ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా | Parliament Monsoon Session 2026 LS Adjourned Till 12 Noon | Sakshi
Sakshi News home page

ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా

Jul 29 2026 11:13 AM | Updated on Jul 29 2026 11:32 AM

Parliament Monsoon Session 2026 LS Adjourned Till 12 Noon

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 2026లో భాగంగా బుధవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే తీవ్ర గందరగోళం నెలకొంది. పేపర్ లీకేజీ నిరోధక సవరణ బిల్లుపై చర్చకు ముందు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు హాజరుకావాలని డిమాండ్ చేస్తూ విపక్ష ‘ఇండియా' కూటమి ఎంపీలు నినాదాలు చేయడంతో లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఎంపీల నిరసనల మధ్య సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.  కాగా లోక్‌సభలో మంగళవారం అర్ధరాత్రి వరకు పేపర్ లీకేజీ నిరోధక బిల్లుపై తీవ్ర వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ బిల్లుపై మాట్లాడే అవకాశం ఉండటంతో అందరి దృష్టి ఆయన ప్రసంగంపైనే నిలిచింది. మరోవైపు, ఈ కీలక బిల్లుపై రాహుల్ గాంధీ కనీసం ఐదు నిమిషాల పాటు మాట్లాడాలని, అటువంటి ముఖ్యమైన అంశంపై మాట్లాడకుండా తప్పించుకోవడం సరికాదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అభిప్రాయపడ్డారు.

సభ ప్రారంభానికి ముందే ఉభయ సభల విపక్ష సభ్యులు ఎన్నికల సంస్కరణల నుంచి అంతరాష్ట్ర జల వివాదాల వరకు పలు అంశాలపై చర్చించేందుకు వాయిదా తీర్మానాలు సమర్పించారు. లోక్‌సభ జాబితా ప్రకారం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. జనన, మరణాల రిజిస్ట్రేషన్ (సవరణ) బిల్లు, 2026ను సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఫిరాయింపుల నిరోధక చట్టంపై సమగ్ర చర్చ కోరుతూ వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చారు.

ఇక రాజ్యసభలో జాతీయ గౌరవ అవమానాల నిరోధక (సవరణ) బిల్లు, 2026 ఆమోదం కోసం రానుంది. అలాగే కావేరి జల వివాదంపై జలశక్తి మంత్రిత్వ శాఖ తప్పుదారి పట్టించే సమాధానం ఇచ్చిందంటూ ఎంపీ ప్రవీణ్ చక్రవర్తి రూ. 267 కింద సభ కార్యకలాపాలను నిలిపివేయాలని కోరుతూ మోషన్ వేశారు. కాంగ్రెస్ విప్ నాసిర్ హుస్సేన్ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఖాతాలపై స్వతంత్ర ఆడిట్ కోరుతూ వాయిదా నోటీసు అందజేశారు. ఉభయ సభల్లోని ఈ పరిణామాలపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement