ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఖోడా ప్రాంతంలోని ఒక హోటల్‌లో ఆర్డర్ చేసిన ఆహారం రావడం ఆలస్యమైందన్న చిన్న కారణంతో మొదలైన వివాదం ఇద్దరి ప్రాణాలను బలితీసుకునేవరకూ వెళ్లింది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ దారుణ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను బహ్రైచ్ జిల్లాకు చెందిన శ్రీపాల్ (25), సత్యం (26)గా పోలీసులు గుర్తించారు. వీరు ఖోడాలోని నెహ్రూ విహార్ కాలనీలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. ఘటన జరిగిన సమయంలో రెండు వర్గాలకు చెందిన యువకులు మద్యం మత్తులో ఉన్నారు. ఆర్డర్ చేసిన భోజనం వడ్డించడంలో జాప్యం జరగడంతో ఇరు గ్రూపులవారు ఒకవైపు హోటల్ సిబ్బందితోను, మరోపైపు పరస్పర వర్గంతోను వాగ్వాదానికి దిగారు. ఇది క్షణాల్లో పెను వివాదంగా మారి, ఇరు వర్గాలు పరస్పరం పదునైన ఆయుధాలతో దాడి చేసుకునేవరకూ దారి తీసింది. హోటల్ ప్రాంగణంలో రక్తం చిందింది.
స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు యువకులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే శ్రీపాల్, సత్యంలు మృతి చెందినట్లు వైద్యులు వైద్యులు ప్రకటించారు. మూడవ వ్యక్తికి తీవ్రమైన గాయాలు కావడంతో పాటు, అతను కూడా మద్యం మత్తులో ఉండటంతో అతని వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనపై డిసిపి నిమిష్ పాటిల్ మాట్లాడుతూ, కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు వేగవంతం చేసినట్లు తెలిపారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఇది కూడా చదవండి: ర్యాగింగ్ కలకలం.. ఎనిమిది మంది మెడికోలపై వేటు


