‘బంగ్లా’ ఎన్నికల్లో హిందూ అభ్యర్థి ఘన విజయం | Historic Win For Hindu Representation In Bangladesh Against Jamaat candidate, Gayeshwar Chandra Roy Triumphs In Dhaka-3 | Sakshi
Sakshi News home page

‘బంగ్లా’ ఎన్నికల్లో హిందూ అభ్యర్థి ఘన విజయం

Feb 13 2026 11:53 AM | Updated on Feb 13 2026 12:20 PM

Hindu candidate Roy defeats Jamaat candidate in Dhaka

ఢాకా: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో హిందువులకు సంతోషాన్ని పంచే పరిణామం చోటుచేసుకుంది. నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ)కి చెందిన హిందూ అభ్యర్థి గయేష్వర్ చంద్ర రాయ్ ఢాకా-3 నియోజకవర్గం నుంచి  ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆయన తన సమీప ప్రత్యర్థి, జమాతే ఇస్లామీ నేత మహమ్మద్ షాహినూర్ ఇస్లాంను ఓడించారు. గయేష్వర్ చంద్ర రాయ్‌కు మొత్తం 98,785 ఓట్లు రాగా, జమాత్ అభ్యర్థికి 82,232 ఓట్లు మాత్రమే లభించాయి.  రాయ్ సాధించిన ఈ విజయం బంగ్లాదేశ్ పార్లమెంటులో హిందువుల గళాన్ని వినిపిండానికి దోహదపడుతుందని  విశ్లేషకులు భావిస్తున్నారు.

గయేష్వర్ చంద్ర రాయ్ 1951, నవంబర్‌ ఒకటిన ఢాకాలోని కెరానిగంజ్‌లో జ్ఞానేంద్ర చంద్ర రాయ్,  సుమతి రాయ్ దంపతులకు జన్మించారు. 1990వ దశకంలో బీఎన్‌పీ నేతృత్వంలోని ప్రభుత్వాలలో ఆయన కీలక పాత్రలు పోషించారు. పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రిగా, మత్స్య , పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రిగా సేవలు అందించారు. రాజకీయాలతో పాటు ఆయన కుటుంబానికి బీఎన్‌పీ అగ్రనాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాయ్ కుమారుడు అమితాబ్ రాయ్, బీఎన్‌పీ నేత నితాయ్ రాయ్ చౌదరి కుమార్తె నిపున్ రాయ్ చౌదరిని వివాహం చేసుకున్నారు.

ఈ ఎన్నికల ఫలితాలలో తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే 200 కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకున్న బీఎన్‌పీ త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. తారిఖ్ రెహమాన్ బంగ్లాదేశ్ తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ ఫలితాలతో జమాతే ఇస్లామీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో గత 18 నెలలుగా కొనసాగుతున్న ముహమ్మద్ యూనస్ తాత్కాలిక పాలనకు ముగింపు పలికేలా ఈ ఎన్నికల తీర్పు వెలువడింది.

బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం తుది ఫలితాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, బీఎన్‌పీ విజయం దాదాపు ఖాయమైంది. ఆగస్టు 2024లో అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏర్పడిన ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం స్థానంలో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఈ పోలింగ్ జరిగింది. మొత్తం 12.7 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉండగా, అందులో సగం మంది 18-37 ఏళ్ల మధ్య వయస్సు గల యువతే కావడం గమనార్హం. 299 నియోజకవర్గాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో 59 పార్టీల నుంచి 1,700 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడగా, బీఎన్‌పీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement