ఏఐ.. ఆవిష్కరణలకు అడ్డంకి కాదు | IT Minister Sridhar Babu to speak at India AI Impact Summit | Sakshi
Sakshi News home page

ఏఐ.. ఆవిష్కరణలకు అడ్డంకి కాదు

Feb 20 2026 4:33 AM | Updated on Feb 20 2026 4:33 AM

IT Minister Sridhar Babu to speak at India AI Impact Summit

అది 21వ శతాబ్దపు ఏరోడైనమిక్స్‌ 

గ్లోబల్‌ స్ట్రాటెజిక్‌ సంస్థల సదస్సులో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు

సాక్షి, న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ)ను ఆవిష్కరణలకు అడ్డంకిగా కాకుండా, 21వ శతాబ్దపు ఏరోడైనమిక్స్‌గా తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు వ్యాఖ్యానించారు. నియంత్రణలు లేకుండా సాధించే వేగవంతమైన వృద్ధి త్రైమాసిక నివేదికల్లో అద్భుతంగా కనిపించవచ్చు.., కానీ, సరైన భద్రతా చర్యలు లేకుంటే జరిగే ఒక్క చిన్న పొరపాటు దశాబ్దాలుగా సంపాదించుకున్న ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు.

ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఏఐ సమ్మిట్‌–2026లో.. గురువారం డిజిటల్‌ గవర్నెన్స్‌ అడ్వైజరీ, ఆల్‌ బ్రైట్‌ స్టోన్‌బ్రిడ్జ్‌ గ్రూప్‌ (డీజీఏ–ఏఎస్‌జీ) లాంటి గ్లోబల్‌ స్ట్రాటెజిక్‌ అడ్వైజరీ సంస్థల ప్రతినిధులు, ఏఐ సేఫ్టీ కనెక్ట్‌ సంస్థల నిపుణులను ఉద్దేశించి ఆయన కీలకోపన్యాసం చేశారు.  

కీలకమైన కూడలిలోనే ఉన్నాం... 
ఈ సందర్భంగా ప్రముఖ పెట్టుబడిదారుడు వారెన్‌ బఫెట్‌ మాటలను మంత్రి శ్రీధర్‌ బాబు ఉటంకించారు. ‘ఖ్యాతిని గడించడానికి 20 ఏళ్లు పడితే, దానిని కోల్పోవడానికి కేవలం 5 నిమిషాలు చాలు‘అని బఫెట్‌ చెప్పినట్లుగానే నేడు ఏఐ విషయంలో మనం అలాంటి కీలక కూడలిలోనే ఉన్నామని మంత్రి వ్యాఖ్యానించారు. విమానయాన రంగం ప్రారంభ దశలో భద్రతపై ఆందోళనలు ఉన్నప్పటికీ.. సీటు బెల్టులు, రాడార్‌ వంటి కఠినమైన భద్రతా ప్రమాణాలు ఆ రంగాన్ని ఆపలేదని, మరింత ఎత్తుకు ఎదగడానికి అవి అవకాశాన్ని కల్పించాయని గుర్తుచేశారు. ఏఐకి కూడా ఇదే సూత్రం వర్తిస్తుందన్నారు.

‘ప్రస్తుతం 80 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న హైదరాబాద్‌ వృద్ధిలో సగానికి పైగా మన టెక్‌ నిపుణుల కృషితోనే సాధ్యమైంది. ప్రపంచంలోనే అగ్రగామి ఏఐ హబ్‌గా ఎదగడం ద్వారా 2035 నాటికి 1 ట్రిలియన్‌ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడమే మా లక్ష్యం’అని చెప్పారు. ప్రొయాక్టివ్‌ గవర్నెన్స్‌లో భాగంగా 2027 నాటికి ఇంటిగ్రేటెడ్‌ డిజిటల్‌ సరీ్వసెస్‌ ప్లాట్‌ఫారమ్‌ (ఐడీఎస్‌పీ) ద్వారా 4 కోట్ల మంది పౌరులకు 300కు పైగా ప్రభుత్వ సేవలను అరచేతిలోనే అందించనున్నామని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement