రాజ్యసభ అభ్యర్థి ఎంపికలో మరోమారు రేవంత్ మార్క్ రాజకీయం
తన ఆలోచనను స్పష్టంగా చెప్పి కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించిన సీఎం
నేడు నామినేషన్లు దాఖలు చేయనున్న సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సన్నిహితుడైన వేం నరేందర్‌రెడ్డికి రాజ్యసభ స్థానం ఇప్పించుకోవడంలో సఫలీకృతులయ్యారు. వాస్తవానికి, ఈ దఫా రాష్ట్రం నుంచి ఇద్దరికి రాజ్యసభకు వెళ్లే అవకాశం లభించింది. ఈ రెండు స్థానాల్లో ఒకటి అధిష్టానం కోటాకు వెళుతుందని, మరొకటి తెలంగాణ నాయకత్వానికి వస్తుందనే చర్చ మొదటి నుంచి జరిగింది.
అయితే తెలంగాణకు వచ్చే ఒక స్థానం విషయంలో సామాజిక వర్గాల వారీగా సమీకరణలు తెరపైకి వచ్చాయి. అధిష్టానం కోటాలో అగ్రవర్ణాలకు చెందిన సింఘ్వీ కేటాయించాల్సి ఉన్నందున మరో స్థానాన్ని బీసీ లేదా ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలన్న ప్రతిపాదన బలంగా వినిపించింది. అయితే, ఇదే సామాజిక వర్గ కోణాన్ని సీఎం రేవంత్‌రెడ్డి అధిష్టానం ముందు పెట్టి తన మాట నెగ్గించుకోగలిగారని పార్టీ నేతలు చెబుతున్నారు.
తెలంగాణలో సామాజిక న్యాయం దిశగా కాంగ్రెస్ పార్టీ అనేక అడుగులు వేస్తోందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఇప్పటికే పలుసార్లు ప్రాధాన్యం ఇచ్చామని, ఈసారి తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందిన రెడ్డి నేతకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని ఆయన అధిష్టానం ముందు తన ఆలోచనను వెలిబుచ్చారని చెబుతున్నాయి.. ఈ కోణంలోనే తనకు చేదోడువాదోడుగా ఉండే అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డిని ఆయన మొదటి నుంచి చర్చల్లో ఉంచగలిగారని, ఆయనకు ఇవ్వడం వల్ల జరిగే ప్రయోజనాన్ని సీఎం అధిష్టానానికి స్పష్టంగా వివరించగలిగారని గాందీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
పోయిన సారే అనుకున్నా...
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దొరకకపోవడంతో తన సన్నిహితుడైన వేం నరేందర్‌రెడ్డిని ఎలాగైనా రాజ్యసభకు పంపాలని సీఎం రేవంత్ అనుకున్నారు. అందులో భాగంగా పార్టీ అధికారంలోకి వచ్చి న తర్వాత తొలిసారి జరిగిన రాజ్యసభ ఎన్నిక సమయంలోనే వేం నరేందర్‌రెడ్డి పేరును ప్రతిపాదించారు. అయితే అగ్రవర్ణాలకు చెందిన రేణుకాచౌదరికి ఒక స్థానం ఇవ్వాల్సి రావడంతో బీసీ వర్గానికి చెందిన అనిల్‌కుమార్‌యాదవ్‌కు అవకాశం లభించింది. మధ్యలో వచ్చిన మరో స్థానాన్ని అధిష్టాన కోటాలో సుప్రీంకోర్టు న్యాయవాది సింఘ్వీకి కేటాయించారు.
తమిళనాడు తికమక
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి డీఎంకే కేటాయించే స్థానాలు, అక్కడ పోటీ చేసే అభ్యర్థుల విషయం తేలడంలో జాప్యం జరిగింది. పరిస్థితిని బట్టి సింఘ్వీ తమిళనాడుకు వెళ్లే అవకాశం ఉందనే చర్చ కూడా జరిగింది. దీంతో అధిష్టానం కోటాకు ఒక స్థానం వెళుతుందా లేదంటే రెండు స్థానాలు తెలంగాణ నాయకులకే వస్తాయా అనే మీమాంస మంగళవారం వరకు కొనసాగింది.
ఒకవేళ తెలంగాణకు రెండు స్థానాలు కేటాయించాల్సి వస్తే ఒకటి ఓసీకి మరొకటి బీసీకి ఇస్తారనే చర్చ జరిగింది. అయితే తమిళనాడు నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీకి ఒకటే స్థానాన్ని ఇచ్చేందుకు డీఎంకే అంగీకరించడంతో సింఘ్వీ తెలంగాణకు ఖరారయ్యారు. మిగిలిన ఒక స్థానాన్ని నరేందర్‌రెడ్డికి కేటాయించారు.
నేడు నామినేషన్లు
రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలోని రాజ్యసభ ఎన్నికల కార్యాలయంలో తమ నామినేషన్లను వారు సమర్పిస్తారు. ఈ నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు హాజరుకానున్నారు. ఇతర నామినేషన్లు దాఖలు కాని పక్షంలో ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఈ ఇద్దరి ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటిస్తుంది.


