రూ. 30 వేల‌ కోట్ల ఆస్తి వివాదం, సుప్రీంకోర్టు అసహనం | Supreme Court Judge Irked On Kapur Family Row Mahabharat Will Look Small | Sakshi
Sakshi News home page

రూ. 30 వేల‌ కోట్ల ఆస్తి వివాదం, సుప్రీంకోర్టు అసహనం

May 12 2026 7:29 PM | Updated on May 12 2026 7:40 PM

 Supreme Court Judge  Irked On Kapur Family Row Mahabharat Will Look Small

'మహాభారతాన్ని మించిపోయింది' - ధర్మాసనం వ్యాఖ్యలు

గత ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్‌లో పోలో ఆడుతూ మరణించిన వ్యాపారవేత్త సంజయ్ కాపూర్రూ. 30,000 కోట్ల వారసత్వ సంపద కోసం కపూర్ కుటుంబం మధ్య జరుగుతున్న సుదీర్ఘ పోరాటంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దివాలా ఘాటుగా స్పందించారు. ఈ వివాదంలో దాఖలవుతున్న పిటిషన్ల వెల్లువను చూసి, "చూస్తుంటే మహాభారతం కూడా చిన్నదిగా కనిపిస్తుంది" అని ఆయన వ్యాఖ్యానించారు.

మే 18న జరగాల్సిన 'రఘువంశీ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్' (RIPL) బోర్డు సమావేశాన్ని నిలిపివేయాలని సంజయ్ కపూర్ తల్లి 80 ఏళ్ల రాణి కపూర్ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశించిన మధ్యవర్తిత్వ ప్రక్రియను పక్కదారి పట్టించేందుకు జరుగుతున్న 'మోసపూరిత ప్రయత్నం'గా ఈ సమావేశాన్ని ఆమె అభివర్ణించారు. ఈ పిటిషన్‌ను విన్న జస్టిస్ జేబీ పార్దివాలా నేతృత్వంలోని బెంచ్, దేశంలోని అత్యంత ధనిక కుటుంబాల్లో ఒకటైన కపూర్ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ వివాదం మహాభారతం కంటే పెద్దదిగా మారుతోందని వ్యాఖ్యానిస్తూ, ఈ కేసును మే 14న (గురువారం) విచారణకు స్వీకరిస్తామని తెలిపారు.వివాదాస్పద కుటుంబ ఆస్తిలో అధిక భాగం RIPL ఆధీనంలో ఉంది.

కాగా గత వారం, ఢిల్లీ హైకోర్టు ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (CJI) డి.వై. చంద్రచూడ్‌ను మధ్యవర్తిగా నియమించింది. రాణి కపూర్ తన కుటుంబ ట్రస్ట్‌ను మోసపూరితమైందిగా ప్రకటించాలని సివిల్ సూట్ దాఖలు చేశారు. మధ్యవర్తిత్వం పూర్తయ్యే వరకు సంజయ్ కపూర్ మూడో భార్య ప్రియా కపూర్ కుటుంబ ట్రస్ట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా చూడాలని రాణి కపూర్ కోరారు.

మరోవైపు  సంజయ్ కపూర్ రెండో భార్య, నటి కరిష్మా కపూర్ పిల్లలైన కియాన్, సమీరా కపూర్, ప్రియా కపూర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రియా కపూర్ తన తండ్రి వీలునామాను ఫోర్జరీ చేశారని వారు ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు.  కాగా ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియ సంజయ్ కపూర్ రాసిన వీలునామాకు (Will) వర్తించదు. దానిపై విడిగా న్యాయ పోరాటం జరుగుతోంది. 

ఇదీ చదవండి: నో వీసా, నో సిటిజన్‌షిప్‌ : స్కాట్లాండ్‌లో సంచలనం ఎవరీ మణివణ్ణన్‌?

గత ఫిబ్రవరిలో ఈ కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న బహిరంగ విమర్శలపై ఢిల్లీ హైకోర్టు కూడా  అసహనం వ్యక్తం చేసింది. ఒకరిపై ఒకరు పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయవద్దని,  "గౌరవంగా ప్రవర్తించాలని" కోర్టు హెచ్చరించింది.దీంతో ఈ వివాదం, రోజుకో కొత్త మలుపు తిరుగుతూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

ఇదీ చదవండి: విజయ్‌ ఎత్తులు : పళని స్వామికి షాక్‌, కొత్త నాయకత్వం

Advertisement
 
Advertisement
Advertisement