అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణం | Himanta Biswa Sarma's Historic Second Term as Assam CM | Sakshi
Sakshi News home page

అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణం

May 12 2026 11:54 AM | Updated on May 12 2026 12:15 PM

Himanta Biswa Sarma's Historic Second Term as Assam CM

గౌహతి: అస్సాం రాజకీయాల్లో మరో అధ్యాయం మొదలయ్యింది. గౌహతిలోని ఖానాపరా పశువైద్య కళాశాల ప్రాంగణం ఈ  అద్భుత ఘట్టానికి వేదికైంది. భారతీయ జనతా పార్టీ అగ్రనేత హిమంత బిశ్వ శర్మ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, రాష్ట్ర చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుక యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. మంగళవారం ఉదయం 11:40 గంటలకు గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య సమక్షంలో హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అస్సాం రాజకీయాల్లో కాంగ్రెసేతర నాయకుడెవరూ వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించలేదు. 57 ఏళ్ల శర్మ ఆ రికార్డును తిరగరాశారు. గతంలో ప్రఫుల్ల కుమార్ మహంత రెండుసార్లు సీఎంగా పనిచేసినప్పటికీ, ఆ పదవీకాలాల మధ్య విరామం ఉంది. తద్వారా వరుసగా రెండోసారి పగ్గాలు చేపట్టిన తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా శర్మ రికార్డు సృష్టించారు.

 


హేమాహేమీల సమక్షంలో..
ఈ చారిత్రక ఘట్టానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, ఎన్డీయే పాలిత 22 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. విదేశీ ప్రతినిధులు, ముఖ్యంగా భారతదేశానికి అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అస్సాంలోని 17 వైష్ణవ మఠాల మఠాధిపతుల ఆశీర్వచనాల మధ్య శర్మ ప్రమాణం చేశారు. లక్షలాది మంది ప్రజలు ఈ వేడుకను వీక్షించడానికి తరలిరావడంతో గౌహతి జనసంద్రమైంది.

 

మంత్రుల ప్రమాణం
శర్మతో పాటు అజంతా నియోగ్, రామేశ్వర్ తేలి, అతుల్ బోరా (ఏజీపీ), చరణ్ బోరో (బీపీఎఫ్‌)లు మంత్రులుగా ప్రమాణం చేశారు. రంజిత్ దాస్‌ను స్పీకర్‌గా ఎంపిక చేయనున్నారు. 126 స్థానాలున్న అస్సాం అసెంబ్లీలో ఎన్డీయే కూటమి ఏకంగా 102 సీట్లను కైవసం చేసుకుని, తిరుగులేని మెజారిటీని సాధించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ కేవలం 19 సీట్లకే పరిమితం కావడంతో, ఈసారి అసెంబ్లీలో అధికారిక ప్రతిపక్ష నేత హోదా పొందే అవకాశం కూడా ఏ పార్టీకి లభించకపోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement