విజయ్‌ ఎత్తులు : పళని స్వామికి షాక్‌, కొత్త నాయకత్వం | Tamil Nadu CM Vijay meets AIADMK CV Shanmugam SP Velumani | Sakshi
Sakshi News home page

విజయ్‌ ఎత్తులు : పళని స్వామికి షాక్‌, కొత్త నాయకత్వం

May 12 2026 5:11 PM | Updated on May 12 2026 5:41 PM

Tamil Nadu CM Vijay meets AIADMK CV Shanmugam SP Velumani

సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీ AIADMK (అన్నాడీఎంకే) చీలిక దిశగా వెళ్తుండటంతో, ఆ పార్టీకి చెందిన రెబల్ వర్గం ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది.  బుధవారం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించు కోవాల్సి ఉన్న తరుణంలో సీఎం విజయ్  శరవేగంగా పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలో CV షణ్ముగం, SP వేలుమణిలతో భేటీ కావడంతో తమిళనాట  రాజికీయాలు మరింత వేడెక్కాయి.

ముఖ్యమంత్రి విజయ్, టీవీకే కూటమికి మద్దతు ప్రకటించిన అన్నాడీఎంకే కీలక నేతలతో  సమావేశ మయ్యారు.  ఎడప్పాడి పళనిస్వామి (EPS) ప్రతిపాదనపై వ్యతిరేకత కారణంగా అన్నాడీఎంకేకు చెందిన సుమారు 30 మంది ఎమ్మెల్యేలు ఈ రెబల్ క్యాంపులో ఉన్నట్లు సమాచారం. ఇది తమ ఎమ్మెల్యేలలో అత్యధికుల నిర్ణయమని షణ్ముగం మంగళవారం తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర పరాజయాన్ని చవిచూసిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది.

కొత్త నాయకత్వం
రెబల్ వర్గం తమ సొంత నాయకత్వాన్ని ఎన్నుకుంది:శాసనసభాపక్ష నేతగా ఎస్.పి. వేలుమణిని, డిప్యూటీ లీడర్‌గా జి. హరిని ఎన్నుకోవడం సంచలనం  రేపింది.


విజయ్‌తో అన్నాడీఎంకే రెబల్ నేతల భేటీ
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కేవలం 47 స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పార్టీ జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి, బద్ధశత్రువైన DMK (డీఎంకే) మద్దతుతో ముఖ్యమంత్రి కావాలని భావించడం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని షణ్ముగం తెలిపారు.

డీఎంకేతో పొత్తు పెట్టుకుంటే అన్నాడీఎంకే మనుగడకే ముప్పు అని మెజారిటీ ఎమ్మెల్యేలు భావించారు. 53 ఏళ్లుగా డీఎంకేకు వ్యతిరేకంగానే తమ రాజకీయం ఉందని, అందుకే విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. అన్నాడీఎంకేలో మరో చీలిక తమకు ఇష్టం లేదని ఎస్.పి. వేలుమణి పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పళనిస్వామిని కోరారు. పార్టీ శ్రేయస్సు కోసమే తాము ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

కాగా తమిళనాడులో ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికల్లో టీవీకే (108 సీట్లు) అతిపెద్ద పార్టీగా అవతరించగా, డీఎంకే 59 సీట్లు, అన్నాడీఎంకే 47 సీట్లు గెలుచుకున్నాయి. ఇప్పుడు అన్నాడీఎంకేలోని ఒక వర్గం మద్దతుతో విజయ్ ప్రభుత్వం మరింత బలోపేతం కానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement