పూరీ: జగన్నాథ రథయాత్ర సందర్భంగా ‘పూరీ కాజా' విక్రయాలలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. పది రోజుల ఉత్సవాల్లో దాదాపు రూ.100 కోట్ల విలువైన కాజా అమ్ముడైనట్లు వర్తకులు చెబుతున్నారు. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో ఈ తియ్యని పదార్థానికి గిరాకీ అనూహ్యంగా పెరిగింది. ఈ ఏడాది రథయాత్రకు ముప్పై లక్షలకు పైగా భక్తులు పూరీకి తరలివచ్చారు. దీంతో శ్రీమందిర్ ఆనంద్ బజార్, అడపా మండప్ ఆనంద్ బజార్‌తో పాటు గ్రాండ్ రోడ్, నగర వీధులు, పూరీ-భువనేశ్వర్ హైవే వెంట వెలిసిన వందలాది దుకాణాల్లో కాజా విక్రయాలు జోరుగా సాగాయి.
గత సంవత్సరాలతో పోలిస్తే విక్రయ కేంద్రాల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. భక్తులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం ఒక్కొక్కరు 2 నుంచి 5 కిలోల వరకు కాజాను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసిన ప్రీమియం రకం కిలో సుమారు రూ.400 పలుకగా, సాధారణ రోడ్డు పక్కన విక్రయించే రకాలు రూ.200 నుంచి రూ.300 వరకు అమ్ముడయ్యాయి.
పండుగ రద్దీని ఆసరా చేసుకుని కొన్ని చోట్ల సాధారణ కాజాను కూడా ‘కాళీయ భోగం’ అంటూ కొందరు విక్రేతలు అమాయక భక్తులను మోసగించారనే ఆరోపణలు వినిపిస్తునాయి. జగన్నాథ సంప్రదాయాల పవిత్రతను దెబ్బతీసే ఈ చర్యలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం శ్రీమందిర్ ఆనంద్ బజార్‌లోనే రూ.40 కోట్ల విలువైన మహాప్రసాదం అమ్ముడైనట్లు అంచనా. మరోవైపు పూరీ కాజాకు అంతర్జాతీయ ఖ్యాతి ఉన్నప్పటికీ, దీనికి ఇప్పటివరకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) లభించలేదు. దీని ప్రత్యేకతను కాపాడేందుకు, ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించడానికి జీఐ ట్యాగ్ ఇవ్వాలనే డిమాండ్ మళ్లీ ఊపందుకుంది.


