాడని స్థానికంగా ప్రచారం జరుగుతుంది. -
ఆదోని పత్తి జిన్నింగ్ మిల్లుకు ఉత్తమ అవార్డు
ఆదోని అర్బన్: దేశంలోని 15 ఉత్తమ పత్తి జిన్నింగ్ మిల్లులకు అవార్డులు ప్రకటించారు. ఇందులో ఆదోని బసాపురం రోడ్డులో ఉన్న ధారశ్రీ పత్తి జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ ఒకటిగా నిలిచింది. నాణ్యమైన దూది తయారీ, ఎప్పటికప్పుడు మిషనరీల శుభ్రత, అప్డేట్ చేయడం, ఆన్లైన్, ఆఫ్‌లైన్ సమావేశాల్లో సలహాలు, సూచనలు ఇవ్వడం ఇలా పలు అంశాల్లో ఈ పరిశ్రమ ఉత్తమమైనదిగా టెక్స్టైల్స్ కమిటీ ఎంపిక చేసింది. ఈ నెల 22న ముంబాయిలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర టెక్స్టైల్స్ మంత్రి గిరిరాజ్‌సింగ్ చేతులమీదుగా పరిశ్రమ నిర్వాహకులు వెంకటరామిరెడ్డి, ఆదినారాయణరెడ్డి అవార్డు అందుకున్నారు. ఆదివారం ఆదోనికి చేరుకున్న వారిని స్థానిక వ్యాపారులు అభినందించారు. ఏపీ నుంచి తమ పత్తి మిల్లు ఒకటే ఉత్తమ పరిశ్రమగా నిలవడం గర్వకారణంగా ఉందని ధారశ్రీ పత్తి జిన్నింగ్ మిల్లు నిర్వాహకులు వెల్లడించారు. -
ఉపాధ్యాయులను వేధించడం కోసమే ‘టెట్’
● కలెక్టరేట్ ఎదుట డీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసనకర్నూలు(సెంట్రల్): ఇన్ సర్వీసు టీచర్లను మానసికంగా వేధించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం టెట్‌ను నిర్వహిస్తోందని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శులు తిమ్మప్ప, రత్నంఏసేపు అన్నారు. ఆదివారం డీటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏకపక్షంగా స్పెషల్ టెట్‌ను ప్రకటించడాన్ని నిరసిస్తున్నట్లు చెప్పారు. సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కోసం విద్యా హక్కు చట్టం సెక్షన్ 23(1)ను సవరించాలని డిమాండ్ చేశారు. చట్ట సవరణలు చేయకుండా ఏకపక్షంగా నోటిఫికేషన్‌ను విడుదల చేయడం అన్యాయమన్నారు. ఆఫ్‌లైన్‌లో టెట్ నిర్వహించాలని, 40 శాతం అర్హత మార్కులుగా నిర్ణయించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇన్‌సర్వీసు టీచర్లకు టెట్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి బీమన్న, నాయకులు రోశన్న, సుబ్బారాయుడు, రఘునాథ్, హుస్సేన్, నంద్యాల అధ్యక్షుడు స్వాములు పాల్గొన్నారు. -
జిల్లాలో 5,244 పోలింగ్ కేంద్రాలు
● నేడు తుదిజాబితా ప్రచురణ కర్నూలు(అర్బన్): రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రచురిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్ తెలిపారు. జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో 5,100 వార్డులకు 5,244 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్ఈసీ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఈ ప్రక్రియను చేపట్టామని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ కేంద్రాల తుది జాబితాలను ఆయా మండల పరిషత్ అభివృద్ధి అధికారి, గ్రామ పంచాయతీ కార్యాలయాలతో పాటు ముఖ్యమైన రెండు కార్యాలయాల్లో ప్రచురిస్తామని పేర్కొన్నారు. నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యలు ఉన్న ప్రజలు అర్జీలు ఇవ్వా లని సూచించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్వింటా వేరుశనగ రూ.9,290 ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఆదివారం క్వింటా వేరుశనగకు గరిష్ట ధర రూ.9,290 లభించింది. మార్కెట్‌కు 1,056 క్వింటాళ్ల దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. క్వింటా కనిష్టంగా రూ.4,390, మధ్యస్థంగా రూ.7,700 ప్రకారం మార్కెట్లో వ్యాపారులు కొనుగోలు చేశారని మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన తెలిపారు. వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం ● భార్య మృతి.. భర్త గల్లంతు గుంతకల్లుటౌన్/చిప్పగిరి: జీవితంపై విరక్తితో వృద్ధ దంపతులు హంద్రీ–నీవా కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిలో భార్య మృతదేహం లభ్యం కాగా.. గల్లంతైన భర్త కోసం గాలింపు చేపట్టారు. పోలీసుల కథనం మేరకు...చిప్పగిరి మండలం బెలడోణ గ్రామానికి చెందిన సోమలింగమ్మ (60), సీతానంద(64) దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరు కుమారుడు నారాయణ వద్ద ఉంటున్నారు. వీరు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం గుంతకల్లులో ఆస్పత్రికి వెళ్తున్నామని ఇంటి నుంచి వచ్చిన వీరు బస్సులో కసాపురం చేరుకున్నారు. అక్కడి నుంచి హంద్రీ–నీవా కాలువ వద్దకు వెళ్లి నీటిలో దూకారు. నీటిలో తేలియాడుతున్న సోమలింగమ్మను స్థానికులు గమనించి రక్షించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. నీటిలో గల్లంతైన సీతానంద కోసం గాలింపు చేపట్టారు. దంపతులు అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కసాపురం ఎస్ఐ వెంకటస్వామి తెలియజేశారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. మొక్కజొన్న పంట జీవాలకు మేత నందికొట్కూరు: పక్కనే హంద్రీ నీవా కాల్వల్లో కృష్ణా జలాలు పరుగులు పెడుతున్నాయి. ఎక్కడో దూరాన ఉన్న అనంతపురం, కుప్పానికి నీళ్లు తరలిస్తున్న ప్రభుత్వం ఇక్కడి రైతుల గురించి పట్టించుకోవడం లేదు. వర్షాలు లేక, కాల్వలకు నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయి. దామగట్ల గ్రామానికి చెందిన రైతు కుమ్మరి లింగన్న పొలంపక్కన హంద్రీనీవా కాలువ ఉంది. మొక్క జొన్న పంట సాగు చేయగా వర్షాలు లేకపోవడంతో పంట గిడసబారిపోయింది. చివరకు పంటను జీవాలకు మేతగా వదిలేశాడు. -
ప్రశాంతంగా నీట్పీజీ
● 98.72శాతం మంది విద్యార్థుల హాజరు కర్నూలు(హాస్పిటల్): వైద్యవిద్యలో స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్పీజీ పరీక్ష ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. మొత్తం ఏడు కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు. కర్నూలులోని జి.పుల్లారెడ్డి, కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలల్లో నిర్వహించిన నీట్–పీజీ పరీక్షను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి పరిశీలించారు. కేవీ సుబ్బారెడ్డి, జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీల్లో ఎస్పీ విక్రాంత్ పాటిల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నీట్ పీజీ–2026 ఆన్లైన్ పరీక్షల కోసం జిల్లాలో మొత్తం ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షకు 2,114 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఆదివారం నిర్వహించిన పరీక్షకు 2,087 మంది హాజరయ్యారని, 27 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఈ మేరకు జిల్లాలో మొత్తం 98.72 శాతం మంది హాజరైనట్లు వివరించారు. పరీక్షల నిర్వహణ పూర్తిగా సజావుగా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగాయన్నారు. అన్ని కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టదిట్టంగా అమలు చేశామన్నారు. -
ఇంతటి కరువును 28 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదు
● నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ జయలక్ష్మికర్నూలు(అగ్రికల్చర్): ‘ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో వివిధ హోదాల్లో 28 ఏళ్లుగా పనిచేస్తున్నా. ఎప్పుడూ ఇంతటి తీవ్రమైన కరువును చూడలేదు. ఎల్‌నినో ప్రభావంతో 60 రోజులకుపైగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పంటలకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. వర్షాధారం కింద సాగు చేసిన పత్తిలో 15 కిలోల నుంచి క్వింటాళు కూడా దిగుబడి వచ్చే అవకాశం లేదు. మేం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేశాం.. అన్ని చోట్ల పంటలు దెబ్బతిని ఉన్నాయి’ అని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ పరిశోధన స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్(ఏడీఆర్) జయలక్ష్మి తెలిపారు. కర్నూలు జిల్లాలో 80 వేల హెక్టార్లకు పైగా పంటలు వర్షాభావం వల్ల పూర్తిగా పాడైపోయాయని, నంద్యాల జిల్లాలో 30 వేల హెక్టార్లలో పంటలు దున్నేశారని ఏడీఆర్ తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరువు తీవ్రతపై ‘సాక్షి’ తో నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ వి.జయలక్ష్మి మాట్లాడారు. ప్రశ్న: పంటల పరిస్థితి ఎలా ఉంది? జవాబు: కర్నూలు జిల్లాలో పత్తి, ఆముదం, కంది పంటల పరిస్థితి దయనీయంగా ఉంది. నంద్యాల జిల్లాలో మొక్కజొన్న, మినుము వంటి పంటలను దున్నేశారు. మేం వెళ్లిన ప్రతి చోట పంటల పరిస్థితి అధ్వానంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడ కూడా పంటల పరిస్థితి సంతృప్తికరంగా లేదు. ప్రశ్న: దిగుబడులు వచ్చే అవకాశం ఉందా? జవాబు: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు రెండు నెలలుగా లేవు. కర్నూలు జిల్లాలో ప్రత్తి ప్రధాన పంట. వర్షాధారం కింద సాగు చేసిన పత్తిలో 15 కిలోల నుంచి క్వింటా వరకు కూడా దిగుబడి రావడం కష్టమే. పెట్టుబడి ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంది. అక్కడక్కడ పత్తి పంటకు ఒకటి, రెండు నీటి తడులు ఇచ్చుకున్నారు. అటువంటి వాటిల్లో 2–3 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మామూలుగా అయితే ఒకటి, రెండు నీటి తడులు ఇచ్చిన పత్తిలో 12 క్వింటాళ్ల వరకు వస్తుంది. నంద్యాల జిల్లాలో మొక్కజొన్నలో దిగుబడులు జీరో ఉండే అవకాశం ఉంది. మహా అయితే క్వింటా నుంచి రెండు క్వింటాళ్ల వరకు రావచ్చు. మినుములో అక్కడక్కడ క్వింటా వరకు దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ప్రశ్న: వర్షాల పరిస్థితి ఎలా ఉంది? జవాబు: వరుసగా రెండు నెలల పాటు వర్షాలు లేకపోవడం ఇదే మొదటిసారి. నంద్యాల జిల్లాలో 30 మండలాలు ఉన్నాయి. అన్ని మండలాల్లో లోటు వర్షపాతమే ఉంది. ఇటువంటి పరిస్థితి గతంలో ఎపుడూ లేదు. కర్నూలు జిల్లాలో 5 మండలాల్లో సాధారణ వర్షపాతం ఉండగా.. మిగిలిన మండలాల్లో వర్షపాతం లోటు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రశ్న: వరి పంట పరిస్థితి ఎలా ఉంది? జవాబు: నంద్యాల జిల్లాల్లో బోర్లు, ఇతర నీటి వసతి కింద 15 వేల నుంచి 20 వేల హెక్టార్లలో వరి వంగడాలను నేరుగా విత్తుకున్నారు. కాల్వలకు నీళ్లు రాకపోవడం, బోర్లలో నీళ్లు లేకపోవడంతో వరి పంట పంట పూర్తిగా దెబ్బతినింది. నంద్యాల జిల్లాలో మొదటిసారిగా వరి పంట దెబ్బతినడంతో రైతులు కోలుకోలేని విధంగా నష్టపోతున్నారు. ప్రశ్న: గతంలో ఇలాంటి కరువును చూశారా? జవాబు: దాదాపు మూడు దశాబ్దాల కాలంలో ఎప్పు డూ ఇలాంటి తీవ్రమైన కరువును చూడలేదు. మొదటి సారిగా తీవ్రమైన కరువు పరిస్థితులను చూస్తున్నాం. ప్రశ్న: ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటలకు అవకాశం ఉందా? జవాబు: కర్నూలు జిల్లాలో నల్లరేగడి నేలల్లో వేసిన పత్తి దెబ్బతిని ఉంటే తీసేసి సెప్టెంబరు 15 నుంచి జొన్న, శనగ వంటి పంటలు సాగు చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయ పంటలు కూడా 100 మీ.మీ. వర్షపాతం నమోదు అయినప్పుడే వేసుకోవాలి. తెల్ల జొన్నలో ఎన్జీజే5(కిలో ధర రూ.96), ఎన్ 15 రకాలు(కిలో ధర రూ.108) ప్రత్యామ్నాయ పంటలుగా వేసుకోవచ్చు. శనగలో దేశివాళీ రకాలు నంద్యాల గ్రామ్ 452, 857, 776, 1267, కాబూలి రరాలు నంద్యాల గ్రామ్ 49, 810 రకాలు వేసుకోవచ్చు. ఈ రకాలన్నీ నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌లో రైతులకు అందుబాటు ఉన్నాయి. సబ్సిడీ ఉండదు. శనగలో దేశీవాళీ రకాలు కిలో ధర రూ.115, కాబూలీ రకాల కిలో ధర రూ.150 ప్రకారం రైతులకు ఇస్తాం. -
పెండింగ్‌లో రూ.28.57 కోట్ల బిల్లులు
జేజేఎం పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రూ.28.57 కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. బిల్లులు పెండింగ్ లో ఉంచడంతో అనేక గ్రామాల్లో జలజీవన్ మిషన్ కింద చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోయాయి. పైప్లైన్ల కోసం తవ్విన రోడ్లు, సగం వరకు ఆగిన ఓవర్ హెడ్ ట్యాంకులు ఆయా ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో పనులు పూర్తి చేసినా, బిల్లులు విడుదల చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జేజేఎం పనులు చేసిన కాంట్రాక్టర్లు ఈ నెల 26న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట ఆందోళన కూడా చేపట్టారు. చేసిన పనులకు సంబంధించి బిల్లులను అప్ లోడ్ చేసినా, నేటికి విడుదల కాకపోవడంతో పలు ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు పనులను నిలిపివేశారు.ఉల్చాలలో అలంకార ప్రాయంగా నిలిచిన నీటి ట్యాంకుగోనెగండ్లలో నిలిచిన ట్యాంకు పనులుఅర్ధంతరంగా నిలిచిపోయిన ఓవర్ హెడ్ ట్యాంకు -
వింత ఆచారం.. తేళ్ల నైవేద్యం
● కొండలరాయుడికి నేడే తేళ్ల సమర్పణ కోడుమూరు రూరల్: శ్రావణమాసంలో వచ్చే మూడో సోమవారం కోడుమూరు కొండపై వెలసిన శ్రీకొండలరాయుడికి భక్తులు తేళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ వింత ఆచారాన్ని ప్రజలు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. విషపురుగులైన తేళ్లను చూస్తే ఎక్కడైనా ప్రజలు ఆమడదూరం పరుగెడతారు. ఇక్కడ కొండమీద మాత్రం భక్తులు చిన్న చిన్న రాళ్లను ఎత్తుతూ వాటికింద ఉండే తేళ్లను ఎలాంటి జంకుబొంకులేకుండా పట్టుకొని స్వామికి నైవేద్యంగా సమర్పించి కోరికలను కోరుకుంటారు. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా తేళ్లను చేతులతో పట్టుకొని స్వామివారికి సమర్పిస్తారు. స్వామి వారికి సమర్పించేందుకు తేలును పట్టుకునే సమయంలో కుట్టినా ఏమి కాదని భక్తుల నమ్మకం. గుడి నిర్మాణం కోడుమూరు కొండపై శ్రీకొండరాయుడు విగ్రహాని ఎన్నో ఏళ్లుగా ప్రజలు పూజలు చేస్తున్నారు. అయితే కోడుమూరుకు చెందిన సౌరెడ్డి అనే భూస్వామి తనకు కుమారుడు పుడితే స్వామికి ఆలయం నిర్మిస్తానని మొక్కుకున్నాడు. కుమారుడు జన్మించడంతో మొక్కు ప్రకారం 1970లో గుడి నిర్మించారు. ప్రతి శ్రావణమాసంలో ప్రజలు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. వంశపారపర్యంగా స్వామి వారికి మా వంశస్తులే పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. సోమవారం జరిగే ఉత్సవం కోసం ఆలయానికి రంగులు వేయించాం. భక్తుల సౌకర్యార్థం మధ్యాహ్నం నుంచి అన్నదానం చేస్తాం. నీటి వసతి కోసం ఏర్పాట్లు పూర్తి చేశాం. – మనోహర్‌రెడ్డి, ఆలయ సంరక్షకుడు. -
తుంగాతీరం.. జయ జన ధ్వానం
మంత్రాలయం: సద్గురు రాఘవేంద్రులు సశరీరంగా బృందావన ప్రవేశం చేసిన శుభదినం.. పరమగురుడి 355వ ఆరాధన వేళ.. భక్తజన సంద్రంతో వేదభూమి పులకించింది. తుంగభద్రమ్మ పరవశించింది. ఆదివారం సప్తరాత్రోత్సవాల్లో భాగంగా పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆశీస్సులతో మధ్యారాధన మహా మంగళకరంగా సాగింది. రాఘవేంద్రస్వామి బృందావనం ప్రవేశం రోజు కావడంతో స్వామి మూల బృందావనానికి మహా పంచామృతాభిషేకం గావించారు. వేదపఠనం గావిస్తూ జల, పుష్ప, పంచామృతాభిషేకం నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు 2 లక్షలకుపైగా భక్తులు హాజరైనట్లు అంచనా. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు శ్రీమఠం క్షేత్ర పరిధిలో నాలుగు చోట్ల ఎల్ఈడీ డిస్ప్లేతో ద్వారా భక్తులకు వీక్షణ సదుపాయం కల్పించింది. మధ్యారాధన సందర్భంగా మధ్యా హ్నం రాఘవేంద్రులను బంగారు రథంపై ఊరేగించారు. రాయరు బంగారు ప్రతిమను స్వర్ణ రథంపై కొలువుంచగా పీఠాధిపతి నారికేళ సమర్పణతో మంగళ హారతులు పట్టి రథయాత్రకు అంకురార్పణ పలికారు. పండితుల వేదఘోష, మంగళ వాయిద్యాలు, కర్ణాటక డోలు వాయిద్యాల సుస్వరాల మధ్య శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో రథయాత్ర రమణీయంగా సాగింది. వేడుకలో మేళతాళాలు, నృత్య ప్రదర్శనలు, సంకీర్తనాలాపనలు భక్తులను మైమరిపించాయి. గజవాహనంపై గురుసార్వభౌమ.. ద్వైత వేదాంత మూర్తి గురుసార్వభౌముడు రజత గజవాహనంపై కడు వైభవంగా ఊరేగారు. ముందుగా ఊంజల మంటపంలో ఉత్సవమూర్తికి రుగ్వేద, యజుర్వేద, సామవేద పారాయణం పఠిస్తూ పీఠాధిపతి చామర్ల సేవ గావించారు. అనంతరం శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో డప్పు దరువులతో ఎంతో రమణీయంగా ఉత్సవమూర్తి గజవాహనంపై ఊరేగారు. రాత్రి రెండు గంటల వరకు, అంబారీ, స్వర్ణ, నవరత్న రథోత్సవం అశేష భక్తజన వాహిని మధ్య అంగరంగ వైభవంగా సాగింది. అంతకు ముందు పరిమళ తీర్థ పుష్కరిణిలో ఉత్సవమూర్తి తెప్పోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే యోగీంద్ర మంటపంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి. బెంగళూరుకు చెందిన భువనేశ్వరి వీణా వాదం, రాయచూరు శేషగిరి దాసు, దాసవాణి, ఉడిపికి చెందిన భార్గవ నృత్య తండా బృందం నృత్య రూపక ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. వేడుకలో పండితకేసరి గిరియాచార్, ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 వెంకటేష్‌జోషి, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్, ధార్మిక సహాయకాధికారి వ్యాసరాజాచార్, వేద పాఠశాల మాజీ ప్రిన్స్‌పాల్ వాదిరాజాచార్ తదితరులు పాల్గొన్నారు.నేడు మహా రథోత్సవంమంత్రాలయం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి 355వ ఆరాధనోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం ఉదయం 9.30 గంటలకు మహా రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. శ్రీమఠం పీఠాఽధిపతి సుబుధేంద్ర తీర్థుల నేతృత్వంలో ఉదయం నిత్యపూజలు అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రథోత్సవం శ్రీ మఠం కారిడార్ మహాద్వారం నుంచి ప్రధాన రహదారి, పురవీధుల మీదుగా రాఘవేంద్ర సర్కిల్ చుట్టూ చేరుకుని తిరిగి శ్రీమఠం చేరుకుంటుంది. దేశం నలుమూల నుంచి భక్తులు భారీ ఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకుంటారు. అదే మహా రథోత్సవ సమయంలో హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపిస్తారు. వైభవంగా శ్రీరాఘవేంద్రుల మధ్యారాధన స్వర్ణ రథంపై రాఘవేంద్రుల ఊరేగింపు ఆకట్టుకున్న మహా పంచామృతాభిషేకం భక్తుల రద్దీతో శ్రీమఠం కిటకిట -
దొంగలను పట్టించిన స్కూటీ నంబరు ప్లేట్
కర్నూలు: స్కూటీ నంబరు ప్లేట్ ఆధారంగా ఇంటికి కన్నం వేసిన దొంగలను పోలీసులు వలపన్ని పట్టుకొని కటకటాల్లోకి పంపారు. 4వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని ఉల్చాల రోడ్డులోని ఆదిత్యనగర్‌లో జయంతి మహేశ్వరరెడ్డి నివాసం ఉంటున్నారు. జూలై 6వ తేదీ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యలతో ఊరికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి తాళాలు పగుల గొట్టి లోనికి ప్రవేశించారు. పడకగదిలో ఉన్న బీరువాను బద్దలు కొట్టి 25 గ్రాములు బంగారు నగలు, 320 గ్రాముల వెండి ఆభరణాలు మూట గట్టుకొని ఉడాయించారు. బాధితుడు జయంతి మహేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని.. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. చోరీ జరిగిన రోజు అనుమానాస్పదంగా ఆ ప్రాంతంలో తిరిగిన స్కూటీని గుర్తించి నంబరు ప్లేట్ ఆధారంగా నిందితులపై ఆరా తీశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన ఎరుకలి శివప్రసాద్, ప్రస్తుతం గుత్తిలో ఉంటున్న పామిడికి చెందిన ఎరుకలి రామాంజనేయులు, కర్నూలు ఇందిరాగాంధీ నగర్‌కు చెందిన కామ్లే కార్తీక్ ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. సీఐ విక్రమసింహ, ఎస్ఐ చంద్రశేఖర్‌రెడ్డి క్రైమ్ పార్టీ పోలీసులు సుబ్బరాయుడు, మురళీ, జీనత్, ఈశ్వర్, గోవిందు తదితరులు బృందాలుగా ఏర్పడి దొంగల కదలికలపై నిఘా ఉంచారు. కర్నూలు శివారులోని సమ్మర్ స్టోరేజీ పక్కన పొలాల్లో దొంగలు దాక్కొన్ని ఉన్నట్లు సమాచారం అందడంతో ఆదివారం వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. వారి వద్ద నుంచి 2 బంగారు చైన్లు, చిన్న పిల్లల ఉంగారాలు కలిపి 25 గ్రాముల బంగారం, 32 తులాల వెండి, దొంగతనానికి వినియోగించిన స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను న్యాయమూర్తి ఎదట హాజరు పరుచగా రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా కేసు ఛేదించిన పోలీసులు కటకటాల్లోకి ఇంటి దొంగలు 25 గ్రాముల బంగారం, 320 గ్రాముల వెండి రికవరీ -
రాకపోక.. నరకయాతన!
● అధ్వానంగా ఉరుకుంద రహదారి కౌతాళం: ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన ఉరుకుందకు వెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది. శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా ఆలయానికి 20 లక్షల నుంచి 25 లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఉత్సవాల నుంచి ఆలయానికి ఒక్క నెలలోనే రూ.10 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది. అయితే స్వామి దర్శనానికి వచ్చే భక్తులు రోడ్డు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నారు. కౌతాళం నుంచి ఉరుకుందకు ఆరు కిలోమీటర్ల రోడ్డులో వందల గుంతలు ఏర్పడ్డాయి. ఇదే రోడ్డు నుంచి శిరుగుప్ప, బళ్లారి, సింధనూరు, గంగవతి, కొప్పళ ప్రాంతాలకు వాహనాలు రాకపోకలు సాగించాల్సి ఉంది. ఈ రహదారిని బాగు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఉత్సవాలకు ముందు గుంతల్లో కంకర నింపి దానిపై తారు వేయడం మరిచారు. కనీసం గ్రావెల్ అయినా వేయకపోవడంతో రహదారి అధ్వానంగా మారింది. -
‘గంగ’ లేక బెంగ!
● ఎండిన తెలుగు గంగ ● బాబు సర్కార్ నిర్లక్ష్యమే కారణమంటూ రైతుల మండిపాటు మహానంది: వర్షాకాలం వస్తే జలసవ్వడులతో కళకళలాడాల్సిన తెలుగుగంగ కాలువ నీళ్లు లేక వెలవెలబోతోంది. శ్రీశైలం నియోజకవర్గంలో ఉన్న తెలుగుగంగ కాలువ కింద సుమారు 60 వేల ఎకరాల పంట భూములున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీళ్లున్నా చంద్రబాబు ప్రభుత్వం చుక్క నీరు కూడా విడుదల చేయకపోవడంతో కాలువ పూర్తిగా ఎండిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఎన్నో ఆశలతో మొదలుపెట్టిన పంటలు కూడా పూర్తిగా ఎండిపోయే దుస్థితి తలెత్తిందని వాపోయారు. ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేసి.. ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
కృష్ణా జిల్లా వృషభాలు విజయం
కృష్ణగిరి: మండలంలోని పెద్దొడి గ్రామంలో ఆంజనేయస్వామి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం న్యూ కేటగిరి వృషభాలకు నిర్వహించిన రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలలో కృష్ణా జిల్లా యనమలకుడూరు ఆజాద్ వృషభాలు విజేతలుగా నిలిచి రూ.40 వేల నగదు బహుమతి గెలుచుకున్నాయి. హోరాహోరీగా సాగిన పోటీల్లో తర్వాతి నాలుగు స్థానాలలో వరుసగా అనంతపురం కేసీపల్లె మీసాల కిరణ్ వృషభాలు, నంద్యాల సాంబవరం జూపల్లె ప్రభాకర రెడ్డి వృషభాలు, గద్వాల గొర్లకానిదొడ్డి కురువ కర్రప్ప వృషభాలు, నంద్యాల జిల్లా బిల్లాల పురం కొలిమి పద్మావతి ఎడ్లు నిలిచి వరుసగా రూ.30వేలు, రూ.20వేలు, రూ.10వేలు, రూ.5వేలు నగదు బహుమతులు గెలుచుకున్నాయి. విజేత వృషభ యజమానులకు నిర్వాహకులు, దాతలు బహుమతులిచ్చారు. సీఐ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ అనంతపురం సెంట్రల్: కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న సీఐ తబ్రేజ్ అహ్మద్ కారు తరచూ ప్రమాదానికి గురవుతోంది. వారం రోజుల క్రితం అనంతపురం తపోవనం సర్కిల్లో సీఐ ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటన మరువక ముందే ఆదివారం స్థానిక టవర్‌క్లాక్ సమీపంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద రెడీ టూ కాంక్రీట్ మిక్చర్ లారీ ఢీ కొట్టింది. కారు స్వల్పంగా దెబ్బతింది. ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
అమ్మవారికి పల్లకీ సేవ
శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆదివారం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవమూర్తులు ఆశీనులుగావించి వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు చేసి, మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. పూజా కార్యక్రమాల్లో దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. పోలీసులమంటూ బెదిరించి..! హొళగుంద: పోలీసులమంటూ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ వృద్ధ రైతును బెదిరించి రూ.20 వేలు కొట్టేసిన ఘటన నెరణికి గ్రామంలో చోటు చేసుకుంది. నెరణికి గ్రామానికి చెందిన బోయ కుంటి మంగన్న అనే 75 ఏళ్ల రైతు మూడు రోజుల క్రితం ఆదోనిలో పత్తి అమ్మగా వచ్చిన డబ్బులో కొన్ని అప్పులు తీర్చేశాడు. ఇంకా ఆలూరులో కిరాణ దుకాణం, ఇతర అంగట్లో ఉన్న అప్పు కట్టి మిగిలిన డబ్బుతో సంత చేసుకోవాలనుకున్నాడు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఆలూరు వెళ్లేందుకు ఆటో కోసం విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో రోడ్డుపై నిలబడ్డాడు. ఆ సమయంలో బైక్‌పై ఎల్లార్తి వైపు నుంచి ఆలూరు వైపు వెళ్తున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రైతు మంగన్న వద్ద బైక్ నిలిపి ‘తాము పోలీసులమంటూ సెల్ఫోన్లో వారు పోలీసు డ్రస్సులో ఉన్న ఫొటోలు చూపి ఇక్కడేం చేస్తున్నావంటూ బెదిరించారు. భయపడిన రైతు సంతకు వెళ్తున్నానని, తన వద్ద ఉన్న రూ.20 వేలు వారికి చూపించగా ఆ డబ్బును తీసుకొని దుండగులు బైక్‌పై పరారైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాముకాటుతో రైతు మృతి బేతంచెర్ల: మండల పరిధిలోని ఆర్ కొత్తపల్లె గ్రామానికి చెందిన గురు మోహన్ (45) అనే రైతు పొలం పనులు చేస్తుండగా పాముకాటుకు గురై మృతి చెందాడు. ఆదివారం పొలం పనులకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. వెంటనే చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు బేతంచెర్ల సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య శివలక్ష్మి, కొడుకు చక్రవర్తి, కుమార్తె గీతాంజలి ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖరప్ప తెలిపారు. దేవరగట్టులో టెంకాయల విక్రయానికి వేలం హొళగుంద: దసరా బన్ని ఉత్సవాల్లో టెంకాయల విక్రయానికి ఆదివారం దేవరగట్టులో వేలం నిర్వహించారు. ఇందులో నెరణికి గ్రామానికి చెందిన కురువ ద్యావణ్ణ రూ.4.55 లక్షలకు పాట పాడి దక్కించుకున్నాడు. ఆలయ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు కమిటీ సభ్యులైన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామపెద్దల ఆధ్వర్యంలో ఈ వేలాలు జరిగాయి. కాగా 2025లో రూ.4 లక్షలకు పలకగా , ఈ ఏడాది రూ.55 వేలు అధికంగా వచ్చిందని కమిటీ సభ్యులు తెలిపారు. -
బీడు పడ్డ కేసీ ఆయకట్టు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాయలసీమకు తిండి గింజలు.. పశువులకు పశుగ్రాసం అందించే కేసీ కాలువ ఆయకట్టు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైంది. 31.90 టీఎంసీల నీటి కేటాయింపులున్నా ఈ ఏడాది కేసీ ఆయకట్టుకు చుక్కనీరు విడుదల చేయకపోవడంతో కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లోని 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు బీడుగా మారింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని మరో 1.76 లక్షల ఎకరాల ఆయకట్టుపైనా ఈ ఏడాది తీవ్ర ప్రభావం పడనున్నది. నీళ్లొస్తాయన్న ఆశతో రైతులు వేసిన వరిపంటలు, నారుమళ్లు ఎండిపోవడంతో పెట్టుబడులు మట్టిపాలయ్యాయి. ఏటా రెండు లక్షల ఎకరాలకు పైగా వరి సాగయ్యే కేసీ ఆయకట్టు ప్రాంతంలో ఈసారి సాగు నిలిచిపోవడంతో రాయలసీమలో తిండిగింజలతోపాటు పశుగ్రాసం కొరత తీవ్రరూపం దాల్చే ప్రమాదం కనిపిస్తోంది.బీళ్లుగా మారిన పంటపొలాలు.. కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో విస్తరించిన కేసీ కాలువ పరిధిలో నేరుగా 2,65,628 ఎకరాల ఆయకట్టు ఉండగా.. పరోక్షంగా కేసీ చివరి ఆయకట్టు నీరు కడప జిల్లాలోని పెన్నానది గుండా సోమశిలకు చేరి నెల్లూరు జిల్లాలో 1.36 లక్షల ఎకరాలతోపాటు కండలేరు ద్వారా చిత్తూరు జిల్లాలోనూ 40 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతుంది. కేసీకి 31.90 టీఎంసీల నీటి కేటాయింపులున్నా ఈ ఏడాది చంద్రబాబు ప్రభుత్వం కేసీ ఆయకట్టుకు చుక్క నీరివ్వలేదు. దీంతో ఆయకట్టు మొత్తం బీడుగా మారింది. నీళ్లొస్తాయన్న ఆశతో అరకొరగా ఎదపద్ధతిలో సాగుచేసిన వరిపంటతోపాటు, నారుమళ్లు కూడా ఎండిపోయాయి. దీంతో పెట్టుబడులు నష్టపోయి అన్నదాతలు లబోదిబోమంటున్నారు. సీమలో తిండిగింజలు, పశుగ్రాసం కష్టాలు నీటికోసం రైతులు వేడుకుంటున్నా.. చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడాలేదు. కేసీకి నీళ్లిచ్చే ఆలోచన ఏమాత్రం కనిపించడంలేదు. కేసీ పరిధిలో ఏటా 2 లక్షల ఎకరాలకు పైగా రైతులు వరిపంట సాగుచేస్తున్నారు. ఈ ఏడాది కేసీకి నీళ్లివ్వకపోతే వరితోపాటు ఇతర పంటలసాగు కూడా లేకుండా పోతుంది. తిండి గింజలతోపాటు సీమలో పశుగ్రాసం కొరత తీవ్ర రూపం దాల్చనుంది. ఏటా కర్నూలు, అనంతపురం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా పరిధిలోని ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాల రైతులు కేసీ పరిధిలోని గ్రామాలనుంచి ధాన్యం, పశుగ్రాసం తీసుకు వెళ్లేవారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలతోపాటు లక్షలాది పశువులకు ఈ ఏడాది గ్రాసం దొరికే పరిస్థితి కనిపించడంలేదు. ఇప్పటికే గ్రాసం కొరతతో మూగ జీవాలను కబేళాలకు అమ్ముకుంటున్నారు.వైఎస్ జగన్ పాలనలో కేసీ కింద ఏటా రెండు పంటలు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాయలసీమలోని కేసీ, తుంగభద్ర ఎగువకాలువ, దిగువకాలువ, గోరకల్లు, అవుకు, గండికోట, బ్రహ్మంసాగర్, మైలవరం, చిత్రావతి, అన్నమయ్య, సోమశిల, కండలేరుతో సహా అన్ని సాగునీటి వనరులను నీటితో నింపారు. ఐదేళ్లపాటు పంటలకు అదునులో నీళ్లిచ్చారు. దీంతో రైతులు కేసీ పరిధిలో ఎకరాకు 40 బస్తాలు (75 కిలోలు) లెక్కన 30 క్వింటాళ్ల ధాన్యం పండించారు. ఈ లెక్కన 2లక్షల ఎకరాల్లో ఒక పంటకు 60 లక్షల క్వింటాళ్ల చొప్పున రెండు పంటలకు 1.20 కోట్ల క్వింటాళ్ల ధాన్యం పండించారు. బస్తా ధాన్యం రూ. 2,500 నుంచి రూ.3 వేల వరకూ ధరపలికింది. సీమలో తిండిగింజలు, పశుగ్రాసం కొరతలేకుండా పోయింది.వరిపంట మొత్తం ఎండిపోయిందిఐదు ఎకరాల సొంత భూమితో పాటు మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నా. ట్రాక్టర్లతో దుక్కి దున్ని వరి పంట సాగు చేశాను. కేసీ కెనాల్‌కు సాగు నీరు రాకపోవడంతో ఐదు ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది. ఇప్పటికే ఎకరాకు రూ. 15,000 చొప్పున రూ. 75000 పెట్టుబడి పెట్టాను. మొత్తం నష్టపోవాల్సి వచ్చింది. – పల్లె వెంకట సుబ్బారెడ్డి, రైతు, ఈర్నపాడు గ్రామం, బండి ఆత్మకూరు మండలం, నంద్యాల జిల్లా.పెట్టుబడి మొత్తం నష్టపోయాంకేసీ కెనాల్ ఆయకట్టు కింద ఐదు ఎకరాల ఆలయ మాన్యం భూమి, రెండున్నర ఎకరాలు కౌలు భూముల్లో వరి సాగు చేస్తున్నాను. ఎకరాకు రూ.18వేల చొప్పున మొత్తం రూ.1.30లక్షల దాకా ఖర్చు పెట్టాను. వర్షాలు కురవక పోవడం, కేసీకి సాగునీరు రాకపోవడంతో వరి పైరు మొత్తం ఎండిపోతోంది. – సూరిపల్లి మధుబాబు గౌడ్, కానాల గ్రామం, నంద్యాల మండలంభూములన్నీ బీడు పడ్డాయిఈ ఏడు వర్షాలు కురవలేదు. కేసీ కెనాల్ నీళ్లన్నా ఇస్తారనుకుంటే ప్రభుత్వం చుక్కనీరివ్వలేదు. దీంతో భూములన్నీ బీడు పడ్డాయి. వైఎస్ జగన్మోహన్నెడ్డి హయాంలో కేసీ కాలువకు ఐదేళ్లు వరుసగా నీళ్లిచ్చారు. ఏటా రెండు పంటలు పండించుకున్నాం. – ఆంజనేయులు, రైతు, సిద్దారెడ్డిపల్లె, చాపాడు మండలం, వైఎస్సార్ జిల్లా -
హైకోర్టు బెంచ్ సాధనే లక్ష్యం
కర్నూలు: హైకోర్టు బెంచ్ సాధనే లక్ష్యంగా ఉద్యమం మరింత ఉధృతం చేయనున్నట్లు న్యాయవాదులు ప్రకటించారు. కర్నూలులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల ఆందోళన కొనసాగుతోంది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు నేతృత్వంలో విధుల బహిష్కరణతో పాటు రిలే నిరాహారదీక్షలు నిర్వహిస్తున్నారు. శనివారం ఈ దీక్షలో మామిళ్ల విక్టర్, కృష్ణప్రసాద్, శ్రీనివాసులు గౌడ్, ఎ.శ్రీనివాసులు, రాము, ఎండీ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆరు రోజులుగా నిరాహారదీక్షలు కొనసాగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు తెలిపారు. సెప్టెంబర్ 3వ తేదీ వరకు విధుల బహిష్కరణ కొనసాగిస్తామని ప్రకటించారు. జిల్లా న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రసూల్ ఖాన్, సీనియర్ న్యాయవాదులు రామ సుబ్బారెడ్డి, నాగేంద్రనాథ్, కె.ఓంకార్, వై.జయరాజ్, వి.నాగలక్ష్మి దేవి, ఎంఆర్ కృష్ణ, జూనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని దీక్ష చేస్తున్న న్యాయవాదులకు మద్దతు ప్రకటించారు. -
మంత్రాలయంలో బంగారు నగల అపహరణ
● మహిళ బ్యాగ్‌లో నుంచి 35 తులాల బంగారు ఆభరణాలు చోరీమంత్రాలయం: ప్రముఖ ఆధ్మాత్మిక క్షేత్రం మంత్రాలయంలో భారీ చోరీ జరిగింది. రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తుండగా ఓ వైపు దొంగలు రెచ్చిపోతున్నారు. శనివారం రాఘవేంద్రుడి ఉత్సవాల నిమిత్తం విచ్చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అసిస్టెంట్ ఇంజినీర్ దివాకర్ భార్య కవిత బ్యాగ్‌లో ఉన్న 35 తులాల బంగారిన్ని ఆపహరించారు. స్థానిక అన్నపూర్ణ భోజనశాల నుంచి శ్రీనికేతన్ లాడ్జి షాపింగ్ కాంప్లెక్స్‌లో షాపింగ్ చేస్తుండగా ఈ చోరీ చోటు చేసుకుంది. ఆదోనిలో బంధువుల పెళ్లి నిమిత్తం బాధితురాలు ఆభరణాలు తన వెంట తెచ్చుకున్నారు. నగల విలువ దాదాపు రూ. 52.50 లక్షలు ఉంటుంది. ఇదిలా ఉండగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి పోలీసులకు దృష్టికి తీసుకెళ్లినా కేసు నమోదు చేయకపోవడం శోచనీయం. సీసీ కెమెరాల పరిశీలన పేరుతో అర్ధరాత్రి గడిచిన కేసుపై మీనమేషాలు లెక్కిస్తూ వచ్చారు. ఈ విషయం సీఐ దస్తగిరి బాబును వివరణ కోరగా.. దర్యాప్తు చేస్తున్నామన్నారు. అలాగే కోయంబత్తూర్ చెందిన భక్తులు శ్రీమఠం రూమ్ అద్దెకు తీసుకున్నారు. వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్, రైల్వే టికెట్స్, మనీ పర్స్‌తో పాటు అందులో ఉన్న నగదు రూ.2 వేలు ఆపహరణకు గురయ్యాయి. దీంతో బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా శ్రీ మఠంలో సీసీ ఫుటేజీ పరిశీలించారు. -
భక్తుల భద్రతే లక్ష్యం
మంత్రాలయం రూరల్: శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాల్లో భక్తుల భద్రతే లక్ష్యమని ఎస్పీ విక్రాంత్‌పాటిల్ పేర్కొన్నారు. శనివారం తుంగభద్ర నదీ తీర ప్రాంతాలు, భక్తుల క్యూలైన్లు, శ్రీ మఠంలో సీసీ కెమెరాల పర్యవేక్షణను పరిశీలించారు. ఉత్సవాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ స్థలాల్లో వాహనాలను నిలుపుకోవాలన్నారు. భక్తుల దర్శనం సజావుగా జరిగేటట్లు ఏర్పాట్లు చేయాలని సీఐలు మధుసూదన్‌రావు, దస్తగిరి బాబు, రామాంజులును ఆదేశించారు. సచివాలయాల్లో ప్రతి రోజూ పీజీఆర్ఎస్ కర్నూలు(అర్బన్): జిల్లాలోని స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు సచివాలయాల్లో ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పీజీఆర్ఎస్ నిర్వహించాలని జిల్లా అధికారి టీవీ భాస్కర్‌నాయుడు ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా పరిషత్‌లోని తన కార్యాలయంలో మండల/అర్బన్ సచివాలయాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో విధులు ముగించుకొని తప్పనిసరిగా పీజీఆర్ఎస్కు హాజరు కావాలన్నారు. సచివాలయాల్లోని ఉద్యోగులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారనే ఫిర్యాదులు వస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అన్నదాతను ఆదుకుందాం!
కర్నూలు(అర్బన్): ‘తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఈ ఏడాది ఉమ్మడి కర్నూలు జిల్లాలో రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయారు. వేసిన అరకొర పంటలు కూడా తొంభై శాతం దెబ్బతిన్నాయి. చాలా మంది పంటలను దున్నేస్తున్నారు. ఖరీఫ్ కలిసిరాక తీవ్రంగా నష్టపోయిన రైతులను పాడి రూపంలో ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంద’ని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్‌లోని మినీ సమావేశ భవనంలో స్థాయీ సంఘ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు పశు సంవర్ధక శాఖ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పాడి పరంగా రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. పశు సంపదను పెంచుకునేందుకు ప్రభుత్వ పరంగా సహకారం అందించాలన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద పనిదినాలు పెంచాలన్నారు. ప్రస్తుతం 125 పనిదినాలు ఉన్నాయని, రోజుకు 25 వేల మంది కూలీల హాజరవుతున్నారని, వ్యవసాయ పనుల్లేక పోవడం దీనికి కారణమని డ్వామా అదనపు పీడీ మాధవీలత చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాలోని రైతు లు, వ్యవసాయ కూలీలను ఆదుకునేందుకు అవసరమైన పనులను మరింత పెంచాలని కోరారు. ఖరీఫ్‌నకు నీరివ్వకపోవడం దురదృష్టకరం పక్క రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర, శ్రీశైలం జలాశయాలకు నీరు పుష్కలంగా వచ్చి చేరినా, ఖరీఫ్‌కు నీరు ఇవ్వలేమని చెప్పడం దురదృష్టరమని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత నెలలో హెచ్ఎన్ఎస్ఎస్కు నీటిని విడుదల చేసినా, నేటికి జిల్లాలోని చెరువులను నింపుకోకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. హంద్రీనీవా నీటిని కేవలం తాగునీటి అవసరాలకు ఉపయోగించాలకున్నప్పుడు 77 చెరువులను నింపితే భూగర్భ జలాలు రీచార్జ్ అయ్యే అవకాశం ఉంది కదా? అని ఆయన అధికారులను ప్రశ్నించారు. కోడుమూరు, డోన్, పత్తికొండ ప్రాంతాల ప్రజల తాగునీటి అవసరాలకు గాజులదిన్నె నీటిని వినియోగించాల్సి ఉన్నప్పుడు జీడీపీకి ఎందుకు హంద్రీనీవా నీటితో నింపడం లేదన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలను ఎండగట్టి ఎవరి ప్రయోజనాల కోసం వెలిగొండకు నీటిని తీసుకుపోతున్నారని పాపిరెడ్డి ప్రశ్నించారు. కోడుమూరు, వెల్దుర్తి, కాల్వ హుసేనాపురం, గడివేముల, వెలుగోడు వరకు రోడ్ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తే జాతీయ రహదారుల్లో ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉందని చెప్పారు. సమావేశాల్లో జెడ్పీసీ ఈఓ సుధాకర్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు మహేశ్వరరెడ్డి, సీహెచ్ మనోహర్, సాంఘిక సంక్షేమ శాఖ కర్నూలు, నంద్యాల జిల్లాల అధికారులు బి. రాధిక, ఎంవీ శివారెడ్డి, ఎస్జీఎస్డబ్ల్యూ జిల్లా అధికా రి టీవీ భాస్కర్‌నాయుడు పాల్గొన్నారు. జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో ఎవరేంమాట్లాడరంటే.. ● ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామ రోడ్డుకు ఇరువైపులా బంక మట్టి వేయడంతో చాలా ఇబ్బందిగా ఉంది. – శంకర్‌రెడ్డి, జెడ్పీటీసీ ఆత్మకూరు ● కోడుమూరు – వెల్దుర్తి రోడ్డు పనులను ఎప్పుడు పూర్తి చేస్తారు? ఏడాదిన్నరగా ఈ పనులు జరుగుతూనే ఉన్నాయి. – బి రఘునాథరెడ్డి, జెడ్పీటీసీ, కోడుమూరు ● 50 సంవత్సరాల పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెన్షన్లు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఇవ్వలేదు. – డి.సుంకన్న, జెడ్పీటీసీ, వెల్దుర్తి ● శిథిలావస్థకు చేరిన దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు 20 శాతం దాతలు చెల్లిస్తే, 80 శాతం నిధులు ప్రభుత్వం సమకూరుస్తుందనే అంశంపై అవగాహన కల్పించాలి. – జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి పంటల రూపంలో నష్టపోయిన రైతులకు పాడి ద్వారా ఊరట కలిగిద్దాం టీబీ డ్యాం, శ్రీశైలంలో ఇన్‌ఫ్లో ఉన్నా ఖరీఫ్‌నకు నీరివ్వకపోవడం దురదృష్టకరం వెలిగొండలో నీరు నింపేందుకు రెండు జిల్లాలను ఎండగడుతున్నారు -
రంగనాథుడి పట్టువస్త్రాల సమర్పణ
పూర్వారాధన వేడుక సందర్భంగా తమిళనాడు శ్రీరంగపట్నం శ్రీరంగనాథ స్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలు సమర్పించారు. స్థానిక మహా ముఖద్వారం నుంచి రంగనాథుడి పట్టువస్త్రాలతో ఊరేగింపుగా శ్రీమఠం చేరుకున్నారు. స్వామిజీ పట్టువస్త్రాలను పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా స్వీకరించారు. రాఘవేంద్రుల మూల బృందావనం చేరుకుని పట్టు వస్త్రాలకు విశేష పూజలు నిర్వహించారు. ఊంజల మంటపంలో రంగనాథుడి ఆలయ పండితులను సన్మానించారు. పట్టువస్త్రాల సమర్పణ వెనుక దాగిన చరిత్రను స్వామిజీ భక్తులకు ప్రవచించారు. -
పట్టుసాగుకు సెంట్రల్ సిల్క్ బోర్డు రాయితీలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో పటు సాగును ప్రోత్సహించేందుకు సెంట్రల్ సిల్క్ బోర్డు ఆధ్వర్యంలో నా పట్టు– నా అభిమానం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి విజయకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టుసాగుకు ఇస్తున్న రాయితీలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ...ఇప్పటి వరకు వెల్దుర్తి, ఆదోని, పత్తికొండ, కల్లూరు, గూడూరు మండలాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, మిగిలిన మండలాల్లో కూడా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పట్టుపురుగుల పెంపకానికి ఇది వరకు భారీ ఖర్చుతో షెడ్లు నిర్మించుకోవాల్సి ఉందని, ప్రస్తుతం తక్కువ ఖర్చులతో పట్టు పురుగుల పెంపకానికి సెంట్రల్ సిల్క్ బోర్డు గుడిసెలు నిర్మించుకునేందుకు రూ.2.25 లక్షలు రాయితీ ఇస్తుందని తెలిపారు. ఈ ఏడాది 12 గుడిసెలు మంజారయ్యాయని వివరించారు. కారు బోల్తా.. ప్రొద్దుటూరు వాసి దుర్మరణం ఓర్వకల్లు: మండలంలోని నన్నూరు గ్రామ సమీపంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదురుగా, జాతీయ రహదారిపై వెళుతున్న కారు బోల్తా పడిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఎస్ఐ సునీల్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఇద్రుష్బాష(56), తన భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి శనివారం కారులో హైదరాబాద్‌కు వెళ్తున్నాడు. మార్గం మధ్యలో నన్నూరు సమీపాన కుమారుడు షంషీర్ఖాజా కారు నడుపుతుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్రుష్బాష తలకు బలమైన రక్తగాయం కావడంతో హైవే అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి బొమ్మలసత్రం: నంద్యాల మండలం అయ్యలూరు మెట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. తాలూకా సీఐ ఈశ్వరయ్య తెలిపిన వివరాల మేరకు.. చాబోలు గ్రామానికి చెందిన శ్రీనివాసులు, కుమారి (38) దంపతులకు ఇద్దరు కుమారులు. శ్రీనివాసులు పాలిష్ కటింగ్ కార్మికునిగా, కుమారి వ్యవసాయ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఉదయం మహానంది మండలం నందిపల్లె గ్రామంలో వ్యవసాయ పనులు చేసేందుకు భార్యాభర్తలు స్కూటీపై బయలుదేరారు. మార్గమధ్యలో అయ్యలూరు మెట్ట వద్ద టిప్పర్ వేగంగా వచ్చి స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కూటీ వెనుక కూర్చున్న కుమారి రోడ్డుపై పడిపోవడంతో టిప్పర్ టైర్లు ఆమైపె నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. భర్త స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బైక్ ఢీకొనియువకుడి దుర్మరణం చాగలమర్రి: పెద్ద బోధనం సమీపంలోని పాత వంతెన వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. చిన్నబోధనం గ్రామానికి చెందిన ప్రశాంత్ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు వెళ్తుండటంతో అతని మిత్రులు అదే గ్రామానికి చెందిన మీసా సంపత్ కుమార్ (23), అన్నవరం శివ బైక్‌పై వెళ్లి ఆళ్లగడ్డలో బస్సు ఎక్కించారు. అనంతరం ఇద్దరు తిరిగి వస్తుండగా పెద్ద బోధనం సమీపంలో ఉన్న సర్వీసు రోడ్డు వద్ద శివ మూత్ర విసర్జనకు వెళ్లగా, సంపత్ కుమార్ బైక్ వద్ద ఉన్నాడు. అదే సమయంలో చింతకొమ్మదిన్నె వైపు నుంచి మైల ఓబు లేసు, నాగేంద్ర బైక్‌పై వస్తూ సంపత్ కుమార్‌ను ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన సంపత్‌కుమార్‌ను స్థానికులు టోల్‌ప్లాజా అంబులెన్సులో ఆళ్లగడ్డకు తరలించగా కోలుకోలేక మృతి చెందినట్లు చాగలమర్రి ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు. మృతుడి తండ్రి మత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి, కేసు విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
మద్దిలేటయ్యలో శ్రావణ సందడి
బేతంచెర్ల: ప్రముఖ వైష్ణవ పుణ్య క్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయం శనివారం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆయా ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు చర్యలు చేపట్టారు. రేపు ప్రభుత్వ ఉద్యోగుల సహకార గృహ నిర్మాణ సంఘం ఎన్నికలు కర్నూలు(అగ్రికల్చర్): ది కర్నూలు ప్రభుత్వ ఉద్యోగుల సహకార గృహ నిర్మాణ సంఘం నూతన పాలక వర్గాన్ని ఎన్నుకునేందుకు ఈ నెల 31వ తేదీ ఉదయం 10 గంటలకు సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి, సహకార శాఖ కర్నూలు సబ్ డివిజన్ అసిస్టెంటు రిజిస్ట్రార్ నాగరమణయ్య తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కృష్ణానగర్‌లోని శ్రీనివాస మందిరం కళ్యాణ మండపంలో చేతులెత్తే పద్ధతి ద్వారా నూతన పాలక వర్గం ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నిక కార్యక్రమానికి సంఘం సభ్యులందరు హాజరు కావాలని చెప్పారు. కర్నూలు డివిజనల్ డీడీగా భవాని శంకర్రెడ్డికర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధక శాఖ కర్నూలు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్‌గా భవాని శంకర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం కర్నూలు డివిజన్ కార్యాలయంలో సహాయ సంచాలకులుగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం డివిజనల్ డీడీగా విధులు నిర్వహిస్తున్న వసంతలక్ష్మి ఈ నెల 31న స్వచ్ఛంద పదవీ విరమణ చేయనున్నారు. ఖాళీ అవుతున్న ఈ పోస్టులో పూర్తి అదనపు బాధ్యతలతో భవాని శంకర్‌రెడ్డిని నియమిస్తూ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
జిల్లాలో న్యాయవిజ్ఞాన క్లబ్‌లు
కర్నూలు: జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి ఆదేశాల మేరకు జిల్లాలో న్యాయవిజ్ఞాన క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. కర్నూలులోని మున్సిపల్ హైస్కూల్, ఏపీఎస్పీ రెండో బెటాలియన్ క్యాంప్, వీఆర్ కాలనీలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్లో శనివారం న్యాయ విజ్ఞాన క్లబ్‌లను ఏర్పాటు చేశారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి ఈ క్లబ్‌లను ప్రారంభించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రాథమిక న్యాయ హక్కులు, న్యాయ సేవలపై అవగాహన కల్పిస్తూ ఉచిత న్యాయ సహాయం కోసం టోల్‌ఫ్రీ నెంబర్ 15100 ప్రాముఖ్యతను ఈ సందర్భంగా వివరించారు. ముగిసిన శిక్షణా కార్యక్రమం... జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో మధ్యవర్తులకు 40 గంటల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది. న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కబర్ధి, కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి ఈ సందర్భంగా మధ్యవర్తులకు ధృవపత్రాలను అందజేశారు. శిక్షణ పొందిన మధ్యవర్తులు అవసరమైన వారికి నాణ్యమైన న్యాయ సేవలందించేలా కృషి చేయాలని కబర్ధి సూచించారు. న్యాయాధికారులతో వర్చువల్ సమావేశం... సెప్టెంబర్ 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో సివిల్, క్రిమినల్ కేసులను పెద్ద సంఖ్యలో పరిష్కరించాలని లీలా వెంకటశేషాద్రి అన్నారు. జిల్లాలోని కర్నూలు మినహా ఇతర న్యాయస్థానాల న్యాయాధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించేలా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలన్నారు. -
సింహ వాహనంపై సిద్ధగురుడు
మంత్రాలయం: మంగళ వాయిద్యాల సుస్వర నాదాలు, కర్ణాటక డప్పు దరువులు, పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తజనం కోలాహలం మధ్య శ్రీ ప్రహ్లాదరాయుడు సింహవాహనంపై కొలువుదీరాడు. జయజయ ధ్వానాల మధ్య శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో కడు వైభవంగా ఊరేగారు. శ్రీరాఘవేంద్ర స్వామి ఆరాధన సప్త రాత్రోత్సవాల్లో భాగంగా శనివారం పూర్వారాధన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో సుప్రభాత సేవతో వేడుకలు ప్రారంభమయ్యాయి. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులకు ఊంజల మండపంలో ఊంజల, దివిటీ సేవలు జరిపారు. అనంతరం ప్రహ్లాదరాయలును సింహవాహనంపై శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. విశేషంగా పూర్వారాధన శాస్త్రోక్తంగా సాగిన పూర్వారాధన వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్వామిజీ ఆశీస్సులతో రాఘవేంద్రుల మూల బృందావనానికి నిర్మల్య విసర్జన, పుష్పార్చన, విశేష పంచామృతాభిషేకంతో పాటు పుష్పాలంకరణ చేశారు. రాయరు, మూల, జయ, దిగ్విజయ రాముల సంస్థాన పూజలో స్వామిజీ తరించారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు పూర్వారాధన సందర్భంగా యోగీంద్ర మంటపంలో చేపట్టిన కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బెంగళూరుకు చెందిన కడబ శ్రీనివాస్ సంగీత విభావరి, బెంగళూరు అనురాగ కళా గురుకుల బృందాం భరతనాట్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. వేడుకలో ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 వెంకటేష్‌జోషి, మేనేజర్–3 శ్రీపతి ఆచార్, మేనేజర్–4 సురేష్ కోనాపూర్, ధార్మిక సహాయకాధికారి వ్యాసరాజాచార్ పాల్గొన్నారు. -
రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలి
● బ్యాంకర్లను ఆదేశించిన కలెక్టర్ డాక్టర్ ఏ.సిరికర్నూలు(సెంట్రల్): రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యా రుణాల విషయంలో బ్యాంకులు మరింత చొరవ చూపాలన్నారు. గృహ నిర్మాణం కోసం కేవలం 12.45 శాతం మాత్రమే రుణాలు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి రుణాల పురోగతి ఆశించిన స్థాయిలో లేదని, అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) రుణాల పంపిణీలో బ్యాంకులు మరింత చొరవ చూపాలన్నారు. రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం పశుపోషణ కోసం రుణాలు ఇవ్వాలన్నారు. సెప్టెంబర్ నెలాఖరులోగా పీఎం విశ్వకర్మ కింద పెండింగ్‌లో ఉన్న రుణాలు మంజూరు చేయాలన్నారు. పీఎంఈజీపీ కింద కింద రుణ దరఖాస్తుల తిరస్కరణలు అధికంగా ఉండడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ రూఫ్‌టాప్‌ల ఏర్పాటును ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో ఆర్బీఐ లీడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ రవీంద్రబాబు, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పి.మోహన్, నాబార్డ్ డీడీఎం ఎం.సుబ్బారెడ్డి, కెనరా బ్యాంకు ఆర్ఎం సుశాంత్ కుమార్, కేడీసీసీబీ సీఈఓ రామాంజనేయులు పాల్గొన్నారు. -
మృతుడి కుటుంబానికి న్యాయం చేయండి
కోడుమూరు రూరల్/గూడూరు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబీకులు గూడూరులో శనివారం సాయంత్రం ఆందోళనకు దిగారు. గూడూరుకు చెందిన ఎర్రన్న (40) అనే వ్యక్తి స్నేహితుడితో కలిసి వ్యక్తిగత పనిమీద శుక్రవారం బైక్‌పై కర్నూలుకు వెళ్లారు. అదే రోజు రాత్రి తిరిగి వస్తుండగా కర్నూలు నగర శివార్లలోని సెయింట్ క్లారెట్ స్కూల్ వద్ద ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందాడు. కాగా ఎర్రన్న మృతికి ట్రాక్టర్ డ్రైవరే కారణమంటూ మృతుడి కుటుంబ సభ్యులు శనివారం మృతదేహంతో గూడూరు నుంచి ట్రాక్టర్ డ్రైవర్ స్వగ్రామమైన మునగాల వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని నిలువరించడంతో మృతుడి కుటుంబ సభ్యులు నాలుగురోడ్ల కూడలిలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. న్యాయం చేసేంత వరకు ఆందోళన విరమించేది లేదంటూ భీష్మించారు. ఎమ్మిగనూరు–కర్నూలు రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయా యి. ఎస్ఐ రాజకుళ్లాయప్ప బాధితులతో మాట్లాడినప్పటికీ వారు ససేమిరా అన్నారు. కోడుమూరు సీఐ తబ్రేజ్ గూడూరు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించి అక్కడి నుంచి మృతదేహాన్ని తీసు కుని వెళ్లిపోయారు. కాగా గంటకుపైగా మృతుడి కుటుంబ సభ్యులు నాలుగు రోడ్ల కూడలిలో ఆందోళన చేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.


