తమిళనాడులో బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మిత్రపక్షం అన్నాడీఎంకేలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. టీవీకే విజయ్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ వెంటనే టీవీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే కూడా అదే ప్రకటన చేసింది.
‘‘డీఎంకేతో చేతులు కలిపి సీఎం కావాలని పళనిస్వామి కుట్ర చేశారు. పార్టీ సిద్దాంతాలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించారు. అందుకే ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నాం. ఇకపై ఎన్డీయే కూటమికి.. మాకు సంబంధం లేదు. మాదే అసలైన అన్నాడీఎంకే. విజయ్ ప్రజల సీఎం. అందుకే మా మద్దతు ప్రకటిస్తున్నాం’’ అని అన్నాడీఎంకే రెబల్ వర్గ ఎమ్మెల్యే సీవీ షణ్ముగం ప్రకటించారు.
ఆ వెంటనే.. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(AMMK) ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. అయితే ఈ విషయంలో ఆ పార్టీ అధినేత టీవీవీ దినకరన్ హైడ్రామా నడిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది.
ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్న టీవీకేకు తొలుత కామరాజ్ మద్దతుగా సంతకం చేశారు. అయితే తమ ఎమ్మెల్యే సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ దినకరన్ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ విషయంపై గవర్నర్‌కు, పోలీసులు ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. తమ మిత్రపక్షం అన్నాడీఎంకే ప్రభుత్వ ఏర్పాటునకు సిద్ధంగా ఉందని.. కాబట్టి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. అయితే..
టీవీకే ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ కామరాజ్ సంతకం చేసిన వీడియోను రిలీజ్ చేసింది. అయినా కూడా దినకరన్ తన ఆరోపణలను కొనసాగించారు. ఈ తరుణంలో..
అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ప్రకటన చేయడం గమనార్హం. అయితే తన ఎమ్మెల్యే కామరాజ్ దినకరన్ సూచన మేరకే విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటన చేశారా?.. లేదంటే రెబల్‌గా సంతకం చేశారా? ఎన్డీయే కూటమి నుంచి దినకరన్ పార్టీ కూడా బయటకు వచ్చేసినట్లేనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమి మొత్తం 234 స్థానాలకుగానూ.. 223 స్థానాల్లో పోటీ చేసింది. వీటిలో అన్నాడీఎంకే 178 స్థానాల్లో పోటీ చేసి 47 గెల్చుకుంది. బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు నెగ్గింది. ఏఎంఎంకే 11 స్థానాల్లో పోటీ చేసి ఒక్క స్థానంలో గెలిచింది. పట్టాలి మక్కల్ కట్చి(PMK) 18 స్థానాల్లో పోటీ చేసి 4 సీట్లు గెలిచింది. ఫలితంగా, ఈ కూటమి మొత్తం 53 స్థానాలు గెలుచుకుంది.
ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఎన్డీయే కూటమిలో.. లుకలుకలు బయటపడ్డాయి. మెజారిటీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు (24-30) మంది కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్‌కు మద్దతు ప్రకటించారు. ఇటు దినకరన్ ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే కూడా మద్దతు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో పళని వర్గ ఎమ్మెల్యేలు, పీఎంకే 4 ఎమ్మెల్యేలు, బీజేపీ ఏకైక ఎమ్మెల్యే మాత్రమే మిగిలినట్లైంది!.


