‘బాబా వంగ’ భవిష్యవాణిపై ఊపందుకున్న చర్చలు | Middle East Tensions Rise, Baba Vanga World War 3 Prediction Amid US Israel Iran Conflict Sparks Global Speculation | Sakshi
Sakshi News home page

‘బాబా వంగ’ భవిష్యవాణిపై ఊపందుకున్న చర్చలు

Mar 1 2026 11:12 AM | Updated on Mar 1 2026 11:47 AM

Baba Vanga World war 3 Prediction us Israel Iran Conflict

టెహ్రాన్: మిడిల్‌ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో యావత్ ప్రపంచం మరోసారి తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా మెరుపు దాడులు చేపట్టాయి. ఈ నేపధ్యంలో దివంగత బల్గేరియన్ ప్రవక్త ‘బాబా వంగ’ గతంలో చెప్పిన సంచలన భవిష్యవాణి నిజమవుతున్నదంటూ ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది.

2020వ దశకంలో ప్రపంచం పెను మార్పులకు లోనవుతుందని, తీవ్రమైన దౌత్య సంక్షోభాలు  తలెత్తి, అవి పెను యుద్ధానికి దారితీస్తాయని ‘బాబా వంగ’  అప్పట్లో పేర్కొన్నట్లు సోషల్ మీడియా వేదికలపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 1996లోనే ఆమె మరణించినప్పటికీ, ఆమె చెప్పిన భవిష్యత్‌ ప్రపంచ పరిణామాలను నిజమవుతున్నాయని  ఆమె అనుచరులు నమ్ముతున్నారు. దీంతో ప్రస్తుతం నెలకొన్న అస్థిరతను మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతంగా వారు అభివర్ణిస్తున్నారు.

కాగా ఇరాన్ అణు సామర్థ్యం, క్షిపణి వ్యవస్థలను అడ్డుకోవడమే లక్ష్యంగా భారీ యుద్ధ కార్యకలాపాలను ప్రారంభించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఈ దాడుల నేపథ్యంలో యూఏఈ, బహ్రెయిన్, ఖతార్ వంటి పొరుగు దేశాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతుండగా, మరోవైపు పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధం మొదలు కావడం ఆందోళన కలిగిస్తోంది.

అయితే బాబా వంగ భవిష్యవాణికి సంబంధించి ఎటువంటి ప్రామాణిక రాతపూర్వక ఆధారాలు లేవని చరిత్రకారులు, పరిశోధకులు  అంటున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తలు సందర్భానుసారంగా అన్వయించుకున్నవేనని వారు కొట్టిపారేస్తున్నారు. భౌగోళిక రాజకీయ విశ్లేషకులు సైతం ప్రస్తుత పరిస్థితులను ‘ప్రపంచ యుద్ధం’గా పిలవలేమని, ఇవి కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పోరాటాలని  అంటున్నారు. సంక్షోభ సమయాల్లో జనం ఇలాంటి ప్రతీకాత్మక లేదా ప్రాచీన జోస్యాలపై మొగ్గు చూపడం సహజమేనని, దౌత్యపరమైన చర్చలు, సంయమనం ద్వారానే ఈ పెను ముప్పును తప్పించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ‘ప్రతిజ్ఞ నెరవేర్చా’.. ఖమేనీ చివరి సందేశం?

Advertisement
 
Advertisement
Advertisement