‘చరిత్రలో ఇదే తొలిసారి’: లోక్‌సభలో రాహుల్‌ ఆగ్రహం | Parliament Budget Session Ombirla Loksabha Discussion Rahul gandhi | Sakshi
Sakshi News home page

‘చరిత్రలో ఇదే తొలిసారి’: లోక్‌సభలో రాహుల్‌ ఆగ్రహం

Mar 11 2026 1:18 PM | Updated on Mar 11 2026 1:46 PM

Parliament Budget Session Ombirla Loksabha Discussion Rahul gandhi

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడతలో రాజకీయ సెగలు మరింతగా రాజుకున్నాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సభలో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించడంతో గందరగోళం నెలకొంది. చర్చ సందర్భంగా అధికార పక్ష సభ్యులు పదేపదే తన పేరును ప్రస్తావించడంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ప్రతిపక్ష నేతను సభలో మాట్లాడనివ్వకుండా అడ్డుకోవడం ఇదే తొలిసారి అని ఆయన మండిపడ్డారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ సభను పక్కదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.

సభాపతి ఓం బిర్లా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని విపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అవిశ్వాస తీర్మానంపై ఫిబ్రవరిలోనే సుమారు 118 మంది ఎంపీలు సంతకాలు చేయగా, దీనిపై చర్చకు 10 గంటల సమయాన్ని కేటాయించారు. తీర్మానం నెగ్గాలంటే విపక్షాలకు సాధారణ మెజారిటీ అవసరం. అయితే, స్పీకర్ ఎన్నడూ పక్షపాతంగా వ్యవహరించలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. విపక్షంలోని 50 మందికి పైగా ఎంపీలు వ్యక్తిగతంగా తనను కలిసి, ఈ తీర్మానంతో తాము ఏకీభవించడం లేదని, కేవలం ఒత్తిడి మేరకే సంతకాలు చేశామని చెప్పారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

వంట గ్యాస్ కొరతపై..
దేశంలో వంట గ్యాస్ (ఎల్పీజీ) కొరతను నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో విపక్ష నేతలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతిని, గ్యాస్ ధరలు పెరగడమే కాకుండా సామాన్యులకు సిలిండర్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని సిపిఐ ఎంపీ సంతోష్ కుమార్ రాజ్యసభలో వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. 2019 నుంచి లోక్‌సభలో ‘డిప్యూటీ స్పీకర్’ పదవి ఖాళీగా ఉండటం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ఆరోపించింది. గతంలో స్పీకర్‌పై తీర్మానం ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ సభను నడిపించేవారని, కానీ ప్రస్తుతం ఆ వ్యవస్థే లేకుండా పోయిందని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. కాగా ఇరాన్ తదితర గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతల కారణంగా చిక్కుకుపోయిన వెయ్యి మందికి పైగా భారతీయ మత్స్యకారులను వెంటనే స్వదేశానికి తీసుకురావాలని కన్యాకుమారి ఎంపీ విజయ్ వసంత్ డిమాండ్‌ చేశారు.

ఇది కూడా చదవండి: పప్పన్నం పెట్టకుండా 10 వేల పెళ్లిళ్లు?
 

Advertisement
 
Advertisement
Advertisement