ముంబై: ప్రముఖ పంజాబీ గాయకుడు కరణ్ ఔజ్లా ‘పీ-పాప్ కల్చర్ వరల్డ్ టూర్’ పేరిట ముంబైలో నిర్వహించిన కన్సర్ట్ వివాదాస్పదంగా మారింది. హోలీ థీమ్‌తో నిర్వహించిన ఈ వేడుకలో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఢిల్లీ, పూణేలలో జరిగిన ప్రదర్శనలు సవ్యంగా సాగినప్పటికీ ముంబైలో నిర్వాహక లోపాలు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా మండుతున్న ఎండలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి.
మార్చి 3న జరిగిన ఈ కన్సర్ట్‌లో తొక్కిసలాట లాంటి పరిస్థితులు నెలకొనడమే కాకుండా, ఎండ వేడికి తట్టుకోలేక పలువురు అభిమానులు స్పృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది. ఫ్యాన్ జోన్‌లో మాత్రమే స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసి, వీఐపీ, జనరల్ జోన్లను గాలికి వదిలేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి చూడాల్సి రావడంతో చాలా మంది హీట్‌స్ట్రోక్‌కు గురయ్యారు. వేదిక చాలా దూరంగా ఉండటం, భారీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో అసలు కరణ్ ఔజ్లా ఉన్నాడో లేడో కూడా అర్థం కాలేదని కొందరు అభిమానులు వాపోయారు. ప్రొఫెషనల్ కన్సర్ట్‌లా కాకుండా స్కూల్ యాన్యువల్ డే వేడుకలా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
ఈ విమర్శలపై గాయకుడు కరణ్ ఔజ్లా స్పందించారు. ముంబై అభిమానుల అసంతృప్తిని గమనించిన ఆయన.. ఇన్ స్టాగ్రామ్ వేదికగా వారికి క్షమాపణలు చెబుతూ ఒక ప్రకటన చేశారు. ముంబైలో మరోసారి నైట్ కన్సర్ట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తన టీమ్ మరింత పటిష్టమైన ఏర్పాట్లతో తిరిగి వస్తుందని, అభిమానులకు మెరుగైన అనుభూతిని అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ రెండో షోకు సంబంధించిన తేదీలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఫిబ్రవరి 28న ఢిల్లీలో 75 వేల మంది అభిమానుల మధ్య అట్టహాసంగా ప్రారంభమైన ఈ టూర్.. రాబోయే రోజుల్లో చండీగఢ్, ఇండోర్, బెంగళూరు సహా పలు నగరాల్లో కొనసాగనుంది.
ఇది కూడా చదవండి: తాళి కట్టే వేళ.. తల పైనుంచి మిస్సైళ్లు!


