కర్ణాటక: కలిసి ఏడడుగులు వేశారు, ఎంత కష్టం వచ్చిందో గానీ కలిసే తనువు చాలించారు. జిల్లాలోని కెఆర్ పేట పట్టణంలోని జయనగర బ్లాక్‌లో యువ దంపతులు ఒకే తాడుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. హోస్కోటే గ్రామానికి చెందిన దర్శన్ (29), నతనహళ్లికి చెందిన భార్య ఎన్.ఎల్. దివ్య (25) మృతులు. వీరికి 3 ఏళ్ల కిందట పెళ్లయింది, ఏడాదిగా ఇక్కడ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.
దర్శన్ క్యాబ్ డ్రైవర్ కాగా, దివ్య ఓ నర్సింగ్ హోంలో పనిచేస్తున్నారు. వీరికి రక్ష అనే రెండేళ్ల కుమార్తె ఉంది. ఏం సమస్యలు వచ్చాయోగానీ.. ఆదివారం రాత్రి వారితో పాటు పాపకు ఉరి బిగించి ప్రాణాలు తీసుకున్నారు. అయితే ఉరి జారిపోవడంతో పాప క్షేమంగా తప్పించుకుంది.
చిన్నారి ఏడుస్తూ ఉండడంతో ఇరుగు పొరుగు వచ్చి చూడగా దంపతులు ఉరికి వేలాడుతూ కనిపించారు. దర్శన్ తండ్రి గణేష్ గౌడ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు కుటుంబాలవారు చేరుకుని మీరంటే మీరు కారణమని ఆరోపణలు చేసుకున్నారు. తల్లిదండ్రులు కానరాని లోకాలకు చేరడంతో కూతురు అనాథగా మారింది.


