బెంగళూరులో ఓ సీనియర్ ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారిని మోసం చేసి లక్షల్లో దోచుకున్నాడో మోసగాడు. ముఖం చూసి భవిష్యత్తు చెబుతానంటూ నమ్మబలికిన చిలుక జ్యోతిష్యాన్ని నమ్మి దారుణంగా మోసపోయిన వైనం విభ్రాంతి రేపింది. చదువుకున్న వారు, ఉన్నత హోదాల్లో ఉన్నవారు కూడా మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్మి మోసపోవడం ఆశ్చర్యం అంటూ నెట్టింట చర్చకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బెంగళూరులో చిలుక జోస్యం పేరుతో మోసాలకు పాల్పడుతున్నతమిళనాడుకు చెందిన శేఖర్ (59) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి సమాచారం ప్రకారం ఆదాయపు పన్ను శాఖలో పరిపాలనా అధికారిగా పనిచేస్తున్న సత్యనారాయణను నిందితుడు ముఖం చూసి భవిష్యత్తు చెబుతానంటూ నమ్మించాడు. కెరీర్ ఎదుగుదల, బదిలీలు వంటి ఆశలు చూపించాడు. ఇందుకు పూజలు, క్రతువు చేయాలని ఆ అధికారిని ఒప్పించాడు. ఇందుకోసం రూ. 50,000 చెల్లించేలా చేశాడు.
ఆ తరువాత మరింత శక్తివంతమైన పూజలు చేస్తేనే దోషాలు తొలగిపోతాయని నమ్మించాడు. ఇలా సుమారు రూ. 35 లక్షల విలువైన 194 గ్రాముల బంగారం, 1.3 కిలోల వెండి వస్తువులను కాజేశాడు. చివరికి అనుమానం వచ్చి విలువైన తన వస్తువులను తిరిగి ఇవ్వమని అడగడంతో చిలుక జ్యోతిష్యుడి అసలు బండారం బయట పడింది. అధికారి వెండి, బంగారు వస్తువులను తిరిగి ఇవ్వలేదు సరికదా ఎదురు బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితుడు భారతీనగర్ పోలీసులను ఆశ్రయించాడు.
మార్చి5 న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మార్చి 12న కాంటోన్మెంట్ రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడిని పట్టుకున్నారు. విలువైన వస్తువులను హలసూరులోని ఒక జ్యువెలరీ షాపులో అమ్మేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అతని సమాచారం ఆధారంగా, పోలీసులు 124 గ్రాముల బంగారం, 796 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ. 20.60 లక్షలు.
మార్చి 17న నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతోనే తాను ఈ మోసానికి పాల్పడినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. విచారణలో భాగంగా, నిందితుడు జ్యోతిష్యం, చిలుక జ్యోతిష్య సేవలను అందిస్తానని చెబుతూ, ఇదే తరహాలో మరికొంతమందిని కూడా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మోసం ద్వారా సేకరించిన డబ్బు మరియు బంగారాన్ని నిందితుడు ఎక్కడికి తరలించాడనే విషయంపై అధికారులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.


