ఖమేనీ హెచ్చరికలు.. ట్రంప్ బేఖాతర్‌ | Trump hopes Iran will make a deal | Sakshi
Sakshi News home page

ఖమేనీ హెచ్చరికలు.. ట్రంప్ బేఖాతర్‌

Feb 2 2026 9:01 AM | Updated on Feb 2 2026 9:06 AM

Trump hopes Iran will make a deal

వాషింగ్టన్‌: అమెరికా, ఇరాన్‌ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్ ముందుకు వస్తుందనే ఆశ తనలో ఉందని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చేసిన హెచ్చరికలను కూడా ఆయన ప్రస్తావించారు. అమెరికా గనుక దాడులకు దిగితే అది తీవ్రమైన ప్రాంతీయ యుద్ధానికి దారి తీస్తుందని ఖమేనీ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.

వాషింగ్టన్‌తో ఇరాన్‌ చర్చలు ఒకవేళ విఫలమైతే ఖమేనీ చేసిన హెచ్చరిక ఎంతవరకు నిజమో తేలిపోతుందని ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో నివాసంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, ఇరాన్ సమీపంలో అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలను మోహరించినట్లు తెలిపారు. అయితే సైనిక చర్య కంటే దౌత్యపరమైన పరిష్కారానికే తాము మొగ్గు చూపుతున్నామన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నామని, అది సాధ్యం కాకపోతే తదుపరి పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధమని ట్రంప్‌ పేర్కొన్నారు.

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సోషల్ మీడియా వేదికగా అమెరికాను హెచ్చరిస్తూ వరుస పోస్టులు చేశారు. అమెరికా గనుక యుద్ధాన్ని ప్రారంభిస్తే, అది కేవలం ఇరాన్ సరిహద్దులకే పరిమితం కాదని, ఈ ప్రాంతాన్నంతా చుట్టుముట్టే యుద్ధంగా మారుతుందని హెచ్చరించారు. యుద్ధ నౌకలు లేదా విమానాలతో చేసే బెదిరింపులకు ఇరాన్ భయపడదని అన్నారు. గతంలోనూ అమెరికా ఇలాంటి ప్రకటనలు చేసిందని, వీటివల్ల తమ దేశ ప్రయోజనాలకు భంగం కలగదని  ఖమేనీ అన్నారు.

తాము ఏ దేశంతోనూ యుద్ధాన్ని కాంక్షించడం లేదని,  అయితే ఎవరైనా దాడికి దిగితే నిర్ణయాత్మకమైన దెబ్బ కొడతామని ఖమేనీ స్పష్టం చేశారు. ఇరాన్ వద్ద ఉన్న సహజ వనరులు, వ్యూహాత్మక భౌగోళిక స్థానంపై పట్టు సాధించేందుకే అమెరికా తమను లొంగదీసుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.

ఇది కూడా చదవండి: పొద్దున్నే వణికించిన భూకంపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement