ఎమ్మిగనూరుసెంట్రల్: బనవాసి గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్‌మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రజిత తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ ఎంపీసీలో 60 సీట్లు, బైపీసీలో 40 సీట్లు, ఎంపీసీలో 30 సీట్లు ఖాళీగా ఉన్నాయని, కళాశాల వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
విద్యుత్ బిల్లుల నకిలీ సందేశాలను నమ్మొద్దు
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు పంపుతున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని ఏపీఎస్‌పీడీసీఎల్ చైర్మన్, సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. మీ విద్యుత్ బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరిస్తూ మరిన్ని వివరాలకు ఈ నెంబర్‌ను సంప్రదించాలని కొందరు వినియోగదారులకు సందేశాలు వస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ బిల్లులు, సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఏపీఎస్‌పీడీసీఎల్ అధికారిక మార్గాల ద్వారా మాత్రమే తెలియజేస్తుందన్నారు. వినియోగదారులు విద్యుత్ సమస్యలపై టోల్‌ఫ్రీ నెం.1912 లేదా 1800 425 155333కు కాల్ చేయవచ్చని, లేదా 91333 31912 నెంబరుకు చాట్ చేయవచ్చని సూచించారు.
యువకుడు ఆత్మహత్య
బనగానపల్లె: పట్టణంలోని తెలుగుపేటలో ఓ యువకుడు ఆత్యహత్య చేసుకున్నట్లు పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఆయన వివరాల మేరకు పది నెలల క్రితం వడ్డే చెంచయ్య తన కుమారుడు వడ్డె హేమంత్‌కుమార్ (19) కోసం ఫైనాన్స్ ద్వారా బైక్ కొనుగోలు చేశాడు. అయితే ఫైనాన్స్ కంతులు చెల్లించడంలో జాప్యం జరగడంతో ఫైనాన్స్ సిబ్బంది బైక్‌ను తీసుకెళ్లారు. ఈ విషయంలో తండ్రి, కుమారుడు తరచూ ఘర్షణ పడుతూ వచ్చారు. దీంతో మనస్తాపం చెందిన హేమంత్‌కుమార్ శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
గిరిజనుడిపై ఎలుగుబంటి దాడి
కొత్తపల్లి: ఓ గిరిజన వృద్ధుడిపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండల పరిధిలోని గువ్వలకుంట్ల గ్రామ పంచాయతీలోని మజారా గ్రామమైన చదరంపెంట గూడెం వాసి అయిన నిమ్మల పెద్ద అంకన్న అనే గిరిజన వృద్ధుడు సాయంత్రం స్నానం చేసి దుస్తువులు శుభ్రం చేసుకునేందుకు గూడెంకు పక్కనే ఉన్న గొరిసెల కాల్వకు వెళ్లాడు. అక్కడ స్నానం చేస్తున్న సమయంలో అటవీలోంచి ఓ ఎలుగుబండి అకస్మాత్తుగా వచ్చి దాడి చేసింది. ఈ దాడిలో అంకన్న కుడి, ఎడమ చేతులు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఎలుగుబంటి బారి నుంచి అంకన్న బయటపడి గూడెం చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. అంకన్నకు అటవీశాఖ నుంచి ఆర్థిక సహాయం అందించాలని గిరిజనులు కోరుతున్నారు.


