-
పవన్‌ను పిచ్చాసుపత్రిలో చేర్చాలి: నారాయణ
బి.కొత్తకోట: రోజుకో మాట మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పిచ్చాసుపత్రిలో చేర్చాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలో సీపీఐ శత వార్షికోత్సవ సభ ఆదివారం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన నారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ ఒకసారి చేగువేరా, మరొకసారి సావర్కర్, ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నారని అన్నారు. ‘సనాతన ధర్మంలో భర్త చనిపోతే భార్య చితి మంటల్లో ఆహుతి అవుతుంది. ఇలాంటి ధర్మాన్ని ఒప్పుకుంటారా.. మూడు పెళ్లిళ్ల పవన్ కళ్యాణ్’ అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న చంద్రబాబు, పవన్ ఆయన మాటలకు తలూపుతున్నారని అన్నారు. -
పార్టీ కమిటీలను వెంటనే పూర్తి చేయాలి: సజ్జల
తాడేపల్లి: ప్రతీ నియోజకవర్గంలోనూ వైఎస్సార్సీపీ కమిటీలు వెంటనే పూర్తి చేయాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో సజ్జల టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, రీజనల్ కోఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, ఇతర ముఖ్యనేతలు టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కమిటీల విషయంలో ఎటువంటి జాప్యం జరగకూడదని సజ్జల ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో కమిటీల ఏర్పాటు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం జనరల్ సెక్రటరీలు, రీజనల్ కో ఆర్డినేటర్లు, కేంద్ర కార్యాలయం నుంచి ఇంచార్జులు అందరూ అందుబాటులో ఉంటారన్నారు. కమిటీల విషయంలో జాప్యం జరగడానికి వీల్లేదని ఇప్పటికీ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేసిన సంగతిని సజ్జల ఈ సందర్భంగా గుర్తు చేశారు. కమిటీల ఏర్పాటుపై సీరియస్ గా దృష్టిపెట్టాలని, జిల్లా అధ్యక్షులు వెంటనే వీటిపై స్పందించాలని సజ్జల సూచించారు.ప్రజా పాలనను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, పార్టీకి సంబంధించి రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం సమిష్టిగా పనిచేసి అన్ని కార్యక్రమాలను విజయవంతం చేశారని సజ్జల అభినందించారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ అధినేత వైఎస్ జగన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారన్నారు. -
‘ప్రతిసారి అలగడం, ఏడవడమే బాలినేని చరిత్ర’
సాక్షి, ప్రకాశం జిల్లా: వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి బాలినేనికి మాట్లాడే అర్హత లేదంటూ జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైవీ, వైస్సార్ కుటుంబం లేకపోతే నువ్వెవరవి అంటూ బాలినేనిని ప్రశ్నించారు. ఆదివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిసారి ఏదో ఒక సాకుపెట్టు కొని మా మీద ఏడుస్తావు. గతంలో కూడా మా కుటుంబం మీద కుట్రలు చేశావ్. ఇప్పటికీ నీ బుద్ధిమారలేదు’’ అంటూ వెంకాయమ్మ మండిపడ్డారు.‘‘బూచేపల్లి కుటుంబంపై కుట్రలు చేసి.. ఇవాళ నువ్వే రోడ్డున పడ్డావు. వైఎస్ జగన్‌ను ఓడిస్తావా..? నీ తరం కాదు. 2024 ఎన్నికలో నా కుమారుడు బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి గెలవకూడదని కుట్ర పన్నావ్...? నువ్వే ఓడిపోయావు. నన్ను చైర్ పర్సన్ పదవి నుంచి దించుతావా..? నా కుర్చి టచ్ చేసి చూడు.. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగనే సీఎం.. ఎవరూ అడ్డుకోలేరు.?...2004 నుంచి రాజకీయాల్లో ఉండి.. నీతిగా రాజకీయాలు చేస్తున్నాం. మా ప్రాణాలు పోయే వరకు వైఎస్ జగన్‌తోనే ప్రయాణం. మా కుటుంబం మీద అభిమానంతో వైఎస్ జగన్ నన్ను జడ్పి చైర్ పర్సన్‌ని చేశాడు. నీకు దమ్ముంటే... నా కుర్చీ జోలికిరా..? చూస్తా.. ప్రతీ సారి వైఎస్ జగన్ మీద అలగడం.. ఎడవడమే.. బాలినేని చరిత్ర?. జిల్లాలో పార్టీ నేతల దగ్గర డబ్బు దోచుకున్న అవినీతి పరుడు బాలినేని’’ అంట వెంకాయమ్మ ధ్వజమెత్తారు. -
పవన్ కల్యాణ్‌పై సీపీఐ రామకృష్ణ సెటైర్లు
సాక్షి, గుంటూరు: చంద్రబాబు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారని.. అమలు చేయమంటే నిధులు లేవంటూ చెబుతున్నారంటూ సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో సమయంలో చెప్పినట్లు గ్రామంలో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరాల్సిందేనని నిలదీశారు.‘‘గత ప్రభుత్వం 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. దళితులు, గిరిజనుల భూములను పెద్దలు కొట్టేసి బ్యాంకుల్లో లోన్ తెచ్చుకుంటున్నారు. పవన్ కల్యాణ్ పరిపాలన గాలికి వదిలేశాడు. సనాతన ధర్మం అంటూ కాషాయ బట్టలు వేసుకుని తిరుగుతున్నాడు. ఇలా తిరగడానికి డిప్యూటీ సీఎం పదవి ఎందుకు?. పవన్ కల్యాణ్‌కి దేవాదాయ శాఖ కేటాయిస్తే బాగుంటుంది. చంద్రబాబు ఆలోచించాలి’’ అంటూ రామకృష్ణ చురకలు అంటించారు.చంద్రబాబుపై సీపీఎం ఫైర్నెల్లూరు: సీఎం చంద్రబాబు చేపట్టిన స్వచ్ఛ ఆంధ్రపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మండిపడ్డారు. స్వచ్ఛ ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయలను కార్పోరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజల మాత్రం మురికి కుపాలలో దోమలతో జీవనం సాగిస్తున్నారన్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉంది. దోమలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి పన్ను, నీటి పన్నులను బలవంతంగా వసూలు చేస్తున్నారు’’ అని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. -
‘దాచుకో.. దోచుకో.. పంచుకో.. చంద్రబాబు పాలన ఇదే’
సాక్షి, ఏలూరు జిల్లా: రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో చెత్త కుప్పలు పేరుకుపోయి.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం ఆయన ఏలూరులోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్వచ్ఛతలో రాష్ట్రంలో కింద నుంచి మూడో స్థానంలో ఉందన్నారు.వైఎస్ జగన్ హయాంలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధంగా క్లాప్ వెహికల్స్ పెట్టారని. నీతి ఆయోగ్ సైతం ప్రశంసించిందని గుర్తు చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో స్వచ్ఛభారత్‌ను వైఎస్ జగన్ సమర్థవంతంగా అమలు చేశారన్నారు. స్వచ్ఛ భారత్ క్లాప్ వ్యాన్లను చంద్రబాబు ప్రభుత్వం మూలన పడేసిందని.. వాటిని తొలగించడంతో ప్రతి మున్సిపాలిటీలో ప్రజలు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.‘‘చంద్రబాబు పర్యటనలో తణుకును దిగ్బంధం చేశారు. తేతలిలో పశువధ కర్మాగారం అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు. పశువుల కర్మాగారం పక్కనున్న ఎఫ్‌సీఐ గోడౌన్లు సైతం ఖాళీ చేస్తున్నారు. కోర్టు స్టే ఇచ్చినా కానీ.. పశువధ కర్మాగారం వారికి ప్రభుత్వం కొమ్ము కాస్తుంది. పశువధ కర్మాగారం ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. టీడీపీ, జనసేన కార్యాలయాల చుట్టూ పశువధ కర్మాగారం బాధితులు తిరిగిన వారికి న్యాయం జరగలేదు. పశువధ దుర్గంధంతో తణుకు ప్రజలు అల్లాడిపోతున్నారు’’ అని కారుమూరి పేర్కొన్నారు.‘‘ఆరుమిల్లి రాధాకృష్ణకు పావలా ఎమ్మెల్యే అని పేరు వచ్చింది. లిక్కర్, గంజాయిలో దాచుకో.. దోచుకో.. పంచుకో అన్న రీతిలో పాలన సాగుతుంది. వైఎస్ జగన్ బస్సులో వెళ్లేటప్పుడు ఎవరైనా వినతిపత్రం చూపిస్తే వెంటనే స్పందించేవారు. నిన్న స్వచ్ఛ ఆంధ్ర సభలో చంద్రబాబు భజనే సరిపోయింది. వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారు అందులో ఐదు పూర్తయ్యాయి. 750 మెడికల్ సీట్లు మాకు వద్దు అని కేంద్రానికి లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబు. ప్రతి గ్రామంలో వైఎస్ జగన్ తీసుకొచ్చిన సచివాలయాలు రైతుభరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్లు దర్శనమిస్తాయి. 9 నెలలోనే చంద్రబాబు 1,50,000 కోట్లు అప్పు చేశాడు. వైఎస్ జగన్ పథకాలు కొనసాగించక పోగా మీరు ఇస్తానన్న సూపర్ సిక్స్ ఇవ్వలేదు.17 లక్షల రైతులు వద్ద రెండు కోట్ల మెట్రిక్ టన్నులు ధాన్యం మీరు గతంలో కొంటే వైఎస్ జగన్ హయాంలో 37 లక్షల మంది రైతుల వద్ద మూడు కోట్ల 40 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొన్నాము. ఈ-క్రాప్, ఇన్సూరెన్స్ విధానాలు ఎత్తేశారు. చంద్రబాబు రైతుల నడ్డి విరిచేశారు. 45 ఏళ్ల ఇండస్ట్రీ అనే చంద్రబాబు ఒక్క హామీ నెరవేర్చలేదు. రాష్ట్రంలో ప్రజలు బాధలతో అల్లాడిపోతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, తల్లికి వందనం ఊసే లేదు.. నీకు 15000 నీకు 18000 అన్నారు వాటి ఇప్పుడు ఆ 15 లేదు 18 లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గతంలో మీ హయాంలోనే వచ్చింది. పయ్యావుల కేశవ్ గతంలో ఇది చాలా మంచిదని అనలేదా..?. మేము దాన్ని అమలు చేస్తే బురదజల్లారురూ.75,000 ఉండే మెడికల్ కాలేజీ ఫీజు లక్ష ఇరవై వేలకు పెంచేశారు. ఫీజులు కట్టలేక విద్యార్థులు పొలం బాట పడుతున్నారు. వైఎస్ జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తే ఆ పథకాలన్నీ నిలిపివేశారు. పేద ప్రజలు చదువుకోవడం మీకు ఇష్టం లేదా?. సూపర్ సిక్స్ అని ఊదరకొట్టారు. గతంలో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్నారు. ఇప్పుడు ఒక్క హామీ అమలు చేయలేకపోతున్నారు’’ అని కారుమూరి నాగేశ్వరరావు దుయ్యబట్టారు. -
‘కాశీనాయన’ కూల్చివేత వెనుక దుష్టశక్తులు ఎవరు?: భూమన
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో మహిమాన్వితమైన కాశీనాయన క్షేత్రం కూల్చివేతల వెనుక ఉన్న దుష్టశక్తులు ఎవరో బయట పెట్టాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ల మధ్య ఉన్న వైరుధ్యాలతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు నలిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీనాయన క్షేత్రం కూల్చివేతలు ఈ రాష్ట్రంలో హిందూధర్మం గుండెలను బుల్డోజర్లతో బద్దలుకొట్టడమేనని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...సనాతనధర్మ పరిరక్షణ అంటే ఇదేనా పవన్?సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ కూల్చివేతలపై ఎక్కడా స్పందించలేదు. పాశవికంగా, దుర్మార్గంగా జరిగిన ఈ దాడిపై ఆయన నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదు. ఈ కూల్చివేతలు చేపట్టిన అటవీశాఖ సనాతన ధర్మ పరిరక్షకుడుగా తనకు తాను చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిధిలో, ఆయన పర్యవేక్షణలో పనిచేస్తోంది. సనాతన ధర్మంపై దాడి చేస్తే, వారి తలలు తీస్తాను అంటూ భీకర ప్రతిజ్ఞలు చేసే పవనానందుల గొంతుక ఇప్పుడు మాత్రం మూగబోయింది. ఆయన దీనిపై స్పందించాల్సిన అవసరం లేదా? గతంలో తిరుపతిలో ఆరుగురు చనిపోయినప్పుడు నేరుగా ఇక్కడికి వచ్చి క్షమాపణలు చెప్పారు.ఈ రోజు కాశీనాయన క్షేత్రాన్ని పవన్ పరిధిలోని శాఖకు చెందిన అధికారులే కూల్చేవేస్తే ఎందుకు మౌనంగా ఉన్నారు? మీకు బదులుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు క్షమాపణలు చెప్పారు? తిరుపతి విషయంలో సారీలు చెప్పడం మా పార్టీ విధానం కాదు అంటూ ఆనాడు మంత్రి లోకేష్ వ్యాఖ్యలు చేయడం నిజం కాదా? ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆధీనంలోని అటవీశాఖ అధికారులు చేసిన దానికి విద్యాశాఖ మంత్రిగా క్షమాపణలు చెప్పడం, తానే కాశీనాయన క్షేత్రంను నిర్మించి ఇస్తానని ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. నారా లోకేష్, పవన్ కల్యాణ్‌ల మధ్య ఉన్న వైరుధ్యాల వల్ల పవిత్ర క్షేత్రాలు నలిగిపోవాలా?సోషల్ మీడియా సాక్షిగా వీరిద్దరి మధ్య ఉన్న గొడవలు అందరికీ తెలిసినవే. రెడ్‌బుక్ గుడ్డితనం కమ్మి గతంలో ఆలయాలను కూల్చిన వారు నేడు కాశీనాయన క్షేత్రంపై విరుచుకుపడ్డారు. ఎవరు కూల్చారో తెలియదు, ఉత్తర్వులు ఎవరో గుడ్డిగా ఇచ్చారంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇది సమర్థించుకోవడం కాదు? మీకు తెలియకుండానే ఆలయాలు నేలమట్టం అవుతాయా? ఆశ్రమాలు కూలతాయా? ప్రసాదంలో విషాలు కలుస్తాయా? కాషాయం కింద విషం చిమ్ముతున్నది మీది కాదా? పార్టీ మీటింగ్‌లకు ప్రభుత్వ సొమ్ముతో గాలిలో ఎగిరి ప్రయాణాలు చేసే పవన్ కళ్యాణ్ హెలికాఫ్టర్‌కు కాశీనాయన క్షేత్రంకు దారి కనిపించడం లేదా?మా ఇంట్లోనే సనాతన ధర్మం పుట్టింది అంటూ గతంలో పవన్ చెప్పారు. ఆయనే మా తండ్రి పూజ గదిలో వెలిగే దీపారాదనతో సిగరెట్ వెలిగించుకునేవారు అని కూడా అన్నారు. ఇవ్వన్నీ కూడా సనాతన ధర్మం కిందకు వస్తాయా అని కూడా పవనానంద స్వామీ చెప్పాలి. శ్రీశైలం క్షేత్రాన్ని కూడా కూల్చివేస్తారా?కాశీనాయన క్షేత్రం కూల్చివేతలపై దేవాదాయశాఖ మంత్రి స్పందిస్తూ ఈ క్షేత్రం టైగర్‌జోన్ పరిధిలో ఉన్నందునే కూల్చివేశారు అంటూ ప్రకటన చేశారు. టైగర్‌జోన్ పరిధిలోనే ఉన్న శ్రీశైలంను కూడా కూల్చివేస్తామనే ఉద్దేశం ఆ శాఖ మంత్రి మాటల్లో అర్థమవుతోంది. టైగర్‌జోన్ పరిధిలో ఉన్న అన్ని దేవాలయాలను కూల్చివేయాలన్నదే ఈ కూటమి ప్రభుత్వ అసలు లక్ష్యం. కూటమి పాలనలో హిందూ దేవాలయాలకు దిక్కులేకుండా పోయింది.ఆలయాల పరిరక్షణకు ఎటువంటి చర్యలు లేవు. రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉన్న కాశీనాయన క్షేత్రంకు ఉన్న ఆధ్యాత్మిక విలువల దృష్ట్యా దీనిని అటవీ చట్టాల పరిధి నుంచి మినహాయించాలని ఆనాడే సీఎం హోదాలో వైఎస్ జగన్ కేంద్ర అటవీశాఖకు లేఖ రాశారు. ఇప్పుడు సనాతన సారధి పవన్ కళ్యాణ్ పరిధిలోని అటవీశాఖ అధికారులు కేంద్ర అటవీశాఖ నుంచి ఎటువంటి ఉత్తర్వులు, ఆదేశాలు లేకుండానే ఈ క్షేత్రంలోని నిర్మాణాలను కూల్చివేశారు.పవన్ కళ్యాణ్ ఆదేశాలు లేకుండానే ఈ కూల్చివేతలు జరిగాయా? వీటిని కూల్చివేస్తున్నారని తెలిసి కూడా ఎందుకు పవన్ దానిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఎంతసేపు బీజేపీకి కొమ్ముగాయడం, మోయడంలో తనమునకలు అయ్యి ఉండటం వల్లే ఇటువంటి ఘోరమైన సంఘటనను పట్టించుకోలేదా? బొట్లు పెట్టడం, మెట్లు కడగడం మినహా ఆలయాలను పరిరక్షించాలనే విషయాన్ని విస్మరించారు. బీజేపీ కూడా ఎందుకు స్పందించడం లేదు. కాశీనాయన క్షేత్రంను కులం కోణంలో చూస్తున్నారా అనే అనుమానాలు, అది అసలు ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు అనే భావనను కలిగిస్తున్నారా అనుమానం భక్తుల్లో కలుగుతోంది.కూటమి పాలనలో హిందూధర్మంకు గడ్డుకాలంకూటమి పాలనలో హిందూధర్మంకు గడ్డుకాలం దాపురించింది. కూటమి ప్రభుత్వానికి వైయస్ఆర్సీపీపై అభాండాలు మోపి పబ్బం గడుపుకోవడమే తెలుసు. తిరుయల లడ్డూలో కల్తీనెయ్యి అంటూ ఒక పచ్చి అబద్దాన్ని తెరమీదికి తీసుకువచ్చి ఆనాడు వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపై దుర్మార్గమైన నిందలు మోపారు. ఆవుకొవ్వు, పందికొవ్వు కలిపారంటే సాక్షాత్తూ సీఎం ఒక ప్రకటన చేయడం, వారి రాజకీయం కోసం ఎంత దూరమైన సరే దిగజారిపోతారనడానికి నిదర్శనం.జనం దీనిని నిజమని నమ్మేలా శతవిధాల ప్రయత్నించారు. దీనిపై సుప్రీంకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక అత్యున్నత పదవిలో ఉన్నవారు బాధ్యతారహితంగా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. ఇదంతా ఒక కుట్ర అంటూ వైఎస్సార్సీపీ ధైర్యంగా ఎదుర్కోవడంతో ఈ కూటమి ప్రభుత్వం సిగ్గుతో వెనక్కి తగ్గింది.అలాగే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లలో కూటమి ప్రభుత్వం బాధ్యతారాహిత్యం కారణంగా తొక్కిసాలకు గురై ఆరుగురు మృతి చెందడం, 45 మందికి పైగా గాయపడ్డారు. వైఎస్సార్సీపీ పాలనలో చిన్నచిన్న పొరపాట్లను కూడా అత్యంత దారుణంగా చిత్రీకరించారు. అదే కూటమి పాలనలో జరుగుతున్న అరాచకాలను ఏదో పొరపాటున జరిగిన చిన్న అంశంగా సమర్థించుకుంటున్నారు. తాజాగా ఒక తాగుబోతు నేరుగా శ్రీవారి ఆలయ ప్రాంగణం బయట మద్యం మత్తులో పెద్ద ఎత్తున గొడవ చేశాడు. శ్రీవారి కొండపై మద్యం ఎంతైనా దొరుకుతుందంటూ వీరంగం సృష్టించారు. ఇప్పటి వరకు నాలుగుసార్లు ఎర్రచందనం కొండపై పట్టుబడింది. దానిపై ఎటువంటి చర్యలు లేవు. ఎన్టీఆర్‌ను మానసికంగా చంపి పుట్టిన పార్టీ టీడీపీమంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శవాలపైన పుట్టిన పార్టీ అంటూ మాట్లాడారు. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఎన్టీఆర్‌ను మానసికంగా చంపి, ఆయన శవాన్ని అడ్డం పెట్టుకుని, అధికారాన్ని లాక్కుని అనే విషయం లోకేష్ గుర్తించాలి. తెలుగుదేశం అధికారపీఠం కింద విగతజీవులైన పింగళి దశరథ్‌రామ్, వంగవీటి మోహనరంగా వంటి వారు ఉన్నారని లోకేష్ తెలుసుకోవాలి.గిల్లి జోల పాడటం, చంపి మాలవేయడం, వెన్నుపోటు పొడిచి పీఠమెక్కడం టీడీపీ లక్షణం. కూటమి ప్రభుత్వంలో కూర్చున్నందుకే కాషాయదళం నోరువిప్పడం మానేసింది. ఏపీలో సనాతన ధర్మానికి జరుగుతున్న అన్యాయం, ఆలయాల విధ్వంసం, శ్రీవారి క్షేత్రంలో జరుగుతున్న అనాచారం, దళారీల మయంగా మారిన పవిత్రక్షేత్రం కాషాయదళానికి కనిపించడం లేదు. అమరావతిలో శ్రీవారి కళ్యాణం జరిపామంటూ ఎంతో ఆర్భాటంగా ప్రకటించుకున్న సీఎం చంద్రబాబు.. గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు స్వామివారి కళ్యాణాలను గ్రామాల్లోకి తీసుకువచ్చాం. 2004 డిసెంబర్ నుంచే నేను టీటీడీ బోర్డ్ సభ్యుడగా ఉన్నప్పుడే మొట్టమొదటి సూళ్ళూరిపేట దళితవాడలో స్వామివారి కళ్యాణంను అద్భుతంగా నిర్వహించాం. తరువాత కొన్ని పదుల సంఖ్యలో శ్రీవారి కళ్యాణాలు చేయించాం’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. -
బాలినేని బ్రతుకు ప్రకాశం ప్రజలకు బాగా తెలుసు: బూచేపల్లి
సాక్షి, ప్రకాశం: బాలినేని శ్రీనివాసరెడ్డి పెద్ద కమల్‌హాసన్.. ఆయనతో సినిమా తీయొచ్చు అంటూ దర్శి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం జనసేనలో చేరి ఎక్కువగా మాట్లాడుతున్నారంటూ హెచ్చరించారు. బాలినేని బ్రతుకు ప్రకాశం జిల్లా ప్రజలకు బాగా తెలుసు అని వ్యాఖ్యలు చేశారు.దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. బాలినేని.. నీ గురించి అందరకీ తెలుసు. జిల్లాలో ప్రతీ ఒక్కరినీ వేధించి వారి వద్ద దోచుకున్నావ్. నీ బాధితుడు కానీ వాడు ప్రకాశం జిల్లాలో ఒక్కడు కూడా లేడు. బాలినేని పార్టీ మారిన తర్వాత జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు సంతోషించారు. నటనలో బాలినేని.. కమల్‌హాసన్‌ను మించిపోయారు. ఆయనతో ఒక సినిమా తీయవచ్చు. టీడీపీలో చేరేందుకు నువ్వు ప్రయత్నిస్తే.. రిజక్ట్ చేస్తే.. ఆస్తుల కోసం జనసేనలో చేరావు. జడ్పీ చైర్‌పర్సన్‌ని మార్చేస్తానని చాలెంజ్ చేస్తున్నావు. నీలాగా అమ్ముడుపోయే జడ్పీటీసీలు జిల్లాలో లేరు. నీలాగా వెన్నుపోటు పొడిచే వారు పార్టీకి అవసరం లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
మెగా బ్రదర్స్ అత్యుత్సాహం..
మాటలు నేర్చిన కుక్కను వేటకు తీసుకెళ్తే ఉస్కో అంటే ఎదురు మళ్ళా ఉస్కో అందట.. ఆలా అయింది తెలుగుదేశం పరిస్థితి. పార్టీ పెట్టి పుష్కరం దాటి.. అసెంబ్లీ గేటు కూడా దాటలేకపోయిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం.. బీజేపీతో పొత్తు పుణ్యాన ఈసారి అసెంబ్లీ లోపలి అడుగుపెట్టారు. పవన్ ప్రాధాన్యాన్ని గుర్తించిన చంద్రబాబు సైతం ఆయనకు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. ఇక జనసేనలో మొదట్నుంచి ఉన్న నాగబాబు సైతం గతంలో ఎంపీగా పోటీ చేసి మట్టికరిచారు. ఇక డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేయడం అచ్చిరాదనుకున్నారో ఏమో అడ్డదారిలో శాసనమండలిలోకి అడుగుపెట్టారు. ఇక చట్టసభలో ప్రజల తరఫున మాట్లాడాల్సిన నాగబాబు తొలిసారిగా మైక్ అందుకుని ఇక ఒంటి మీద స్పృహ లేకుండా నోటికొచ్చింది వాగేశారు. తెలుగుదేశానికి లైఫ్ ఇచ్చింది తామేనని పవన్ అంటే.. అసలు పవన్‌ను గెలిపించింది ప్రజలు.. జనసైనికులే తప్ప ఇంకెవరూ కాదని గట్టిగా చెప్పారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు పిఠాపురం సీటును పవన్ కోసం త్యాగం చేసిన వర్మను నాగబాబు.. పవన్ ఇద్దరూ భుజానికి ఎత్తుకుని మోశారు. నా గెలుపు బాధ్యత మీదే.. మీ భుజాల మీదనే ఉందని మునగ చెట్టు ఎక్కించారు. ఇక గెలిచాక.. వర్మ త్యాగం గాలిలో కలిసిపోయింది.. అసెంబీ గేటు వరకూ ఓడ వర్మ.. గేటు దాటాక బోడి వర్మ అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న నలభయ్యేళ్ళ తెలుగుదేశాన్ని తామే నిలబెట్టినట్లు ఈ బ్రదర్స్ చెప్పుకున్నారు.పాలన గురించి ఒక్క ముక్కాలేదు..అటవీ, పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్న పవన్ ఈ తొమ్మిది నెలల్లో చేసిన ఒక్క మంచి పని గురించి కూడా చెప్పలేదు.. ఎంతసేపు తన స్వోత్కర్ష.. సొంత ఎలివేషన్ తప్పితే ప్రజలకు పనికొచ్చేది.. సమాజానికి ఉపయోగపడే మాట ఒక్కటీ లేదు.. పైగా జనసైనికులు కూడా అచ్చం అలాగే తయారయ్యారు.. 2029 నాటికి పవన్‌ను సీఎం అభ్యర్థిగా చూడాలన్నది వారి అభిలాష అని అక్కడ ఓపెన్ అయిపోయారు.. ఈ అన్నదమ్ముల అత్యుత్సాహం తెలుగుదేశాన్ని ఇరిటేట్ చేస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా ఖాతాల్లో ఈ బ్రదర్స్ గురించి ట్రోలింగ్ మొదలైంది. తెలుగుదేశం లేకపోతే జనసేన ఎక్కడ ఉంటుంది. ఇదేంటి ఇంత ఓవర్ యాక్షన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు తన గురించి మాటమాత్రం ప్రస్తావించకపోవడం పిఠాపురం వర్మను మరింత వేడెక్కిస్తోంది. ఈ అంశం లోకేష్ వద్దకు కూడా చేరింది.. పలువురు కార్యకర్తలు లోకేష్ తో మాట్లాడుతూ నాగబాబు.. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.చెప్పులోని రాయి చెవిలోని జోరీగకంటిలోని నలుసు కాలి ముల్లుఇంటిలోని పోరు ఇంతింత గాదయావిశ్వదాభిరామ వినురవేమ!అన్నట్లుగా తయారైంది టీడీపీ పరిస్థితి. తమ గెలుపులో కీలకపాత్ర పోషించిన పవన్‌ను ఇప్పుడు చెప్పులమాదిరిగా బయట వదిలేయలేక.. వాళ్ళ అన్నదమ్ముల కామెంట్లు చెవిలో జోరీగమాదిరిగా ఇబ్బంది పెడుతున్నా భరించలేక.. సతమతమవుతున్నారు. మొత్తానికి నోటి దురుసు ఉన్న నాగబాబు ఎప్పటికైనా కూటమిలో చిచ్చుకు కారణం అవుతారని అంటున్నారు..-సిమ్మాదిరప్పన్న -
గెలవక ముందు ‘జనసేనాని’.. గెలిచాక 'భజన సేనాని’: ప్రకాశ్ రాజ్
సాక్షి, అమరావతి: త్రిభాషా సూత్రం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, నిన్న(శుక్రవారం) రాత్రి జనసేన జయకేతనం సభలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా, పవన్ గెలవక ముందు ‘‘జనసేనాని’’.. గెలిచిన తరువాత ‘‘భజన సేనాని" అంతేనా? అంటూ సెటైర్లు వేశారాయన. హిందీ వద్దంటూ దక్షిణాది రాష్ట్రాలకు మద్దతుగా పవన్ గతంలో చేసిన పోస్టులను ట్వీట్‌కి ప్రకాశ్‌రాజ్ జత చేశారు.‘‘హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదంటూ అంతకుముందు మరో ట్వీట్ కూడా చేశారు ప్రకాష్‌రాజ్. ‘‘స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’’ అని పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్..’ అంటూ కామెంట్స్ చేశారాయన.కాగా, పవన్ కల్యాణ్ బహుభాష వ్యాఖ్యలపై డీఎంకే కూడా స్పందించింది. ‘‘మా వైఖరిని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇతర భాషలు నేర్చుకునేందుకు మేం వ్యతిరేకం కాదు’’ అంటూ డీఎంకే అధికార ప్రతినిధి సయీద్ హఫీజుల్లా స్పష్టం చేశారు. తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని.. హిందీపై కేంద్రం తీరును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.“ గెలవక ముందు “జనసేనాని”, గెలిచిన తరువాత “భజన సేనాని” … అంతేనా #justasking pic.twitter.com/EqjtqK6qFA— Prakash Raj (@prakashraaj) March 15, 2025‘‘వ్యక్తిగతంగా హిందీ, ఇతర భాషలు నేర్చుకోవడాన్ని తాము ఎన్నడూ అడ్డుకోలేదన్న డీఎంకే.. ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవడం కోసం ఇప్పటికే తమ రాష్ట్రంలో హిందీ ప్రచార సభలను నిర్వహిస్తున్నామని పేర్కొంది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్ఈపీ, పీఎం శ్రీ పాఠశాలలు వంటి విధానాలతో తమ రాష్ట్ర ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతోంది. దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం’’ అని సయీద్ హఫీజుల్లా తేల్చి చెప్పారు. -
‘కూటమి’ వేధింపులు.. గుంటూరు మేయర్ రాజీనామా
సాక్షి, గుంటూరు: గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. కూటమి సర్కార్ తనను ఎంతగానో అవమానించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాజీనామా పత్రాన్ని కలెక్టర్‌కు పంపా. నా ప్రమేయం లేకుండా స్టాండింగ్ కమిటీ పెడుతున్నారు. నా ఛాంబర్‌కు కూడా తాళం వేశారు. నెలరోజుల క్రితం జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసం టీడీపీ నేతలు మా కార్పొరేటర్లను కొనుగోలు చేశారు. కార్పొరేటర్ల ఇంటికెళ్లి బెదిరించారు’’ అని మనోహర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఈ నెల 17 తేదిన స్టాండింగ్ కమిటి సమావేశం నిర్వహిస్తున్నామని అధికారులు నాకు సమాచారం ఇచ్చారు. స్టాండింగ్ కమిటికి నేనే ఛైర్మన్‌ను. స్టాండింగ్ కమిటీలో ఏం ప్రతిపాదనలు ఉండాలి. ఎక్కడ పెట్టాలి. ఎప్పుడు పెట్టాలి అనేది నేను నిర్ణయించాలి. కానీ నాకు తెలియకుండా. నా ప్రమేయం లేకుండా స్టాండింగ్ పెడుతున్నారు. నా ఛాంబర్‌కు తాళం వేశారు. నేను ఛాంబర్‌కు వెళ్తే అధికారులు డ్రామాలు ఆడుతున్నారు.‘‘గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నాటినుంచి ఇంత దారుణమైన అవమానం ఏ మేయర్‌కు జరగలేదు. నాపై కూడా కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వైఎస్ జగన్ దయవల్లే నేను మేయర్ అయ్యాను. పీవీకే కూరగాయలు మార్కెట్ పేరు మార్చితే చూస్తూ ఊరుకోం’’ అని మనోహర్ నాయుడు హెచ్చరించారు. -
‘బాలినేని ఆస్తులు ఎక్కడ పోగొట్టుకున్నారో అందరికీ తెలుసు’
సాక్షి, తాడేపల్లి: పిఠాపురం జయకేతనం సభలో పవన్ ఏం మాట్లాడారో ఆయనకే తెలియలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. జనసేన పార్టీకి దిశదశ లేదని.. పవన్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్ జనసేన స్థాపించారని.. పవన్ ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాదు.. కుటుంబం కోసమే పోరాటం చేస్తారు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు.‘‘కాపు సామాజికవర్గంపై చంద్రబాబు అనేక దుశ్చర్యలు చేశారు. జనసేన నిర్వహణను చూసేది చంద్రబాబే. జనసేనలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు చంద్రబాబు మనుషులే. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఏమైంది?. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై పిఠాపురంలో పవన్ ఎందుకు మాట్లాడలేదు?. గతంలో బీజేపీ నేతలపై పవన్ అనేక విమర్శలు చేశారు. పవన్ ఊసరవెల్లిలా ప్రవర్తిస్తున్నాడు. రాష్ట్రంలో జనసేన నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. పవన్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమని.. పవన్ ఆయన అన్నకు ఎమ్మెల్యే సీటు ఇప్పించుకున్నారు’’ అంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.అధికారం కోసం పార్టీలు మారే వ్యక్తి బాలినేని..బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలకు అంబటి కౌంటర్ ఇస్తూ.. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చరిత్ర ఏంటి?. అధికారం కోసం పార్టీలు మారే వ్యక్తి బాలినేని.. ఆయన ఆస్తులు ఎక్కడ పోగొట్టుకున్నారో అందరికీ తెలుసు. జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచిన బాలశౌరి కూడా ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ అసెంబ్లీకి రావటానికి 16 ఏళ్లు పట్టింది. అదికూడా అన్ని పార్టీలు కలిస్తేనే ఆ అవకాశం వచ్చింది. వైఎస్ జగన్ ఢిల్లీని ఢీకొట్టి, పోరాటం చేసి పదేళ్లకే సీఎం అయ్యారు’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.‘‘టీడీపీ కోసం పుట్టిన పార్టీ జనసేన. చంద్రబాబును కాపులు నమ్మరు. కాబట్టి జనసేన పార్టీని పవన్ చేత ఏర్పాటు చేయించారు. జనసేనను నడిపేదంతా చంద్రబాబే. రెండు పార్టీల మద్దతుతో పవన్‌కు 21 సీట్లు వచ్చాయి. వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. జనసేనలో ఉన్నవారంతా చంద్రబాబు మనుషులు, వైఎస్సార్సీపీ బహిష్కరించిన వారే..రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేయబోతున్నారో చెప్ప లేదు. ఎర్రకండువా నుండి కాషాయ రంగు వేసుకునే వరకు పవన్ వచ్చారు. అసలు ఎప్పుడు ఏ వేషం వేస్తారో జనానికి అర్థం కావటం లేదు. ఏ వ్యూహం, సిద్దాంతం లేకుండా మారిపోతున్న వ్యక్తి పవన్. జనసేన నేతలంతా ఇసుక, మద్యం దోపిడీలో మునిగి పోయారు. బియ్యం, విజిలెన్స్, దాడులు, డబ్బులు.. ఇదే పనిలో ఒక మంత్రి ఉన్నారు. ఇంత దోపిడీ చేస్తుంటే పవన్ ఏం చేస్తున్నారు?అధికారం, సినిమా గ్లామర్ ఉన్నందున జనం వస్తారు. అంతమాత్రానికే ఏదేదో ఊహించుకోవద్దు. పవన్ సీఎం అయ్యే అవకాశం లేదని కాపులకు సినిమా క్లయిమాక్స్ లో తెలుస్తుంది. నాగబాబుకు కొత్తగా ఎమ్మెల్సీ వచ్చేసరికి ఏవేవో కలలు కంటున్నారు. ఎన్నికలలో అవసరం తీరాక వర్మను తరిమేశారు. వర్మకి కనీసం మర్యాద అయినా ఇవ్వండి. పిఠాపురాన్ని మీ అడ్డా అనుకోవద్దు. ఉత్తరాది అహంకారం అంటూ అవకాశం వాద రాజకీయాలు చేయటం పవన్‌కే చెల్లింది’’ అని అంబటి రాంబాబు దుయ్యబట్టారు. -
గుంటూరు జైల్లో పోసానిని కలిసిన వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేతలు
సాక్షి, గుంటూరు: గుంటూరు జైల్లో పోసాని కృష్ణమురళిని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేతలు శనివారం కలిశారు. రిమాండ్‌లో ఉన్న పోసానితో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, లీగల్ సెల్ ప్రతినిధులు ములాఖాత్ అయ్యారు. అనంతరం మీడియాతో మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, పోసాని అనారోగ్యంతో ఉన్నారని.. కూటమి ప్రభుత్వం పోసానిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు.‘‘2016లో నంది అవార్డుల కమిటీలో ఏకపక్షంగా ఉందని మాట్లాడినందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై 12 కేసులు పెట్టారు. మీడియాతో మాట్లాడితే కేసులు పెడతారా?. మరోసారి ప్రెస్ మీట్ పెడితే మరో 6 కేసులు పెట్టారు. ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించి రాష్ట్రవ్యాప్తంగా పీటీ వారెంట్ల పేరుతో తిప్పి హింసిస్తోంది. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పోసానిపై పెట్టిన నాలుగు కేసుల్లో 111 సెక్షన్లు పెట్టి బయటికి రానివ్వకుండా కుట్ర చేశారు.’’ అని మనోహర్‌రెడ్డి మండిపడ్డారు.‘‘కోర్టు పోలీసులకు చివాట్లు పెడుతున్న మారటం లేదు. రెడ్ బుక్కు టీడీపీకే కాదు. మాక్కూడా బుక్కులు ఉన్నాయి. మేము కూడా పేర్లు నమోదు చేసుకుంటున్నాం. ఇప్పటివరకు నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా కేసులు పెడుతున్న 62 మందిని గుర్తించాం. చంద్రబాబు జైలుకెళ్లినప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగాలేదని పిటిషన్ల మీద పిటిషన్ల వేశారు. అమ్మో ఇంకేముంది అని హడావుడి చేశారు. అందరివి చంద్రబాబు లాంటి ప్రాణాలే. పోలీసులు ఆర్గనైజర్ క్రైమ్ చేస్తున్నారు. కేసులు పెట్టి పోలీసులు వాటి సమాచారాన్ని దాచేస్తున్నారు. ఒక కేసులో బెయిల్ రాగానే మరొక కేసుని బయటికి తీస్తున్నారు’’ అంటూ మనోహర్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
ఇప్పటికైనా మించిపోయింది లేదు! ఇకనైనా..
పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే చూస్తూ ఊరుకోం: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, 45 ఏళ్ల చరిత్రలో నాపై హత్యా రాజకీయాల మరక లేదు.. రాజకీయం ముసుగులో నేరాలను ఉపేక్షించం.. కక్ష రాజకీయం చేయను: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు.. పై రెండు వార్తలు ఒకే రోజూ పత్రికల్లో వచ్చాయి. వీటిల్లో ఒకటి ఏపీలో ప్రస్తుత అరాచక పరిస్థితులకు అద్దం పడుతూంటే... రెండోది వాస్తవాలను కప్పిపుచ్చి ప్రజలను ఏమార్చే ప్రయత్నానికి మచ్చు తునకలా కనిపిస్తుంది. చంద్రబాబుకు పేరు ప్రతిష్టలు మెండని.. వ్యవస్థలపై పట్టున్న రాజకీయవేత్త అని అంటూంటారు. అయితే ప్రజాస్వామ్యంలో అందరిని అన్నిసార్లూ మోసం చేయలేరు అనేందుకు హైకోర్టు తాజా వ్యాఖ్యలు ఒక నిదర్శనం. నిజానికి గౌరవ న్యాయమూర్తులు రఘునందనరావు, మన్మధరావులకు మనం నమస్కారం చేయాలి. తమ వ్యాఖ్యలతో వీరు పది నెలలుగా ఏపీలో సాగుతున్న రెడ్ బుక్ అరాచక పర్వానికి(Red Book Atrocities) కొంతైనా బ్రేక్ వేశారని అనిపిస్తుంది. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త, ఆ పార్టీ అధికార ప్రతినిది అవుతు శ్రీధర్ రెడ్డి కేసులో కాని, మాదిగ మహాసేన నాయకుడు కె.ప్రేమ్ కుమార్ కేసులో కాని హైకోర్టు పరిశీలన ఏ ప్రభుత్వానికైనా కనువిప్పు కలిగించాల్సినవే. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ వైఖరి మార్చుకున్నట్లు కనిపించదు. ప్రముఖ నటుడు 67 ఏళ్ల వయసున్న పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)పై పెట్టిన ఆయా కేసులలో బెయిల్ వచ్చినా, కుట్రపూరితంగా సీఐడీ మళ్లీ పీటీ వారంట్ తీసుకుని ఆయనను ఇబ్బంది పెట్టే యత్నం చేస్తోంది. ఇదంతా రెడ్‌బుక్ దారుణాల కిందకే వస్తుంది. కక్ష రాజకీయాలే అవుతాయి. వైఎస్సార్సీపీ వాళ్లపై దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం, తప్పుడు కేసుల బనాయింపు వంటి అకృత్యాలు పది నెలలుగా సాగుతున్నా న్యాయ వ్యవస్థ సైతం వీటిని పూర్తి స్థాయిలో పట్టించుకోలేదన్న అభిప్రాయం ఉండేది. దాంతో ఏపీలో పౌరులు ప్రత్యేకించి విపక్షం కాని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారు కానీ జీవించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. 👉సూపర్‌సిక్స్ పేరుతో ఇష్టారీతిన ఎన్నికల హామీలిచ్చి.. వాటి అమలు చేతకాక ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ హింసాకాండకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. హైకోర్టు తాజా తీర్పు కూడా ఈ విషయాన్ని రూఢి చేస్తోంది. పౌరులను ఆధారాల్లేకుండా.. కేవలం ఊహలపై ఆధారపడి అరెస్టులు చేస్తారా? అంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పోలీసులు తమని తాము చట్టానికి అతీతులుగా భావిస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించింది. ఇందులో వాస్తవం ఉంది. సోషల్ మీడియా, ఇతర చిన్న కేసుల్లోనూ నోటీసులివ్వకుండా హైదరాబాద్‌సహా ఎక్కడ ఉన్నా ఆకస్మికంగా అరెస్టులు చేయడం.. వారిని క్రిమినల్స్ మాదిరిగా ట్రీట్ చేస్తూండటాన్ని గౌరవ హైకోర్టు గుర్తించడం మంచి పరిణామం. 'రేపు కోర్టుల్లోకి వచ్చి కూడా అరెస్టులు చేస్తారా?".. అనే తీవ్రమైన వ్యాఖ్యలను న్యాయమూర్తులు చేశారంటే పరిస్థితి ఏమిటన్ని అర్థమవుతుంది. అదే సమయంలో చిన్న చిన్న కేసుల్లోనూ మేజిస్ట్రేట్లు పోలీసులు తీసుకొచ్చిన నిందితులను రిమాండ్‌కు ఆదేశించడం కూడా ఆందోళన కలిగించే విషయమే. కొంతమంది మెజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్లు విధిస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.👉గతంలో ముఖ్యమంత్రి, మంత్రులను బండబూతులు తిట్టిన టీడీపీ నేతలకు చకచకా బెయిల్ వచ్చిన తీరు, కొన్ని కేసులలో అసలు రిమాండ్‌కే పంపకుండా వదలివేసిన వైనాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత పరిణామాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మాజీ మంత్రి రోజాపైన దారుణమైన దూషణకు దిగిన టీడీపీ మాజీ మంత్రి ఒకరికి కోర్టు రిమాండ్ విధించకుండా వదలిపెట్టింది. అదే.. పోసాని కృష్ణ మురళీకి మాత్రం వరస రిమాండ్లు విధిస్తున్నారు. పోసాని, అవుతు శ్రీధర్ రెడ్డిలు టీడీపీ, జనసేనల వారు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు స్పందిస్తూ జవాబు ఇచ్చారు. అందులో అభ్యంతరం ఉంటే, అసలు ప్రేరేపించిన వారిపై కూడా కేసులు పెట్టాలి కదా! ఆ పని చేయకుండా ఒక పక్షంపైనే కేసులు పెడుతున్నారు. 👉చట్టంలోని కొన్ని సెక్షన్ 111ను ఎంతగా దుర్వినియోగం చేస్తున్నది హైకోర్టు గమనించింది. సోషల్ మీడియాలో పోస్టు పెడితే బలవంతపు వసూళ్ల కింద అమలు చేయవలసిన సెక్షన్లో కేసు పెట్టారని హైకోర్టు తెలిపింది. లోకేష్ బృందానికి ఈ రెడ్ బుక్ ఏదో సరదాగా ఉండవచ్చు. ప్రస్తుతం అధికారం ఉంది కనుక తాము ఏమి చేసినా చెల్లుతుందని విర్రవీగవచ్చు. అధికారాన్ని ఇలా అరాచకాలకు ఉపయోగించుకుంటే అదే రెడ్ బుక్ వారి పాలిట పాముగా మారే ప్రమాదం ఉంటుంది. ఇక చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) చేసేది చేస్తూనే సుద్దులు చెబుతుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలను రెచ్చగొడతారు. నేతలు తన సమక్షంలోనే బూతులు మాట్లాడినా, సోషల్ మీడియా యాక్టివిస్టులు బూతు పోస్టులు పెట్టినా దానికి స్వేచ్ఛ అనే కవరింగ్ ఇస్తారు. వైఎస్సార్సీపీ వాళ్లు స్పందిస్తే మాత్రం దానినే ఫోకస్ చేస్తూ ప్రచారం చేస్తుంటారు.కావలి గ్రీష్మ అనే ఒక చిన్న స్థాయి నేత తన సమక్షంలోనే బూతులు మాట్లాడితే నవ్వుతూ విన్నారే తప్ప వారించలేదు. ఆ తర్వాత ఆమెను శాసనమండలి సభ్యురాలిని చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి జగన్, ఆయన కుటుంబాన్ని టీడీపీ సోషల్ మీడియా ఎంత నీచంగా ట్రోల్ చేసిందీ అందరికి తెలుసు. అయినా చంద్రబాబు దానిని ఖండించినట్లు కనిపించలేదు. అంతెందుకు చంద్రబాబుసహా లోకేష్, పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి వంటి కూటమి నేతలు వాడిన బూతు పదజాలానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 👉ఇప్పుడు అధికారం రాగానే తాను బూతులను అరికట్టానని ఆయన సభలలో చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్నదంతా టీడీపీ కక్ష రాజకీయమే అయినా, తాము ఏమీ ఎరగనట్లు మాట్లాడారు. అంతేకాదు. నలభై ఐదేళ్ల చరిత్రలో తనపై హత్య రాజకీయాల మరక లేదని చంద్రబాబు చెబుతున్నారు. అసలు ఈ ప్రస్తావన తేవలసిన అవసరం ఏమిటో తెలియదు. రాజకీయం ముసుగులో నేరాలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మంచిదే. కాని నిజంగా టీడీపీని అలాగే నడుపుతున్నారా? లేక కేవలం ప్రత్యర్ధి పార్టీలపై అభియోగాలు మోపడానికి ఇలా మాట్లాడుతున్నారా అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. 👉చంద్రబాబు తోడల్లుడు, ఈ మధ్యే కలిసిపోయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్యలు రాసిన పుస్తకాలలో చంద్రబాబు నేరపూరిత రాజకీయాలపై ఏమి రాశారో అందరికి తెలిసిన విషయమే. వాటిపై ఏనాడైనా వివరణ ఇచ్చి ఉంటే చంద్రబాబును ఒప్పుకోవచ్చు. ఎవరు తనపై ఏ ఆరోపణ చేసినా ఏమి పట్టనట్లు ఉండడం ఆయన ప్రత్యేకత. అందుకే వైఎస్సార్సీపీ నేతలు తరచూ వంగవీటి రంగా, పింగళి దశరథ్‌రామ్, మల్లెల బాబ్జీ తదితరుల హత్య కేసులలో వచ్చిన విమర్శలను ప్రస్తావిస్తుంటారు. ప్రతిపక్షంలో ఉంటే కేసులు పెట్టించుకోండని తన కార్యకర్తలకు చెబుతారు. అధికారంలోకి రాగానే ఎదుటి పక్షంపై కేసులు పెట్టండని చెబుతారు. నిజంగా ఈ వయసులో చంద్రబాబు తన కక్ష రాజకీయాలను మానుకుని మంచి పేరు తెచ్చుకునేలా పాలన చేయడమే కాకుండా.. తన కుమారుడు లోకేష్ రెడ్ బుక్ గోలకు అడ్డుకట్ట వేయకపోతే వారికే నష్టం జరుగుతుందని చెప్పక తప్పదు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏరు దాటాక తెప్పతో పనేంటి?
కాకినాడ, సాక్షి: ఏరు దాటాక తెప్పతో పనేముంటుంది?.. తగలెట్టేయడమే!.. కాబోయే జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు(Konidela Naga babu) ఇప్పుడు ఇదే తరహా రాజకీయం చూపించారు. తన సోదరుడు, జనసేన అధినేత అయిన పవన్ కల్యాణ్ కోసం సీటును.. ఆపై ఆత్మాభిమానం చంపేసుకుని మరీ ప్రచారం చేసి గెలిపించారు పిఠాపురం టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ. అంతటి త్యాగాన్ని చేసిన వ్యక్తిని ఉద్దేశించి నాగబాబు చేసిన వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు మండిడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో చర్చతో రచ్చ కూడా చేస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే... అది వారి ‘ఖర్మ’ అంటూ కొణిదెల నాగబాబు పిఠాపురం ఆవిర్భావ సభలో అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) విజయం ఎన్నికలకు ముందే ఖాయమైందని, ఆ విజయం వెనుక వర్మ చేసిందేమీ లేదన్నట్లుగా మాట్లాడారాయన. ఎన్నికల సమయంలో తనకు, తన బృందానికి పవన్ కళ్యాణ్ బాధ్యతలు అప్పగించారని, అది కేవలం తమ సంతృప్తి కోసం అప్పగించిన బాధ్యతలే అన్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్‌ను గెలిపించాలని ఎన్నికలకు ముందే నిశ్చయించుకున్నారని చెప్పారు. ఈ పరిస్థితిలో ఎవరైనా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పని చేశామని కానీ, విజయానికి తామే కారణమని కానీ అనుకుంటే అది వారి ‘ఖర్మ’ అని స్పష్టం చేశారు. కాగా, నాగబాబు వ్యాఖ్యలు టీడీపీలో దుమారం రేపుతున్నాయి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయానికి తాను ఎంతో కష్టపడి పని చేశానని వర్మ అనేక సందర్భాల్లో చెప్పారు. అయినా మొన్న ఎమ్మెల్సీ సీటు ఆయనకు దక్కలేదు. పైగా నాగబాబుకు టికెట్ దక్కింది. అయితే ఎమ్మెల్సీ రాకపోయినా తాను సర్దుకుపోతానని వర్మ ఒక మాట అన్నారు. దీంతో ఇటు టీడీపీలోనే కాదు.. అటు జనసేనలోనూ ఆయనపై సింపథీ ఏర్పడింది. ఇలాంటి తరుణంలోనూ నాగబాబు పిఠాపురం సభలో చేసిన వ్యాఖ్యలు మంచి పద్ధతి కాదని సోషల్ మీడియా వేదికగా టీడీపీ అభిమానులు మండిపడుతున్నారు. పిఠాపురంలో వ్యూహాత్మకంగా టీడీపీని, వర్మను నిర్వీర్యం చేయడానికే నాగబాబు ఇలా మాట్లాడారని, ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక ఇలా నాలుక మడతెయ్యడం తగదని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. -
హైదరాబాద్ టు పిఠాపురం.. ఇదెక్కడి యూటర్న్ భయ్యా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఏపీ ప్రజలకు శుక్రవారం పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో.. కొత్త పవన్ కల్యాణ్ కనిపించాడు. మునుపెన్నడూ లేని విధంగా ఆయన ప్రసంగం సాగడమే అందుకు కారణం. రాజకీయాల్లో పవన్ ఎలా ఉండకూడదని ఆయన అభిమానులు అనుకున్నారో.. సరిగ్గా అలాగే ఆయన నిన్న కనిపించారు. అసలు అంశాలన్నీ పక్కన పడేసి.. అవసరం లేకపోయినా మత, ప్రాంతీయ అంశాలను తెర మీదకు తెచ్చి మరీ ఊగిపోయారాయన. విలువలు వదిలేసి.. అధికారంలోకి వచ్చాక పవన్ రాజకీయంలో మార్పు కనిపిస్తోంది. కుల, మత, జాతి, ప్రాంతీయ రాజకీయాలకు తాను వ్యతిరేకుడినని.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆరాధిస్తానని తొలినాళ్లలోనే ప్రకటించుకున్న పవన్.. మొత్తంగా మారిపోయారు. రాజకీయాన్ని బాగా ఒంట బట్టిచ్చుకుని మాట్లాడారు. మొన్నటి ఎన్నికల్లో 40 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీని నిలబెట్టానంటూ పవన్ మాట్లాడారు. ఈ కామెంట్లు టీడీపీ పొత్తుపై అసంతృప్తితో ఉన్న కేడర్‌ను సంతృప్తి పరచడానికో లేదంటే.. నిజంగా మనసులోంచి వచ్చిన మాటలో తెలియదు. పనిలో పనిగా.. ఏదో తిట్టాలని కదా అని వైఎస్సార్సీపీని ఓ నాలుగు మాటలు అన్నారు. ఈ క్రమంలో తనను జనాలకు బాగా దగ్గర చేసిన సినిమాలను తక్కువ చేసి మాట్లాడారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు సినిమా ఉపకరణం మాత్రమేనని ఇంక దానితో తనకు అవసరం లేదన్నట్లుగా ఒక్క మాటతో తేల్చేశారు. డిగ్రీ పూర్తి చేసి ఉంటేనా?.. సగటు మధ్య తరగతి మనిషిగా బతకడమే పవన్ కోరిక అట. చంటి సినిమాలో మీనాను పెంచినట్టు తనను పెంచారట. తాను డిగ్రీ పూర్తి చేసి, ఎస్సైని కావాలన్నది తన తండ్రి కోరిక అని, కానీ తాను డిగ్రీ కూడా పూర్తి చేయలేదని చెప్పారు. అటువంటి తాను బయటకు వెళ్తే ఏమవుతానో అని ఇంట్లో నిత్యం భయపడేవారన్నారు. అలాంటిది తాను సినిమాలు, రాజకీయం చేయడం కుటుంబ సభ్యులకూ ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. అయితే పవన్ కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసి ఉండేవారేమో అంటూ కొందరు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఓట్ల కోసం కాదంట!!.. జనసేన విజయానికి ఏడు సిద్ధాంతాలే కారణమని, ఎంతో ఆలోచించి వీటిని రూపొందించామని పవన్ కళ్యాణ్ తెలిపారు. సమాజంపై అవగాహన లేకుండానే పార్టీ పెట్టేస్తామా? పార్టీ పెట్టాలంటే నాన్న ముఖ్యమంత్రి, మామయ్య కేంద్ర మంత్రి అయ్యుండాలా? అని పవన్ ప్రశ్నించారు. దశాబ్దం పాటు పార్టీని నడపడంతో వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం ఎంతో కోల్పోయానన్నారు. సమాజంలో మార్పు కోసం వచ్చానని, ఓట్ల కోసం కాదని కామెంట్ చేశారు. అన్‌అపాలజెటిక్ సనాతనినే అంట.. భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేయాల్సిన సమయం ఇదేనని, సనాతన ధర్మం తన రక్తంలోనే ఉందని, దానిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై స్పందిస్తూ.. ఇతర మతాలను గౌరవించాలని సనాతన ధర్మం నేర్పిందన్నారు. హైదరాబాద్‌లో పోలీసులు 15 నిమిషాలు కళ్లు మూసుకుంటే హిందువులకు తమ సత్తా చూపుతామని ఒక నాయకుడు వ్యాఖ్యానించడం దారుణం అంటూ మండిపడ్డారు. పవర్ స్టార్‌ను అంత మాట అన్నారా?.. ‘మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటారు.. అన్నీ దేశ భాషలే కదా.. తమిళనాడులో హిందీ రాకూడదని అంటూంటే నాకు ఒక్కటే అనిపించింది. తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో ఉత్తర ప్రదేశ్, బీహార్, చత్తీస్‌గఢ్ నుంచి కావాలి. హిందీని మాత్రం ద్వేషిస్తామంటే ఎలా? ఇక్కడి న్యాయం. తమిళనాడులో పెరిగినప్పుడు నేను వివక్ష అనుభవించా.. గోల్టీ.. గోల్టీ.. అంటూ అవమానించారని ఆయన తెగ ఫీలైపోయారు.ఎంత మార్పు!గత జనసేన ఆవిర్భావ సభలకు.. ఈసారి సభకు జనసేనానిలో చాలా మార్పు వచ్చింది. అందుకు అధికారంలో ఉండడం, అదీ చంద్రబాబు కింద ఉండడమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లో జనసేన ఆవిర్భావం రోజు నుంచి.. గత జనసేన సభల్లో.. పవన్ ఎక్కువగా ప్రజలకు కనెక్ట్ అయ్యే అంశాలపై దృష్టి పెట్టేవారు. అవసరం ఉన్నా.. లేకున్నా.. అప్పటి ప్రభుత్వాలను విమర్శిస్తూ ఆవేశంగా ఊగిపోయేవారు. అది ప్రజల్లో మాస్ హిస్టీరియాలాంటి స్థితిని తెచ్చింది. అయితే.. 👉గత మీటింగ్‌లలో పవన్ వ్యాఖ్యలు కొన్నిసార్లు విచిత్రంగా.. అసంబద్ధంగా ఉన్నా.. ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పడంలో మాత్రం పవన్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. కానీ, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి.. అందునా హామీలు నెరవేర్చలేని స్థితిలో ఉన్నారు. ప్చ్.. బహుశా అందుకేనేమో ఆయన వాటి ఊసెత్తలేదు. 👉ఎప్పటిలాగే సొంత విషయాల్లో ‘కొత్త కోణం’ ఆవిష్కరించిన ఆయన.. అవసరం లేకున్నా.. హిందూ, హిందీ భాష టాపిక్స్ తీసుకొచ్చి మాట్లాడారు. అలాగే.. నేషనల్ మీడియా తనపై రాసినవంటూ కొన్ని అంశాలంటూ ఊగిపోయారు. లెఫ్ట్, రైట్, సెంట్రల్ ఐడియాలజీ మార్చేశానని, చెగువేరా ఫాలోవర్ కాస్త నుంచి సడన్‌గా సనాతని డిఫెండర్ అయిపోయానిని కథనాలు(వాస్తవాలు) రాశారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారాయన. అయితే..గెలుపు ఓటములతో సంబంధం లేకుండా, అధికారంలో ఉన్నా లేకున్నా.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిలా విలువలుతో కూడిన రాజకీయాలు చేయడం, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడం బహుశా చంద్రబాబు & కోకు మాత్రమే కాదు తన వల్లా కాదనే విషయాన్ని పవన్ పిఠాపురం ప్రసంగంతో తేల్చేశారు. -
‘జగనన్న చేసిన మంచి ప్రతి కుటుంబంలో ఉంది’
తూర్పుగోదావరి జిల్లా: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన మంచి ప్రతి కుటుంబంలోనూ ఉందని మాజీ హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. జగనన్న పేదల గడపలకే సంక్షేమాన్ని చేర్చారని..కూటమి ప్రభుత్వం వచ్చాక అరాచకం దారుణంగా ఉందని, సోషల్ మీడియా కార్యకర్తలపై దాడి, వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి వారి వాహనాల ధ్వంసం తప్పితే అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదన్నారు.గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు.. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ హోం మంత్రి తానేటి వనిత, రాజమండ్రి పార్లమెంట్ కన్వీనర్ గూడూరు శ్రీనివాస్ లు పాల్గొన్నారు. జగనన్నను తలుచుకోని కుటుంబం లేదు‘ఎన్నికలు వచ్చేవరకు ప్రతి కార్యకర్త ఫైట్ చేస్తూనే ఉండాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న ఏ విధంగా ఇబ్బందిపడి బయటకు వచ్చారో అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 15 ఏళ్లు పూర్తయింది. కూటమి తొమ్మిది నెలల పాలనలో జగనన్నను తలుచుకోని కుటుంబం లేదు. కూటమి నాయకులు సైతం జగనన్నను తలుచుకుంటున్నారు. అందరూ కలిసి ఐక్యతతో జగనన్న ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ. తగిలిన గాయాలు, మనపై కట్టిన కేసులు అవి.. ఎవరు మర్చిపోవద్దు మనకి కూడా ఒక రోజు వస్తుంది. అప్పుడు కూటమి నేతలకు తిరిగి ఇస్తాం. పార్టీ కోసం నిలబడిన ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకుడికి పాదాభివందనం. ప్రతి కార్యకర్తకు ఆడబిడ్డగా నేను అండగా ఉంటాను. జగనన్న చేసిన మంచి ప్రతి కుటుంబంలో ఉంది’ అని తానేటి వనిత పేర్కొన్నారు.జగన్ అంటేనే నిజం..వైఎస్ జగన్ అంటేనే నిజం అని అన్నారు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. జగన్ పాలనలో ఒక్క పైసా కూడా ఆశించకుండా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పని చేశారన్నారు. ఇప్పుడు వైఎస్సార్ సీపీ వాళ్లకు పథకాలు ఇవ్వద్దని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబే చెబుతున్నారని, రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి స్వార్థంగా మాట్లాడిన వాడు చంద్రబాబు తప్ప ఇంకెవరూ లేరన్నారు. రాష్ట్ర సంపద పొందాల్సింది పేదవాడు. అది ఒక వర్గానికో ఒక పార్టీకో చెందటానికి మనం రాచరికంలో లేము. సంక్షేమ పథకాలు పొందాలంటే ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?, టీడీపీ, బీజేపీ, జనసేన, ఈనాడు, టీవీ 5, ఏబీఎన్ కలిసి ప్రజలను మోసం పోయేలా చేశారు. సూపర్ సిక్స్ అని అబద్ధపు హామీలతో గద్దెనెక్కినవాడు చంద్రబాబు.. ఎన్నికల ముందు రాష్ట్రంలో రూ. 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయన్నార చంద్రబాబు, పవన్, పురందేశ్వరీ. శ్వేతపత్రాలని కొన్ని రోజులు హడావుడి చేశారు. చివరకు మతాల మీదకు తెచ్చారు. లడ్డూలో కల్తీ అంటూ చంద్రబాబు ప్రమాదకరమైన ట్రోల్స్ చేశారు. ప్రతినెల డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు చేస్తున్నాడు. ఆరున్నర లక్షల కోట్లు అని చివరికి చెప్పక తప్పలేదు. సంపద సృష్టిస్తానంటూ అధికారం కోసం అబద్ధాలు చెప్పాడు చంద్రబాబు నాయుడు. గత సంవత్సరం అమ్మబడి ఎత్తేశాడుఅన్నదాత సుఖీభవ అన్నాడు అది ఎత్తేశాడు. కేంద్రం ఇచ్చేవి కాకుండానే ప్రతి రైతుకు 20000 ఇస్తానన్నాడు. ఉచిత బస్సు లేదు.. మూడు గ్యాస్ సిలిండర్లు అన్నాడు ఒకటి ఇచ్చాడు. చంద్రబాబు హామీలు అమలు చేయాలంటే 79 వేల కోట్లు కావాలి...?, మహిళలకు 15000 ఇస్తా అన్నాడు ఎలా మోసపోయారో వారికి చెప్పాలి .మేనిఫెస్టోలో ఇచ్చిన నవరత్నాలను అమలు చేసిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్’ అని పేర్కొన్నారు. -
నాగబాబు వ్యంగ్యాస్త్రాలు.. మరింత అగ్గి రాజేసేలా!
పిఠాపురం: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి టీడీపీకి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పాత్ర ఏమీ లేదని జనసేన నేత నాగబాబు ఒక్క దెబ్బలో తేల్చి పారేశారు. అసలు పవన్ గెలుపునకు ఏ నేతైనా కారణం అనుకుంటే అది వారి ‘ఖర్మ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది కూడా పిఠాపురం వేదికగా ఈరోజు(శుక్రవారం) జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో నాగబాబు పరోక్షంగా చురకలు అంటించారు. కేవలం పవన్ విజయానికి పిఠాపురం ప్రజలు, జన సైనికులే కారణమని ఒక్క ముక్కలో చెప్పేశారు నాగబాబు. ఇక్కడ పవన్ గెలుపునకు పవనే ప్రధాన కారణంగా చెప్పుకొచ్చారు. వర్మ సీటు త్యాగం సంగతి ఏంటో..?అసెంబ్లీలో అడుగు పెట్టడమే కలగా మారిన పవన్ కళ్యాణ్‌కు సహకరించి.. ఆ కల నెరవేరేలా చేసింది పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ. ఇక్కడ తన సీటును త్యాగం చేసి మరీ పవన్ ను భుజాన వేసుకున్నారు వర్మ, అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని చంద్రబాబు ఆశ చూపడంతో పాటు దానికి పవన్ కళ్యాణ్ కూడా వంత పాడటం కూడా జరిగింది. సర్లే.. చంద్రబాబు మన నాయకుడే.. పవన్ కూడా మన వాడే అనుకున్నాడో ఏమో వర్మ.. ఎమ్మెల్సీ టికెట్ అన్నారు కదా అని ఆ ఎమ్మెల్యే సీటను త్యాగం చేశారు వర్మ,. మరి తీరా చూస్తే వర్మకు ఊహంచని పరిణామం ఎదురైంది. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకుండా పెద్ద షాకిచ్చారు చంద్రబాబు..పవనే దెబ్బ కొట్టారా..?ఆయనే రాజకీయంగా దెబ్బకొట్టారనే చర్చ జోరుగా జరుగుతోంది. ఆయనకు ఎమ్మెల్సీ సీటు రాకుండా పవన్ అడ్డుపడ్డారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పిఠాపురంలో తనకు ఇబ్బందులు వస్తాయని ఆయన చంద్రబాబుకు చెప్పడం వల్లే పక్కన పెట్టారని టీడీపీ నేతలు చెబుతున్నారు.తనకు ప్రొటోకాల్ సమస్యలు వస్తాయని, వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వవద్దని స్వయంగా పవనే .. చంద్రబాబుకు చెప్పారని రెండు పార్టీల్లోనూ చర్చించుకుంటున్నారు. అలాగే వర్మకు పదవి లభిస్తే పిఠాపురంలో ఆయన ప్రాధాన్యత పెరిగి రెండు అధికార కేంద్రాలు ఏర్పాటవుతాయనే ఆందోళనలోనూ పవన్ కళ్యాణ్ ఉన్నట్లు చెబుతున్నారు.అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ తాను అక్కడి నుంచి పోటీ చేయడం కష్టమవుతుందనే భావనలో ఆయన ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. వర్మ ఎమ్మెల్సీ అయితే నియోజక వర్గానికి చెందిన కూటమి నేతలు ఆయన వద్దకే వెళతారని, ఇది రాజకీయంగా తమకు నష్టమని పవన్ అంచనా వేస్తున్నట్లు సమాచారం. మరింత అగ్గి రాజేసేలా..పవన్ కూడా వర్మ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూస్తానని అంతర్గతంగా చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీంతో పవన్‌ను గెలిపించేందుకు వర్మ అహర్నిశలు పనిచేశారు. టీడీపీ శ్రేణులు పలుచోట్ల ఆయనను తిట్టినా లెక్క చేయకుండా తిరిగి పవన్‌ను గెలిపించారు. రెండుచోట్ల ఓడిపోయిన వ్యక్తికి తన సీటును త్యాగం చేసి గెలిపించి అసెంబ్లీకి పంపడంలో కీలకపాత్ర పోషించారు.ఇప్పుడు ఆయనకే పవన్ అడ్డుపడడం ఏమిటని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వర్మను పవన్ దెబ్బకొట్టడం దారుణమని వాపోతున్నాయి. ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో ఆయనకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతున్నాయి. ఇప్పుడు ఏకంగా నాగబాబు నోటి వెంట వర్మ పేరు రాలేదు.. కదా పరోక్షంగా సెటైర్లు వేయడం ఇప్పుడు మరో చర్చకు దారి తీసింది. ఇప్పటికే టీడీపీ-జనసేనలపై ఆగ్రహంగా ఉన్న వర్మ వర్గంలో మరింత అగ్గి రాజేశారనే వాదన తెరపైకి వచ్చింది. -
‘హిందూ ధర్మం మీద దాడి జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?’
తాడేపల్లి : కాశీనాయన జ్యోతి క్షేత్రం పరమ పవిత్రమైనదని, మహారాష్ట్ర, కర్ణాటక నుండి కూడా భక్తులు వచ్చే ప్రాంతమని అలాంటి క్షేత్రం మీద అటవీ శాఖ అధికారులు దాడులు చేయడం వెనుక ఏపీ ప్రభుత్వం హస్తం ఉందని వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు విమర్శించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేయడం నిజంగా దారుణమన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మల్లాడి విష్ణు మాట్లాడుతూ.. కాశీనాయనక్షేత్రం మీద జరిగిన దాడి.. హైందవ ధర్మం మీద జరిగిన దాడిగా పేర్కొన్నారు. ‘ పవన్ కళ్యాణ్ పరిధిలోని అటవీ శాఖ ఈ దారుణానికి పాల్పడింది* అని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. ఇది హిందూ ధర్మం మీద జరిగిన దాడిరాష్ట్రంలో హైందవ ధర్మాన్ని కాపాడతాననే పవన్ కళ్యాణ్.. మరి ఈ విషయంలో మిన్నుకుండి పోవడానికి కారణం ఏమిటి?, పవన్ కళ్యాణ్ కి తెలిసే ఇది జరిగింది. కూటమి నేతల అనుమతితోనే ఈ కూల్చివేతలు జరిగాయి. హిందూ ధర్మం మీద జరిగిన దాడిగా భావించే వైఎస్సార్సీపీ స్పందించింది. ఆ ప్రాంతాన్ని సందర్శించింది. ఎన్నో సేవా కార్యక్రమాలను కాశినాయన చేశారు. వందేళ్ల పాటు జీవించి అందరికీ ఆధ్యాత్మికతను బోధించారు. అలాంటి కాశీనాయన క్షేత్రం మీద అటవీ శాఖ దాడులు, కూల్చివేతలు జరిగాయి. వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగాక మళ్ళీ నిర్మాణాలు చేస్తామంటూ హడావుడి చేస్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తోంది..?హిందూ ధర్మం మీద జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?, తిరుమల లడ్డూ విషయంలో జనాన్ని తప్పదారి పట్టించారు. భక్తులు క్యూలో చనిపోతే క్షమించమని ప్రాధేయపడ్డారు. అసలు ఇన్ని ఘోరాలు జరుగుతుంటే హిందూ భక్తులు ఎందుకు క్షమించాలి? , ముందు జాగ్రత్తగా ఎందుకు చర్యలు చేపట్టడం లేదు?, వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆ 13 హెక్టార్లను మినహాయించాలని కేంద్రానికి లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ ఏమైపోయావ్..?ఈ ప్రభుత్వం ఆ రికార్డులను కూడా పరిశీలించదా?, చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా హిందూ ఆలయాల మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. విజయవాడలో ఆలయాలు కూల్చారు. తిరుపతి లో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చారు. సతావర్తి సత్రం భూముల కుంభకోణం చేశారు. పుష్కరాల్లో జనం చనిపోయారు. ఇలా అనేక సంఘటనలు చంద్రబాబు హయాంలోనే జరిగాయి. సంబంధం లేకపోయినా తిరుపతి విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు క్షమాపణ చెప్పారు?, ఇప్పుడు కాశినాయన క్షేత్రం వద్ద కూల్చివేతలు చేస్తే ఆయన ఎందుకు పట్టించుకోలేదు?, లోకేష్ క్షమాపణలు చెప్పడం ఎందుకు?, మా హయాంలో ఏం జరిగినా వెంటనే స్పందించాం. అంతర్వేదిలో రధం తగులపడితే నూతన టెక్నాలజీతో కొత్త రధాన్ని నిర్మించాం. చంద్రబాబు హయాంలోనే హిందూ ఆలయాలపై నిర్లక్ష్యం జరుగుతోంది’ అని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. అటవీ ప్రాంతం పేరుతో ఆధ్యాత్మికతపై దాడి! -
‘సకల శాఖ మంత్రి నారా లోకేష్’: మేరుగు నాగార్జున
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో విద్యా శాఖను భ్రష్టు పట్టిస్తున్నారని, లోకేష్ సకల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో చంద్రబాబు రాజకీయ జీవితంలో ప్రభుత్వ విద్యపై సాఫ్ట్ కార్నర్‌తో ఆలోచించారా? అంటూ ధ్వజమెత్తారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని.. పుస్తకాలపై వైఎస్ జగన్ బొమ్మలు ఉన్నాయని ఓర్వలేకపోయారంటూ దుయ్యబట్టారు.‘‘ప్రభుత్వ పథకాలపై చంద్రబాబు బొమ్మలు లోకేశ్‌కు కానరాలేదా?. కూటమి పాలనలో పాఠశాల విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యారంగం ప్రోత్సాహకంలో విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పాత్ర లేదు. వైఎస్సార్సీపీ హయాంలో హయ్యర్ ఎడ్యుకేషన్‌ను క్వాలిటీతో అందించాం. కూటమి పాలనలో వర్శిటీ వైస్ ఛాన్సలర్లను భయపెట్టి రిజైన్ చేయించారు. ఇదేనా విద్యా వ్యవస్థను నడిపించే తీరు’’ అంటూ మేరుగ నాగార్జున ప్రశ్నించారు.‘‘విద్యాశాఖ మంత్రిగా లోకేష్ విద్యా వ్యవస్థలో ఏమైనా మార్పులు తెచ్చారా?. మేము తెచ్చిన సంస్కరణలను తొలగించడం తప్ప ఇంకేమీ చేయలేదు. అంబేద్కర్ ఆశయాలను చంద్రబాబు ప్రభుత్వం నీరు గార్చింది. జగన్ తెచ్చిన మార్పులను చూసి ఇతర రాష్ట్రాలే మెచ్చుకున్నాయి. కానీ అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్ వెకిలి మాటలు మాట్లాడుతున్నారు. నాలుగుసార్లు సీఎం అయిన చంద్రబాబు ప్రభుత్వ స్కూళ్లను బాగు చేశారా?. ఇంగ్లీషు మీడియం, టెక్నాలజీ అభివృద్ధి, పిల్లలకు యూనిఫాం, షూస్ కూడా ఎందుకు ఇవ్వలేక పోయారు?..పిల్లల పుస్తకాలు, రేషన్ సరుకులు, కుట్టు మిషన్లు, సైకిళ్లు, శ్మశానాలతో పాటు అప్పడాలు మీద కూడా చంద్రబాబు ఫోటోలు వేశారు. యూనివర్సిటీలో క్వాలిటీ చదువులు చెప్పించాం. అలాంటి యూనివర్సిటీలోని 17 మంది వైస్ ఛైర్మన్లను బెదిరించి రాజీనామాలు చేయించారు. 9 నెలలపాటు వీసీలు లేకుండానే యూనివర్సిటీలను నడిపిన నీచ చరిత్ర ఈ ప్రభుత్వానిది. టీడీపీ నేతల పుట్టినరోజులు, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించిన నీచ చరిత్ర చంద్రబాబుది. చివరికి క్లాసు రూముల్లో పార్టీ సభ్యత్వాలను నమోదు చేసిన నీచ చరిత్ర టీడీపీది. మీ అవసరాలకు యూనివర్సిటీలను వాడుకున్నారేగానీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏ మంచి ఐనా చేశారా?. ఇప్పటికైనా జగన్ తెచ్చిన సంస్కరణలను అమలు చేయాలి. పేద విద్యార్థులకు నాణ్యమైన చదువులు చెప్పించాలి’’ అని మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. -
మేం ‘పిఠాపురం’ తాలుకా.. మమ్మల్ని ఎవడ్రా ఆపేది!
సాక్షి, కాకినాడ: జనసేన (Janasena) పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఒకవైపు యువ కార్యకర్తలు రోడ్లపై బైకులతో ప్రమాదకరమైన స్టంట్లతో వాహనదారుల్ని హడాలెత్తించగా.. ఇంకోవైపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించి మరీ వాహనదారులతో వాగ్వాదానికి దిగారు మరికొందరు.పిఠాపురం శివారు ప్రాంతమైన చిత్రాడలో ‘జయకేతనం’(JSP JayaKethanam Sabha) పేరిట సభ నిర్వహిస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గం కావడంతో ఆ పార్టీ శ్రేణులు అతి చేష్టలకు దిగాయి. ‘‘పిఠాపురం డిప్యూటీ సీఎం తాలుకా.. మమ్మల్ని ఎవడ్రా ఆపేది?’’ అంటూ నినాదాలు చేస్తూ.. దారినపోయేవాళ్లను దుర్భాషలాడుతున్నారు.ఈ క్రమంలో.. జనసేన స్టికర్లు, జెండాలతో ఉన్న బైకులు, కార్లతో రోడ్లపై హల్ చల్ చేశాయి. కత్తిపూడి-కాకినాడ 216 జాతీయ రహదారిపై జనసైనిక్స్ బైక్‌లతో ప్రమాదకర ఫీట్లు చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. దీంతో ఆ దారి గుండా వెళ్లే పలువురు వాహనదారులు హడలెత్తిపోతున్నారు. ఇంకోవైపు.. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ జనసేన నేతలు సామాన్యులకు చుక్కలు చూపించారు.ఈ క్రమంలో చిత్రాడ వద్ద బైక్ మీద వెళ్తున్న ఓ వ్యక్తికి.. జనసేన నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ట్రాఫిక్ క్లియర్ చేయాలని కోరాడతను. ఈలోపు వెనక నుంచి జెండాతో వచ్చిన ఓ వ్యక్తి అతన్ని చితకబాదాడు. సదరు వ్యక్తిని బూతులు తిట్టాడు. ఆ వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి. అయితే పిఠాపురంలో ఎర్ర టవల్ బ్యాచ్ ఇంత చేస్తున్నా.. అక్కడి పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోవడం గమనార్హం -
జనసేన టీడీపీ మధ్య ఇసుక వేస్తే భగ్గుమనేలా..!
కృష్ణా, సాక్షి: ఏపీలో కూటమి నేతల మధ్య ‘ఇసుక మాఫియా’ కోసం ఆధిపత్య పోరు నడుస్తోంది. అయితే ఈ విషయంలోనూ టీడీపీనే పైచేయి సాధిస్తోంది. తాజాగా అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ-జనసేన ఇసుక పంచాయతీ కొట్టుకునేదాకా తీసుకెళ్లింది. ఆ వీడియోలు ఏకంగా సోషల్ మీడియాకు ఎక్కి వైరల్ అవుతున్నాయి. ఘంటసాల మండలం శ్రీకాకుళం ఇసుక క్వారీపై టీడీపీ నేతల ఆధిపత్యం కొనసాగుతోంది. పగలూ రాత్రీ తేడాలేకుండా ఇసుక తరలిస్తూ.. పార్టీకి చెందిన వాళ్లకు ఉచితంగా అందిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన తరఫు వాళ్లకు మాత్రం ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. విషయం తెలిసి రేటు విషయంలో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జనసేనవాళ్లను అసభ్యంగా తిట్టడంతో అది బాహాబాహీకి దారి తీసింది. ఇరు పార్టీల వాళ్లు అర్ధరాత్రి రోడ్డునపడి కొట్టుకున్నారు. ఈ ఘటనలో క్వారీ క్యాష్ కౌంటర్ సూపర్ వైజర్ అఖిల్‌కు గాయాలయ్యాయి. అనంతరం గొడవ.. ఘంటసాల పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. పోలీసులు కాంప్రమైజ్‌కు ప్రయత్నించినా లాభం లేకపోయింది. దీంతో కేసు నమోదు చేసి లారీ, జేసీబీని సీజ్ చేశారు. అయితే విషయం తెలిసిన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కుమారుడు , అల్లుడు రంగంలోకి దిగారు. కేసు లేకుండా రాజీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు ఘర్షణ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటా: వైఎస్ జగన్
సాక్షి అమరావతి, సాక్షి ప్రతినిధి, గుంటూరు: టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, మద్దతుదారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం పల్నాడు జిల్లాలో గ్రామ బహిష్కరణకు గురైన దళిత, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన దాదాపు 400 కుటుంబాలకు చెందిన బాధితులు వైఎస్ జగన్‌ను గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో కలుసుకున్నారు. మాచవరం మండలం పిన్నెల్లి, తురకపాలెం, మాదినపాడు, చెన్నాయపాలెం, కొత్తగణేశునిపాడు గ్రామాలకు చెందిన వారంతా మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్‌ను కలిశారు. టీడీపీ నేతలు ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్సార్సీపీ సానుభూతి పరులపై, ఇళ్లపై దాడులకు తెగబడి అక్రమ కేసులు బనాయించి పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని తెలిపారు. ఈ అకృత్యాలను భరించలేక గ్రామాలు విడిచి ఇతర ప్రాంతాల్లో తల దాచుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. స్వగ్రామాలకు దూరంగా గడుపుతుండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులనే కారణంతో తమను ఊరి నుంచి బహిష్కరించారని, గ్రామంలోకి వస్తే చంపేస్తామని టీడీపీ కూటమి నేతలు బెదిరిస్తున్నారని పిన్నెల్లి గ్రామానికి చెందిన బాధిత కుటుంబాల సభ్యులు వైఎస్ జగన్ ఎదుట వాపోయారు. ‘అధైర్యపడొద్దు.. మీకు అన్ని విధాలా అండగా ఉంటాం..’ అని వారికి వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచి వారికి పూర్తి న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. కాగా, వచ్చే రెండు నెలల్లో ‘చలో పిన్నెల్లి’ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ సిద్ధమవుతోంది. గ్రామ బహిష్కరణపై న్యాయపరంగా కూడా హైకోర్టులో పోరాడుతోంది.గురజాల నియోజకవర్గ నాయకులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్ దహన సంస్కారాలకూ నోచుకోని దుస్థితిటీడీపీ శ్రేణుల దురాగతాలతో గ్రామం విడిచి వెళ్లి వేరే ప్రాంతంలో ఉంటున్నాం. మా కుటుంబ సభ్యుడు మృతి చెందినా స్వగ్రామానికి వెళ్లే పరిస్థితి లేక మేం తలదాచుకుంటున్న ప్రాంతంలోనే దహన సంస్కారాలు పూర్తి చేశాం. ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలకు అడ్డుకట్ట పడేదెప్పుడో తెలియడం లేదు. మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నా. – అమరావతి హసన్ (బుజ్జి), పిన్నెల్లి, వైఎస్సార్సీపీ నాయకుడుమహిళలపైనా దాడులు..ఎన్నికల ఫలితాలు వెలువడ్డ వెంటనే టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీ సానుభూతి పరుల నివాసాలపై మూకుమ్మడి దాడులకు తెగబడ్డాయి. ఇంట్లో ఉన్న మహిళలను సైతం దౌర్జన్యంగా లాక్కొచ్చి దాడి చేశారు. టీడీపీ శ్రేణుల అఘాయిత్యాలతో ఆర్థికంగా, శారీరకంగా నష్టపోయాం. బంధువుల నివాసాల్లో కుటుంబ సభ్యులతో తలదాచుకుంటున్నాం. మాకు రక్షణ కల్పించండి.– రత్తయ్య, కొత్తగణేశునిపాడు, వైఎస్సార్సీపీ నాయకుడుఆర్థికంగా నష్టపోయాం టీడీపీ శ్రేణుల అఘాయిత్యాలతో కుటుంబంతో సహా గ్రామాన్ని విడిచి వేరే ప్రాంతాల్లో తలదాచుకుంటున్నాం. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం. మా పొలాలు సాగు చేసుకోలేక నష్టపోతున్నాం. మాకు న్యాయం చేయాలి. – పిక్కిలి కొండలు, పిన్నెల్లి గ్రామం, వైఎస్సార్సీపీ నాయకుడు -
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కూటమి పాలన సాగుతోందని, తక్షణం జోక్యం చేసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం కోరింది. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై గురువారం గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. అనంతరం రాజ్‌భవన్ బయట పలువురు మాజీ మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలతో కలిసి శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఇటీవల గంగాధర నెల్లూరులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అన్ని పనులు టీడీపీ వారికే చేయాలని, వైఎస్సార్సీపీ వారికి పనులు చేస్తే పాముకు పాలు పోసినట్లేనని చేసిన తీవ్ర వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఎలాంటి వివక్ష లేకుండా సమ దృష్టితో పాలన అందిస్తానంటూ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన సీఎం చంద్రబాబు, దానికి విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలపై తక్షణం చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ సంక్షేమాన్ని అందుకునే లబ్ధిదారులకు పార్టీలు, వర్గాలు ఉండవని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలతో అర్హతను బట్టి పథకాలను వర్తింపజేస్తారని, చంద్రబాబు మాత్రం ఒక వర్గానికి మాత్రమే మేలు చేయాలని, కొందరిపట్ల వివక్ష చూపించాలంటూ చేసిన వ్యాఖ్యలు దారుణమని బొత్స మండిపడ్డారు. ఇలా ఏ నాయకుడూ మాట్లాడలేదు.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కూడా చంద్రబాబులా మాట్లాడలేదని బొత్స తప్పుబట్టారు. ఏ రాజకీయ పార్టీ అయినా వారి సిద్ధాంతాలు, విధానాల ప్రకారం పనిచేస్తుందని, రాష్ట్రంలోని మొత్తం ప్రజలకు మేలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటారని పేర్కొన్నారు. ఏ పార్టీ కూడా వ్యక్తిగత ఎజెండాతో పనిచేయదని, కానీ, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు దానికి భిన్నంగా చేసిన వ్యాఖ్యలు, ఆయన అనుసరిస్తున్న విధానాలపై తక్షణం స్పందించాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు. సామాన్యుల అవసరాలపైనా రాజకీయమా? సామాన్యుల అవసరాలకు కూడా రాజకీయ రంగు పులమడం దారుణమని బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఒత్తిడి తెస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. కూటమి సర్కారు మెడలు వంచి ప్రజలకు ప్రయోజనాలు కలిగించేలా వ్యవహరిస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. జర్నలిస్టులనూ వదలరా? రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు, చివరికి జర్నలిస్టుల పైన కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు బి.విరూపాక్షి, తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్, తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మాజీ మంత్రులు విడదల రజిని, వెలంపల్లి శ్రీనివాసరావు, మేరుగు నాగార్జున, కారుమూరు వెంకట నాగేశ్వరరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు తదితరులు ఉన్నారు. -
‘కూటమి’ కుట్రలు.. గవర్నర్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం రాజ్‌భవన్‌లో కలిసి వినతిపత్రం సమర్పించింది. రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కూటమి పాలన సాగుతున్న నేపథ్యంలో తక్షణం గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరింది. అనంతరం రాజ్‌భవన్ బయట పలువురు మాజీ మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలతో కలిసి శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.ఇటీవల గంగాధర నెల్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అన్ని పనులు తెలుగుదేశం వారికే చేయాలి.. వైఎస్సార్సీపీ వారికి ఏ పనీ చేయకూడదు.. అలా చేస్తే పాముకు పాలుపోసినట్లేనంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో ఎటువంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ సమదృష్టితో పాలనను అందిస్తానంటూ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన చంద్రబాబు, దానికి విరుద్దంగా చేసిన వ్యాఖ్యలపై తక్షణం గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రజాస్వామిక స్పూర్తికి వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంలో సంక్షేమాన్ని అందుకునే లబ్దిదారులకు పార్టీలు, వర్గాలు ఉండవని అన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రమాణాలతో అర్హతను బట్టి పథకాలను వర్తింపచేస్తారని, కానీ చంద్రబాబు మాత్రం ఒక వర్గానికి మాత్రమే మేలు చేయాలని, కొందరి పట్ల వివక్ష చూపించాలంటూ చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. స్వాతంత్రం వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చంద్రబాబులా మాట్లాడలేదన్నారు.రాష్ట్రంలోని ఏ రాజకీయపార్టీ అయినా వారి సిద్ధాంతాలు, విధానాల ప్రకారం పనిచేస్తుందని, రాష్ట్రంలోని మొత్తం ప్రజలకు మేలు చేసేలా పనిచేయాలన్నదే వారి లక్ష్యంగా పెట్టుకుంటారని అన్నారు. ఏ పార్టీ అయినా వ్యక్తిగత ఏజెండాతో పనిచేయవని, కానీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు దానికి భిన్నంగా చేసిన వ్యాఖ్యలు, ఆయన అనుసరిస్తున్న విధానాలపై తక్షణం స్పందించాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు. సామాన్యుల అవసరాలకు కూడా రాజకీయ పార్టీ రంగు పులమడం దారుణమన్నారు.ప్రతిపక్ష పార్టీగా ప్రజల ప్రయోజనాల కోసమే వైఎస్సార్సీపీ.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వ మెడలు వంచి ప్రజలకు ప్రయోజనాలు కలిగించేలా వ్యవహరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లు, చివరికి జర్నలిస్ట్‌లపైన కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువచ్చామని బొత్స సత్యనారాయణ తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేరుగు నాగార్జున, విడదల రజనీ, కారుమూరు వెంకట నాగేశ్వరరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు వున్నారు. -
విపక్ష సభ్యులను కించపరచడమే కూటమి నేతల పనా?: బొత్స
సాక్షి, అమరావతి: శాసనమండలిలో ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానాలు రావడం లేదని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన శాసనమండలి మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. మంత్రులు చెప్పిందే చెప్తుతున్నారని.. కూటమి ప్రభుత్వానికి నిర్ధిష్టమైన ఆలోచన లేదని దుయ్యబట్టారు. 2019-24 మధ్య స్కామ్‌లు జరిగితే ఎంక్వైరీ వేసుకోమని చెప్పాం. మేం 2014 నుంచి మాట్లాడాలని అడిగాం. సభలో అభ్యంతరకరమైన భాష మాట్లాడుతున్నారు’’ అని బొత్స ధ్వజమెత్తారు.‘‘వైజాగ్ భూముల సిట్ రిపోర్ట్ బయటపెట్టమని కోరాం. విపక్ష సభ్యులను కించపరచడమే పనిగా పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వానికి నిర్ధిష్టమైన విధానం లేదు. డిజిటల్ కరెన్సీ అనేది మ్యాండేట్ కాదు. ఇప్పుడు జరుగుతున్న లిక్కర్ సేల్స్ డిజిటల్ కరెన్సీలోనే నడుస్తున్నాయా? సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడటం సరికాదు. ప్రత్యేకించి వైఎస్ జగన్ పేరు ప్రస్తావించడంపై మేం అభ్యంతరం తెలిపాం. మా మీద, మా నాయకుల మీద నిరాధార ఆరోపణలు చేస్తున్నారు’’ అని బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు.