breaking news
-
నేను గుంపు మేస్త్రీనే
సాక్షి, హైదరాబాద్: ‘అవును.. నేను గుంపు మేస్త్రీనే. ఈ మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులందరూ నా గుంపు. వారికి నేను మేస్త్రీని. కొందరు నన్ను గుంపు మేస్త్రీ అని అవహేళనగా మాట్లా డినా నేనేం బాధ పడను. ఉద్యోగుల గుంపే నా బలం..నా ధైర్యం. ప్రజలకు, ప్రభుత్వానికి వారధి ఈ గుంపే..’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉద్యోగుల ఉచిత ప్రమాద బీమా పథకాన్ని గురువారం రవీంద్రభారతిలో ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు వివిధ బ్యాంకులు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పలు ఎంఓయూలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగులనుద్దేశించి ప్రసంగించారు. అనుకోని ఘటనలు జరిగినప్పుడు ఆదుకునేలా.. ‘ఉద్యోగులుగా విధులు నిర్వహించే వారి భద్రత ప్రభుత్వ బాధ్యత. వారి సంక్షేమాన్ని ప్రభుత్వం బాధ్యతగా నిర్వహించాలి. మొదటగా సింగరేణి కార్మికులకు రూ.కోటి బీమా కల్పించేందుకు డిప్యూటీ సీఎం ప్రతిపాదించినప్పుడు నమ్మకం కలగలేదు. ఒక్క రూపాయి చెల్లించకుండా కోటి రూపాయల బీమా ఎలా సాధ్యమని నాకు సందేహం వచ్చింది. కానీ ప్రమాదవశాత్తూ మరణించిన 45 మంది సింగరేణి కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున బీమా సొమ్మును వారికి అందించడంతో ఇది సాధ్యమని నిరూపణ అయ్యింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రమాద బీమాను అమలు చేయాలని నిర్ణయించాం. బతికున్నప్పుడు ఉన్న బంధాలు చనిపోయిన తరువాత సానుభూతి మాత్రమే చూపుతాయి. ఆర్థికంగా ఆదుకునేవారు చాలా తక్కువ. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి కుటుంబానికి భరోసా ఇచ్చేందుకే ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. ప్రమాద బీమా ఉద్యోగుల కుటుంబానికి ధైర్యం, భరోసా ఇస్తుంది..’అని సీఎం స్పష్టం చేశారు. నేను మీకు ఎప్పటికీ రేవంతన్ననే.. ‘మేము దొరలం.. మాకు గడీలున్నాయని కొందరిలా నేను గొప్పలు చెప్పుకోను. నా హోదా, పదవి మారినా నేను మీకు ఎప్పటికీ రేవంతన్ననే. మన మధ్యనున్నది అన్నదమ్ముల అనుబంధమే. మీ సోదరుడు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మనందరం కలిసి తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దుదాంం. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను.. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వం రూ.8.11 లక్షల కోట్ల అప్పులు చేసి దివాలా తీయించింది. పదేళ్లలో వందేళ్ల విధ్వంసం చేసింది. పదేళ్లలో మొదటి తారీఖున జీతాలు ఇచ్చిన పరిస్థితి ఉందా? ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం విడతల వారీగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేస్తున్నాం..’అని రేవంత్ చెప్పారు. ఆదాయం పెంచితే మరింత ఖర్చు చేస్తాం ‘ప్రజలకు విజయవంతంగా అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకంలో ఉద్యోగుల కృషి ఉంది. మీ నమ్మకమే మా బలం. ఉద్యోగులు రోజుకో గంట అదనంగా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచాలి. ఆదాయాన్ని పెంచితే ప్రజలు, ఉద్యోగుల సంక్షేమం కోసం మరింత ఖర్చు పెడతాం. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ఉద్యోగుల చేతుల్లోనే ఉంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడి పెట్టుబడులను ఆకర్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలబడాలంటే మీ అందరి సహకారం అవసరం. అక్రమార్కులను కట్టడి చేస్తే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగుల పీఆర్సీ అంశాన్ని పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఆదేశిస్తున్నా. ప్రజల కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఆ ప్రజల కోసం పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం తోడుగా ఉంటుందని మాట ఇస్తున్నా..’అని ముఖ్యమంత్రి అన్నారు. అవన్నీ వద్దని అడ్డుకుంటున్నారు.. ‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రతిపాదించింది. అసెంబ్లీ వేదికగా ఎన్నో అంశాలను చర్చించింది. ఇప్పుడు వాటిని అమలు చేస్తుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ అడ్డుకుంటోంది. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ వద్దంటున్నారు. ఓట్లు వేయని ప్రజలు బాగుపడొద్దన్నట్టుగా ఊరిమీద పడి తిరుగుతున్నారు. ఫామ్‌హౌస్‌లో ఉంటే కుంభకర్ణుడు.. బయటకొస్తే బకాసురుడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ కోసం సర్వం కోల్పోయినవారికి పదవులు ఇస్తుంటేం అడ్డు పడుతున్నారు. 30 నెలలుగా నేను ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. మేం రూపొందించిన ప్రణాళికలన్నీ ఇప్పుడు కొలిక్కి వస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం పదే పదే ఢిల్లీ వెళ్తున్నా. పలు ప్రాజెక్టులకు ఆమోదం కోసం కృషి చేస్తున్నా..’అని సీఎం చెప్పారు. ఉద్యోగుల సిబిల్ స్కోర్‌ను దెబ్బతీశారు: భట్టి రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల సిబిల్ స్కోర్‌ను పూర్తిగా దెబ్బతీసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. ఉద్యోగుల వేతనాలను 15నుంచి 20వ తేదీ మధ్య ఇచ్చేవారని, దీంతో వారి బ్యాంకు ఖాతాలు బ్యాడ్ అయ్యాయని, వారి ఫైనాన్షియల్ కమిట్మెంట్టు గాడి తప్పాయని అన్నారు. వారి సిబిల్ స్కోర్ దెబ్బతినడంతో రుణాలు అందే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఆ పరిస్థితిని ఇప్పుడు పూర్తిగా చక్కబెడుతున్నామని చెప్పారు. క్రమం తప్పకుండా వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు, ఇతర ఆర్థిక లబ్ధిని వేగంగా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా సరికొత్తగా ఉచిత బీమా పథకాన్ని ఆమోదించి అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకం కింద.. ప్రభుత్వంపై కానీ, ఉద్యోగులపై కానీ ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడకుండా, బ్యాంకులతో మాట్లాడి భారీ బీమా రక్షణను కలి్పస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజహరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
72 సార్లు ఢిల్లీకి పోయి 72 పైసలు కూడా తేలేదు: కేటీఆర్
సాక్షి, చేవెళ్ల: రైతులు సహా అన్నివర్గాలను మోసం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చి.. అమలులో మాత్రం పూర్తిగా విఫలమైందని అన్నారు. గురువారం చేవెళ్లలో నిర్వహించిన బీఆర్ఎస్ ‘సర్’ శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధు సాయాన్ని వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని కేటీఆర్ మండిపడ్డారు. అలాంటి రేవంత్‌ను ఏమనాలో రైతులే చెప్పాలన్నారు. రైతు సంక్షేమం గురించి గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడంలో విఫలమైందని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని అన్నారు.రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలు పలికిన భూముల ధరలు ప్రస్తుతం భారీగా పడిపోయాయని అన్నారు. పెట్టుబడులు తగ్గడంతో పాటు నిర్మాణ రంగం కూడా మందగించిందని చెప్పారు.రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్.. ప్రజల సమస్యల పరిష్కారం కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. "72 సార్లు ఢిల్లీకి వెళ్లి 72 పైసలు కూడా తీసుకురాలేకపోయారు" అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.ప్రజాస్వామ్య విలువలను పక్కనబెట్టి వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ.. "హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని రేవంత్ ఎగిరెగిరి పడుతున్నారు" అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని, రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే సర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపు ఇచ్చారు. -
ఎన్నికల వ్యవస్థలో బోగస్ ఓట్లపై బీఆర్ఎస్ ఆందోళన
సాక్షి,హైదరాబాద్: ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన ఎన్నికల ప్రక్రియను బోగస్, నకిలీ ఓట్ల బెడద నుంచి పూర్తిగా విముక్తి చేయకుండా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ తన అసలు లక్ష్యాన్ని చేరుకోలేదని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక దేశం - ఒక పౌరుడు - ఒకే ఓటు అనే ఆలోచన మేరకు వారి ఆదేశాలతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి సమగ్ర వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ప్రజాస్వామ్య పునాదులను పరిరక్షించడం, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటం, ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడం అనే లక్ష్యంతోనే భారత రాష్ట్ర సమితి ఈ అంశాన్ని అత్యంత బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్తోందని ఆయన తెలిపారు. ఎన్నికల పవిత్రతకు విఘాతం కలిగించే బోగస్, నకిలీ ఓట్ల సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రమాదంలోకి నెట్టినట్లవుతుందని హెచ్చరించారు.డూప్లికేట్ ఓటర్లు, బోగస్ ఓటర్లు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడమే కాకుండా ప్రజల అసలు తీర్పును వక్రీకరించే ప్రమాదం కలిగిస్తారని డా. శ్రవణ్ పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికే ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం చేపట్టినప్పటికీ, ఒక రాష్ట్రంలో ఓటు హక్కు కొనసాగిస్తూ మరో రాష్ట్రంలో కూడా ఓటరుగా నమోదైన వారిని గుర్తించి తొలగించే స్పష్టమైన విధానం ఇప్పటికీ లేకపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు.హైదరాబాద్ నేడు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజలు నివసిస్తున్న అంతర్జాతీయ స్థాయి నగరంగా ఎదిగిందని ఆయన చెప్పారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో స్థిరపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. వీరిలో చాలామంది తమ స్వరాష్ట్రాల్లో ఓటు హక్కును కొనసాగిస్తూనే తెలంగాణలో కూడా ఓటరుగా నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. ఒకే వ్యక్తికి రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉండటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, అటువంటి నమోదులను గుర్తించి తొలగించడంలో ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా జరుగుతున్న ఈ సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం అత్యంత కీలకమని డా. శ్రవణ్ అన్నారు. తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు తమ పాత ఓటు నమోదులను రద్దు చేయకుండా కొనసాగించే అవకాశం ఉందన్నారు. అందువల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు ఉమ్మడిగా పని చేస్తూ రెండు రాష్ట్రాల ఓటరు జాబితాలను పరస్పరం పరిశీలించాలని సూచించారు.ఒక రాష్ట్రంలో నమోదైన ఓటరు మరో రాష్ట్రంలో కూడా ఓటరుగా ఉన్నట్లయితే అలాంటి నమోదులను గుర్తించి వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల ఎన్నికల యంత్రాంగాలు కలిసి పనిచేసి ఓటరు జాబితాలను పరస్పరం సరిపోల్చి, క్షుణ్ణంగా పరిశీలించి, నకిలీ నమోదులను తొలగిస్తేనే ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని అన్నారు.అదేవిధంగా ఈ ప్రక్రియను కేవలం తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. బీహార్, రాజస్థాన్, గుజరాత్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన ప్రజలు కూడా తెలంగాణలో నివసిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాల మధ్య ఉన్న డూప్లికేట్ ఓట్లను గుర్తించే జాతీయ స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రతిపాదించిన “ఒక దేశం – ఒక పౌరుడు – ఒకే ఓటు” అనే సిద్ధాంతాన్ని డా. శ్రవణ్ ప్రస్తావించారు. ఒక దేశంలో ప్రతి పౌరుడికి ఒకే ఓటు హక్కు ఉండాలనేదే ప్రజాస్వామ్యానికి మూల సూత్రమని పేర్కొన్నారు. ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే ఓటు హక్కు ఉండాలి తప్ప రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు హక్కు కొనసాగకూడదని స్పష్టం చేశారు.ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓటు నమోదులు ఉండటం, తప్పుడు సమాచారంతో ఓటరుగా నమోదు కావడం, బోగస్ ఓటు వేయడం చట్టరీత్యా నేరమని డా. శ్రవణ్ గుర్తు చేశారు. అలాంటి నేరాలకు ఏడాది వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు. ఈ విషయంపై చాలా మందికి సరైన అవగాహన లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు అమాయక ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.అందువల్ల ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, బోగస్ ఓట్లు కలిగి ఉండటం వల్ల కలిగే చట్టపరమైన పరిణామాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని కోరారు. ఓటు హక్కు పవిత్రతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కేవలం రాష్ట్రాల మధ్య ఉన్న డూప్లికేట్ ఓట్లే కాకుండా, ఒకే రాష్ట్రంలోని వేర్వేరు నియోజకవర్గాల్లో నమోదైన డూప్లికేట్ ఓట్లను కూడా గుర్తించి తొలగించాలని డా. శ్రవణ్ డిమాండ్ చేశారు. ఒకే వ్యక్తి ఒక నియోజకవర్గంలో కాకుండా రెండు లేదా మూడు నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదై ఉండే సందర్భాలు ఉన్నాయని తెలిపారు. అలాంటి నమోదులను గుర్తించి రద్దు చేయడం ఎన్నికల సంఘం బాధ్యత అని పేర్కొన్నారు.ఒకే నియోజకవర్గంలో నమోదైన నకిలీ ఓట్లు, వేర్వేరు నియోజకవర్గాల్లో నమోదైన నకిలీ ఓట్లు, వేర్వేరు రాష్ట్రాల్లో నమోదైన నకిలీ ఓట్లు ,అన్నింటినీ సమగ్రంగా గుర్తించి తొలగించాలని ఎన్నికల అధికారులను కోరినట్లు తెలిపారు. అవసరమైతే ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఢిల్లీలో కలిసి కూడా తమ వాదనను వినిపిస్తామని డా. దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయత, ఓటు పవిత్రత కోసం భారత రాష్ట్ర సమితి నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు కురువ విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
‘బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని మరోసారి తేలిపోయింది’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కాములు తప్ప స్కీములు లేవని.. కుసుమ్ పథకంలో వెయ్యి కోట్ల స్కామ్ చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఇందులో కొంతమంది పెద్దల పేర్లు వినపడుతున్నాయి.. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.‘‘పీసీసీ చీఫ్‌కు ఎసరు పెడుతున్నారు. ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు. రైతుబంధుకు వీళ్ళు ఇచ్చిన నిధుల కంటే ప్రచారానికి ఎక్కువ ఖర్చు పెట్టారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని మరోసారి తేలిపోయింది. వారం రోజులు తిట్టుకుని ఇప్పుడు డ్యూయెట్లు పాడుతున్నారు. బీఆర్ఎస్ రాదనే కాంగ్రెస్ వాళ్లు.. కేటీఆర్ పర్యటనలకు ఎందుకు భయపడుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం పీఏగా పని చేస్తున్నారా...?. తెలంగాణ హైబ్రిడ్ సీఎం మోదీ జట్టు అని ఖాయమైంది. రైతులకు 30 వేల కోట్లు ప్రభుత్వం బాకీ ఉంది. భట్టి శాఖలో జరుగుతున్న వెయ్యి కోట్ల అవినీతిపై విచారణ జరపాలి..జాతీయ బ్యాంకును బ్లాక్ మెయిల్ చేసి భయపెడుతున్నారు. చంద్రబాబు,మోదీ ఆలోచనలతో పుట్టిన క్రాస్ బ్రీడ్ హైబ్రీడ్ సీఎం రాష్ట్రంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తే కేంద్ర మంత్రి ఇతర కేంద్ర మంత్రులను కలిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో కాదు.. దేశంలో ఎక్కడైనా పార్టీ ఆఫీసు పెట్టుకోవచ్చు. తెలంగాణ వచ్చినందుకు 11 రోజులు అన్నం తినలేదని పవన్ కల్యాణ్ చెప్పారు. వాళ్ళ శరీరం నిర్మాణం అయ్యింది తెలంగాణ తిండితో.. బీజేపీ, రేవంత్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ కలిసి అందుతున్న నాటకాలు. అందరూ కలిసి మ్యాచ్ ఫిక్స్ రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
ట్రాన్స్ఫర్ నుంచి టెండర్ దాకా స్కామ్‌లే
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ట్రాన్స్ఫర్లు మొదలు టెండర్ల వరకు అన్నింటా స్కాములే జరుగు తున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం కారణంగా దాదాపు 30 ఏళ్ల తర్వా త సింగరేణి నష్టాలబాటలో నడుస్తోందని చెప్పారు. సింగరేణిలో కాంగ్రెస్ హయాంలో అన్ని విషయాల్లో స్కామ్‌లు జరుగుతున్నా యని, కమీషన్ల కోసం ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని దుయ్య బట్టారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హరీశ్‌రావు పలు అంశాలపై మాట్లాడారు.తప్పు చేస్తే చట్టపరమైన చర్యలుసింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల లేని బొగ్గు నిల్వలు ఉన్నట్లు చూపుతూ ఆ మేరకు సెస్, ట్యాక్సులు, సీఎస్సార్, డీఎంఎఫ్టీ తదితర పన్నులు కట్టారని.. కానీ క్షేత్రస్థాయిలో అసలు బొగ్గును తవ్వి తీయలేదన్నారు. బొగ్గు నిల్వలు చూపించాలని తాము గనుల దగ్గరికి వెళ్తే అనుమతి ఇవ్వట్లేదని.. అదే సమయంలో పనికిరాని షెల్ బొగ్గును మట్టికుప్పలపై పోస్తూ అదే అసలైన బొగ్గుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.తాము అధికారంలోకి వచ్చాక ఈ అంశంపై విచారణ చేపట్టి తప్పుడు వివరాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హరీశ్‌రావు హెచ్చరించారు. రెండేళ్ల క్రితమే ఉత్పత్తి నిలిచిపోయిన అడ్రియాల గనిలో 1.69 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని పేర్కొనడం కాంగ్రెస్ సర్కార్ అవినీతి పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.సీఎం బావమరిదికే లాభంఓపెన్ కాస్ట్ గనుల్లో ఓవర్ బర్డెన్ తొలగింపు పనుల్లో కమీషన్లు దండుకోవడం కోసమే సైట్ విజిట్ విధానం అమల్లోకి తెచ్చారని హరీశ్‌రావు ఆరోపించారు. సైట్ విజిట్ తెచ్చిన తర్వాత ప్రతిసారీ ఎక్సెస్‌కే టెండర్లు వెళ్తున్నాయని.. ఇలా ఎక్స్స్ టెండర్ దక్కించుకున్న తొలి కంపెనీ శోధా కన్స్ట్రక్షన్స్ ఓనర్ సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డి అని హరీశ్‌రావు పేర్కొన్నారు. సైట్ విజిట్ నిబంధన అమల్లోకి వచ్చాక ఎక్సెస్ టెండర్ల వల్ల సింగరేణిపై రూ. 1,000 కోట్లకుపైగా అదనపు భారం పడిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి వివిధ బ్యాంకుల్లో సింగరేణికి రూ.3,200 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండేవని.. ప్రస్తుతం రూ. 4,300 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ)కి సింగరేణి వెళ్లిందని వివరించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ, వనమా వెంకటేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు, రవిచంద్ర, ఎమ్మెల్సీలు టి.రవీందర్రావు, తాతా మధు తదితరులు పాల్గొన్నారు. -
మెట్రో పేరుతో డ్రామాలు
గచ్చిబౌలి/మియాపూర్: సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్ మెట్రో విషయంలో డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఆరోపించారు. కేంద్రాన్ని రేవంత్‌రెడ్డి ఏదో అడిగినట్లు, కిషన్‌రెడ్డి ఏదో తీసుకొస్తున్నట్లుగా ఢిల్లీలో మళ్లీ నాటకాలు మొదలు పెట్టారని ఆయన విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన పార్టీ సభ్యత్వ, ‘సర్’శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మెట్రోకు చెందిన రూ. 30 వేల కోట్ల విలువైన ఆస్తులపై సీఎం రేవంత్ కన్నేశారని.. అందుకే అధికారులను బ్లాక్మెయిల్ చేసి రాష్ట్రం నుంచి తరిమేశారని ఆరోపించారు. 250 ఎకరాలను కుటుంబ సభ్యులకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎల్ అండ్ టీకి ఉన్న రూ. 14 వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తామని చెప్పి మెట్రో రైళ్లను దివాలా తేయించే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. కిషన్‌రెడ్డికి, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే లక్డీకాపూల్ నుంచి పటాన్చెరు వరకు గతంలో తాము ప్రతిపాధించిన మెట్రో రైలు అలైన్‌మెంట్‌కు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. జనసాంద్రత ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేస్తే రేవంత్‌రెడ్డి రద్దు చేశారని కేటీఆర్ మండిపడ్డారు. శేరిలింగంపల్లిని రూ. 9,500 కోట్లతో అభివృద్ధి చేశాం.. శేరిలింగంపల్లిలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ. 9,500 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని కేటీఆర్ చెప్పారు. సినీహీరో రజనీకాంత్ శేరిలింగంపల్లి ప్రాంతాన్ని చూసి హైదరాబాద్‌లో ఉన్నానా లేక అమెరికాలో ఉన్నానా అనే సందేహం కలుగుతోందని అన్నారంటే ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందో అందరూ గుర్తుచేసుకోవాలన్నారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని అంటున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ముందు వారిని లక్షాధికారులను చేయాలని సూచించారు. ఒక్కో మహిళకు రూ. లక్షన్నర ఇస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ విసిరారు. కార్యకర్తలే డ్రైవర్లు.. ‘కారు’కు కార్యకర్తలే డ్రైవర్లని, పదవి ఇచ్చినా ఇవ్వకున్నా ప్రతి ఒక్కరూ కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం అహారి్నశలూ శ్రమిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కార్యకర్తలతో కరచాలనం చేస్తూ, సెల్ఫీలు దిగుతూ కేటీఆర్ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు వివేకానంద, నాయకులు రాగడి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొమిరిశెట్టి సాయిబాబ, బొబ్జానవతా రెడ్డి, రోజా రంగారెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అర్జున్‌రెడ్డి హిట్.. రేవంత్‌రెడ్డి ఫట్
శంషాబాద్: ‘‘ఆమధ్య విడుదలైన అర్జున్‌రెడ్డి అనే సినిమా సూపర్ హిట్ అయ్యింది.. కానీ మన రాష్ట్రంలో ఇంటర్వెల్ వరకు వచ్చిన రేవంత్‌రెడ్డి సినిమా మాత్రం ఫట్ అయ్యింది. సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత నష్టపోతాడు. కానీ ఇక్కడ మాత్రం రేవంత్‌రెడ్డి సినిమాతో రాష్ట్రంలో 4 కోట్ల మంది నష్టపోతున్నారు’’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు విమర్శించారు.రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలకు ఆదివారం శంషాబాద్‌లో నిర్వహించిన ‘సర్’ప్రక్రియ అవగాహన కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని గప్పాలు చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి... ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలోని 1.67 కోట్ల ఆడబిడ్డల ఖాతాల్లో రూ. లక్షన్నర చొప్పున జమ చేస్తే రాజకీయాలను మానేస్తానని సవాల్ విసిరారు. నిరుద్యోగులకు ఇస్తానన్న రూ. 4 వేలతోపాటు పెన్షన్‌ను రూ. 4 వేలకు పెంచుతానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రాహుల్‌బంధు మాత్రమే : రాష్ట్రంలో ప్రస్తుతం రైతుబంధు లేదని.. రాహుల్ బంధు మా త్రమే ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రైతులకు యురియా లేదని.. కనీసం వాటిని దాచుకోవడానికి సంచులు ఇక్కడ ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని సంచులు ముట్టజెప్పి రెన్యూవల్ చేయించు కుంటున్న సీఎం మాత్రమేనని వ్యాఖ్యానించారు. సర్ ప్రక్రియను బూత్ స్థాయి కార్యకర్తలు నిశితంగా పరిశీలించి దొంగ ఓట్లను తీయించి అసలు ఓట్లు ఉండేలా చూడాలన్నారు. అలాగే క్రియాశీల సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మహేశ్వర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి.సబితారెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్‌రెడ్డి, వాణీదేవి తదితరులున్నారు. -
ఈ విషయాన్ని కేసీఆర్ చెప్పమన్నారు: కేటీఆర్
ఆదిలాబాద్: ప్రభుత్వం వ్యవసాయ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. కల్లబొల్లి మాటలతో రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. సిరికొండ మండలం పొన్నలో శనివారం కేటీఆర్ పర్యటించారు. రైతు పాండురంగ కుటుంబాన్ని పరామర్శించారు. ‘‘రైతులు పండించిన ప్రతి పంటను తప్పకుండా ప్రభుత్వం కొనాల్సిందే. ఇలాంటి ఆత్మహత్యలను నివారించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఎంతమంది రైతులు చనిపోయారో అంతమంది రైతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాల్సిందే. మెడలు వంచి నష్టపరిహారం వచ్చేలా చేస్తాం. వారికి ధైర్యం చెప్పడానికి వారి కుటుంబానికి అండగా మేమున్నామని ధైర్యాన్ని ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాము. రెండు సంవత్సరాల్లో తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. అప్పటివరకు రైతులు ధైర్యంగా ఉండాలని కేసీఆర్ చెప్పమన్నారు’’ అని కేటీఆర్ తెలిపారు.రైతులు భయపడుతున్నారువ్యవసాయం చేయాలంటేనే రైతులు భయపడుతున్నారని కేటీఆర్ చెప్పారు. రైతు పండించిన ప్రతి పంటను ప్రభుత్వం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. వారం రోజులు కల్లాల్లో పంట కొనుగోలు కోసం ఎదురుచూసి ఎవరూ కొనకపోవడం వల్ల అప్పుల వాళ్ల బాధ భరించలేక పాండురంగ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.‘‘ప్రభుత్వం వ్యవసాయ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పక్కనే ఉన్న మహారాష్ట్ర కన్నా ఆదిలాబాద్ పత్తి పంటలు సాగులో మొదటి స్థానంలో ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు ఎంతోమంది రైతులకు ఆసరా అయింది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. మా పార్టీ తరఫున వారి కుటుంబానికి మూడు లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నాం. కానీ ప్రభుత్వం కూడా రైతులను ఆదుకోవాలి. రైతు బీమా ప్రీమియం కూడా కట్టలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఎలక్షన్లకు రాజకీయాలు చేద్దాం.. ఎలక్షన్లప్పుడు కొట్టుకుందాం.. ప్రజలు ఎవరికీ ఓటు వేస్తే వాళ్లు కుర్చీలో కూర్చుంటారు.. కానీ మా మీద కోపం రైతుల మీద తీయొద్దు. మీరు ప్రాణాలు తీసుకోవద్దు.. ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఎక్కడ రూ.500 బోనస్? అని ఎందుకు కొనరు? అని ప్రభుత్వాన్ని నిలదీయండి. మీకు అండగా మేముంటాం.. ఎవరూ బలిదానాలు చేసుకోవద్దు’’ అని కేటీఆర్ చెప్పారు. -
రేవంత్‌కు డబుల్ ట్రబుల్?
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ క్రీడలో పోటీ పడుతున్నాయి. రాజకీయాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉంటే ఫర్వాలేదు కాని, అవి నష్టం చేసేలా ఉంటే మాత్రం చాలా ప్రమాదకర క్రీడ అవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో అలాంటి అపాయం సంభవిస్తుందేమో అన్న అనుమానం వస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు కొత్త సంక్షోభంలోకి వెళుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంకట పరిస్థితిని సృష్టిస్తున్నదా? లేక ఆయన అనుభవరాహిత్యం కారణమా? అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది.మెట్రో రైలు ప్రాజెక్టును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు కొంతకాలం క్రితం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు గాను ఆ కంపెనీకి సుమారు 1400 కోట్లు ముట్టచెప్పడానికి, 13600 కోట్ల రుణాన్ని భరించడానికి ఒప్పందం అయినట్లు కూడా వెల్లడించారు. అంతా సజావుగా జరిగితే ప్రభుత్వానికి కొంత భారం అయినా, రేవంత్ సర్కార్‌కు ప్రతిష్ట వచ్చేది. ప్రభుత్వం కోరినట్లు 13600 కోట్ల మొత్తాన్ని రుణంగా ఇచ్చేందుకు భారత రైల్వే ఆర్థిక సంస్థ(ఐఆర్ఎఫ్సీ) అంగీకరించింది. దీంతో అంతా హాపీస్ అనుకుంటున్న వేళ ఆ సంస్థ వెనక్కి తగ్గడం రేవంత్ ప్రభుత్వానికి పెద్ద గండంగా మారింది. మెట్రో రెండోదశ నిర్మాణానికి సుమారు నలభై వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తూ డీపీఆర్‌ను కేంద్రానికి రాష్ట్రం పంపించింది. దీనికి కూడా ఆమోద ముద్ర పడలేదన్నది రేవంత్ ఆరోపణ.రుణం మంజూరు ఆగిపోవడం కాని, రెండో దశ నిలిచిపోవడానికి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కారణమని, ఆయన వెనుక బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఉన్నారని రేవంత్ ఆరోపించారు. దీనిని కిషన్ రెడ్డి తోసిపుచ్చినా, సహజంగానే కేంద్రంపైన సందేహాలు వస్తాయి. అందులోనూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేయడానికి వెనుకాడటం లేదన్న విమర్శ ఉంది. నిజంగానే రేవంత్ చెప్పినట్లు కేంద్రం కనుక మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో ఇలాగే వ్యవహరించి ఉంటే వచ్చే ఎన్నికలలో బీజేపీకి చేటు అవుతుంది. అయితే రేవంత్‌వి తప్పుడు ఆరోపణలు అని బీజేపీ తిప్పికొడుతోంది. కాని నిర్దిష్టమైన సమాధానాలు ఇచ్చినట్లు కనిపించలేదు.బీజేపీ రాజకీయం ఇలా ఉంటుందని రేవంత్ సర్కార్ ఆలోచించలేక పోయిందా? ఇక్కడే ఆయన అనుభవ రాహిత్యం కనిపిస్తోందా? సాధారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ఇలాంటి గేమ్ ఆడుతూనే ఉంటాయి. అలాగే ప్రతిదానికి కేంద్రంపై నెపం నెట్టి రాష్ట్రంలోని అధికార పార్టీ తనవంతు రాజకీయం తాను ఆడుతుంది. ఈ గేమ్ ప్రమాదకరంగా మారనంతవరకు ఫర్వాలేదు. కాని ఇప్పుడు మెట్రో రైల్ ప్రాజెక్టు భవిష్యత్తు సంకటస్థితిలో పడుతోంది. ఆ ప్రాజెక్టుకు ఏడాదికి 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు నష్టం వస్తోంది. ఈ ప్రాజెక్టుకు సుమారు 30వేల కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. అది కరెక్టు అయితే ఎల్ అండ్ టీ ఎందుకు 15వేల కోట్లకే అంగీకరించిందన్న ప్రశ్నను బీఆర్ఎస్ నేతలు వేస్తున్నారు. అంటే ఈ కంపెనీకి ఉన్న ఆస్తులపై రేవంత్ టీమ్ కన్నేసిందని ఆ నేతలు ఆరోపిస్తున్నారు.ఐఆర్టీసీ నుంచి తక్కువ వడ్డీకి రుణం వస్తుందని, అందువల్ల మెట్రోని లాభాల పట్టించవచ్చన్న ఆశ రాష్ట్రానికి ఉన్నా, ఇప్పుడు పరిస్థితి ఎదురు తిరిగింది. కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్వని వైభవ్, కిషన్ రెడ్డిలు కూడబలుక్కుని రుణం ఆపారా? లేక ఆదాయంలో రుణ వాయిదా చెల్లించాలన్న కండిషన్ కారణంతో రుణం ఆగిందా అన్నది చర్చగా ఉంది. ఆర్బీఐ కూడా ఈ రుణం మంజూరుకు ఓకే చేసిన తర్వాత కేంద్రం అడ్డు పడడం కుదురుతుందా? అలా ఆగిపోవడానికి కేంద్రం నుంచి లేఖ ఏదైనా వెళ్లిందా? లేక మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారా అన్నదానిపై ఎవరికి వారు తోచిన విధంగా మాట్లాడుకుంటున్నారు. ఈ డీల్ పూర్తి అయితే కాంగ్రెస్‌కు, రేవంత్‌కు పేరు వస్తుందని, దానివల్ల బీజేపీకి ఏమి లాభమన్న ఆలోచన జరిగిందన్నది మరో ఆరోపణ. కాగా కేసీఆర్ టైమ్‌లో ప్లాన్ చేసిన రెండో దశను రేవంత్ రద్దు చేసి, జనం లేని ఫ్యూచర్ సిటీ నుంచి ఎయిర్ పోర్టుకు ప్లాన్ చేయడం కూడా నష్టం చేసిందా అన్నది మరో పాయింట్‌గా ఉంది.ఈ మధ్యకాలంలో ప్రధాని మోదీతో రేవంత్ మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారన్న భావన ఉంది. కొద్ది రోజుల క్రితం నీతి అయోగ్ సమావేశానికి వెళ్లినప్పుడు కూడా ఆయనతో ముఖాముఖీ మాట్లాడారు. అప్పుడు ఈ మెట్రో గురించి చర్చించారా? లేదా? చర్చించినా ఈ ప్రాజెక్టుకు ఈ సమస్య ఎదురైందంటే ఏమని అర్థం అవుతుంది. రాజకీయాలలో వీటన్నిటిని ముందుగా ఊహించుకుని ఒక వ్యూహంతో వెళ్లాలి. లేకుంటే సహజంగానే ప్రజాస్వామ్య రాజకీయాలలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకు ఉమ్మడి ఏపీలో కేంద్రం తమకు సహకరించడం లేదని, అనేక ప్రాజెక్టులను పెండింగులో పెడుతోందని టీడీపీ వ్యవస్థాపకుడు, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీరామారావు విమర్శించేవారు. కేంద్రం ఒక మిధ్య అని కూడా సీరియస్ వ్యాఖ్య చేశారు. తెలంగాణకు ఆర్థికంగా రావల్సిన మొత్తాలు రావడం లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పలుమార్లు విమర్శలు చేశారు. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేయడం లేదని కిషన్ రెడ్డి తదితరులు వాదిస్తుంటారు.ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం ద్వారా ఇబ్బంది పెట్టడానికి కొందరు బీజేపీ నేతలు ప్రయత్నించేవారు. జగన్ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పు చేసిందంటూ గతంలో బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి ఒక తప్పుడు ఆరోపణతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు అప్పట్లో వినతిపత్రం అందచేశారు. తద్వారా విపక్ష టీడీపీకి మేలు చేయడానికి ఆమె యత్నించేవారు. అంతెందుకు! ఎన్నికల సమయంలో ఏపీలో జగన్ ప్రభుత్వానికి సంబంధం లేకుండా పలువురు ఐపీఎస్, ఐఏఎస్ లను కూటమి ప్రయోజనం కోసం బీజేపీ నేతలు పోస్టు చేయించుకున్నారు. అంతేకాక ఏకంగా ఏభై లక్షల మాయ ఓట్లు అదనంగా అర్ధరాత్రి వేళ పోల్ అవడం వెనుక ఎవరు ఉన్నది అర్థం చేసుకోలేరా? దీనిపై పరకాల ప్రభాకర్ ఎన్ని విమర్శలు చేసినా నోరు తెరవడం లేదంటేనే పరిస్థితి అర్ధం చేసకోవచ్చు.ఇవన్ని ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తన అధికారాన్ని ప్రదర్శించడం మొదలు పెడితే రాష్ట్రాలను చాలా రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తుంది. దీనికి తగినట్లు రాష్ట్రాలలోని విపక్ష ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలి. సోనియాగాంధీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం కూడా ఇలాంటివెన్నో చేసిందన్నది సర్వవిధితమే. ఆమె తెలివి తక్కువగా సొంత పార్టీ నేతలను కూడా కష్టాల పాలు చేసి జైళ్లలో పెట్టి, చివరికి తన అధికారాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరింత అధికంగా ఇలాంటి రాజకీయాలు చేస్తోందన్న భావన ఉంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని రేవంత్ మెట్రో వ్యవహారంలో ఆచితూచి అడుగు వేయకుండా లేచిందే లేడికి పరుగు అన్నట్లు వ్యవహరించి ఇబ్బంది పడుతున్నారనిపిస్తుంది.ఏడాదికి మహా అయితే 500 కోట్ల నష్టం రావచ్చు. దానిని భరించే శక్తి ప్రభుత్వానికి ఉంటుంది. అలాకాకుండా ఏదేదో చేయాలని భావించి ఊబిలో చిక్కుకున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ కళ్లు తెరచి కొత్త ఆలోచన చేయకపోతే అది రాష్ట్రానికి నష్టం చేస్తుందని చెప్పవలసి ఉంటుంది. కాగా మరో అంశం కూడా చూడాలి. కాంగ్రెస్ ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్‌లో రాజ్యసభకు పోటీచేస్తే ఆమెపై ఏదో కేసు ఉన్నట్లు కాంగ్రెస్ నేతలే బీజేపీవారికి ఉప్పందించినట్లు వచ్చిన సమాచారం ఆ పార్టీకి తీరని చేటు అవుతుంది. దీని వెనుక రేవంత్ హస్తం ఉందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు. అయితే ఈ విషయంలో రేవంత్.. బీజేపీపై ఘాటైన విమర్శలే చేశారు. ఓట్ చోరీతో పాటు సీట్ చోరికి బీజేపీ పాల్పడిందని ఆయన ఆరోపించారు. కాగా ఓటుకు నోటు కేసులో ఉన్నది రేవంతేనని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్ రిటర్నింగ్ అధికారి వ్యవహరించిన తీరు కూడా ప్రజాస్వామ్యయుతంగా లేదన్నది నిజమే. మొత్తం మీద ఇలాంటి ఘటనలు చూసినప్పుడు కాంగ్రెస్‌లో అంతా సజావుగా లేదన్న సంగతి అర్థం అవుతుంది. అటు ప్రభుత్వపరంగా, ఇటు పార్టీపరంగా డిఫెన్స్‌లో పడితే అది కాంగ్రెస్‌తో పాటు రేవంత్ భవిష్యత్తు రాజకీయానికి ఇక్కట్లు తేవచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
దాన్యం కొనుగోళ్ల నుంచి ప్రభుత్వం తప్పుకుంటోంది
సాక్షి, హైదరాబాద్: పంట బోనస్‌కు కోతలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ధాన్యం కొనుగోళ్ల బాధ్యత నుంచి కూడా తప్పుకోవాలని చూస్తోందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. డిజిటల్ కేబినెట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసేలా ఉన్నాయని మండిపడ్డారు. ఇకపై కేంద్రం నిర్దేశించిన కోటాకు లోబడి మాత్రమే ధాన్యం కొనుగోళ్లు చేస్తామని చెప్పడం అంటే రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోళ్ల నుంచి చేతులెత్తేసినట్టేనని పేర్కొన్నారు.రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనకపోతే వారు ఏం చేయాలన్న ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని హరీశ్‌రావు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పంట బోనస్ విషయంలో కూడా ప్రభుత్వం రైతులపై కొత్త షరతులు విధిస్తోందని హరీశ్‌రావు మండిపడ్డారు. కేవలం ఏడు రకాల సన్న ధాన్యాలకు మాత్రమే బోనస్ వర్తింపజేయడం ద్వారా సాగుపై ఆంక్షలు విధిస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లకు పరిమితులు విధించడం రైతులను మార్కెట్ దయాదాక్షిణ్యాలపై వదిలేయడమేనన్నారు.కేసీఆర్ రైతన్నను రాజుగా నిలబెట్టారని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం రైతును ఆర్థికంగా దెబ్బతీసే విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో నీటి నిర్వహణ విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీశ్‌రావు విమర్శించారు. ప్రాజెక్టుల్లో నీటి కొరత ఉందని చెబుతూనే ఆంధ్రప్రదేశ్‌కు 10 టీఎంసీల నీటిని ఎందుకు వదిలారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుభరోసా చెల్లింపుల విషయంలో బహిరంగ సభలు నిర్వహించడం హాస్యాస్పదమని, గతంలో పెండింగ్‌లో ఉన్న మూడు విడతలతోపాటు ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతుభరోసా నిధులు కలిపి మొత్తం రూ.16,545 కోట్లను ఈ నెల 30న మధిర వేదికగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. -
కావాల్సిన సీట్లపై కర్ఛీఫ్ వేశారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రులు ఇద్దరు తమ రాజకీయ వారసుల కోసం ఇప్పటినుంచే నియోజకవర్గాలను సెట్ చేస్తున్నారా? అసెంబ్లీ ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందే పరిస్థితులకు అనుగుణంగా పావులు కదుపుతూ, కాంగ్రెస్ మార్కు రాజకీయం చేస్తూ కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం వ్యూహాలు పన్నుతున్నారా? వీరి వ్యూహాల్లో ఒక చోట రాజ్యసభ సభ్యుడు, మరోచోట లోక్‌సభ సభ్యుడు పాలుపంచుకుంటున్నారా? వీరి సహకారం వెనుక మరో తంత్రం ఉందా? అంటే.. పాలకుర్తి, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితులను బట్టి చూస్తే అవుననే సమాధానమే లభిస్తోంది. తన అల్లుడు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘు రామిరెడ్డి కుమారుడు అర్జున్‌రెడ్డి కోసం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాలకుర్తిపై, తన కుమార్తె త్రిష కోసం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంపై గురి పెట్టారని స్థానిక కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సులభంగా టికెట్ తెచ్చుకోగలమని, ఒకవేళ జరగకపోతే రేసులో గట్టిగా ఉండాలనే ఆలోచనతో ఇద్దరు మంత్రులు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల్లోని వివాదాల వ్యవహారం టీపీసీసీ క్రమశిక్షణా సంఘం ముందుకు రావడం గమనార్హం. పాలకుర్తిలో కదులుతున్న పావులుపాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి అసమ్మతి సెగలు భారీగా తగులుతున్నాయి. ఆమె అత్త, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డికి వ్యతిరేకంగా పలువురు కాంగ్రెస్ నేతలు గళమెత్తుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఝాన్సీరెడ్డిని కాదని ఇతర అభ్యర్థులకు వారు బహిరంగంగానే మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి యశస్వినిరెడ్డితో కలిసి ఝాన్సీరెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే యశస్వినిరెడ్డి ఫిర్యాదు చేసిన ఇద్దరు నేతలు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన సమయంలో ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి కూడా వారితో కలిసి రావడం పార్టీలో చర్చనీయాంశమవుతోంది. పార్టీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి మద్దతుగా ఎంపీ రాగా, ఇందుకు మంత్రి పొంగులేటి సహకారం ఉందని, పాలకుర్తి నుంచి ఈసారి తన కుమారుడిని పోటీ చేయించే ఆలోచనలో రఘురామిరెడ్డి ఉన్నారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే అసమ్మతి నేతలకు ఆపన్న హస్తం అందిస్తున్నారనేది బహిరంగ రహస్యమేనని పార్టీ శ్రేణులంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఫిర్యాదుపై నిర్ణయం తీసుకునేందుకు కూడా టీపీసీసీ వెనుకాడుతోందనే చర్చ జరుగుతుండడం గమనార్హం. కాగా మరోవైపు ఈ అసమ్మతి నేతలకు సీఎం సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి మద్దతు కూడా ఉందని, తన కుమారుడు కృష్ణభార్గవ్ రెడ్డి వేం కోసం పాలకుర్తిపై కన్నేసిన నరేందర్‌రెడ్డి ఇప్పటినుంచే జాగ్రత్త పడుతున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది.జహీరాబాద్‌లో దామోదర వ్యూహంఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంపై దృష్టి పెటారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచి తన కుమార్తె త్రిషకు ఆయన టికెట్ అడిగే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే జహీరాబాద్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌కు పొగ పెడుతున్నారని స్థానిక కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయనకు స్థానిక ఎంపీ సురేశ్ షెట్కార్ కూడా సహకరిస్తున్నారని తెలస్తుండగా, మరోవైపు ఆయన కూడా ఆ స్థానం తనకు కావాలని అడిగే ఆలోచనలో ఉన్నారని, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈసారైనా ఎమ్మెల్యే కావాలనే వ్యూహంతో షెట్కార్ ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి సహకారంతోనే మాజీ మంత్రి చంద్రశేఖర్‌పై ఫిర్యాదు చేసేందుకు స్థానిక కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ వరకు వచ్చారని చెబుతున్నారు. -
ప్రజల దృష్టి మళ్లించేందుకే సీఎం కొత్త డ్రామాలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు విమర్శించారు. గత రెండున్నరేళ్లలో ప్రధాని మోదీని పలుమార్లు కలిసిన సీఎం... కేంద్రమంత్రులను కలవడానికి అడ్డంకులు కల్పిస్తున్నారనడం హాస్యాస్పదమన్నారు. సీఎం మాటలు చెప్పడంలోనే కాకుండా...ఇప్పుడు అబద్ధాల ప్రచారంలోనూ ప్రావీణ్యం సంపాదించారని ఎద్దేవా చేశారు. అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజమని నమ్మించేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తమ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని దాచేందుకే రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.బుధవారం బీజేపీ కార్యాలయంలో రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరుతూ కిషన్ రెడ్డికి సీఎం లేఖ రాయడం అత్యంత హాస్యాస్పదమన్నారు. ఇప్పటివరకు సీఎం ఢిల్లీకి 71సార్లు వెళ్లారని, కనీసం 15సార్లు కేంద్రమంత్రులను కలిశారని గుర్తుచేశారు. ఆ సందర్భాల్లో ఎప్పుడైనా కిషన్‌రెడ్డికి చెప్పి కలిశారా? ఇప్పుడు అపాయింట్మెంట్ ఇప్పించడం లేదంటూ కిషన్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం బూటకమేనని మండిపడ్డారు. కేవలం ప్రజలను తప్పుదారి పట్టించేందుకే రేవంత్ రెడ్డి ఈ లేఖ రాశారని దుయ్యబట్టారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై, బీజేపీపై నిరాధార ఆరోపణలు చేయడం వెంటనే మానుకోవాలన్నారు. మెట్రో విస్తరణ ఆలస్యానికి కేంద్రం, కిషన్ రెడ్డి కారణం కాదని, కేవలం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే ప్రధానకారణమని పేర్కొన్నారు. కాగా, సీనియర్ సినీ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి, నిర్మాత బండి శ్రీనివాస్ బీజేపీలో చేరడం పట్ల రాంచందర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ పాలన డిజాస్టర్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘కాంగ్రెస్ హయాంలో సంక్షేమం దారి తప్పి అభివృద్ధి కుంటుపడి పాలన డిజాస్టర్‌గా నిలిచింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనకు హిట్లర్ స్ఫూర్తి అంటాడు. ఎవడన్నా బుద్ధి ఉన్నోడు రావణాసురుడు, నరకాసుడు స్ఫూర్తి అంటాడా? ఆ వ్యాఖ్యలతోనే ఆయన నిజస్వరూపం బయటపడింది’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులకు ఎస్ఆర్ఐపై బుధవారం శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అధ్యక్షత వహించగా కేటీఆర్ తన ప్రసంగంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మలపై ధ్వజమెత్తారు. మంత్రుల అనుచరుల దందా కోసం..ఖమ్మం వెలుగుమట్లలో పేదలు కట్టుకున్న వేయి ఇళ్లను రాత్రికి రాత్రి ప్రభుత్వం రాక్షసంగా కూల్చేసిందని తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల అనుచరుల రియల్ ఎస్టేట్ దందా, సీఎం పైశాచికానందం కోసం ఆడబిడ్డలను రోడ్డున పడేశారన్నారు. రాష్ట్ర ఆదాయం పడిపోతుంటే ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల అవినీతి సామ్రాజ్యం మాత్రం వేల రెట్లు పెరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. పొంగులేటి ములుగు జిల్లాలో రూ.4 వేల కోట్ల విలువైన ఇసుక దోచుకుంటున్నారని విమర్శించారు.సంక్షోభంలో వ్యవసాయ రంగంవ్యవసాయ రంగం, రైతాంగం సంక్షోభంలో ఉందని.. పంట చేతికొచ్చి 60 రోజులు దాటినా ధాన్యం కొనే దిక్కులేదని కేటీఆర్ తెలిపారు. వ్యవసాయ మంత్రి తుమ్మల రైతుల శ్రేయస్సును గాలికొదిలేస్తే.. డిప్యూటీ సీఎం కమీషన్ల దందాల్లో జోరుగా ఉన్నారని ఆరోపించారు. ‘ప్రభుత్వానికి ఇంటర్వెల్ (రెండున్నరేళ్లు) అయిపోయింది.. ఫస్ట్ హాఫ్ మొత్తం అట్టర్ డిజాస్టర్‘అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘హౌసింగ్ మంత్రిగా ఉన్న పొంగులేటి.. 20 లక్షల ఇళ్లు కట్టించాకే మీ గుమ్మానికి వచ్చి ఓట్లు అడుగుతాం‘అని అంటున్నారని.. ఆ మాట మీద నిలబడే దమ్ము ఉందా అని కేటీఆర్ సవాల్ విసిరారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బాండ్ పేపర్లు రాసి ఆరు గ్యారంటీల కార్డులను 99 రోజులు భద్రంగా దాచుకోమన్నారని.. ఇప్పుడు ఆ కార్డులను ఎక్కడ పెట్టుకోవాలో చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. పేదల కళ్లలో ఆనందం చూడాలనే ఉద్దేశం, రాష్ట్ర అభివృద్ధి కోసం నాడు సీఎంగా కేసీఆర్ అప్పు చేశారని కేటీఆర్ అన్నారు. రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి గోదావరి నీళ్లు తెస్తే, ఖమ్మం జిల్లా రైతుల కోసం సీతారామ ప్రాజెక్టును 80 శాతం కట్టించి, భక్త రామదాసు ప్రాజెక్టును 9 నెలల్లోనే పూర్తి చేశారన్నారు. ఈ సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, నేతలు లింగాల కమల్‌రాజ్, రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు. -
తెరవెనుక బాగోతం నడిచింది
సత్తుపల్లి: బుగ్గపాడు ఫుడ్‌పార్క్ భూములను ఎకరం రూ.40.47 లక్షలుగా నిర్ణయించి, రూ.21 లక్షలకే కేటాయించారంటే తెర వెనుక బాగోతం నడిచినట్టేనని బీజేపీ తమిళనాడు రాష్ట్ర కో ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు ఫుడ్‌పార్కు భూములను పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వరరావుతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. తక్కువ ధరకు భూమి కేటాయింపులో అవినీతి, కుట్ర, కుంభకోణం దాగి ఉందని, ఇదంతా ప్రభుత్వంలోని జిల్లాకు చెందిన ముఖ్యనేత కన్నుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. పరిశ్రమల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని.. తక్కువ ధరకు కేటాయింపులనే వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎవరి ప్రమేయంతో జరిగిందో చెప్పాలి? ఏపీకి చెందిన దీపక్ నెక్స్ట్ జెన్ కంపెనీకి 72 ఎకరాలు కేటాయించడం వెనుక ఆంతర్యం ఏమిటో, కేబినెట్ అనుమతితో జరగాల్సిన భూకేటాయింపు అందుకు విరుద్ధంగా ఎవరి ప్రమేయంతో జరిగిందో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఫుడ్‌పార్కు అభివృద్ధి నిధులు రూ.109 కోట్లలో కేంద్ర ప్రభుత్వం రూ.49.70 కోట్లు ఇచ్చిందని తెలిపారు. భూ కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌తో దర్యాప్తు చేయించేలా కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అనంతరం ఆయన హైవేలోని వేంసూరు ఎగ్జిట్ వద్ద మొక్కలు నాటారు. -
ఆ కేంద్రమంత్రి ఎవరో చెప్పండి.. సీఎంకి కిషన్‌రెడ్డి సవాల్
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ మెట్రో ఫేజ్–2 ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. తనపై ముఖ్యమంత్రి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం ఏనాడూ చేయలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను తాను అడ్డుకుంటున్నట్టుగా చెప్పిన కేంద్రమంత్రి ఎవరో చెప్పాలని సవాల్ విసిరారు. మంగళవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కిషన్‌రెడ్డి ఆపమంటే కేంద్రం ఆపదు ‘మెట్రో ఫేజ్–2 విషయంలో 50:50 నిష్పత్తిలో ముందుకెళ్లేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ కూడా ఈ విషయం రేవంత్‌రెడ్డికి తెలిపారు. మెట్రో ఫేజ్–1కు కేంద్ర ప్రభుత్వం రూ.1,250 కోట్లు అందించింది. ప్రధాని మోదీ స్వయంగా ఆ ప్రాజెక్టును ప్రారంభించారు. దేశంలోని ఇతర నగరాలకు సహకరించినట్లే హైదరాబాద్‌కు కూడా సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం సహకరిస్తుంది. అంతేకానీ కిషన్‌రెడ్డి ఆపమంటే ప్రాజెక్టులు ఆపే సంస్కృతి కేంద్రంలో లేదు. తెలంగాణ అభివృద్ధి విషయంలో మాకు చిత్తశుద్ధి ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్ లేదా రేవంత్‌రెడ్డి సర్టిఫికెట్లు మాకు అవసరం లేదు. నేను తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉంటా..’అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కిషన్‌రెడ్డి ఆపారనడం సీఎంకు తగదు ‘మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఐఆర్ఎఫ్సీతో రాష్ట్ర ప్రభుత్వం రూ.13,500 కోట్ల రుణ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నిధుల మంజూరును నేను ఆపాననడంలో కూడా వాస్తవం లేదు. దీనిపై కేంద్ర మంత్రి ఖట్టర్‌తో మాట్లాడా. మెట్రోకు వచ్చే ఆదాయం నుంచి ముందుగా ఐఆర్ఎఫ్సీ రుణాలను చెల్లించాలని కేంద్రం కోరుతోంది. కానీ ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం లేదని ఖట్టర్ చెప్పారు. నిజానికి దేశవ్యాప్తంగా ఏ మెట్రో ప్రాజెక్టులోనూ అప్పులను ముందే చెల్లించరు. ప్రాజెక్టు నిర్వహణ ఖర్చులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే నిర్వహణ ఖర్చులు పోను మిగిలిన ఆదాయంతో రుణాలు చెల్లించేలా చూస్తేనే మెట్రో మనుగడ సాగిస్తుందని నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఆయన అంగీకరించలేదు. సాంకేతిక, ఆర్థిక అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చుని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప, నిధులు ఇవ్వొద్దని కిషన్‌రెడ్డి చెప్పారని ఆరోపించడం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగదు..’అని కేంద్రమంత్రి ధ్వజమెత్తారు. కేంద్రం నిధుల వెల్లువ.. తెలంగాణ అభివృద్ధికి ఏ వివక్ష లేకుండా కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోందని కిషన్‌రెడ్డి వివరించారు. ‘రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.1.75 లక్షల కోట్లు వెచ్చించారు. – రాష్ట్రానికి ఇటీవల 50 ఏళ్ల కాలపరిమితితో రూ.11 వేల కోట్ల వడ్డీ లేని రుణాన్ని కేంద్రం అందించింది. – మూసీ పునరుజ్జీవనం కోసం ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రూ.4,100 కోట్ల రుణం ఇప్పించింది. – జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) ద్వారా గత 12 ఏళ్లలో రాష్ట్రానికి రూ.లక్ష కోట్ల రుణాలు అందాయి. – ఈ ఏడాది రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కోసం కేంద్రం రూ.34 వేల కోట్లను కేటాయించింది. – గతంలో కేసీఆర్ ప్రభుత్వం భూసేకరణకు సహకరించకపోయినా, కేంద్ర నిధులతోనే ఎంఎంటీఎస్ ఫేజ్–2 పూర్తి చేశారు. – కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, జహీరాబాద్ ఇండ్రస్టియల్ కారిడార్‌తో పాటు 42 రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి..’అని తెలిపారు. నాడు కేసీఆర్.. నేడు రేవంత్ కాలయాపన గతంలో మెట్రో ఫేజ్–1 అలైన్మెంట్ మార్పు పేరుతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు ఏళ్లు కాలయాపన చేశారని, నేడు రేవంత్‌రెడ్డి కూడా ఫేజ్–2 విషయంలో అదే తీరుతో వ్యవహరిస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. మెట్రో ఫేజ్–1 రుణాల విషయం, ఫేజ్–2 ప్రాజెక్టు, ఎన్ఓసీ సాధించడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి ఎప్పుడు వచ్చినా.. ఆయనతో పాటు వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి సమస్యను పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. -
ఆ వార్తల్లో వాస్తవం లేదు: బండి సంజయ్
కరీంనగర్: హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారనేది అసత్య ప్రచారమని మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే వాళ్లమైతే రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు, ప్రాజెక్టులు ఎందుకిస్తామని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు బండి సంజయ్.కరీంనగర్ జిల్లా మాన కొండూరులో ఆర్ఎంపీ డాక్టర్లతో ‘ఛాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్లో మావోయిస్టు భావజాల నేతలున్నది నిజమేనని. అలాంటి వారితోనే సమాజానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. మావోయిస్టులే ఆ భావజాలాన్ని వీడి లొంగిపోయారని, వీడకపోతే వారి భవిష్యత్కే నష్టమన్నారు బండి సంజయ్. -
కిషన్‌రెడ్డే అడ్డుకున్నారు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు తొలి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వా«దీనం చేసుకోకుండా, రా ష్ట్రంలో మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టు చేపట్టకుండా కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి కుట్రపూరితంగా అడ్డుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘ఒప్పందం ప్రకారం తొలి దశ ప్రాజెక్టు స్వాదీనానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) నుంచి అవసరమైన రుణం విడుదలకు జూన్ 15 చివరి రోజు. బ్యాంకులు సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. ఈ రోజు కిషన్‌రెడ్డి రుణం విడుదల చేయిస్తడా? చేయించడా? చివరకు రిజర్వ్ బ్యాంకు నుంచీ గ్యారెంటీ తెచ్చి ఇచ్చాం. ఇక ఫిట్టింగ్ పెట్టడానికి ఏం లేదు. రుణం ఆపడానికి కారణం ఏమిటో చెప్పండి. రుణం విడుదల చేయించడానికి మీరు మాట్లాడతరా? మాట్లాడరా? రెండో విడత మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టుకు 50 శాతం నిధుల వాటాతో భాగస్వామ్యానికి కేంద్రం ముందుకు వస్తదా? రాదా? ముందుకు రాకపోతే రాష్ట్రమే పూర్తి వ్యయంతో కట్టుకోవడానికి కేంద్రం ఎన్ఓసీ ఇవ్వాలి. ఉత్తరప్రదేశ్, అహ్మదాబాద్, వైజాగ్‌కు కూడా మెట్రో ఇచ్చారు. విశ్వనగరం హైదరాబాద్‌కు ఇవ్వడం లేదంటే వివక్ష ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవాలి..’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్వోసీ ఇస్తే మీ వాటా అవసరం లేదు.. ‘మెట్రో తొలి దశ ప్రాజెక్టు స్వా«దీనానికి అవసరమైన రుణం కోసం ఐఆర్ఎఫ్సీని ఒప్పించి అన్ని ఒప్పందాలు చేసుకున్నాం. మే 30 నాటికే అప్పు విడుదల కావాలి. జూన్ 1 నుంచి మెట్రోను పూర్తిగా ఎల్అండ్టీ నుంచి స్వా«దీనం చేసుకునేలా ఒప్పందం చేసుకున్నాం. ప్రభుత్వం పెట్టుబడి వాటాగా రూ.1,400 కోట్ల మార్జిన్ మనీతో పాటు రూ.84 కోట్ల పేపర్ ఫీజు కట్టింది. ఐఆర్ఎఫ్సీ రూ.13,600 కోట్ల రుణం విడుదల చేయాల్సి ఉండగా, కరెక్టుగా ఈ సమయంలోనే (గతనెల 20న) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్, 21న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసిన కిషన్‌రెడ్డి.. ఇంత సులువుగా మీరు రేవంత్‌రెడ్డికి అప్పులు ఇస్తే తెలంగాణలో బీజేపీ ఉండాలా? మూసివేయాలా? అని తిరకాసు పెట్టడంతో రుణం విడుదల చేయకుండా కేంద్రం పీటముడి వేసుకుని కూర్చుంది.’ అని సీఎం ఆరోపించారు. ‘రెండో దశ ప్రాజెక్టుకు కేంద్రం ఎన్వోసీ ఇస్తే ఐఆర్ఎఫ్సీ నుంచి 4 శాతం వడ్డీతో మళ్లీ రూ.40 వేల కోట్ల రుణం తెచ్చుకుంటాం. మీ 50 శాతం నిధుల వాటా అవసరం లేదు..’ అని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు ‘ఎవరితో సంబంధం లేకుండా రేవంత్‌రెడ్డి 122 కి.మీ.ల మెట్రో కట్టుకుంటే మోదీ, కిషన్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వం గురించిన చర్చ ఉండదు. అప్పుడు రాజకీయంగా నష్టం వస్తుందనే ఆలోచనతో ఎక్కడికక్కడ ఛిన్నాభిన్నం చేయడానికి బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయి. ఖట్టర్‌ను కలవడానికి వెళ్లినప్పుడు కిషన్‌రెడ్డి నన్నెందుకు తీసుకునిపోడు? వరంగల్ ఎయిర్‌పోర్టు కొలిక్కి వచ్చాక కేంద్రమంత్రి రాంమోహన్ నాయుడిని కలిసి ఏం మాట్లాడిండో ఎందుకు చెప్పడు? అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి ఏం మాట్లాడిండో ఎందుకు చెప్పడు?..’ అని సీఎం నిలదీశారు. కేసీఆర్ వల్ల రూ.7 వేల కోట్ల నష్టం ‘నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2009లో మెట్రో రైలు నిర్మాణానికి టెండర్లు పిలిచారు. వైఎస్ అకాల మరణం తర్వాత నాటి సీఎం రోశయ్య రూ.15 వేల కోట్లతో 70 కి.మీ.ల కారిడార్‌తో 2017లోగా మెట్రో రైలు నిర్మాణం పూర్తి చేయడానికి ఎల్అండ్టీ సంస్థతో పీపీపీ విధానంలో ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించారు. అయితే 2014లో కేసీఆర్ సీఎం అయ్యాక చారిత్రిక కట్టడాల పేరుతో మూడు మార్గాల్లో అలైన్మెంట్ మార్చాలని ఎడతెగని పేచీ పెట్టడంతో పనులు ఆలస్యమై 2020కి కానీ పూర్తి కాలేదు. మూడేళ్ల జాప్యంతో వ్యయం రూ.22వేల కోట్లకు పెరిగింది. షరతులపై షరతులు పెట్టిన కేంద్రం మెట్రో రైలు రెండో దశకు అనుమతి, నిధులివ్వాలని మేము అధికారంలోకి వచ్చాక ప్రధాని, కేంద్ర పట్టణాభివృద్ధి, రైల్వే, ఆర్థిక శాఖల మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశా. ఎల్అండ్టీని భాగస్వామిని చేస్తేనే అనుమతిస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ షరుతు పెడితే ఎల్అండ్టీ తిరస్కరించింది. గత ప్రభుత్వం పనులు స్తంభింపజేయడంతో రూ.7 వేల కోట్ల నష్టం వచ్చిందని పేర్కొంది. ఎల్అండ్టీతో ఒప్పందం చేసుకోవాలంటూ కేంద్రం మరోసారి మెలిక పెట్టగా, ఆ సంస్థ మళ్లీ తిరస్కరించింది. దీంతో ఎల్అండ్టీ నుంచి మెట్రో రైలు కొనుగోలే ఏకైక ప్రత్యామ్నాయం అని కేంద్రం చెప్పింది. ఇందుకు ఎల్అండ్టీని ఒప్పించి, మంత్రివర్గంలో, అసెంబ్లీలో చర్చించి ఆమోదించాం..’ అని సీఎం వివరించారు. నేను అండగా ఉంటా కేసీఆర్‌ను భయపెట్టు ‘రెండో దశ విస్తరణకు 50శాతం నిధుల వాటా ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకుందని కిషన్‌రెడ్డి చెప్పిన దాంట్లో వాస్తవముంటే కాగితం చూపించాలి. తెలంగాణ తరఫున కేంద్ర కేబినెట్ ర్యాంకు మంత్రివి నువ్వు ఒక్కడివే. మంత్రివర్గం భేటీలో పీఎం మోదీతో నువ్వే మాట్లాడాలి. కేసీఆర్‌కు భయపడి, లొంగిపోయి కిషన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. నేను నీకు అండగా నిలబడతా కేసీఆర్‌ను భయపెట్టు. కిషన్‌రెడ్డికి అంత తెలివి లేదు. ఆయన వెనుక కేటీఆర్ ఉన్నాడు. ఛత్రపతి సినిమాలో వేణుమాధవ్ అపరిచితుడి వేషం వేసుకుని అందరినీ బెదిరించినట్టు.. ‘నీ సంగతి చూస్తా ’అని రామచందర్‌రావు నన్ను బెదిరిస్తుండు. నేను భడేభాయ్(మోదీ)ను కూడా కలిసా. కింద(రాష్ట్రంలో) సమస్యలుంటాయి..అవి ఏందో చూడు అన్నారు. ప్రధానితో పాటు కేంద్రమంత్రులు చాలా మందిని కలిసి వచ్చిన. వారితో జరిగిన చర్చను బయటపెట్టడం అనైతికమని కొన్ని విషయాలు చెప్పుకోదలుచుకోలేదు..’ అని రేవంత్ అన్నారు. కేంద్రం ఎన్నో పార్టీలపై ఆధారపడి ఉంది.. హామీలు అమలు చేయని సీఎం రేవంత్ రాజీనామా చేయాలని కిషన్‌రెడ్డి చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు. ‘మూడు ఎన్నికల మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీల్లో ఏదీ మోదీ అమలు చేయలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫిజికల్లీ హ్యాండీకాప్డ్ (వికలాంగ ప్రభుత్వం). ఎన్నో పార్టీలపై ఆధారపడి ఉంది. స్పష్టమైన మెజారిటీ లేదు. నాకు పూర్తి మెజారిటీ ఉంది. ఎవరిపై ఆధారపడలేదు. నన్ను రిజైన్ చేయమని అడిగే నైతిక హక్కు వారికి లేదు. అయినా మోదీ చేస్తే నేనూ రాజీనామా చేయడానికి సిద్ధం..’ అని సీఎం స్పష్టం చేశారు. -
‘రేవంత్ మన ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారు’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,తన గురువు చంద్రబాబు ఎపిలో 2018లో సేవా మిత్ర యాప్ ద్వారా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఓట్లు తొలగించినట్లే,బిఆర్ఎస్ పార్టీ ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ రోజు తుంగతుర్తి నియోజకవర్గ, బిఆర్ఎస్ పార్టీ బిఎల్ఏల ఎస్ఐఆర్ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో బిజేపి పార్టీ,కాంగ్రెస్ పార్టీ కలిసే ఉన్నాయని,ఆ రెండు పార్టీలు ఒక్కటై,తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాకుండా చూడాలనే కుట్రతో,ఓట్లు తొలగించే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్నికల సమయంలో ఎస్ఐఆర్ నిర్వహించి సుమారు 90 లక్షల ఓట్లు తొలగించి,మమత బెనర్జీ పార్టీని ఓడించారని తెలిపారు. బిజేపి అధికారంలోకి వచ్చాక అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయని గుర్తుచేశారు. అందుకే మనం అప్రమత్తంగా ఉండాలన్నారు.మాజీ మానవ వనరుల శాఖ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓటు గల్లంతయ్యిందని, బెంగళూరులో రాహుల్ ద్రావిడ్ కూడా ఓటు వినియోగించలేకపోయారన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఏమరుపాటుగా ఉంటే మన ఓటు కూడా గల్లంతయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎన్యుమరేషన్ ఫారం నింపిన తర్వాత, వ్యక్తికి నోటీసు ఇవ్వకుండా ఓటు తొలగించే అధికారం ఎవరికీ లేదన్నారు,ఓటు తొలగించాలంటే ఖచ్చితంగా నోటీసు ఇవ్వాల్సిందేనన్నారు. అంతేకాకుండా 326 ప్రకారం ఎవరైనా వ్యక్తులు రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉంటే, రిప్రజెంటేషన్ ఈఫ్ పీపుల్ యాక్ట్ 1950 లోని సెక్షన్ 17,18 ప్రకారం ఏడాది పాటు జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు.2028లో కేసీఆర్ గారిని తిరిగి తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే బిఎల్ఏలే ప్రధాన పాత్ర పోషించాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారికి,నూతన ఓటు నమోదు చేయడానికి ఫారం 6 నింపి ఇవ్వాలని, బిజేపి,కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు బిఎల్ఓ లను ప్రభావితం చేసి,దొంగ ఓట్లు వేయిస్తే,వెంటనే అధికారులకు ఫిర్యాది చేసి, ఫారం 7 ద్వారా ఓట్లు తొలగించాలని సూచించారు. 2002 ఓటరు జాబితాలో పేరు లేని వారు, మ్యాపింగ్ టెక్నాలజీ ఆధారంగా ఓటు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ముసాయిదా ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు ఉన్నా, వెంటనే అభ్యంతరాలు తెలుపుతూ,ఫారం 8 ద్వారా సరిచేసుకోవాలన్నారు.తెలంగాణలో అభివృద్ధి పథంలో నడవాలంటే,తిరిగి కేసిఆర్ ముఖ్యమంత్రి కావాలని,అందుకోసం ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొని ఖచ్చితంగా మన బూత్ లో ఉండే అన్ని కుటుంబాలను కలిసి అందరి ఓట్లు నమోదయ్యేలా చూడాలని,నిరంతరం బిఎల్ఓలను వెంట ఉండి ఓట్లు పోకుండా చూడాలన్నారు. తుంగతుర్తి మాజీ శాసన సభ్యులు గాదరి కిశోర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి,సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్ రెడ్డి,మాజీ రాజ్యసభ ఎంపి మల్లయ్య యాదవ్, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘బీజేపీ అంటే సీఎం రేవంత్ భయపడుతున్నారు’
హైదరాబాద్: తమ పార్టీ అంటే సీఎం రేవంత్‌రెడ్డి భయపడిపోతున్నారన్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు ఎద్దేవా చేశారు. అందుకే కిషన్‌రెడ్డిని, బీజేపీని టార్గెట్ చేస్తున్నారన్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే తమపై విమర్శలు చేస్తున్నారన్నారు. సాక్షి టీవీతో మాట్లాడిన రాంచందర్‌రావు.. హైదరాబాద్ వ్యక్తిగా కిషన్‌రెడ్డితో పాటు తాసు కూడా ఇక్కడ అభివృద్ధి కోరుకుంటామని, రేవంత్‌కు హైదరాబాద్ అభివృద్ధి జరగాలని లేదని విమర్శించారు. బీజేపీ బలం పుంజుకుంటోందని రేవంత్ రెడ్డి భయపడుతున్నారు. కేంద్రం నిధులు ఎందుకు ఇవ్వదు. మీరు టెక్నికల్ గా తప్పులు ఇస్తే తప్ప. మీ చేతగాని తనాన్ని మా మీద తోయాలని చూస్తున్నావు. మోదీ గురించి మాట్లాడే స్థాయి రేవంత్‌ది కాదు. మోదీ ముందు రేవంత్ చిన్నపిల్లాడు. రాష్ట్రంలో అసలు పాలన ఎక్కడుంది. సీఎం మాట ఎవరు వినట్లేదు’ అని ఆరోపించారు. -
పొన్నం సమక్షంలో ఎంపీ చిందులు
తెలంగాణ వ్యాప్తంగా బడి గంట మోగిన వేళ.. విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమం ప్రారంభోత్సవ వేదిక ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీసింది. అధికార కార్యక్రమం సాఫీగా సాగుతుందని అందరూ అనుకుంటున్న సమయంలోనే.. మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలోనే రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం కలకలం రేపింది. అసలు ఏం జరిగిందన్న ఆసక్తి వేదిక వద్దే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం విద్యార్థులకు అల్పాహార పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనున్న సంగతి తెలిసిందే. అయితే కార్యక్రమం ప్రారంభానికి ముందు ప్రోటోకాల్ అంశం వివాదాస్పదంగా మారింది.స్థానిక రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్‌కు కార్యక్రమం గురించి అధికారులు సమాచారం ఇవ్వలేదని తెలిసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. నేరుగా కార్యక్రమానికి హాజరై మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలోనే అధికారులను ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహించడం సరైంది కాదని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో కొద్దిసేపు కార్యక్రమంలో రాజకీయ వేడి కనిపించింది.అనంతరం అల్పాహార పథకాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా, పౌష్టికాహారంతో ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సుమారు రూ.800 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారంతో పాటు పాలు, రాగిజావ అందజేస్తున్నామని చెప్పారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థుల డ్రాప్‌అవుట్ రేటును తగ్గించడంతో పాటు విద్యను ప్రోత్సహించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్య నాణ్యతపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.హైదరాబాద్ నగర వ్యాప్తంగా తొలి దశలో 42 ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. విద్యార్థులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.అయితే విద్యార్థుల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమం కంటే.. కార్యక్రమం ప్రారంభానికి ముందే చెలరేగిన ప్రోటోకాల్ వివాదమే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి సమక్షంలోనే ఎంపీ అధికారులను నిలదీయడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. -
సింగరేణిపై రాజకీయాలెందుకు?
శ్రీరాంపూర్: సింగరేణిని రాజకీయాల కోసం వాడుకోవద్దని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంత్రి దుద్దిళ్ల« శ్రీధర్‌బాబు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావుతో కలిసి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని ఆదివారం ఆయన సందర్శించారు. సంస్థపై వస్తున్న ఆరోపణలు ఖండించేందుకు సంస్థ అధికారులతో అక్కడే మీడియా సమక్షంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. సింగరేణిపై జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని అవాస్తవాలను ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ నాయకులు రాజకీయ లబ్ధి పొందుతున్నారన్నారు. కార్మికుల శ్రమ, వారి ఆత్మగౌరవాన్ని చులకన చేసేలా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. బొగ్గు పెళ్ల కూడా పోలేదు..... బొగ్గు పెళ్ల కూడా దొంగతనంగా బయటకు పోలేదని సింగరేణి అధికారులు తెలిపారు. ఓపెన్‌హౌస్‌లో భాగంగా సింగరేణి సీఎండీ, డైరెక్టర్లు, ఏరియా జీఎం శ్రీనివాస్ డిప్యూటీ సీఎం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. బొగ్గు లోడిండ్ మొదలు, రవాణా వరకు అన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయని, దీని కోసం వీటీఎస్, జీపీఎస్ టెక్నాలజీని వాడుతున్నామని తెలిపారు. శాప్ సిస్టం ద్వారా ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. దీన్ని కాదని బొగ్గు పెళ్ల కూడా బయటకు పోదన్నారు.ఇటీవల వచ్చిన ఆరోపణలను వారు మీడియా సమక్షంలో ఖండించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్‌జ్యోతి, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి.జనక్‌ప్రసాద్, డైరెక్టర్లు గౌతమ్ పొట్రు, ఎల్వీ సూర్యనారాయణ , కొప్పుల వెంకటేశ్వర్లు, తిరుమల్‌రావు, శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్, బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జీఎం వీరభద్రం, సేఫ్టీ జీఎం రవికుమార్, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ అధికారి సీహెచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా మంచిర్యాల మోడల్మంచిర్యాలటౌన్: మంచిర్యాల పట్టణ ప్రగతి అద్భుతంగా ఉందని, 50 ఏళ్లకు సరిపడేలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇదే మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంచిర్యాలలోని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు నివాసంలో మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. మంచిర్యాల ఎమ్మెల్యే పట్టుబట్టి నిధులు తీసుకొచ్చి రోడ్ల విస్తరణ, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులతోపాటు, ఇండస్ట్రియల్ పార్కు, ఐటీ హబ్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, పాఠశాలలు, కళాశాలల నిర్మాణం చేపడుతున్నారని వివరించారు. ఇవి అద్భుతంగా ఉన్నాయని, ఇక్కడ జరిగే అభివృద్ధిని ఒక మోడల్‌గా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
సొంత పార్టీ నేతలకే వెన్నుపోటు
బంజారాహిల్స్(హైదరాబాద్): సీఎం రేవంత్‌రెడ్డి సొంతపార్టీ నేతలకే వెన్నుపోటు పొడిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మీనాక్షీ నటరాజన్‌కు పదవి రాకుండా అడ్డుకోవడమే కాకుండా, తప్పుడు కేసులు పెట్టించడం రేవంత్‌రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఆదివారం తెలంగాణభవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ఉన్న కొంతమందిలో మీనాక్షి నటరాజన్ నిజాయతీ గల మనిషి అని, రాహుల్‌గాందీకి నమ్మిన బంటు కావడంతోనే రేవంత్‌రెడ్డి ఆమె పైనే కుట్ర చేశారన్నారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి భూములు, కాంట్రాక్టులు అమ్ముకుంటూ అడ్డగోలు అవినీతి చేస్తున్నాడని మీనాక్షి నటరాజన్ రాహుల్‌గాందీకి చెప్పినందుకే రేవంత్‌రెడ్డి ఆమెపై పగపట్టారని చెప్పారు. అందుకే మీనాక్షి నటరాజన్ మీద రేవంత్‌రెడ్డి దొంగ కేసు పెట్టించారన్నారు. ఆ కేసు వివరాలు కూడా బీజేపీకి ఇచ్చారని ఆరోపించారు. ఇలా ప్రజలకే కాకుండా సొంతపార్టీ వారికే గుండుకొట్టి శఠగోపం పెట్టిన దొంగ రేవంత్‌రెడ్డి అని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నానని సీఎం ప్రకటించడం సిగ్గుచేటన్నారు. రేవంత్‌రెడ్డి పాలనను అట్టర్ఫ్లాఫ్గా అభివర్ణించారు. సినిమా ట్రైలర్ చూడగానే హిట్ లేదా ఫ్లాప్ అని తెలిసినట్టేనని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్వెల్‌కే ఫ్లాప్ అని తేలిపోయిందన్నారు. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి..? నిరుద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తూ మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటివరకు 4 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తానని హామీఇచ్చిన రేవంత్‌రెడ్డి అది నెరవేరితే నిరూపించాలన్నారు. అదే జరిగితే తాను రాజీనామాకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. జీఓ నంబర్ 50 ద్వారా పేదలకు పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. నగరంలో ఇటుక కూడా వేయని కాంగ్రెస్ హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే.. నగరంలోని ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని ఉచితంగా అందిస్తామన్నారు. ఖైరతాబాద్‌లో రెండుసార్లు గులాబీ జెండా ఎగురవేశామని, మూడోసారి కూడా సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. దానం నాగేందర్ నియోజకవర్గ ప్రజలను మోసం చేసి రేవంత్‌రెడ్డి పక్కన కూర్చున్నారన్నారు. త్వరలో ఇక్కడ ఉప ఎన్నిక రావడం ఖాయమన్నారు. ‘సర్’విషయంలో బాధ్యతాయుతంగా పనిచేయాలి జూన్ 25 నుంచి జూలై 31 వరకు జరిగే ‘సర్’నమోదులో ప్రతి బూత్ లెవల్ ఏజెంట్ బాధ్యతగా పనిచేయాలని కేటీఆర్ చెప్పారు. త్వరలోనే కొత్త కమిటీలు వేయబోతున్నామని, టికెట్ ఆశించేవారు ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ మన్నె గోవర్దన్‌రెడ్డి, జూబ్లీహిల్స్ మాజీ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్, బీఆర్ఎస్ నేతలు జేజోళ్ల రాజుముదిరాజ్, మహేశ్‌యాదవ్, హేమలతాయాదవ్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
‘హైడ్రా లాంటి అరాచక చర్యలపై పోరాడుతున్నాం’
హనుమకొండ: రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు, అరాచకాలపై పోరాటం చేస్తున్నామని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు స్పష్టం చేశారు. హైడ్రా లాంటి అరాచక చర్యలపై పోరాడుతున్నామన్నారు హరీష్‌రావు. బాలకార్మిక వ్యవస్థ తగ్గడానికి కేసీఆర్ పెట్టిన గురుకులాలే కారణమన్నారు. కాంగ్రెస్ పోవాలని, కేసీఆర్ రావాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. హనుమకొండలో హరీష్ రావు పర్యటించారు. బీఆర్ఎస్ యువనేత రంజిత్‌రెడ్డి జన్మదిన వేడుకలలో హరీష్‌రావు పాల్గొన్నారు. దీనిలో భాగంగా పేద విద్యార్థులకు చేయూత, స్కూల్ బాగ్స్ పంపిణీ కార్యక్రమం ఉంటుంది,. అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. -
ఫస్ట్ హాఫ్ ఫెయిల్
సిరిసిల్ల: రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని, రేవంత్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు విమర్శించారు. ఈ ప్రభుత్వ పాలన మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) విఫలమైందని చెప్పారు. సినిమా ఫస్ట్ హాఫ్ డిజాస్టర్ అయినప్పుడు సెకండ్ హాఫ్‌పై ఎలాంటి ఆశలు ఉండవో.. ప్రభుత్వ ప్రస్తుత పనితీరు కూడా అలాగే ఉందని అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడల్లో పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై బూత్ లెవల్ ఏజెంట్లతో బీఆర్ఎస్ శ్రేణులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ధాన్యంలో తరుగు పేరుతో రైతులను నిలువునా మోసం చేస్తోందని ఆరోపించారు. ఎరువుల దుకాణాల వద్ద మళ్లీ క్యూలైన్లో నిలబడే దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుకు సంచులు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే, రాహుల్‌గాందీకి మాత్రం సంచుల కొద్దీ డబ్బులు వెళ్తున్నాయని ఆరోపించారు. రైతుబంధును బలహీనపరిచి ‘రాహుల్‌బంధు’మొదలుపెట్టారని విమర్శించారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎన్నికలకు ముందు బాండ్ పేపర్ రాసిస్తానన్న హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని, దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.4 లక్షల కోట్ల అప్పుతో చేసిందేమిటో చెప్పాలి హిట్లర్ స్ఫూర్తి అయితే పాలన గిట్లనే ఉంటదని కేటీఆర్ అన్నారు. మీనాక్షి నటరాజన్‌కు అవమానం జరిగేలా వ్యవహరించిన వ్యక్తి రేవంత్‌రెడ్డేనని ఆరోపించారు. ప్రజలు పాలు ఇచ్చే బర్రెను వదిలి, తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్లుగా కాంగ్రెస్‌ను ఎన్నుకున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్కు అధికారం మాత్రమే పోయిందని, కేసీఆర్‌పై ప్రజల అభిమానం తగ్గలేదని చెప్పారు. రేవంత్‌రెడ్డి ప్రతిసారీ కేసీఆర్ అప్పు చేశారంటుంటారని..అయితే కేసీఆర్ అప్పు చేసినా అభివృద్ధి చేశారని, రైతుల ఖాతాల్లో రూ.77వేల కోట్లు వేశారని, 15 లక్షల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మీ ఇచ్చారని, కొత్త జిల్లాలు, కొత్త కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీలు, గురుకులాలు, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు కట్టారని వివరించారు. రెండున్నరేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసి రేవంత్‌రెడ్డి తెలంగాణకు చేసిందేమిటో చెప్పాలని సవాల్ విసిరారు. సభ్యత్వ నమోదు, ‘సర్’పై పాఠాలు ‘నాకు జన్మనిచ్చింది శోభమ్మ అయితే, రాజకీయంగా పునర్జన్మనిచ్చింది సిరిసిల్ల ప్రజలే. ఒక్క రూపాయి.. చుక్క మద్యం పంచకుండా ప్రజల ఆశీర్వాదంతో సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిచినందుకు గర్వపడుతున్నా..’అని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో సిరిసిల్లను జిల్లా చేసి రూపురేఖలు మార్చామని, ప్రాణం ఉన్నంత వరకు సిరిసిల్ల అభివృద్ధే తన లక్ష్యమని చెప్పారు. బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నాయని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెల 25 తర్వాత వేములవాడలోని ప్రతి మండలాన్ని సందర్శించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటానని ప్రకటించారు. కాగా పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్పై పాఠం మాదిరి అవగాహన కల్పించారు. మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్‌రెడ్డి, నేతలు చెలిమెడ లక్ష్మీనర్సింహారావు, తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లో ‘ఆడియో’ కలకలం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఓ ఆడియో తీవ్ర కలకలం రేపుతోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడితో ఆ పార్టీ సీనియర్ నేత, సీఎం రేవంత్ సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ మాట్లాడినట్టుగా ఉన్న ఈ ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అంశంలో పార్టీలోని కోవర్టుల వ్యవహారం ఇంకా ముగియక ముందే..పార్టీని, పీసీసీ అధ్యక్షుడిని ఉద్దేశించి షబ్బీర్ అలీ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా ఉన్న ఆ ఆడియో గాందీభవన్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. రంగంలోకి దిగిన టీపీసీసీ షబ్బీర్ అలీని వివరణ కోరింది. ఢిల్లీ పెద్దలు సైతం దీనిపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఏముందా ఆడియోలో.. ఆవేదన, పరామర్శ కోణంలోనే ఆ ఆడియోలోని మాటలు ఉన్నప్పటికీ పార్టీలో చర్చనీయాంశమయ్యింది. ఆ ఆడియోలో ఉన్న మాటల ప్రకారం.. తనకు కాకుండా ఎవరో చంద్రశేఖర్‌రెడ్డి అనే వ్యక్తికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడాన్ని తప్పుపడుతూ తాను ఉరి పెట్టుకుంటానంటూ ఓ నాయకుడు షబ్బీర్ అలీకి ఫోన్ చేయగా, సదరు నాయకుడిని ఓదారుస్తూ షబ్బీర్ అలీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. డబ్బులు పెడుతున్నారని, మహిళలను ఎరగా వేసి పదవులు తీసుకుంటున్నారనే కోణంలో వ్యాఖ్యలు ఉండటంతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ పేరు కూడా ఉచ్ఛరించారు. కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీగా మారిపోయిందంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆడియో ఎప్పటిదో అయినా..అది కాస్తా ఇప్పుడు బయటకు వచ్చి వైరల్ అయ్యింది. నేనేంటో అందరికీ తెలుసు: మహేశ్‌గౌడ్ ఈ ఆడియో వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ స్పందించారు. శనివారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతున్న సందర్భంలో దీనిపై ప్రశ్నించగా.. ఎలాంటి ఆరోపణల విషయంలోనైనా తొందరపడేది లేదని స్పష్టం చేశారు. ‘నా వ్యక్తిత్వం, ఆస్తిపాస్తులు, నా పుట్టుక ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు. నిజామాబాద్ ప్రజలకు ఇంకా బాగా తెలుసు. 40 ఏళ్లుగా లేని అవినీతి ఇప్పుడెక్కడ నుంచి వస్తుంది? షబ్బీర్ అలీనే ఆ వ్యక్తిని రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరి్పంచారు. ఎందుకు చేరి్పంచారో ఆయనే సమాధానం చెప్పాలి. రేవంత్‌రెడ్డి సిఫారసు చేసినందుకే చంద్రశేఖర్‌రెడ్డికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి వచ్చింది. షబ్బీర్ అలీ అయినా, ఎవరైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మహిళల పరువు తీసేలా వ్యాఖ్యానాలు చేయకూడదు. దీనిపై ఆయన్ను వివరణ కోరాం. ఈ వ్యవహారం పార్టీ చూసుకుంటుంది..’ అని చెప్పారు. పీసీపీ చీఫ్‌ను టార్గెట్ చేశారా? పీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్ల పదవీ కాలం ముగియకముందే మహేశ్‌కుమార్‌గౌడ్‌ను పార్టీలోని కొందరు టార్గెట్ చేశారా? అనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఈ చర్చకు ఇటీవలి కొన్ని పరిణామాలు కూడా ఊతమిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌గౌడ్ ఫెయిల్ అయ్యారంటూ ఇటీవలే ఓ చానెల్లో పెద్ద ఎత్తున వార్తలు రాగా, సీఎం రేవంత్‌కు సన్నిహితంగా ఉండే ఓ నాయకుడే ఇలా చేశారనే ప్రచారం కూడా జరిగింది. ఈ వ్యవహారం పూర్తిగా సమసిపోక ముందే ఎప్పుడో మాట్లాడిన ఆడియోను ఇప్పుడు బయటకు తీసుకురావడం చర్చనీయాంశమవుతోంది. అది కూడా సీఎం రేవంత్‌కు సన్నిహితుడైన నాయకుడే మాట్లాడినట్టు అందులో ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌గౌడ్ బలహీనపడ్డారా? లేదంటే పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నారా..అన్నది అర్థం కావడం లేదని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. వ్యాఖ్యలపై వివరణ ఇవ్వండి పీసీసీ అధ్యక్షుడి ప్రతిష్టకు భంగం కలిగేలా, పార్టీలో పనిచేస్తున్న మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ పేర్కొంది. మీడియాలో వచ్చిన కథనాలు, పార్టీ కార్యకర్తతో మాట్లాడిన సంభాషణపై వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి, వైస్‌చైర్మన్ అనంతుల శ్యాంమోహన్, సభ్యుడు జాఫర్ జావేద్‌లు శనివారం షబ్బీర్ అలీకి లేఖ రాశారు. వివరణపై ఎలాంటి ఆలస్యం చేయకూడదని సూచించారు.


