బాస్ కుర్చీలో ‘బాట్’.. ‘ఏజెంట్‌’ చెప్పింది చేయాల్సిందే! | The new boss at work may not be human | Sakshi
Sakshi News home page

బాస్ కుర్చీలో ‘బాట్’.. ‘ఏజెంట్‌’ చెప్పింది చేయాల్సిందే!

Mar 10 2026 1:50 PM | Updated on Mar 10 2026 2:00 PM

The new boss at work may not be human

న్యూయార్క్: కార్పొరేట్ ప్రపంచంలో నిశ్శబ్ద విప్లవం మొదలైంది. నిన్నటి వరకు కేవలం మన సందేహాలకు సమాధానాలిచ్చే ‘చాట్‌బాట్‌’లుగా ఉన్న కృత్రిమ మేధ (AI) వ్యవస్థలు, ఇప్పుడు నిర్ణయాధికార స్థాయికి చేరుకుంటున్నాయి. అమెరికా, కెనడాల్లోని అనేక దిగ్గజ కంపెనీల్లో సాగే కార్యకలాపాలను సమూలంగా మార్చేస్తున్నాయి. కేవలం సహాయకులుగా కాకుండా, పనులను ప్లాన్ చేస్తూ, తోటి ఉద్యోగులకు బాధ్యతలు కేటాయించే ‘ఏఐ ఏజెంట్లు’గా ఇవి అవతరిస్తున్నాయి.

సాధారణ ఏఐ చాట్‌బాట్‌లకు, ఏఐ ఏజెంట్లకు మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం వాటి ‘స్వయంప్రతిపత్తి’. చాట్‌బాట్‌లు మనం అడిగే ప్రశ్నలకు మాత్రమే స్పందిస్తాయి. కానీ ఏఐ ఏజెంట్లు ఒక అడుగు ముందుకు వేసి, సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా క్యాలెండర్లు, సమావేశాల ట్రాన్స్‌క్రిప్ట్‌లు, అంతర్గత డేటాబేస్‌లను విశ్లేషించి, స్వయంగా నిర్ణయాలు తీసుకోగలవు. అమెరికన్ క్లౌడ్ డేటా సంస్థ ‘స్నోఫ్లేక్’ వంటి చోట్ల ఇంజనీర్లు గతంలో గంటల తరబడి చేసే కోడింగ్ సమీక్షలు, సిస్టమ్ పర్యవేక్షణ వంటి పనులను ఇప్పుడు ఏఐ ఏజెంట్లు అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నాయి.

కొన్ని సందర్భాల్లో ఒక ఏఐ ఏజెంట్ రాసిన కోడ్‌ను మరో ఏఐ ఏజెంట్ తనిఖీ చేసి, లోపాలను సరిదిద్దుతోంది. మానవ పర్యవేక్షణ కేవలం తుది ఆమోదానికే పరిమితమవుతోంది. మేనేజర్లు చేసే పనుల కేటాయింపు, పనితీరు పర్యవేక్షణ వంటి బాధ్యతలను ఇప్పుడు సాఫ్ట్‌వేర్లే చూసుకుంటున్నాయి. అమెజాన్, యూపీఎస్, టార్గెట్ వంటి సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగాల కోత విధిస్తూ, ఆటోమేషన్ ద్వారా సామర్థ్యాన్ని పెంచుకుంటామని ప్రకటించడం ఇందుకు నిదర్శనం. అమెరికాలో దాదాపు 6 నుంచి 7 శాతం మంది ఉద్యోగులు ఏఐకు ప్రభావితం కావచ్చని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. ముఖ్యంగా అకౌంటెంట్లు, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్లు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు ఈ ముప్పును ఎదుర్కొంటున్నారు.

కాగా ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో ఏఐని ప్రవేశపెట్టడం వల్ల సంస్థలో సహకారం క్షీణించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే కొన్ని సంస్థలు ఏఐ ద్వారా పెరిగిన ఉత్పాదకతను ఉద్యోగులకు పంచుతూ, వారానికి నాలుగు రోజుల పనిదినాలను ప్రవేశపెడుతున్నాయి. మరోవైపు మానవ సంబంధాలకు ప్రాధాన్యత ఉండే కౌన్సెలింగ్, వెల్నెస్ వంటి రంగాల్లో ఏఐ ఏజెంట్ల వినియోగానికి వినియోగదారులు విముఖత చూపుతున్నారు. సామర్థ్యం కంటే సామాజిక అనుబంధానికే విలువనిస్తూ, కొన్ని కంపెనీలు ఇప్పటికీ మనుషులకే పెద్దపీట వేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ‘యుద్ధమంటే ఆటలా?’ అగ్రరాజ్యంపై ఆగ్రహ జ్వాలలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement