శ్రేయస్‌ కాదు!.. భారత టీ20 కెప్టెన్‌గా ఊహించని పేరు! | Shreyas Iyer Sidelined Surprising Pick Emerges As India New T20 Captain | Sakshi
Sakshi News home page

శ్రేయస్‌, సంజూ కాదు!.. భారత టీ20 కెప్టెన్‌గా ఊహించని పేరు!

Apr 30 2026 7:16 PM | Updated on Apr 30 2026 8:12 PM

Shreyas Iyer Sidelined Surprising Pick Emerges As India New T20 Captain

టీమిండియా టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ భవితవ్యం త్వరలోనే తేలనుంది. ఇంగ్లండ్‌ పర్యటనలో అతడి ప్రదర్శన ఆధారంగానే అతడిని కొనసాగించాలా? లేదా? అన్న అంశంపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

కాగా సూర్య ఇటీవలే భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ అందించాడు. కెప్టెన్‌గా సూపర్‌ హిట్‌ అయినా.. బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. మరోవైపు.. టీమిండియా 2028లో టీ20 ప్రపంచకప్‌తో పాటు లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ ఆడాల్సి ఉంది.

యువ నాయకుడి సారథ్యంలో
ఇలాంటి తరుణంలో 35 ఏళ్ల సూర్యకు స్వస్తి పలికి.. యువ నాయకుడి సారథ్యంలో జట్టును తీర్చిదిద్దాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రత్యామ్నాయంగా శుబ్‌మన్‌ గిల్‌, హార్దిక్‌ పాండ్యా, సంజూ శాంసన్‌, అక్షర్‌ పటేల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) పేర్లు తెరమీదకు వచ్చాయి.

అయితే, గిల్‌ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో గత కొంతకాలంగా పేలవంగా ఆడి వరల్డ్‌కప్‌ జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. వన్డే, టెస్టు జట్ల కెప్టెన్‌ అయినప్పటికీ సెలక్టర్లు అతడిపై వేటు వేసేందుకు ఏమాత్రం వెనకాడలేదు. కాబట్టి ఇప్పట్లో అతడికి టీ20 జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించకపోవచ్చు.

రేసులో ఈ ఐదుగురు
మరోవైపు.. రోహిత్‌ శర్మ (Rohit Sharma) తర్వాత హార్దిక్‌ పాండ్యానే టీ20 జట్టు కెప్టెన్‌ కావాల్సి ఉండగా.. బీసీసీఐ అనూహ్యంగా సూర్యకు పగ్గాలు అప్పగించింది. అరుదైన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ నైపుణ్యాలున్న హార్దిక్‌పై అధిక భారం పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఇక సంజూ శాంసన్‌, అక్షర్‌ పటేల్‌లకు మేనేజ్‌మెంట్‌ అవకాశం ఇవ్వడం దాదాపు అసాధ్యమే. మరోవైపు.. శ్రేయస్‌ అయ్యర్‌ 2023, డిసెంబరు తర్వాత ఇంత వరకు టీ20 జట్టులో పునరాగమనమే చేయలేదు. అయితే, దేశవాళీ, ఐపీఎల్‌లో టీ20 కెప్టెన్‌గా, బ్యాటర్‌గా సత్తా చాటడం శ్రేయస్‌కు సానుకూలాంశం.

ఈ నేపథ్యంలో సూర్య స్థానాన్ని శ్రేయస్‌ అయ్యర్‌తోనే భర్తీ చేస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా క్రిక్‌బ్లాగర్‌ మాత్రం ఇందుకు భిన్నమైన కథనం అందించింది. ‘‘మెజారిటీ మంది మాజీ క్రికెటర్లు శ్రేయస్‌ అయ్యర్‌ను కెప్టెన్‌ను చేయాలని సూచిస్తున్నారు.

తెరమీదకు ఊహించని పేరు
కానీ సెలక్టర్లు మాత్రం ఇందుకు సుముఖంగా లేరు. జాతీయ టీ20 జట్టు, వరల్డ్‌కప్‌ జట్టులో స్థానమే లేని ఆటగాడిని ఏకంగా కెప్టెన్‌ను చేసేందుకు వారు సిద్ధంగా లేరు. ఏదేమైనా శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌, సంజూ శాంసన్‌ కంటే.. టీ20 కెప్టెన్సీ రేసులో ఇషాన్‌ కిషన్‌ ముందు వరుసలో ఉన్నాడు’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు చెప్పినట్లు సదరు కథనం పేర్కొంది.

కాగా సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ2025-26 సీజన్‌లో జార్ఖండ్‌ కెప్టెన్‌, బ్యాటర్‌గా రాణించి ఇషాన్‌ జట్టుకు తొలి టైటిల్‌ అందించాడు. ఈ క్రమంలోనే భారత టీ20 జట్టులో పునరాగమనం చేసి.. వరల్డ్‌కప్‌-2026లో అదరగొట్టాడు. 

అదేవిధంగా.. ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆరంభ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి మంచి మార్కులు కొట్టేశాడు. దీంతో ఇషాన్‌ చుట్టూ యువ జట్టును తీర్చిదిద్దాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

చదవండి: రియాన్‌ పరాగ్‌పై బీసీసీఐ చర్యలు

Advertisement
 
Advertisement
Advertisement