ముస్లింల పవిత్ర మాసం రంజాన్ వచ్చేసింది. రోజంతా పచ్చినీళ్లు కూడా ముట్టకుండా నెల రోజులపాటు ఉపవాసం! మన జీర్ణ వ్యవస్థకు సుదీర్ఘమైన విశ్రాంతినిచ్చి...పునరుజ్జీవం కల్పించేందుకు అద్భుత అవకాశమిది. కానీ...ముస్లిం సోదరులు ఉపవాస దీక్షకు ముందు.. ఇలా ఆహారం తీసుకుంటే గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అవేంటో తెలుసకుందామా..!.
సమోసాలు, పకోడి, లస్సీ, చక్కెర దట్టించిన మసాలా టీ, బిర్యానీ, రోటీ, పరాటా.. హలీమ్ వంటివి రంజాన్ సమయంలో బాగా పాప్యులర్ అవుతూంటాయి. పండ్లు, ఖర్జురాలు తినేవాళ్లు ఉంటారు కానీ చాలామంది బిర్యానీల వంటివాటికి అదనంగా వీటిని స్వీకరిస్తూంటారు. ఫలితంగా రోజంతా ఉండే ఉపవాసంతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు కాస్తా దెబ్బతింటాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఏడాది మొత్తమ్మీద పేరుకుపోయిన మలినాలను శరీరం పగలు మొత్తం శుభ్రం చేసుకుంటే... రాత్రికాగానే మళ్లీ అవే అనారోగ్య కారకాలను లోపలికి పంపిస్తున్నామన్నట. వీటన్నింటినీ జీర్ణం చేసేందుకు కాలేయం కాస్తా కష్టపడాలి. ఫలితంగా నిద్ర చెడిపోతుంది. నెలరోజులపాటు సాగే ఈ తంతు కారణంగా మలినాలను మొత్తం వదిలించుకునే బదులు కాలేయం మరింత ఎక్కువ శ్రమ పడుతుంది. రక్తంలో చక్కెర మోతాదులు తరచూ మారిపోతూండటం వల్ల నాడీ వ్యవస్థపై ఒత్తిడికి గురవుతుంది. ఉపవాసం పుణ్యమా అని పొట్ట తేలిక అయ్యే బదులు వేయించిన తిండి, చక్కెరలతో నిండిపోతూంటుంది.
ఇలా చేస్తే మేలు...
ఇఫ్తార్...
ఖర్జూరం, నీళ్లళ్లతో మీ దీక్ష విరమణ చేపట్టండి. శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లు ఖర్చూరాల్లో మెండు. డీహైడ్రైషన్ నుంచి కాపాడతాయి. వీటితోపాటు వేడి వేడి సూప్, ప్రొటీన్ కోసం కొంచెం మాంసం/చేప/కోడిగుడ్లు తీసుకోవడం మేలు. అలాగే.. ఉడికించిన కాయగూరలు, ఆరోగ్యకరమైన కొవ్వులు కొంత మోతాదులో తినడం శరీరంలో మంట/వాపులను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మేలు చేస్తుంది. అవకాడో, ఆలివ్ ఆయిల్, బాదాం. జీడిపప్పు, వాల్‌నట్స్ వంటివి లేదంటే, గుమ్మడి/సూర్యకాంతి, అవిశ గింజల వంటి వాటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు, ప్రొటీన్, ఫైబర్‌లు లభిస్తాయి.
షుహూర్ (తెల్లవారుఝాము)
ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులకు ప్రాధాన్యమివ్వండి. రోజంతా శక్తిని అందించేందుకు సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్లు తీసుకోవడం మేలు. బ్రౌన్ రైస్, ఓట్స్, చిరుధాన్యాలు, చిలగడదుంపలు, క్యారెట్స్‌లు మాత్రమే కాదు... ఆపిల్స్, ఆరటిపండ్లు, నారింజ వంటి పండ్లు మేలు. చిటికెడు ఉప్పు కలుపుకుని నీళ్లు తాగాలి. ఉప్పు ఎక్కువగా ఉన్న, బాగా శుద్ధి చేసిన ఆహారం తీసుకోవడం వల్ల దాహం ఎక్కువ అవుతుంది.
రెండింటి మధ్య...
నిద్రకు ప్రాధాన్యమివ్వండి. రాత్రి ఎక్కువ సేపు మేలుకుని ఉండటం వల్ల శరీరంపై ఒత్తిడి పెరిగిపోయి మంట/వాపులు పెచ్చరిల్లుతాయి. ఇఫ్తార్ విందు తరువాత కాసేపు అటు ఇటు కదలడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది.
అద్భుతమైన అవకాశం...
రంజాన్ మాసం... దైవిక సేవతోపాటు మీకు మీరు సేవ చేసుకునేందుకు ఉపయోగించుకునే అద్భుత అవకాశం. అయితే ఉపవాసం ఒక్కటే సరిపోదు. శరీర హీలింగ్‌కు అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది అంతే. ఇక్కడ ఉపవాసాన్ని మీరెలా చేస్తున్నారనే దానిపై శరీరానికి కలిగే ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి.
ముస్లిం సోదరులు ఏటా ఒక నెల రోజులపాటు పైన చెప్పుకున్న ఆహార నియమాలను పాటిస్తే.. మిగిలిన 11 నెలలూ శరీరం మెరుగ్గా పనిచేస్తుంది. ముస్లిం సోదరులు ఒక్కరే కాదు... మిగిలిన వారు కూడా అప్పుడప్పుడు కొంత కాలం పాటు ఉపవాసం చేయడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
- మైక్ ఎన్డీగ్వా, నేచురల్ హెల్త్ గైడ్


