● శ్రీశైలానికి పోటెత్తిన కన్నడ భక్తులు
● నేటితో ముగియనున్న స్పర్శదర్శనం
‘హే..మల్లయ్య...హే.. శ్రీగిరి మల్లయ్య యుగే యుగే’.. అంటూ కన్నడ భక్తులు శివనామస్మరణ చేస్తున్నారు. కంబి(పల్లకీ)లు మోసుకుంటూ పాదయాత్రగా తరలివస్తున్నారు. పల్లకీల ముందు తప్పెట దరువులకు రంగులు చల్లుకుంటూ, చిందులు వేస్తూ మల్లన్నను కీర్తిస్తున్నారు. కన్నడ భక్తుల నృత్యాలతో శ్రీగిరి క్షేత్రం మరింత ఉత్సవ శోభను సంతరించుకుంది. ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని తరలివస్తున్న కన్నడ భక్తులతో శనివారం శ్రీగిరి క్షేత్రం జనసంద్రంగా మారింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన వేలాది మంది కన్నడ భక్తులు శ్రీశైలం చేరుకుంటున్నారు. దీంతో శ్రీశైల క్షేత్రం కన్నడ భక్తజన సంద్రంగా మారింది. మల్లన్న స్పర్శదర్శనం నేటితో (ఆదివారం) ముగియడంతో కన్నడ భక్తులు అధికసంఖ్యలో శ్రీగిరి చేరుకుంటున్నారు. వేలాది మంది భక్తులు నల్లమల అడవుల్లో పాదయాత్రగా తరలివస్తున్నారు. వృద్దులు, మహిళలు, చంటిపిల్లల తల్లులు సైతం పాదయాత్ర చేసుకుంటూ తరలివస్తున్నారు. – శ్రీశైలం టెంపుల్
కంబి(పల్లకీ)ని
మోసుకుంటూ..


