కర్నూలు(సెంట్రల్): జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. మొత్తం 37,331 మంది విద్యార్థుల కోసం 160 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో పదో తరగతి పరీక్షలపై ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ వరకు జరగనున్నాయన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లకు సంబంధించి డిపార్టుమెంటల్ అధికారులు, చీఫ్ సూపరిటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, ఫ్లైయింగ్ స్క్వాడ్‌లను నియమించి తగిన శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. సమస్యాత్మక కేంద్రాలపై సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచినట్లు చెప్పారు.
సెల్‌ఫోన్లు నిషేధం
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుల్లో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ షాపులు, ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేసేలా చర్యలు తీసకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఓఆర్‌ఎస్, మంచినీరు, మందులతో కూడిన ఉచిత వైద్య శిబిరాలను అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఏపీఎస్‌ఆర్‌టీసీ ద్వారా పదో తరగతి విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు చెప్పారు. ఇందుకోసం విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను చూపితే చాలని సూచించారు. ప్రశ్నపత్రాలను 34 పోలీసు స్టేషన్లలో భద్రపరిచామన్నారు. వీటిని ప్రతి రోజు ఉదయం 8 నుంచి 8.30గంటల మధ్య కేంద్రాలను చేరుస్తామన్నారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్ల సెల్‌ఫోన్‌లు కూడా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమన్నారు. విద్యార్థులు విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా కేంద్రాల్లోకి తీసుకెళ్లడానికి వీలు లేదని చెప్పారు. కార్యక్రమంలో డీఈఓ సుధాకర్ పాల్గొన్నారు.
నేడు అక్షరాంధ్ర అభ్యాసకులకు పరీక్షలు
అక్షరాంధ్ర కార్యక్రమంలో విద్యను అభ్యసించిన వారికి ఆదివారం పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. శనివారం ఆమె తన కార్యాలయం నుంచి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 1,62,235 మంది పరీక్షలు రాసేందుకు అనువుగా మొత్తం 1368 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇన్విజిలేటర్లుగా పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లను నిమించినట్లు చెప్పారు. టెలీ కాన్ఫరెన్స్‌లో వయోజన విద్యా శాఖ డెప్యూటీ డైరక్టర్ చంద్రశేఖరరెడ్డి, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి, మెప్మా పీడీ శ్రీనివాసులు, ఐసీడీఎస్ పీడీ విజయ పాల్గొన్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద
144 సెక్షన్ అమలు
హాల్‌టిక్కెట్ చూపితే విద్యార్థులకు
ఉచిత ప్రయాణం
విలేకరుల సమావేశంలో
కలెక్టర్ డాక్టర్ ఏ సిరి


