సోలన్: అతనికి ప్రాణసంకటం ఎదురైనప్పుడు సాహసం సాయపడింది. 12 నిమిషాల పాటు చిరుతతో సాగిన ఆ భీకర పోరాటంలో చివరకు మృగమే తలవంచింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లా అర్కి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అర్కి ఐటీఐ విద్యార్థి ప్రవేష్ శర్మ సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో తమ పొలం గుండా పాలు తీసుకువచ్చేందుకు వెళ్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఒక చిరుతపులి ఒక్కసారిగా అతనిపై విరుచుకుపడింది. ఊహించని ఈ పరిణామంతో నివ్వెరపోకుండా, తన ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రవేష్ అసాధారణ పోరాటం చేశాడు. ఒకటిన్నర ఏళ్ల వయసున్న ఆ చిరుత పులి పంజా విసురుతున్నా, తన చేతులతో దాని దవడలను గట్టిగా పట్టుకుని ప్రతిఘటించాడు.
సుమారు 12 నిమిషాల పాటు యువకుడికి ఆ క్రూర మృగానికి మధ్య భీకర పోరాటం సాగింది. చిరుత గోళ్ల గీతలతో శరీరం రక్తసిక్తమవుతున్నా ప్రవేష్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సమయస్ఫూర్తితో వ్యవహరించి, చిరుత మెడను, తలను బలంగా అదిమి పట్టి మట్టుబెట్టాడు. ఆత్మరక్షణ కోసం సాగించిన ఈ పోరాటంలో చిరుత ప్రాణాలు కోల్పోగా, ప్రవేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై ప్రవేష్ బాబాయ్ శ్యామ్ లాల్ మాట్లాడుతూ.. మార్చి 6వ తేదీ నుంచే ఈ ప్రాంతంలో చిరుత సంచారం ఉందంటూ అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. బోను ఏర్పాటు చేసి చిరుతను పట్టుకోవాలని కోరినప్పటికీ, అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా ఘటనా స్థలాన్ని సందర్శించిన అటవీ శాఖ డివిజనల్ అధికారి రాజ్‌కుమార్ శర్మ, గాయపడిన ప్రవేష్‌కు తక్షణ సహాయంగా రూ. 5,000 అందజేశారు. వన్యప్రాణుల సహజ ఆవాసాలు దెబ్బతినడం వల్లే అవి జనావాసాల్లోకి వస్తున్నాయని ఆయన అన్నారు. సాధారణంగా చిరుతలు రాత్రి వేళల్లో దాడులు చేస్తాయని, అయితే ఈ చిరుత తెల్లవారుజామునే దాడికి దిగడం దాని ఆకలి తీవ్రతను సూచిస్తోందని వివరించారు. ప్రవేష్ శౌర్యసాహసాల గురించి తెలిసిన స్థానికులు, తోటి విద్యార్థులు, నెటిజనులు అతనిని అభినందనలతో ముంచెత్తుతున్నారు.
ఇది కూడా చదవండి: ‘ఎన్‌సీఈఆర్‌టీ’ వివాదం: ‘న్యాయ పాఠం’పై కీలక నిర్ణయం


