లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ ఆరోపణలు
అవిశ్వాస తీర్మానంపై సభలో మొదలైన చర్చ
స్పీకర్ అందరికీ సమాన అవకాశాలిచ్చారన్న ప్రభుత్వం
హోంమంత్రి అమిత్ షా ప్రసంగంతో తీర్మానంపై నేడు ముగియనున్న చర్చ
స్పీకర్ తటస్థంగా వ్యవహరిస్తారని అందరూ ఆశిస్తారు. కానీ ఓం బిర్లా పక్షపాతంతో వ్యవహరించారు. ప్రతిపక్ష నేత ప్రసంగాన్ని ఆయన ఎన్నోసార్లు అడ్డుకున్నారు. ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగానే మరో సభ్యుడికి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు. – కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానంపై మంగళవారం చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదాల నడుమ సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఓం బిర్లా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, కొందరు మహిళా ఎంపీలపైఆయన నిరాధార ఆరోపణలు చేశారని, కొన్ని అంశాలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వం ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలని కోరారు.
స్పందించిన అధికార పక్షం, ఓం బిర్లాను తొలగించేందుకు తీసుకువచ్చిన తీర్మానం వార్తల్లో నిలిచేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నంగా అభివర్ణించింది. ఓం బిర్లా నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నారంటూ మద్దతు తెలిపింది. స్పీకర్ స్థానంలో ఉన్న వారు తమను తాము సమర్థించుకునేందుకు సభలో జరిగే ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ ఓటింగ్‌కు దూరంగా ఉండాలని బిర్లా నిర్ణయించుకున్నారు. హోం మంత్రి అమిత్ షా ప్రసంగంతో బుధవారం ఈ తీర్మానంపై చర్చ ముగియనుంది.
తటస్థంగా ఉంటారని ఆశించాం. కానీ, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తీర్మానంపై చర్చను ప్రారంభించారు.
సభా మర్యాదను కాపా డేందుకు, రాజ్యాంగాన్ని రక్షించేందుకే స్పీకర్‌ను తొలగించేందుకు ప్రతిపక్షం తీర్మానం తీసుకు రావాల్సి వచ్చిందన్నారు. ‘స్పీకర్ తటస్థంగా వ్యవహరిస్తారని అందరూ ఆశిస్తారు. కానీ ఓం బిర్లా పక్షపాతంతో వ్యవహరించారు. ప్రతిపక్ష నేత ప్రసంగాన్ని ఆయన ఎన్నోసార్లు అడ్డుకున్నారు. ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగానే మరో సభ్యుడికి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు’అని గొగోయ్ ఆరోపించారు. సభలో వాక్ స్వాతంత్య్రం లేనేలే దన్నారు. సభ్యులందరికీ వ్యక్తిగతంగా స్పీకర్‌తో సత్సంబంధాలే ఉన్నప్పటికీ, ఈ తీర్మా నం తేవాల్సి రావడం విచారకరమని గొగోయ్ పేర్కొన్నారు.
అందరికీ అవకాశమిచ్చారు: మంత్రి రిజిజు
ఈ చర్చ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు జోక్యం చేసుకుంటూ.. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యవక్తం చేశారు. వాస్తవానికి ఓం బిర్లా సభ్యుల పట్ల ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించారన్నారు. అధికార పక్షం కంటే ప్రతిపక్ష సభ్యులకే తమ అభిప్రాయాలు వెల్లడించేందుకు ఎక్కువ అవకాశాలిచ్చారని తెలిపారు. అధికారం కోల్పోయిన 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ వ్యవస్థలపై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈసారి స్పీకర్ పదవినే లక్ష్యంగా చేసుకుందని, ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి అని ఆయన అభివర్ణించారు. డీఎంకే నేత టీఆర్ బాలు, టీడీపీకి చెందిన శ్రీకృష్ణ దేవరాయలు, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, శివసేన(యూబీటీ) సభ్యుడు అర్వింద్ సావంత్, టీఎంసీకి చెందిన మహువా మొయిత్రా, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే చర్చలో పాల్గొన్నారు.


