స్ట్రాంగ్‌రూమ్ పాలిటిక్స్‌తో బెంగాల్ హీట్ | West Bengal Election Tensions Rise Ahead Of Counting Day As TMC And BJP Clash, Heavy Security Imposed | Sakshi
Sakshi News home page

స్ట్రాంగ్‌రూమ్ పాలిటిక్స్‌తో బెంగాల్ హీట్

May 3 2026 8:16 AM | Updated on May 3 2026 7:23 PM

Heavy Security Imposed Ahead of May 4 Counting

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకోవడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మే 4న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ప్రతిపక్ష బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియం స్ట్రాంగ్‌రూమ్ వద్ద భారీ భద్రత మోహరించగా, ఓటర్ల తీర్పు ఎవరికి పట్టం కట్టనుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

ప్రశాంతంగా రీ-పోలింగ్.. ఫాల్తాలో మళ్లీ ఎన్నిక
దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్, మగ్రాహత్ పశ్చిమ నియోజకవర్గాల్లోని 15 కేంద్రాల్లో శనివారం ప్రశాంతంగా రీ-పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 87 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు ఫాల్తా నియోజకవర్గంలోని మొత్తం 285 బూత్‌లలో మే 21న తిరిగి పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. దీని ఫలితాలు మే 24న వెలువడనున్నాయి. అంతకుముందు ఫాల్తాలో కొందరు టీఎంసీ కార్యకర్తలు ప్రాణహాని కలిగించేలా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ స్థానికులు ఆందోళనకు దిగడం తీవ్ర కలకలం రేపింది.
 

దీదీ ధీమా.. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద నిఘా
ఓట్ల లెక్కింపునకు ముందే టీఎంసీ తమ వ్యూహాలకు పదును పెట్టింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలు కౌంటింగ్ ఏజెంట్లతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 200కు పైగా స్థానాలు గెలుస్తామని వారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు రాజ్యసభ ఎంపీ రాజీవ్ కుమార్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులను పరిశీలకులుగా నియమించారు. బెలేఘాటా అభ్యర్థి కునాల్ ఘోష్ వంటి నేతలు స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద స్వయంగా పహారా కాస్తూ అప్రమత్తంగా ఉన్నారు.

టీఎంసీ ఓటమి ఖాయం: బీజేపీ ధీమా
టీఎంసీ నేతలు ఓటమి భయంతో వణికిపోతున్నారని బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందని, ఆమె ముఖంలో భయం కనిపిస్తోందని ఎన్జేపీ నాయకురాలు దేబశ్రీ చౌదరి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సుమారు 90 శాతం రికార్డు స్థాయి పోలింగ్ జరగడం అధికార మార్పునకు స్పష్టమైన సంకేతమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. మే 4 కౌంటింగ్‌కు ముందు తమ అభ్యర్థులంతా దేవాలయాలను సందర్శిస్తారని, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మహిళా కార్యకర్తలు అప్రమత్తంగా ఉంటారని బీజేపీ ప్రకటించింది.

ఇది కూడా చదవండి: బెంగాల్ ‘ప్రస్థానం’లో నరాలు తెగే క్లైమాక్స్
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement