‘సింధు’ వివాదం: ‘హేగ్’ఆదేశాలపై భారత్ ఆగ్రహం | India against International Court Order on Indus Waters Treaty | Sakshi
Sakshi News home page

‘సింధు’ వివాదం: ‘హేగ్’ఆదేశాలపై భారత్ ఆగ్రహం

Feb 3 2026 9:45 AM | Updated on Feb 3 2026 11:20 AM

India against International Court Order on Indus Waters Treaty

హేగ్‌: సింధు జలాల ఒప్పందం (ఐడబ్యూటీ) విషయంలో హేగ్‌(నెదర్లాండ్స్‌)లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (CoA) జారీ చేసిన తాజా ఆదేశాలను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. భారత్‌లోని జలవిద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన ‘పాండేజ్ లాగ్‌బుక్’లను సమర్పించాలని కోర్టు కోరగా, ఆ ఆదేశాలను పాటించే ప్రసక్తే లేదని భారత్‌ స్పష్టం చేసింది.

అసలు ఈ మధ్యవర్తిత్వ కోర్టు ఏర్పాటునే భారత్ అక్రమమని, దానికి ఎటువంటి చట్టబద్ధత లేదని కొట్టిపారేసింది. ఈ అంశంపై ఫిబ్రవరి 2, 3 తేదీల్లో హేగ్‌లోని పీస్ ప్యాలెస్‌లో విచారణ జరుగుతున్నప్పటికీ, భారత్ మాత్రం వీటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. 2025 ఏప్రిల్ 23న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం నేపథ్యంలో ప్రస్తుత ప్రతిష్టంభన ఏర్పడింది. పహల్గామ్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది పౌరులను పొట్టనబెట్టుకున్న మర్నాడే భారత్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

సరిహద్దు దాటి వస్తున్న ఉగ్రవాదాన్ని ఆపకపోతే పాకిస్తాన్‌కు నీటి సహకారం అందించడం సాధ్యం కాదని భారత్ తేల్చిచెప్పింది. ఒప్పందాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టినందున, అంతర్జాతీయ వేదికలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమకు లేదని భారత ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. కాగా సింధు నదీ వ్యవస్థపైనే ఆధారపడిన పాకిస్తాన్ వ్యవసాయ రంగం ప్రస్తుతం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. పాక్‌లోని తర్బేలా, మంగ్లా వంటి కీలక జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలను వాడుకుంటోందని భారత్ ఆరోపించింది.

భారత్ ఈ విచారణలో పాల్గొనకపోయినప్పటికీ, హేగ్ కోర్టు మాత్రం పాకిస్తాన్ విన్నపం మేరకు విచారణను కొనసాగిస్తోంది. ఒకవేళ భారత్ సమాచారం ఇవ్వకపోతే ప్రతికూల నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. అయితే భూతలాన ఉన్న యథార్థ పరిస్థితులను విస్మరించి, ఒప్పందాలు సాగవని భారత్ గట్టిగా వాదిస్తోంది. ఈ వివాదం ఇప్పుడు కేవలం నీటి పంపకాలకే పరిమితం కాకుండా, భారత్-పాక్ మధ్య ఒక వ్యూహాత్మక దౌత్య యుద్ధంగా మారింది. భారత భాగస్వామ్యం లేని విచారణ ఏకపక్షమే అవుతుందని, అది ఏ రకంగానూ ఒప్పందాన్ని శాసించలేదని విశ్లేషకులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: ‘బడ్జెట్‌’తో బుద్ధి చెప్పిన భారత్‌.. తేరుకోని బంగ్లాదేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement