రష్మిక మందన్న పేరు మార్చుకున్నారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక.. ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత రష్మిక పేరు చివరన దేవరకొండ లేదా విజయ్ అని యాడ్ చేస్తారని చాలా మంది భావించారు. గతంలో చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకోగానే భర్త ఇంటిపేరు లేదా భర్త పేరుని తమ పేరుకు జోడించేవారు. కానీ రష్మిక అలా చేయలేదు. తన సోషల్ మీడియా ఖాతాలన్నీ పెళ్లికి ముందు ఉన్న పేరుతోనే ఉన్నాయి. దీంతో ఆమె పేరులో ఎలాంటి మార్పు ఉండదని అనుకున్నారు.
అయితే తాజాగా రష్మిక కూడా తన పేరు చివరన భర్త ఇంటిపేరుని యాడ్ చేశారు. తాజాగా ఆమె భర్త విజయ్ దేవరకొండతో కలిసి అత్తాగారి సొంతూరు నాగర్‌కర్నూల్ జిల్లా తుమ్మన్‌పేటలో వెళ్లారు. అక్కడ ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరంలో 9, 10వ తరగతుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి ఉపకారవేతనాలు అందజేశారు.
ఈ సందర్భంగా రష్మిక తనని తాను రష్మిక మందన్న దేవరకొండగా పరిచయం చేసుకున్నారు. ‘ఈ రోజు రష్మిక మందన్న దేవరకొండలా మీ ముందు మాట్లాడుతున్నా. చాలా ఆనందంగా ఉంది. 9,10వ తరగతిలో ఫస్ట్, సెండర్ ర్యాంకులు సాధించి మీరు(విద్యార్థులను ఉద్దేశించి) నా కంటే ముందే ఉన్నారు. చాలా కష్టపడి ఈ ర్యాంకులు సాధించారు. లైఫ్‌లో కొన్నిసార్లు విన్ అవుతాం, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం.. కానీ ప్రతిసారి నేర్చుకుంటాం. పేరెంట్స్, టీచర్స్ నుంచి నేర్చుకొని గొప్పగా ఎదగండి.’ అని విద్యార్థులకు సూచించారు.
అయితే రష్మిక తొలిసారి తనపేరుని రష్మిక మందన్న దేవరకొండ అని పరిచయం చేసుకోవడం విశేషం. సోషల్ మీడియా ఖాతాల్లో కూడా పేరు మార్చుకుంటారా లేదా అలానే ఉంచుతారా? చూడాలి.


