జెమిని 3.1 ప్రో.. రెట్టింపు మేధస్సు.. అద్భుత ఫలితాలు! | Google launches Gemini 3.1 Pro performance doubles in major AI leap | Sakshi
Sakshi News home page

జెమిని 3.1 ప్రో.. రెట్టింపు మేధస్సు.. అద్భుత ఫలితాలు!

Feb 20 2026 9:09 AM | Updated on Feb 20 2026 11:32 AM

Google launches Gemini 3.1 Pro performance doubles in major AI leap

న్యూఢిల్లీ: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన కృత్రిమ మేధ (ఏఐ)విభాగంలో తాజాగా మరో భారీ అప్‌డేట్‌ను ప్రకటించింది. జెమిని శ్రేణిలో అత్యంత శక్తివంతమైన ‘జెమిని 3.1 ప్రో’ మోడల్‌ను కంపెనీ ఆవిష్కరించింది. ఇది గతంలో ఉన్న మోడల్ కంటే రెండు రెట్లు మెరుగైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సంస్థ తెలిపింది. ‘జెమిని 3.1 ప్రో’ను కేవలం టెక్స్ట్ జనరేషన్ మాత్రమే కాకుండా, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, ఫైనాన్స్ వంటి రంగాల్లో సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించేలా తీర్చిదిద్దారు.

గత నవంబర్‌లో విడుదలైన జెమిని 3 సిరీస్‌ను మెరుగుపరుస్తూ, రూపొందించిన జెమిని 3.1 ప్రో.. మేధస్సులో ఒక కొత్త మైలురాయిని  దాటిందని గూగుల్‌ తెలిపింది. సంస్థ నిర్వహించిన అంతర్గత పరీక్షల ప్రకారం కఠినమైన తార్కిక సమస్యలను పరిష్కరించే ‘ఏఆర్‌సీ- ఏజీఐ-2' బెంచ్‌మార్క్‌లో ఈ మోడల్ 77.1% స్కోరును సాధించింది. ఇది గతంలోని 3.0 ప్రో మోడల్ పనితీరు కంటే రెట్టింపు కంటే ఎక్కువే కావడం విశేషం. లాజిక్ నమూనాలను విశ్లేషించి, పరిష్కరించడంలో ఈ మోడల్ అసాధారణ ప్రతిభను కనబరుస్తుందని గూగుల్ వెల్లడించింది.
 

డెవలపర్లు, డిజైనర్ల కోసం జెమిని 3.1 ప్రో అద్భుతమైన ఫీచర్లను తీసుకువచ్చింది. కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు, వెబ్‌సైట్లలో నేరుగా ఉపయోగించుకోదగ్గ యానిమేటెడ్ ఎస్‌వీజీ (ఎస్‌వీజీ) ఫైళ్లను ఇది సృష్టించగలదు. ఇవి కోడింగ్ ఆధారంగా  రూపొందుతాయి. అంతేకాకుండా, హ్యాండ్ ట్రాకింగ్ ద్వారా నియంత్రించే సంక్లిష్టమైన 3డీ సిమ్యులేషన్లను, వాటికి అనుగుణంగా రియల్ టైమ్ ఆడియోను కూడా ఇది రూపొందించగలదు.

వేల పేజీల సాంకేతిక పత్రాలను, లేదా మొత్తం సాఫ్ట్‌వేర్ కోడ్ మొత్తాన్ని ఒకేసారి విశ్లేషించగలగడం ‘జెమిని 3.1 ప్రో’ ప్రత్యేకత. 2026, ఫిబ్రవరి 20 నుండి జెమిని 3.1 ప్రో మోడల్ అందుబాటులోకి రానున్నదని గూగుల్‌ తెలిపింది. గూగుల్ ఏఐ స్టూడియో, గూగుల్ యాంటీగ్రావిటీ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా డెవలపర్లకు, గూగుల్ ఏఐ ప్రో అల్ట్రా సబ్‌స్క్రైబర్లకు జెమిని యాప్ ద్వారా ఇది అందుబాటులో ఉండనుంది. 

ఇది కూడా చదవండి: ‘వయనాడ్’ బాధితులకు రాహుల్ భారీ కానుక

Advertisement
 
Advertisement
Advertisement