‘నాన్నని వద్దంటున్న అమ్మ’.. కలెక్టర్‌ను కలిసిన చిన్నారులు | Siblings Approach Collector to Reunite Fighting Parents | Sakshi
Sakshi News home page

‘నాన్నని వద్దంటున్న అమ్మ’.. కలెక్టర్‌ను కలిసిన చిన్నారులు

May 12 2026 10:28 AM | Updated on May 12 2026 10:40 AM

Siblings Approach Collector to Reunite Fighting Parents

పాలక్కడ్‌: కుటుంబ కలహాలు ఆ పసిమొగ్గల పాలిట శాపంగా మారుతున్నాయి. ‘అమ్మకు మేం కావాలి, కానీ నాన్న వద్దు.. మాకు మాత్రం ఇద్దరూ కావాలి’ అంటూ కేరళలోని పాలక్కాడ్ జిల్లా కలెక్టరేట్ మెట్లెక్కిన ఇద్దరు చిన్నారుల ఆవేదన అందరి హృదయాలను కలచివేస్తోంది. విడిపోతున్న తమ తల్లిదండ్రులను ఎలాగైనా కలపాలని వారు చేసిన వేడికోలు ఇప్పుడు సంచలనంగా మారింది.

విదేశీ పర్యటనలో మొదలైన దూరం
త్రిథాలలోని అనక్కరకు చెందిన 10, 8 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు.. తమ మేనత్త కూతురైన 12 ఏళ్ల సోదరితో కలిసి సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎస్. మాధవికుట్టిని కలిశారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న తమ తల్లి వద్దకు విషు పండుగ సందర్భంగా నాన్నతో కలిసి వెళ్లామని పిల్లలు తెలిపారు. అయితే, అక్కడ రెండు నెలలు ఉన్నప్పటికీ తల్లి తమను పెద్దగా పట్టించుకోలేదని, కనీసం తమతో సరిగా గడపలేదని వారు కలెక్టర్‌కు వివరించారు. ఆ విదేశీ పర్యటన వారిని తీవ్ర మానసిక ఆవేదనకు గురిచేసింది.

విడిపోదామన్న తల్లి.. వ్యసనంలో తండ్రి
కేరళకు తిరిగి వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. తండ్రి మద్యానికి బానిస కావడం, ఇంట్లో నిత్యం గొడవలు, పోలీసు కేసులు ఆ పసివాళ్లను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాయి. ఈ క్రమంలో గత బుధవారం కేరళకు తిరిగొచ్చిన తల్లి.. తండ్రి లేకుండా తనతోనే వచ్చేయాలని పిల్లలకు తేల్చిచెప్పింది. అయితే, ‘ఇద్దరూ కలిసి ఉంటేనే వస్తాం’ అంటూ ఆ చిన్నారులు తెగేసి చెప్పారు.

రంగంలోకి కలెక్టర్.. కౌన్సెలింగ్ ఏర్పాటు
తమ తాతయ్య, సోదరి మద్దతుతో కలెక్టర్ వద్దకు రాకముందే ఈ చిన్నారులు బాలల సంక్షేమ సమితిని (సీడబ్ల్యూసీ) కూడా ఆశ్రయించారు. కలెక్టర్‌తో జరిగిన సమావేశంలో 12 ఏళ్ల సోదరి వారికి ప్రతినిధిగా వ్యవహరించి, కుటుంబంలో నెలకొన్న కలహాలను పూసగుచ్చినట్లు వివరించింది. పిల్లల పరిస్థితికి చలించిపోయిన కలెక్టర్ మాధవికుట్టి తక్షణమే జోక్యం చేసుకుని, మహిళా శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ద్వారా ఆ చిన్నారులకు కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. వారికి పూర్తి భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చి అధికారుల సాయంతో సురక్షితంగా ఇంటికి పంపించారు.
 

ఇది కూడా చదవండి: మంత్రి అరోరాకు ఈడీ షాక్: వెలుగులోకి డమ్మీ అకౌంట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement