Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Coca Cola Brings the Iconic FIFA World Cup Trophy to India After 12 Years1
12 ఏళ్ల భారత్‌కు ఫిఫా ప్రపంచకప్‌

ఫిఫా ప్రపంచకప్‌ ట్రోఫీ 12 ఏళ్ల తర్వాత భారత్‌లోకి అడుగుపెట్టింది. కోకా-కోలా భాగస్వామ్యంతో జరుగుతున్న ట్రోఫీ టూర్ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను భారత అభిమానులకు దగ్గర చేసింది. ప్రతిష్టాత్మకమైన ఈ ట్రోఫీని న్యూఢిల్లీలోని తాజ్ మహల్ హోటల్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర యువజన, క్రీడా శాఖ మంత్రి డా. మాన్సుఖ్ మాండవియా, బ్రెజిల్ మాజీ వరల్డ్ కప్ విజేత గిల్బర్టో డి’సిల్వా, క్రీడా చరిత్రకారుడు బోరియా మజుందార్, అలాగే కోకా-కోలా ఇండియా నాయకత్వం హాజరయ్యారు.మంత్రి మాండవియా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో క్రీడలు జాతీయ ప్రాధాన్యతగా మారాయి. 2047 నాటికి భారత్‌ను ప్రపంచంలోని టాప్ 5 క్రీడా దేశాల్లో ఒకటిగా నిలపడం మా లక్ష్యం అని అన్నారు. కోకా-కోలా ఇండియా అధ్యక్షుడు సంకేత్ రే మాట్లాడుతూ.. భారత క్రీడలు విస్తృత భాగస్వామ్యం, బలమైన మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ అనుసంధానం ద్వారా కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయి. FIFAతో మా దీర్ఘకాలిక భాగస్వామ్యం వల్ల ఇలాంటి చారిత్రాత్మక క్షణాలను భారత అభిమానులకు చేరువ చేస్తున్నామని అన్నారు. ట్రోఫీ విశేషాలు ఫిఫా ప్రపంచకప్‌ ట్రోఫీ 18 క్యారెట్ల బంగారంతో తయారు చేయబడింది. దీని బరువు 6.175 కిలోలు. ఈ ట్రోఫీ రెండు మానవ ఆకృతులు ప్రపంచ గోళాన్ని పైకి ఎత్తిన రూపకల్పనతో 1974లో రూపొందించబడింది. ఈ ట్రోఫీ టూర్‌ 30 దేశాల్లో, 75 స్టాప్‌లతో 150 రోజుల పాటు సాగుతుంది.

Historic moment for Afghanistan legend as Mohammad Nabi features with son Hassan BPL2
క్రికెట్‌ చరిత్రలో అద్భుతం

క్రికెట్‌ చరిత్రలో అద్భుతం జరిగింది. తండ్రి-కొడుకులు ఒకే జట్టులో కలిసి ఆడి చరిత్ర సృష్టించారు. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2025-26లో ఈ చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ మొహమ్మద్‌ నబీ, అతని కొడుకు హసన్ ఐసాఖిల్ నోఖాలి ఎక్స్‌ప్రెస్ అనే ఫ్రాంచైజీకి కలిసి ప్రాతినిథ్యం వహించారు.క్రికెట్‌ చరిత్రలో ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో గతేడాదే తొలిసారి ఓ తండ్రి-కొడుకుల జోడీ (సుహైల్‌ సత్తార్‌ (50)-యాహ్యా సుహైల్‌ (17), తిమోర్‌-లెస్టే అనే దేశం తరఫున కలిసి టీ20 మ్యాచ్‌ ఆడింది.విండీస్‌ దిగ్గజ బ్యాటర్‌ శివ్‌నరైన్‌ చంద్రపాల్‌ సైతం తన కొడుకు తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌తో కలిసి ఓ క్లబ్‌ మ్యాచ్‌ ఆడాడు. తాజాగా మొహమ్మద్‌ నబీ-హసన్ ఐసాఖిల్ కలిసి ఓ టీ20 లీగ్‌ మ్యాచ్‌ ఆడి అత్యంత అరుదైన జాబితాలో చోటు దక్కించకున్నారు.ప్రస్తుతం నబీ వయసు 41 సంవత్సరాలు కాగా.. హసన్‌ వయసు 19. 2007లో నబీ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టినప్పుడు హసన్ 11 నెలల పసికందు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత, ఈ తండ్రి–కొడుకు ఒకే జట్టులో ఆడటం చారిత్రక ఘట్టంగా నిలిచింది. నబీ కెరీర్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ చరిత్రలో ఇతనో దిగ్గజం. ప్రపంచ క్రికెట్‌లోనూ మేటి స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. ఆఫ్ఘనిస్తాన్‌ తరఫున సుదీర్ఘ అనుభవం కలిగిన నబీకి కొడుకు హసన్‌తో కలిసి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని కల ఉంది. ఈ కల త్వరలోనే నెరవేరే అవకాశం ఉంది.హసన్‌ ఫస్ట్ క్లాస్ మరియు లిస్ట్–ఏ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తూ జాతీయ జట్టు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఓపెనింగ్‌ బ్యాటర్‌ అయిన హసన్‌ పై రెండు ఫార్మాట్లలో సగటు 50కు చేరువగా పరుగులు సాధించాడు. పొట్టి క్రికెట్‌లో మాత్రం హసన్‌కు అనుభవం కాస్త తక్కువగా ఉంది. ఇప్పటివరకు 30 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ హసన్‌కు తొలి విదేశీ అసైన్‌మెంట్‌. నోఖాలి ఎక్స్‌ప్రెస్ తరఫున మూడు వారాల పాటు బెంచ్‌లో కూర్చున్న హసన్‌.. తాజాగా ఢాకా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌తో బీపీఎల్‌ అరంగేట్రం చేశాడు.అరంగేట్రంలోనే విధ్వంసంఅరంగేట్రంలోనే హసన్‌ చెలరేగిపోయాడు. 60 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు సాయంతో 92 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. కేవలం 8 పరుగులతో సెంచరీ చేసే సుదర్ణావకాశాన్ని కోల్పోయాడు. కొడుకు చెలరేగిపోగా, తండి నబీ మాత్రం 17 పరుగులు (2 ఫోర్లు) మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయితే నబీ బౌలింగ్‌లో సత్తా చాటి 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. తండ్రి-కొడుకులు సత్తా చాటడంతో ఈ మ్యాచ్‌లో ఢాకా క్యాపిటల్స్‌పై నోఖాలి ఎక్స్‌ప్రెస్ 41 పరుగుల తేడాతో గెలుపొందింది. అరంగేట్రంలోనే విధ్వంసం సృష్టించిన హసన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

  Indian legends Rohit Sharma and Virat Kohli in a special felicitation ceremony3
గెలుపు తలుపు తీసే క్రికెటర్లకు...

వడోదర: ప్రస్తుత టీమిండియా దిగ్గజ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలకు బరోడా క్రికెట్‌ అసోసియేషన్‌ (బీసీఏ) వినూత్నంగా ఆత్మీయ సత్కారాన్ని ఏర్పాటు చేసింది. ఏళ్ల తరబడి ‘టన్‌’లకొద్దీ పరుగులతో భారత క్రికెట్‌ జట్టు గెలుపు తలుపుల్ని తీస్తున్న ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్, ‘కింగ్‌’ కోహ్లిలను తొలి వన్డే సందర్భంగా అదే రీతిన గౌరవించింది. రెండు తలుపులతో ప్రత్యేక క్యాబిన్‌ ఏర్పాటు చేసిన బీసీఏ ఇద్దరినీ అందులో ఉంచింది. ఇద్దరి క్రికెటర్ల నిలువెత్తు పోస్టర్లు అంటించిన చెరో తలుపు తీయగానే కోహ్లి, రోహిత్‌లు బయటికి వచ్చారు. వారి పోస్టర్లపై ఆటోగ్రాఫ్‌లు చేశారు. ఈ వేడుక మైదానంలోని వేలమంది క్రికెట్‌ అభిమానుల్ని విశేషంగా అలరించింది. వాళ్లు రావడం, పోస్టర్లపై సంతకాలు చేయడంతో ప్రేక్షకులంతా కరతాళధ్వనులతో జేజేలు పలికారు. ఇందులో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చైర్మన్‌ జై షా, బీసీఏ అధ్యక్షుడు ప్రణవ్‌ అమీన్, బీసీసీఐ అధ్యక్షుడు మిథున్‌ మన్హాస్, ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా తదితరులు పాల్గొన్నారు.

Sri lanka beat pakistan by 14 runs in 3rd T20I4
తిప్పేసిన హసరంగ.. బెంబేలెత్తిపోయిన పాక్‌

‍స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను శ్రీలంక 1-1తో డ్రా చేసుకుంది. డంబుల్లా వేదికగా నిన్న (జనవరి 11) జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో పాక్‌ను 14 పరుగుల తేడాతో చిత్తు చేసింది. వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆతిథ్య జట్టు 6 వికెట్ల నష్టానికి 160 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. లంక బ్యాటర్లు తలో చేయి వేసి ఈ స్కోర్‌ను అందించారు. కమిల్‌ మిషారా 20, కుసాల్‌ మెండిస్‌ 30, ధనంజయ డిసిల్వ 22, చరిత్‌ అసలంక 21, దసున్‌ షనక 34, జనిత్‌ లియనాగే 22 (నాటౌట్‌) పరుగులు చేశారు. పాక్‌ బౌలర్లలో మొహమ్మద్‌ వసీం జూనియర్‌ 3 వికెట్లు పడగొట్టగా.. నసీం షా, మొహమ్మద్‌ నవాజ్‌, ఫహీమ్‌ అష్రాఫ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.తిప్పేసిన హసరంగఅనంతరం భారీ లక్ష్య ఛేదనలో హసరంగ ధాటికి పాక్‌ బెంబేలెత్తిపోయింది. 12 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులకు మాత్రమే పరిమితమైంది. హసరంగ 3 ఓవర్లలో 35 పరుగులకు 4 వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టాడు. మతీష పతిరణ (3-0-34-2) రాణించాడు. ఎషాన్‌ మలింగకు ఓ వికెట్‌ దక్కింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ సల్మాన్‌ అఘా (45) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. మరో ఇద్దరు (నవాజ్‌ (28), ఖ్వాజా నఫే (26)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో పాక్‌ గెలువగా.. రెండో మ్యాచ్‌ వర్షం కారణంగా టాస్‌ కూడా పడకుండానే రద్దైంది.

Gujarat Giants edged Delhi Capitals by four runs in a WPL 20265
సూపర్‌ సోఫీ

ముంబై: ఆధిక్యం చేతులు మారుతూ సాగిన మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ను విజయం వరించింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ఆదివారం పరుగుల వరద పారిన పోరులో గుజరాత్‌ 4 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. మొదట గుజరాత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, న్యూజిలాండ్‌ స్టార్‌ ప్లేయర్‌ సోఫీ డివైన్‌ (42 బంతుల్లో 95; 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగి త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... కెపె్టన్‌ ఆష్లే గార్డ్‌నర్‌ (26 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా దంచికొట్టింది. ఢిల్లీ బౌలర్లలో నందిని శర్మ (5/33) ‘హ్యాట్రిక్‌’తో సహా 5 వికెట్లుపడగొట్టగా... తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి (2/42), చినెల్లి హెన్రీ (2/43) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులకు పరిమితమై వరుసగా రెండో ఓటమి చవిచూసింది. లిజెల్లి లీ (54 బంతుల్లో 86; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), లారా వోల్వార్ట్‌ (38 బంతుల్లో 77; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. ఆరంభంలో లిజెల్లి చెలరేగిపోగా... విజయానికి 24 బంతుల్లో 60 పరుగులు అవసరమైన దశలో వోల్వార్ట్‌ కదంతొక్కింది. వోల్వార్ట్‌ 17వ ఓవర్‌లో 2 ఫోర్లు... 18వ ఓవర్‌లో 4, 4, 4, 6 కొట్టింది. దీంతో సమీకరణం 12 బంతుల్లో 29కి చేరింది. 19వ ఓవర్‌లో వోల్వార్ట్‌ 6, 4, జెమీమా ఫోర్‌తో 22 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 7 పరుగులు అవసరం కాగా... 2 పరుగులే ఇచి్చన సోఫీ డివైన్‌ 2 వికెట్లు తీసి గుజరాత్‌కు వరుసగా రెండో విజయం కట్టబెట్టింది. ఒకే ఓవర్‌లో 4,4,6,6,6,6 గుజరాత్‌ ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లో సోఫీ డివైన్‌ విజృంభించింది. స్నేహ్‌ రాణా వేసిన ఆ ఓవర్‌ తొలి రెండు బంతులకు ఫోర్లు బాదిన డివైన్‌... ఆ తర్వాత వరుసగా నాలుగు సిక్స్‌లు కొట్టింది. దీంతో ఒక్క ఓవర్‌లోనే 32 పరుగులు వచ్చాయి. డబ్ల్యూపీఎల్‌ చరిత్రలో ఒకే ఓవర్‌లో లభించిన అత్యధిక పరుగులు ఇవే. క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించిన డివైన్‌... శ్రీచరణి ఓవర్‌లో సైతం మూడు సిక్స్‌లు బాదింది. మరో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో సెంచరీకి ఐదు పరుగుల దూరంలో అవుటైంది. నందిని ‘హ్యాట్రిక్‌’ ఫుల్‌ఫామ్‌లో ఉన్న డివైన్‌ను అవుట్‌ చేసిన నందిని శర్మ... ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో ‘హ్యాట్రిక్‌’తో సహా నాలుగు వికెట్లు పడగొట్టింది. రెండో బంతికి కాశ్వీ గౌతమ్‌ (14) అవుట్‌ కాగా... నాలుగో బంతికి కనిక (4) స్టంపౌటైంది. చివరి రెండు బంతులకు రాజేశ్వరి (0), రేణుక (0) క్లీన్‌»ౌల్డ్‌ అయ్యారు. తద్వారా ఇసీ వాంగ్‌(2023), దీప్తి శర్మ (2024), గ్రేస్‌ హారిస్‌ (2025) తర్వాత డబ్ల్యూపీఎల్‌లో ‘హ్యాట్రిక్‌’ తీసిన నాలుగో బౌలర్‌గా నందిని నిలిచింది.

Virat Kohli stars again as India beat New Zealand by 4 wickets6
విరాట్‌ విశ్వరూపం.. తొలి వన్డేలో భారత్‌ ఘన విజయం

భార‌త పురుష‌ల క్రికెట్ జట్టు కొత్త ఏడాదిని ఘ‌నంగా ఆరంభించింది. ఆదివారం వ‌డోద‌ర వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. 301 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని భార‌త్ 6 వికెట్లు కోల్పోయి 49 ఓవ‌ర్ల‌లో చేధించింది.దీంతో మూడు వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. కివీస్‌ బ్యాటర్లలో డార్లీ మిచెల్‌(71 బంతుల్లో 84), డెవాన్‌ కాన్వే(56), హెన్రీ నికోల్స్‌(62) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, హర్షిత్‌ రానా తలా రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్‌ యాదవ్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.విరాట్ విధ్వంసం..అనంతరం భారీ లక్ష్య చేధనలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ తన విశ్వరూపాన్ని చూపించాడు. తనదైన శైలిలో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓ దశలో సునాయసంగా సెంచరీ మార్క్‌ను అందుకునేలా కన్పించిన కోహ్లి.. ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు.కేవలం 7 పరుగుల దూరంలో సెంచరీ చేసే అవకాశాన్ని కింగ్ కోల్పోయాడు. కోహ్లి మొత్తంగా 91 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌(56), వైస్‌ కెప్టెన​ శ్రేయస్‌ అయ్యర్‌(49) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.అయితే కోహ్లి ఔటయ్యాక భారత్‌ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. దీంతో భారత డగౌట్‌లో కాస్త టెన్షన్‌ నెలకొంది. కానీ కేఎల్‌ రాహుల్‌(21 బంతుల్లో 29) ప్రశాంతంగా ఆడుతూ మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. హర్షిత్‌ రాణా(23 బంతుల్లో 29) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. న్యూజిలాడ్‌ బౌలర్లలో కైల్ జేమీసన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఆశోక్‌, క్లార్క్‌ తలా వికెట్‌ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో వన్డే బుధవారం రాజ్‌కోట్‌ వేదికగా జరగనుంది.చదవండి: IND vs NZ: చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్‌

Sophie Devine struck by 90s curse again7
సోఫీ డివైన్‌ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్‌

డబ్ల్యూపీఎల్ 2026లో భాగంగా నవీ ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ బ్యాటర్లు జూలు విధిల్చారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ సోఫీ డివైన్ విధ్వంసం సృష్టించింది. తొలి ఓవర్ నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడింది. ఆమెను ఆపడం ఢిల్లీ బౌలర్ల తరం కాలేదు. 6 ఓవర్ వేసిన స్నేహ రాణా బౌలింగ్‌లో అయితే సోఫీ 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో ఏకంగా 32 పరుగులు పిండుకుంది. ఓవరాల్‌గా కేవలం 42 బంతులు మాత్రమే ఎదుర్కొన్న డివైన్‌..7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95 పరుగులు చేశాడు. ఆమెతో పాటు కెప్టెన్‌ గార్డనర్‌ 49 పరుగులతో రాణించింది.నందినీ శర్మ హ్యాట్రిక్‌..ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ పేసర్‌ నందిని శర్మ హ్యాట్రిక్‌ వికెట్లతో మెరిశాడు. గుజరాత్‌ ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ వేసిన నందిని బౌలింగ్‌లో రెండో బంతికి కశ్వి గౌతమ్‌ పెవిలియన్‌కు చేరింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తనుజా సింగిల్‌ తీసి స్ట్రైక్‌ కనిక అహుజకు ఇచ్చింది. అయితే నాలుగో బంతికి కనిక స్టంపౌట్‌ కాగా.. ఐదో బంతికి గైక్వాడ్‌, ఆరో బంతికి రేణుకా సింగ్‌ క్లీన్‌ బౌల్డయ్యారు. దీంతో తొలి హ్యాట్రిక్‌ నందిని ఖాతాలో చేరింది. ఓవరాల్‌గా నందిని తన నాలుగు ఓవర్ల కోటాలో 33 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ఆమెతో పాటు శ్రీచరణి రెండు వికెట్లు సాధించింది.చదవండి: T20 World Cup 2026: టీమిండియాకు భారీ షాక్‌..

Washington Sundar suffers injury scare during IND vs NZ 1st ODI8
టీమిండియాకు భారీ షాక్‌..

టీ20 వరల్డ్‌కప్-2026కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. కివీస్ ఇన్నింగ్స్ సందర్భంగా 20 ఓవర్ వేస్తున్న సమయంలో సుందర్‌కు వెన్నునొప్పి తలెత్తింది. దీంతో అతడు వెంటనే మైదానాన్ని వీడియాడు.వాషీ స్ధానంలో నితీష్ కుమార్ రెడ్డి సబ్‌స్ట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలో వచ్చాడు. సుందర్ తిరిగి ఫీల్డింగ్‌కు కూడా రాలేదు. అతడి గాయంపై ఈ మ్యాచ్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న హర్షా భోగ్లే అప్‌డేట్ ఇచ్చాడు. సుందర్ వెన్నునొప్పితో బాధపడుతున్నాడని, మెడికల్ టీమ్ అతడిని పర్యవేక్షిస్తోందని భోగ్లే తెలిపాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సుందర్ బ్యాటింగ్‌కు కూడా వచ్చే సూచనలు కన్పించడం లేదు.అయితే తొలుత‌ సుందర్‌ పక్కటెముకుల నొప్పితో బాధపడుతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అది కేవ‌లం వెన్ను నొప్పి అనే తెలియ‌డంతో టీమ్ మెనెజ్‌మెంట్ ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే సైడ్ స్ట్రెయిన్ అయితే కోలుకోవడానికి కనీసం 3 నుండి 4 నెలల సమయం పడుతుంది.అటువంటి సంద‌ర్భంలో వ‌చ్చే నెల‌లో జ‌రగాల్సిన దూరంగా ఉండ‌క త‌ప్పుదు. అతడి గాయంపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో 5 ఓవర్లు బౌలింగ్‌ చేసిన సుందర్‌ 27 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేదు.టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టుఅభిషేక్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), సంజుశాంసన్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దూబె, అక్షర్‌ పటేల్‌ ( వైస్‌ కెప్టెన్‌), రింకు సింగ్‌, బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా, వాషింగ్టన్‌ సుందర్‌, ఇషాన్‌ కిషన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి చదవండి: IND vs NZ: చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్‌

Virat Kohli Overtakes Kumar Sangakkara To Become 2nd Highest Run-Getter In International Cricket9
చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్‌

టీమిండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో దుమ్ములేపిన విరాట్‌.. ఇప్పుడు కివీస్‌తో వన్డేల్లో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు. వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో కోహ్లి దూకుడుగా ఆడుతున్నాడు.క్రీజులోకి వచ్చినప్పటి నుంచే భారీ షాట్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఈ క్రమంలో కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో 28,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. తద్వారా అత్యంతవేగంగా ఈ ఫీట్ సాధిం‍చిన ప్లేయర్‌గా విరాట్ వరల్డ్ రికార్డు సృష్టించాడు.కింగ్ కోహ్లి కేవలం 624 ఇన్నింగ్స్‌లలోనే అందుకున్నాడు. ఇంతకుముందు ఈ ఫీట్ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌(644) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సచిన్ ఆల్‌టైమ్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ముగ్గురే ముగ్గురు 28,000 ప‌రుగులు సాధించారు. కోహ్లి కంటే ముందు కుమార సంగక్కర(28,016), స‌చిన్ టెండూల్క‌ర్‌(34,357) ఈ ఘ‌న‌త సాధించారు.సంగక్కర రికార్డు బ్రేక్‌..అదేవిధంగా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగుల చేసిన జాబితాలో కోహ్లి రెండో స్ధానానికి చేరాడు. ఈ మ్యాచ్‌లోనే 42 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద అత‌డు ఈ ఫీట్ సాధించాడు. ఇంత‌కుముందు ఈ స్ధానంలో సంగక్కర ఉండేవాడు. తాజా మ్యాచ్‌తో అత‌డిని కోహ్లి అధిగ‌మించాడు. కోహ్లి కంటే ముందు సచిన్ ఒక్క‌డే ఉన్నాడు. అయితే కోహ్లి కేవ‌లం ఒక్క ఫార్మాట్‌లో మాత్ర‌మే ఆడుతుండ‌డంతో సచిన్ రికార్డు బ్రేక్ చేయ‌డం క‌ష్ట‌మనే చెప్పాలి.చదవండి: IND vs NZ: 'అతడికి మరోసారి అన్యాయం.. కావాలనే ఎదగనివ్వడం లేదు'

 Virat Kohli does 'Nagin Dance' in Vadodara as Phillips perishes to Kuldeep10
విరాట్ కోహ్లి నాగిన్ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లి మైదానంలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కింగ్ కోహ్లి కేవలం బ్యాటింగ్‌తోనే కాకుండా తన చేష్టలతో కూడా అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా మరోసారి కోహ్లి తనలోని ఫన్నీ యాంగిల్‌ను బయటపెట్టాడు.వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లి నగిన్ డ్యాన్స్ చేశాడు. కివీస్ ఇన్నిం‍గ్స్ 34వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో డేంజరస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్.. శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఇండియన్ టీమ్ మొత్తం సంబరాల్లో మునిగితేలిపోయింది. కోహ్లి మాత్రం ఫ్లూట్ వూదుతున్నట్లుగా చేతులతో సైగ చేస్తూ స్పెషల్‌ సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. కివీస్‌ బ్యాటర్లలో డార్లీ మిచెల్‌(71 బంతుల్లో 84), డెవాన్‌ కాన్వే(56), హెన్రీ నికోల్స్‌(62) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, హర్షిత్‌ రానా తలా రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్‌ యాదవ్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.చదవండి: IND vs NZ: 'అతడికి మరోసారి అన్యాయం.. కావాలనే ఎదగనివ్వడం లేదు'pic.twitter.com/LZrkrdDVtq— crictalk (@crictalk7) January 11, 2026

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement