హరారే వేదికగా నిన్న (ఫిబ్రవరి 6) జరిగిన అండర్-19 ప్రపంచకప్ 2026 ఫైనల్లో ఇంగ్లండ్‌పై భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ఆరోసారి జగజ్జేతగా ఆవిర్భవించింది. ఈ మ్యాచ్‌లో యంగ్ ఇండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను గెలిపించాడు.
ఈ ఇన్నింగ్స్ అండర్ 19 క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమమైందిగా కీర్తించబడుతుంది. ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ కేవలం 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 175 పరుగులు చేశాడు. అండర్ 19 లెవెల్లోనే కాదు, యావత్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఇదీ ఒకటిగా నిలిచిపోతుంది.
ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ విధ్వంసం నభూతో నభవిష్యతి అన్నట్లుగా సాగింది. 14 కుర్ర వైభవ్ ఇంగ్లండ్ బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. పడ్డ బంతిని పడ్డట్టు ఎడాపెడా బాదాడు. వైభవ్‌లోని ఫైర్ చూసి ఇంగ్లండ్ బౌలర్లు వణికిపోయారు. ఏం చేయాలో.. బంతిని ఎక్కడ వేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. వైభవ్‌ను ఆపడం ఇంగ్లండ్ బౌలర్ల వల్ల కాలేదు.
విచక్షణారాహిత్యంగా సాగిన వైభవ్ ఇన్నింగ్స్ యావత్ క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. 14 ఏళ్ల పిల్లాడు ఇంతలా రెచ్చిపోవడమేంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. వైభవ్ విధ్వంసాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు మారణహోమంగా అభివర్ణిస్తున్నారు.
ఐస్‌లాండ్ క్రికెట్ అయితే ఓ అడుగు ముందుకేసి వైభవ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఐస్‌లాండ్ క్రికెట్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఇంగ్లండ్ బౌలర్లపై వైభవ్ విరుచుకుపడిన తీరును ఐస్‌లాండ్ క్రికెట్ ఎక్స్ రేటెడ్ హింసగా పేర్కొంది.
Someone arrest Vaibhav Sooryavanshi right now. This violence on the field against the English bowlers is X-rated!
— Iceland Cricket (@icelandcricket) February 6, 2026
ఐస్‌లాండ్ క్రికెట్ ఈ ట్వీట్‌ను సరదాగా చేసినా, నెటిజన్లు దీన్ని నిజంగానే అన్వయించుకుంటున్నారు. ఎందుకంటే, ఇంగ్లండ్ బౌలర్లపై వైభవ్ విరుచుకుపడిన తీరు ఎక్స్ రేటెడ్ హింసలాగే ఉంది. ఆ బాదుడు నిజంగానే ఇంగ్లండ్ ఆటగాళ్లను భయబ్రాంతులకు గురి చేసింది. ఇది తలచుకొని వారు కొన్ని నెలలైనా సుఖంగా నిద్రపోలేరు. అంతలా సాగించి వైభవ్ బీభత్సం.
ఈ సునామీ ఇన్నింగ్స్‌తో వైభవ్ ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు. ఇందులో అత్యధిక సిక్సర్లు, ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ వంటి భారీ రికార్డులు కూడా ఉన్నాయి. వైభవ్ ఊచకోత కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్స్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్.
అనంతరం కష్టసాధ్యమైన ఛేదనలో ఇంగ్లండ్ అద్భుతంగా పోరాడింది. అయితే లక్ష్యం అతి భారిది కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. కాలెబ్ (115) వీరోచిత శతకంతో ఆకట్టుకున్నాడు. చివరికి ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటై, 100 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.


