కుటుంబంలో సంక్షోభం.. కుర్రాళ్లకు సందేశం | As divorce headlines swirl, what is TVK Vijay's latest post | Sakshi
Sakshi News home page

కుటుంబంలో సంక్షోభం.. కుర్రాళ్లకు సందేశం

Mar 4 2026 9:07 AM | Updated on Mar 4 2026 9:39 AM

As divorce headlines swirl, what is TVK Vijay's latest post

చెన్నై: విడాకుల వార్తల నడుమ  టీవీకే అధినేత విజయ్ విజయ్ సోషల్‌ మీడియాలో చేసిన ఒక పోస్టు చర్చనీయాంశంగా మారింది. తన పాతికేళ్ల ఏళ్ల వైవాహిక బంధం కోర్టు మెట్లెక్కిన వేళ.. విజయ్ తన వ్యక్తిగత వేదన కంటే రేపటి పౌరుల భవిష్యత్తుకే ప్రాధాన్యతనిచ్చారు. 12వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులను ఉద్దేశించి ఆయన పంచుకున్న ఒక సందేశం ఇప్పుడు వైరల్‌గా మారింది.

‘తమిళనాడు, పుదుచ్చేరిలో 12వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న నా ప్రియమైన తమ్ముళ్లకు,  చెల్లెళ్లకు శుభాకాంక్షలు. రేపటి సంపన్నమైన సమాజాన్ని నిర్మించబోతున్న మీరందరూ, ఈ పరీక్షను ఎటువంటి ఆందోళన లేకుండా, భయం లేకుండా, ధైర్యంతో ఎదుర్కోండి. ఉన్నత విద్యలో మీరు రాణించాలని ముందుస్తు (అడ్వాన్స్) శుభాకాంక్షలు.. మంచే జరుగుతుంది!.. విజయం నిశ్చయం!’ అని దానిలో విజయ్‌ పేర్కొన్నారు.  

1996లో విజయ్‌కు ఒక అభిమానిగా పరిచయమై, 1999లో అర్ధాంగిగా మారిన సంగీతతో విజయ్ వైవాహిక ప్రయాణం ఆదర్శప్రాయంగా సాగింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ జంట మధ్య 2021 నుండి విభేదాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ నటితో సంబంధమే ఈ విడాకులకు కారణమని సంగీత తన పిటిషన్‌లో పేర్కొన్న ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
 

సినిమాలకు గుడ్ బై చెప్పి ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) ద్వారా ప్రజా సేవకు అంకితమైన తరుణంలో పలు వివాదాలు ఆయనను చుట్టుముట్టాయి. రాజకీయంగా పార్టీని బలోపేతం చేస్తూ, సభ్యత్వ నమోదులో బిజీగా ఉన్న విజయ్.. ప్రస్తుత పరీక్షల వేళ విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని నూరిపోస్తున్నారు. ‘భయం వద్దు.. విజయం మీదే’ అంటూ ఆయన ఇచ్చిన పిలుపు వెనుక, తన వ్యక్తిగత వైఫల్యాల నీడలు పడకుండా చూసుకోవడం ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనం.

ఈ సంక్షోభం విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు, మరోవైపు ప్రత్యర్థుల విమర్శలు వచ్చే అవకాశం ఉన్నా.. విజయ్ మాత్రం ప్రజాక్షేత్రంలోనే తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నారు. తన చుట్టూ జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోకుండా, విద్యార్థుల పరీక్షల పై దృష్టి సారించడం ద్వారా తన ప్రాధాన్యతలు ఏంటో విజయ్‌ స్పష్టం చేశారు.  

ఇది కూడా చదవండి: ‘ఆస్పత్రి మాఫియా’ ఇక లగెత్తాల్సిందే! 

Advertisement
 
Advertisement
Advertisement