న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ గురువారం కీలక అడుగు వేసింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా లోక్‌సభలో ‘సబ్‌స్టాంటివ్ మోషన్’ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా, ఆయన జీవితకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని దూబే ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అయితే ఇది ప్రివిలేజ్ మోషన్ కాదని, ఆయనపై ఉన్న తీవ్రమైన ఆరోపణల దృష్ట్యా ప్రవేశపెట్టిన ప్రత్యేక తీర్మానమని ఆయన పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు, పలు అంతర్జాతీయ సంస్థలతో ఆయనకు ఉన్న సంబంధాలపై ఎంపీ నిషికాంత్ దూబే తీవ్ర విమర్శలు గుప్పించారు. సోరోస్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్, యూఎస్ఏఐడి వంటి సంస్థలతో రాహుల్ సంబంధాలు కలిగి ఉన్నారని, థాయిలాండ్, కంబోడియా, వియత్నాం, అమెరికా పర్యటనల్లో ఆయన భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలిపారని దూబే ఆరోపించారు. ఈ అంశాలన్నింటినీ తాను దాఖలు చేసిన తీర్మానంలో వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలకు భంగం కలిగించేలా రాహుల్ వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శించారు.
బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ఈ వివాదానికి బీజం పడింది. కేంద్ర బడ్జెట్‌పై జరిగిన చర్చలో పాల్గొన్న రాహుల్ గాంధీ, భారత్-అమెరికా మధ్య జరిగిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని 'టోకు లొంగుబాటు'గా అభివర్ణించారు. ఈ ఒప్పందం ద్వారా దేశ ఇంధన భద్రతను అమెరికాకు అప్పగించారని, రైతు ప్రయోజనాలను విస్మరించారని ఆయన ఆరోపించారు. బీజేపీ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి భారత ప్రయోజనాలను తాకట్టు పెట్టారని రాహుల్ విమర్శించారు. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యర్థిని ఎలాగైతే ఉక్కిరిబిక్కిరి చేస్తారో, అలాగే ఈ ఒప్పందం భారత్‌ను చిక్కుల్లో పడేసిందని ఆయన వ్యాఖ్యానించారు.
సబ్‌స్టాంటివ్ మోషన్ అనేది అవిశ్వాస తీర్మానం లేదా అభిశంసన తీర్మానం లాంటి అత్యంత కీలకమైన ప్రక్రియ. ఉన్నత పదవుల్లో ఉన్న వారిపై నిర్దిష్టమైన ఆరోపణలు ఉన్నప్పుడు దీనిని సభలో ప్రవేశపెడతారు. దీనిని సభ చర్చకు స్వీకరించాల్సి ఉంటుంది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సభ్యుడు, తాను చేస్తున్న ఆరోపణలకు తగిన ఆధారాలను సభ ముందు ఉంచాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీపై బీజేపీ ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై సభ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.


