నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అలసిపోవడం అనేది ఒక సాధారణ అంశంగా మారిపోయింది. ఆఫీసు పని, ఇంటి బాధ్యతలు, ప్రయాణాలు.. ఇలా ఏదో ఒక కారణంతో మనం అలసటకు గురవుతున్నామని సరిపెట్టుకుంటాం. అయితే ఎలాంటి పని చేయకపోయినా, తగినంత నిద్ర ఉన్నా కూడా నిత్యం నీరసంగా అనిపిస్తుంటే, దాని వెనుక ప్రమాదకర కారణం ఉండవచ్చని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ జనరల్ ప్రాక్టీషనర్ డాక్టర్ సెర్మెడ్ మెజర్ హెచ్చరిస్తున్నారు.
దడ పుట్టించే ‘థయామిన్’ లోపం
మనకు కలిగే అలసటకు కేవలం పని ఒత్తిడి మాత్రమే కారణం కాకపోవచ్చని, శరీరంలో ఒక కీలకమైన పోషకం తగ్గిందని చెప్పడానికి అది ఒక హెచ్చరిక కావచ్చని డాక్టర్ సెర్మెడ్ మెజర్ అంటున్నారు. ‘థయామిన్’ లేదా ‘విటమిన్ బి1’ లోపం పలు అనారోగ్య సమస్యలకు దారితీసుందని ఆయన హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ‘థయామిన్’లోపంపై పలు కీలక విషయాలను పంచుకున్నారు. కారణం లేకుండా వేధించే అలసట వెనుక ఈ విటమిన్ లోపం ఎలా దాగి ఉంటుందో ఆయన వివరించారు.
గుర్తించడం చాలా కష్టం
చాలా మందిలో థయామిన్ లోపం ఉన్నప్పటికీ, సాధారణ రక్త పరీక్షల ద్వారా దీనిని త్వరగా గుర్తించలేమని డాక్టర్ మెజర్ పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం ఈ లక్షణాలు ఇతర సాధారణ ఆరోగ్య సమస్యలను పోలి ఉండటమేనని ఆయన తెలిపారు. ‘ప్రారంభ దశలో థయామిన్ లోపం ఉంటే విపరీతమైన అలసట, చికాకు, మతిమరుపు లేదా నిద్రలేమి వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని బాధితులు మాత్రమే కాదు, వైద్యులు కూడా సాధారణ ఒత్తిడి లేదా వయసు పెరగడం వల్ల వచ్చే మార్పులుగా భావించి నిర్లక్ష్యం చేసే అవకాశం ఉందని ఆయన విశ్లేషించారు.
థయామిన్ నిల్వలు తగ్గుతాయిలా..
మన శరీరం విటమిన్ బి1ను ఎక్కువ కాలం నిల్వ చేసుకోలేదు. కేవలం 20 నుండి 30 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే మన శరీరంలో ఉంటాయి. కాబట్టి, మనం తీసుకునే ఆహారం సరిగ్గా లేకపోయినా లేదా అధిక చక్కెర పదార్థాలు తీసుకున్నా ఈ నిల్వలు చాలా వేగంగా తగ్గిపోతాయి. దీనిని డాక్టర్ మెజర్ ‘థయామిన్ డ్రైన్స్’గా పేర్కొన్నారు.
శుద్ధి చేసిన పిండి పదార్థాలు
మనం తీసుకునే మైదా, వైట్ రైస్ వంటి పదార్థాలను గ్లూకోజ్‌గా మార్చే ప్రక్రియలో థయామిన్ ఒక కీలకమైన కో-ఫ్యాక్టర్‌గా పనిచేస్తుంది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న థయామిన్ వేగంగా ఖర్చవుతుంది.
మద్యపానం
ఆల్కహాల్ అలవాటు ఉన్నవారిలో థయామిన్ గ్రహించే శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల ఈ లోపం ఏర్పడే ప్రమాదం ఎక్కువ.
మందుల ప్రభావం
రక్తపోటు (బీపీ) నియంత్రణ కోసం వాడే కొన్ని రకాల 'డైయూరిటిక్స్' మందులు, మూత్రపిండాల ద్వారా థయామిన్ శరీరం నుండి బయటకు వెళ్లిపోయేలా చేస్తాయి.
శారీరక ఒత్తిడి
విపరీతమైన శారీరక శ్రమ లేదా తీవ్రమైన అనారోగ్యం సమయంలో కూడా ఈ పోషక అవసరాలు పెరుగుతాయి.
ఈ లక్షణాలను విస్మరించొద్దు
థయామిన్ లోపం ప్రారంభంలో చాలా సాధారణంగా అనిపించినా, అది క్రమంగా తీవ్రరూపం దాలుస్తుంది. అందుకే శరీరంలో కలిగే కొన్ని ముఖ్య లక్షణాలను గుర్తించాలి.
నిరంతర అలసట: రాత్రంతా నిద్రపోయినా ఉదయాన్నే లేవగానే నీరసంగా అనిపించడం.
మెంటల్ ఫజ్జినెస్ : ఏదైనా విషయంపై దృష్టి పెట్టలేకపోవడం, ఆలోచనలు స్పష్టంగా లేకపోవడం.
మూడ్ స్వింగ్స్: చిన్న చిన్న విషయాలకే విపరీతమైన చికాకు లేదా కోపం రావడం.
మతిమరుపు: ఇటీవల జరిగిన విషయాలను కూడా గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడటం.
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయమా?
థయామిన్ లోపం తీవ్రమైతే అది 'బెరిబెరి' (Beriberi) అనే ప్రమాదకరమైన వ్యాధికి దారితీస్తుంది. ఇది నాడీ వ్యవస్థను, గుండె పనితీరును దెబ్బతీస్తుంది. దీనివల్ల కండరాలు క్షీణించడం, కాళ్లు చేతులు మొద్దుబారిపోవడం, చివరికి గుండె వైఫల్యం (Heart Failure) సంభవించే అవకాశం ఉందని డాక్టర్ మెజర్ హెచ్చరించారు.
పరిష్కారం ఏమిటి?
థయామిన్ లోపాన్ని చాలా సులభంగా సరిదిద్దవచ్చు. డాక్టర్ మెజర్ సూచనల ప్రకారం..
ఆహార మార్పులు: పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని భర్తీ చేయవచ్చు.
సప్లిమెంట్లు: ముఖ్యంగా వృద్ధులు, సరైన పోషకాహారం తీసుకోలేని వారు లేదా ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు వైద్యుల సలహాతో 'లిపిడ్-సోలబుల్ థయామిన్' సప్లిమెంట్లను వాడవచ్చు.
కొన్నివారాల్లోనే మాయం: శరీరంలో థయామిన్ స్థాయిలు మళ్ళీ సాధారణ స్థితికి చేరగానే, ఆహారం శక్తిగా మారే ప్రక్రియ మెరుగుపడుతుంది. దీనివల్ల ఏళ్ల తరబడి వేధిస్తున్న అంతుచిక్కని అలసట కేవలం కొన్ని వారాల్లోనే మాయమవుతుంది.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీకు ఇలాంటి లక్షణాలు ఉంటే, సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా వెంటనే అర్హత కలిగిన వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఏఐ మేధావికి ఇలాంటి టెస్టా?.. ఇంత కన్నా ఘోరం ఉంటుందా?


