అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే మహిళలను మోసం చేసిన చంద్రబాబు
మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండానే ఇచ్చేసినట్లు డ్రామాలు
నిప్పులు చెరిగిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
ప్రతి అక్కచెల్లెమ్మకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18,000 ఎప్పుడు ఇస్తారు?
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు 50 ఏళ్లకే పింఛన్ ఎప్పటి నుంచి ఇస్తారు?
తల్లికి వందనం తొలి ఏడాది పూర్తిగా ఎగవేత.. రెండో ఏడాది అరకొర..
ఉచిత గ్యాస్ పథకానికి సరిపడా నిధులు ఎందుకు కేటాయించలేదు?
మహిళలకు ఉచిత బస్సు పథకం 16 కాకుండా 5 సర్వీసులకే ఎందుకు పరిమితం చేశారు?
డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ కింద ఒక్క రూపాయి అయినా చెల్లించారా?
మా ప్రభుత్వ హయాంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే.. మీరు ఒక్క ఇంటి పట్టా కూడా ఇవ్వలేదు
ఈబీసీ నేస్తం.. కాపు నేస్తం ఊసే లేదు
ఊరికో మద్యం షాపు.. వీధికో బెల్టుషాపు.. మహిళల భద్రత గాలికొదిలేశారు
మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ టీటీడీ చైర్మన్.. అత్యాచార ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించారు
మా పాలనలో 90 శాతం అక్కచెల్లెమ్మల పేరిట డీబీటీ పథకాలు
వేల కొద్దీ నామినేటెడ్ పదవుల్లో 50 శాతం వాటా
మహిళా సంక్షేమ చరిత్రలో మా పాలన సువర్ణ అధ్యాయం
సాక్షి, అమరావతి: మహిళాభ్యుదయానికి, మహిళా సాధికారతకు చంద్రబాబు పాలన చీకటి కాలమని, ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నదంతా దుశ్శాసన పర్వమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎంవైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబుకు మహిళా సాధికారత అన్న పదం పలికే అర్హత కూడా లేదని నిప్పులు చెరిగారు. మూడు రోజులుగా చంద్రబాబు సర్కారు ప్రజలకు మూడు డ్రామాలు చూపించిందని, అసెంబ్లీలో ఒక డ్రామా.. పగటి వేషాలు వేసుకున్న అదే ఎమ్మెల్యేతో మరో డ్రామా.. ఈ రెండింటికీ కొనసాగింపుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున చంద్రబాబు నాయుడు ట్రూప్ ఇంకో డ్రామా ఆడిందంటూ ఎద్దేవా చేశారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆదివారం ఆయన పోస్టు చేశారు. ‘నేను నేరుగా చంద్రబాబునాయుడిని అడుగుతున్నా.. జనాభాలో 50 శాతం ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల ముందు మీరిచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటి వరకు సక్రమంగా అమలు చేయకపోయినా, అన్నీ చేసేసినట్లు విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, పట్టపగలు డ్రామాలాడిన మీకు మహిళా సాధికారత అన్న పదం పలికే అర్హత ఉందా?’ అని నిలదీశారు. ఈ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
⇒ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్‌లో భాగంగా 19–59 మధ్య వయసున్న ప్రతి అక్కచెల్లెమ్మకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారు. రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడి, 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలు ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం కోటి 80 లక్షల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.1,500 అంటే సంవత్సరానికి రూ.18 వేల చొప్పున ఒక్కో అక్కచెల్లెమ్మకు మూడేళ్లలో రూ.54 వేల చొప్పున బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారు చంద్రబాబు గారూ?
⇒ 50 ఏళ్లకే పింఛన్ మరో హామీ. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.4 వేలు చొప్పున ఒక్కొక్కరికి ఏటా రూ.48 వేలు ఇవ్వాలి. మూడేళ్లలో రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారు?
⇒ బడికి వెళ్లే ప్రతి పిల్ల వాడికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం కింద ఇస్తామన్నారు. మొదటి ఏడాది పూర్తిగా ఎగనామం పెట్టారు. రాష్ట్రంలో యూడీఐఎస్‌ఈ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్–యూడైస్) ప్రకారం 2023–24 నాటికి బడికి పోయే పిల్లలు 87,41,885 మంది ఉంటే రెండో ఏడాది 20 లక్షల మందికి ఎగరగొట్టారు. చివరకు 67.27 లక్షల మందికి మాత్రమే.. అది కూడా కొందరికి రూ.8 వేలు.. రూ.9 వేలు.. రూ.10 వేలు, మరి కొంత మందికి రూ.13 వేలు ఇచ్చారు. మరి వీళ్లందరికీ మిగిలిన డబ్బులు ఎప్పుడిస్తారు? ఎగ్గొట్టిన మొదటి ఏడాది డబ్బులు ఎప్పుడిస్తారు?
⇒ సూపర్ సిక్స్‌లో ఉచిత గ్యాస్ చిన్న హామీ. ఇక్కడ కూడా మోసాలే. రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్న గ్యాస్ కనెక్షన్ల సంఖ్య దాదాపు 1.59 కోట్లు. వీరికి ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. సిలిండర్ ధర రూ.855 చొప్పున మూడు సిలిండర్లకు ఏడాదికి రూ.3,990 కోట్లు కేటాయించాలి. మొదటి ఏడాది కేవలం రూ.786 కోట్లు, రెండో ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం బడ్జెట్‌లో రూ.2,199.99 కోట్లు కేటాయించారు. 2026–27లో బడ్జెట్‌లో ఈ పథకానికి పెట్టింది రూ.2,601 కోట్లు. అంటే మొత్తంగా రూ.6,143 కోట్లు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు చంద్రబాబు గారూ?
⇒ ఉచిత బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లవచ్చని మహిళలకు హామీ ఇచ్చారు. కడప నుంచి వైజాగ్‌కు పోవచ్చు.. శ్రీకాకుళం వాళ్లు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు.. మధ్యలో కనకదుర్గమ్మను కూడా దర్శనం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఫ్రీ అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీలో 16 రకాల సర్వీసులుంటే.. కేవలం ఐదు సర్వీసులకు మాత్రమే పరిమితం చేశారు. ఈ పథకం అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఖర్చు చేయాలి. మొదటి ఏడాది ఈ స్కీమ్ ఎగరగొట్టేశారు. రెండో ఏడాది ఆర్నెల్ల తర్వాత ఆగస్టులో అరకొరగా మొదలు పెట్టారు. చేసిన ఖర్చు రూ.1,040 కోట్లు. ఈ స్కీమ్ కోసం ఈ బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం రూ.1,420 కోట్లు. అంటే మూడేళ్లలో రూ.9,600 కోట్లకు గాను రూ.2,460 కోట్లు కేటాయించారు. అంటే రూ.7,140 కోట్లు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారు చంద్రబాబు గారూ?
⇒ సూపర్ సిక్స్‌లో అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఇలా వంచనగా మార్చటం వల్ల ప్రతి కుటుంబాన్ని, అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతను, మొత్తంగా మన రాష్ట్రంలో ఇంటింటి భవిష్యత్తును మీరు ఎంతగా దెబ్బతీశారో అర్థమవుతోందా?
⇒ అక్కచెల్లెమ్మల పేరిట వాళ్లకు మంచి చేస్తూ ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలిచ్చాం. అందులో 21 లక్షల ఇళ్లు మంజూరు చేయించాం. అందులో 10 లక్షల పైచిలుకు ఇళ్లు పూర్తి చేశాం. చంద్రబాబునాయుడు అక్కచెల్లెమ్మలకు ఇచ్చే ఇంటి స్థలాలకు సంబంధించి చేసిన ప్రామిస్ ఏంటి? పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. 3 బడ్జెట్లు అయిపోయాయి. ఈ రోజుకు కూడా ఒక్క కుటుంబానికి ఒక్క పట్టా ఇవ్వలేదు. దీని కోసం ఒక్క గజం కూడా స్థలం కొనలేదు. ఉన్న ఇళ్ల నిర్మాణాలను గాలికొదిలేశారు. మరి ఆ ఇళ్ల నిర్మాణాలను అక్కచెల్లెమ్మలకు ఎప్పుడు పూర్తి చేసి ఇస్తారు?
⇒ డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకానికి మూడు బడ్జెట్లలో అతీగతీ లేదు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని చెప్పారు. పెంచడం సంగతి దేవుడెరుగు.. మామూలుగా ఇంతకు ముందు ఇస్తున్నట్టు ఇచ్చేది కూడా ఆగిపోయింది. మా హయాంలో కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాల కింద రూ.4,969 కోట్లు ఇచ్చాం. మీరు వచ్చి మూడు బడ్జెట్లు పెట్టారు. ఇప్పటికి ఒక్క పైసా కూడా సున్నా వడ్డీ కింద ఇవ్వలేదు. ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు?

⇒ వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు రూ.19,189 కోట్లు.. వైఎస్సార్ ఆసరా కింద 78,94,169 మందికి రూ.25,570 కోట్లు.. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 3,58,613 మందికి రూ.2,029 కోట్లు.. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,269 మంది అక్కచెల్లెమ్మలకు మరో రూ.1,876 కోట్లు ఇచ్చాం. నిజంగా స్త్రీ శక్తి ఎక్కడైనా లభించింది అంటే, వారి సాధికారత ఎక్కడైనా జరిగింది అంటే అది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే అని గర్వంగా చెప్పగలుగుతాం. ఈ పథకాలన్నీ మీరు అధికారంలోకి వచ్చాక రద్దు చేశారు. మరి మీకు మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత ఉందా?
⇒ మీ పాలనలో ఈబీసీ అక్కచెల్లెమ్మలకు ఈబీసీ నేస్తం అనే పథకమే లేదు. మీకు కాపుల్ని మభ్య పెట్టి.. వారి ఓట్లు కొల్లగొట్టే ప్యాకేజీ పథకాలు బాగా తెలుసుగానీ, కాపు నేస్తంగా ఒక్క రూపాయి కూడా ఆ అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన చరిత్ర మీకు కానీ, మీకు మద్దతిస్తున్న వారికి కానీ లేదు.
⇒ ఇలా ఇవ్వక పోవటం కూడా మీకున్న విజన్‌లో భాగమే అని నమ్మించగల ఎల్లో మీడియా మీ చేతిలో ఉంది కాబట్టి.. ఇదీ గొప్ప ఎంపవర్‌మెంట్ అని పత్రికల్లో రాయించటం, టీవీల్లో వేయించటమే ఇక మిగిలింది!
⇒ అక్కచెల్లెమ్మల కాపురాల్లో చిచ్చుపెట్టేలా వీధికో బెల్టుషాపు, ఊరికో మద్యం షాపు, బారు తెరవటమే మీకు తెలిసిన మహిళా సాధికారత. అదే మీకు తెలిసిన మహిళా భద్రత.
⇒ దిశ పోలీస్ స్టేషన్లను, దిశ యాప్‌ను కూడా నిర్వీర్యం చేశారు. చివరికి రాష్ట్రాన్ని మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ టీటీడీ చైర్మన్.. అత్యాచార ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించారు. పసి పిల్లల్ని, ఆడపిల్లల్ని, చివరికి ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళల్ని మీరు, మీకు మద్దతిస్తున్న వాళ్లు పెంచి పోషిస్తున్న కామాంధులంతా ఎలా చిదిమేస్తున్నారో చూసి కూడా మీకు సిగ్గనిపించడం లేదా?
⇒ మా పాలనలో 90 శాతం అక్కచెల్లెమ్మల పేరిట డీబీటీ పథకాలే. మేం ఇచ్చిన ఇళ్ల స్థలాలన్నీ అక్కచెల్లెమ్మల పేరుమీదే. దేశ చరిత్రలో తొలిసారిగా.. మేం ఇచ్చిన వేల కొద్దీ నామినేటెడ్ పదవుల్లో 50 శాతం వాటా వారికే.
⇒ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఎక్కువ మంది మహిళలకు ఎమ్మెల్సీలు, క్యాబినెట్ మంత్రులుగా అవకాశం ఇచ్చింది కూడా మా పాలనలోనే. అందుకే మా పాలన మహిళా సంక్షేమ చరిత్రలో సువర్ణ అధ్యాయం అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం.
⇒ ఇప్పటి పరిస్థితి ఏమిటంటే.. మహిళాభ్యుదయానికి, మహిళా సాధికారతకు చంద్రబాబు పాలన చీకటి కాలం. రాష్ట్రంలో నడుస్తున్నదంతా దుశ్శాసన పర్వం.


